Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 2

దావీదు తన మనుష్యులతో హెబ్రోనుకు వెళ్లటం

దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు.

“వెళ్లు” అన్నాడు యెహోవా.

“ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే,

“హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.

కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి. దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు.

యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.

యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను[a] మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక! దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను. మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”

ఇష్బోషెతు రాజవటం

నేరు కుమారుడైన అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు. అక్కడ అబ్నేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా నియమించాడు. అనగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజయ్యాడు.

10 ఇష్బోషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయేలుకు రాజై పాలించేనాటికి నలుబది ఏండ్ల వయస్సువాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు. 11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు.

ఇష్బోషెతు, దావీదు రాజులుగా పోటి

12 నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషెతు నౌకరులు మహనయీము వదిలి పయనమైపోయారు. వారు గిబియోను చేరారు. 13 సెరూయా కుమారుడుగు యోవాబు, దావీదు సేవకులు కూడా గిబియోనుకు వెళ్లారు. గిబియోను మడుగువద్ద వారు అబ్నేరును, ఇష్బోషెతు సేవకులను కలిసారు. అబ్నేరు తరపువారంతా కొలనుకు ఒక పక్క కూర్చున్నారు. యోవాబు పక్షం వారు మరొక ప్రక్క కూర్చున్నారు.

14 యోవాబుతో అబ్నేరు, “మన ఇరుపక్షాల యువకులనూ ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ జరుపుదాము” అన్నాడు.

పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పుకున్నాడు.

15 అప్పుడు యువసైనికులు లేచారు. ఇరుపక్షాల వారూ వారి వారి యువసైనికులను పోటీకి లెక్కపెట్టారు. ఇష్బోషెతు పక్షాన బెన్యామీను వంశీయులు, దావీదు పక్షాన అతని అనుచరులు పన్నెండు మంది చొప్పున ఎంపిక చేయబడ్డారు. 16 ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల క్షేత్రం”[b] అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో ఉంది. 17 ఆ రోజు పోటీ ఒక భయంకర పోరాటంగా మారింది. దావీదు సైనికులు అబ్నేరును, ఇశ్రాయేలీయులను ఓడించారు.

అబ్నేరు అశాహేలును చంపటం

18 యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు. 19 అశాహేలు అబ్నేరును తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్నేరును అనుసరించి తరిమాడు. 20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు.

“అవును నేనే” అన్నాడు అశాహేలు.

21 “(అబ్నేరు అశాహేలును గాయ పరచేందుకు ఇష్టపడలేదు) అయితే నీవు కుడి పక్కకు గాని, ఎడమ పక్కకు తిరిగి అక్కడ వున్న యువకులలో ఒకడిని పట్టుకుని వాని కవచం నీ కొరకు తీసుకో” అన్నాడు అబ్నేరు. కాని అశాహేలు అబ్నేరును వెంటాడటం మానటానికి ఒప్పుకోలేదు.

22 అబ్నేరు మళ్లీ అశాహేలుతో ఇలా అన్నాడు: “నన్ను తరమటం ఆపివేయుము. నీవు ఆపకపోతే నేను నిన్ను చంపుతాను. నేను నిన్ను చంపిన పక్షంలో నీ సోదరుడైన యోవాబు ముఖం మళ్లీ నేను చూడ లేను!”

23 కాని అశాహేలు అబ్నేరును తరమటం మానలేదు. దానితో అబ్నేరు తన ఈటె వెనుక భాగంతో అశాహేలు పొట్టలో పొడిచాడు. ఈటె మడం ఎంత తీవ్రంగా దిగబడిందంటే అది పొట్టలో నుండి వీపు ద్వారా బయటికి వచ్చింది. అశాహేలు అక్కడికక్కడే మరణించాడు.

యోవాబు, అబీషైలు అబ్నేరును వెంటాడటం

అశాహేలు శవం నేలమీద పడివుంది. అతని మనుష్యులందరూ అక్కడికి వచ్చి ఆగారు. (అశాహేలును చూసేందుకు) 24 కాని యోవాబు, అబీషై[c] లిరువురూ అబ్నేరును వెంటాడసాగారు. వారు అమ్మా కొండ చేరేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గిబియోను ఎడారిమార్గంలో గీహ ఎదురుగా అమ్మా కొండవుంది. 25 బెన్యామీనీయులంతా అబ్నేరు వద్దకు వచ్చి కొండ మీద కూడారు.

26 అబ్నేరు యోవాబును పిలిచి, “కత్తివుంటే అది ఎల్లప్పుడూ చంపటానికేనా? నీకు తెలుసు; నిజానికి ఇది విషాదాంతమవుతుంది! తమ సోదరులనే వెంటాడటం మానివేయమని ఆ మనుష్యులకు చెప్పు” అని అన్నాడు.

27 “నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవంతోడుగా చెబుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా వుండివుంటే ఈ జనం వారి సోదరులను తెల్లవారేవరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు అన్నాడు. 28 అప్పుడు యోవాబు ఒక బూర వూదాడు. దానితో అతని మనుష్యులు ఇశ్రాయేలీయులను తరమటం మానివేశారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని వారు ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు.

29 అబ్నేరు, అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబహు మైదానం గుండా ప్రయాణం చేసి యొర్దాను నదిని దాటారు. మరునాటి పగలంతా వారు ప్రయాణం చేసి మహనయీముకు చేరారు.

30 యోవాబు అబ్నేరును తరుముట మాని, తిరిగి వచ్చాడు, యోవాబు తన జనాన్ని సమావేశ పర్చినప్పుడు దావీదు అనుచరులలో పందొమ్మిది మంది తప్పియున్నారు. అశాహేలు కూడా లేడు. 31 అబ్నేరు అనుచరులలో మూడువందల అరువది మంది బెన్యామీనీయులను దావీదు సేవకులు వధించారు. 32 దావీదు మనుష్యులు అశాహేలు శవాన్ని బేత్లెహేముకు తీసుకొని వెళ్లి, అక్కడ ఉన్న అతని తండ్రి సమాధిలోనే పాతి పెట్టారు.

యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా పయనించారు. వారు హెబ్రోను చేరేసరికి సూర్యోదయమయ్యింది.

1 కొరింథీయులకు 13

ప్రేమను నీ మార్గదర్శిగా ఉండనివ్వు

13 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు. నాకు దైవసందేశం చెప్పే వరం ఉన్నా, నాలో సంపూర్ణ జ్ఞానం ఉన్నా, నాకు అన్ని రహస్యాలు తెలిసినా, నాలో పర్వతాలను కదిలించగల విశ్వాసం ఉన్నా, నాలో ప్రేమ లేకపోయినట్లయితే నేను నిరర్థకుణ్ణి. నేను నా సర్వము పేదలకు దానం చేసినా, నా దేహాన్ని అగ్నికి అర్పితం చేసినా నాలో ప్రేమ లేకపోతే అది నిరర్థకము.

ప్రేమలో సహనము ఉంది. ప్రేమలో దయ ఉంది. ప్రేమలో ఈర్ష్య లేదు. అది గొప్పలు చెప్పుకోదు. దానిలో గర్వము లేదు. దానిలో క్రూరత్వము లేదు. దానిలో స్వార్థం లేదు. దానికి ముక్కు మీద కోపం ఉండదు. అది తప్పులు ఎంచదు. ప్రేమ చెడును గురించి ఆనందించదు. అది సత్యాన్నిబట్టి ఆనందిస్తుంది. ప్రేమ అన్ని సమయాల్లో కాపాడుతుంది. అది అన్ని వేళలా విశ్వసిస్తుంది. ఆశను ఎన్నటికీ వదులుకోదు. అది ఎప్పుడూ సంరక్షిస్తుంది.

దైవసందేశాన్ని చెప్పే వరము మనము పొందాము. అది అంతమౌతుంది. తెలియని భాషల్లో మాట్లాడే శక్తి మనకు ఉంది. అది అంతమౌతుంది. మనలో జ్ఞానం ఉంది. అది నశించిపోతుంది. కాని ప్రేమ నశించి పోదు. ఎందుకంటే, మన జ్ఞానం మితమైంది, మనకుండే ఈ సందేశము అసంపూర్ణమైనది. 10 అయితే సంపూర్ణత కలిగినప్పుడు ఈ అసంపూర్ణత అంతమౌతుంది.

11 నేను పసివానిగా ఉన్నప్పుడు పసివాని మాటలు, అనుభవాలు, ఆలోచనలు నాలో ఉండేవి. నేను యవ్వనంలోకి వచ్చాక నా బాల్యంలో ఉన్న గుణాల్ని మరిచిపోయాను. 12 ప్రస్తుతం అద్దంలో మసకగా కనిపిస్తున్న ప్రతిబింబాన్ని మాత్రమే మనము చూస్తున్నాము. తదుపరి మనము ఆ ముఖాన్ని స్పష్టంగా చూస్తాము. ఇప్పుడు నాకు తెలిసింది సంపూర్ణం కాదు. కాని తదుపరి నా గురించి దేవునికి తెలిసినంత సంపూర్ణంగా నాకు ఆయన్ని గురించి తెలుస్తుంది. 13 అంతందాకా ఈ మూడు, అంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఉంటాయి. వీటిలో ప్రేమ గొప్పది.

యెహెజ్కేలు 11

నాయకులకు విరోధంగా ప్రవచనాలు

11 తరువాత ఆత్మ (గాలి) నన్ను యెహోవా ఆలయపు తూర్పుద్వారం వద్దకు తీసుకొని వెళ్లింది. సూర్యుడు ఉదయించే వైపుకు ఈ ద్వారం తిరిగి ఉంది. ఈ ద్వారం ముందు ఇరవైఐదు మంది మనుష్యులున్నట్లు నేను చూశాను. అజ్జూరు కుమారుడైన యజన్యా వారితోవున్నాడు. బెనాయా కుమారుడు పెలట్యా కూడా అక్కడ వున్నాడు. పెలట్యా ఆ ప్రజలకు నాయకుడుగా ఉండెను.

పిమ్మట దేవుడు నాతో ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ నగరానికి కీడు మూడే పథకాలు వేసేవారు వీరే. ప్రజలు చెడు కార్యాలు చేయటానికి వీరు నిత్యం ప్రోత్సహిస్తారు. ఈ మనుష్యులు, ‘మా ఇండ్లు మేము త్వరలో తిరిగి నిర్మించుకుంటాము. కుండలో మాంసంలా మేమీ నగరంలో సురక్షితంగా ఉన్నాము!’ అని అంటున్నారు. వారీ అబద్ధాలు చెపుతున్నారు. కావున నీవు నా తరపున ప్రజలతో మాట్లాడాలి. ఓ నరపుత్రుడా, నీవు వెళ్లి ప్రజలకు భవిష్యత్తు యొక్క నిజాలను ప్రకటించు.”

ఆ తరువాత యెహోవా ఆత్మ నా మీదికి వచ్చాడు. దేవుడు ఇలా చెప్పాడు: “యెహోవా ఈ మాట చెప్పాడని వారికి తెలియజేయి: ఇశ్రాయేలు వంశీయులారా, మీరు పెద్ద పెద్ద విషయాలు చేయపూనుకొంటున్నారు. కాని మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు! మీరీ నగరంలో అనేక మందిని చంపివేశారు. వీధులన్నిటినీ మీరు శవాలతో నింపివేశారు. ఇప్పుడు మన ప్రభువైన యెహోవా చెపుతున్నదేమంటే, ‘ఈ శవాలే ఆ మాంసం. నగరమే ఆ కుండ. కాని అతడు (నెబకద్నెజరు) వచ్చి ఈ సురక్షితమైన కుండలో నుండి మిమ్మల్ని తీసుకొనిపోతాడు! మీరు కత్తికి భయపడుతున్నారు. కాని మీ మీదికి నేను కత్తిని తీసుకువస్తున్నాను!’” మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కావున అవి నెరవేరితీరుతాయి!

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “మిమ్మల్ని ఈ నగరం నుండి నేను బయటికి తీసుకొని వెళతాను. మిమ్మల్ని అన్యులకు అప్పగిస్తాను. నేను మిమ్మల్ని శిక్షిస్తాను! 10 మీరు కత్తికి గురియై చనిపోతారు. నేను మిమ్మల్ని అక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. తద్వారా మిమ్మల్ని శిక్షించేది నేనే అని మీరు తెలుసుకొంటారు. నేనే యెహోవాను. 11 అవును. ఈ నగరం వంటపాత్ర అవుతుంది. మీరు అందులో ఉడికే మాంసం! మిమ్మల్ని ఇక్కడే ఇశ్రాయేలులో శిక్షిస్తాను. 12 అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. మీరు భగ్నపర్చింది నా ధర్మాన్నే! మీరు నా ఆజ్ఞలను శిరసావహించలేదు. మీ చుట్టూ వున్న దేశాల ప్రజల మాదిరిగానే మీరూ జీవించటానికి నిర్ణయించుకున్నారు.”

13 నేను దేవుని తరపున మాట్లాడటం పూర్తిచేసిన వెంటనే బెనాయా కుమారుడైన పెలట్యా చని పోయాడు! నేను వెంటనే సాష్టాంగపడి, నా శిరస్సు భూమికి ఆనించి ఇలా పెద్ద గొంతుకతో అరిచాను: “నా ప్రభువైన ఓ యెహోవా, నీవు ఇశ్రాయేలులో మిగిలిన వారందరినీ పూర్తిగా నాశనం చేయబోతున్నావు!”

యెరూషలేము శేషులకు విరోధంగా ప్రవచనాలు

14 కాని యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 15 “నరపుత్రుడా, ఈ దేశాన్నుండి వెడలగొట్టబడిన ఇశ్రాయేలు సంతతివారగు నీ సోదరులను నీవు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఇక్కడికి చాలా దూరంలో వున్న దేశంలో వారు నివసిస్తున్నారు. అయినా నేను వాళ్ళను తిరిగి రప్పిస్తాను. ‘కాని యెరూషలేములో ఉంటున్న జనులు యెహోవాకు దూరంగా ఉండండి. ఈ దేశం మాకు ఇవ్వబడింది.’ ఇది మాది అని అంటున్నారు.

16 “కావున ఈ విషయాలు ఆ ప్రజలకు తెలియ జేయుము, మన ప్రభువైన యెహోవా చెప్పున దేమంటే, ‘నా ప్రజలు దూరదేశాలకు తరలిపోయేలా నేను ఒత్తిడి చేసిన మాట నిజమే. అనేక దేశాలలో నివసించేలా వారిని చెల్లా చెదురు చేశాను. అయినా వాళ్ళు ఆ దేశాలలో ఉన్నప్పుడు కొద్దికాలం నేనే వారి ఆలయమై ఉంటాను. 17 కావున వారి ప్రభువైన యెహోవా వారిని తిరిగి తీసుకువస్తాడని నీవు ఆ ప్రజలకు చెప్పాలి. నేను మిమ్మల్ని అనేకదేశాలకు చెదరగొట్టాను. కాని మిమ్మల్ని మళ్లీ చేరదీసి, ఆయా దేశాలనుండి తిరిగి తీసుకొని వస్తాను. ఇశ్రాయేలు దేశాన్ని మళ్లీ మీకు ఇస్తాను! 18 నా ప్రజలు తిరిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న అపవిత్రమైన విగ్రహాలన్నింటినీ వారు నాశనం చేస్తారు. 19 నేను వారందరినీ చేరదీసి, ఒక్క మనిషిలా వారిలో ఐకమత్యం కలుగజేస్తాను. వారికి నూతన ఆత్మ కలుగజేస్తాను. రాతి గుండెను తీసివేసి, దాని స్థానంలో మాంసపు గుండెను అమర్చుతాను. 20 అప్పుడు వారు నా ధర్మాలను పాటిస్తారు. వారు నా ఆజ్ఞలను పాటిస్తారు. నేను వారికి చెప్పిన పనులు చేస్తారు. అప్పుడు వారు నిజంగా నా ప్రజలవుతారు. నేను వారి దేవుడి నవుతాను.’”

యెహోవా మహిమ యెరూషలేమును వదలుట

21 దేవుడు ఇంకా ఇలా అన్నాడు: “కాని ఇప్పుడు వారి హృదయాలు ఆ భయంకరమైన, హేయమైన విగ్రహాలకు చెందివున్నాయి. కనుక ఆ ప్రజలు చేసిన దుష్కార్యాలకు నేను వారిని శిక్షించాలి.” నా ప్రభువైన యెహోవా ఆ మాటలు చెప్పాడు. 22 పిమ్మట కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలో ఎగిరిపోయారు. చక్రాలు వారితో వెళ్లాయి. ఇశ్రాయేలు దేవుని మహిమ వారిపైన ఉంది. 23 యెహోవా మహిమ గాలిలోకి లేచి యెరూషలేమును వదిలి వెళ్లింది. యెరూషలేముకు తూర్పున వున్న కొండ[a] మీద దేవుడు ఒక్క క్షణం ఆగాడు. 24 పిమ్మట ఆత్మ నన్ను గాలిలోకి లేపి మళ్ళీ బబులోను (బాబిలోనియా)కు తీసుకొని వచ్చాడు. ఆయన నన్ను ఇశ్రాయేలు నుండి బలవంతంగా వెళ్లగొట్టబడిన ప్రజల వద్దకు తీసుకొనివచ్చాడు. ఆ దర్శనంలోనే యెహోవా ఆత్మ గాలిలోకి లేచి, నన్ను వదిలి వెళ్లాడు. అవన్నీ నేను దర్శనంలో చూశాను. 25 పిమ్మట బందీలుగా వున్న (చెరపట్టబడిన) ప్రజలతో నేను మాట్లాడాను. యెహోవా నాకు చూపిన అన్ని విషయాల గురించీ వారికి చెప్పాను.

కీర్తనలు. 50

ఆసాపు కీర్తనలలో ఒకటి.

50 దేవాధి దేవుడు యెహోవా మాట్లాడాడు.
    సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు భూమి మీది ప్రజలందరినీ ఆయన పిలుస్తున్నాడు.
సీయోను నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు. ఆ పట్టణపు అందము పరిపూర్ణమైనది.
మన దేవుడు వస్తున్నాడు, ఆయన మౌనంగా ఉండడు.
    ఆయన యెదుట అగ్ని మండుతుంది.
    ఆయన చుట్టూరా గొప్ప తుఫాను ఉంది.
తన ప్రజలకు తీర్పు చెప్పుటకు పైన ఆకాశాన్ని,
    క్రింద భూమిని ఆయన పిలుస్తున్నాడు.
“నా అనుచరులను నా చుట్టూరా చేర్చండి.
    వారు బలియర్పణ ద్వారా నాతో ఒడంబడిక చేసుకున్నారు” అని ఆయన అంటాడు.

అప్పుడు ఆకాశాలు ఆయన న్యాయాన్ని చెప్పాయి.
    ఎందుకంటే, దేవుడే న్యాయమూర్తి.

దేవుడు చెబుతున్నాడు: “నా ప్రజలారా, నా మాట వినండి.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీకు విరోధంగా నా రుజువును కనపరుస్తాను.
    నేను దేవుణ్ణి, మీ దేవుణ్ణి.
నేను మీ బలుల విషయంలో మిమ్ములను సరిచేయటంలేదు. గద్దించటంలేదు.
    ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దహన బలులను ఎల్లప్పుడూ తెస్తున్నారు. ప్రతిరోజు వాటిని మీరు నాకిస్తున్నారు.
మీ ఇంటినుండి ఎద్దులను తీసుకోను.
    మీ శాలలనుండి మేకలు నాకవసరం లేవు.
10 ఆ జంతువులు నాకు అవసరం లేదు. అరణ్యంలో ఉన్న జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
    వేలాది పర్వతాల మీద జంతువులన్నీ ఇది వరకే నా సొంతం.
11 కొండల్లో ఉండే ప్రతి పక్షి నాకు తెలుసు.
    పొలాల్లో చలించే ప్రతిదీ నా సొంతం
12 నాకు ఆకలి వేయదు! నాకు ఆకలిగా ఉంటే ఆహారం కోసం నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు
    ప్రపంచం, అందులో ఉన్న సమస్తమూ, నా సొంతం.
13 నేను ఎద్దుల మాంసం తినను. నేను మేకల రక్తం త్రాగను.”

14 దేవునికి కృతజ్ఞతార్పణలను ఇవ్వండి. మహోన్నతుడైన దేవునికి మీ మొక్కుబడిని చెల్లించండి,
    దేవుడు ఇలా అన్నాడు: మీరు వాగ్దానం చేసినది ఇవ్వండి.
15 “ఇశ్రాయేలు ప్రజలారా, మీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను ప్రార్థించండి!
    నేను మీకు సహాయం చేస్తాను. అప్పుడు మీరు నన్ను గౌరవించవచ్చు.”

16 దుర్మార్గులతో దేవుడు చెబుతున్నాడు,
    “నా న్యాయ విధులను చదువుటకు,
    నా ఒడంబడికకు బద్ధులమని ప్రకటించుటకును మీకేమి హక్కున్నది?[a]
17 కనుక నేను మిమ్మల్ని సరిదిద్దినప్పుడు దానిని మీరు ద్వేషిస్తారు.
    నేను మీతో చెప్పే సంగతులను మీరు నిరాకరిస్తారు.
18 మీరు ఒక దొంగను చూస్తారు, వానితో చేయి కలపడానికి పరుగెడతారు.
    వ్యభిచార పాపం చేసే మనుష్యులతో పాటు మీరు మంచం మీదికి దూకుతారు.
19 మీరు చెడు సంగతులు చెబుతారు, అబద్ధాలు పలుకుతారు.
20 మీరు మీ సహోదరుని గూర్చి ఎడతెగక చెడ్డ సంగతులు చెబుతారు.
    మీరు మీ తల్లి కుమారుని అపనిందలపాలు చేస్తారు.
21 మీరు ఈ చెడ్డ విషయాలు చేసారు. నేను మౌనంగా ఉండిపోయాను
    నేను మీలాంటివాడినని మీరనుకొన్నారు.
కాని నేనిప్పుడు మిమ్ములను కోపంతో గద్దిస్తాను.
    మరియు మీ ముఖంమీద నిందమోపుతాను.
22 నేను మిమ్ములను చీల్చివేయకముందే,
    దేవుని మరచిన జనాంగమైన మీరు,
ఈ విషయమును గూర్చి ఆలోచించాలి.
    అదే కనుక జరిగితే, ఏ మనిషి మిమ్మల్ని రక్షించలేడు.
23 ఒక వ్యక్తి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తే, అప్పుడు అతడు నన్ను గౌరవిస్తాడు.
    నా మార్గాన్ని అనుసరించే వానికి రక్షించగల దేవుని శక్తిని నేను చూపిస్తాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International