Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 సమూయేలు 1

సౌలు మరణం గురించి దావీదు వినటం

దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది. మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది. అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు.

“నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు.

“నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించుకొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు.

“దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు.

“జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి.

దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు.

అందుకు యువసైనికుడు, ఇలా చెప్పాడు: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు. సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. అతను నన్ను పిలవగా, ‘నన్నేమి చేయమంటారు?’ అంటూ వెళ్లాను. ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను. సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయి. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’ అని చెప్పాడు. 10 అందువల్ల నేను ఆగి, అతన్ని చంపాను. అతను ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనతని కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.”

11 తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు. 12 వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు.

అమాలేకీయుని చంపమని దావీదు ఆజ్ఞ

13 సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు.

“నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు.

14 “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు.

15-16 తరువాత దావీదు తన యువభటులలో ఒకనిని పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువకుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపివేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా నీవే మాట్లాడావు![a] ‘దేవునిచే ఎంపిక చేయబడిన రాజును నేనే చంపానని’ నీవే అన్నావు,” అని దావీదు ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు.

సౌలు, యోనాతానులను గూర్చిన దావీదు ప్రలాప గీతిక

17 సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు. 18 యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాట యాషారు గ్రంథంలో ఇలా వ్రాయబడింది.

19 ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది!
    బలాఢ్యులు పడిపోయారు!
20 ఈ విషయం గాతులో చెప్పవద్దు,
    అష్కెలోను[b] వీధులలో ప్రకటించ వద్దు!
ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు,
    సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు!

21 “గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని
    వాన చినుకులు గాని పడకుండుగాక!
ఆ పొలాలు బీడులైపోవుగాక!
యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి
    అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు.
22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది.
    సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది
అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల,
కొవ్వును స్పృశించాయి.

23 “సౌలును, యోనాతానును మేము ప్రేమించాము;
    వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము!
    మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు!
వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు,
    వారు సింహాల కంటె బలంగలవారు!
24 ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి!
    సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు;
    మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు.

25 “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు!
    యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు.
26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను.
    నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను;
నా పట్ల నీ ప్రేమ అద్భతం,
    అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది!
27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు!
    వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”

1 కొరింథీయులకు 12

పవిత్రాత్మ వరాలు

12 సోదరులారా! పరిశుద్ధాత్మ యిచ్చే వరాలను గురించి మీరు తెలుసుకోవాలని నా అభిప్రాయము. మీరు క్రీస్తులో విశ్వాసులు కానప్పుడు ఏదో ఒక విధంగా ప్రేరేపింపబడి త్రోవతప్పి, మాట్లాడలేని విగ్రహాల వైపుకు మళ్ళారు. ఇది మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేదేమిటంటే, దేవుని ఆత్మ ద్వారా మాట్లాడేవాడెవ్వడూ, “యేసు శాపగ్రస్తుడని” అనడు. అదే విధంగా ఆత్మ ద్వారా మాత్రమే “యేసే ప్రభువు” అని అనగలడు.

దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. ప్రభువు ఒక్కడే కాని, ఆయనకు ఎన్నో విధాలుగా సేవ చేయవచ్చు. దేవుడు నలుగురిలో పలువిధాలుగా పని చేస్తాడు. దేవుడు ఒక్కడే అయినా ఆయన అన్నీ చేస్తాడు. అందరిలో చేస్తాడు.

దేవుడు ప్రతీ ఒక్కరిలో తన ఆత్మ ఉండేటట్లు చేసాడు. ఇది మనము చూస్తున్నాము. అందరికీ శ్రేయస్సు కలగాలని ఆయన ఉద్దేశ్యం. ఒకనికి పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మీయ జ్ఞానంతో మాట్లాడే వరాన్ని, ఆ ఆత్మ ద్వారానే బుద్ధి వాక్యాన్ని ఇచ్చాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఒకనికి విశ్వాసము ఇచ్చాడు. మరొకనికి వ్యాధులు నయం చేసే వరము నిచ్చాడు. 10 ఒకనికి అద్భుతాలు చేయు శక్తిని, మరొకనికి ప్రవచించే శక్తిని ఇచ్చాడు. ఒకనికి ఆత్మలను గుర్తించే శక్తిని, మరొకనికి రకరకాల భాషల్లో మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఇంకొకనికి వాటి అర్థాలను విడమర్చి చెప్పే శక్తినిచ్చాడు. 11 ఆ ఒక్క ఆత్మయే అన్నీ చేస్తున్నాడు. ఆయన తన యిచ్ఛానుసారం ప్రతీ ఒక్కనికి వరాల్ని ఇస్తాడు.

ఒకే శరీరం, అనేక అవయవాలు

12 శరీరంలో అనేక భాగాలు ఉన్నా అవి కలిసి ఒక దేహంగా పని చేస్తాయి. క్రీస్తు కూడా అంతే. 13 అంటే మనమంతా ఒక ఆత్మ ద్వారా బాప్తిస్మము పొంది, ఒక శరీరంలో ఐక్యం అయ్యాము. మనము యూదులమైనా, గ్రీకులమైనా, బానిసలమైనా, బానిసలము కాకపోయినా, మనకందరికీ ఒకే ఆత్మ యివ్వబడినాడు.

14 మన శరీరంలో ఎన్నో భాగాలున్నాయి. ఒకటి కాదు. 15 ఒకవేళ, కాలు, “నేను చేతిని కాను, కనుక నేను ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 16 అదే విధంగా ఒకవేళ చెవి, “నేను కన్నును కాను. కనుక ఈ శరీరానికి చెందను” అని అన్నంత మాత్రాన అది శరీరంలో ఒక భాగం కాకపోదు. 17 శరీరమంతా కన్నైపోతే దేనితో వింటాం? శరీరమంతా చెవియైతే దేనితో వాసన చూస్తాం? 18 కాని నిజానికి దేవుడు ఈ శరీరంలోని ప్రతి అవయవాన్ని తాను అనుకొన్న విధంగా అమర్చాడు. 19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. 20 నిజానికి శరీరంలో అనేక భాగాలు ఉన్నా శరీరం ఒక్కటే.

21 కన్ను చేతితో, “నీవు నాకు అవసరం లేదు” అని అనలేదు. అదే విధంగా శిరస్సు పాదాలతో, “మీరు నాకు అవసరం లేదు” అని అనలేదు. 22 సున్నితంగా కనిపించే అవయవాలే నిజానికి ముఖ్యమైనవి. 23 ముఖ్యం కాదనుకొనే భాగాలను మనము ప్రత్యేకంగా కాపాడుతాము. బహిరంగపరచలేని భాగాల పట్ల మనము ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాము. 24 బహిరంగపరచగల భాగాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపనవసరం లేదు. కాని దేవుడు శరీరానికి సంబంధించిన భాగాల్ని ఒక చోట చేర్చి ప్రాముఖ్యత లేని భాగాలకు ప్రాముఖ్యత కలిగించాడు. 25 శరీరంలో చీలికలు ఉండరాదని, దాని భాగాలు పరస్పరం శ్రద్ధ చూపుతూ ఉండాలని, ఆయన ఉద్దేశ్యం. 26 ఒక భాగానికి కష్టం కలిగితే ప్రతీయొక భాగం దానితో సహా కష్టం అనుభవిస్తుంది. ఒక భాగానికి గౌరవం లభిస్తే మిగతా భాగాలన్నింటికీ దానితో సహా ఆనందం కలుగుతుంది.

27 మీరు క్రీస్తు శరీరం. మీలో ప్రతి ఒక్కరూ ఆ శరీరానికి చెందిన భాగాలు. 28 దేవుడు సంఘంలో ఉన్నవాళ్ళందర్నీ తమతమ స్థానాల్లో ఉంచాడు. మొదటి స్థానంలో అపొస్తలులను, రెండవ స్థానంలో ప్రవక్తల్ని, మూడవ స్థానంలో బోధించే వాళ్ళను, ఆ తర్వాత మహత్కార్యాలను చేసేవాళ్ళను, వాళ్ళ తర్వాత వ్యాధులు నయం చేసే శక్తి గలవాళ్ళను, ఇతరులకు సహాయం చేసేవాళ్ళను, పరిపాలించేవాళ్ళను, తమకు తెలియని భాషల్లో మాట్లాడగల శక్తి గలవాళ్ళను ఉంచాడు. 29 వీళ్ళలో అందరూ అపొస్తలులు కారు, అందరూ ప్రవక్తలు కారు, అందరూ బోధించేవాళ్ళు కారు, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు కారు. 30 వీళ్ళలో అందరికి వ్యాధులు నయం చేసే శక్తి లేదు. తెలియని భాషలో మాట్లాడే శక్తి లేదు. ఆ మాటలకు అర్థం విడమర్చి చెప్పే శక్తి లేదు. 31 కనుక మీ హృదయాలను ముఖ్యమైన వరాల వైపుకు మళ్ళించండి. ఏది ఏమైనా అన్నిటికన్నా ముఖ్యమైన మార్గం చూపిస్తాను.

యెహెజ్కేలు 10

యెహోవా మహిమ దేవాలయమును వదలుట

10 తరువాత నేను కెరూబు దూతల తలలపైవున్న పాత్రవైవు చూశాను. అది స్వచ్చమైన నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు. నారబట్టలు వేసుకున్న వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య ప్రాంతంలోకి రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై విసిరివేయి.”

ఆ వ్యక్తి నా ప్రక్క నుండి వెళ్లాడు. ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది. పిమ్మట దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి పైకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవరించింది. ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.

నారబట్టలు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి ప్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. కావున ఆ వ్యక్తి ఒక చక్రం ప్రక్కగా నిలబడ్డాడు. కెరూబులలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. (కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)

అక్కడ నాలుగు చక్రాలున్నట్లు నేనప్పుడు చూశాను. ప్రతి కెరూబుల ప్రక్క ఒక చక్రం చొప్పున ఉన్నాయి. చక్రాలు స్వచ్చమైన విలువైన రాయిగా కనిపించాయి. 10 మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి. 11 కదిలినప్పుడు ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనైనా వెళ్ళగలిగినవి. కాని కెరూబులు కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు. 12 వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి! 13 నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.

14-15 ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం.[a] రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే.

పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు. 16 వాటితో పాటు చక్రాలు లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు. 17 కెరూబులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో వెళ్లాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది.

18 తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది. 19 అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రాయేలు దేవుని మహిమ గాలిలో వారిపై నిలిచింది.

20 అప్పుడు నేను కెబారు కాలువవద్ద దర్శించిన ఇశ్రాయేలు దేవుని మహిమ క్రింద ఉన్న జీవులను గుర్తుకు తెచ్చుకున్నాను. ఆ జీవులే కెరూబు దూతలని నేను తెలుసుకొన్నాను. 21 ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు మరియు మానవుల చేతులను పోలినటువంటివి వాటి రెక్కల క్రింద ఉన్నాయి. 22 కెరూబుల ముఖాలు నేను కెబారు కాలువ వద్ద దర్శించిన జీవుల ముఖాల మాదిరిగానే ఉన్నాయి. అవన్నీ అవి పోయే దిక్కు వైపే తిన్నగా చూస్తూ ఉన్నాయి.

కీర్తనలు. 49

సంగీత నాయకునికి: కోరహు కుమారుల కీర్తన.

49 సర్వ దేశములారా, ఇది వినండి.
    భూమి మీద నివసించే సకల ప్రజలారా, ఇది వినండి.
    ప్రతి మనిషి, ధనికులు, దరిద్రులు కలిసి వినాలి.
నేను మీకు కొన్ని జ్ఞాన విషయాలు చెబుతాను.
    నా ఆలోచనలు బుద్ధినిస్తాయి.
సామెతపైనా ఆసక్తినుంచుతాను.
    ఇప్పుడు నా సితారాను వాయిస్తూ కథను వివరిస్తాను.

అపాయాన్నిగూర్చి నేను భయపడాల్సిన అవసరం నాకేమీ లేదు.
    నా దుష్ట శత్రువులు నన్ను చుట్టుముట్టినప్పుడు నేను భయపడాల్సిన కారణం ఏమీ లేదు.
ఆ ప్రజలు తమ స్వంత బలాన్ని నమ్మి
    తమ ఐశ్వర్యాన్ని గూర్చి గొప్పలు చెప్పుకొంటారు.
ఎవడూ తనకు తాను విడుదల చేసుకోలేడు.
    నీవు ఒకని జీవితపు వెలను దేవునికి చెల్లించలేవు.
ఏ మనిషీ తన సొంత ప్రాణాన్ని కొనుక్కునేందుకు
    సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు.
ఏ మనిషీ శాశ్వతంగా జీవించే హక్కు
    కొనుక్కునేందుకు సరిపడేంత డబ్బు ఎన్నటికీ సంపాదించలేడు,
    మరియు తన సొంత శరీరం సమాధిలో కుళ్లిపోకుండా రక్షించుకోలేడు.
10 చూడు, వెఱ్ఱివాళ్లు, బుద్ధిహీనులు చనిపోయినట్టే జ్ఞానులు కూడా చనిపోతారు.
    మరియు వారు తమ ఐశ్వర్యమంతటినీ ఇతరులకు విడిచిపెడతారు.
11 శాశ్వతంగా సదాకాలం సమాధి ప్రతి ఒక్కరి గృహంగా ఉంటుంది.
    వారికి సొంతంగా ఎంత భూమి ఉన్నా సరే లెక్కలేదు.
12 ధనికులు నిరంతరం జీవించలేరు.
    వారు జంతువుల్లా మరణిస్తారు.
13 బుద్ధిహీనులకు, మరియు వారు చెప్పేది
    అంగీకరించే వారికి ఇలాగే జరుగుతుంది.
14 మనుష్యులందరూ గొర్రెల్లా ఉన్నారు. సమాధి వారిదొడ్డి.
    మరణం వారి కాపరి.
    వారి శరీరాలు సమాధిలో కుళ్లిపోయి వ్యర్థమైపోతాయి.

15 కాని దేవుడు విలువ చెల్లించి నా ప్రాణాన్ని విమోచిస్తాడు.
    సమాధి శక్తి నుండి ఆయన నన్ను విడుదల చేస్తాడు.
16 మనుష్యుడు కేవలం ధనికుడని వానికి భయపడవద్దు.
    వాని ఇంటి ఐశ్వర్యం పెరిగిందని వానికి భయపడవద్దు.
17 ఆ మనుష్యుడు చనిపోయినప్పుడు వాని వెంట వాడేమీ తీసుకొనిపోడు.
    వాని ఐశ్వర్యం వానితో సమాధిలోనికి దిగిపోదు.
18 అయినప్పటికీ, అతడు జీవించినంత కాలం సంతోషంగా ఉంటాడు.
    ఒక మనుష్యుడు తనకు తాను మంచి చేసికొని పొగడ్తలు పొందినా,
19 అతడు తన పూర్వీకుల వద్దకు వెళ్తాడు.
    అతడు ఇక వెలుగును ఎన్నటికి చూడడు.
20 మనుష్యుడు తన వైభవంలో ఎక్కువ కాలం నిలిచియుండలేడు. అతడు నశించే మృగంలాంటి వాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International