M’Cheyne Bible Reading Plan
సౌలు మరణం
31 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేశారు. ఇశ్రాయేలు సైన్యం చెల్లాచెదురై ఫిలిష్తీయుల నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతంవద్ద చాలా మంది ఇశ్రాయేలీయులు చంపబడ్డారు. 2 ఫిలిష్తీయులు సౌలుతోను, అతని కుమారులతోను భీకరంగా పోరాడారు. సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు మరియు మెల్కీషూవలను ఫిలిష్తీయులు చంపివేశారు.
3 సౌలు మీద యుద్ధం దారుణంగా జరిగింది. విలుకాండ్రు సౌలు మీద బాణాలు వేయగా సౌలు శరీరం తూట్లు పడిపోయింది. 4 సౌలు తన ఆయుధాలు మోసేవానిని పిలిచి, “నీ కత్తి దూసి దానితో నన్ను సంహరించు. సున్నతి సంస్కారం లేని ఈ పరాయి వాళ్లు నన్ను గేలి చేయకుండా నన్ను సంహరించు” అని చెప్పాడు. కాని సౌలు సహాయకుడు నిరాకరించాడు. అతడు చాలా భయపడిపోయాడు. అందుచేత సౌలు తన కత్తినే దూసి దానితో తనను తానే చంపుకున్నాడు.
5 అలా సౌలు చనిపోవటం ఆయుధాలు మోసేవాడు చూశాడు. కనుక వాడు కూడ తన కత్తితో తాను పొడుచుకొని సౌలుతో పాటు చనిపోయాడు. 6 కనుక ఆ ఒక్కరోజున సౌలు, అతని ముగ్గురు కుమారులు, అతని సహాయకుడు అందరూ చనిపోయారు.
సౌలు మరణం గూర్చి ఫిలిష్తీయుల ఆనందం
7 లోయకు అవతల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు, ఇశ్రాయేలు సైన్యం పారిపోవటం చూశారు. సౌలు, అతని కుమారులు చనిపోవటం కూడ వారు చూశారు. కనుక ఆ ఇశ్రాయేలీయులు తమ నగరాలను వదిలి పారిపోయారు. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి ఆ నగరాలను ఆక్రమించుకొని వాటిలో నివసించసాగారు.
8 ఆ మరునాడు చనిపోయిన వారివద్దనున్న విలువైన వస్తువులను తీసుకోవటానికి ఫిలిష్తీయులు వచ్చారు. సౌలు, అతని ముగ్గురు కుమారులు గిల్బోవ పర్వతం మీద చనిపోయి ఉన్నట్లు వారు చూశారు. 9 ఫిలిష్తీయులు సౌలు తల నరికి, అతని కవచం తీసుకున్నారు. ఈ వార్తను వారు ఫిలిష్తీయులందరికీ తెలియ జేసి, వారి బూటకపు దేవతల విగ్రహాల దేవాలయానికి కూడ ఆ వార్తను చేరవేశారు. 10 వారు సౌలు కవచాన్ని అష్తారోతు దేవత గుడిలో ఉంచారు. ఫిలిష్తీయులు సౌలు శవాన్ని బెత్షాను నగర గోడకు వేలాడదీసారు.
11 ఫిలిష్తీయులు సౌలుకు చేసిన వాటన్నింటిని గూర్చి యాబేష్గిలాదు నివాసులు విన్నారు. 12 కనుక యాబేషునగరంలో వున్న సైనికులంతా, ఒక రాత్రంతా నడిచి బేత్షాను నగరానికి వెళ్లారు. సౌలు శవాన్ని బేత్షాను నగర గోడ మీదనుంచి వారు దించారు. అలాగే సౌలు కుమారుల శవాలను కూడ ఆ గోడ మీద నుంచి వారు దించారు. అప్పుడు ఆ శవాలన్నిటినీ వారు యాబేషుకు తీసుకుని వెళ్లారు. అక్కడ యాబేషు ప్రజలు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలకు దహన సంస్కారం చేశారు. 13 తరువాత వారు సౌలు, అతని ముగ్గురు కుమారుల శవాలను తీసుకుని యాబేషులో సింధూర వృక్షం క్రింద సమాధి చేశారు. అప్పుడు యాబేషు ప్రజలు వారి దుఃఖాన్ని వెలిబుచ్చారు. యాబేషు ప్రజలు ఏడు రోజుల పాటు భోజన పానాదులు మానివేశారు.[a]
11 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి.
ఆరాధనా, పవిత్రత—తలపై ముసుగు
2 నన్ను ఎప్పుడూ జ్ఞాపకం చేసుకొంటూ, నేను చెప్పిన బోధల్ని పాటిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. 3 క్రీస్తుకు ప్రతీ మనిషిపై అధికారం ఉంది. ప్రతీ పురుషునికి తన భార్యపై అధికారం ఉంది. దేవునికి క్రీస్తుపై అధికారం ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని నా కోరిక.
4 కనుక తన తల కప్పుకొని బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించేవాడు లేక దైవసందేశాన్ని ప్రకటించేవాడు తన తలను అవమానపరచినవానితో సమానము. 5 తల మీద ముసుగు వేసుకోకుండా బహిరంగంగా దేవుణ్ణి ప్రార్థించే స్త్రీ, లేక దైవసందేశాన్ని బోధించే స్త్రీ తన తలను అవమానపరచినట్లు అవుతుంది. ఆమె తలగొరిగించుకొన్నదానితో సమానము. 6 స్త్రీ తన తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె తన తలవెంట్రుకలు కత్తిరించుకోవటం మంచిది. తలవెంట్రుకలు కత్తిరించుకోవటంకాని, లేక తల గొరిగించుకోవటం కాని అవమానంగా అనిపిస్తే ఆమె తన తలపై ముసుగు వేసుకోవాలి.
7 పురుషుడు దేవుని ప్రతిరూపం. దేవునికి కీర్తి కలిగించేవాడు పురుషుడు. కనుక అతడు తన తల కప్పుకొనకూడదు. కాని స్త్రీ వల్ల పురుషునికి కీర్తి కలుగుతుంది. 8 ఎందుకంటే పురుషుడు స్త్రీ నుండి సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడింది. 9 అంతేకాక పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. స్త్రీ పురుషుని కొరకు సృష్టింపబడింది. 10 ఈ కారణంగా మరియు దేవదూతల కారణంగా స్త్రీ తనపై ఒకరికి అధికారముందని చూపటానికి తన తలపై ముసుగు వేసుకోవాలి.
11 కాని ప్రభువు దృష్టిలో పురుషుడు లేకుండా స్త్రీ, స్త్రీ లేకుండా పురుషుడు జీవించలేరు. 12 ఎందుకంటే, స్త్రీ పురుషుని నుండి సృష్టింపబడినట్లే, పురుషుడు కూడా స్త్రీ నుండి సృష్టింపబడ్డాడు. కాని అన్నిటినీ దేవుడే సృష్టించాడు.
13 తలపై ముసుగు వేసుకోకుండా స్త్రీ దేవుణ్ణి ప్రార్థించటం సరియేనా? మీరే నిర్ణయించండి. 14 పురుషునికి పొడుగాటి వెంట్రుకలు ఉండటం వలన అతనికి అవమానమని ప్రకృతే మీకు తెలియచెయ్యటం లేదా? 15 స్త్రీకి తన తలవెంట్రుకలు ముసుగుగా ఉండటానికి పొడుగాటి వెంట్రుకలు ఇవ్వబడ్డాయి. దాని వల్ల ఆమెకు గౌరవం లభిస్తుంది. 16 దీన్ని గురించి ఎవరైనా వాదించాలనుకొంటే మా సమాధానం యిదే తప్ప వేరొకటి లేదు. దేవుని సంఘం కూడా దీన్నే అనుసరిస్తుంది.
ప్రభువు భోజనం
17 మీ సంఘ సమావేశాలు మంచికన్నా చెడును ఎక్కువగా చేస్తున్నాయి. కనుక ఈ క్రింది ఆజ్ఞలు మిమ్మల్ని పొగుడుతూ వ్రాయటం లేదు. 18 మీరు సమావేశమైనప్పుడు మీలో విభాగాలు కలుగుతున్నట్లు నేను విన్నాను. ఇందులో నిజముండవచ్చు. 19 సక్రమ మార్గాల్లో నడుచుకొనేవాళ్ళు రుజువు కావాలంటే మీలో విభేదాలు ఉండటం అవసరం.
20 మీరు సమావేశమైనప్పుడు నిజమైన “ప్రభు రాత్రి భోజనం” చెయ్యటం లేదు. 21 ఎందుకంటే మీరు తినేటప్పుడు ఎవరికోసం కాచుకోకుండా తింటారు. బాగా త్రాగుతారు. కాని కొందరు ఆకలితో ఉండిపోతారు. 22 తినటానికి, త్రాగటానికి మీకు ఇళ్ళు లేవా? మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. అంటే, మీరు దేవుని సంఘాన్ని లెక్క చెయ్యనట్లే కదా! మీరు ఇలా చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? ఈ విషయంలో మిమ్మల్ని పొగడను.
23 నేను ప్రభువు నుండి పొందిన సందేశాన్ని మీకు చెప్పాను. యేసు ప్రభువు అప్పగింపబడిన రాత్రి రొట్టె చేత పట్టుకొని 24 దేవునికి కృతజ్ఞతలు చెప్పి దాన్ని విరిచి, “ఇది మీ కొరకైన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకే దీనిని చేయుడి” అని అన్నాడు. 25 అదే విధముగా వారు భోజనమయిన తర్వాత ద్రాక్షారసం ఉన్న పాత్రను తీసుకొని, “ఈ పాత్ర నా రక్తంవలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనండి” అని అన్నాడు. 26 కనుక మీరు ఈ రొట్టెను తిని, ద్రాక్షారసమును త్రాగినప్పుడెల్ల ఆయన మరణాన్ని ఆయన వచ్చేదాకా ప్రకటిస్తారు.
27 కనుక ప్రభువు పట్ల అయోగ్యముగా ఎవరు ఆయన రొట్టె తింటారో, ఎవరు ఆయన పాత్ర నుండి త్రాగుతారో అతడు ప్రభువు శరీరం పట్ల, ఆయన రక్తం పట్ల పాపం చేసినవాడగును. 28 ప్రతీ వ్యక్తి రొట్టెను తినే ముందు, ఆ పాత్రనుండి త్రాగే ముందు తన ఆత్మను స్వయంగా పరిశోధించుకోవాలి. 29 ప్రభువు శరీరమని గ్రహించక రొట్టెను తినువాడు, మరియు ద్రాక్షారసం త్రాగువాడు శిక్షావిధికి గురి అవుతాడు. 30 అందువల్లనే మీలో అనేకులు బలహీనులు, రోగగ్రస్తులు అయినారు, కొందరు మరణించారు. 31 కనుక మొదటే మనల్ని మనం పరీక్షించుకొంటే మనం శిక్ష పొందం. దేవుడు మనల్ని శిక్షించడు. 32 కాని, మనకు సరియైన శిక్షణ యివ్వాలని ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. ప్రపంచంతో పాటు మనకు శిక్ష లభించరాదని ఆయన ఉద్దేశ్యం.
33 అందువల్ల నా సోదరులారా! మీరు భోజనానికి సమావేశమైనప్పుడు ఒకరి కోసం ఒకరు కాచుకోండి. 34 మీరు సమావేశమైనప్పుడు ఒకవేళ మీలో ఎవరికైనా ఆకలి వేస్తే, అలాంటివాడు యింట్లోనే తిని రావాలి. అలా చేస్తే మీరు సమావేశమైనప్పుడు తీర్పుకు గురికారు. నేను వచ్చినప్పుడు మీకు మిగతా ఆజ్ఞలు యిస్తాను.
దేవుని సందేశకులు యెరూషలేమును శిక్షించుట
9 పిమ్మట దేవుడు నగరాన్ని శిక్షించటానికి నియమితులైన నాయకులను పిలిచాడు. ప్రతి నాయకుడూ తన చేతిలో ఒక విధ్వంసకర ఆయుధం కలిగి ఉన్నాడు. 2 పై ద్వారం నుంచి ఆరుగురు మనుష్యులు బాటవెంట నడచి రావటం చూశాను. ఈ ద్వారం ఉత్తర దిశన ఉంది. ప్రతి ఒక్కడూ తన చేతిలో ఒక మారణాయుధాన్ని కలిగియున్నాడు. వారిలో ఒకడు నార బట్టలు[a] ధరించాడు. అతని నడుముకు లేఖకుని కలం, సిరాబుడ్డి[b] వేలాడకట్టుకున్నాడు. ఈ మనుష్యులు ఆలయంలో కంచు పీఠం వద్దకు వెళ్లి, అక్కడ నిలబడ్డారు. 3 అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహిమ కెరూబు దూతల మీదుగా లేచి అతను ఎక్కడకు వెళ్లాడో అక్కడకి వచ్చింది. ఆ తేజస్సు ఆలయ ద్వారం వద్దకు వచ్చింది. గడప మీదకు వచ్చి తేజస్సు ఆగింది. తరువాత నారబట్టలు వేసుకొని, లేఖకుని సామగ్రి ధరించి ఉన్నవానిని ఆ తేజస్సు పిలిచింది.
4 పిమ్మట యెహోవా (మహిమ) అతనితో, “యెరూషలేము నగరం గుండా వెళ్లు. ఈ నగరంలో ప్రజలు చేస్తున్న భయంకరమైన పనులన్నిటికీ కలత చెంది, విచారిస్తున్న వారి ఒక్కొక్కరి నుదుటి మీద ఒక గుర్తు పెట్టు” అని చెప్పాడు.
5-6 మళ్లీ దేవుడు ఇతర ఐదుగురు మనుష్యులతో, “మీరు ఆ మొదటి వ్యక్తిని అనుసరించి వెళ్లవలసిందిగా మిమ్ముల్ని కోరుతున్నాను. నుదుటి మీద గుర్తులేని ప్రతివానిని మీరు చంపివేయండి. వారు పెద్దలేగాని, పిన్నలేగాని, యువతులేగాని, పిల్లలేగాని, తల్లులేగాని ఎవరైనా లెక్కచేయవద్దు. మీ ఆయుధాన్ని వినియోగించి నుదుటిపై గుర్తులేని ప్రతివానిని చంపివేయండి. ఏ మాత్రం దయాదాక్షిణ్యం చూపవద్దు. ఎవ్వరిపట్లా జాలిపడవద్దు! ఈ నా ఆలయం వద్దనే మొదలు పెట్టండి” అని చెప్పాడు. ఆలయం ముందు ఉన్న పెద్దలతోనే వారు మొదలు పెట్టారు.
7 ఆ మనుష్యులతో దేవుడు ఇలా చెప్పాడు, “ఈ స్థలాన్ని అపవిత్రం చేయండి. శవాలతో ఈ ఆవరణాన్ని నింపివేయండి! ఇప్పుడు వెళ్లండి!” కావున వారు వెళ్లి నగర ప్రజలను చంపివేశారు.
8 ఆ మనుష్యులు ప్రజలను చంపటానికి వెళ్లగా, నేను అక్కడే ఉండిపోయాను. నా శిరస్సును భూమికి ఆనించి నమస్కరించి, “నా ప్రభువైన ఓ యెహోవా, యెరూషలేముపై నీ కోపాన్ని ప్రకటించటంతో నీవు ఇశ్రాయేలులో మిగిలి ఉన్న వారిని చంపివేయటం లేదు కదా!” అని అన్నాను.
9 అది విన్న దేవుడు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు, యూదా వంశాల వారు అనేక ఘోరపాపాలు చేశారు. ఈ దేశంలో ప్రజలు ఎక్కడ బడితే అక్కడ హత్య చేయబడుతున్నారు. ఈ నగరం నేరాలతో నిండిపోయింది. ఎందువల్లనంటే ప్రజలు, ‘యెహోవా ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయాడు కనుక మనం చేసే పనులను ఆయన చూడలేడు’ అని అనుకొంటున్నారు. 10 కాని నేను ఏ మాత్రం కనికరం చూపను. ఈ ప్రజలు పట్ల విచారించను. వారు దాన్ని వారి మీదకే తెచ్చుకొన్నారు. నేను కేవలం వారికి అర్హమైన శిక్ష విధిస్తున్నాను!”
11 పిమ్మట నారబట్టలు ధరించి కలం, సిరాబుడ్డి పట్టుకున్న వ్యక్తి వచ్చి, “మీ ఆజ్ఞ ప్రకారం నేను అంతా చేశాను” అని అన్నాడు.
కోరహు కుమారుల స్తుతి పాట.
48 యెహోవా గొప్పవాడు.
మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
అది మహారాజు పట్టణం.
3 ఇక్కడ ఆ పట్టణంలోని
భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
7 దేవా, బలమైన తూర్పుగాలితో
తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
8 మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.
© 1997 Bible League International