M’Cheyne Bible Reading Plan
ఫిలిష్తీయుల యుద్ధ సన్నాహం
28 తరువాత ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై యుద్ధానికి తమ సైన్యాన్ని సిద్ధం చేశారు. ఆకీషు దావీదుతో, “నీవూ, నీ మనుష్యులూ నాతో కలిసి ఇశ్రాయేలీయుల మీద పోరాటానికి వెళ్లాలని గ్రహించావా?” అని అన్నాడు.
2 “ఓ, తప్పకుండా. అప్పుడు నీవే చూస్తావుగా నేను ఏమి చేయగలిగిందీ” అని దావీదు జవాబిచ్చాడు.
“చాలా బాగుంది. నిన్ను నా అంగరక్షకునిగా శాశ్వత నియామకం చేస్తాను” అని అన్నాడు ఆకీషు.
సౌలు మరియు ఏన్దోరు మంత్రగత్తె
3 సమూయేలు చనిపోయాడు. ఇశ్రాయేలీయులంతా అతని మరణానికి దుఃఖించారు. అతని స్వంత పట్టణమైన రామాలోనే సమూయేలు శరీరాన్ని ప్రజలు సమాధి చేశారు.
అంతకు ముందే సౌలు కర్ణపిశాచముగల వారిని[a] చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెడల గొట్టాడు.
4 ఫిలిష్తీయులంతా యుద్ధానికి సిద్ధమై షూనేము అనే చోట గుడారాలు వేసుకున్నారు. సౌలు ఇశ్రాయేలీయులందరినీ సమీకరించి, గిల్బోవలో గుడారాలు వేసుకున్నాడు. 5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది. 6 సౌలు యెహోవాను ప్రార్థించాడు. కానీ యెహోవా అతనికి జవాబు ఇవ్వలేదు. కలలోకూడ దేవుడు సౌలుతో మాట్లాడలేదు. అతనికి జవాబు ఇచ్చేందుకు దేవుడు ఊరీము[b] ప్రయోగించ లేదు. 7 చివరికి సౌలు తన మనుష్యులతో, “ఒక కర్ణపిశాచంగల స్త్రీని వెదకండి. నేను వెళ్లి ఏమి జరుగబోతుందో ఆమెను అడుగుతాను” అని చెప్పాడు.
“ఏన్దోరులో కర్ణపిశాచం గల ఒక స్త్రీ వుందని” అతని అధికారులు అతనితో చెప్పారు.
8 అప్పుడు సౌలు గుర్తు తెలియకుండా మారు వేషం వేసుకొని, ఆ రాత్రి ఇద్దరు మనుష్యులను వెంటబెట్టుకొని ఆ స్త్రీని చూడటానికివెళ్లాడు. “ఆ స్త్రీని దైవావేశంతో తన భవిష్యత్తును చెప్పమన్నాడు. నేను చెప్పిన వ్యక్తిని నీవు పిలువు” అని అన్నాడు.
9 కానీ ఆ స్త్రీ, “సౌలు ఏమి చేసాడో నీకు ఖచ్చితంగా తెలుసు. కర్ణపిశాచముగలవారిని, చిల్లంగివారిని ఇశ్రాయేలు నుండి వెళ్లగొట్టాడు. నీవు నన్ను ఉరివేసి చంపాలని చూస్తున్నావు” అని సౌలుతో అంది.
10 సౌలు యెహోవా పేరును ప్రయోగించి ఆ స్త్రీకి ప్రమాణం చేసాడు. “యెహోవా జీవిస్తున్నంత నిజంగా చెబుతున్నాను. నీవు ఈ పని చేసినందుకు శిక్షపొందవు” అన్నాడు.
11 “అయితే మాట్లాడేందుకు ఎవరిని రప్పించమంటావు?” అని ఆ స్త్రీ సౌలును అడిగింది.
“సమూయేలును” అన్నాడు సౌలు.
12 ఆ స్త్రీ సమూయేలును చూచి చావుకేక వేసింది. “నీవు నన్ను మాయ చేసావు, నీవు సౌలువే” అంది ఆ స్త్రీ సౌలుతో.
13 “అయినా ఏమీ భయపడకు! నీవు ఏమి చూస్తున్నావు?” అన్నాడు సౌలు ఆమెతో.
“భూమిలో నుండి[c] ఒక ఆత్మ రావటం నేను చూస్తున్నాను” అంది ఆ స్త్రీ.
14 “అయితే, వాని ఆకారం ఎలా ఉంది?” అని సౌలు అడిగాడు.
“అతడు అంగీ ధరించిన ముసలివానిలా కనబడుతున్నాడు” అని ఆ స్త్రీ జవాబిచ్చింది.
అది సమూయేలు అని అప్పుడు సౌలుకు తెలిసింది. సౌలు సాష్టాంగపడి నమస్కరించాడు. 15 “నన్నెందుకు ఇబ్బంది పెట్టావు? నన్నెందుకు పైకి రప్పించావు?” అన్నాడు సమూయేలు సౌలుతో.
సౌలు, “నేను కష్టంలో వున్నాను. ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధానికి వచ్చారు. దేవుడేమో నన్ను విడిచిపెట్టేసాడు. ఆయన నాకు ఇంకెంత మాత్రం జవాబు ఇవ్వటంలేదు. నాకు ఆయన స్వప్నంలోగాని, ప్రవక్తల ద్వారాగాని జవాబు ఇవ్వటం లేదు. అందుకే నేను నిన్ను పిలిపించాను. నా కర్తవ్యమేమిటో నీవు నాకు చెప్పాలి” అన్నాడు.
16 సమూయేలు, “యెహోవా నిన్ను విసర్జించి ఇప్పుడు ఆయన నీ పొరుగువానితో ఉన్నాడు. అందు చేత నీవు నన్నెందుకు పిలిచావు? 17 యెహోవా ఏమి చేస్తానని చెప్పాడో అదే చేసాడు. ఈ విషయాలు నాద్వారా నీకు చెప్పాడు. యెహోవా ఇశ్రాయేలు రాజ్యాన్ని నీ చేతులనుండి తీసివేసాడు. దానిని నీ పొరుగు వారిలో ఒకనికి ఆయన ఇచ్చాడు. ఆ పొరుగు వాడే దావీదు! 18 నీవు యెహోవా ఆజ్ఞ పాటించలేదు. నీవు అమాలేకీయులను నాశనం చేయలేదు, వారిమీద యెహోవా ఎంత కోపగించాడో వారికి చూపించలేదు. అందుకే దేవుడు ఈ వేళ నీకు దీనిని చేసాడు. 19 యెహోవా ఇశ్రాయేలును, నిన్ను కూడ ఫిలిష్తీయులకు ఇచ్చివేసాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు సైన్యాన్ని ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. రేపు నీవూ, నీ కుమారులు కూడా నాతో పాటు ఇక్కడ ఉంటారు” అని చెప్పాడు.
20 సౌలు వెంటనే నేల మీదికి ఒరిగిపోయి, అక్కడే పడి ఉన్నాడు. సమూయేలు చెప్పిన వాటి మూలంగా సౌలు భయపడిపోయాడు. ఆ రాత్రి, పగలు సౌలు ఏమీ తినకపోవటంతో చాలా నీరసించి పోయాడు.
21 ఆ స్త్రీ సౌలు వద్దకు వచ్చి, అతను నిజంగానే చాలా భయపడి పోయినట్టు గమనించింది. “చూడు, నేను నీ సేవకురాలిని. నేను నీకు విధేయురాలినయ్యాను. నేను నా ప్రాణానికి తెగిచిం నీవు చెప్పినట్లు చేసాను. 22 దయచేసి ఇప్పుడు నేను చెప్పేది విను. నీకు కొంత ఆహారం ఇస్తాను. నీవు అది తినాలి. అప్పుడు నీ దారిన నీవు వెళ్లటానికి సరిపడే శక్తి నీకు ఉంటుంది” అని ఆమె చెప్పింది.
23 కానీ సౌలు తిరస్కరించాడు. “నేనేమి తినను” అన్నాడు.
సౌలు అధికార్లు ఆమెతో కలిసి సౌలును తినమని బ్రతిమలాడారు. చివరకు సౌలు ఒప్పుకుని నేల మీదనుండి లేచి పక్కమీద కూర్చున్నాడు. 24 ఆ స్త్రీ ఇంటివద్ద ఒక బలిసిన ఆవుదూడ వుంది. వెంటనే ఆమె ఆ దూడను చంపింది: కొంత పిండి తీసి, స్వయంగా కలిపి, దానిని పులియగపెట్టకుండా రొట్టెకాల్చింది. 25 ఆ ఆహారాన్ని సౌలు ముందు, అతని అధికార్ల ముందు ఆమె పెట్టింది. సౌలు, అతని అధికార్లు భోజనం చేసారు. అదే రోజు రాత్రి వారు బయలుదేరి వెళ్లిపోయారు.
అపొస్తులుని హక్కులు
9 నాకు స్వేచ్ఛ లేదా? నేను అపొస్తలుడను కానా? నేను మన యేసు క్రీస్తు ప్రభువును చూడలేదా? “మీరే” ప్రభువు కోసం నేను చేసిన సేవా ఫలితంకదా? 2 నేను ఇతరులకు క్రీస్తు అపొస్తులుడను కాకపోవచ్చు. కాని నేను మీకు క్రీస్తు అపొస్తులుడను. నేను క్రీస్తు అపొస్తులుడనన్న దానికి మీరే నా రుజువు.
3 నాపై తీర్పు చెప్పాలనుకొన్నవాళ్ళకు నా సమాధానం యిది: 4 అన్న పానాలకు మాకు అధికారం లేదా? 5 ఇతర అపొస్తులవలె, ప్రభువు సోదరులవలె, కేఫావలె విశ్వాసురాలైన భార్యను వెంట తీసుకెళ్ళటానికి మాకు అధికారం లేదా? 6 నేనూ, బర్నబా మాత్రమే జీవించటానికి పనిచేయాలా? 7 తన స్వంత డబ్బుతో సైనికునిగా ఎవరు పని చేస్తారు? ద్రాక్షా మొక్కల్ని నాటి, వాటి ఫలాన్ని తినకుండా ఎవరుంటారు? పశువుల మందలను కాస్తూ, వాటి పాలు త్రాగకుండా ఎవరుంటారు?
8 నేను దీన్ని మానవ దృష్టిలో చెపుతున్నానా? ధర్మశాస్త్రం కూడా ఈ మాటే చెబుతుంది. 9 మోషే ధర్మశాస్త్రంలో, “ధాన్యం త్రొక్కే ఎద్దు నోటికి చిక్కం వేయరాదు”(A) అని వ్రాయబడి ఉంది. ఎద్దులకోసం మాత్రమే దేవుడు ఈ మాట అన్నాడా? 10 ఈ మాట మనకోసమే వ్రాయబడిందని నేను గట్టిగా చెప్పగలను. పొలం దున్నేవాడూ, పంట నూర్చేవాడూ, పంట ఫలంలో భాగం లభిస్తుందన్న ఆశతో ఆ పనులు చేస్తారు. 11 మేము మీలో ఆత్మీయ విత్తనాలు చల్లాము. మీనుండి మా అవసరాలు తీర్చుకోవటం తప్పా? 12 మిగతావాళ్ళకు మీనుండి ఈ సహాయం పొందే హక్కు ఉన్నప్పుడు మాకు వాళ్ళకంటే ఎక్కువ హక్కు ఉందికదా? కాని, మేమా హక్కును ఉపయోగించుకోలేదు. క్రీస్తు సువార్త ప్రచారంలో ఏ ఆటంకం కలుగకుండా ఉండాలని మేము ఎన్నో కష్టాలు అనుభవించాము. 13 మందిరంలో పనిచేసేవాళ్ళకు మందిరం నుండి ఆహారం లభిస్తుంది. బలిపీఠం దగ్గర పనిచేసేవాళ్ళకు బలి ఇవ్వబడిన వాటిలో భాగం లభిస్తుందని తెలియదా? 14 అదే విధంగా సువార్త బోధించే వాళ్ళకు సువార్త ద్వారా జీవితావసరాలు తీరాలని ప్రభువు ఆజ్ఞాపించాడు.
15 కాని నేను ఈ హక్కుల్ని ఉపయోగించుకోలేదు. మీరు నాకు సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో నేను ఇది వ్రాయటం లేదు. అభిమానం దెబ్బతినటం కన్నా నాకు చావటం మేలనిపిస్తుంది. 16 కాని నేను సువార్త ప్రకటిస్తున్నందుకు గొప్పలు చెప్పుకోలేను. సువార్త బోధించటం నా కర్తవ్యం. నేను సువార్త బోధించటం ఆపేస్తే నాకు శాపం కలుగుగాక! 17 స్వయంగా ఈ పని చేస్తే నాకు బహుమానం ఉంది. ఈ పని చెయ్యాలని నేను స్వయంగా కోరలేదు. ఆ బాధ్యతను నాకు దేవుడే అప్పగించాడు. 18 మరి నా ప్రతిఫలం ఏమిటి? ప్రతిఫలం పుచ్చుకోకుండా, నా హక్కులు అడగకుండా సువార్తను ప్రకటించటమే నా ప్రతిఫలం.
19 నేను స్వేచ్ఛాజీవిని, ఎవ్వరికీ బానిసను కాను. కాని చేతనైనంతమందిని గెలవాలని నేను ప్రతి ఒక్కనికీ బానిసనౌతాను. 20 నేను యూదులతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని యూదునిలా జీవించాను. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు గెలవాలని, నేను ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేకపోయినా ధర్మశాస్త్రం అనుసరించేవాళ్ళకోసం దాన్ని అనుసరిస్తూ ఉన్నట్లు జీవించాను. 21 ధర్మశాస్త్రం లేనివాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళని గెలవాలని, ధర్మశాస్త్రం లేనివానిగా ప్రవర్తించాను. అంటే నేను దేవుని న్యాయానికి అతీతుడను కాను. నిజానికి నేను క్రీస్తు న్యాయాన్ని అనుసరిస్తున్నాను. 22 బలహీనుల్ని గెలవాలని బలహీనుల కోసం బలహీనుడనయ్యాను. ఏదో ఒక విధంగా కొందరినైనా రక్షించగలుగుతానేమో అని నేను అందరికోసం అన్ని విధాలుగా మారిపొయ్యాను. 23 నేను ఇవన్నీ సువార్త కోసం చేసాను. అది అందించే దీవెనలు పొందాలని నా అభిలాష.
24 పరుగు పందెంలో అందరూ పాల్గొన్నా ఒక్కనికే బహుమతి లభిస్తుందని మీకు తెలియదా? కనుక ఆ బహుమతి పొందాలనే ఉద్దేశ్యంతో పరుగెత్తండి. 25 పరుగు పందెంలో పాల్గొనదలచిన వాళ్ళందరూ మంచి క్రమశిక్షణ పొందుతారు. విజయకిరీటం పొందాలనే వాళ్ళ ఉద్దేశ్యం. కాని, వాళ్ళు పొందే కిరీటం చిరకాలం ఉండదు. మనం చిరకాలం ఉండే కిరీటం కోసం పోరాడుతున్నాం. 26 నేను గమ్యం లేకుండా పరుగెత్తను. గాలితో పోరాడుతున్న వానిలా పోరాడను. 27 నేను నా దేహానికి సరియైన శిక్షణనిచ్చి, అదుపులో ఉంచుకొంటాను. బోధించిన తర్వాత కూడా ఆ బహుమతి పొందే అర్హత పోగొట్టుకోరాదని ప్రయాస పడుచున్నాను.
యెరూషలేముకు నాశనం వస్తుంది
7 పిమ్మట యెహోవా వాక్కు నాకు చేరింది. 2 ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా నుండి ఒక సందేశం ఉంది. అది ఇశ్రాయేలు దేశానికి సంబంధించినది:
“అంతం వచ్చింది.
దేశం యావత్తూ నాశనమవుతుంది.
3 ఇప్పుడు నీ అంతం సమీపించింది.
నేను నీ పట్ల ఎంత కోపంగా ఉన్నానో చూపిస్తాను.
నీ చెడు కార్యాలకు నిన్ను నేను శిక్షిస్తాను.
నీవు చేసిన భయంకరమైన పనులకు ఫలమనుభవిస్తావు.
4 నీ పట్ల నేను కనికరం చూపను. నిన్ను చూచి విచారించను.
నీవు చేసిన చెడ్డకార్యాలకు నిన్ను నేను శిక్షిస్తున్నాను.
నీవు ఘోరమైన పనులు చేశావు.
నేను యెహోవానని నీవిప్పుడు తెలుసు కొంటావు.”
5 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఒక విపత్తు తరువాత మరొకటి వస్తుంది: 6 అంతం సమీపిస్తున్నది! అవసానదశ వస్తున్నది. అది అతి త్వరలో సంభవిస్తుంది! 7 ఇశ్రాయేలులో నివసిస్తున్న ప్రజలారా, హెచ్చరించే ఈల శబ్దం వింటున్నారా? శత్రువు వచ్చిపడుతున్నాడు. శిక్షాకాలం అతి దగ్గరలో ఉంది! శత్రుసైన్యపు రణగొణ ధ్వనులు పర్వతాలపై మరీ మరీ ఎక్కువగా వినవస్తున్నాయి. 8 నేనెంత కోపంగా వున్నానో అతి త్వరలో మీకు నేను చూపిస్తాను. మీమీద నాకున్న కోపాన్నంతా చూపిస్తాను. మీరు చేసిన చెడు కార్యాలకు మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. మీరు చేసిన భయంకరమైన పనులన్నిటికీ మీరు ప్రతి ఫలం చెల్లించేలా చేస్తాను. 9 మీ పట్ల ఏ మాత్రం కనికరం చూపను. మిమ్ముల్ని చూచి విచారపడను. మీరటువంటి భయంకరమైన పాపాలు చేశారు. నేను ప్రభువైన యెహోవానని, నేనే మిమ్ముల్ని కొడతానని మీరు తెలుసుకుంటారు.
10 “ఆ శిక్షాకాలం సమీపించింది. హెచ్చరిక ఈల విన్నావా? దేవుడు సూచన చేశాడు. శిక్ష మొదలవుతూ ఉంది. చేతికర్ర చిగురు తొడగటం మొదలు పెట్టింది.[a] అహంకారియైన రాజు (నెబుకద్నెజరు) ఇప్పటికే చాలా బలవంతుడైనాడు. 11 హింసావాదియైన అతడు ఆ దుష్ట ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయేలులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు వారిలో ఒకడు కాదు. ఆ గుంపులో అతడొకడు కాదు. ఆ ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు.
12 “ఆ శిక్షాకాలం దరిచేరింది. ఆ రోజు ఇక్కడే వున్నది. సరుకులు కొనుగోలు చేసే జనులు సంతోషపడరు. అమ్మకపుదారులు వారి అమ్మకాల పట్ల విచారపడరు. ఎందువల్లనంటే ఆ భయంకరమైన శిక్ష ప్రతివానికి వస్తుంది గనుక. 13 తమ ఆస్తిని అమ్ముకున్న[b] ప్రజలు, మరి దాని వద్దకు వెళ్లరు. ఏ వ్యక్తి అయినా తప్పించుకుని బ్రతికితే కూడా అతడు తన ఆస్తి వద్దకు ఎన్నడూ మళ్లీ వెళ్లలేడు. ఎందువల్లనంటే, దేవుని ఈ సందేశం అందరికీ సంబంధించినది గనుక. అందువల్ల ఏ ఒక్కడైనా బ్రతికి బయటపడినా, అది ప్రజలను సంతోష పెట్టలేదు.
14 “ప్రజలను హెచ్చరించటానికి వారు బూరలు ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్ధులౌతారు. కాని వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. ఎందువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో ఆ సమూహమంతటికీ చూపిస్తాను గనుక. 15 శత్రువు కత్తిపట్టి నగరం వెలుపల కాచివున్నాడు. వ్యాధులు, క్షామము నగరం లోపల ఉన్నాయి. ఏ మనిషేగాని బయట తన పొలానికి వెళ్లితే వేచి వున్న శత్రు సైనికుడు అతన్ని చంపివేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నగరంలోనే వుంటే ఆకలి, వ్యాధులు అతన్ని చంపివేస్తాయి.
16 “కాని కొంతమంది ప్రజలు తప్పించుకుంటారు. అలా బ్రతికినవారు పర్వతాలలోకి పారిపోతారు. అయినా వారు సంతోషంగా ఉండలేరు. వారు తమ పాపాలను తలచుకొని కుమిలిపోతారు. వారు ఏడ్చి, పావురాలవలె మూలుగుతారు. 17 ప్రజలు మిక్కిలి అలసిపోయి, దఃఖించి తమ చేతులను కూడా ఎత్తలేరు. వారి కాళ్లు నీళ్లలా ఉంటాయి. 18 వారు విషాదాన్ని సూచించే దుస్తులు ధరిస్తారు. వారిని భయం ఆవరిస్తుంది. ప్రతి ముఖంలోనూ సిగ్గు ముంచుకు రావటం చూస్తావు. విచారాన్ని వ్యక్తంచేస్తూ వారు తమ తలలను గొరిగించుకుంటారు. 19 వారి వెండి విగ్రహాలను వీధుల్లో పారవేస్తారు. బంగారము (విగ్రహాల)ను మురికి గుడ్డల్లా చూస్తారు. యెహోవా తన కోపాన్ని వారిపట్ల చూపించినప్పుడు వారి విగ్రహాలు వారిని రక్షించలేవు గనుక వారలా చేస్తారు. ప్రజలను పాపమార్గంలో పడవేయటానికి విగ్రహాలు ఒక మాయోపాయంలాంటివి. ఆ విగ్రహాలు ప్రజలకు ఆహారాన్ని ఇవ్వలేవు. వారి విగ్రహాలు వారి కడుపు నింపలేవు.
20 “ఆ ప్రజలు వారి విలువైన ఆభరణాలు వినియోగించి ఒక విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్రహాన్ని చూచి వారు గర్వపడ్డారు. వారింకా భయానక విగ్రహాలు చేశారు. వారా హేయమైన వస్తువులను చేశారు. కావున దేవుడనైన నేను వారిని మసిబట్టలా విసిరి పారవేస్తాను. 21 పరాయివారు వారిని పట్టుకునేలా చేస్తాను. పరాయి ప్రజలు వారిని ఎగతాళి చేస్తారు. పరాయి జనులు వారిలో కొంతమందిని చంపివేస్తారు. మరి కొంతమందిని చెరపట్టి తీసుకొనిపోతారు. 22 నేను వారిని చూచి ముఖం తిప్పుకుంటాను. నేను వారివంక చూడను. పరాయి మనుష్యులు నా ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. ఆ పవిత్ర భవనంలో రహస్య స్థానాలకు వెళ్లి అపవిత్ర పరుస్తారు.
23 “బందీల కొరకు సంకెళ్లు తయారుచేయి! ఎందుకంటే ఇతరులను చంపిన నేరానికి చాలామంది ప్రజలుంటే శిక్షింపబడతారు గనుక ఈ గొలుసులు తయారు చేయాలి. నగరంలో ప్రతిచోటా దౌర్జన్యం చెలరేగుతుంది. 24 రాజ్యాల నుండి చెడ్డ వ్యక్తులను తీసుకువస్తాను. ఆ చెడ్డ మనుష్యులు ఇశ్రాయేలీయుల ఇండ్లన్నిటినీ ఆక్రమిస్తారు. శక్తివంతులైన మీ ప్రజలందరినీ గర్వించకుండా చేస్తాను. అన్యదేశీయులు మీ ఆరాధన స్థలాలన్నిటినీ వశపర్చుకుంటారు.
25 “మీ ప్రజలందరూ భయంతో పణికిపోతారు. మీరు శాంతికోసం ఎదురుచూస్తారు. కాని అది మీకు లభ్యం కాదు. 26 ఒక విషాద గాధ తరువాత మరియొకటి మీరు వింటారు. చెడ్డవార్తలు మినహా మరేమీ వినరు. మరొక ప్రవక్త కొరకు వెదికి, దర్శన విషయం అడుగుతారు. ఒక్కటికూడ మీకు వుండదు. యాజకులు మీకు బోధించేదేమీ లేదు. పెద్దలు మీకిచ్చే మంచి సలహా ఏమీ వుండదు. 27 చనిపోయిన ప్రజల కొరకు మీ రాజు దుఃఖిస్తాడు. నాయకులు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. సామాన్య జనులు మిక్కిలి భయపడతారు. ఎందువల్లనంటే వారు చేసిన పనులను నేను తిప్పికొడతాను. నేను వారికి శిక్షను నిర్ణయిస్తాను. వారిని నేను శిక్షిస్తాను. అప్పుడా ప్రజలు నేను యెహోవానని తెలుసుకుంటారు.”
సంగీత నాయకునికి: “శోషనీము” రాగం. కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరియు ఒక ప్రేమగీతం.
45 రాజుకోసం నేను ఈ విషయాలు వ్రాస్తూ ఉండగా
అందమైన పదాలు నా మనస్సును నింపేస్తున్నాయి.
నైపుణ్యంగల రచయిత కలంనుండి వెలువడే మాటల్లా
నా నాలుక మీద మాటలు దొర్లిపోతున్నాయి.
2 నీవు అందరికంటె ఎంతో అందంగా ఉన్నావు!
నీ పెదవులనుండి దయ వెలువడుతుంది
కనుక దేవుడు నిన్ను శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు.
3 నీవు ఖడ్గం ధరించు, యుద్ధ వీరునివలె, మహిమను, ఘనతను ధరించుము.
4 నీవు అద్భుతంగా కనబడుతున్నావు! వెళ్లి, నీతి న్యాయం కోసం పోరాటంలో గెలువుము.
అద్భుతకార్యాలు చేసేందుకు శక్తిగల నీ కుడి చేతిని ప్రయోగించుము.
5 నీ బాణాలు సిద్ధంగా ఉన్నాయి. అవి రాజు శత్రువుల హృదయాల్లోకి ప్రవేశిస్తాయి
అనేక మంది ప్రజలను నీవు ఓడిస్తావు.
6 దేవా, నీ సింహాసనం శాశ్వతంగా కొనసాగుతుంది!
నీ నీతి రాజదండము.
7 నీవు నీతిని ప్రేమిస్తావు, కీడును ద్వేషిస్తావు.
కనుక, నిన్ను నీ స్నేహితుల మీద రాజుగా
నీ దేవుడు కోరుకొన్నాడు.
8 నీ వస్త్రాలు గోపరసం, అగరు, లవంగ, పట్టావంటి కమ్మని సువాసనగా ఉన్నాయి.
నిన్ను సంతోషపరచుటకు దంతం పొదగబడిన భవనాల నుండి సంగీతం వస్తుంది.
9 నీవు ఘనపరచే స్త్రీలలో రాజకుమార్తెలున్నారు.
నీ పెండ్లి కుమార్తె ఓఫీరు బంగారంతో చేయబడిన కిరీటం ధరించి నీ చెంత నిలుస్తుంది.
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
© 1997 Bible League International