M’Cheyne Bible Reading Plan
దావీదు తన మనుష్యులతో ఫిలిష్తీయుల రాజ్యానికి వెళ్లుట
27 తరువాత దావీదు, “ఏదో ఒకరోజు సౌలు నన్ను పట్టుకుంటాడు. ఈ పరిస్థితిలో నేను ఫిలిష్తీయుల రాజ్యానికి తప్పించుకోవటం ఒక్కటే ఉత్తమ మార్గం. అప్పుడు సౌలు నా కోసం ఇశ్రాయేలు రాజ్యంలో వెదకటం మానేస్తాడు. ఆ విధంగా నేను సౌలునుండి తప్పించుకుంటాను” అనుకున్నాడు.
2 అందుచేత దావీదు, తన ఆరు వందలమంది అనుచరులతో ఇశ్రాయేలును వదిలి వెళ్లాడు. వారు మాయోకుమారుడైన ఆకీషు వద్దకు వెళ్లారు. ఆకీషు గాతుకు రాజు. 3 దావీదు, అతని మనుష్యులు వారి కుటుంబాలతో సహా ఆకీషు రాజుతో పాటు గాతులో నివాసము ఏర్పాటు చేసుకున్నారు. దావీదు ఇద్దరు భార్యలు యెజ్రెయేలీ వాసి అహీనోయము, మరియు, కర్మెలు నివాసి, నాబాలు భార్య విధవరాలునైన అబీగయీలు అతనితో ఉన్నారు. 4 దావీదు గాతుకు పారిపోయాడని ప్రజలు సౌలుతో చెప్పగానే సౌలు అతని కొరకు వెదకటం మానేశాడు.
5 ఆకీషును దావీదు కలసి, “నా విషయమై నీవు సంతోషిస్తే బయట పట్టణంలో ఒక ఊరిలో స్థానమిస్తే అక్కడ ఉంటాను. నేను కేవలం నీ సేవకుడిని మాత్రమే. రాజధానిలో నీతో నేను ఉండుటకంటె నేను అక్కడే ఉండటం మంచిది” అని చెప్పాడు.
6 సిక్లగు అనే ఊరిని అదే రోజున ఆకీషు దావీదుకు ఇచ్చాడు. కావున అప్పటి నుండి సిక్లగు యూదా రాజులకు చెందినదిగా ఉండిపోయింది. 7 ఫిలిష్తీయుల రాజ్యంలో దావీదు ఒక సంవత్సరం నాలుగు నెలలు ఉన్నాడు.
దావీదు ఆకీషు రాజును మోసగించుట
8 దావీదు, అతని మనుష్యులు కలిసి అమాలేకీయులతోనూ, గెషూరులో నివసిస్తున్న ప్రజలతోనూ యుద్ధానికి వెళ్లారు. దావీదు మనుష్యులు వారిని ఓడించి వారి ఆస్తులను దోచుకున్నారు. ఆ ప్రజలంతా షూరు పట్టణం దగ్గర తెలెమునుండి మొత్తం ఈజిప్టువరకు నివసిస్తూ ఉన్నారు. 9 ఆ ప్రాంతంలో దావీదు వారితో పోరాడి వారిని ఓడించాడు. వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఒంటెలను, దుస్తులను అన్నిటినీ స్వాధీనం చేసుకొని వాటిని ఆకీషుకు ఇచ్చాడు.
10 దావీదు ఇలా చాలాసార్లు చేసాడు. ప్రతిసారీ దావీదు ఎక్కడ యుద్ధం చేసి, సంపద అంతా తెస్తున్నాడు అనే విషయం ఆకీషు అడిగేవాడు. “యూదాకు దక్షిణ ప్రాంతంలో యుద్ధం చేసాననీ యెరహ్మెయేలుకు దక్షిణ భాగాన పోరాడాననీ, కేనీయుల దేశానికి దక్షిణాన పోరాడాను” అనీ ప్రతిసారీ ఒక పేరు చెపుతూ ఉండేవాడు దావీదు. 11 బతికి వున్న ఒక స్త్రీని గాని, పురుషుని గాని దావీదు ఒక్కసారి కూడా గాతుకు తీసుకుని రాలేదు. “అలా చేస్తే వాళ్లు నిజానికి తాను చేస్తున్న పనులన్నీ ఆకీషుకు చెబుతారని దావీదు అనుకున్నాడు.”
ఫిలిష్తీయుల దేశంలో ఉన్న అన్ని రోజులూ దావీదు ఇలాగే చేసాడు. 12 ఆకీషు మాత్రం దావీదును నమ్మటం మొదలు పెట్టాడు. “ఇప్పుడు దావీదు యొక్క స్వంత వాళ్లే అతనిని ద్వేషిస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును బాగా అసహ్యించుకుంటున్నారు. అందువల్ల దావీదు శాశ్వతంగా నాకు సేవచేస్తాడు” అని ఆకీషు తనలో తాను అనుకున్నాడు.
విగ్రహార్పితమైన పదార్ధం
8 ఇక విగ్రహాలకు బలి యిచ్చిన వాటిని గురించి: మనలో జ్ఞానం ఉందని మనకు తెలుసు. జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది. ప్రేమ మనిషిని అభివృద్ధి పరుస్తుంది. 2 తనలో జ్ఞానముందని భావిస్తున్నవానిలో నిజానికి ఉండవలసిన జ్ఞానం లేదు. 3 కాని తనను ప్రేమిస్తున్న మనిషిని దేవుడు గుర్తిస్తాడు.
4 ఇక విగ్రహాలకు బలి ఇచ్చినవాటి విషయం: విగ్రహానికి అర్థం లేదని, ఒక్కడే దేవుడున్నాడని మనకు తెలుసు. 5 దేవుళ్ళని పిలువబడేవాళ్ళు ఆకాశంలోగాని, భూమిమీదగాని ఉన్నా, వాళ్లు “దేవుళ్ళని”, “ప్రభువులని” పిలవబడుచున్నారు. 6 అయితే నిజానికి మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయనే మన తండ్రి. అన్నిటినీ ఆయనే సృష్టించాడు. ఆయన కోసమే మనము జీవిస్తున్నాము. మనకు ఒక్కడే ప్రభువు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారానే అన్నీ సృష్టింపబడ్డాయి. ఆయనవల్ల మనము జీవిస్తున్నాము.
7 కాని ఈ విషయం తెలియనివాళ్ళు చాలమంది ఉన్నారు. ఈనాటికీ విగ్రహారాధనకు అలవాటు పడ్డ కొందరు ఆ పదార్థాన్ని తిన్నప్పుడు అది విగ్రహానికి అర్పించింది అనుకొని తింటారు. వాళ్ళ మనసులు బలహీనమైనవి కనుక వాళ్ళు మలినమయ్యారు. 8 ఆహారంవల్ల మనము దేవునికి సన్నిహితులము కాలేము. ఆ ఆహారం తినకపోతే నష్టం ఏమీ లేదు. తింటే వచ్చిన లాభం లేదు.
9 కాని మీ నిర్ణయము దృఢవిశ్వాసం లేనివాళ్ళకు నష్టం కలిగించకుండా జాగ్రత్తపడండి. 10 ఈ విషయంపై గట్టి అభిప్రాయం లేనివాడొకడు ఈ విషయాన్ని గురించి జ్ఞానమున్న మిమ్మల్ని గుడిలో నైవేద్యం తినటం చూస్తాడనుకోండి. అప్పుడు అతనికి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం తినటానికి ధైర్యం కలుగుతుంది. 11 బలహీనమైన మనస్సుగల మీ సోదరుని కోసం క్రీస్తు మరణించాడు. కాని మీ అజ్ఞానంవల్ల ఆ సోదరుడు నశిస్తాడు. 12 అలా చేస్తే మీ సోదరునిపట్ల పాపం చేసి అతని మనస్సును గాయపరచిన వాళ్ళవుతారు. తద్వారా మీరు క్రీస్తుపట్ల పాపం చేసిన వాళ్ళవుతారు. 13 నా సోదరుడు పాపం చేయటానికి నా ఆహారం కారణమైతే నేనిక మీదట మాంసం తినను! ఏ విధంగానైనా అతని పతనానికి కారకుణ్ణి కాకుండా ఉంటాను.
ఇశ్రాయేలుకు విరోధంగా ప్రవచనాలు
6 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినిపించింది. 2 ఆయన ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలవైపు తిరిగి, నా తరపున వాటికి వ్యతిరేకంగా మాట్లాడు. 3 ఆ పర్వతాలకు ఈ విషయాలు తెలియజెప్పు: ‘ఇశ్రాయేలు పర్వతములారా, నా ప్రభువైన యెహోవా సందేశాన్ని వినండి! నా ప్రభువైన యెహోవా కొండలకు, పర్వతాలకు, కనుమలకు, లోయలకు ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. చూడండి! (దేవుడనగు) నేను మీపై యుద్ధానికి శత్రువును రప్పిస్తున్నాను. మీ ఉన్నత స్థలాలు.[a] నేనే నాశనం చేస్తాను 4 మీ బలిపీఠాలు ముక్కలు చేయబడతాయి! మీ ధూప వేదికలు నాశనం చేయబడతాయి. మీ హేయమైన విగ్రహాలముందే మీ శవాలను పడవేస్తాను. 5 ఇశ్రాయేలు ప్రజల శవాలను అసహ్యమైన విగ్రహాల ముందు పడవేస్తాను. మీ ఎముకలను మీ పీఠాల చుట్టూ వెదజల్లుతాను. 6 మీ ప్రజలెక్కడ వుంటే అక్కడ వాళ్ళు నాశనం చేయబడతారు. వారి నగరాలు రాళ్లగుట్టల్లా మారిపోతాయి. వారి ఉన్నత స్థలాలు నాశనం చేయబడతాయి. ఎందుకంటే, ఆ పూజా స్థలాలు మరెన్నడూ వినియోగింపబడకుండా వుండేటందుకు. ఆ బలి పీఠాలు నాశనం చేయబడతాయి. ప్రజలు మరెన్నడూ ఆ రోత విగ్రహాలను ఆరాధించరు. ఆ ధూప పీఠాలు ధ్వంసం చేయబడతాయి. మీరు చేసిన వస్తువులన్ని సర్వనాశనం చేయబడతాయి! 7 మీ ప్రజలు చంపబడతారు. అప్పుడు నేనే ప్రభువు (యెహోవా) నని మీరు తెలుసుకుంటారు!’”
8 దేవుడు ఇలా చెప్పాడు: “కాని మీలో చాలా కొద్ది మంది తప్పించుకునేలా నేను చేస్తాను. వారు అన్య దేశాలలో స్వల్పకాలం పాటు నివసిస్తారు. వారిని నేను చెల్లా చెదురుచేసి, ఇతర దేశాలలో నివసించేలా ఒత్తిడి చేస్తాను. 9 అలా మిగిలిన వారు బందీ చేయబడతారు. వారు అన్యదేశాలలో నివసించేలా తరిమివేయబడతారు. కాని, అలా మిగిలిన వారు నన్ను తలచుకొంటారు. నేను వారి గుండెలు బద్దలయ్యేలా చేశాను. వారు చేసిన చెడు కార్యాలకు వారిని వారే అసహ్యించుకుంటారు. గతంలో వారు నాకు విముఖులై, నన్ను వదిలిపెట్టారు. హేయమైన వారి విగ్రహాల వెంట వారు వెళ్ళారు. తన భర్తను వదిలి, పరాయి పురుషుని వెంటబడిన స్త్రీవలె వారున్నారు. వారెన్నో భయంకరమైన పనులు చేశారు. 10 చివరికి, నేనే యెహోవానని వారు తెలుసుకొంటారు. నేనేదైనా చేస్తానంటే, అది చేసి తీరుతానని కూడా తెలుసుకొంటారు! వారికి జరిగిన కీడంతా నేనే జరిపించినట్లు వారు తెలుసుకొంటారు.”
11 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “నీ చేతులు చరిచి, నీ పాదాలను దట్టించుము. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఘోరమైన చెడ్డ పనులన్నిటినీ విమర్శిస్తూ మాట్లాడు. వారు వ్యాధుల వల్ల, ఆకలిచేత చనిపోతారని వారిని హెచ్చరించు. వారు యుద్ధంలో చనిపోతారని తెలియజేయుము. 12 దూరాన వున్నవారు రోగపీడితులై చనిపోతారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వున్న ప్రజలు కత్తిచేత చంపబడతారు. ఇంకను నగరంలో మిగిలిన ప్రజలు ఆకలితో మాడి చనిపోతారు. అప్పుడు మాత్రమే నా కోపం తగ్గుతుంది. 13 అప్పుడు మాత్రమే నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు. మీ అపవిత్రమైన మీ విగ్రహాలముందు, వాటి బలిపీఠాల చుట్టూ పడిన మీ శవాలను చూచినప్పుడు మీరిది తెలుసుకుంటారు. ఆ శవాలు మీ ఆరాధనా స్థలాలున్న ప్రతిచోట, ప్రతి కొండ, పర్వతం మీద, ప్రతి పచ్చని చెట్టు, ఆకులున్న ప్రతి సింధూర వృక్షం క్రింద పడి వుంటాయి. ఆ స్థలాలన్నిటిలో మీరు మీ బలులు సమర్పించారు. అవి మీ హేయమైన విగ్రహాలకు సుగంధ పరిమళాలు. 14 కాని మీ మీదికి నా చెయ్యెత్తి, మిమ్ముల్ని నేను శిక్షించాను! నేను మీ దేశాన్ని నాశనం చేశాను. అది దిబ్లాతు ఎడారి[b] కంటె ఎక్కువగా శూన్య ప్రదేశమయ్యింది. ఇప్పుడు మీ ప్రజలు నివసించే ప్రతి చోటా నేనే యెహోవానని తెలుసుకొంటారు!”
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం.
44 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము.
మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు.
చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు.
2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు.
మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు.
ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు.
వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు.
3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు.
వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు.
నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది.
దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే!
4 నా దేవా, నీవు నా రాజువు.
నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి.
5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము.
నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము.
6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను.
నా ఖడ్గం నన్ను రక్షించజాలదు.
7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు.
మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు.
8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము!
నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము!
9 కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు.
నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు.
10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు.
మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు.
11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు.
రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు.
12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు.
ధర విషయం నీవేమీ వాదించలేదు.
13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు.
మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు.
14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము.
ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు.
15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను.
రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను.
16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు.
నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు.
17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు.
అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు.
మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు!
18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు.
నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు.
19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు.
మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు.
20 మా దేవుని పేరు మేము మరచిపోయామా?
అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు!
21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు.
లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు.
22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము!
చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము.
23 నా ప్రభువా, లెమ్ము!
నీవేల నిద్రపోతున్నావు?
లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము!
24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు?
మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు?
25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము.
మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము.
26 దేవా, లేచి మాకు సహాయం చేయుము!
నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము.
© 1997 Bible League International