M’Cheyne Bible Reading Plan
దావీదు, అబీషై సౌలు గుడారంలోకి ప్రవేశించుట
26 జీపు ప్రజలు సౌలును చూడటానికి గిబియాకు వెళ్లారు. “హకీలా కొండల్లో దావీదు దాగి ఉంటున్నాడు. ఈ కొండ యెషీమోనుకు ఎదురుగా ఉంది” అని వారు సౌలుతో చెప్పారు.
2 జీపు అరణ్యంలోకి సౌలు వెళ్లాడు. ఇశ్రాయేలు అంతటిలో తాను ఎంపిక చేసుకొన్న మూడువేల మంది సైనికులను సౌలు తన వెంట తీసుకుని వెళ్లాడు. సౌలు, అతని మనుష్యులు దావీదును వెదుక్కుంటూ జీపు అరణ్యంలోకి వెళ్లారు. 3 సౌలు హకీలా కొండపై గుడారాలు సిద్ధపరచుకొనెను. యెషీమోనుకు ఎదురుగా బాటపక్కలో ఈ స్థలం వుంది.
దావీదు అరణ్యంలోనే వుండి, సౌలు తనను వెతుక్కుంటూ వచ్చినట్లు విన్నాడు. 4 దావీదు తన వేగుల వారిని పంపి, సౌలు హకీలా కొండకు వచ్చినట్లు తెలుసుకున్నాడు. 5 సౌలు గుడారాలు వేసుకున్న ప్రదేశానికి దావీదు వెళ్లాడు. సౌలు, అబ్నేరు ఇద్దరూ నిద్రిస్తున్న చోటును దావీదు చూశాడు. (నేరు కుమారుడు అబ్నేరు సౌలు సైన్యాలకు సేనాని.) గుడారం మధ్యలో సౌలు నిద్రిస్తూవున్నాడు. సైన్యమంతా అతని చుట్టూ వుంది.
6 హిత్తీయుడైన అహీమెలెకుతోను, సెరూయా కుమారుడయిన అబీషైతోను దావీదు మాట్లాడి, “సౌలు పాళెములోనికి తనతో ఎవరు రాగలరని” అడిగాడు.
(అబీషై అనేవాడు యోవాబు తమ్ముడు). “నీతో నేను వస్తా” అని అబీషై చెప్పాడు.
7 చీకటి పడ్డాక దావీదు, అబీషై కలిసి సౌలు మజిలీలోకి వెళ్లారు. సౌలు మధ్యలో నిద్రపోతూ ఉన్నాడు. సౌలు తల వద్ద అతని ఈటె భూమిలోకి దిగవేసి ఉంది. అతని చుట్టూ సైనికులు, ప్రక్కగా అబ్నేరు నిద్రపోతూ ఉన్నారు. 8 “నీ శత్రువును ఓడించటానికి దేవుడు నీకు ఈ రోజు అవకాశం ఇచ్చాడు. ఒక్క వేటుతో, అతని ఈటెతోనే సౌలును భూమిలోనికి పొడిచి వేస్తాను” అన్నాడు అబీషై దావీదుతో.
9 కానీ దావీదు అబీషైతో ఇలా అన్నాడు, “సౌలును చంపవద్దు! యెహోవాచే ఎంపిక చేయబడిన రాజుకు హాని చేసినవాడు శిక్షించబడాలి. 10 యెహోవా జీవిస్తున్నంత నిజంగా యెహోవా తానే సౌలును శిక్షిస్తాడు. ఒకవేళ సౌలు సహజంగానే చనిపోవచ్చు. లేదా యుద్ధంలో అతడు చంపబడవచ్చు. 11 కానీ యెహోవా చేత అభిషేకించబడిన రాజును నేను మాత్రం చంపకుండా ఉండేటట్టు చేయమని యెహోవాకు నేను ప్రార్థన చేస్తాను. కనుక సౌలు తలవద్ద ఉన్న ఈటెను, మంచినీటి కూజాను తీసుకోండి. మనము వెళ్లి పోదాము.”
12 కనుక సౌలు తల దగ్గర వున్న ఈటెను, నీటి కూజాను తీసుకుని దావీదు, అబీషై సౌలు గుడారంనుండి బయటకు వెళ్లిపోయారు. ఇదంతా జరగటం ఏ ఒక్కరూ చూడలేదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఒక్క మనిషికూడ కనీసం మేల్కోలేదు! యెహోవా సౌలును, తన సైన్యాన్ని గాఢనిద్రలో పడవేయటంతో వారంతా అలా నిద్రపోయారు.
దావీదు మరల సౌలును అవమానించుట
13 దావీదు ఆవలివైపుకు వెళ్లిపోయాడు. సౌలు గుడారాలకు దూరంగా లోయ అవతల ఉన్న పర్వతం మీద దావీదు నిలబడ్డాడు. అంటే వీరిద్దరి గుడారాలు ఒకదాని కొకటి చాలా దూరంగా ఉన్నాయి. 14 నేరు కుమారుడైన అబ్నేరును, సైన్యాన్ని ఉద్దేశించి దావీదు కేకవేసి “అబ్నేరూ, నాకు జవాబు చెప్పు” అన్నాడు.
“రాజును పిలుస్తోన్న నీవు ఎవరివి?” అని అబ్నేరు అడిగాడు.
15 అందుకు దావీదు, “నీవు మగాడివి కదూ! నీవు ఇశ్రాయేలు అంతటిలో చాలా గొప్పవాడివి కదూ! నిజమేనంటావా? అయితే నీవు నీ యజమానుడైన రాజును ఎందుకు కాపాడుకోలేదు? నీ యాజమానియైన రాజును చంపటానికి ఒక సామాన్యుడు నీ గుడారంలోనికి వచ్చాడు! 16 నీవు గొప్ప పొరపాటు చేసావు. యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవూ నీ సైనికులూ చావాలి. ఎందుకంటే యెహోవా చేత అభిషేకించబడ్డ నా యజమానియైన రాజును కాపాడలేదు. నీవు సౌలు తలవద్ద వుంచబడిన ఈటె, నీళ్ల కూజా ఏమయ్యాయో చూడు. అవి ఏవి?” అని ఎదురు ప్రశ్నవేశాడు.
17 సౌలుకు దావీదు స్వరం తెలుసు. “నా కుమారుడా దావీదూ, అది నీ స్వరమే కదూ?” అన్నాడు సౌలు దావీదుతో.
“అవును నా యజమానీ, నా రాజా, ఇది నా స్వరమే” అన్నాడు దావీదు. 18 దావీదు ఇంకా ఇలా అన్నాడు, “రాజా, నీవు నన్నెందుకు ఇలా తరుముతున్నావు? నేను చేసిన నేరం ఏమిటి? దేని విషయంలో నేను దోషిని? 19 రాజా, నా యజమానీ, నా మాట విను! యెహోవా గనుక నీకు నాపై కోపం వచ్చినట్లు చేసి ఉంటె ఆయనకు బలి సమర్పణ చేద్దాము. కానీ మనుష్యుల ప్రేరణవల్ల నామీద నీకు కోపం వచ్చివుంటే యెహోవా వారిని కష్టనష్టాలకు గురిచేస్తాడు. యెహోవా నాకిచ్చిన భూమిని నేను వదిలిపోయేలా మనుష్యులు చేశారు. వెళ్లి ఇతర దేవుళ్లను కొలవమని, 20 పరదేశీయులతో ఉండమని మనుష్యులు నాకు చెప్పారు. ఇప్పుడు నన్ను యెహోవా సన్నిధికి దూరంగా చావనీయకు. ఇశ్రాయేలు రాజు ఒక పురుగును చంపటానికి వెతుక్కుంటూ బయటకి వచ్చాడు! కొండల్లో కౌజు పిట్టను[a] వేటాడటానికి వచ్చినవానిలా ఉన్నావు నీవు!”
21 అప్పుడు సౌలు, “నేను పాపం చేసాను. నా కుమారుడా దావీదూ, నా దగ్గరకు తిరిగి వచ్చేయి. నా ప్రాణం నీకు ముఖ్యం అని ఈ రోజు నీవు నాకు చూపించావు. అందుచేత నేను నీకు హాని చేసేందుకు ప్రయత్నించను. నేను తెలివి తక్కువగా ప్రవర్తించాను. నేను ఒక పెద్ద తప్పుచేశాను” అన్నాడు.
22 “ఇదిగో రాజు ఈటె. మీలో ఒక యువకుడు వచ్చి దీనిని తీసుకోవచ్చు. 23 మంచి చేసిన ప్రతి వానికీ యెహోవా ప్రతిఫలం ఇప్పిస్తాడు. కీడు చేసిన వానిని ఆయన శిక్షిస్తాడు. ఈ వేళ యెహోవా నేను నిన్ను ఓడించేటట్టు చేసాడు. అయినా యెహోవా చేత అభిషేకించబడిన రాజుకు నేను హాని చేయను. 24 నీ ప్రాణం నాకు ముఖ్యం అని ఈ వేళ నేను నీకు చూపించాను. యెహోవాకు నా ప్రాణం ముఖ్యం అని యెహోవా నీకు చూపిస్తాడు. ప్రతి కష్టంనుంచీ యెహోవా నన్ను రక్షిస్తాడు” అని చెప్పాడు దావీదు.
25 సౌలు, “నా కుమారుడా దావీదూ, దేవుడు నిన్నాశీర్వదించును గాక! నీవు చాలా ఉన్నతమైన కార్యాలు చేస్తావు. నీవు విజయం సాధిస్తావు” అని దావీదుతో చెప్పాడు.
దావీదు తన దారిన తాను వెళ్లిపోయాడు. సౌలు తన ఇంటికి తిరిగి వెళ్లాడు.
వివాహం
7 ఇక మీరు వ్రాసిన ప్రశ్నలకు నా సమాధానం ఇది: ఔను. వివాహం చేసుకోకుండా ఉండటం మంచిది. 2 కాని లైంగిక అవినీతి చాలా వ్యాపించిపోయింది కనుక స్త్రీపురుషులు వివాహం చేసుకోవటం మంచిది. 3 ప్రతీ పురుషుడు భర్తగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. అలాగే ప్రతీ స్త్రీ భార్యగా తన కర్తవ్యాలు నిర్వహించాలి. 4 భార్యకు తన శరీరంపై అధికారం లేదు. భర్తకు మాత్రమే ఆమె శరీరంపై అధికారం ఉంది. అలాగే భర్తకు తన శరీరంపై అధికారం లేదు. అతని శరీరంపై అతని భార్యకు మాత్రమే అధికారం ఉంది. 5 భార్యాభర్తలు ఇరువురు సమ్మతించి దేవుని ప్రార్థించటంలో తమ కాలాన్ని గడపదలిస్తే తప్ప వేరువేరుగా ఉండకూడదు. ప్రార్థనా సమయం ముగిసాక మళ్ళీ మీరు కలిసికొనండి. మీలో ఆత్మనిగ్రహంలేదు. కనుక సాతాను ప్రేరేపణకు లొంగిపోకుండా జాగ్రత్త పడటానికి ఇలా చెయ్యటం అవసరం. 6 ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. 7 అందరూ నాలా ఉండాలని నా కోరిక. కాని ప్రతి ఒక్కనికీ దేవుడు ఒక ప్రత్యేకమైన వరం ఇచ్చాడు. ఒకనికి ఒక వరం, ఇంకొకనికి ఇంకొక వరం ఇచ్చాడు.
8 అవివాహితులకు, వితంతువులకు నా సలహా ఇది: వాళ్ళు నాలాగే పెళ్ళి చేసుకోకుండా ఉండటం మంచిది. 9 కాని వాళ్ళలో నిగ్రహం లేకపోతే పెళ్ళి చేసుకోవటం ఉత్తమం. కామంతో కాలిపోవటం కన్నా పెళ్ళి చేసుకోవటం మంచిది.
10 వివాహితులకు నా ఆజ్ఞ ఇది. ఇది నా ఆజ్ఞ కాదు. ప్రభువుయొక్క ఆజ్ఞ. భార్య తన భర్తను వదిలివేయరాదు. 11 అలా వదిలివేస్తే ఆమె తిరిగి పెళ్ళి చేసుకోకూడదు. లేదా భర్తతో సమాధాన పడాలి. అలాగే భర్త తన భార్యకు విడాకులు ఇవ్వకూడదు.
12 మిగతా వాళ్ళకు నా ఆజ్ఞ యిది. ఇది ప్రభువు ఆజ్ఞ కాదు. నా ఆజ్ఞ. ఒక విశ్వాసి భార్య ప్రభువును నమ్మనిదై అతనితో ఉండటానికిష్టపడితే అతడు ఆమెకు విడాకులు ఇవ్వకూడదు. 13 అలాగే ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి అతడు ఆమెతో జీవించాలని అనుకొంటే ఆమె అతనికి విడాకులు ఇవ్వకూడదు. 14 అంటే, విశ్వాసం లేని భర్త విశ్వాసురాలైన భార్యతో కలిసి జీవించటంవల్ల పవిత్రమౌతాడు. అదే విధంగా అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన భర్తతో కలసి జీవించటం వల్ల పవిత్రమౌతుంది. అలాకానట్లయితే మీ సంతానం అపవిత్రంగా ఉంటుంది. కాని ఇప్పుడున్న ప్రకారం వాళ్ళు పవిత్రులే.
15 కాని, విశ్వాసి కానివాడు వెళ్ళిపోవాలని అనుకొంటే వెళ్ళిపోనివ్వండి. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాసికి కాని, విశ్వాసురాలికి కాని ఏ నిర్భంధం ఉండకూడదు. దేవుడు శాంతితో జీవించటానికే మనల్ని పిలిచాడు. 16 ఓ స్త్రీ! నీ వల్ల నీ భర్త రక్షింపబడుతాడో లేదో! నీకేమి తెలుసు? ఓ పురుషుడా! నీ వల్ల నీ భార్య రక్షింబడుతుందో లేదో! నీకేమి తెలుసు?
దేవుడు నిన్ను పిలిచినట్లే జీవించు
17 ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని ప్రభువు ప్రసాదించిన వరం ప్రకారం జీవించాలి. మీ జీవితం ప్రభువు నియమించిన ప్రకారముగా పిలుపుకు తగినట్టుగా ఉండాలి. ఈ నియమాన్ని అన్ని సంఘాలు పాటించాలని ఆజ్ఞాపిస్తున్నాను. 18 సున్నతి చేయించుకొన్నవాడు దేవుని పిలుపును అంగీకరిస్తే, అతడు ఆ సున్నతి లేనివానిగా ఉండుటకు ప్రయత్నించరాదు. సున్నతి చేయించుకొననివాడు దేవుని పిలుపును అంగీకరిస్తే అతడు సున్నతి చేయించుకోవటానికి ప్రయత్నం చేయరాదు. 19 సున్నతి చేయించుకొన్నా, చేయించుకోక పోయినా జరిగేది ఏమిలేదు. దేవుని ఆజ్ఞల్ని పాటించటం ముఖ్యం. 20 ప్రతి ఒక్కడూ, దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదేవిధంగా ఉండాలి. 21 దేవుడు పిలిచినప్పుడు నీవు బానిసవా? చింతించకు. కాని నీవు స్వేచ్ఛ పొందగలిగితే అందుకు ప్రయత్నం చేయి. 22 ప్రభువు పిలిచినప్పుడు బానిసగా ఉన్నవాడు, ప్రభువులో ఐక్యత పొందటంవల్ల స్వేచ్ఛను పొందుతాడు. అదే విధంగా ప్రభువు పిలిచినప్పుడు స్వేచ్ఛగా ఉన్నవాడు ప్రభువుకు బానిస అవుతాడు. 23 మీకోసం వెల చెల్లించి దేవుడు మిమ్మల్ని కొన్నాడు. మానవులకు బానిసలు కాకండి. 24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి.
పెండ్లి చేసుకొనుటలో గల సమస్యలు
25 ఇక కన్యలను గురించి: ప్రభువు మీకు ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. కాని దేవుని అనుగ్రహంవల్ల నేను మీకు చెపుతున్న సలహాలు నమ్మతగినవి. 26 ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితుల వల్ల మీరు కన్యలుగా ఉండిపోవటం మంచిది. 27 ఇక పురుషులు, మీరు వివాహితులైనట్లయితే విడాకులు ఇవ్వకండి. మీరు అవివాహితులైనట్లయితే భార్యల కోసం వెతక్కండి. 28 అలాగని మీరు వివాహం చేసుకొంటే పాపం కాదు. అదే విధంగా కన్యలు కూడా వివాహం చేసుకొంటే పాపం కాదు. కాని వివాహం చేసుకొన్నవాళ్ళు జీవితంలో చాలా కష్టాలు అనుభవిస్తారు. మీకా కష్టాలు కలుగరాదని ఇలా చెపుతున్నాను.
29 సోదరులారా! ఇక వ్యవధి లేదు. ఇక మీదటనుండి భార్యలున్నవాళ్ళు భార్యలు లేనట్లు జీవించాలి. 30 దుఃఖించేవాళ్ళు దుఃఖించనట్లు, ఆనందిస్తున్నవాళ్ళు ఆనందించనట్లు, కొనేవాళ్ళు కొన్నవి తమని కానట్లు జీవించాలి. 31 ఇప్పుడున్న ప్రపంచం నశించబోతోంది. కనుక ఈ ప్రపంచంలో జీవిస్తున్నవాళ్ళు దానిలో ఉన్న వస్తువుల పట్ల ఆశ పెంచుకోకుండా జీవించాలి.
32 మీరు చింతించరాదని నా కోరిక. “వివాహం చేసుకోనివాడు ప్రభువును ఏ విధంగా ఆనంద పరచాలా” అని, అంటే ఆత్మీయమైన విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 33 కాని, వివాహితుడు తన భార్యను ఎలా ఆనందపరచాలని ఆలోచిస్తూ ఉంటాడు. కనుక ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 34 అందువల్ల అతని మనస్సు రెండు రకాలుగా పని చేస్తూ ఉంటుంది. పెళ్ళికాని స్త్రీలు, కన్యలు ప్రభువు ఆజ్ఞల్ని పాటించటంలో నిమగ్నులై ఉంటారు. తమ మనస్సును, శరీరాన్ని ప్రభువుకు అర్పించి పని చేస్తుంటారు. కాని పెళ్ళిచేసుకొన్న స్త్రీలు తమ భర్తను ఆనందపరచటానికి, ప్రాపంచిక విషయాలను గురించి ఆలోచిస్తూ ఉంటారు. 35 ఇది నేను మీ మంచి కోసం చెపుతున్నాను. అనవసరమైన కట్టుబాట్లు నియమించాలని కాదు. మీరు సక్రమంగా నడుచుకోవాలని, మనస్ఫూర్తిగా మిమ్నల్ని మీరు ప్రభువుకు అర్పించుకోవాలని నా ఉద్ధేశ్యం.
36 తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకోకుండా ఉండటం అక్రమమని భావించినవాడు, లేక ఆమెకు వయస్సు పెరిగిపోవటంవల్ల పెళ్ళి చేసుకోవటం అవసరమని భావించినవాడు పెళ్ళి చేసుకోవచ్చు. ఇది పాపం కాదు. 37 కాని పెళ్ళి చేసుకోరాదని తన మనస్సులో నిశ్చయించుకొన్నవాడు, పెళ్ళి చేసుకోవాలనే నిర్బంధం లేనివాడు, తన మనస్సును అదుపులో పెట్టుకోగలవాడు కూడా పెళ్ళి మాని సరియైన పని చేస్తున్నాడు. 38 కనుక తనతో పెళ్ళి నిశ్చయమైన కన్యను పెళ్ళి చేసుకొన్నవాడు మంచి పని చేస్తున్నాడు. కాని పెళ్ళి చేసుకోనివాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు.
39 భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి కట్టుబడి ఉండాలి. అతడు చనిపోతే ఆమె తనకు ఇష్టమున్నవాణ్ణి వివాహం చేసుకోవచ్చు. కాని అతడు ప్రభువు యొక్క విశ్వాసియై ఉండాలి. 40 ఆమె విధవరాలుగా ఉండిపోతే ఆనందంగా ఉంటుందని నా అభిప్రాయం. నాకును దేవుని ఆత్మ సహాయం ఉన్నదని తలస్తున్నాను.
యెరూషలేము ప్రజలు చెదరిపోవుట
5 1-2 “నరపుత్రుడా, నీ ఆకలి సమయం[a] అనంతరం నీవు ఈ పనులు చేయాలి: ఒక పదునైన కత్తి తీసుకో. దానిని మంగలి కత్తిలా వినియోగించి, నీ జుట్టును, గడ్డాన్ని గొరిగివేయుము. అలా తీసిన నీ జుట్టును ఒక తాసులో తూకం వేయుము. ఆ జుట్టును మూడు సమభాగాలుగా తూచాలి. నీ జుట్టులో ఒక భాగాన్ని నగరం బొమ్మ ఉన్న ఇటుక మీద పెట్టి, ఆ జుట్టును నగరంలో కాల్చివేయుము. కొంతమంది ప్రజలు నగరంలో చనిపోతారనే దానికి ఇది ఒక సూచన. ఒక కత్తితో రెండవ భాగం జుట్టును చిన్న చిన్న ముక్కలుగా చేయుము. ఆ జుట్టును నగరం (ఇటుక) చుట్టూ జల్లు. కొంతమంది ప్రజలు నగరం వెలుపల చనిపోతారని ఇది తెలియజేస్తుంది. నీ జుట్టులో మూడవ భాగాన్ని గాలిలోకి విసిరివేయుము. దానిని గాలిలో బహుదూరం కొట్టుకొనిపోనిమ్ము. కొంత మంది ప్రజలను నేను నా కత్తిని బయటికిలాగి బహుదూర దేశాలకు తరిమివేస్తానని ఇది సూచిస్తుంది. 3 కాని తరువాత నీవు వెళ్లి కొట్టుకుపోయిన వెంట్రుకలలో కొన్నింటిని ఏరి తేవాలి. వాటిని నీ దుస్తులతో చుట్టు. ఇది నా ప్రజలలో కొంతమందిని తిరిగి నా వద్దకు తెచ్చుకుంటాననే దానికి సూచన. 4 ఎగిరిపోయిన వెంట్రుకలలో మరికొన్నింటిని ఏరి, తెచ్చి, వాటిని నిప్పులో వేయుము. ఇది ఇశ్రాయేలు ఇల్లంతా అగ్నికి గురియై నాశనమవుతుందనడానికి ఒక సూచన.”
5 నా ప్రభువైన యెహోవా ఇంకా ఇలా చెప్పియున్నాడు. “ఆ ఇటుకరాయి యెరూషలేముకు గురుతు. యెరూషలేమును ఇతర రాజ్యాలకు మధ్య ఉంచుతాను. దాని చుట్టూ దేశాలుంటాయి. 6 ఆ ప్రజలు నా ఆజ్ఞలను ధిక్కరించారు. ఇతర దేశాల వారికంటె వీరు మిక్కిలి హీనులయ్యారు. వారిచుట్టూ వున్న దేశాల ప్రజలకంటె ఈ ప్రజలే నా ధర్మాన్ని ఎక్కువగా ఉల్లంఘించారు. నా ఆజ్ఞలను వినటానికి వారు నిరాకరించారు! నా నియమాలను వారు మన్నించ లేదు!”
7 కావున నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “మీకు నేను భయంకర పరిస్థితులు కల్పిస్తాను. ఎందుకనగా మీరు నా ధర్మాన్ని అంగీకరించి, అనుసరించలేదు. మీరు నా ఆజ్ఞలను పాటించలేదు. మీ చుట్టూవున్న ప్రజలకంటే నా న్యాయసూత్రాలను మీరే ఎక్కువగా ఉల్లంఘించారు! ఆ ప్రజలు తప్పుగా భావించే పనులను కూడా మీరు చేశారు!” 8 అందువల్ల నా ప్రభువైన యెహోవా చెప్పినదేమంటే, “కాబట్టి ఇప్పుడు, నేను కూడా మీకు వ్యతిరేకిని. ఇతర ప్రజలంతా చూసేలా నేను మిమ్ముల్ని శిక్షిస్తాను. 9 గతంలో నేనెన్నడూ చేయని పనులు మీకు నేను చేస్తాను. ఆ భయంకరమైన శిక్షను ఇకముందెన్నడూ విధించను! ఎందువల్లనంటే మీరు అనేక భయంకరమైన పనులు చేశారు. 10 యెరూషలేము ప్రజలు చాలా ఆకలితో ఉండి, తండ్రులు వారి బిడ్డలనే తినివేస్తారు. పిల్లలు వారి తండ్రులను తినివేస్తారు. అనేక విధాలుగా మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. చావగా మిగిలిన ప్రజలను నేను అన్ని దిక్కులలో చిందర వందరగా వదిలి వేస్తాను.”
11 నా ప్రభువైన యెహోనా ఇలా చెప్పాడు, “యెరూషలేమా, నా జీవము తోడుగా నిన్ను నేను శిక్షిస్తానని చెపుతున్నాను! నిన్ను శిక్షిస్తానని నేను ప్రమాణ పూర్వకంగా చెపుతున్నాను! ఎందుకంటే, నా పవిత్ర స్థలానికి నీవు భయంకరమైన పనులు చేశావు. దానిని అపవిత్ర పర్చుతూ ఘోరమైన పనులు చేశావు! నేను నిన్ను శిక్షిస్తాను. నీ పట్ల కరుణ ఏ మాత్రం చూపించను. నిన్ను చూచి నేను విచారపడను! 12 నగరంలో నీ ప్రజలలో మూడవ వంతు వ్యాధిపీడితులై ఆకలితో చనిపోతారు. నీ ప్రజలలో మూడవ వంతు నగరం వెలుపల యుద్ధంలో చనిపోతారు. అప్పుడు నా కత్తిని బయటికిలాగి మీలో మరొక మూడో వంతు మందిని దూర దేశాలకు తరిమి వేస్తాను. నీ చుట్టూ ఉన్న ప్రజలు యుద్ధంలో వారిని చంపివేస్తారు! అప్పుడు మాత్రమే నేను నీ పట్ల నా కోపాన్ని ఉపసంహరించుకుంటాను. 13 అప్పుడు మాత్రమే నీ ప్రజల పట్ల నా కోపాన్ని తగ్గించుకుంటాను. వారు నా పట్ల చేసిన పాపకార్యాలకే వారు శిక్షింపబడ్డారని నాకు తెలుసు. నేను వారి యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు. వారి పట్ల నాకుగల గాఢమైన ప్రేమ[b] వల్ల నేను వారితో మాట్లాడానని కూడా వారు తెలుసు కుంటారు!”
14 దేవుడు ఇలా చెప్పాడు: “యెరూషలేమా, నిన్ను నేను నాశనం చేస్తాను. నీవు కేవలం ఒక రాళ్ల కుప్పలా మిగిలిపోతావు. నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను ఎగతాళి చేస్తారు. నీ ప్రక్కగా వెళ్లే ప్రతివాడూ నిన్ను చూచి పరిహసిస్తాడు. 15 నీ చుట్టూ వున్న ప్రజలు నిన్ను పరిహసిస్తారు. కాని వారికి నీవొక గుణపాఠంలా కూడ మిగులుతావు. నేను నీ పట్ల కోపగించి, నిన్ను శిక్షించినట్లు వారు చూస్తారు, నేను మిక్కిలి కోపంగా ఉన్నాను. నేను నిన్ను హెచ్చరించాను. యెహోవానైన నేను ఏమి చేస్తానో నీకు చెప్పాను! 16 నీకు లభించే ఆహారాన్ని తీసేసి మరల మరల ఆకలిగొలిపే ఆ సమయాన్ని కలుగజేస్తానని చెప్పియున్నాను. నిన్ను నాశనం చేసే భయంకర పరిణామాలు కలుగజేస్తానని నీకు చెప్పియున్నాను. ఆ కరువు పరిస్థితులు అనేకసార్లు వచ్చాయి. మీకు ఆహార పదార్థాలు సరఫరా కాకుండా చేశాను. 17 నేను ఆకలిని, క్రూరమృగాలను నీ మీదకు పంపుతాను. ఆవి నీ పిల్లలను చంపుతాయి. నగరమంతా వ్యాధులు, మరణాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. మీ మీదికి శత్రు సైన్యాలను తెప్పించి యుద్ధం చేయిస్తాను. యహోవానగు నేను ఈ విషయాలన్నీ సంభవిస్తాయని నీకు చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరాయి!”
రెండవ భాగం
(కీర్తనలు 42–72)
సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవధ్యానం
42 దప్పిగొన్న దుప్పి, చల్లటి సెలయేటి ఊటల్లో నీళ్లు త్రాగాలని ఆశిస్తుంది.
అలాగే దేవా, నీకోసం నా ఆత్మ దాహంగొని ఉంది.
2 సజీవ దేవుని కోసం, నా ఆత్మ దాహంగొని ఉంది.
ఆయనను కలుసుకొనుటకు నేను ఎప్పుడు రాగలను?
3 నా కన్నీళ్లే రాత్రింబవళ్లు నా ఆహారం.
నా శత్రువు ఎంతసేపూను “నీ దేవుడు ఎక్కడ?” అంటూనే ఉన్నాడు.
4 కనుక నన్ను వీటన్నిటినీ జ్ఞాపకం ఉంచుకోనిమ్ము.
నా ఆత్మను కుమ్మరించనిమ్ము. దేవుని ఆలయానికి నడవటం,
ప్రజల గుంపులను నడిపించటం నాకు జ్ఞాపకం.
అనేకమంది ప్రజలు పండుగ చేసుకొంటూ సంతోష స్తుతిగానాలు పాడటం నాకు జ్ఞాపకం.
5 నేను ఎందుకు అంత విచారంగా ఉన్నాను?
ఎందుకు నేనంత తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
ఆయనను ఇంకా స్తుతించుటకు నాకు అవకాశం దొరుకుతుంది.
ఆయన నన్ను కాపాడుతాడు.
6 నాకు సహాయమైన దేవా! నా మనస్సులో నేను కృంగియున్నాను.
కనుక నేను నిన్ను యొర్దాను ప్రదేశమునుండియు, హెర్మోను ప్రాంతంనుండియు, మీసారు కొండనుండియు జ్ఞాపకం చేసుకొంటున్నాను.
7 నీ జలపాతాల ఉరుము ధ్వని అఘాధంలోనుండి పిలుస్తోంది.
నీ అలలు అన్నియు నామీదుగా దాటియున్నవి.
8 ప్రతిరోజూ యెహోవా తన నిజమైన ప్రేమను చూపిస్తాడు.
అప్పుడు రాత్రిపూట నేను ఆయన పాటలు పాడుతాను. నా సజీవ దేవునికి నేను ప్రార్థన చేస్తాను.
9 ఆశ్రయ బండ అయిన నా దేవునితో,
“యెహోవా! నీవు నన్ను ఎందుకు మరిచావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి?” అని నేను వేడుకుంటాను.
10 నా శత్రువులు నన్ను చంపుటకు ప్రయత్నించారు.
“నీ దేవుడు ఎక్కడ?” అని వారు అన్నప్పుడు వారు నన్ను ద్వేషిస్తున్నట్టు వారు చూపెట్టారు.
11 నేను ఎందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేను ఎందుకు ఇంతగా తల్లడిల్లిపోయాను?
దేవుని సహాయం కోసం నేను వేచి ఉండాలి.
నేను ఇంకా ఆయన్ని స్తుతించే అవకాశం దొరుకుతుంది.
నా సహాయమా! నా దేవా!
43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
2 దేవా, నీవే నా క్షేమ స్థానం.
నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
నేనెందుకు విచారంగా ఉండాలి?
3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
నా దేవుడే నాకు సహాయము.
© 1997 Bible League International