Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 25

దావీదు మరియు మూర్ఖుడైన నాబాలు

25 సమూయేలు చనిపోయాడు. సభచేరిన ఇశ్రాయేలీయులు సమూయేలు మృతికి తమ సంతాపాన్ని వెలిబుచ్చారు. రామాలో వున్న ఇతని ఇంటివద్దనే సమూయేలు భౌతిక కాయాన్ని వారు సమాధి చేశారు.

అప్పుడు దావీదు పారాను అరణ్యానికి తరలిపోయాడు. మాయోనులో ఒక ధనవంతుడు నివసిస్తుండేవాడు. అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. ఏదో వ్యాపార రీత్యా అతడు కర్మెలులో ఉన్నాడు. కర్మెలులో అతడు తన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు. అతని పేరు నాబాలు.[a] అతని భార్య పేరు అబీగయీలు. ఆమె చాలా తెలివైనది, మంచి అందగత్తె, కానీ నాబాలు క్రూరుడు, నీచుడు, కాలేబు సంతతివాడు.

దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, నాబాలు తన గొర్రెలనుండి ఉన్ని తీస్తున్నట్లు విన్నాడు. దావీదు పదిమంది యువకులను పిలిచి, “కర్మెలులో వున్న నాబాలు వద్దకు వెళ్లి అతనిని తన పక్షంగా పలుకరించమని” చెప్పాడు. “నీవూ, నీ కుటుంబం బాగున్నారని ఆశిస్తున్నాను! నీకు ఉన్నదంతా క్షేమం అని కూడ నేను భావిస్తున్నాను, నీవు నీ గొర్రెల నుండి ఉన్ని తీస్తున్నట్లు నేను విన్నాను. నీ గొర్రెల కాపరులు కొద్ది రోజులు మా వద్ద ఉన్నారు. అప్పుడు వారికి మేము ఏ హానీ చేయలేదు. వారు కర్మెలులో ఉన్నంత కాలం మేము వారినుండి ఏమి తీసుకోలేదు. నీవు వారి నడిగితే ఇది నిజం అని వారే చెబుతారు. మేము ఈ సంతోష సమయంలో నీ దగ్గరకు వస్తున్నాము. అందుచేత ఈ యువకుల పట్ల నీవు కనికరం చూపించు. దయచేసి నీవు ఇవ్వగలిగింది వారికి ఇవ్వు. నీ స్నేహితుడనైన[b] దావీదు కోసం ఇది చేయి” అని చెప్పమన్నాడు దావీదు.

దావీదు మనుష్యులు నాబాలు దగ్గరకు వెళ్లారు. దావీదు సందేశాన్ని వారు నాబాలుకు అందజేశారు. 10 కాని నాబాలు చాలా అసభ్యకరంగా వ్యవహరించాడు. తన వద్దకు వచ్చిన దావీదు సేవకులతో, “ఎవడీ దావీదు? ఎవడీ యెష్షయి కొడుకు? ఇటీవల చాలా మంది బానిసలు తమ యజమానులనుండి పారిపోతున్నారు! 11 నావద్ద రొట్టె, నీళ్లూ ఉన్నాయి. అవి, నావద్ద ఉన్న మాంసం, ఉన్ని తీసే నా సేవకులకు కావాలి. నాకు తెలియని వాళ్లెవరికీ నేను దాన్ని ఇవ్వను,” అని కసురుకున్నాడు నాబాలు.

12 నాబాలు అన్నదంతా దావీదు మనుష్యులు తిరిగి వెళ్లి దావీదుకు చెప్పారు. 13 ఇది విన్న దావీదు తన మనుష్యులను, “తమ కత్తులు తీసుకోమన్నాడు.” కనుక దావీదు అతని మనుష్యులు తమ తమ కత్తులు చేపట్టారు. సుమారు నాలుగు వందల మంది దావీదుతో వెళ్లారు. రెండువందల మంది సామాన్ల వద్ద కాపలా ఉన్నారు.

అబీగయీలు ఆపదను తప్పించుట

14 నాబాలు నౌకర్లలో ఒకడు తన యజమాని భార్య అబీగయీలు వద్దకు వెళ్లి, “దావీదు అరణ్యం నుండి కొందరు దూతలను మా యజమాని నాబాలును పలకరించేందుకు పంపాడు. అయితే నాబాలు వారితో నీచంగా ప్రవర్తించాడు అని చెప్పాడు. 15 దావీదు మనుష్యులు మనపట్ల చాలా మర్యాదగా ఉన్నారు. మనకు ఏ అపకారమూ చేయలేదు. మేము గొర్రెలను పొలాలకు తోలుకు వెళ్లినప్పుడు వారు మాతోనే ఉన్నారు. వారు ఎప్పుడూ ఏమీ దొంగిలించలేదు. 16 రాత్రింబగళ్లు దావీదు మనుష్యులు మమ్మల్ని కాపాడారు. మేము గొర్రెలను మేపుతున్న రోజుల్లో వారు మాకు పెట్టని కోటలా ఉండి మమ్మల్ని కాపాడారు. 17 ఇప్పుడు నీవు ఏమి చేయగలవో నీవే ఆలోచించి నిశ్చయించు. మా యజమాని నాబాలుకూ, అతని కుటుంబానికీ భయంకర ఆపద రాబోతోంది. నాబాలు చెప్పిన మాటలు బుద్ధి తక్కువ మాటలు” అని చెప్పాడు.

18 అబీగయీలు వెంటనే రెండువందల రొట్టెలు, రెండు నిండు ద్రాక్షారసపు తిత్తులు, వండిన ఐదు గొర్రెల మాంసం, సుమారు ఐదు మానికల వండిన ఆహారం, ఒక మూట ఎండు ద్రాక్ష, ఎండిన అంజూరపు పండ్ల అడలు రెండు వందలు, కొన్ని గాడిదల మీద ఎత్తించింది. 19 తరువాత అబీగయీలు తన నౌకర్లతో, “వాటిని తీసుకుని వెళ్లమని, వారి వెనుక తను బయలు దేరి వస్తానని చెప్పింది.” కానీ ఆమె ఇదంతా తన భర్తకు చెప్పలేదు.

20 అబీగయీలు తన గాడిద మీద ఎక్కి పర్వతం అవతలి వైపుకు వచ్చింది. ఎదురుగా వస్తున్న దావీదును, అతని మనుష్యులను ఆమె కలుసుకున్నది.

21 అబీగయీలు దావీదును కలుసుకోక ముందు దావీదు తన అనుచరులతో, “నాబాలు ఆస్తిని అరణ్యంలో నేను అనవసరంగా కాపాడాను. వాని గొర్రెలలో ఒక్కటికూడ తప్పిపోకుండా అదుపు చేయించాను. నేనతనికి అన్నీ మంచి పనులు చేశాను. కానీ అతను నాపట్ల చాలా చెడుగా ప్రవర్తించాడు. 22 రేపటి ఉదయంలోగా నేను నాబాలు కుటుంబంలో ఒక్క మగవాడు కూడా లేకుండా చంపకపోతే యెహోవా నన్ను శిక్షించును గాక!” అన్నాడు.

23 అయితే అబీగయీలు దావీదును చూడగానే వెంటనే గాడిద మీదనుంచి దిగి, దావీదుకు సాగిలపడి అభివందనం చేసింది. 24 అబీగయీలు దావీదు పాదాల మీద పడి, “అయ్యా, నన్ను నీతో మాట్లాడనియ్యి. నేను చెప్పేది విను. జరిగిన దానికి నన్నేనిందించు. 25 నీవు పంపిన మనుష్యుల్ని నేను చూడలేదు. ఈ పనికిమాలిన మనిషి నాబాలును నీవు లక్ష్యపెట్టకు. అతను తన పేరుకు తగినట్టే ఉన్నాడు. అతని పేరుకు ‘బుద్ధిహీనుడని’ అర్థం. అతడు నిజంగానే బుద్ధిహీనుడు. 26 నిర్దోషులను చంపకుండా, యెహోవాయే నిన్ను దూరంగా ఉంచాడు. యెహోవా జీవిస్తున్నాడు నిజంగా, నీవు జీవిస్తున్నావు నిజంగా నీ శత్రువులంతా, మరియు నీకు కీడు తలపెట్టిన వారంతా నాబాలువలె అవుదురు గాక! 27 నీ కోసం నేను ఈ కానుకలు తెచ్చాను. నిన్ను అనుసరిస్తున్న నీ మనుష్యులకు ఈ కానుకలనివ్వు. 28 తప్పు చేసినందుకు నన్ను క్షమించు. యెహోవా నీ కుటుంబాన్ని బలపరచి నీ కుటుంబంలో అనేక మంది రాజులు పుట్టేలా చేస్తాడని నాకు తెలుసు. నీవు ఆయన తరపున యుద్ధాలు చేస్తున్నావు గనుక యెహోవా అలా చేస్తాడు. నీవు జీవించియున్నంత కాలం ప్రజలకు నీలో ఏ తప్పూ కనబడదు. 29 ఒక మనిషి నిన్ను చంపాలని వెంటాడినా, నీ దేవుడైన యెహోవా నీ ప్రాణాన్ని రక్షిస్తాడు. ఒడిసెలలో పెట్టి విసరిన రాయిలా యెహోవా నీ శత్రువుల ప్రాణాలను విసిరేస్తాడు. 30 నీకు అనేక మంచి వాటిని చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. కనుక యెహోవా వాటన్నింటినీ నెరవేరుస్తాడు. ఆయన నిన్ను ఇశ్రాయేలుకు నాయకునిగా చేస్తాడు. 31 అప్పుడు నీవు ఈ బోనులోపడవు. దుర్మార్గాలు చేసిన దోషం నీకు ఉండదు. నిర్దోషులను చంపావనే దోషం నీ మీద ఉండదు. ఆ మహా గొప్ప విజయం నీకు యెహోవా చేకూర్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను” అని వేడుకున్నది.

32 దావీదు అబీగయీలుకు సమాధానమిస్తూ, “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం. నన్ను కలుసుకునేందుకు దేవుడే నిన్ను పంపించాడు. 33 నీవు సరియైన న్యాయ విచారణ చేసినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక! ఈ రోజు నేను నిర్దోషులను చంపకుండా నీవే నన్ను వారించావు. 34 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవిస్తున్నంత నిజంగా నీవు గనుక ఇంత త్వరగా ఈరోజు నన్ను కలుసుకొనేందుకు రాకపోతే రేపటి ఉదయం లోపల నాబాలు వంశంలో ఒక్క మగవాడు కూడా మిగిలే వాడు కాదు” అని చెప్పాడు దావీదు.

35 అప్పుడు దావీదు అబీగయీలు తెచ్చిన కానుకలు స్వీకరించి, “శాంతితో ఇంటికి వెళ్లు. నీ మాటలు నేను విన్నాను, నీవు కోరినట్టు నేను చేస్తాను” అని దావీదు ఆమెతో చెప్పాడు.

నాబాలు మరణము

36 అబీగయీలు తిరిగి వచ్చేసరికి నాబాలు ఇంటి వద్దనే ఉన్నాడు. నాబాలు ఒక రాజులా తింటూ ఉన్నాడు. బాగా తాగి, ఉల్లాసంగా ఉన్నాడు. అందుచేత అబీగయీలు మరుసటి రోజు ఉదయం వరకు నాబాలుతో ఏమీ చెప్పలేదు. 37 మరుసటి ఉదయం నాబాలు మామూలుగా ఉన్నాడు. కనుక అతని భార్య జరిగినదంతా అతనితో చెప్పింది. అది వినగానే అతనికి గుండెపోటు వచ్చి, రాయిలా బిగుసుకుపోయాడు. 38 ఆ తరువాత పదిరోజులకు నాబాలు చచ్చేటట్టుగా చేసాడు యెహోవా.

39 నాబాలు మరణ వార్త విన్న దావీదు, “యెహోవాకు స్తోత్రం! నాబాలు నన్ను గూర్చి చెడుగా మాట్లాడాడు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. నాబాలు తప్పు చేసాడు గనుక యెహోవా వానిని చచ్చేటట్టు చేసాడు” అని చెప్పాడు.

అప్పుడు దావీదు అబీగయీలుకు ఒక వర్తమానం పంపాడు. ఆమె తనకు భార్య కావాలని దావీదు అడిగాడు. 40 దావీదు సేవకులు కర్మెలుకు వెళ్లి అబీగయీలును కలిసి, “దావీదు నిన్ను తీసుకుని రమ్మని మమ్ములను పంపించాడు. నీవు అతని భార్యవు కావాలని దావీదు కోరిక” అని చెప్పారు. 41 అబీగయీలు సాగిలపడి సమస్కరించి, “నేను మీ దాసిని. మీ సేవకు సిద్ధంగా ఉన్నాను. నేను నా యజమానియైన దావీదు సేవకుల పాదప్రక్షాళనం[c] చేయటానికి సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.

42 అబీగయీలు వెంటనే ఒక గాడిద మీద ఎక్కి, దావీదు పంపిన సేవకులతో కలిసి వెళ్లింది. ఆమెతో అయిదుగురు పనిగత్తెలను కూడ తీసుకుని వెళ్లింది. అబీగయీలు దావీదు భార్య అయింది. 43 యెజ్రెయేలీ వాసి అహీనోయమును కూడ దావీదు వివాహము చేసుకున్నాడు. అహీనోయము, అబీగయీలు ఇద్దరూ దావీదుకు భార్యలయ్యారు. 44 సౌలు కుమార్తె మీకాలు కూడ దావీదుకు భార్యయే గాని, సౌలు ఆమెను గల్లీముకు చెందిన లాయీషు అనే వాని కుమారుడు పల్తీయేలుకు ఇచ్చి మళ్లీ పెళ్లి చేశాడు.

1 కొరింథీయులకు 6

క్రైస్తవుల మధ్య వివాదాలు

ఒకవేళ మీ మధ్య తగువులొస్తే, మన సంఘంలో ఉన్న పవిత్రుల దగ్గరకు వెళ్ళాలి కాని, సంఘానికి చెందనివాళ్ళ దగ్గరకు వెళ్ళేందుకు మీ కెంత ధైర్యం? పవిత్రులు ప్రపంచం మీద తీర్పు చెపుతారన్న విషయం మీకు తెలియదా? మీరు ప్రపంచంమీద తీర్పు చెప్పగలిగినప్పుడు, సాధారణమైన విషయాలపై తీర్పు చెప్పే స్తోమత మీలో లేదా? మనము దేవదూతల మీద కూడా తీర్పు చెపుతామన్న విషయం మీకు తెలియదా? అలాంటప్పుడు ఈ జీవితానికి సంబంధించిన విషయాలు ఏ పాటివి? మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా? సిగ్గుచేటు! సోదరుల మధ్య కలిగే తగువులు తీర్చగలవాడు మీలో ఒక్కడు కూడా లేడా? సంఘానికి చెందినవాని దగ్గరకు వెళ్ళకుండా ఒక సోదరుడు మరొక సోదరునిపై నేరారోపణ చేయటానికి న్యాయస్థానానికి వెళ్ళుతున్నాడు. అంటే సంఘానికి చెందనివాళ్ళను అడుగుతున్నాడన్న మాట.

మీ మధ్య వ్యాజ్యాలు ఉండటం వల్ల మీరు పూర్తిగా ఓడిపొయ్యారని చెప్పవచ్చు. వ్యాజ్యాలు పెట్టు కోవటంకన్నా అన్యాయం సహించటం, మోసపోవటం మంచిది. దానికి మారుగా మీరే అన్యాయాలు, మోసాలు చేస్తున్నారు. ఇతరులను కాక, మీ సోదరులనే మోసం చేస్తున్నారు.

దుష్టులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరని మీకు తెలియదా? మోసపోకండి. లైంగిక విషయాల్లో అవినీతిగా జీవించేవాళ్ళకు, విగ్రహారాధికులకు, వ్యభిచారులకు, మగ వేశ్యలు, మగవాళ్ళతో మగవాళ్ళు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు తమ కామాన్ని తీర్చుకొనే వాళ్ళకు, 10 దొంగలకు, దురాశాపరులకు, త్రాగుబోతులకు, అపవాదాలు లేవదీసేవాళ్ళకు, మోసగాళ్ళకు, దేవుని రాజ్యం దొరకదు. 11 మీలో కొందరు ఆ విధంగా జీవించారు. కాని దేవుడు మీ పాపాలు కడిగివేశాడు. కనుక మీరు పవిత్రంగా ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు పేరిట మన దేవుని ఆత్మ ద్వారా మీరు నిర్దోషులుగా పరిగణింపబడ్డారు.

లైంగిక అవినీతి

12 “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది.” కాని వాటివల్ల లాభం కలుగదు. “ఏది చెయ్యటానికైనా నాకు అనుమతి ఉంది” కాని నేను దానికి బానిసను కాను, 13 “తిండి కడుపు కోసము, కడపు తిండి కోసం సృష్టింపబడినాయి.” కాని దేవుడు రెంటినీ నాశనం చేస్తాడు. దేహం ఉన్నది వ్యభిచారం చేయటానికి కాదు. అది ప్రభువు కోసం ఉంది. ప్రభువు దేహం కోసం ఉన్నాడు. 14 దేవుడు తన శక్తితో ప్రభువును బ్రతికించాడు. అదే విధంగా మనల్ని కూడా బ్రతికిస్తాడు. 15 మీ దేహాలు క్రీస్తుకు అవయవాలని మీకు తెలియదా? మరి అలాంటప్పుడు క్రీస్తు అవయవాల్ని, వేశ్య దేహంతో కలుపమంటారా? అసంభవము. 16 తన దేహాన్ని వేశ్య దేహంతో కలిపినవాడు ఆ దేహంతో ఒకటైపోతాడని మీకు తెలియదా? దీన్ని గురించి, “రెండు దేహాలు ఒక దేహంగా అవుతాయి”(A) అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. 17 కాని ప్రభువుతో ఐక్యమైన వాడు ఆయన ఆత్మతో ఐక్యమౌతాడు.

18 లైంగిక అవినీతికి దూరంగా ఉండండి, మనిషి చేసే మిగతా పాపాలు తన దేహానికి సంబంధించినవి కావు. కాని వ్యభిచారం చెయ్యటంవల్ల వ్యక్తి తన స్వంత దేహంపట్ల పాపం చేసినట్లౌతుంది. 19 మీ దేహం పరిశుద్ధాత్మకు మందిరమని మీకు తెలియదా? దేవుడు యిచ్చిన పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మీ దేహంపై మీకు హక్కులేదు. 20 మీ కోసం వెల చెల్లించబడింది. కనుక మీ దేహాల్ని దేవుని మహిమ కోసం ఉపయోగించండి.

యెహెజ్కేలు 4

యెరూషలేము దాడిని గూర్చి హెచ్చరికలు

“నరపుత్రుడా, ఒక ఇటుక తీసుకొని దానిమీద ఒక బొమ్మ గియ్యి. యెరూషలేము నగరపు బొమ్మ వేయుము. నీవా నగరాన్ని ముట్టుడించే సైన్యంలాగా చిత్రీకరించు. నగరాన్ని తేలికగా పట్టుకొనేటందుకు అనువుగా దానిచుట్టూ ఒక మట్టిగోడ నిర్మించు. నగరపు గోడవరకు ఒక మట్టి రహదారి వేయుము. సమ్మెటల్ని (ముఖ్య నాయకుల్ని) తెప్పించి, నగరం చుట్టూ సైనిక స్థావరాలను ఏర్పాటు చేయండి. పిమ్మట ఒక ఇనుప పెనము తీసుకొని దానిని నీకు, నగరానికి మధ్య ఉంచు. అది నిన్ను, నగరాన్ని వేరుచేసే ఇనుప గోడలా ఉంటుంది. ఈ రకంగా నీవా నగరానికి వ్యతిరేకంగా వున్నట్లు నీవు చూపిస్తావు. నీవా నగరాన్ని చుట్టుముట్టి దానిపై దాడి చేస్తున్నట్లు వుంటుంది. ఎందువల్లనంటే ఇశ్రాయేలు వంశానికి ఇది ఒక ఉదాహరణగా వుంటుంది. (దేవుడనైన) నేను యెరూషలేమును నాశనం చేస్తానని అది నిరూపిస్తుంది.

“తరువాత నీవు ఎడమ ప్రక్కకి పడుకో, ఇశ్రాయేలీయుల పాపాలన్నీ నీవు భరిస్తున్నట్లు నిరూపించే విధంగా నీవాపని చేయాలి. నీవు ఎడమ ప్రక్కన ఎన్నాళ్లు పడుకొని ఉంటే అన్నాళ్లు నీవా పాపాలను మోస్తావు. నీవు వారి పాపాన్ని మూడు వందల తొంభై రోజులు[a] భరించాలి. ఈ ప్రకారం ఇశ్రాయేలు ఎంతకాలం శిక్షింపబడుతుందో నేను తెలియజేస్తున్నాను. ఒక్కరోజు ఒక్క సంవత్సరానికి సమానం.

“ఆ తరువాత నీవు కుడి ప్రక్కకి తిరిగి నలభై రోజులు పడుకోవాలి. ఈసారి నీవు యూదావారి పాపాలను నలభై రోజులపాటు భరిస్తావు. ఒక రోజు ఒక సంవత్సరానికి సమానం. యూదా ఎంతకాలం శిక్షింపబడాలో నేను నీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను.”

దేవుడు మళ్లీ మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు, “ఇప్పుడు నీవు నీ చొక్కా చేతిని పైకి మడిచి, ఆ ఇటుక మీదికి నా చేతినెత్తు. యెరూషలేము నగరంపై దాడి చేస్తున్నట్లు నీవు ప్రవర్తించు. నీవు నా తరఫు దూతగా మాట్లాడుతున్నట్లు చూపటానికి ఈ విధంగా చేయుము. ఇప్పుడు చూడు, నిన్నిప్పుడు తాళ్లతో కట్టుతున్నాను. నగరంపై నీ దాడి పూర్తయ్యేవరకు నీవు అటు, ఇటు కదలలేవు.”

దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “రొట్టె చేయటానికి నీవు కొంత ధాన్యాన్ని తీసుకొనిరా. కొన్ని గోధుమలు, బార్లీ బియ్యము (యవలు), చిక్కుడు గింజలు, పప్పులు, జొన్నలు, సజ్జలు తీసుకో. వీటన్నిటినీ కలిపి రోటిలో వేసి దంచి పిండి చేయుము. ఈ పిండిని ఉపయోగించి రొట్టె చేయుము. నీవు ప్రక్కకు తిరిగి పడుకొనే మూడువందల తొంభై రోజులూ ఈ రొట్టెనే తినాలి. 10 రొట్టెను చేయటానికి ఈ పిండిని రోజుకు ఒక గిన్నెడు (సుమారు ఇరవై తులాలు) మాత్రమే ఉపయోగించటానికి నీకు అనుమతి ఇవ్వబడింది. అవసరమైనప్పుడల్లా రోజంతా ఆ రొట్టెనే నీవు తినాలి. 11 ప్రతి రోజూ మూడు గిన్నెల నీరే నీవు తాగాలి. రోజంతా తగిన సమయానికి దానిని తాగాలి. 12 ప్రతిరోజూ నీ రొట్టెను నీవే చేసుకోవాలి. నీవు మనుష్యుల మలం తెచ్చి, ఎండబెట్టి, దానిని కాల్చాలి. మండే ఆ మనుష్యుల మలం మీద నీవు ఆ రొట్టెను కాల్చాలి. ప్రజల ఎదుట ఈ రొట్టెనే నీవు కాల్చితినాలి.” 13 మళ్లీ యెహోవా ఇలా చెప్పాడు: “ఈ పని చేయటం ద్వారా ఇశ్రాయేలు వంశీయులు పరాయి దేశాలలో అపరిశుభ్రమైన రొట్టెలు[b] తింటారని నీవు సూచిస్తావు. వారు ఇశ్రాయేలు వదిలి అన్యదేశాలకు పోయేలా నేను వారిని ఒత్తిడి చేశాను!”

14 అప్పుడు నేనిలా (యెహెజ్కేలు) అన్నాను, “అయ్యో, నా ప్రభువైన యెహోవా, నేనెన్నడూ అపరిశుద్ధ ఆహారాన్ని తినలేదు. వ్యాధిచే చచ్చిన జంతు మాంసంగాని, అడవి జంతువుచే చంపబడిన పశువుల మాంసాన్ని గాని నేను ఎన్నడూ తినియుండలేదు. నా చిన్ననాటి నుండి ఈ నాటి వరకు నేను ఎన్నడూ అపరిశుద్ధ ఆహారం ముట్టి ఎరుగను. ఆ దుష్ట మాంసమేదీ నానోట బడలేదు.”

15 అందుకు దేవుడీలా అన్నాడు: “సరే! నీ రొట్టెను కాల్చటానికి ఎండిన ఆవుపేడ ఉపయోగించేటందుకు నీకు అనుమతి ఇస్తున్నాను. ఎండిన మనిషి మలం నీవు వినియోగించనవసరం లేదు.”

16 దేవుడు ఇంకా ఇలా అన్నాడు, “నరపుత్రుడా, యెరూషలేముకు ఆహార పదార్థాల సరఫరాను నిలిపి వేస్తున్నాను. అందువల్ల ప్రజలు తగుమాత్రం రొట్టె తినవలసి వస్తుంది. వారి ఆహార పదార్థాల సరఫరా విషయమై వారు మిక్కిలి చింతిస్తారు. వారికి తాగే నీరు కూడా పరిమితమవుతుంది. ఆ నీటిని తాగినప్పుడు వారు మిక్కిలి భీతిల్లుతారు. 17 ఎందువల్లనంటే ప్రజలకు తినటానికి తిండి, తాగటానికి నీరు తగినంత ఉండదు. ప్రజలు ఒకరిని చూచి ఒకరు భయ కంపితులవుతారు. వారివారి పాపాల కారణంగా వారు చిక్కి శల్యాలైపోతారు.

కీర్తనలు. 40-41

సంగీత నాయకునికి: దావీదు కీర్తన.

40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
    నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
    ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
    ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
    యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
    వారు యెహోవాను నమ్ముకొంటారు.
ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
    ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
    ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
    మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
    నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.

యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
    బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
    దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
    నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
    నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
    యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
    ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
    నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
    నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.

12 దుష్టులు నన్ను చుట్టుముట్టారు.
    లెక్కించాలంటే వారు చాలా మంది ఉన్నారు.
నా పాపాలు నన్ను పట్టుకొన్నాయి.
    నేను వాటిని తప్పించుకోలేను.
నా తలమీది వెంట్రుకల కంటె నా పాపాలు ఎక్కువగా ఉన్నాయి.
    నేను ధైర్యాన్ని కోల్పోయాను.
13 యెహోవా, నా దగ్గరకు వేగంగా వచ్చి నన్ను రక్షించుము.
    త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
14 ఆ దుర్మార్గులు నన్ను చంపాలని చూస్తున్నారు.
    యెహోవా, ఆ మనుష్యులు సిగ్గుపడి, నిరాశ చెందేటట్టుగా చేయుము.
    ఆ మనుష్యులు నాకు హాని చేయాలని కోరుతున్నారు. వాళ్లను సిగ్గుతో పారిపోనిమ్ము.
15 ఆ చెడ్డ మనుష్యులు నన్ను ఎగతాళి చేస్తారు.
    వాళ్లు మాట్లాడలేనంతగా వారిని ఇబ్బంది పడనిమ్ము.
16 కాని నీకోసం చూచే మనుష్యుల్ని సంతోషంగా ఉండనిమ్ము.
    “యెహోవాను స్తుతించుము.” అని ఆ మనుష్యుల్ని ఎల్లప్పుడూ చెప్పనిమ్ము. నీ చేత రక్షించబడటం ఆ మనుష్యులకు ఎంతో ఇష్టం.

17 ప్రభూ, నేను కేవలం నిస్సహాయ, నిరుపేద మనిషిని.
    యెహోవా, నన్ను గూర్చి ఆలోచించుము.
నాకు సహాయం చేయుము.
    నన్ను రక్షించుము, నా దేవా, త్వరగా రమ్ము.

సంగీత నాయకునికి: దావీదు కీర్తన

41 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు.
    కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు.
ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు.
    ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి.
    దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు.
ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు
    యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు.

నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము.
    నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.”
నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు.
    “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు.
కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు.
    కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు.
ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు,
    మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు.
నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు.
    వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు.
“ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు.
    ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు.
నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు.
    నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు.
10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము.
    అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను.
11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల
    అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను.
12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి.
    నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు.

13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక.
    ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు.
ఆమేన్! ఆమేన్!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International