Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 24

దావీదు సౌలును అవమానపరచుట

24 సౌలు ఫిలిష్తీయులను తరిమివేసిన పిమ్మట, “దావీదు ఏన్గెదీ ఎడారిలో ఉంటున్నట్లు” ప్రజలు అతనికి చెప్పారు.

కనుక సౌలు ఇశ్రాయేలు అంతటినుండీ మూడువేలమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వారిని తీసుకొని వెళ్లి దావీదు కొరకు, అతని అనుచరుల కొరకు వెతకటం మొదలు పెట్టాడు. అడవి మేక బండలు అనే చోట వారు వెదికారు. సౌలు బాట ప క్కగావున్న గొర్రెల మంద వద్దకు వచ్చి అక్కడ ఉన్న ఒక గుహలోకి కాలకృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లాడు. ఆ గుహలోనే చాలా లోపల దావీదు, అతని మనుష్యులు దాగివున్నారు. సౌలును చూసి దావీదు అనుచరులు అతనితో “యెహోవా చెప్పిన రోజు ఇదే. ‘నీ శత్రువును నీకు అప్పగిస్తాను కనుక ఇప్పుడు నీ శత్రువును నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అని యెహోవా నీతో చెప్పాడు గదా!’” అన్నారు.

అప్పుడు దావీదు మెల్లగా సౌలు వద్దకు పాకుతూ వెళ్లి, సౌలు అంగీని ఒక కొన కోసివేశాడు. సౌలు దావీదును గమనించలేదు. కానీ తర్వాత సౌలు అంగీని కోసివేసినందుకు దావీదు బాధపడ్డాడు. “నా యజమానికి నేను ఇలాంటి పని చేయకుండా యెహోవా నన్ను నివారించునుగాక! సౌలు యెహోవా నియమించిన రాజు. సౌలు యెహోవాచే అభిషేకింపబడిన రాజు గనుక సౌలుకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయకూడదు” అని దావీదు తన మనుష్యులతో అన్నాడు. కోపోద్రేకులైన తన మనుష్యులను అదుపు చేయటానికి దావీదు ఈ మాటలు చెప్పాడు. దావీదు వారిని సౌలు మీదికి పోనియ్యలేదు.

సౌలు గుహ వదిలి తన దారిన వెళ్లిపోయాడు. అతని వెనుకనే దావీదు బయటికి వచ్చి, “రాజా నా ప్రభూ” అని కేక వేసాడు. సౌలు వెనుదిరిగి చూశాడు. దావీదు వంగి నమస్కరించాడు. “దావీదు నీకు హాని చేయ చూస్తున్నాడని ప్రజలు చెబితే నీవెందుకు ఆ మాటలు వింటున్నావు? 10 యెహోవా ఈ రోజున గుహలో నిన్ను నాకు ఎలా అప్పగించాడో నీ కళ్లతో నీవే చూశావు. కానీ నిన్ను చంపటానికి నేను నిరాకరించాను. నేను నీపట్ల కనికరము చూపాను. ‘సౌలు యెహోవా చేత అభిషేకించబడిన రాజు. నా యజమానికి నేను కీడు చేయను’ అని నేననుకున్నాను. 11 ఇదిగో నీ రాజవస్త్రం ముక్క నా చేతిలో ఉంది చూడు! దీనిని నీ అంగీ నుండి ఒక మూల కోశాను. నిన్ను నేను చంపగలిగి ఉండేవాడిని కానీ చంపలేదు. ఇప్పుడైనా నీవు అర్థం చేసుకో. నేను నీకు ఏ కీడూ తలపెట్టలేదు. నేను నీ ఎడల ఏ తప్పూ చేయలేదు. కాని నీవు మాత్రం నన్ను చంపే ప్రయత్నంలో వెంటాడుతున్నావు. 12 యెహోవాయే న్యాయం తీర్చును గాక! నీవు నాపట్ల తలపెట్టిన కీడుకు యెహోవా నిన్ను శిక్షించవచ్చును. కాని నాకై నేను నీతో పోరాడను. 13 దుష్టులనుండి దుష్టకార్యాలే వస్తాయనే ఒక పాత సామెత ఉంది.

‘కానీ నేను దుర్మార్గం ఏమీ చేయలేదు.’

“నేను దుర్మార్గుడిని కాదు. నేను నీకు హాని చేయను. 14 ఇంతకూ నీవు తరుముచున్నది ఎవరిని? ఇశ్రాయేలు రాజు పోరాడేందుకు వస్తున్నది ఎవరిమీదికి? నిన్ను గాయపర్చే వారినెవరినో నీవు వెంటాడటం లేదు! ఏదో ఒక చచ్చిన కుక్కనో, లేక ఈగనో నీవు తరుము తున్నట్టుగా ఉంది. 15 యెహోవాయే న్యాయమూర్తిగా ఉండి నీకూ నాకూ మధ్య న్యాయం తీర్చును గాక! యెహోవా నన్ను బలపర్చి నేను నిర్దోషినని నిరూపిస్తాడు. ఆయన నన్ను నీ బారినుండి రక్షిస్తాడు” అని రాజైన సౌలుతో దావీదు చెప్పాడు.

16 దావీదు తన మాట ముగించగానే, సౌలు “దావీదూ! నా కుమారుడా, అది నీ స్వరమేనా?” అంటూ ఏడ్వటం మొదలుపెట్టాడు. సౌలు చాలా ఏడ్చాడు. 17 “అవును నీవు చెప్పింది వాస్తవమే. నేనే తప్పు చేశాను. నీవు నాపట్ల చాలా మంచితనం చూపించావు. కాని నేనే నీపట్ల చెడుగా ప్రవర్తించాను. 18 నీవు చేసిన మంచి పనులన్నీ నాకు నీవు చెప్పావు. యెహోవా నన్ను నీ వద్దకు తీసుకుని వచ్చాడు. అయినా నీవు నన్ను చంపలేదు. 19 ఇది నీవు నా శత్రువు కాదని నిరూపిస్తుంది. శత్రువు చేజిక్కినపుడు మంచితనంతో ఎవరూ విడిచి పెట్టరు. శత్రువుకు ఎవరూ మేలు చేయరు. ఈ రోజు నీవు నాపట్ల ఇంత మంచిగా ప్రవర్తించినందుకు యెహోవా నీకు ప్రతిఫలం దయచేయును గాక! 20 నీవు ఖచ్చితంగా రాజువు అవుతావని నాకు తెలుసు. ఇశ్రాయేలు రాజ్యాన్ని నీవు పరిపాలిస్తావు. 21 ఇప్పుడు నాకొక మాట ఇవ్వు. యెహోవా నామం పేరిట నీవు నా సంతతి వారిని హతమార్చనని మాటయివ్వు. నా తండ్రి వంశం నుంచి నా పేరు తుడిచివేయనని నీవు నాకు ప్రమాణం చేసి చెప్పు.” అన్నాడు సౌలు.

22 కనుక సౌలుకు దావీదు వాగ్దానం చేసాడు. సౌలు కుటుంబాన్ని నాశనం చేయనని దావీదు వాగ్దానం చేశాడు. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వెళ్లాడు. దావీదు తన అనుచరులతో కొండ స్థలాలకు వెళ్లిపోయాడు.

1 కొరింథీయులకు 5

నీతిలేని సోదరుణ్ణి బహిష్కరించండి

మీలో లైంగిక అవినీతి బాగా వ్యాపించి పోయిందని నాకు సృష్టంగా తెలిసింది. అలాంటి అవినీతి, క్రైస్తవులు కానివాళ్ళలో కూడా లేదు. ఒకడు తన సవతి తల్లితో సంబంధం పెట్టుకొన్నాడని విన్నాను. ఇది గర్వించతగిన విషయమా? ఇది చాలా దుఃఖించవలసిన విషయము. ఈ పని చేసినవాణ్ణి మీరు సంఘం నుండి బహిష్కరించవలసి ఉంది. నేను శరీరముతో మీ దగ్గర లేకున్నా నా ఆత్మలో మీతో ఉన్నాను. నేను మీతో ఉన్నట్లు భావించి ఈ అపరాధము చేసిన వానిపై తీర్పు చెపుతున్నాను. మీరు యేసు ప్రభువు పేరిట సమావేశమైనప్పుడు నా ఆత్మలో మీతో ఉంటాను. యేసు ప్రభువు శక్తి మీలో ఉంటుంది. అప్పుడు అతణ్ణి సాతానుకు అప్పగించండి. తద్వారా వాని పాపనైజం నశించి అతని ఆత్మ మన ప్రభువు వచ్చిన రోజున రక్షింపబడుతుంది.

“పులుపు కొంచెమైనా, పిండినంతా పులుపు చేస్తుందని తెలియదా? మీరు గర్వించటం మంచిది కాదు.” పులిసిన పాత పిండిని పారవేయండి. క్రీస్తు మన పస్కా గొఱ్ఱెపిల్లగా బలి ఇవ్వబడ్డాడు. అప్పుడు మీరు క్రొత్త పిండిలా ఉంటారు. నిజానికి మీరు పులియని క్రొత్త పిండివంటివాళ్ళు. కనుక పులియని రొట్టెతో పండుగ చేసుకొందాము. ద్వేషంతో, పాపంతో కూడుకొన్న పాత పులిసిన పిండితో కాక నిష్కపటంతోనూ, సత్యంతోనూ కూడుకొన్న పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాము.

నేను నా లేఖల్లో లైంగిక అవినీతి కలవాళ్ళతో సాంగత్యం చేయవద్దని వ్రాసాను. 10 అంటే, సంఘానికి చెందని అవినీతిపరులతో, లోభులతో, మోసగాళ్ళతో, విగ్రహారాధకులతో సాంగత్యం చేయవద్దని నేను చెప్పటం లేదు. అలా చేస్తే మీరు ఈ ప్రపంచాన్నే వదిలివేయవలసి వస్తుంది. 11 నేను ప్రస్తుతం వ్రాసేది ఏమిటంటే తాను సోదరుణ్ణని చెప్పుకొంటూ, లైంగిక అవినీతితో జీవించేవానితో, లోభత్వం చేసేవానితో, విగ్రహారాధన చేసేవానితో, ఇతరులను దూషించేవానితో, త్రాగుబోతుతో, మోసం చేసేవానితో, సహవాసం చేయవద్దని చెపుతున్నాను. అలాంటి వానితో కలిసి భోజనం కూడా చేయవద్దు.

12 సంఘానికి చెందనివానిపై తీర్పు చెప్పే అధికారం నాకు లేదు. కాని సంఘంలో ఉన్నవానిపై తీర్పు చెప్పవలసిన అవసరం ఉంది. 13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.”(A) కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు.

యెహెజ్కేలు 3

దేవుడు నాతో ఇలా చెప్పాడు: “ఓ నరపుత్రుడా, నీవు చూస్తున్న దానిని తిను. ఈ గ్రంథపు చుట్టను తిని, ఇశ్రాయేలు వంశం వారికి దీనిలోనున్న విషయాలన్నిటినీ తెలియజెప్పు.”

ఆ తరువాత నేను నా నోరు తెరువగా, అతడు గ్రంథపు చుట్టను నాకు తినిపించెను. పిమ్మట దేవుడు ఇలా అన్నాడు: “నరపుత్రుడా, ఈ కాగితం చుట్టను నీకిస్తున్నాను. దానిని మ్రింగివేయి! ఆ గ్రంథపు చుట్ట నీ శరీరాన్ని నింపివేయనీ.”

నేను దానిని తినేశాను. అది తేనెలా మధురంగా ఉంది.

అప్పుడు దేవుడు నాతో ఇలా అన్నాడు, “నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశంవారి వద్దకు వెళ్లు. వారికి నా మాటలన్నీ తెలియజేయుము. భాష తెలియని పరదేశీయుల వద్దకు నిన్ను నేను పంపటంలేదు. ఏ ఇతర భాషను నీవు నేర్చుకునే పనిలేదు. నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వారివద్దకు పంపుతున్నాను! నీవు అర్థం చేసుకోలేని పలుభాషలు మాట్లాడే అనేక ఇతర దేశాల ప్రజల వద్దకు నేను నిన్ను పంపటం లేదు. నీవు గనుక వారి వద్దకు వెళ్లి మాట్లాడితే వారు వింటారు. కాని నీవాకఠిన భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. లేదు! నేను నిన్ను ఇశ్రాయేలు వంశం వద్దకు పంపుతున్నారు. వారున్నారే వారు తల బిరుసు కలిగి ఉన్నారు. వారు చాలా మొండివారు! ఇశ్రాయేలీయులు నీవు చెప్పేది వినటానికి నిరాకరిస్తారు. వారు నా మాట వినదల్చుకోలేదు! కాని వారు ఎంత మొండివారో, నిన్ను కూడా అంత మొండివానిగా నేను చేస్తాను. నీ తల కూడా వారి తలలా కఠినంగా ఉంటుంది! చెకుముకిరాయి కంటె వజ్రం కఠినమైనది. అదే రకంగా, నీ తల వారి తలకంటె గట్టిగా తయారవుతుంది. నీవు మిక్కిలి మొండిగా ఉంటావు. అందువల్ల వారంటే నీవు భయపడవు. ఎల్లప్పుడూ నా మీద తిరుగుబాటు చేసే ఆ ప్రజలంటే నీవు భయపడవు.”

10 ఇంకా దేవుడు ఇలా చెప్పాడు, “నరపుత్రుడా, నేను నీకు చెప్పే ప్రతీ మాటను వినాలి. విని, వాటిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 11 పిమ్మట దేశాన్నుండి వెళ్ల గొట్ట బడిన నీ ప్రజలందరి వద్దకు వెళ్లు. వారి వద్దకు వెళ్లి, ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని పలుకు. వారు వినరు. వారు పాపం చేయటం మానరు. అయినా నీవు ఈ విషయాలు చెప్పాలి.”

12 పిమ్మట గాలి (ఆత్మ) నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం, “యెహోవా మహిమ ధన్యమైనది!” అని పలికింది. 13 ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది. 14 గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది! 15 టెల్ అవీవ్‌కు[a] బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లాను. ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ కూర్చుంటిని.

ఇశ్రాయేలు కావలివాడు

16 ఏడు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 17 “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి నీవు వారికి హెచ్చరిక చేయాలి. 18 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.

19 “ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం మానమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు.

20 “లేదా, ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు చేయటం మొదలు పెడతాడు. దానితో అతడు చనిపోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు.

21 “నీవొక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చరిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక చేయటం, అతడు నీ మాటను వినటం జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”

22 పిమ్మట యెహోవా హస్తం ఆ స్థలంలో నా మీదికి వచ్చింది. “లెమ్ము; లోయలోకి వెళ్లు. అక్కడ నేను నీతో మాట్లాడతాను” అని దేవుడు నాకు చెప్పాడు.

23 నేను లేచి లోయలోకి వెళ్లాను. యెహోవా మహిమ అక్కడ ఉంది. గతంలో నేను కెబారు కాలువవద్ద చూసినట్లే అది ఉంది. నేను శిరస్సు నేలకు ఆన్చి సాష్టాంగ నమస్కారం చేశాను. 24 కాని, ఇంతలో ఒక గాలి (ఆత్మ) వచ్చి నన్ను నా పాదాలపైకి లేపింది. ఆయన నాతో ఇలా అన్నాడు, “నీవు ఇంటికి వెళ్లి లోపల కూర్చుని గడియపెట్టుకో. 25 ఓ నరపుత్రుడా, ప్రజలు నీ వద్దకు వచ్చి, నిన్ను తాళ్లతో బంధిస్తారు. వారు నిన్ను ప్రజల మధ్యకు వెళ్లనీయరు. 26 నేను నీ నాలుకను నీ అంగిలి గుంటలో అతుక్కుపోయేలా చేస్తాను. దానితో నీవు మాట్లాడలేవు. అందువల్ల వారు తప్పు చేస్తున్నట్లు వారికి చెప్పే మనుష్యుడెవ్వడూ ఉండడు. ఎందువల్లనంటే ఆ జనులు నా మీద ఎల్లప్పుడూ తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. 27 కాని నేను నీతో మాట్లాడతాను. పిమ్మట నీవు మళ్లీ మాట్లాడటానికి అనుమతిస్తాను. అయితే నీవు మాత్రం ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు’ అని వారికి చెప్పాలి. ఏ వ్యక్తి అయినా వినగోరితే మంచిదే. ఎవ్వరూ వినటానికి ఇష్టపడకపోయినా మంచిదే. ఆ ప్రజలు ఎల్లప్పుడూ నాకు వ్యతిరేకులవుతూ ఉన్నారు.

కీర్తనలు. 39

సంగీత నాయకునికి, యెదూతూనునకు: దావీదు కీర్తన.

39 “నేను జాగ్రత్తగా నడచుకొంటాను.
    నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను.
    నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను.[a]

మాట్లాడుటకు నేను తిరస్కరించాను.
    నేనేమి చెప్పలేదు.
    కాని నేను నిజంగా తల్లడిల్లిపోయాను.
నాకు కోపం వచ్చింది.
    దీని విషయం నేను తలంచిన కొలది నాకు మరింత కోపం వచ్చింది.
    కనుక నేను ఏదో అన్నాను.

యెహోవా, నాకు ఏమి జరుగుతుందో చెప్పుము.
    నేను ఎన్నాళ్లు జీవిస్తానో నాకు చెప్పుము.
    నిజానికి నా జీవితం ఎంత కొద్దిపాటిదో నాకు చెప్పుము.
యెహోవా, నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు.
    నా జీవితం నీ ఎదుట శూన్యం.
ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.

మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబింబం వంటిది.
    మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము.
    కాని ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.

కనుక ప్రభూ, నాకు ఏమి ఆశ ఉంది?
    నీవే నా ఆశ.
యెహోవా, నేను చేసిన చెడు కార్యాలనుండి నీవు నన్ను రక్షిస్తావు.
    దేవునియందు నమ్మకము లేనివానిలా, వెర్రివాడిలా నన్ను యితరులు చూడకుండా నీవు చేస్తావు.
నేను నా నోరు తెరవను.
    నేను ఏమీ చెప్పను.
    యెహోవా, నీవు చేయవలసింది చేశావు.
10 దేవా, నన్ను శిక్షించటం మానివేయుము.
    నీ శిక్షవల్ల నేను అలసిపోయాను.
11 యెహోవా, తప్పు చేసినవారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు.
    వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు.
    మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.

12 యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
    నేను నీకు మొరపెట్టే మాటలు వినుము.
    నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు.
నేను దాటిపోతున్న ఒక అతిథిని.
    నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.
13 యెహోవా, నా వైపు చూడకుము. నేను చనిపోక ముందు నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
    కొంచెంకాలంలో నేను ఉండకుండా పోతాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International