Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 23

దావీదు కెయీలాకు వెళ్లటం

23 అక్కడి ప్రజలు దావీదుతో, “ఫిలిష్తీయులు కెయీలా రాజ్యంపై యుద్ధం చేస్తున్నారనీ, నూర్చెడి కళ్లాలనుండి ధాన్యాన్ని కొల్ల గొడుతున్నారనీ” చెప్పారు.

“నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా?” అని దావీదు యెహోవాను అడిగాడు.

“వెళ్లు. ఫిలిష్తీయులను ఎదుర్కొని కెయీలాను కాపాడు.” అని యెహోవా దావీదుకు సమాధానమిచ్చాడు.

కాని దావీదు మనుష్యులు, “మనము యూదాలోనే ఉండి భయపడి పోతున్నాము. ఇక ఫిలిష్తీయుల సైన్యంవున్న చోటికి వెళితే మా భయానికి అంతువుండదు” అన్నారు.

దావీదు మళ్లీ యెహోవాను అడిగాడు. యెహోవా, “కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను జయించటానికి నేను నీకు సహాయం చేస్తాను” అని దావీదుకు జవాబిచ్చాడు. అప్పుడు దావీదు తన మనుష్యులతో కెయీలాకు వెళ్లాడు. దావీదు మనుష్యులు ఫిలిష్తీయులతో యుద్ధం చేసి, వారిని ఓడించి, వారి పశువులను పట్టుకున్నారు. దావీదు ఫిలిష్తీయులను చిత్తుగా ఓడించి వారి బారినుండి కెయీలా ప్రజలను రక్షించాడు. (అహీమెలెకు కుమారుడు అబ్యాతారు దావీదు వద్దకు పారిపోయినప్పుడు తనతో ఏఫోదు అనబడే యాజకుల అంగీని ఒక దానిని తీసుకొని వెళ్లాడు).

దావీదు కెయీలాలో ఉన్నట్లు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని, “దేవుడు దావీదును నాకిచ్చినట్టే! దావీదు తనకు తాను బోనులో పడ్డాడు. ఎందువల్ల నంటే అతను చుట్టూ ద్వారాలు కటకటాలు ఉన్న పట్టణంలో ప్రవేశించాడు” అన్నాడు సౌలు. సౌలు తన సైన్యాన్ని సమీకరించుకొని, యుద్ధానికి సిద్ధమయ్యాడు. దావీదును, అతని అనుచరులను ఎదిరించటానికి సౌలు సైన్యం కెయీలాకు వెళ్లేందుకు తయారయింది.

తన మీద సౌలు పన్నాగం పన్నుతున్నాడని దావీదు తెలుసుకున్నాడు. “ఏఫోదు తీసుకురా” అని దావీదు అబ్యాతారుకు చెప్పాడు.

10 దావీదు ఇలా ప్రార్థన చేశాడు: “ఇశ్రాయేలీయుల యెహోవా దేవా! నా మూలంగా సౌలు కెయీలా పట్టణానికి వచ్చి దానిని నాశనం చేయ సంకల్పించాడని విన్నాను. 11 సౌలు కెయీలాకు వస్తాడా? కెయీలా ప్రజలు నన్ను సౌలుకు అప్పగిస్తారా? ఇశ్రాయేలీయుల యెహోవా దేవా, నేను నీ సేవకుడను! దయచేసి నాకు చెప్పు.”

“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.

12 దావీదు, “కెయీలా ప్రజలు నన్ను, నా మనుష్యులను సౌలుకు అప్పగిస్తారా?” అని మళ్లీ అడిగాడు.

“అవును!” అని యెహోవా జవాబిచ్చాడు.

13 అది విన్న దావీదు తన మనుష్యులతో కెయీలా వదిలి వెళ్లిపోయాడు. దావీదుతో ఆరువందల మంది వెళ్లారు. ఒక చోటనుండి మరొక చోటికి వారు తరలిపోయారు. దావీదు కెయీలానుండి తప్పించుకున్నాడని విన్న సౌలు కెయీలా నగరానికి వెళ్లలేదు.

సౌలు దావీదును వెంటాడుట

14 దావీదు అరణ్యములో ఉన్న దుర్గాలలోను, జీపు అరణ్యంలోని కొండలలోను తలదాచుకున్నాడు. ప్రతి రోజూ సౌలు దావీదు కోసం వెదుకుతూ ఉండేవాడు. కానీ యెహోవా దావీదును సౌలు పట్టుకొనేలా చేయలేదు.

15 జీపు అరణ్యంలో హోరేషు వద్ద ఉన్నాడు దావీదు. సౌలు తనను చంపటానికి వస్తున్నాడని భయపడ్డాడు. 16 కానీ సౌలు కుమారుడు యోనాతాను హోరేషులో ఉన్న దావీదును చూడటానికి వెళ్లాడు. యోనాతాను దావీదుకు యెహోవా మీద దృఢవిశ్వాసం కలిగేందుకు సహాయం చేసాడు. 17 యోనాతాను, “భయపడకు, నా తండ్రి సౌలు నిన్ను తాకలేడు. నీవు ఇశ్రాయేలుకు రాజువవుతావు. నేను నీ తరువాత స్థానంలో ఉంటాను. ఇది నా తండ్రికి కూడా తెలుసు” అన్నాడు దావీదుతో.

18 యోనాతాను, దావీదు ఇద్దరూ యెహోవా ఎదుట ఒక ఒడంబడిక చేసుకున్నారు. తరువాత యోనాతాను ఇంటికి వెళ్లిపోయాడు. దావీదు హోరేషులో ఉండిపోయాడు.

జీపు ప్రజలు దావీదు గురించి సౌలుకు చెప్పుట

19 గిబియాలో ఉన్న సౌలు వద్దకు జీపు ప్రజలువచ్చి, “తమ రాజ్యంలో దావీదు దాగియున్నట్లు చెప్పారు. యెషిమోనుకు దక్షిణంగా ఉన్న హకీలా కొండ మీద వున్న హోరోషు కోటలో దావీదు ఉన్నట్లు చెప్పారు. 20 ఓ రాజా! ఇప్పుడు మీరు ఏ సమయంలో వచ్చినా దావీదును మీకు పట్టి ఇచ్చే బాధ్యత మాది” అని అన్నారు.

21 అందుకు సౌలు, “నాకు సహాయం చేస్తున్నందుకు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక! 22 వెళ్లండి. అతని గురించి ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకొనండి. దావీదు ఎక్కడ ఉంటున్నాడో కనుగొనండి. అతనిని అక్కడ ఎవరు చూశారో కూడా తెలుసుకోండి. సౌలు కంటె దావీదు తెలివైనవాడు, కనుక తనను మోసగిస్తాడు అని అనుకున్నాడు. 23 దావీదు దాక్కొనే స్థలాలన్నీ కూడ తెలుసుకోండి. మళ్లీ నా వద్దకు వచ్చి నాకు పూర్తి సమాచారం తెలియజేయండి. అప్పుడు నేను మీతో వస్తాను. దావీదు ఆ ప్రాంతంలోనే ఉంటే నేను వానిని కనుగొంటాను. అవసరమైతే యూదాలో ప్రతి ఇంటిని శోధించైనా సరే వానిని కనుక్కుంటాను” అన్నాడు.

24 అప్పుడు జీపువాళ్లు జీపుకు తిరిగి వెళ్లిపోయారు. సౌలు తరువాత అక్కడికి వెళ్లాడు.

దావీదు, అతని అనుచరులు మాయోను అరణ్యంలో ఉన్నారు. అది యెషీమోనుకు దక్షిణంగా ఉన్న ఎడారి ప్రాంతం. 25 సౌలు, అతని సైనికులు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు. కాని సౌలు అతనికొరకు వస్తున్నాడని ప్రజలు దావీదును హెచ్చరించారు. దావీదు మాయోను అరణ్యంలోని “కొండ” కు వెళ్లాడు. ఇది సౌలు తెలుసుకున్నాడు. సౌలు దావీదును వెతుక్కుంటూ మాయోను అరణ్యానికి వెళ్లాడు.

26 పర్వతానికి ఒక ప్రక్కన సౌలు ఉన్నాడు. దావీదు, అతని మనుష్యులు అదే పర్వతానికి మరో వైపున ఉన్నారు. సౌలునుండి దూరంగా పోవటానికి దావీదు తొందర పడుతూ ఉన్నాడు. కానీ దావీదును సపరివారంగా పట్టుకోవాలని సౌలు, అతని సైనికులు ఆ పర్వతం చుట్టూ తిరుగుట ప్రారంభించారు.

27 ఒక సందేశకుడు సౌలు వద్దకు వచ్చి, “ఫిలిష్తీయులు తమ రాజ్యం మీదికి దండెత్తి వస్తున్నారనీ” త్వరగా రమ్మనీ చెప్పాడు.

28 అంతటితో సౌలు దావీదును వెంటాడటం మాని ఫిలిష్తీయులను ఎదుర్కోటానికి వెళ్లాడు. అందువల్ల ప్రజలు ఈ ప్రదేశానికి, “జారుడు బండ”[a] అని పేరు పెట్టారు. 29 దావీదు మోయోను ఎడారి వదలి ఏన్గెదీ దగ్గర ఉన్న కొండస్థలాలకు వెళ్లాడు.

1 కొరింథీయులకు 4

క్రీస్తు యొక్క అపొస్తలులు

అందువల్ల మమ్మల్ని మీరు క్రీస్తు సేవకులుగా, దేవుని రహస్యాలు అప్పగింపబడ్డ వాళ్ళుగా పరిగణించండి. బాధ్యత అప్పగింపబడిన సేవకుడు ఆ బాధ్యతను నమ్మకంతో నిర్వర్తించాలి. మీరు నాపై తీర్పు చెప్పినా, ఇతరులు తమ నియమాల ప్రకారము తీర్పు చెప్పినా నేను లెక్కచెయ్యను. నాపై నేనే తీర్పు చెప్పుకోను. నా మనస్సు నిర్మలమైనది. అంత మాత్రాన నేను నిర్దోషినికాను. ప్రభువు నాపై తీర్పు చెపుతాడు. అందువల్ల తీర్పు చెప్పే సమయం వచ్చే దాకా, ఎవరిమీదా తీర్పు చెప్పకండి. ప్రభువు వచ్చేదాకా ఆగండి. ఆయన చీకట్లో దాగివున్నదాన్ని వెలుగులోకి తెస్తాడు. మానవుల హృదయాల్లో దాగివున్న ఉద్దేశ్యాలను బహిరంగ పరుస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తగిన విధంగా దేవుని మెప్పు పొందుతాడు.

సోదరులారా! “లేఖనాల్లో వ్రాయబడినవాటిని అతిక్రమించకండి” అనే లోకోక్తి యొక్క అర్థం మీరు నేర్చుకోవాలని, దానివల్ల మీరు లాభం పొందాలని మేము, అంటే నేను, అపొల్లో ఆ లోకోక్తి ప్రకారం నడుచుకొన్నాము. మీరు ఒకరిని పొగిడి యింకొకరిని ద్వేషించకండి. ఇతరులకన్నా మీలో ఏమి ప్రత్యేకత ఉంది? మీదగ్గరున్నవన్నీ మీరు దేవుని నుండే కదా పొందింది. మరి అలాంటప్పుడు మీకు అవి దేవుడు యివ్వనట్లు ఎందుకు చెప్పుకొంటున్నారు?

ఇప్పటికే మీకు కావలసినవన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీరు ధనవంతులైపొయ్యారు. మేము రాజులం కాకపోయినా, మీరు రాజులైపొయ్యారు. మీరు నిజంగా రాజులు కావాలని మా అభిలాష. అప్పుడు మేము మీతో సహా రాజులమౌతాము. మరణ శిక్ష పొందిన నేరస్థుల్లాగా, దేవుడు అపొస్తులులమైన మమ్మల్ని చివరన ఉంచాడు. లోకమంతటికీ, దేవదూతలకు, మానవులకు అపొస్తులమైన మేము ప్రదర్శనా వస్తువులయ్యాము. 10 క్రీస్తు కొరకు మేము మూర్ఖులమయ్యాము. కాని మీరు క్రీస్తు విషయంలో తెలివిగా నడచుకొన్నారు. మేము బలహీనులము. మీరు బలవంతులు. మీకు గౌరవం లభిస్తోంది. మాకు అవమానం లభిస్తోంది. 11 ఇప్పటికీ మేము ఆకలిదప్పులతో బాధపడ్తున్నాము. చినిగిన దుస్తులు వేసుకొని జీవిస్తున్నాము. నిర్దాక్షిణ్యమైన హింసలు అనుభవిస్తున్నాము. మాకు ఇల్లు వాకిలి లేదు. 12 మేము మా చేతుల్తో కష్టపడి పనిచేస్తున్నాం. మమ్మల్ని దూషించిన వాళ్ళను మేము దీవిస్తున్నాం. మాకు శిక్ష విధిస్తే అనుభవిస్తాం. 13 అవమానిస్తే, మర్యాదగా సమాధానం చెపుతున్నాం. ఇంతదాకా మేము ఈ ప్రపంచానికి చెందిన చెత్తలాగా, పారవేసిన కసువులాగా చూడబడ్డాము.

14 మిమ్మల్ని సిగ్గుపరచాలని ఇలా వ్రాయటంలేదు. నా పుత్రులవలె ప్రేమించి హెచ్చరిస్తున్నాను. 15 క్రీస్తులో మీకు పదివేల మంది ఉపదేశకులు ఉన్నా మీకు తండ్రులు అనేకులు లేరు. యేసు క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితం మూలంగా సువార్త తెచ్చి మీకు తండ్రినయ్యాను. 16 కనుక నన్ను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. 17 ఈ కారణంగా నాకు ప్రియమైన నా కుమారునిలాంటి తిమోతిని, మీ దగ్గరకు పంపుతున్నాను. తిమోతి ప్రభువు ప్రేమించిన కుమారుడు. అతడు యేసు క్రీస్తుతో నేను సాగిస్తున్న జీవిత విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఈ జీవిత విధానాన్ని గురించి ప్రతి సంఘంలో బోధిస్తుంటాను.

18 నేను రాననుకొని మీలో కొందరు గర్వాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టారు. 19 కాని ప్రభువు చిత్తమైతే నేను త్వరలోనే వస్తాను. గర్వంతో మాట్లాడుతున్నవాళ్ళు ఏమి చెయ్యకలుగుతారో చూస్తాను. 20 దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు. అది శక్తితో కూడినది. 21 మీకేమి కావాలి? మిమ్మల్ని శిక్షించటానికి మీ దగ్గరకు రావాలా? లేక దయ, ప్రేమ చూపటానికి రావాలా?

యెహెజ్కేలు 2

యెహోవా యెహెజ్కేలుతో మాట్లాడటం

ఆ స్వరం, “నరపుత్రుడా, లెమ్ము; నేను నీతో మాట్లాడదలిచాను” అని అన్నది.

ఇంతలో ఒకగాలి వచ్చి నన్ను నా పాదాలమీద నిలబెట్టింది. ఆ వ్యక్తి (దేవుడు) చెప్పేది నేను విన్నాను. ఆయన ఇలా చెప్పాడు, “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలు వంశం వారితో మాట్లాడటానికి నిన్ను నేను పంపుతున్నాను. ఆ ప్రజలు అనేక సార్లు నాకు వ్యతిరేకులయ్యారు. వారి పూర్వీకులు కూడా నాపై తిరుగుబాటు చేశారు. వారు నా పట్ల అనేకసార్లు పాపం చేశారు. ఈనాటికీ వారు నాపట్ల పాపం చేస్తూనే వున్నారు. ఆ ప్రజలతో మాట్లాడటానికి నేను నిన్ను పంపుతున్నాను. కాని వారు చాలా మొండివారయ్యారు. వారు తలబిరుసు కలిగినవారు. అయినా, నీవు వారితో తప్పక మాట్లాడాలి. ‘మన ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు’ అని నీవు అనాలి. కాని ఆ ప్రజలు నీ మాట వినరు. వారు నా పట్ల పాపం చేయటం మానరు. ఎందువల్లనంటే వారు మిక్కిలిగా తిరుగబడే స్వభావం గలవారు. వారు ఎల్లప్పుడూ నాపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు! కాని నీవావిషయాలు చేప్పాలి. దానితో వారిమధ్య ఒక ప్రవక్త నివసిస్తున్నాడని వారు తెలుసుకుంటారు.

“ఓ నరపుత్రుడా, ఆ ప్రజలకు నీవు భయపడవద్దు, వారు చెప్పేవాటికి నీవు భయపడకు, వారు నీకు వ్యతిరేకులై, నీకు హాని చేయటం ఖాయం. వారు ముండ్లవంటి వారు. తేళ్లమధ్య నివసిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. కాని వారు చెప్పేవాటికి నీవు భయపడవద్దు. వారు తిరుగుబాటుదారులు. అయినా వారికి నీవు భయపడవద్దు. నేను చేప్పే విషయాలు నీవు వారికి తప్పక తెలియజేయాలి. వారు నీ మాట వినరని నాకు తెలుసు. పైగా నా పట్ల పాపం చేయటం వారు మానరు. ఎందువల్లనంటే వారు తిరుగబడే స్వభావం గలవారు.

“ఓ నరపుత్రుడా, నేను నీకు చెప్పే విషయాలు శ్రద్ధగా విను. ఆ తిరుగుబాటుదారుల్లా నీవు నాకు వ్యతిరేకం కావద్దు. నీ నోరు తెరచి, నా మాటలు స్వీకరించు. తిరిగి వాటిని ప్రజలకు తెలియజెప్పు. ఈ మాటలను నీవు జీర్ణించుకో.”

తరువాత నేను (యెహెజ్కేలు) ఒక చేయి నా మీదికి రావటం చూశాను. ఆ చేతిలో వ్రాయబడిన గ్రంథపు చుట్ట ఉంది. 10 చుట్టబడిన ఆ కాగితాన్ని విడదీసి చూడగా దానిమీద రెండు వైపులా వ్రాసివుంది. అందులో రకరకాల విషాద గీతికలు, విషాద గాథలు, హెచ్చరికలు ఉన్నాయి.

కీర్తనలు. 38

జ్ఞాపకార్థ దినం[a] కోసం దావీదు కీర్తన.

38 యెహోవా, నీవు నన్ను విమర్శించేటప్పుడు కోపగించకు.
    నీవు నన్ను సరిదిద్దేటప్పుడు కోపగించకుము.
యెహోవా, నీవు నన్ను బాధించావు.
    నీ బాణాలు లోతుగా నాలో గుచ్చుకొన్నాయి.
నీవు నన్ను శిక్షించావు. నా శరీరం అంతా బాధగా ఉంది.
    నేను పాపం చేశాను, నీవు నన్ను శిక్షించావు. అందుచేత నా ఎముకలన్నీ బాధగా ఉన్నాయి.
నేను చెడు కార్యాలు చేసిన దోషిని,
    ఆ దోషం నా భుజాలమీద పెద్ద బరువుగా ఉంది.
నేను తెలివితక్కువగా ఉన్నాను.
    ఇప్పుడు నాకు అవి కంపుకొడ్తున్న పుండ్లు అయ్యాయి.
నేను దుఃఖించేవానిలా రోజంతా విచారంగా ఉన్నాను.
    రోజంతా నేను కృంగిపోయి ఉన్నాను.
నా నడుము వేడిగా కాలిపోతోంది.
    నా శరీరం అంతా బాధగా ఉంది.
నేను పూర్తిగా బలహీనంగా ఉన్నాను.
    నేను బాధతో ఉన్నాను గనుక నేను మూలుగుతున్నాను.
ప్రభువా, నీవు నా మూలుగు విన్నావు.
    నా నిట్టూర్పులు నీకు మరుగు కాలేదు.
10 నా గుండె తడబడుచున్నది. నా బలం పోయింది.
    నా చూపు దాదాపు పోయింది.
11 నా రోగం మూలంగా నా స్నేహితులు,
    నా పొరుగువారు నన్ను చూసేందుకు రావటం లేదు.
    నా కుటుంబం నా దగ్గరకు రాదు.
12 నన్ను చంపగోరేవారు తమ ఉచ్చులను వేసియున్నారు.
    నాకు హాని చేయగోరేవారు నా నాశనం గూర్చి మాట్లాడుకొంటున్నారు.
    వారు రోజంతా అబద్ధాలు చెప్తున్నారు.
13 అయితే నేను వినబడని చెవిటివానిలా ఉన్నాను.
    మాట్లాడలేని మూగవానిలా నేను ఉన్నాను.
14 ఒకని గూర్చి మనుష్యులు చెప్పే మాటలు వినలేని చెవిటివానిలా నేను ఉన్నాను.
    నేను వాదించి, నా శత్రువులదే తప్పు అని రుజువు చేయలేను.
15 కనుక యెహోవా, నీవు నన్ను కాపాడాలని వేచియుంటాను.
    నా దేవా, నా ప్రభువా, నా శత్రువులకు సత్యం చెప్పుము.
16 నన్ను చూచి వారిని నవ్వనియ్యవద్దు.
    నేను తొట్రుపడినప్పుడు వారిని గర్వపడనియ్యవద్దు.
17 నేను పడిపోయేటట్టు ఉన్నాను.
    నేను నా బాధను మరచిపోలేను.
18 యెహోవా, నేను చేసిన చెడు కార్యాలను గూర్చి, నేను నీకు చెప్పాను.
    నా పాపాలను గూర్చి నేను విచారిస్తున్నాను.
19 నా శత్రువులు ఇంకా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు,
    వారు ఎన్నెన్నో అబద్ధాలు చెప్పారు.
20 నా శత్రువులు నాకు కీడు చేశారు,
    నేను వారికి మంచి పనులు మాత్రమే చేశాను.
మంచి పనులు చేయటానికి మాత్రమే నేను ప్రయత్నించాను.
    కాని ఆ మనుష్యులు నాకు విరోధం అయ్యారు.
21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు.
    నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు.
22 త్వరగా వచ్చి నాకు సహాయం చేయుము.
    నా దేవా, నన్ను రక్షించుము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International