Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 21-22

యాజకుడైన అహీమెలెకును చూచుటకు దావీదు వెళ్ళుట

21 తరువాత దావీదు వెళ్లిపోయాడు. యోనాతాను తిరిగి పట్టణానికి వెళ్లాడు.

అహీమెలెకు అనే యాజకుని చూడటానికి దావీదు నోబు పట్టణానికి వెళ్లాడు. దావీదును చూడగానే అహీమెలెకు భయంతో వణకిపోయాడు. “నీవు ఒంటరిగా ఎందుకున్నావు? నీకు తోడుగా ఎవ్వరూ ఎందుకు లేరు?” అని అహీమెలెకు దావీదును అడిగాడు.

దావీదు అహీమెలెకుతో, “రాజు నాకు ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తాను ఏ పనిమీద నన్ను పంపిస్తున్నాడో అది వేరెవ్వరికీ తెలియ కూడదన్నాడు. నన్ను ఏమి చేయమని అతను చెప్పాడో అది ఎవ్వరికీ తెలియకూడదని అతని ఆజ్ఞ. నన్ను ఎక్కడ కలవాలో నా మనుష్యులకు నేను చెప్పాను. ఇప్పుడు నీవద్ద ఏమైన ఆహారం ఉన్నదా? నాకు ఐదు రొట్టెలు లేదా ఏది ఉంటే అది ఇవ్వు” అని చెప్పాడు.

“తనవద్ద మాములు రొట్టెలేవీ లేవనీ, కేవలం ప్రతిష్ఠితంగా దేవుని సన్నిధిలో ఉంచిన రొట్టెలు[a] కొన్ని వున్నాయనీ, తన పరివారమంతా స్త్రీలకు దూరంగా వున్న వారైతే వారు ఈ రొట్టె తినవచ్చనీ” యాజకుడు దావీదుతో అన్నాడు.

అది విన్న దావీదు, “మేము ఏ స్త్రీలతోను ఉండలేదు. మేము యుద్ధానికి వెళ్లినప్పుడల్లా, అలాగే మాములు పనులు చేసేటప్పుడు కూడ నా మనుష్యులు తమ శరీరాలను పవిత్రంగా ఉంచు కుంటారు. ఇప్పుడు మేము బయలుదేరిన మా పని ఎంతో పవిత్రమైనది కనుక ఈ వేళ ఇది మరింత సత్యం” అన్నాడు.

పవిత్ర రొట్టె తప్ప మరొకటి లేక పోవటంతో యాజకుడు దావీదుకు దానినే ఇచ్చాడు. యాజకులు యెహోవా ఎదుట పీఠంపై ఆరగింపుగా ఉంచే రొట్టె ఇది. ప్రతి రోజూ వారు ఈ రొట్టెను తీసివేసి మళ్లీ కొత్త రొట్టెను దాని స్థానంలో ఉంచుతారు.

సౌలు అధికారులలో ఒకడు ఆ రోజున ఇక్కడ ఉన్నాడు. వాని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. వాడు అక్కడ యెహోవా ఎదుట ఉంచబడ్డాడు. దోయేగు సౌలు యొక్క గొర్రెల కాపరులకు నాయకుడు.

యాజకుడైన అహీమెలెకును, “ఒక ఈటెగాని, కత్తిగాని అక్కడ ఉన్నదా అని దావీడు అడిగాడు. రాజుపని అతి ముఖ్యమైనదని, తను త్వరగా వెళ్లవలసి ఉందనీ, తాను కత్తిగాని మరి ఏ ఇతర ఆయుధంగాని తేలేదనీ చెప్పాడు.”

ఫిలిష్తీయుడైన గొల్యాతు ఆయుధం ఒక్కటే ఇక్కడ ఉందని యాజకుడు చెప్పాడు. “ఏలా లోయలో నీవు వానిని చంపినప్పుడు వాని దగ్గర నీవు తీసుకున్న ఖడ్గం అది. ఆ ఖడ్గం ఒక బట్టలో చుట్టబడి ఏఫోదు అంగీ వెనుక ఉంచబడింది కావాలంటే అది నీవు తీసుకోవచ్చు”

అని అహీమెలెకు అన్నాడు. “గొల్యాతు కత్తికి మించిన కత్తిలేదు. దానిని నాకు ఇవ్వుము” అన్నాడు దావీదు.

దావీదు గాతుకు పారిపోవుట

10 ఆ రోజు సౌలు నుంచి దావీదు అలా పారిపోయాడు. గాతు రాజైన ఆకీషు వద్దకు దావీదు వెళ్లాడు. 11 కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు అతనితో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ పాట పాడతారు:

“సౌలు వేల కొలదిగా హతము చేసాడు!
    దావీదు పది వేల కొలదిగా హతము చేసాడు!”

12 ఈ మాటలను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. గాతు రాజైన ఆకీషును గూర్చి దావీదు చాలా భయపడ్డాడు. 13 అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట మొదలు పెట్టాడు. అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చివానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు ఉమ్మేసాడు.

14 ఆకీషు, “వీని వైపు చూడండి! వీడు పిచ్చివాడు! వీడిని నా వద్దకు ఎందుకు తిసుకుని వచ్చారు? 15 ఇప్పటికే నా వద్ద పిచ్చి వాళ్లు చాలామంది ఉన్నారు. నా ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటానికి వీనిని మీరు నా ఇంటికి తీసుకుని రానక్కర్లేదు! ఈ మనిషిని మళ్లీ నా ఇంటికి రానివ్వకండి” అని తన అధికారులతో చెప్పాడు.

దావీదు పలుచోట్లకు వెళ్లుట

22 దావీదు గాతును వదిలి అదుల్లాము గుహలలోకి పారిపోయాడు. అదుల్లాము గుహలో దావీదు ఉన్నట్లు అతని సోదరులు, బంధువులు విన్నారు. దావీదును చూడటానికి వారక్కడికి వెళ్లారు. చాలా మంది ప్రజలు దావీదుతో కలిసారు. కష్టాల్లో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, అసంతృప్తి చెందిన వారు దావీదు చుట్టూ చేరారు. వారికి దావీదు నాయకుడయ్యాడు. అతనితో కలిపి వారు మొత్తం నాలుగు వందలమంది.

దావీదు అదుల్లాము గుహ వదిలి మోయాబులో ఉన్న మిస్పాకు వెళ్లాడు. “దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు దయచేసి నా తల్లి దండ్రులను వచ్చి నీతో ఉండనియ్యి” అని దావీదు మోయాబు రాజును అడిగాడు. దావీదు తన తల్లి దండ్రులను మోయాబు రాజువద్ద వదిలి పెట్టాడు. దావీదు కొండలలో[b] దాగి ఉన్నంత కాలం అతని తల్లిదండ్రులు మోయాబు రాజుతోనే ఉన్నారు.

గాదు ప్రవక్త దావీదును, “కోటలో వుండవద్దనీ, యూదాకు వెళ్లమని చెప్పాడు.” కనుక దావీదు బయల్దేరి హారేతు అరణ్యానికి వెళ్లాడు.

అహీమెలెకు కుటుంబాన్ని సౌలు నాశనము చేయుట

దావీదు, అతని మనుష్యులను గూర్చి తన మనుష్యులకు తెలిసినట్లు సౌలు విన్నాడు. గిబియా వద్ద కొండ మీద ఉన్న ఒక వృక్షం క్రింద సౌలు కూర్చున్నాడు. సౌలు క్రింది అధికారులంతా అతని చుట్టూ నిలబడ్డారు. సౌలు చేతిలో ఒక ఈటె వుంది. సౌలు తన చుట్టూవున్న అధికారులనుద్దేశంచి, “బెన్యామీను మనుష్యులారా వినండి! యెష్షయి కుమారుడు దావీదు మీ అందరికీ భూములు, ద్రాక్షతోటలు ఇస్తాడని మీరనుకుంటున్నారా? మీ అందరినీ దావీదు సహస్ర సైన్యాధిపతులుగా, శత దళాధిపతులుగా చేస్తాడని మీరు అనుకుంటున్నారా? అని అడిగాడు. మీరంతా నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నారు! మీరు రహస్య పథకాలు వేసారు. నా కుమారుడు యోనాతాను యెష్షయి కుమారునితో ఒడంబడిక చేసుకున్నట్లు మీలో ఎవ్వడూ నాకు చెప్పలేదు! నా గురించి మీలో ఒక్కనికీ శ్రద్ధలేదు! దావీదును నా కుమారుడు యోనాతాను ప్రోత్సహించినట్టు మీలో ఒక్కడూ నాకు చెప్పలేదు. నా సేవకుడు దావీదును దాగుకొనుమని, నన్ను ఎదురుదెబ్బ తీయుమని యోనాతాను చెప్పాడు. దావీదు ఇప్పుడు అదే పని చేస్తున్నాడు” అని అన్నాడు.

ఎదోమీయుడగు దోయేగు అక్కడ సౌలు అధికారులతో పాటు నిలబడివున్నాడు. “యెష్షయి కుమారుడైన దావీదు అహీటూబు కుమారుడైన అహీమెలెకును నోబులో చూడటానికి వచ్చినపుడు, అతనిని నేను చూసాను. 10 దావీదు కొరకు అహీమెలెకు ప్రార్థన చేయటం, అహీమెలెకు అతనికి ఆహారం ఇవ్వటం, పైగా ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గాన్ని అహీమెలెకు దావీదుకు ఇవ్వటం నేను చూసాను” అని దోయేగు వివరంగా చెప్పాడు.

11 అది విన్న సౌలు అహీటూబు కుమారుడు, యాజకుడైన అహీమెలెకును, అతని బంధువుల నందరినీ తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. అహీమెలెకు బంధువులంతా నోబులో యాజకులు. వారంతా రాజువద్దకు వచ్చారు. 12 “అహీటూబు కుమారుడా, విను” అని సౌలు అహీమెలెకుతో అన్నాడు.

“చెప్పండి ప్రభూ,” అన్నాడు అహీమెలెకు.

13 “నీవూ, యెష్షయి కుమారుడైన దావీదూ కలిసి నామీద ఎందుకు రహస్య పథకాలు వేసారు? నీవు దావీదుకు రొట్టె, ఖడ్గం ఇచ్చావు. వాని కోసం నీవు దేవునికి ప్రార్థన చేసావు. ఇప్పుడు దావీదు నన్ను ఎదుర్కోటానికి వేచియున్నాడు.” అన్నాడు అహీమెలెకుతో సౌలు.

14 అహీమెలెకు, “దావీదు నీ పట్ల చాలా విశ్వసంగా ఉన్నాడు. దావీదు అంతటి నమ్మకస్థుడు నీ అధికారులలో మరెవ్వరూ లేరు. దావీదు నీ సొంత అల్లుడు. పైగా నీ అంగరక్షకులందరికీ అతడు అధిపతి. నీ సొంత కుటుంబమంతా దావీదును గౌరవిస్తూ ఉంది. 15 నేను దావీదు కొరకు ప్రార్థన చేయటం అది మొదటి సారికాదు. ఎన్నటికీ కాదు. నన్నుగాని, నా బంధువులనుగాని నిందించవద్దు. మేము నీ సేవకులము. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనేది నాకేమీ తెలియదు” అని జవాబిచ్చాడు.

16 కానీ రాజు, “అహీమెలెకూ! నీవూ, నీ బంధువులు అంతా చావాల్సిందే!” అన్నాడు. 17 అప్పుడు రాజు తన పక్కనవున్న భటులతో, “వెళ్లి, యెహోవా యాజకులందరినీ చంపండి. వారు దావీదు పక్షంగా ఉన్నారు. దావీదు పారిపోతున్నాడని వారికి తెలుసు. అయినా వారు నాకు ఆ విషయం చెప్పలేదు” అని చెప్పాడు.

రాజభటులు యెహోవా యాజకులకు హాని చేసేందుకు నిరాకరించారు. 18 అప్పుడు రాజు దోయేగును పిలిచి, “నీవు వెళ్లి ఆ యాజకులను చంపు” అని ఆజ్ఞాపించాడు. దానితో ఎదోనీయుడైన దోయేగు వెళ్లి యాజకులందరినీ చంపేసాడు. ఆ రోజు ఎనభై అయిదు మంది యాజకులను దోయేగు చంపేసాడు. 19 నోబు యాజకుల యొక్క పట్టణం. నోబు పట్టణంలోని వారందరినీ దోయేగు చంపేసాడు. పురుషులు, స్త్రీలు, పిల్లలు, పసివాళ్లు అందరినీ దోయేగు చంపేసాడు. వారి పశువులు, గాడిదలు, గొర్రెలు అన్నిటినీ దోయేగు చంపేసాడు.

20 అయితే అబ్యాతారు తప్పించుకున్నాడు. ఇతడు అహీటూబు మనుమడు. అంటే అహీమెలెకు కుమారుడు. అబ్యాతారు పారిపోయి దావీదును కలుసుకొన్నాడు. 21 సౌలు, యెహోవా యాజకులనందకినీ చంపిన విధమంతా అబ్యాతారు దావీదుకు చెప్పాడు. 22 “ఎదోమీయుడగు దోయేగును ఆ రోజు నోబులో నేను చూసాను, వాడు సౌలుకు తప్పనిసరిగా చెబుతాడని నాకు తెలుసును, కాని నీ తండ్రి కుటుంబం అంతా చనిపోవటానికి నేనే కారకుడను. 23 నిన్ను చంపాలనుకొనే సౌలు నన్నూ చంపాలనుకుంటున్నాడు. నీవు నాతోనే ఉండు. భయపడవద్దు. నాతో ఉంటే నీవు క్షేమంగా ఉంటావు” అని దావీదు అబ్యాతారుతో అన్నాడు.

1 కొరింథీయులకు 3

మానవులను అనుసరించుట తప్పు

సోదరులారా! ఆత్మీయత కలవాళ్ళతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేక పొయ్యాను. ఆత్మీయత లేనివాళ్ళతో మాట్లాడినట్లు మాట్లాడాను. క్రీస్తు వల్ల మీరు పొందిన జీవితంలో, మిమ్నల్ని పసిపిల్లలుగా పరిగణించి మాట్లాడాను. మీరు అన్నం తినటానికి సిద్ధంగా లేరు. కనుక పాలు యిచ్చాను. మీరు ఇప్పటికీ సిద్దంగా లేరు. మీరింకా ఆత్మీయత లేనివాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. మీలో అసూయలు, పోట్లాటలు ఇంకా ఉన్నాయి. అంటే మీరు ఆత్మీయత లేనివాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! అంటే మీరు మిగతావాళ్ళలా జీవిస్తున్నట్లే కదా! మీలో ఒకడు, “నేను పౌలును అనుసరిస్తున్నాను” అని, మరొకడు, “నేను అపొల్లోను అనుసరిస్తున్నాను” అని అంటున్నారు. అలా మామూలు మనుష్యులు అంటారు.

ఇంతకూ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? మేము కేవలం దేవుని సేవకులం. మా ద్వారా మీరు క్రీస్తును విశ్వసించారు. అంతే. ప్రభువు అప్పగించిన కర్తవ్యాన్ని మాలో ప్రతి ఒక్కడూ నిర్వర్తించాడు. నేను విత్తనం నాటాను. అపొల్లో నీళ్ళు పోసాడు. కాని దాన్ని పెంచుతున్నవాడు దేవుడే. విత్తనం నాటటం, నీళ్ళు పోయటం ముఖ్యంకాదు. దాన్ని పెంచే దేవుడు ముఖ్యమైనవాడు. విత్తనం నాటేవానికి, నీళ్ళు పోసేవానికి ఉద్దేశ్యం ఒక్కటే. చేనిన పనిని బట్టి ప్రతీ ఒక్కనికి ప్రతిఫలం లభిస్తుంది. ఎందుకంటే, మేము దేవునితో కలిసి పనిచేసేవాళ్ళం.

మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు. 10 దేవుని అనుగ్రహం వల్ల నేను నేర్పుగల నిర్మాణకుడుగా పునాదులు వేసాను. ఇతరులు ఆ పునాదిపై కడుతున్నారు. ప్రతి ఒక్కడూ తానేవిధంగా కడుతున్నాడో గమనిస్తూ జాగ్రత్తగా కట్టాలి. 11 ఆ “పునాది” యేసు క్రీస్తు కనుక ఇదివరకే వేసిన ఆ పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరూ వేయలేరు. 12 కొందరు బంగారము, వెండి, విలువైన రత్నాలు ఉపయోగించి ఈ పునాది మీద కడతారు. మరికొందరు చెక్కను, గడ్డిని, ఆకుల్ని ఉపయోగించి కడతారు. 13 వాళ్ళ పనితనము క్రీస్తు వచ్చిన రోజున ఆయనయొక్క వెలుగులో బయటపడుతుంది. “ఆ రోజు” నిప్పువలె వస్తుంది. ఆ నిప్పు ప్రతి ఒక్కరి పనితనాన్ని పరీక్షిస్తుంది. 14 వాళ్ళు నిర్మించింది నిలిస్తే వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. 15 అది కాలిపోతే వాళ్ళకు నష్టం కలుగుతుంది. కాని మంటలనుండి అతనొక్కడే తప్పించుకొన్న విధంగా రక్షింపబడతాడు.

16 మీరు దేవుని మందిరమని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీకు తెలియదా? 17 కనుక దేవుని మందిరాన్ని నాశనం చేసినవాణ్ణి దేవుడు నాశనం చేస్తాడు. దేవుని మందిరం పవిత్రమైనది. మీరే ఆ మందిరం.

18 మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ప్రాపంచిక విషయాల్లో తెలివి ఉందని భావించేవాడు మొదట తనను తాను జ్ఞానహీనునిగా ఎంచుకొంటే తర్వాత జ్ఞాని కాగలడు. 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రాపంచిక జ్ఞానాన్ని మూర్ఖమైనదానిగా పరిగణిస్తాడు. దీన్ని గురించి లేఖనాల్లో, “తమ చమత్కారము ఉపయోగించే జ్ఞానుల్ని దేవుడు పట్టేస్తాడు”(A) అని వ్రాయబడి ఉంది. 20 మరొకచోట, “జ్ఞానుల ఆలోచనలు పనికిరావని ప్రభువుకు తెలుసు”(B) అని వ్రాయబడి ఉంది. 21 కనుక మానవుల తెలివిని పొగడకండి. అవన్నీ మీవి. 22 పౌలు, అపొల్లో, కేఫా, ప్రపంచము, బ్రతుకు, చావు, ప్రస్తుతము, భవిష్యత్తు అన్నీ మీవి. 23 మీరు క్రీస్తుకు చెందినవారు. క్రీస్తు దేవునికి చెందినవాడు.

యెహెజ్కేలు 1

పరిచయం

1-3 నేనొక యాజకుణ్ణి. నా పేరు యెహెజ్కేలు. బూజీ కుమారుణ్ణి. దేశభ్రష్టుడనై చెరలో ఉన్నాను.[a] బబులోనులో నేను కెబారు కాలువ ప్రక్కన ఉండగా ఆకాశం తెరువబడింది. అప్పుడు నాకు దైవసంబంధమైన దర్శనాలు కలిగాయి. అది ముఫ్పైయవ సంవత్సరంలో[b] నాల్గవ నెల (జూన్) ఐదవ రోజున జరిగింది. రాజైన యెహోయాకీను ప్రవాసంలో చెరపట్టబడ్డాక ఐదవ సంవత్సరం, ఆ నెలలో ఐదవ రోజున యెహోవా వాక్కు యెహెజ్కేలుకు వినవచ్చింది. ఆ స్థలంలో యెహోవా ప్రభావం అతని మీదికి వచ్చింది.

దేవుని వాహనం—యెహోవా సింహాసనం

ఉత్తరాన్నుండి గాలి దుమారం లేచి వస్తున్నట్లు నేను (యెహెజ్కేలు) చూశాను. అది ఒక పెను మేఘం. దాని నుండి అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దానిచుట్టూ వెలుగు దేదీప్యమానంగా ఉంది. అగ్నిలో కణకణలాడే లోహంలా అది మెరుస్తూ ఉంది. దాని లోపల నాలుగు జంతువులు[c] ఉన్నాయి. వాటి రూపం మానవ రూపంలా ఉంది. కాని ప్రతీ జంతువుకు నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు నిట్ట నిలువుగా ఉన్నాయి. వాటి పాదాలు ఆవు పాదాల్లా ఉన్నాయి. అవి మెరుగుదిద్దిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి. వాటి రెక్కల క్రింద మనుష్యుల చేతులు వంటివి ఉన్నాయి. అక్కడ మొత్తం నాలుగు జంతువులున్నాయి. వాటిలో ప్రతి ఒక్క జంతువుకూ నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి. ఇప్పుడు వాటి ముఖాల గురించి వివరిస్తాను. వాటి రెక్కలు ఒకదానితో ఒకటి తాకుతున్నాయి. అవి కదిలినప్పుడు ఆ జంతువులు ప్రక్కకి తిరుగలేదు. అవి చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్ళాయి.

10 ప్రతి జంతువుకు నాలుగు ముఖాలున్నాయి. ప్రతి ఒక్కటి ముందువైపు మనుష్య ముఖం కలిగిఉంది. కుడివైపు సింహపు ముఖం ఉంది. ఎడమ ప్రక్క ఎద్దు ముఖం ఉంది. వెనుకవైపు గ్రద్ద ముఖం ఉంది. 11 తమ రెక్కలతో ఆ జంతువులు తమ శరీరాలను కప్పుకున్నాయి. రెండు రెక్కలు విప్పుకొని ప్రక్కదాని రెక్కలను తాకుతున్నాయి. మరి, రెండు రెక్కలు శరీరాన్ని కప్పుకొవటానికి వినియోగించు కుంటున్నాయి. 12 ప్రతి జంతువు చూస్తూవున్న దిశలోనే అవి కదిలి వెళ్లాయి. గాలి[d] ఎటువీస్తే అవి అటు కదిలివెళ్లాయి. కానీ, అవి కదలినప్పుడు వాటి ముఖాలు ప్రక్కకి తిరగలేదు.

13 ఆ జంతువులు ఆ విధంగా కనిపించాయి. జంతువుల మధ్యలోవున్న లోపలి ప్రాంతంలో కాలుతున్న బొగ్గు నిప్పుల్లా కనబడిన ఏదో ఒకటి ఉంది. ఈ అగ్ని ఆ జంతువుల చుట్టూ కదలుతున్న చిన్న కాగడాల్లా ఉంది. ఆ అగ్ని ప్రకాశవంతగా వెలిగి దానినుండి మెరుపు మెరిసింది. 14 మెరుపు వంటి వేగంతో ఆ జీవులు వెనుకకు, ముందుకు కదులుతున్నాయి!

15-16 నేనా జంతువుల వైపు చూడగా నాలుగు చక్రాలు కన్పించాయి. ఆ చక్రాలన్నీ ఒకే విధంగా కనిపించాయి. ఒక్కొక్క ముఖానికి ఒక చక్రం చొప్పున ఉన్నాయి. ఆ చక్రాలు భూమిని తాకాయి. చక్రాలు స్వచ్ఛమైన పసుపువన్నె గోమేధికంతో చేయబడినట్లు కానవచ్చాయి. ఒక చక్రంలో మరో చక్రం ఉన్నట్లు కన్పించింది. 17 ఆ చక్రాలు ఏ దిశలోనైనా కదలగలవు. కాని అవి కదలినప్పుడు జంతువులు మాత్రం తిరుగలేదు.

18 ఆ చక్రాల అంచులు ఎత్తుగా, భయంకరంగా ఉన్నాయి. ఆ నాలుగు చక్రాల అన్ని అంచుల చుట్టూ కళ్లు ఉన్నాయి.

19 ఆ జంతువులతోపాటు చక్రాలు ఎప్పుడూ కదులుతూనే ఉండేవి. జంతువులు ఆకాశంలోకి లేచినప్పుడు వాటితోపాటు చక్రాలు కూడా లేచేవి. 20 గాలి (ఆత్మ) వాటిని ఎటు పోవాలని కోరితే అవి అటు వెళ్లాయి. అప్పుడు చక్రాలు కూడా వాటితో వెళ్లాయి. ఎందువల్లనంటే ఆ జంతువుల యొక్క గాలి శక్తి చక్రాలలోనే ఉంది. 21 అందువల్ల జీవులు కదిలితే చక్రాలు కూడా కదిలేవి. జీవులు ఆగితే చక్రాలు కూడా ఆగేవి. చక్రాలు గాలిలోకి వెళితే, జీవులు కూడా వాటితో పాటు వెళ్లాయి. ఎందువల్లనంటే గాలి (ఆత్మ శక్తి) చక్రాలలోనే ఉంది.

22 ఆ జీవులపై ఒక ఆశ్చర్యకరమైన వస్తువు కన్పించింది. అది ఒక పెద్ద పాత్ర బోర్లించినట్లుగా ఉంది. అది మంచులా స్వచ్చంగా ఉంది. అది జీవుల తలలచుట్టూ గాలిలో తేలియాడుతూ ఉంది. 23 ఈ పాత్రక్రింద ప్రతి జంతువుయొక్క రెక్కలు ప్రక్కనున్న జంతువును తాకేటట్లు ఉన్నాయి. రెండు రెక్కలు ఒక వైపున మరో రెండు రెక్కలు మరో వైపున శరీరాన్ని కప్పుతూ వ్యాపించాయి.

24 పిమ్మట నేను ఆ రెక్కల చప్పుడు విన్నాను. జంతువులు కదలినప్పుడల్లా, ఆ రెక్కలు గొప్ప శబ్దం చేసేవి. మహా నీటి ప్రవాహం ఘోషించినట్లు వాటి రెక్కల చప్పుడు వినిపించింది. సర్వశక్తిమంతుడైన దేవుని గంభీర శబ్దంలాగ ఆ శబ్దం వినిపించింది. ఒక సైన్యంగాని, ఒక ప్రజా సమూహంగాని చేసే రణగొణధ్వనుల్లా అవి వినవచ్చాయి. ఆ జంతువులు కదలటం మానినప్పుడు అవి వాటి రెక్కలను తమ ప్రక్కలకు దించివేసేవి.

25 జంతువులు కదలటం మానివేసి, రెక్కలను దించివేశాయి. పిమ్మట మరొక పెద్ద శబ్దం వచ్చింది. అది వాటి తలలపైవున్న ఆకాశమండలం లాంటి పాత్ర మీదుగా వచ్చింది. 26 ఆ పాత్రలాంటి వస్తువుపై మరొకటి కన్పించింది. అది ఒక సింహాసనంలా ఉంది. అది నీలమణిలా మెరుస్తూ ఉంది. ఆ సింహాసనంపై మనిషివంటి ఒక స్వరూపం కూర్చున్నట్లు కన్పించింది! 27 నడుము నుండి పైవరకు అతనిని పరికించి చూశాను. కాలుతున్న లోహంలా అతడు కన్పించాడు. అతని చుట్టూ అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్లు కానవచ్చింది! అతని నడుము నుండి క్రిందికి చూడగా, అంతా అగ్నిలా కన్పించింది. అది అతని చుట్టూ ప్రకాశిస్తూ ఉంది. 28 ఆయన చుట్టూ ప్రకాశించే వెలుగు ఇంద్రధనుస్సులా ఉంది. అది యెహోవా మహిమలా ఉంది. అది చూచి నేను సాష్టాంగపడ్డాను. నా శిరస్సు నేలకు ఆనించాను. అప్పుడు నాతో మాట్లాడే ఒక కంఠస్వరం విన్నాను.

కీర్తనలు. 37

దావీదు కీర్తన.

37 దుర్మార్గుల పట్ల కోపగించకుము
    చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు.
గడ్డి, పచ్చటి మొక్కలు త్వరలోనే వాడిపోయి చస్తాయి.
    దుర్మార్గులు సరిగ్గా అలానే ఉంటారు.
నీవు యెహోవాయందు నమ్మకం ఉంచి, మంచి పనులు చేస్తే
    నీవు బ్రతికి, దేశం ఇచ్చే అనేక వస్తువులను అనుభవిస్తావు.
యెహోవాను సేవించటంలో ఆనందించుము.
    ఆయన నీకు కావల్సినవాటిని యిస్తాడు.
యెహోవా మీద ఆధారపడుము. ఆయనను నమ్ముకొనుము.
    జరగాల్సినదాన్ని ఆయన జరిగిస్తాడు.
నీ మంచితనం, న్యాయం
    మధ్యాహ్నపు సూర్యునిలా ప్రకాశింపనిమ్ము.
యెహోవాను నమ్ముకొనుము. ఆయన సహాయం కోసం కనిపెట్టుము.
    చెడ్డవాళ్లు జయించినప్పుడు కలవరపడకుము.
    చెడ్డవాళ్లు చెడు తలంపులు తలంచి, వారి తలంపులు జయించినప్పుడు కలవరపడకుము.
కోపగించవద్దు, ఆవేశపడవద్దు, నీవు కూడ కీడు చెయ్యాలి అనిపించేటంతగా తొందరపడిపోకుము.
ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడతారు.
    కాని సహాయం కోసం యెహోవాను వేడుకొనే వారికి దేశం సొంతమవుతుంది.
10 కొద్ది కాలానికి ఇక దుర్మార్గులు ఉండరు.
    అలాంటి మనుష్యుల కోసం నీవు చూడవచ్చు. కాని వాళ్లు కనబడరు.
11 దీనులు భూమిని జయిస్తారు,
    వాళ్లు శాంతిని అనుభవిస్తారు.

12 దుర్మార్గులు మంచి వాళ్లకు విరోధంగా కీడు చేయాలని తలుస్తారు.
    ఆ దుర్మార్గులు మంచి మనుష్యుల మీద పండ్లు కొరికి, తమ కోపం వ్యక్తం చేస్తారు.
13 అయితే మన ప్రభువు ఆ దుర్మార్గులను చూచి నవ్వుతాడు,
    వారికి సంభవించే సంగతులను ఆయన చూస్తాడు.
14 దుర్మార్గులు వారి ఖడ్గాలు తీసుకొంటారు, విల్లు ఎక్కుపెడ్తారు. పేదలను, నిస్సహాయులను వాళ్లు చంపాలని చూస్తారు.
    మంచివాళ్లను, నిజాయితీపరులను వాళ్లు చంపాలని చూస్తారు.
15 కాని వారి విల్లులు విరిగిపోతాయి.
    వారి ఖడ్గాలు వారి స్వంత గుండెల్లో గుచ్చుకు పోతాయి.
16 దుష్టుల ఐశ్వర్యంకంటే
    మంచివాని అల్పభాగమే ఉత్తమమైనది.
17 ఎందుకంటే దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
    కాని మంచివాళ్ల విషయమై యెహోవా శ్రద్ధ పుచ్చుకొంటాడు.
18 పవిత్రమైన మనుష్యుల్ని వారి జీవితాంతం వరకూ యెహోవా కాపాడుతాడు.
    వారి ప్రతిఫలం శాశ్వతంగా ఉంటుంది.
19 కష్టం వచ్చినప్పుడు మంచి మనుష్యులు నాశనం చేయబడరు.
    కరువు కాలం వచ్చినప్పుడు మంచి మనుష్యులకు భోజనం సమృద్ధిగా ఉంటుంది.
20 కాని దుర్మార్గులు యెహోవాకు శత్రువులు,
    ఆ దుర్మార్గులు నాశనం చేయబడుతారు.
వారు పొలంలోని పువ్వులవలె అదృశ్యమౌతారు.
    వారు పొగవలె కనబడకుండా పోతారు.
21 దుర్మార్గుడు త్వరగా అప్పు చేస్తాడు. అతడు దాన్ని మరల చెల్లించడు.
    కాని మంచి మనిషి సంతోషంతో ఇతరులకు ఇస్తాడు.
22 ఒకవేళ ఒక మంచి మనిషి ప్రజలను ఆశీర్వదిస్తే, అప్పుడు ఆ ప్రజలు దేవుడు వాగ్దానం చేసిన భూమిని పొందుతారు.
    కాని ప్రజలకు కీడు జరగాలని గనుక అతడు అడిగితే, అప్పుడు ఆ మనుష్యులు నాశనం చేయబడతారు.
23 ఒకడు జాగ్రత్తగా నడిచేందుకు యెహోవా సహాయం చేస్తాడు.
    వాని నడవడియందు యెహోవా ఆనందిస్తాడు.
24 అతడు తొట్రుపడినా పడిపోడు,
    ఎందుకంటే యెహోవా వాని చేయిపట్టుకొని పడిపోకుండా చేస్తాడు.
25 నేను యువకునిగా ఉండేవాడ్ని, ఇప్పుడు ముసలివాడినయ్యాను.
    మంచి మనుష్యులకు దేవుడు సహాయం చేయకుండా విడిచిపెట్టడం నేను ఎన్నడూ చూడలేదు.
    మంచి మనుష్యుల పిల్లలు భోజనం కోసం భిక్షం ఎత్తుకోవడం నేను ఎన్నడూ చూడలేదు.
26 మంచి మనిషి ఇతరులకు ఎల్లప్పుడూ ఉచితంగానే ఇస్తూంటాడు.
    మంచి మనిషి పిల్లలు ఆశీర్వాదం పొందుతారు.
27 నీవు చెడు పనులు చేయటం మానివేసి మంచి పనులు చేస్తే
    అప్పుడు నీవు శాశ్వతంగా జీవిస్తావు.
28 యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    ఆయన తన భక్తులకు సహాయం చేయకుండా విడిచిపెట్టడు.
యెహోవా తన భక్తులను ఎల్లప్పుడూ కాపాడతాడు.
    కాని దుష్టులను ఆయన నాశనం చేస్తాడు.
29 మంచి మనుష్యులకు దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరుకుతుంది.
    వారు దానిమీద శాశ్వతంగా నివసిస్తారు.
30 మంచి మనిషి మంచి సలహా యిస్తాడు.
    అతని నిర్ణయాలు ప్రతి ఒక్కరికి న్యాయంగా ఉంటాయి.
31 యెహోవా ఉపదేశాలు మంచి మనిషి హృదయంలో ఉంటాయి.
    అతడు సరిగా జీవించే విధానాన్ని విడిచిపెట్టడు.

32 కాని చెడ్డవాళ్లు, మంచివాళ్లను బాధించే మార్గాలను వెదకుతారు.
    మరియు చెడ్డవాళ్లు మంచివాళ్లను చంపటానికి ప్రయత్నిస్తారు.
33 యెహోవా దుష్టుల శక్తికి మంచివారిని వదిలి వేయడు.
    మంచివారిని దోషులుగా ఆయన తీర్చబడనీయడు.
34 యెహోవా సహాయం కోసం కనిపెట్టుము. యెహోవాను అనుసరించుము.
    దుర్మార్గులు నాశనం చేయబడతారు. కాని యెహోవా నిన్ను ప్రముఖునిగా చేస్తాడు,
    మరియు దేవుడు వాగ్దానం చేసిన భూమిని నీవు పొందుతావు.

35 శక్తిమంతులైన దుర్మార్గులను నేను చూశాను.
    వారి శక్తి ఒక బలమైన, ఆరోగ్యమైన వృక్షంలా పెరుగుతూ వచ్చింది.
36 కాని తర్వాత వారు లేకుండా పోయారు.
    నేను వారికోసం చూశాను, కాని వారు నాకు కనబడలేదు.
37 నీతి, నిజాయితీ కలిగి ఉండి,
    సమాధానపరచువారి సంతతి నిలుస్తుంది. అది శాంతి కలిగిస్తుంది.
38 అయితే చట్టాన్ని ఉల్లంఘించే వారందరు నాశనం చేయబడతారు.
    వారి సంతానం భూమిని వదలవలసి వస్తుంది.
39 నీతిమంతులను యెహోవా రక్షిస్తాడు.
    నీతిమంతులకు కష్టాలు వచ్చినప్పుడు యెహోవా వారికి బలంగా ఉంటాడు.
40 నీతిమంతులకు యెహోవా సహాయం చేస్తాడు. వారిని రక్షిస్తాడు.
    నీతిమంతులు సహాయంకోసం యెహోవా దగ్గరకు వస్తారు, మరియు యెహోవా దుర్మార్గుల నుండి వారిని రక్షిస్తాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International