M’Cheyne Bible Reading Plan
దావీదు-యోనాతానుల స్నేహం
18 దావీదు సౌలుతో మాట్లాడటం ముగించాక, యోనాతాను దావీదుకు చాలా సన్నిహితుడయ్యాడు. తనను తాను ప్రేమించుకున్నంతగా యోనాతాను దావీదును ప్రేమించాడు. 2 సౌలు ఆ రోజు నుంచీ దావీదును తన వద్దనే ఉంచుకొన్నాడు. దావీదును ఊరిలోవున్న తన తండ్రి వద్దకు సౌలు పోనీయలేదు. 3 యోనాతాను దావీదుతో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. ఎందువల్లనంటే, దావీదు అంటే యోనాతానుకు ఎనలేని ప్రేమ. 4 యోనాతాను తన అంగీ తీసి దావీదుకు తొడిగాడు. యోనాతాను తన సైనిక దుస్తులు కూడా దావీదుకు ఇచ్చాడు. అంతేగాదు; యోనాతాను తన ఖడ్గం, విల్లంబులు, పటకా అన్నీ దావీదుకు ఇచ్చాడు.
దావీదు విజయాన్ని సౌలు గుర్తించుట
5 సౌలు దావీదును అనేక యుద్ధాలకు పంపాడు అన్నింటిలో అతడు విజయం సాధిస్తూ వచ్చాడు. కాబట్టి అతనిని సైన్యాధికారిగా సౌలు నియమించాడు. దీనికి ప్రజలంతా చాలా సంతోషించారు. సౌలు అధికారులు కూడ సంతోషించారు. 6 దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలోని వివిధ పట్టణాల స్త్రీలు అందరూ దావీదును కలుసుకొనేందుకు బయటకు వచ్చారు. వారు వీణారాగాలతోను, మృదంగతాళ ధ్వనులతోను దావీదు ఎదుట చిరునవ్వులతో నాట్యం చేసారు. ఇదంతా వారు సౌలు యెదుటనే చేసారు.
7 “సౌలు వేల కొలదిగాను హతము చేసెననియు
దావీదు పదివేల కొలదిగా హతము చేసెననియు”
స్త్రీలంతా జయగీతిక పాడారు.
8 స్త్రీల పాట సౌలును కలవర పెట్టింది. అతనికి చాలా కోపం వచ్చింది. “తాను వేలమందిని మాత్రమే చంపానని దావీదు పదివేల మందిని చంపాడని స్త్రీలు చెబుతున్నారే” అని సౌలు పరి పరి విధాల ఆలోచనచేశాడు. 9 అప్పటినుండి సౌలు దావీదును ఒక కంట కనిపెడుతూ వచ్చాడు.
సౌలు దావీదును గూర్చి భయపడుట
10 ఆ మరుసటి రోజు దేవుని యొద్ద నుండి ఒక దుష్ట ఆత్మ సౌలును బలీయంగా ఆవరించింది. తన ఇంటిలో సౌలు చాలా కిరాతకంగా ప్రవర్తించాడు. ఎప్పటిలాగే దావీదు తన వీణ వాయించాడు. కానీ సౌలు చేతిలో ఒక బల్లెం ఉంది. 11 “దావీదును గోడకు గుచ్చి వేయాలని సౌలు” తలంచాడు. రెండుసార్లు సౌలు బల్లెం విసరినాడు. కానీ దావీదు తప్పించుకున్నాడు.
12 యెహోవా దావీదుకు తోడుగా ఉన్నాడు. యెహోవా సౌలును వదిలివేశాడు. అందువల్ల దావీదు అంటే సౌలుకు భయంవేసింది. 13 సౌలు తన దగ్గరనుండి దావీదును పంపివేసాడు. సౌలు దావీదును వెయ్యిమంది సైనికులకు అధిపతిగా చేసాడు. ఆ సైనికులను దావీదు యుద్ధానికి నడిపించాడు. 14 యెహోవా దావీదుతో ఉన్నాడు గనుక, దావీదు ఏది చేసినా విజయాన్నే సాధిస్తూవచ్చాడు. 15 దావీదు చాలా విజయం సాధిస్తున్నట్టు సౌలు గమనించాడు. దానితో సౌలుకు దావీదు అంటే భయం ఇంకా ఎక్కువయ్యింది. 16 కానీ ఇశ్రాయేలు, యూదా ప్రజలు అందరూ దావీదును ఎక్కువగా ప్రేమించారు. కారణం వారిని యుద్ధంలో దావీదు అతిచాకచక్యంగా నడిపించుటచేత.
దావీదు తన కుమార్తెను వివాహం చేసుకోవాలని సౌలు కోరుట
17 (కానీ సౌలు దావీదును చంపాలని కోరాడు. దావీదును మోసం చేయటానికి ఒక పథకం వేసాడు). సౌలు, “ఇదిగో నా పెద్ద కుమార్తె మేరబు. నీవు ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత నీవు మంచి శక్తిగల సైనికుడివి కావచ్చు. నీవు నాకు ఒక కొడుకులా ఉంటావు. అప్పుడు నీవు వెళ్లి, యెహోవా పక్షంగా యుద్ధాలు చేయి” అని దావీదుతో చెప్పాడు. (ఇది ఒక పన్నాగము). వాస్తవానికి సౌలు, “ఇప్పుడు దావీదును నేనేమీ చంపక్కర్లేదు. నా కోసం ఫిలిష్తీయులే అతనిని చంపుతారులే” అని తలంచాడు.
18 అందుకు దావీదు, “మాది గొప్ప కుటుంబంకాదు, నేను గొప్ప వ్యక్తినీ కాను. కనుక నేను రాజుగారి అమ్మాయిని పెళ్లాడలేను” అని అన్నాడు.
19 అందుచేత మేరబు దావీదును పెళ్లి చేసుకొనే సమయం వచ్చేసరికి, సౌలు ఆమెను మెహోలతీవాడైన అద్రియేలు అనేవానికిచ్చి వివాహము చేసాడు.
20 సౌలు యొక్క మరో కుమార్తె మీకాలు దావీదును ప్రేమించింది. మీకాలు దావీదును ప్రేమించినట్టు ప్రజలు సౌలుకు చెప్పారు. అది విని సౌలు సంతోషించాడు. 21 “మీకాలు దావీదును వివాహ మాడటానికి నేను అంగీకరిస్తాను. దావీదును ఉచ్చులో పెట్టేందుకు నేను మీకాలును వినియోగించుకుంటాను. అప్పుడు దావీదును ఫిలిష్తీయుల చేతనే చంపిస్తాను” అనుకొన్నాడు సౌలు. కనుక సౌలు రెండవ సారిగా దావీదుతో, “ఈ వేళ నీవు నా కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు” అని చెప్పాడు.
22 సౌలు తన అధికారులకు ఇలా ఆజ్ఞాపించాడు. “దావీదుతో ఆంతరంగికంగా, ‘రాజుకు నీవంటే చాలా ఇష్టం. అతని అధికారులకు కూడా నీవంటే ఇష్టం. నీవు అతని కుమార్తెను పెళ్లి చేసుకో’ అని చాటుగా దావీదుకు చెప్పండి” అని సౌలు వారితో అన్నాడు.
23 సౌలు అధికారులు అలాగే దావీదుతో చెప్పారు. అది విన్న దావీదు, “రాజుగారి అల్లుడు కావటమంటే అంత తేలికైన పని అనుకుొటున్నారా? (రాజుగారి కుమార్తెకు కట్నం ఇచ్చేందుకు నా దగ్గర డబ్బులేదు.) నేను సామాన్య నిరుపేదను” అని దావీదు జవాబిచ్చాడు.
24 తిరిగి సౌలు అధికారులు దావీదు చెప్పినదంతా సౌలుకు వివరించారు. 25 మళ్లీ సౌలు వారితో, “దావీదు కట్నం చెల్లించనక్కరలేదనీ, కేవలం ఒక వందమంది ఫిలిష్తీయుల సున్నతి చర్మాలను తెస్తే చాలనీ చెప్పండి. దానితో సౌలు తన శత్రువుల మీద పగ తీర్చుకున్నట్లవుతుందని చెప్పండి” అన్నాడు. ఈ పని చేస్తే ఫిలిష్తీయులు దావీదును చంపుతారని సౌలు రహస్య పథకం.
26 సౌలు అధికార్లు మళ్లీ దావీదుకు ఈ విషయం చెప్పారు. దావీదు సౌలు అల్లుడు కావటానికి ఇష్టపడ్డాడు. కనుక అతడు వెంటనే పనికి పూనుకున్నాడు. 27 దావీదు తన సైనికులతో బయలుదేరి వెళ్లి రెండువందల మంది ఫిలిష్తీయులను చంపి, వారి సున్నతి చర్మాలను తీసుకొని వచ్చి సౌలుకు ఇచ్చాడు. రాజుగారి అల్లుడు కావాలని కోరి దావీదు ఇలా చేసాడు.
అప్పుడు సౌలు దావీదును తన కుమార్తె మీకాలును పెండ్లి చేసుకోనిచ్చాడు. 28 అప్పుడు కూడా యెహోవా దావీదుతో ఉన్నాడని సౌలు అవగాహన చేసుకున్నాడు. పైగా తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమస్తూ ఉందని తెలుసుకున్నాడు. 29 దానితో సౌలుకు దావీదు అంటే భయం ఎక్కువయ్యింది. ఆ విధంగా సౌలు దావీదుకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండిపోయాడు.
30 ఫిలిష్తీయుల సేనాధిపతులు మాత్రం ఇశ్రాయేలీయులపై తమ దండయాత్రలు సాగిస్తూనే ఉన్నారు. అయితే ప్రతిసారీ దావీదు వారిని ఓడిస్తూనే ఉన్నాడు సౌలు క్రిందవున్న అధికారులందరిలో దావీదు చాలా ఉత్తమ అధికారి. అందువల్ల దావీదు చాలా ప్రసిద్ధిలోకి వచ్చాడు.
కుశలములు
16 కేంక్రేయ పట్టణంలో ఉన్న సంఘానికి సేవ చేస్తున్న మన సోదరి ఫీబే చాలా మంచిది. 2 దేవుని ప్రజలకు తగిన విధంగా ప్రభువు పేరట ఆమెకు స్వాగతం చెప్పండి. ఆమె అనేకులకు చాలా సహాయం చేసింది. నాకు కూడా చాలా సహాయం చేసింది. కనుక ఆమె మీ నుండి సహాయం కోరితే ఆ సహాయం చెయ్యండి.
3 నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. 4 వాళ్ళు నా కోసం తమ ప్రాణాలనే తెగించారు. నేనే కాక, యూదులు కానివాళ్ళ సంఘాలన్నీ వాళ్ళకు కృతజ్ఞతతో ఉంటాయి.
5 వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యే వాళ్ళందరికీ నా వందనాలు చెప్పండి.
ఆసియ ప్రాంతంలో క్రీస్తును నమ్మినవాళ్ళలో నా ప్రియమిత్రుడు ఎపైనెటు మొదటివాడు. అతనికి నా శుభములు అందించండి.
6 మీ కోసం చాలా కష్టపడి పని చేస్తున్న మరియకు నా వందనములు చెప్పండి.
7 నాతో సహా కారాగారంలో గడిపిన నా బంధువులు ఆంద్రొనీకుకు, యూనీయకు నా వందనాలు చెప్పండి. వాళ్ళు అపొస్తలులలో గొప్పవారు. అంతేకాక వాళ్ళు నాకన్నా ముందే క్రీస్తును అంగీకరించారు.
8 ప్రభువు వల్ల నేను, అంప్లీయతు స్నేహితులమయ్యాము. అతనికి నా వందనాలు చెప్పండి. 9 మాతో కలిసి క్రీస్తు సేవచేస్తున్న ఊర్బానుకు,
నా ప్రియ మిత్రుడైనటువంటి స్టాకుకు నా వందనాలు చెప్పండి. 10 అపెల్లెకు క్రీస్తు పట్ల నిజమైన భక్తి ఉన్నట్లు నిరూపించబడింది. అతనికి నా వందనాలు చెప్పండి.
అరిస్టొబూలు కుటుంబానికి చెందిన వాళ్ళకు వందనాలు చెప్పండి. 11 హెరోదియోను నా బంధువు. అతనికి వందనాలు చెప్పండి.
ప్రభువుకు చెందిన నార్కిస్సు కుటుంబాన్ని అడిగానని చెప్పండి. 12 ప్రభువు కోసం కష్టించి పని చేస్తున్న త్రుపైనా, త్రుఫోసా అనే స్త్రీలకు నా వందనాలు చెప్పండి.
మరొక స్త్రీ పెర్సిసు చాలా కష్టించి పని చేసింది. ఆమెకు నా వందనాలు చెప్పండి.
13 ప్రభువు ఎన్నుకొన్న రూపునకు, అతని తల్లికి నా వందనాలు చెప్పండి. అతని తల్లి నాకు కూడా తల్లిలాంటిది.
14 అసుంక్రితుకు, ప్లెగోనుకు, హెర్మేకు, పత్రొబకు, హెర్మాకు, వాళ్ళతో ఉన్న ఇతర సోదరులకు వందనాలు చెప్పండి.
15 పిలొలొగుకు, యూలియా అనే సోదరికి, నేరియకు, అతని సోదరికి, ఒలుంపాకు, వాళ్ళతో ఉన్న దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.
16 మీరు ఒకరినొకరు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దులతో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోండి.
క్రీస్తు సంఘాలన్నీ మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి.
17 సోదరులారా! నేను మిమ్మల్ని అర్థించేదేమిటంటే చీలికలు కలిగించేవాళ్ళను, మీ దారికి ఆటంకాలు కలిగించేవాళ్ళను, మీరు నేర్చుకొన్నవాటికి వ్యతిరేకంగా బోధించేవాళ్ళను గమనిస్తూ వాళ్ళకు దూరంగా ఉండండి. 18 అలాంటివాళ్ళు యేసు క్రీస్తు ప్రభువు సేవ చెయ్యరు. దానికి మారుగా వాళ్ళు తమ కడుపులు నింపుకొంటారు. మంచి మాటలు ఆడుతూ, ముఖస్తుతి చేస్తూ అమాయకుల్ని మోసం చేస్తూ ఉంటారు. 19 మీరు క్రీస్తును చాలా విధేయతతో అనుసరిస్తున్నారన్న విషయం అందరూ విన్నారు. అందువల్ల మీ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మీరు మంచివాటిని గురించి జ్ఞానం సంపాదిస్తూ చెడు విషయంలో అజ్ఞానులుగా ఉండాలని నా కోరిక!
20 శాంతిదాత అయినటువంటి దేవుడు త్వరలోనే సాతాన్ను మీ కాళ్ళ క్రింద అణగ త్రొక్కుతాడు.
మన యేసు క్రీస్తు ప్రభువు యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండుగాక!
21 నాతో కలిసి సేవ చేస్తున్న తిమోతి మీకు వందనములు తెలుపుతున్నాడు. నా బంధువులు, లూకియ, యాసోను, సోసిపత్రు కూడా మీకు వందనాలు తెలుపుతున్నారు.
22 పౌలు చెప్పుచున్న ఈ లేఖను వ్రాస్తున్న తెర్తియు అనే నేను ప్రభువు పేరిట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
23 మొత్తం సంఘానికి, నాకు ఆతిథ్యమిస్తున్న గాయి మీకు వందనాలు చెపుతున్నాడు. పట్టణ కోశాధికారి అయిన ఎరస్తు, మా సోదరుడు క్వర్తు మీకు వందనాలు తెలుపమన్నారు.
24-25 నేను బోధించే సువార్తానుసారం, యేసు క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సారాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం.[a] 26 కాని ఇప్పుడు ప్రవక్తల వ్రాతల మూలంగా ఆ రహస్య సత్యం బయటపడింది. అందరూ దేవుణ్ణి విశ్వసించి విధేయతతో ఆయన్ని అనుసరించాలని అమరుడైన దేవుని ఆదేశానుసారం అన్ని దేశాలకు ఆ రహస్యం తెలుపబడింది. 27 సర్వజ్ఞుడైనటువంటి దేవునికి, యేసు క్రీస్తు ద్వారా సదా మహిమ కలుగుగాక! ఆమేన్.
శ్రమ భావం
3 నేను కష్టాలు అనుభవించిన వ్యక్తిని.
యెహోవా కోపపు కర్ర క్రింద నేను సంకట పరిస్థితులు చూశాను.
2 యెహోవా నన్ను చీకటిలోకి
నడపించాడేగాని వెలుగులోకి కాదు.
3 యెహోవా తన చేతిని నా మీదకి ఎత్తాడు.
రోజంతా పదే పదే ఆయన అలా చేశాడు.
4 ఆయన నా మాంసం, నా చర్మం కృశింపజేశాడు.
ఆయన నా ఎముకలు విరుగగొట్టాడు.
5 యెహోవా నా పైకి కష్టాలను, వేదనను రప్పించాడు.
ఆయన నాచుట్టూ విషాన్ని, సంకట పరిస్థితిని కలుగచేశాడు.
6 ఆయన నన్ను చీకటిలో కూర్చునేలా చేశాడు.
ఏనాడో చనిపోయిన వ్యక్తిలా నన్ను ఆయన చేశాడు.
7 యెహోవా నన్ను బయటకు రాకుండా బంధించాడు.
ఆయన నాకు బరువైన గొలుసులు తగిలించాడు.
8 సహాయం కొరకు నేను మొర్ర పెట్టుకుని అర్థించినా,
యెహోవా నా ప్రార్థన ఆలకించలేదు.
9 ఆయన నా మార్గాన్ని రాళ్లతో అడ్డగించాడు.
ఆయన నా మార్గాన్ని వక్రంగా, గతుకులమయం చేశాడు.
10 నా మీదకు పడనున్న ఎలుగుబంటిలా యెహోవా ఉన్నాడు.
ఆయన పొంచి వున్న ఒక సింహంలా ఉన్నాడు.
11 యెహోవా నన్ను నా మార్గం నుండి తొలగించాడు.
ఆయన నన్ను ముక్కలుగా చీల్చాడు. నన్ను నాశనం చేశాడు.
12 ఆయన విల్లంబులు చేపట్టాడు.
ఆయన బాణాలకు నన్ను గురి చేశాడు.
13 ఆయన నా పొట్టలో బాణం వేశాడు.
ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
14 నా ప్రజలందరిలో నేను నవ్వులపాలయ్యాను.
రోజంతా పాటలు పాడి వారు నన్ను ఎగతాళి చేస్తారు.
15 యెహోవా నాచేత చేదు పానీయం (శిక్ష) తాగించాడు.
ఆయన చేదు పానీయాలతో నన్ను నింపివేశాడు.
16 నా పండ్లు రాత్రి నేలలో గుచ్చుకుపోయేలా యెహోవా నన్ను తోశాడు.
ఆయన నన్ను మట్టిలోకి త్రోసివేశాడు.
17 ఇక నాకు శాంతి ఉండదని అనుకున్నాను.
మంచి విషయాలు ఎట్టివో నేను మర్చిపోయాను.
18 “యెహోవా తిరిగి నాకు సహాయం చేస్తాడనే
ఆశ లేదనుకొన్నాను.”
19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు.
ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు.
అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు.
ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26 యెహోవా రక్షణకై నెమ్మదిగా
వేచియుండటం క్షేమకరం
27 యెహోవా కాడిని ధరించే వానికి మంచి కలుగుతుంది.
ఆయన కాడిని చిన్నతనం నుండే మోయటం ఆ వ్యక్తికి మరీ మంచిది.
28 యెహోవా తన కాడిని వానిమీద వేయునప్పుడు
ఆ వ్యక్తి ఒంటరిగా కూర్చుని మౌనంగా ఉండాలి.
29 ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి.
దానివల్ల తన ఆశ నెరవేరునేమో.
30 తనను కొట్టేవానివైపు తన దవడను ఆ వ్యక్తి తిప్పాలి.
ఆ వ్యక్తి అవమానాలను భరించటానికి సంసిద్ధుడు కావాలి.
31 యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి.
32 యెహోవా శిక్షించేటప్పుడు, ఆయనకు కరుణకూడ ఉంటుంది.
ఆయనకుగల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలి పడతాడు.
33 యెహోవా తన ప్రజలను శిక్షింపకోరడు.
తన ప్రజలను బాధపెట్టటానికి ఆయన ఇష్టపడడు.
34 యెహోవా ఈ విషయాలంటే ఇష్టపడడు:
ఎవ్వరో ఒక్కరికోసం భూమిపైగల ఖైదీలందరినీ ఆయన పాదాలకింద తొక్కటానికి ఇష్టపడడు.
35 ఒకని మేలుకోసం మరియొకనికి అన్యాయం చేయటం ఆయనకు ఇష్టముండదు.
కాని కొంత మంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు.
36 ఒకని మంచి పనిని మరియొకని కోసం పాడు చేయటానికి ఆయన ఇష్టపడడు.
యెహోవా ఈ పనులేవీ చేయటానికి ఇష్టపడడు.
37 యెహోవా ఆజ్ఞలేకుండా ఎవ్వరూ దేనినీ చెప్పలేరు;
చెప్పి జరిపించలేరు.
38 మహోన్నతుడైన దేవుని నోటినుండి వరాలు,
శాపాలు రెండూ వెలువడతాయి.
39 ఒక వ్యక్తియొక్క పాపాలననుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు.
కనుక, బతికున్న వాడెవడూ ఆయనపై ఫిర్యాదు చేయలేడు?
40 మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు
పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము.
41 పరలోకాధిపతియైన దేవునివైపు మన హృదయాలను,
చేతులను చాపుదాము.
42 ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాము: “మేము పాపం చేశాము, మొండివైఖరి దాల్చాము.
అందువల్ల నీవు మమ్మల్ని క్షమించలేదు.
43 నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంటాడినావు.
కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు.
44 నిన్ను నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు.
ఏ ఒక్క ప్రార్థనా నీలో ప్రవేశించకుండ నీవలా చేశావు.
45 అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా,
కల్మశంలా చేశావు.
46 మా శత్రువులందరూ మాతో కోపంగా
మాట్లాడుతున్నారు.
47 మేము భయానికి గురి అయ్యాము.
మేము గోతిలో పడ్డాము.
మేము బాధపెట్టబడి,
చితుక గొట్టబడ్డాము!”
48 నా కన్నీళ్లు ప్రవాహంలా కారుచున్నాయి!
నా ప్రజానాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను.
49 ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది!
నా దుఃఖం ఆగదు.
50 ఓ యెహోవా, నీ దృష్టి మా పై ప్రసాదించి,
మమ్మల్ని చూసే వరకు నా దుఃఖం ఆగదు.
పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసేవరకు
నేను దుఃఖిస్తూనే ఉంటాను.
51 నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూసినప్పుడు
నా కండ్లు నాకు వేదన కలిగించాయి.
52 తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన
వారంతా నన్నొక పక్షిలా తరిమారు.
53 నేను బ్రతికి వుండగానే నన్ను గోతిలోకి తోశారు.
నాపై వాళ్లు రాళ్లు విసిరారు.
54 నీళ్లు నా తలపైకి వచ్చాయి.
“ఇది నా అంతం” అని నేననుకున్నాను.
55 ఓ యెహోవా, నీ పేరు స్మరించాను.
గోతిలో అట్టడుగునుండి నిన్ను పేరుపెట్టి పిలిచాను.
56 నీవు నా మొరాలకించావు.
నీవు నీ చెవులు మూసి కొనలేదు.
నన్ను కాచి రక్షించటానికి నీవు వెనుకాడలేదు.
57 నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు
“భయపడవద్దు,” అని నాకు అభయమిచ్చావు.
58 ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు.
నాకు మళ్లీ జీవం పోశావు.
59 ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు.
నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు.
60 నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూశావు.
వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూశావు.
61 ఓ యెహోవా, వారెలా నన్నవమానించారో నీవు విన్నావు.
వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు.
62 నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఎప్పుడూ
నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి.
63 ఓ యెహోవా, వారు కూర్చున్నా,
నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు!
64 ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు!
వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు!
65 వారి గుండె బండ బారేలా చేయుము!
పిమ్మట వారిని శపించుము!
66 కోపంతో వారిని వెంటాడుము! వారిని నాశనం చేయుము.
యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయుము!
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.
34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
2 దీన జనులారా, విని సంతోషించండి.
నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
3 యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
4 సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
5 సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
6 ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
యెహోవా నా మొర విన్నాడు.
నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
7 యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
8 యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
9 యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.
17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.
© 1997 Bible League International