Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 17

గొల్యాతు ఇశ్రాయేలీయులను యుద్ధానికి సవాలుచేయుట

17 ఫిలిష్తీయులు వారి సైన్యాన్ని యుద్ధానికి సమీకరించారు. వారు యూదాలో శోకో అనేచోట సమావేశమయ్యారు. వారి శిబిరం ఏఫెస్దమ్మీము అనే పట్టణం వద్ద పెట్టారు. ఏఫెస్దమ్మీము అనే పట్టణం శోకోకు, అజేకాకు మధ్యగా వుంది.

సౌలు, మరియు ఇశ్రాయేలు సైన్యాలుకూడా సమావేశం అయ్యారు. ఏలా లోయలో వారి శిబిరం ఉంది. ఫిలిష్తీయులతో యుద్ధానికి సౌలు సైన్యం తయారయ్యింది. ఫిలిష్తీయులు ఒక కొండమీద ఉన్నారు, ఇశ్రాయేలీయులు మరో కొండమీద ఉన్నారు. ఈ రెండు కొండల మధ్య లోయ ఉంది.

ఫిలిష్తీయులకు ఒక ప్రఖ్యాత వీరుడు ఉన్నాడు. వానిపేరు గొల్యాతు. వాడు గాతుకు చెందినవాడు. అతని ఎత్తు తొమ్మిది అడుగుల[a] కంటె ఎక్కువ. గొల్యాతు ఫిలిష్తీయుల శిబిరంలో నుంచి బయటికి వచ్చాడు. అతని తలమీద ఒక కంచుటోపీ ఉంది. కంచుతో చేసిన చేప పొలుసులవంటి కవచం అతడు ధరించాడు. ఈ కవచం కంచుతో చెయబడి నూట ఇరవై అయిదు పౌన్ల బరువు ఉంది. గొల్యాతు కాళ్లకు రాగి కవచాలు ఉన్నాయి. కంచు ఈటె[b] ఒకటి అతని మెడమీద కట్టబడి వుంది. గొల్యాతు ఈటెకువున్న కర్రపిడి సాలెవాని మగ్గం వద్దవుండే దోనెలాగా వుంది. ఈటెకత్తి బరువు పది హేను “పౌన్లు.”[c] గొల్యాతు డాలు మోసే భటుడు అతనికి ముందుగా నడిచాడు.

గొల్యాతు బయటకు వచ్చి ఇశ్రాయేలు సైనికులకు కేకవేసాడు: “మీ సైనికులు అందురూ యూద్ధానికి బారులు తీసారు ఎందుకు? మీరు సౌలు సేవకులు. నేను ఫిలిష్తీవాడిని. కనుక మీరు ఒకనిని ఎంపిక చేసుకొని నాతో పోరాడేందుకు వానిని పంపించండి. వాడు గనుక నన్ను చంపితే ఫిలిష్తీయులందరు మీ సేవకులవుతారు. కానీ నేను గెలిచి మీవాడిని చంపితే, మీరంతా మాకు సేవకులు అవుతారు. అప్పుడు మీరు మాకు సేవ చేస్తారు!” అన్నాడు అతను.

10 “ఈ రోజు నేనిలా నిలబడి ఇశ్రాయేలు సైన్యాన్ని ఎగతాళి చేస్తున్నాను! నాతో పోరాడటానికీ మీలో ఒకనిని పంపండి” అనికూడ ఆ ఫిలిష్తీయుడు అన్నాడు.

11 గొల్యాతు చెప్పిన వాటిని సౌలు, ఇశ్రాయేలు సైనికులు విన్నారు. వారు చాలా భయపడ్డారు.

దావీదు యుద్ధ భూమికి వచ్చుట

12 ఎఫ్రాతీయుడైన యెష్షయి కుమారుడు దావీదు, యూదాలో ఉన్న బేత్లెహేముకు చెందినవాడు యెష్షయి. అతనికి ఎనమండుగురు కుమారులు. సౌలు కాలంలో యెష్షయి వృద్ధుడు. 13 యెష్షయి. యొక్క ముగ్గురు పెద్ద కుమారులు సౌలుతోపాటు యుద్ధానికి వెళ్లారు. పెద్ద కుమారుడు ఏలీయాబు. రెండవ కుమారుడు అబీనాదాబు. మూడవ కుమారుడు షమ్మా. 14 దావీదు అందరికంటె చిన్న కుమారుడు. పెద్ద కుమారులు ముగ్గురూ సౌలు సైన్యంలో ఉన్నారు. 15 కానీ దావీదు బేత్లెహేములోని తన తండ్రి గొర్రెలను కాసేందుకు అప్పుడప్పుడూ సౌలును వదిలి వెళ్లేవాడు.

16 ఫిలిష్తీయుడైన గొల్యాతు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం బయటికి వచ్చి ఇశ్రాయేలు సైన్యం ఎదుట నిలబడేవాడు. ఇలా నలుబది రోజులు ఇశ్రాయేలీయులను గొల్యాతు ఎగతాళి చేసాడు.

17 ఒక రోజు యెష్షయి తన కుమారుడైన దావీదుతో ఇలా చెప్పాడు: “యుద్ధాల శిబిరంలో ఉన్న నీ అన్నలకు తూమెడు వేయించిన గోధుమలు, ఈ పది రొట్టెలు తీసుకుని వెళ్లు. 18 ఈ పది జున్ను ముక్కలు కూడ తీసుకుని వెళ్లి నీ సోదరులున్న వేయి మందిగల పటాలం అధికారికీ ఇయ్యి. నీ సోదరులు ఎలా వున్నారో తెలుసుకొని, వారి యోగక్షేమాలకు గుర్తుగా ఏదైనా తిరిగి తీసుకునిరా. 19 నీ సోదరులంతా ఇప్పుడు సౌలుతోనూ, ఇశ్రాయేలు సైన్యంతోనూ కలిసి ఏలా లోయలో ఉన్నారు. వారు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తున్నారు.”

20 దావీదు తెల్లవారు ఝామునే లేచి మరో కాపరికి మందను అప్పగించాడు. ఆహారపు మూటను తీసుకుని యెష్షయి చెప్పిన విధంగా బయలుదేరి వెళ్లాడు. దావీదు తన బండిని శిబిరం యొద్దకు తోలుకెళ్లాడు. దావీదు అక్కడికి వచ్చేటప్పటికి, సైనికులు వారి వారి యుద్ధ స్థావరాలకు వెళ్లుచూ ఉన్నారు. సైనికులు యుద్ధ నినాదాలు చేయటం మొదలుబెట్టారు. 21 ఇశ్రాయేలీయులు, ఫిలిష్తీయులు వారి వారి మనుష్యులను యుద్ధంలో సంధించటానికి సమీకరిస్తున్నారు.

22 ఆహార పదార్థాల అజమాయిషీ వహించే వ్యక్తివద్ద దావీదు తను తెచ్చిన ఆహార పదార్థాలను వుంచి, ఇశ్రాయేలు సైనికులు ఉన్న చోటికి పరుగెత్తాడు. తన సోదరులను గూర్చి దావీదు అడిగాడు. 23 దావీదు తన సోదరులతో సంభాషించటం మొదలుబెట్టాడు. అదే సమయానికి ఫిలిష్తీయుల పోరాట వీరుడు గాతీయుడైన గొల్యాతు ఫిలిష్తీ సైన్యంనుండి బయటకు వచ్చాడు. గొల్యాతు ఇశ్రాయేలీయులను మామూలు గానే కవ్వించే కేకలు వేసాడు. ఇది దావీదు విన్నాడు.

24 గొల్యాతును చూడగానే ఇశ్రాయేలు సైనికులు పారిపోయారు. అతడంటే వారందరికీ భయము. 25 ఇశ్రాయేలు మనుష్యుల్లో ఒకడు ఇలా అన్నాడు: “వాడిని మీరు చూసారా? చూడండి వానిని. గొల్యాతు మాటిమాటికీ బయటికి వచ్చి ఇశ్రాయేలీయులను ఎగతాళి చేస్తున్నాడు. వానిని చంపినవానికి రాజు పుష్కలంగా డబ్బుఇస్తాడు. కనుక గొల్యాతును చంపినవాడు ధనవంతుడైపోతాడు; గొల్యాతును చంపినవానికి సౌలు తన కుమార్తెను కూడ ఇచ్చి వివాహము చేస్తాడు. ఇశ్రాయేలులో వాని కుటుంబాన్ని సౌలు స్వేచ్ఛగా ఉండనిస్తాడు.”

26 తన దగ్గర నిలబడిన మనుష్యులను దావీదు అడిగాడు, “ఈ ఫిలిష్తీవానిని చంపి ఇశ్రాయేలులో ఈ పరాభవాన్ని తొలగించిన వానికి బహుమానం ఏమిటి? ఇంతకూ ఈ గొల్యాతు ఎవడు? వాడు సున్నతి సంస్కారం కూడా లేనివాడు! వాడు కేవలం ఒక ఫిలిష్తీయుడే. జీవిస్తున్న దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అధికారం వానికి ఉందని వాడు ఎలా అనుకుంటున్నాడు?”

27 కనుక ఆ ఇశ్రాయేలువాడు, గొల్యాతును చంపినందుకు లభించే బహుమానం గూర్చి దావీదుకు చెప్పాడు. 28 దావీదు సైనికులతో మాట్లాడుతుండగా అతని పెద్ద అన్న ఏలీయాబు విన్నాడు. దావీదు మీద ఏలీయాబుకు కోపం వచ్చింది. “అసలు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉన్న కొన్ని గొర్రెలను అరణ్యంలో ఎవరి దగ్గర వదిలి పెట్టావు? నాకు తెలుసు నీవు ఇక్కడికి ఎందుకు వచ్చావో! చేయుమని చెప్పింది, చేయటం నీకు ఇష్టం లేదు. యుద్ధం చూడటానికే ఇక్కడికి రావాలనుకున్నావు” అంటూ ఏలీయాబు దావీదును నిలదీసాడు.

29 “ఇంతకూ నేనేం చేసాను? నేనేమి తప్పు చేయలేదే! నేను ఊరికే మాట్లాడుతున్నాను” అన్నాడు దావీదు. 30 దావీదు ఇంకొందరి వైపు తిరిగి మళ్లీ అవే ప్రశ్నలు వేశాడు. వారు కూడ ఇంతకు ముందు చెప్పిన సమాధానలే దావీదుకు చెప్పారు.

31 దావీదు పలికినది అంతా కొందరు సౌలుతో చెప్పారు. దావీదును తన దగ్గరకు తీసుకుని రమ్మని సౌలు వాళ్లకు ఆజ్ఞాపించాడు. 32 దావీదు, “ఎవ్వరినీ నిరుత్సాహ పడనియ్యవద్దు. నేను మీ సేవకుడిని. నేను వెళ్లి ఈ ఫిలిష్తీ వానితో పోరాడుతాను” అని సౌలుతో చెప్పాడు.

33 సౌలు, “నీవు ఈ ఫిలిష్తీ గొల్యాతును ఎదిరించి పోరాడలేవు. నీవు కనీసం ఒక సైనికుడివి కూడ కాదు. గొల్యాతు చిన్నప్పటి నుండీ యుద్ధంలో ఆరితేరిన వాడు” అని జవాబిచ్చాడు.

34 అయితే, “నీ సేవకుడనగు నేను నా తండ్రి గొర్రెలను కాపలా కాస్తూ ఉండేవాడిని. ఎప్పుడైనా ఒక సింహంగాని, ఎలుగు బంటిగాని నా మంద మీది కొచ్చి ఒక గొర్రెను పట్టుకుంటే, 35 దానిని నేను తరిమి కొట్టేవాడిని. ఆ అడవి మృగాన్ని నేను ఎదిరించి, దాని నోటినుండి గొర్రెను రక్షించేవాడిని. ఒకవేళ అదే నా మీదికి వస్తే, దాని జూలు పట్టి దానితో పోరాడి, దాన్ని చంపేసేవాడిని. 36 నేను ఒక సింహాన్ని, ఒక ఎలుగుబంటినీ చంపేసాను. అదే విధంగా సున్నతి సంస్కారం లేని ఆ పరాయి ఫిలిష్తీయుడిని నేను చంపేస్తాను. జీవిస్తున్న దేవుని సైన్యాన్ని గొల్యాతు ఎగతాళి చేసాడు గనుక వాడు చస్తాడు. 37 యెహోవా నన్ను సింహంనుండి, ఎలుగుబంటినుండి కాపాడాడు. ఇప్పుడు ఈ ఫిలిష్తీయుడైన గొల్యాతునుండి కూడ ఆ యెహోవాయే నన్ను రక్షిస్తాడు” అని దావీదు సౌలుతో చెప్పాడు.

“అయితే వెళ్లు. యెహోవా నీకు తోడైయుండునుగాక!” అని దావీదుతో చెప్పాడు సౌలు. 38 సౌలు తన స్వంత వస్త్రాలను దావీదుకు ధరింపజేసాడు. దావీదు తలమీద ఒక కంచు శిరస్త్రాణం (టోపి), అతని వంటిమీద ఒక కవచం సౌలు పెట్టించాడు. 39 దావీదు ఒక కత్తి ధరించి అటు ఇటు నడవటానికి ప్రయత్నించాడు. సౌలు యుద్ధ వస్త్రాలను దావీదు ధరించటానికి ప్రయత్నించాడు. కానీ ఈ బరువులన్నీ ధరించటం దావీదుకు అలవాటు లేదు.

అప్పుడు దావీదు, “ఇవన్నీ వేసుకుని నేను పోరాడలేను. వీటన్నిటికీ నేను అలవాటు పడలేదు,” అని సౌలుతో చెప్పి వాటన్నింటినీ విడిచి వేశాడు. 40 దావీదు తన చేతికర్ర తీసుకున్నాడు. లోయలో ఉన్న మంచి నునుపైన రాళ్లను ఐదింటిని దావీదు ఏరుకొన్నాడు. ఆ అయిదు రాళ్లను తన సంచిలో వేసుకున్నాడు. తన చేతిలో వడిసెలు పుచ్చుకొన్నాడు. అప్పుడు ఫిలిష్తీయుడైన గొల్యాతును ఎదురించేందుకు అతడు వెళ్లాడు.

దావీదు గొల్యాతును చంపుట

41 ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. 42 గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే. 43 గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు. 44 “ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు.

45 “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు. 46 ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది. 47 ప్రజలను రక్షించాలంటే యెహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు.

48 ఫిలిష్తీయుడైన గొల్యాతు దావీదు మీద పడటానికి మెల్లగా దగ్గరగా వెళ్లాడు. దావీదు గొల్యాతును ఎదుర్కోటానికి వేగంగా పరుగెత్తాడు.

49 దావీదు తన సంచిలో నుంచి ఒక రాయి తీసి వడిసెలలో పెట్టి దానిని విసరికొట్టాడు. ఆ రాయి వడిసెల నుండి వెళ్లి గొల్యాతునుదుటి మీద గట్టిగా తగిలింది. ఆ రాయి అతని తలలోనికి లోతుగా దూసుకుపోయింది. గొల్యాతు ఒక్క సారిగా నేలమీద బోర్ల పడిపోయాడు.

50 అలా దావీదు ఫిలిష్తీయుల యోధుణ్ణి కేవలం ఒక రాయి, వడిసెలతోనే ఓడించేసాడు. ఒక్క దెబ్బతో వానిని చంపేసాడు. దావీదు చేతిలో కనీసం కత్తికూడ లేదు. 51 కనుక దావీదు పరుగున పోయి పడివున్న గొల్యాతు పక్కన నిలబడ్డాడు. తరువాత దావీదు గొల్యాతు ఒరలోవున్న కత్తిని లాగి దానితోనే గొల్యాతు తలను నరికివేశాడు. అలా దావీదు ఫిలిష్తీయుల వీరుని హతమార్చాడు.

ఎప్పుడయితే తమ వీరుడు చావటం మిగతా ఫిలిష్తీయులు చూసారో అప్పుడు వెనుదిరిగి పారిపోయారు. 52 ఇశ్రాయేలు, యూదా సైనికులు జయజయధ్వనులు చేస్తూ ఫిలిష్తీయుల సైనికులను గాతు నగర సరిహద్దుల వరకు, ఎక్రోను నగర ద్వారం వరకు తరిమి తరమి కొట్టారు. చాలామంది ఫిలిష్తీయులను వారు చంపేసారు. వారి శవాలు షరాయిము బాటపై గాతు, ఎక్రోనుల వరకు అంత దూరమూ పడివున్నాయి. 53 ఫిలిష్తీయుల సైన్యాన్ని వెళ్లగొట్టి వచ్చి, ఇశ్రాయేలు సైనికులు ఫిలిష్తీయుల గుడారాల నుంచి చాలా వస్తు సంపదను తీసుకున్నారు.

54 గొల్యాతు తలను దావీదు యెరూషలేముకు తీసుకుని వెళ్లాడు. ఆ ఫిలిష్తీయుల యోధుని ఆయుధాలను కూడా దావీదు తన గుడారములో పెట్టాడు.

దావీదును గూర్చి సౌలుకు భయం ప్రారంభం

55 దావీదు ధైర్యంగా గొల్యాతును ఎదుర్కొన్న తీరును సౌలు గమనించాడు. తన సేనాని అబ్నేరును పిలిచి, “ఆ కుర్రవాని తండ్రి ఎవరని” అడిగాడు.

“మీ తోడు అతనెవరో నాకు తెలియదు రాజా” అన్నాడు అబ్నేరు.

56 సౌలు, “ఆ కుర్రవాని తండ్రి ఎవరో తెలుసుకో” అన్నాడు.

57 గొల్యాతును చంపి దావీదు తిరిగి రాగానే అబ్నేరు అతనిని సౌలువద్దకు తీసుకుని వచ్చాడు. దావీదు ఇంకా ఆ ఫిలిష్తీయుని తలను చేతిలో పట్టుకొని ఉన్నాడు.

58 “చిన్నవాడా! నీ తండ్రి ఎవరు?” అని సౌలు అతన్ని అడిగాడు.

“బేత్లెహేములో ఉన్న మీ సేవకుడు యెష్షయి కుమారుడను నేను” అని దావీదు జవాబు చెప్పాడు.

రోమీయులకు 15

15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము. దేవునికి ఘనత కలగాలని క్రీస్తు మిమ్మల్ని అంగీకరించినట్లే మీరు కూడా ఇతర్లను అంగీకరించండి. మూలపురుషులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాలని, దేవుడు సత్యవంతుడని నిరూపించాలని, క్రీస్తు యూదుల సేవకుడు అయ్యాడు. యూదులు కానివాళ్ళు దేవుని అనుగ్రహం కోసం ఆయన్ని స్తుతించాలని క్రీస్తు ఉద్దేశ్యం. ఈ సందర్భాన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఈ కారణంగానే యూదులు కాని వాళ్ళతో కలిసి నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరిట భక్తి గీతాలు పాడతాను.”(A)

10 మరొక చోట:

“యూదులు కాని ప్రజలారా!
    మీరు కూడా దేవుని ప్రజలతో ఆనందించండి.”(B)

11 ఇంకొక చోట ఇలా వ్రాయబడి వుంది:

“యూదులు కాని ప్రజలారా! ప్రభువును స్తుతించండి.
    ఆయన్ని స్తుతిస్తూ గీతాలు పాడండి!”(C)

12 యెషయా ఒక చోట ఈ విధంగా అన్నాడు:

“యెష్షయి వంశ వృక్షం యొక్క వేరు చిగురిస్తుంది.
    ఆయన దేశాలను పాలిస్తాడు.
    యూదులు కానివాళ్ళు ఆయనలో నిరీక్షిస్తారు.”(D)

13 రక్షణ లభిస్తుందని నిరీక్షణ కలిగించే ఆ దేవుడు మీలో ఉన్న విశ్వాసం ద్వారా మీకు సంపూర్ణమైన ఆనందాన్ని, శాంతిని కలుగ చేయుగాక! అప్పుడు మీలో ఉన్న నిరీక్షణ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొంగి పొర్లుతుంది.

ఉద్దేశ్యం

14 సోదరులారా, మీలో మంచితనముందని, సంపూర్ణమైన జ్ఞానం మీలో ఉందని, పరస్పరం బోధించుకోగల సామర్థ్యం మీలో ఉందని నాకు నమ్మకం ఉంది. 15 అయినా నేను కొన్ని విషయాల్ని గురించి మీకు జ్ఞాపకం చెయ్యాలని వాటిని గురించి మీకు ధైర్యంగా వ్రాసాను. దేవుడిచ్చిన వరం వల్ల ఇది చెయ్యగలిగాను. ఆ వరము ఏదనగా 16 నేను యాజకునిగా పని చేస్తూ దైవసందేశాన్ని యూదులు కానివాళ్ళకు బోధించాలని దేవుడు నన్ను యేసు క్రీస్తుకు సేవకునిగా చేసాడు. ఇందువలన యూదులు కానివాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా పవిత్రం చేయబడి దేవునికి అంగీకారమైన సంతానం కాగలరు.

17 అందువల్ల, నేను యేసు క్రీస్తు ద్వారా దేవుని సేవ చేస్తున్నందుకు గర్విస్తున్నాను. 18 క్రీస్తు నా ద్వారా చేసినవాటిని గురించి మాత్రమే నేను ధైర్యంగా చెప్పుకుంటాను. యూదులు కానివాళ్ళు నేను చేసిన బోధనల ద్వారా, నా కార్యాల ద్వారా దైవసందేశాన్ని అనుసరించేటట్లు క్రీస్తు చేసాడు. 19 గుర్తుల ద్వారా, అద్భుతాల ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ పని సాధించాడు. అందుకే యెరూషలేము నుండి ఇల్లూరికు దాకా అన్ని ప్రాంతాలలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించగలిగాను. 20 క్రీస్తును గురించి తెలియని ప్రాంతాలలో సువార్తను ప్రకటించాలనే ఆశయం నాలో ఉంది. మరొకడు వేసిన పునాదిపై ఇల్లు కట్టటం నాకిష్టం లేదు. 21 అందుకే ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ఆయన్ని గురించి చెప్పబడినవాళ్ళు చూస్తారు.
    కాని వాళ్ళు తెలుసుకొంటారు. ఆయన్ని గురించి విననివాళ్ళు అర్థం చేసుకొంటారు.”(E)

రోము నగరాన్ని దర్శించాలని ప్రయత్నం

22 మీ దగ్గరకు రావటానికి ఈ పరిస్థితుల కారణంగా నాకు ఎన్నో ఆటంకాలు కలిగాయి.

23 ఈ ప్రాంతంలో నేను చేయవలసిన పని ముగిసింది. అంతేకాక ఎన్నో సంవత్సరాల నుండి మిమ్ముల్ని కలుసుకోవాలనుకొంటున్నాను. 24 నేను స్పెయిను దేశానికి వెళ్ళేటప్పుడు రోము నగరానికి వచ్చి కొన్ని రోజులు మీతో ఆనందంగా గడపాలని ఆశిస్తున్నాను. అక్కడి నుండి నేను ప్రయాణం సాగించినప్పుడు మీరు నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను.

25 కాని ప్రస్తుతం నేను యెరూషలేములోని దేవుని ప్రజలకు సహాయం చెయ్యటానికి అక్కడికి వెళ్తున్నాను. 26 ఎందుకంటే యెరూషలేములోని దేవుని ప్రజల్లో ఉన్న పేదవాళ్ళ కోసం మాసిదోనియ, అకయ ప్రాంతాలలోని సోదరులు చందా ఇవ్వటానికి ఆనందంగా అంగీకరించారు. 27 వాళ్ళు ఈ చందా ఆనందంగా ఇచ్చారు. వాళ్ళకు వీళ్ళు సహాయం చెయ్యటం సమంజసమే. ఎందుకంటే, యూదులు కానివాళ్ళు, యెరూషలేములోని దేవుని ప్రజలు ఆత్మీయ ఆశీర్వాదంలో భాగం పంచుకొన్నారు. కనుక తమకున్న వాటిని వీళ్ళు వాళ్ళతో పంచుకోవటం సమంజసమే. 28 ఈ కార్యాన్ని ముగించి వాళ్ళందరికీ చందా తప్పక ముట్టేటట్లు చూసి స్పెయిను దేశానికి వెళ్ళే ముందు మిమ్మల్ని చూడటానికి వస్తాను. 29 నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తునుండి సంపూర్ణంగా ఆశీస్సులు పొంది వస్తానని నాకు తెలుసు.

30 సోదరులారా! మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ ద్వారా మిమ్మల్ని వేడుకొనేదేమిటంటే, నా కోసం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రార్థించండి. 31 యూదయ ప్రాంతంలోని విశ్వాసహీనులనుండి నేను రక్షింపబడాలని, యెరూషలేములోని దేవుని ప్రజలు నా సహాయాన్ని ఆనందంగా అంగీకరించాలని ప్రార్థించండి. 32 తదుపరి, నేను దేవుని చిత్తమైతే మీ దగ్గరకు ఆనందంగా వచ్చి మీతో సమయం గడుపుతాను. 33 శాంతి ప్రదాత అయినటువంటి దేవుడు మీ అందరికీ తోడుగా ఉండు గాక! ఆమేన్.

విలాప వాక్యములు 2

యెహోవా యెరూషలేమును నాశనం చేయుట

సీయోను కుమార్తెను (యెరూషలేము) యెహోవా మేఘముతో కప్పి
    ఎలా మరుగు పర్చినాడో చూడుము.
ఇశ్రాయేలు వైభవాన్ని ఆయన ఆకాశాన్నుండి
    భూమికి త్రోసివేశాడు.
యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు
    ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు పెట్టు కోలేదు.
యాకోబు (ఇశ్రాయేలు) ఇండ్లను యెహోవా మింగివేశాడు.
    కనికరం లేకుండా ఆయన వాటిని మింగివేశాడు.
ఆయన తన కోపంలో యూదా కుమార్తె (యూదా రాజ్యం) కోటలను నాశనం చేశాడు.
    యూదా రాజ్యాన్ని, దాని పాలకులను యెహోవా నేలకు పడదోసినాడు.
    ఆయన రాజ్యాన్ని నాశనం చేశాడు.
యెహోవా తన కోపంతో ఇశ్రాయేలు
    బలాన్ని క్షయం చేశాడు.
ఆయన తన కుడిచేతిని ఇశ్రాయేలు మీదినుండి తీసివేశాడు.
    శత్రువు వచ్చినప్పుడు ఆయన అలా చేశాడు.
యాకోబు (ఇశ్రాయేలు) లో ఆయన అగ్నిశిలలా మండినాడు.
    ప్రళయాగ్నిలా ఆయన ఉన్నాడు.
ఒక శత్రువులా యెహోవా తన విల్లు వంచాడు.
    అయన కుడిచేయి తన ఖడ్గం ఒరమీద వుంది.
బాగా కన్పించే యూదా మనుష్యులందరినీ ఆయన చంపివేశాడు.
    యెహోవా ఒక శత్రువులా వారిని హతమార్చినాడు.
యెహోవా తన కోపాన్ని కుమ్మరించాడు.
    ఆయన దానిని సీయోను గుడారాలపై కుమ్మరించాడు.

యెహోవా ఒక శత్రువులా అయ్యాడు.
    ఆయన ఇశ్రాయేలును మింగేశాడు.
ఆయన దాని స్థలాలన్నిటినీ మింగేశాడు.
    ఆయన దాని కోటలన్నిటినీ మింగేశాడు.
మృతుల కొరకు యూదా కుమార్తెలో మిక్కిలి దుఃఖాన్ని,
    బాధను కలుగ జేశాడు.

యెహోవా తన స్వంత గుడారాన్నే
    ఒక తోట మాదిరి నాశనం చేసినాడు.
ప్రజలు ఎక్కడ సమావేశమై తనను ఆరాధిస్తారో
    ఆ ప్రదేశాన్నే ఆయన పాడుజేశాడు.
సీయోనులో ప్రత్యక సమావేశాలు, ప్రత్యేక విశ్రాంతి దినాలను
    ప్రజలు మర్చిపోయేలా యెహోవా చేశాడు.
యెహోవా రాజును, యాజకుని తిరస్కరించాడు.
    తన కోపంలో ఆయన వారిని తిరస్కరించాడు.
యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు.
    ఆయన తన పవిత్ర ఆరాధనా స్థలాన్ని తిరస్కరించాడు.
యెరూషలేము కోట గోడలను
    ఆయన శత్రువులకు అప్పజెప్పాడు.
యెహోవా ఆలయంలో శత్రువు అల్లరి చేశాడు.
    అది ఒక సెలవు రోజు అన్నట్లు వారు అల్లరి చేశారు.
సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను
    కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు.
ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు.
    దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు.
కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు.
    అవి ఒక్కుమ్మడిగా శిథిలమై పోయాయి.

యోరూషలేము ద్వారాలు భూమిలోకి క్రుంగి పోయాయి.
    ద్వారాల కడ్డీలను ఆయన నుగ్గు నుగ్గు చేశాడు.
ఆమె యొక్క రాజు, యువరాజులు పరదేశాలకు పోయి ఉన్నారు.
    వారికి ఇక ఎంత మాత్రం ఉపదేశం లేదు.
యెరూషలేము ప్రవక్తలకు కూడా యెహోవా నుండి
    దర్శనాలు ఏమీలేవు.

10 సీయోను పెద్దలు నేలపై కూర్చున్నారు.
    వారు కింద కూర్చుండి మౌనం వహించారు.
వారు తమ తలలపై దుమ్ము జల్లుకున్నారు.
    వారు గోనెపట్ట కట్టుకున్నారు.
యెరూషలేము యువతులు దుఃఖంతో
    తమ తలలు కిందికి వంచుకున్నారు.

11 కన్నీళ్లతో నా కళ్లు నీరసించాయి!
    నా అంత రంగంలో గందరగోళం చెలరేగుతూవుంది!
నా గుండె జారి కిందపడినట్లు భావన కలుగుతూ ఉంది!
    నా ప్రజల నాశనం చూసిన నాకు ఆ భావన కలుగుతూ ఉంది.
పిల్లలు, పసికందులు నగర రహదారి స్థలాలలో
    మూర్ఛపోతున్నారు.
12 “రొట్టె, ద్రాక్షారసం ఏవి?”
    అని ఆ పిల్లలు తమ తల్లులను అడుగుతున్నారు.
వారు చనిపోతూ ఈ ప్రశ్న అడుగుతున్నారు.
    వారు తమ తల్లుల ఒడిలో పడుకొని ఉండగా చనిపోతున్నారు.
13 సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను?
    నిన్ను దేనితో పోల్చాలి?
సీయోను కుమారీ, నిన్ను దేనితో పోల్చను?
    నిన్నెలా ఓదార్చగలను?
నీ వినాశనం సముద్రమంత పెద్దది!
    ఎవ్వరేగాని నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు.

14 నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు.
    కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు.
పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు.
    పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నమూ చేయలేదు.
వారు నీకొరకు ఉపదేశాలు అందించారు.
    కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.

15 మార్గమున పోవు వారు నిన్ను చూసి
    విస్మయంతో చేతులు చరుస్తారు.
యెరూషలేము కుమార్తెను చూచి
    వారు ఈలవేసి తలలు ఆడిస్తారు.
“‘అపురూప అందాల నగరం’ అనీ,
    ‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని
    ‘ప్రజలు పిలిచే నగరం ఇదేనా’?” అని వారడుగుతారు.

16 నీ శత్రువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు.
    వారు ఈలవేసి, నిన్నుజూచి పండ్లు కొరుకుతారు.
“మేము వారిని మింగేశాము!
    నిజంగా మేము ఈ రోజుకొరకే ఎదురుచూశాము.
చివరకు ఇది జరగటం మేము చూశాము”
    అని వారంటారు.

17 యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు.
    ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చేసివేశాడు.
    పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూవచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు.
దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు.
    నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు.
    ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు.

18 ఓ సీయోను కుమార్తె ప్రాకారమా, నీ గుండెలు పగిలేలా యెహోవాకు మొరపెట్టుకో!
    నీ కన్నీరు వాగులా పారనీ!
    నీ కన్నీరు మున్నీరై పారనీ!
నీ కన్నీరు రాత్రింబవళ్లు కారనీ! వాటిని ఆపకు!
    నీ కండ్లకు విశ్రాంతి నివ్వకు!

19 లెమ్ము! రాత్రిళ్లు రోదించు!
    రాత్రిళ్లు ప్రతి ఝామున దుఃఖించు!
ఒక జలరాశిలా నీ గుండె కుమ్మరించు!
    యెహోవా ముందు నీ గుండె కుమ్మరించు!
నీ చేతులెత్తి యెహోవాకు ప్రార్థన చేయుము.
    నీ పిల్లలు బ్రతికేలా చేయుమని ఆయనను ప్రాధేయపడుము.
    ఆకలితో అలమటించి సొమ్మసిల్లే నీ పిల్లలను బతికించుమని ఆయనను అర్థించుము.
    ఆకలితో మాడి నగర వీధుల్లో వారు సొమ్మసిల్లి పడిపోతున్నారు.

20 యెహోవా, నావైపు చూడుము!
    నీవు ఈ రకంగా శిక్షించినది ఎవ్వరినో చూడు!
నన్ను ఈ ప్రశ్న అడుగనిమ్ము:
    తాము కన్న బిడ్డలనే స్త్రీలు తినవలెనా?
తాము పెంచి పోషించిన బిడ్డలనే స్త్రీలు తినవలెనా?
    యాజకుడు, ప్రవక్త యెహోవా ఆలయంలో చంపబడాలా?
21 యువకులు, ముసలివారు
    నగర వీధుల్లో దుమ్ములో పడివున్నారు.
నా యువతీ యువకులు
    కత్తి వేటుకు గురియైనారు.
యెహోవా, నీవు కోపగించిన రోజున నీవు వారిని చంపేశావు!
    దయ లేకుండా నీవు వారిని చంపివేశావు!

22 నలుమూలల నుండి నా మీదికి భయాన్ని ఆహ్వానించావు.
    ఏదో విందుకు ఆహ్వానించినట్లు నీవు భయాన్ని ఆహ్వానించావు.
యెహోవాకు కోపం వచ్చిన రోజున తప్పించుకున్నవాడుగాని, దానిని తట్టుకున్నవాడుగాని ఒక్కడూ లేడు.
    నేను పెంచి పోషించిన వారందరినీ నా శత్రువు చంపివేశాడు.

కీర్తనలు. 33

33 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
    నమ్మకమైన మంచి మనుష్యులారా, ఆయనను స్తుతించండి.
సితారా వాయిస్తూ, యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు పదితంతుల స్వరమండలాన్ని వాయించండి.
ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
    ఆనంద గీతాన్ని ఇంపుగా పాడండి.
దేవుని మాట సత్యం!
    ఆయన చేసే ప్రతిదాని మీద నీవు ఆధారపడవచ్చును.
నీతిన్యాయాలను దేవుడు ప్రేమిస్తాడు.
    యెహోవా భూమిని తన ప్రేమతో నింపాడు.
యెహోవా ఆజ్ఞ ఇవ్వగానే లోకం సృష్టించబడింది.
    భూమి మీద ఉన్న సమస్తాన్నీ దేవుని నోటి నుండి వచ్చే శ్వాస సృజించింది.
సముద్రంలోని నీరు అంతటినీ దేవుడు ఒక్కచోట రాశిగా కూర్చాడు.
    మహా సముద్రాన్ని దాని స్థానంలో ఆయనే ఉంచాడు.
భూమి మీద ప్రతి మనిషీ యెహోవాకు భయపడి ఆయనను గౌరవించాలి.
    ఈ లోకంలో జీవించే మనుష్యులందరూ ఆయనకు భయపడాలి.
ఎందుకంటే దేవుడు ఆదేశించిన తక్షణం దాని ప్రకారం నెరవేరుతుంది.
    ఏదైనా “నిలిచిపోవాలని” ఆయన ఆజ్ఞ ఇస్తే, అప్పుడు అది ఆగిపోతుంది.
10 జనసమూహాల పథకాలను పనికిమాలినవిగా యెహోవా చేయగలడు.
    వారి తలంపులన్నింటినీ ఆయన నాశనం చేయగలడు.
11 అయితే యెహోవా సలహా శాశ్వతంగా మంచిది.
    ఆయన తలంపులు తర తరాలకు మంచివి.
12 యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ ప్రజలు ధన్యులు.
    దేవుడే వారిని తన స్వంత ప్రజలుగా ఏర్పాటు చేసుకొన్నాడు.
13 యెహోవా పరలోకం నుండి క్రిందికి చూసాడు.
    మనుష్యులందరిని ఆయన చూశాడు.
14 భూమి మీద నివసిస్తున్న మనుష్యులందరినీ
    ఆయన తన ఉన్నత సింహాసనం నుండి చూశాడు.
15 ప్రతి మనిషి మనస్సునూ దేవుడు సృష్టించాడు.
    ప్రతి మనిషి ఏమి చేస్తున్నాడో అది అయన గ్రహిస్తాడు.
16 ఒక రాజు తన స్వంత గొప్ప శక్తితో రక్షించబడడు.
    ఒక సైనికుడు తన స్వంత గొప్ప బలంతో రక్షించబడడు.
17 యుద్ధంలో గుర్రాలు నిజంగా విజయం తెచ్చిపెట్టవు.
    తప్పించుకొనేందుకు వాటి బలం నిజంగా నీకు సహాయపడదు.
18 యెహోవాను అనుసరించే మనుష్యులను ఆయన కాపాడుతాడు,
    ఆయన నిజమైన ప్రేమయందు నిరీక్షణయుంచు వారిని జాగ్రత్తగా చూస్తాడు. ఆయన మహా ప్రేమ, ఆయనను ఆరాధించే వారిని కాపాడుతుంది.
19 ఆ మనుష్యులను మరణం నుండి రక్షించేవాడు దేవుడే.
    ఆ మనుష్యులు ఆకలిగా ఉన్నప్పుడు ఆయన వారికి బలాన్ని యిస్తాడు.
20 అందుచేత మనం యెహోవా కోసం కనిపెట్టుకుందాము.
    ఆయన మనకు సహాయం, మన డాలు.
21 దేవుడు నన్ను సంతోషపరుస్తాడు,
    నేను నిజంగా ఆయన పవిత్ర నామాన్ని నమ్ముకొంటాను.
22 యెహోవా, మేము నిజంగా నిన్ను ఆరాధిస్తున్నాము.
    కనుక నీ గొప్ప ప్రేమ మాకు చూపించుము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International