M’Cheyne Bible Reading Plan
సౌలు చేసిన మొదటి తప్పు
13 అప్పటికి సౌలు పరిపాలించటం మొదలు పెట్టి ఒక సంవత్సరం అయింది. అతడు రెండు సంవత్సరాలు పాలించేసరికి 2 ఇశ్రాయేలునుండి మూడు వేల మందిని సైన్యానికి ఎంపిక చేశాడు. కొండల ప్రాంతమైన బేతేలు పట్టణం దగ్గర మిక్మషులో అతనితోకూడ రెండు వేలమంది ఉన్నారు. బెన్యామీనులోని గిబియాలో యోనాతానుతో ఒక వెయ్యిమంది ఉన్నారు. సైన్యంలో మిగిలిన వారిని సౌలు ఇంటికి పంపేశాడు.
3 యోనాతాను ఫిలిష్తీయులను గెబాలో ఉన్న వారి శిబిరం వద్దనే ఓడించాడు. ఇది విన్న ఫిలిష్తీయులు “హెబ్రీ జనం తిరుగుబాటు చేశారని” అరిచారు.
“హెబ్రీ ప్రజలు జరిగినదంతా వినాలని” సౌలు అన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు దేశమంతా చాటింపు వేసి చెప్పమని మనుష్యులను పురమాయించాడు సౌలు. 4 ఇశ్రాయేలీయులంతా ఈ వార్త విని, “సౌలు ఫిలిష్తీయులను ఓడించాడు గనుక వాళ్లు మనల్ని ఇప్పుడు మరింత అసహ్యించుకుంటారని” అన్నారు.
సౌలును గిల్గాలు వద్ద కలుసుకోవాలని ఇశ్రాయేలు ప్రజలకు పిలుపు వచ్చింది. 5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలుపై దెబ్బ తీయటానికి సమాయత్తమయ్యారు. వారికి మూడు వేల రథాలు ఉన్నాయి. ఆరువేల మంది అశ్వదళ సైనికులు ఉన్నారు. సముద్ర తీరాన ఇసుక ఉన్నట్లుగా ఫిలిష్తీయుల సైన్యంకూడ లెక్కకు మించి ఉంది. వారంతా పోయి మిక్మషు వద్ద గుడారాలు వేసుకున్నారు. బేతావెనుకు తూర్పుగా మిక్మషు ఉంది.
6 ఇశ్రాయేలు ప్రజలు తాము చాలా విషమ స్థితిలో వున్నట్లు గమనించారు. వారు చిక్కులో పడ్డామని గుర్తించి వారంతా పారిపోయి కొండగుహల్లోను, బండ సందుల్లోను, పొదల్లోను దాక్కున్నారు. మరికొందరు రాతిబండల వెనుక, గోతులలోను, నూతులలోను దాక్కున్నారు. 7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు, గిలాదు ప్రాంతాలకు వెళ్లారు. కాని సౌలు గిల్గాలులోనే ఉన్నాడు. తన సైన్యంలోని వారంతా భయంతో వణకిపోయారు.
8 సమూయేలు గిల్గాలులో సౌలును కలుస్తానని చెప్పాడు. అందువల్ల సౌలు గిల్గాలులో ఏడు రోజులు ఉన్నాడు. కాని సమూయేలు రాలేదు. సైనికులు ఒక్కొక్కరే సౌలును వదిలి పోవటం మొదలు పెట్టారు. 9 “దహన బలులను, సమాధాన బలులను తన దగ్గరకు తీసుకుని రమ్మని” చెప్పాడు. అవి వచ్చిన పిమ్మట సౌలు దహన బలులు అర్పించాడు. 10 సౌలు దహనబలి అర్పించి ముగించే సరికి సమూయేలు వచ్చాడు. సౌలు ఆయనను కలుసుకొనేందుకు వెళ్లాడు.
11 సమూయేలు, “నీవు చేసిన పని ఏమిటి?” అని సౌలును అడిగాడు.
అందుకు సౌలు, “మిక్మషు వద్ద ఫిలిష్తీయులు కూడుకొంటున్నారు. సైనికులేమో నన్ను విడిచిపెట్టేసి, ఒక్కొక్కరే వెళ్లిపోవటం నేను గమనించాను. నీవేమో సమయానికి ఇక్కడికి రాలేదు. 12 గిల్గాలు వద్ద ఫిలిష్తీయులు నా మీదకు వస్తారని నేననుకున్నాను. అప్పటికి నేను ఇంకా దేవుని సహాయం అర్థించియుండలేదు. అందువల్ల నేను బలవంతంగా దహనబలి అర్పించాను” అని చెప్పాడు.
13 అది విన్న సమూయేలు, “నీవు చాలా అవివేకంగా ప్రవర్తించావు! నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నీవు పాటించలేదు. నీవు ఆయన ఆజ్ఞను పాటించివుంటే, ఆయన ఇశ్రాయేలు మీద నీ కుటుంబ పాలన ఎప్పటికీ కొనసాగేలా చేసేవాడు. 14 ఇప్పుడు నీ పాలన అంతం అవుతుంది. యెహోవాకు విధేయుడు కావాలని కోరేవాని కోసం యెహోవా చూశాడు. యెహోవా అతనిని కనుగొన్నాడు. యెహోవా అతనిని తన ప్రజలకు కొత్త నాయకునిగా ఎంపిక చేసాడు. నీవు యెహోవా ఆజ్ఞకు విధేయుడవు కాలేదు. కనుక యెహోవా కొత్త నాయకుని ఎంపిక చేసాడు!” అని చెప్పాడు.
15 అప్పుడు సమూయేలు బయల్దేరి గిల్గాలు విడిచి వెళ్లిపోయాడు.
మిక్మషువద్ద యుద్ధం
సౌలు, అతనితో మిగిలిన సైన్యం గిల్గాలు విడిచి బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు. తన వద్ద మిగిలిన సైన్యాన్ని సమీకరించుకొని చూస్తే సౌలు వద్ద ఆరువందల మంది మాత్రమే మిగిలారు. 16 సౌలు, అతని కుమారుడు యోనాతాను, మరియు సైనికులు బెన్యామీను ప్రాంతంలోని గిబియాకు వెళ్లారు.
ఫిలిష్తీయులు మిక్మషులో గుడారాలు వేసుకొనియుండిరి. 17 మెరుపు దాడులు చేసే మూడు దళాలు ఫిలిష్తీయుల శిబిరంనుంచి బయలుదేరాయి. ఒక దళం ఉత్తరంగా షూయాలు ప్రాంతంలో ఓఫ్రా మార్గంలో వెళ్లింది. 18 రెండవది వాయవ్య దిశగా బేత్ హోరోనుకు పోయే మార్గంలో వెళ్లింది. మూడవ దళం తూర్పున సరిహద్దు మార్గంలో వెళ్లింది. ఆ దారి అరణ్య దిశగా జెబోయిము లోయకు సమీపంగా ఉంది.
19 ఇశ్రాయేలు ప్రజలు ఎవ్వరూ ఇనుముతో ఏ వస్తువూ చేయలేరు. ఇశ్రాయేలులో కమ్మరి ఒక్కడూ లేడు. “(కమ్మరివాళ్లు ఉంటే) ఇశ్రాయేలీయులు కత్తులను ఈటెలను చేయించుకొనెదరు” అని ఫిలిష్తీయులు చెప్పుకొని కమ్మరి వాళ్లు లేకుండా చేసిరి. 20 ఇనుప వస్తువులను ఫిలిష్తీయులు మాత్రమే పదును పెట్టగలరు. అందుచేత ఇశ్రాయేలీయులు వారి నాగళ్లు, పారలు, గొడ్డళ్లు, లేక కొడవళ్లు గనుక పదును చేయాల్సివస్తే, వారు ఫిలిష్తీయుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చేది. 21 నాగళ్లు, పారలు సాన బెట్టడానికి ఫిలిష్తీ కమ్మరులు 1/3 వంతు ఔన్సు వెండి పుచ్చుకొనేవారు. మరియు గునపాలు, గొడ్డళ్లు, మునికోల ఇనుప కొనలు సాన బెట్టటానికి వారు 1/6 వంతు ఔన్సు (వెండి) (అక్షరాలషెకెలులో మూడోవంతు) పుచ్చుకొనేవారు. 22 కనుక యుద్ధం రోజున సౌలు వెంట ఉన్న ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరి వద్దా (ఇనుప) ఖడ్గాలు, ఈటెలు లేవు. సౌలుకు, అతని కుమారుడు యోనాతానుకు మాత్రమే ఇనుప ఆయుధాలు ఉన్నాయి.
23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది.
దేవుని దయ
11 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు. 2 తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు: 3 “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపివేసారు. నీ బలిపీఠాన్ని నేలమట్టం చేసారు. మిగిలినవాణ్ణి నేనొక్కణ్ణే. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు.”(A) 4 అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేల మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”(B)
5 అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. 6 ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.[a]
7-8 అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్నవాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.”(C)
“చూడలేని కళ్ళను,
వినలేని చెవుల్ని ఇచ్చాడు.
ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు.”(D)
9 ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు:
“వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక!
వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!
10 వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక!
వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయివాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!”(E)
11 నేను ఇంకొక ప్రశ్న వేస్తాను: యూదులు లేవలేనంత క్రిందపడి పొయ్యారా? లేదు. వాళ్ళు పాపాలు చేయటం వల్ల యూదులు కానివాళ్ళకు రక్షణ లభించింది. యూదుల్లో ఈర్ష్య కలగాలని ఇలా జరిగింది. 12 వాళ్ళు పాపాలు చెయ్యటం వల్ల ప్రపంచానికి ఐశ్వర్యం కలిగింది. వాళ్ళకు నష్టం కలగటం వల్ల యూదులు కానివాళ్ళు భాగ్యవంతులయ్యారు. అలాగైతే వాళ్ళు సంపూర్ణంగా క్రీస్తును అంగీకరించియుంటే ఇంకెంత లాభం కలుగుతుందో గ్రహించండి.
13 యూదులుకాని ప్రజలారా! ఇప్పుడిక నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీ కోసం క్రీస్తు అపొస్తలునిగా పని చేస్తున్నాను కనుక, నేను చేస్తున్న పనిపట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. 14 ఈ విధంగానైనా నా వాళ్ళలో ఈర్ష్య కలుగచేసి, వాళ్ళలో కొందర్నైనా రక్షించ కలుగుతానని ఆశిస్తున్నాను. 15 వాళ్ళు నిరాకరించటం వల్ల ప్రపంచానికి దేవునితో స్నేహం కలిగింది. అలాంటప్పుడు వాళ్ళు అంగీకరించియుంటే మరణంనుండి జీవానికి వచ్చినట్లే. 16 పిండిముద్దలో ఒక భాగం ప్రథమ ఫలంగా దేవునికి సమర్పిస్తే, అది పవిత్రమైతే, ముద్ద అంతా పవిత్రమైనట్లే కదా! వేర్లు పవిత్రమైతే కొమ్మలు పవిత్రమైనట్లే కదా!
17 చెట్టు కొమ్మల్ని కొన్నిటిని కొట్టివేసి, అడవి ఒలీవ చెట్ల కొమ్మలవలెనున్న మిమ్మల్ని దేవుడు అంటుకట్టాడు. తద్వారా వేరులోనున్న బలాన్ని మీరు పంచుకొంటున్నారు. 18 కాని ఆ కొమ్మలపైగా గర్వించకండి. మీ వల్ల వేరు పోషింపబడుటలేదు. వేరు వల్ల మీరు పోషింపబడుతున్నారు. 19 మమ్మల్ని అంటు కట్టాలని కొమ్మలు కొట్టివేయబడ్డాయి అని మీరనవచ్చు. 20 నిజమే! విశ్వాసం లేనందువల్ల అవి కొట్టి వేయబడ్డాయి. మీలో విశ్వాసం ఉండటం వల్ల మీరా చెట్టునంటుకొని ఉన్నారు. అలా అని గర్వించకండి. భయంతో ఉండండి. 21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు.
22 అందువల్ల దేవుని కరుణను, కోపాన్ని అర్థం చేసుకొనండి. విశ్వసించని కొమ్మల్ని నరికి వేసి ఆయన తన కోపాన్ని ప్రదర్శించాడు. మీరు ఆయన కరుణను అంటి పెట్టుకొని జీవిస్తుంటే కరుణను చూపుతూ ఉంటాడు. లేని పక్షాన మిమ్మల్ని కూడా కొట్టివేస్తాడు. 23 వాళ్ళు, మేము విశ్వాసహీనంగా ఉంటామని మొండి పట్టు పట్టకుండా ఉంటే, దేవుడు మళ్ళీ వాళ్ళను అంటు కడతాడు. వాళ్ళను తిరిగి అంటుకట్టే శక్తి దేవునికి ఉంది. 24 స్వాభావికంగా అడవి జాతికి చెందిన ఒలీవల చెట్లనుండి కొట్టిన కొమ్మలవలెనున్న మిమ్మల్ని మేలురకపు చెట్టుకు అంటు వేయగలిగితే, మేలు రకపు ఒలీవల చెట్ల కొమ్మల్ని స్వజాతికి చెందిన చెట్టుకు అంటు వేయటం ఇంకెంత సులభమో ఆలోచించండి.
25 సోదరులారా! మీరు తెలుసుకోవాలని మీకీ రహస్యం చెప్పాలనుకొంటున్నాను. మీరు అజ్ఞానులుగా ఉండటం నాకిష్టం లేదు. కొందరు ఇశ్రాయేలు ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు. నాటబడాలని కోరుకొంటున్న యూదులుకాని ప్రజలు నాటబడే వరకు ఈ మూర్ఖత్వం వీళ్ళలో ఉంటుంది. 26 శాస్త్రాల్లో వ్రాసినట్లు ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా రక్షింపబడతారు:
“రక్షకుడు సీయోను నుండి వస్తాడు;
అతడు యాకోబు వంశీయుల్లో ఉన్న చెడును తొలగిస్తాడు.
27 నేను వాళ్ళ పాపాలను తొలగించినప్పుడు,
వాళ్ళతో ఈ ఒడంబడిక చేస్తాను.”(F)
28 ఒక విధంగా చూస్తే వాళ్ళు సువార్తను బట్టి మీకు శత్రువులు. మరొక విధంగా చూస్తే వాళ్ళు దేవుడు ఎన్నుకొన్నవాళ్ళు కనుక, వాళ్ళ మూలపురుషుల్ని బట్టి వాళ్ళు ప్రేమించబడ్డారు. 29 ఎందుకంటే, దేవుడు “వరాల” విషయంలో, “పిలుపు” విషయంలో మనస్సు మార్చుకోడు. 30 యూదులు కాని మీరు ఒకప్పుడు దేవుణ్ణి నిరాకరించారు. కాని ఇప్పుడు యూదులు సువార్తను నిరాకరించటం వల్ల దైవానుగ్రహం మీకు లభించింది. 31 అదే విధంగా ఇప్పుడు యూదులు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. అందువల్ల, మీకు లభించిన అనుగ్రహం ద్వారా వాళ్ళకు కూడా దైవానుగ్రహం లభిస్తుంది. 32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు.
స్తుతి
33 దేవుని దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. దేవుని జ్ఞానం, విజ్ఞానం అతీతమైనది. ఆయన తీర్పులు ఎవ్వరికీ అర్థం కావు. ఆయన మార్గాల్ని ఎవ్వరూ కనిపెట్టలేరు.
34 “ప్రభువు మనస్సు ఎవరికి తెలుసు?
ఆయనకు సలహా చెప్పేవాడెవరు?”(G)
35 “దేవునికి ఎవరు అప్పిచ్చారు?
ఆయన ఎవరికీ ఋణపడలేదు.”(H)
36 అన్ని వస్తువులు, ఆయన్నుండి వచ్చాయి. ఆయన ద్వారా వచ్చాయి, అన్నీ ఆయన కొరకే ఉన్నాయి. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
బబులోనుకు సంబంధించిన సందేశం
50 బబులోను దేశానికి, కల్దీయులను ఉద్దేశించి యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు. యెహోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా చెప్పాడు.
2 “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి!
జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి!
పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి,
‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది.
బేలు[a] దైవం అవమానపర్చబడుతుంది.
మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది.
బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి.
దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’
3 ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది.
ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది.
ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు.
మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”
4 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో
ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు.
వారంతా కలిసి వారి దేవుడైన
యెహోవాను వెతుక్కుంటూ వెళతారు.
5 ఆ ప్రజలు సియోనుకు ఎలా వెళ్లాలి అని దారి అడుగుతారు.
వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు దేరుతారు.
ప్రజలు యిలా అంటారు. ‘రండి, మనల్ని మనము యెహోవాకు కలుపుకొందాం.
శాశ్వతమైన ఒక నిబంధన చేసికొందాము.
మన మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసికొందాం.’
6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నారు.
వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి పట్టించారు.
వారి నాయకులు వారిని కొండల్లో, కోనల్లో తిరిగేలా చేశారు.
వారి విశ్రాంతి స్థలమెక్కడో వారు మర్చిపోయారు.
7 నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు.
పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’
ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం.
వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.
8 “బబులోను నుండి పారిపొండి.
కల్దీయుల రాజ్యాన్ని వదిలిపొండి.
మందముందు నడిచే మేకలు మాదిరి వుండండి.
9 ఉత్తరాన్నుండి చాలా దేశాలను నేను కూడగట్టుకు వస్తాను.
ఈ దేశాల కూటమి బబులోను మీదికి యుద్ధానికి సిద్ధమవుతుంది.
ఉత్తర దేశాల వారిచేత బబులోను చెరబట్టబడుతుంది.
ఆ రాజ్యాలు బబులోను మీదికి చాలా బాణాలు వేస్తాయి.
యుద్ధం నుండి వట్టి చేతులతో
తిరిగిరాని సైనికుల్లా ఈ బాణాలు వుంటాయి.
10 కల్దీయుల భాగ్యాన్నంతా శత్రువు కొల్లగొడతాడు.
శత్రు సైనికులు తాము కోరుకున్నవన్నీ పొందగలుగుతారు.”
ఇవి యెహోవా చెప్పిన విషయాలు.
11 “బబులోనూ, నీవు ఉద్రేకంతోను, సంతోషంతోను వున్నావు.
నీవు నా భూమిని తీసికొన్నావు.
ధాన్యంలో చిందులేసే పడుచు ఆవులా
నీవు నాట్యం చేస్తున్నావు.
గుర్రాలు సంతోషంతో చేసే
సకిలింపుల్లా వుంది నీ నవ్వు.
12 ఇప్పుడు నీ తల్లికి తలవంపులవుతుంది.
నినుగన్న తల్లి కలత చెందుతుంది.
దేశాలన్నిటిలో బబులోను అతి సామాన్యమైపోతుంది.
ఆమె బెట్టయైన వట్టి ఎడారిలా అవుతుంది.
13 యెహోవా తన కోపం చూపటంతో
అక్కడ ఎవ్వరూ నివసించరు.
బబులోను నగరం పూర్తిగా ఖాళీ అవుతుంది.
బబులోను ప్రక్కగా పోయే ప్రతివాడు భయపడతాడు.
అది నాశనం చేయబడిన తీరుచూచి విస్మయంతో వారు తలలు ఆడిస్తారు.
14 “బబులోనుతో యుద్ధానికి సిద్ధమవ్వండి.
వింటిని బట్టిన వీరుల్లారా, బబులోనుపై బాణాలు వేయండి.
మీ బాణాల్లో వేటినీ మిగల్చవద్దు.
బబులోను యెహోవా పట్ల పాపం చేసింది.
15 బబులోను చుట్టూ సైనికులు జయ నినాదాలు చేస్తారు.
ఇప్పుడు బబులోను లొంగిపోయింది!
దాని ప్రాకారాలు, బురుజులు కూలదోయబడ్డాయి!
వారికి అర్హమైన శిక్షను యెహోవా ఆ ప్రజలకు ఇస్తున్నాడు.
ప్రజలారా, బబులోనుకు తగిన శిక్షను ఇవ్వండి.
అది ఇతర దేశాలకు ఏమి చేసిందో,
దానిని ఆ రాజ్యానికి తిరిగి చేయండి.
16 బబులోను ప్రజలను మొక్కలు నాటనివ్వకండి.
వారి పంటను సేకరించనీయవద్దు.
బబులోను సైనికులు చాలా మందిని తమ నగరానికి బందీలుగా తీసికొనివచ్చారు.
ఇప్పుడు శత్రు సైన్యాలువచ్చాయి.
కావున ఆ బంధీలంతా ఇండ్లకు తిరిగి వెళ్లుచున్నారు.
ఆ బందీలు తిరిగి తమ తమ దేశాలకు పరుగున పోతున్నారు.
17 “పొలాల్లో చెల్లాచెదరైన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది.
సింహాలు తరిమిన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది.
వానిని తిన్న మొదటి సింహం అష్షూరు రాజు.
వాని ఎముకలు నలుగగొట్టిన చివరి సింహం బబులోను రాజైన నెబుకద్నెజరు.
18 కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
‘బబులోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో శిక్షిస్తాను.
నేను అష్షూరు రాజును శిక్షించినట్లు అతనిని నేను శిక్షిస్తాను.
19 “‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను.
అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు.
అతడు తిని, తృప్తి పొందుతాడు.
ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’”
20 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ప్రజలు ఇశ్రాయేలు యొక్క తప్పులెదకటానికి గట్టిగా ప్రయత్నిస్తారు.
కాని వారికి కన్పించదు.
ప్రజలు యూదా పాపాలు వెదక యత్నిస్తారు.
కాని ఏ పాపాలూ కనుగొనబడవు.
ఎందువల్లనంటే ఇశ్రాయేలు, యూదా రాజ్యాలలో మిగిలిన కొద్దిమందిని నేను రక్షిస్తున్నాను.
పైగా వారి పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను.”
21 యెహోవా యిలా చెపుతున్నాడు, “మెరాతయీయు దేశంపై దండెత్తండి!
పెకోదీలో వుంటున్న ప్రజలను ఎదుర్కొనండి!
వారిని ఎదుర్కొనండి!
వారిని చంపండి. వారిని సర్వ నాశనం చేయండి!
నా ఆజ్ఞ ప్రకారం అంతా చేయండి!
22 “యుద్ధ ధ్వని దేశమంతా వినిపిస్తుంది.
అది తీవ్రవినాశనానికి సంబంధించిన ధ్వని.
23 బబులోను ఒకనాడు
సర్వప్రపంచానికి సుత్తివలె వుంది.
కాని ఇప్పుడా ‘సుత్తి’ విరిగి ముక్కలై పోయింది.
బబులోను సాటి రాజ్యాలన్నిటిలో నిజంగా మిక్కిలి నాశనమైనది.
24 బబులోనూ, నీ కొరకు నేను వల పన్నాను.
అది నీవు తెలిసికొనే లోపుగానే నీవు పట్టుబడ్డావు.
నీవు యెహోవాకు వ్యతిరేకంగా పోరాడావు.
అందువల్ల నీవు చూడబడి, పట్టుబడ్డావు.
25 యెహోవా తన గిడ్డంగిని తెరిచాడు.
ఆ గిడ్డంగి నుండి యెహోవా తన కోపమనే ఆయుధాన్ని వెలికి తీశాడు.
సర్వశక్తిమంతుడైన దేవుడు తాను చేయవలసిన పని ఒకటి వుండుటచే ఆ ఆయుధాన్ని వెలికి తీశాడు.
ఆయన చేయవలసిన కార్యం కల్దీయుల రాజ్యంలో ఉంది.
26 “దూర తీరాల నుండి బబులోను మీదికి రండి.
ఆమె ధాన్యాగారాలను పగులగొట్టండి.
బబులోనును సర్వనాశనం చేయండి.
సజీవంగా ఎవ్వరినీ వదల వద్దు.
పెద్ద ధాన్యరాసులవలె వారి శవాలను గుట్టవేయండి.
27 బబులోనులో ఉన్న గిత్తలన్నిటినీ (యువకులు) చంపండి.
వారినినరకబడనివ్వండి.
వారు ఓడింపబడే సమయం వచ్చింది. వారికి మిక్కిలి కష్టం వచ్చిపడింది.
వారు శిక్షింపబడే సమయంవచ్చింది.
28 బబులోను దేశం నుండి ప్రజలు పారిపోతున్నారు.
వారా దేశంనుండి తప్పించుకొనిపోతున్నారు. ఆ ప్రజలు సీయోనుకు వస్తున్నారు.
యెహోవా చేస్తున్న పనులను ఆ ప్రజలు ఇతరులకు చెపుతున్నారు,
బబులోనుకు అర్హమైన శిక్షను యెహోవా ఇస్తున్నాడని వారు చెబుతున్నారు.
యెహోవా ఆలయాన్ని బబులోను ధ్వంసం చేసింది. కావున యెహోవా ఇప్పుడు బబులోనును ధ్వంసం చేస్తున్నాడు.
29 “బబులోను మీదికి విలుకాండ్రను పిలవండి.
ఆ నగరాన్ని చుట్టుముట్టమని వారికి చెప్పండి.
ఎవ్వరినీ తప్పించుకోనివ్వద్దు.
అది చేసిన దుష్టకార్యాలకు తగిన ప్రతీకారం చేయండి.
అది ఇతర రాజ్యాలకు ఏమి చేసిందో, దానిని ఆ దేశానికి కూడా చేయండి.
బబులోను యెహోవాను గౌరవించలేదు.
పరిశుద్దుడైన ఇశ్రాయేలు దేవునిపట్ల అది మూర్ఖంగా ప్రవర్తించింది.
కావున బబులోనును శిక్షించండి.
30 బబులోను యువకులు వీధుల్లో చంపబడతారు.
ఆ రోజున దాని సైనికులంతా చనిపోతారు.”
యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
31 “బబులోనూ, నీవు మిక్కిలి గర్విష్ఠివి.
అందుచే నేను నీకు వ్యతిరేకినైనాను.”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“నేను నీకు వ్యతిరేకిని.
నీవు శిక్షింపబడే సమయం వచ్చింది.
32 గర్విష్ఠియైన బబులోను తూలిపడి పోయింది.
అది లేచుటకు ఎవ్వరూ సహాయపడరు.
దాని పట్టణాలలో నేను అగ్ని రగుల్చుతాను.
దాని చుట్టూ వున్న వారందరినీ ఆ అగ్ని పూర్తిగా దహించివేస్తుంది.”
33 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు.
“ఇశ్రాయేలు, యూదా ప్రజలు బానిసలై యున్నారు.
శత్రువు వారిని చెరబట్టాడు. శత్రువు ఇశ్రాయేలును వదిలిపెట్టడు.
34 కాని, దేవుడు ఆ ప్రజలను తిరిగి తీసికొని వస్తాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
ఆ ప్రజలను ఆయన బాగా రక్షిస్తాడు.
వారి రాజ్యానికి విశ్రాంతి కల్గించే విధంగా ఆయన వారిని రక్షిస్తాడు.
అంతేగాని బబులోనులో నివసించే వారికి ఆయన విశ్రాంతినివ్వడు.”
35 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోనులో నివసించే ప్రజలను ఒక కత్తి చంపుగాక.
బబులోను రాజును, అతని అధికారులను,
జ్ఞానులను ఒక కత్తి హతము చేయుగాక.
36 బబులోను యాజకులను, దొంగ ప్రవక్తలను కత్తి సంహరించుగాక,
ఆ యాజకులు ఒట్టి మూర్ఖులవుతారు.
బబులోను సైనికులను ఒక కత్తి చంపుగాక.
ఆ సైనికులు భీతావహులవుతారు.
37 బబులోను గుర్రాలను, రథాలను ఒక కత్తి నరికి వేయుగాక.
విదేశ కిరాయి సైనికులను ఒక కత్తి సంహరించుగాక,
ఆ సైనికులందరూ భయపడిన స్త్రీలవలె ఉంటారు.
బబులోను ధనాగారాల మీదికి ఒక కత్తి వెళ్లుగాక.
ఆ ధనాగారాలు దోచుకోబడతాయి.
38 బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక.
ఆ నీటి వనరులన్నీ ఎండిపోతాయి.
బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు.
బబులోను ప్రజలు మూర్ఖులని ఆ విగ్రహాలు చాటి చెపుతున్నాయి.
అందుచే ఆ ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.
39 బబులోను మరెన్నడూ ప్రజలతో నిండిఉండదు.
పిచ్చి కుక్కలు, ఉష్ట్ర పక్షులు, తదితర ఎడారి జంతువులు అక్కడ నివసిస్తాయి.
అంతేగాని, మళ్లీ జనం అక్కడ ఎన్నడూ నివసించరు.
40 సొదొము, గొమొర్రా నగరాలను, వాటి చుట్టుపట్ల పట్టణాలను
దేవుడు పూర్తిగా నాశనం చేశాడు.
ఇప్పుడా పట్టణాలలో ఎవ్వరూ నివసించరు.
అదేరీతి, బబులోనులో ఎవ్వరూ నివసించరు.
అక్కడ నివసించటానికి ప్రజలు అసలు వెళ్లరు.”
41 “చూడండి! ఉత్తరాన్నుండి జనులు వస్తున్నారు.
వారొక బలమైన రాజ్యం నుండి వస్తున్నారు.
ప్రపంచం నలుమూలల నుండి చాలామంది రాజులు కలిసి వస్తున్నారు.
42 వారి సైన్యాలకు ధనుస్సులు, ఈటెలు ఉన్నాయి.
ఆ సైనికులు బహు క్రూరులు
వారికి దయలేదు.
గుర్రాలపై స్వారి చేస్తూ సైనికులు వస్తారు.
అప్పుడు సముద్ర ఘోషలా శబ్దం పుడుతుంది.
వారివారి స్థానాలలో యుద్ధానికి సిద్ధంగా నిలబడతారు!
బబులోను నగరమా, నీపై దాడికి వారు సిద్ధంగా వున్నారు.
43 ఆ సైన్యాల గురించి బబులోను రాజు విన్నాడు. అతడు బాగా బెదరిపోయాడు!
అతని చేతులు బిగుసుకుపోయేటంతగా అతడు భయపడ్డాడు.
ప్రసవ స్త్రీ వేదనవలె, అతని భయం
అతని కడుపును ఆరాటపెడుతుంది.”
44 యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన
దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది.
ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది.
అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి.
నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమికొడతాను!
ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను?
నాలాగా మరే వ్యక్తి లేడు.
నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు.
కావున నేనే ఆ పని చేస్తాను.
నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు.
నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”
45 బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా
పన్నిన పధకాన్ని వినండి.
కల్దీయులకు వ్యతిరేకంగా యెహోవా
ఏమి చేయ నిర్ణయించాడో వినండి.
“శత్రువు బబులోనులోని గొర్రె పిల్లలను (ప్రజలను)
తిరిగి తీసికొంటాడు.
ఆ గొర్రె పిల్లలను ఆయన ఇంటికి తీసికొని వెళతాడు.
ఆ పిమ్మట బబులోను పచ్చిక బయళ్లను యెహోవా పూర్తిగా నాశనం చేస్తాడు.
జరిగిన దానికి బబులోను విస్మయం చెందుతుంది.
46 బబులోను పడిపోతుంది.
ఆ పతనానికి భూమి కంపిస్తుంది.
బబులోను పతనాన్ని గురించి
ప్రపంచ ప్రజలంతా వింటారు.”
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
© 1997 Bible League International