M’Cheyne Bible Reading Plan
రాజు విషయం సమూయేలు మాట్లాడుట
12 సమూయేలు ఇశ్రాయేలు ప్రజలనుద్దేశించి ఇలా అన్నాడు: “మీరు నన్ను కోరినదంతా చేశాను. మీకు ఒక రాజు కావాలంటే ఇచ్చాను. 2 ఇప్పుడు మీకు నాయకత్వం వహించటానికి ఒక రాజు ఉన్నాడు. నేను తల నెరసి ముసలివాడనై పోయాను. నా కుమారులు మీతోనే ఉన్నారు. నా చిన్ననాటి నుంచీ మీకు నేను ఆధిపత్యం వహించాను. 3 ఇప్పుడు నేను మీ సమక్షంలోనే ఉన్నాను. నేనేదైనా తప్పు చేసివుంటే మీరు నాకు వ్యతిరేకంగా వాటిని దేవునికి, ఆయన ఏర్పరచిన రాజుకు చెప్పండి. నేను ఎవరి ఎద్దునే గాని, గాడిదనే గాని దొంగిలించానా? నేనెవరినైనా భాధించటంగాని, మోసగించటంగాని జరిగిందా? నేనెప్పుడైన డబ్బుగాని, ఒక జత చెప్పులుగాని తప్పుపని చేయటానికి తీసుకున్నానా? ఇటువంటి పనులేవైనా చేసి ఉంటే నేను వాటిని తిరిగి ఇచ్చి తప్పు సరిదిద్దుకుంటాను.”
4 “నీవు మమ్ములను మోసం చేయలేదు; బాధపెట్టనూ లేదు. నీవు ఎవరి వద్దా లంచాలు కూడ తీసుకోలేదు” అని ఇశ్రాయేలు జనం అన్నారు.
5 “యెహోవా, ఆయన ఎంపిక చేసిన రాజు కూడ ఈ రోజు మీరు చెప్పిన దానిని విన్నారు. మీరు నాలో ఏ తప్పూ కనుగొనలేదనే దానికి వారిద్దరూ సాక్షులు” అన్నాడు సమూయేలు. అంతట ప్రజలు, “అవును! ఇది సత్యం” అని చెప్పారు.
6 అప్పుడు ప్రజలనుద్దేశించి సమూయేలు, “ఆ దేవుడే సాక్షి. ఆయనే మోషేను, అహరోనును ఎంపికచేసాడు. మీ పూర్వీకులను ఈజిప్టు నుండి ఆయనే విముక్తులను చేసాడు. 7 మీరంతా ఇప్పుడు ఇక్కడ నిలబడండి. ఆ యెహోవా మీ కోసం, మీ పూర్వీకుల సంక్షేమం కోసం చేసిన పనులను వివరిస్తాను.
8 “యాకోబు వెళ్లిన తర్వాత ఈజిప్టు ప్రజలు ఆయన వంశీకుల జీవితాన్ని కష్టతరం చేశారు. కావున వారు యెహోవా సహాయం అర్థించారు. వారి మొర ఆలకించిన యెహోవా మోషేను, అహరోనును అక్కడికి పంపించాడు. వారిద్దరూ మీ పూర్వీకులను ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చి ఈ ప్రాంతానికి నడిపించారు.
9 “కానీ మీ పూర్వీకులు వారి దేవుడైన యెహోవాను మర్చిపోయారు. అప్పుడు యెహోవా వారిని హాసోరు పట్టణ సైన్యాధిపతి సీసెరాకు బానిసలయ్యేలా చేశాడు. తరువాత ఫిలిష్తీయులకు, మోయాబు రాజుకు కూడ యెహోవా వారిని బానిసలు కానిచ్చాడు. వారంతా మీ పూర్వీకులకు వ్యతిరేకంగా పోరాడారు. 10 అయితే మీ పూర్వీకులు సహాయంకోసం యెహోవాకు మొరపెట్టారు. ‘మేము పాపం చేసాము. మేము యెహోవాను విడిచిపెట్టి బయలు, అష్తారోతు అనే బూటకపు దేవతలను సేవించాము. అయితే ఇప్పుడు మమ్మల్ని మా శత్రువుల బారినుండి రక్షించు. మేము నిన్ను సేవిస్తాము’ అని చెప్పారు.
11 “యెరుబ్బయలు (గిద్యోను) బెదానను (బారాకు) యెఫ్తా, సమూయేలును పంపి, మీ చుట్టూ ఉన్న శత్రువులనుండి యెహోవా మిమ్మల్ని రక్షించాడు. మీరు క్షేమంగా జీవిస్తున్నారు. 12 కానీ అమ్మోనీయుల రాజైన నాహాషు మీమీద యుద్ధానికి రావటం మీరు చూచినప్పుడు, మీకు మీ దేవుడైన యెహోవా రాజుగా ఉన్నప్పటికీ ‘మమ్ము పాలించటానికి మాకు ఒక రాజు కావాలని’ మీరు కోరుకున్నారు! 13 మీరు ఎంపిక చేసుకొన్న రాజు మీరు కోరుకున్న రాజు ఇదిగో ఇక్కడ ఉన్నాడు. మీమీద ఒక రాజును యెహోవా నియమించాడు. 14 మీరు యెహోవాను ఘనపరచి, ఆయనను సేవించాలి. ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మీరు పోరాడకూడదు. మరియు మీరు, మిమ్మల్ని పాలిస్తున్న రాజు, మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు ఆ పనులు చేస్తే, అప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. 15 కానీ మీరు యెహోవాకు విధేయులు కాకపోతే, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తే, ఆయన మీకు వ్యతిరేకి అవుతాడు. ప్రభువు మిమ్మల్ని, మీ రాజును సర్వనాశనం చేస్తాడు.
16 “ఇప్పుడు మీరు నిశ్శబ్ధంగా, నిశ్చలంగా నిలబడండి మీ కళ్లముందే యెహోవా చేసే ఒక మహిమాన్విత కార్యం చూడండి. 17 ఇప్పుడు గోధుమ పంట[a] కోతకు వచ్చింది. ఫెళఫెళమనే ఉరుములు, మెరుపులతో వర్షం కురిపించుమని నేను దేవుని ప్రార్థిస్తాను. అప్పుడు మీరు రాజు కావాలని అడిగి, యెహోవాపట్ల ఎంత పాపం చేశారో మీరే తెలుసుకుంటారు,” అని వివరంగా చెప్పాడు.
18 అలా చెప్పి, సమూయేలు యెహోవాను ప్రార్థించాడు. అదే రోజున యెహోవా ఉరుములతో కూడిన వర్షం పంపించాడు. దానితో యెహోవా అనిన, సమూయేలు అనిన ప్రజలకు విపరీతమైన భయం ఏర్పడింది. 19 ప్రజలు సమూయేలుతో, “నీ సేవకులమైన మాకోసం దేవుడైన యెహోవాను ప్రార్థించు. మమ్మల్ని చనిపోనీయవద్దు. మా పాపాల మూటకుతోడు రాజు కావాలని అడిగే దురాచారాన్ని కూడ సంతరించుకున్నాం” అని వాపోయారు.
20 భయపడవద్దని సమూయేలు వారికి ధైర్యం చెప్పాడు. “మీరు తప్పు చేసిన మాట నిజమే. అయినా యెహోవాకు దూరం కావద్దు. మీ హృదయ పూర్వకంగా యెహోవాకు సేవ చేయండి. 21 విగ్రహాలు వట్టి బొమ్మలే. అవి మీకు సహాయం చేయలేవు. కావున వాటిని పూజించవద్దు. విగ్రహాలు మీకు సహాయము చెయ్యలేవు, కాపాడనూలేవు. విగ్రహాలు కేవలం వ్యర్థము!
22 “అయితే యెహోవా తన ప్రజలను విడిచి పెట్టడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొనేందుకు ఆనందించాడు. అందుచేత తనమంచి పేరుకోసం ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. 23 కావున మీ కోసం ప్రార్థన చేయకుండా నేను మాని వేస్తే అది నా తప్పు అవుతుంది. ఒకవేళ నేను అలా మానివేస్తే యెహోవాకు విరుద్ధంగా పాపం చేసినవాణ్ణి అవుతాను. సరైన మంచి జీవన మార్గాన్ని నేను మీకు ప్రబోధిస్తాను. 24 అయితే మీరు యెహోవా ఎడల భయభక్తులతో ఉండాలి. మీ పూర్ణ హృదయంతో మీరు వాస్తవంగా ఆయనను సేవించాలి. ఆయన మీ కోసం చేసిన ఆశ్చర్యకరమైన పనులన్నీ జ్ఞాపకం చేసుకోండి! 25 మీరు మొండి వైఖరితో చెడుచేస్తూనే ఉంటే ఆయన మిమ్మల్నీ, మీ రాజునూ చీపురుతో ఊడ్చి పారవేసినట్లు విసిరేస్తాడు” అని సమూయేలు వారికి వివరించి చెప్పాడు.
10 సోదరులారా! దేవుడు ఇశ్రాయేలు వంశీయుల్ని రక్షించాలని హృదయ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను. 2 వాళ్ళు శ్రద్ధతో దేవుని సేవ చేస్తున్నారని నేను సాక్ష్యం చెప్పగలను. కాని వాళ్ళ శ్రద్ధ జ్ఞానం మీద ఆధారపడలేదు. 3 దేవుడు నీతిమంతులుగా చేసే విధానాన్ని గురించి తెలియక వాళ్ళు తమ విధానాన్ని స్థాపించాలనుకొన్నారు. కనుక వాళ్ళు దేవుడు చెప్పిన విధానాన్ని అంగీకరించలేదు. 4 నమ్మిన ప్రతి ఒక్కడూ నీతిమంతుడు కావాలని క్రీస్తు వచ్చాక ధర్మశాస్త్రం అంతమైపోయింది.
5 ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”(A) 6 కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? 7 “అగాధంలోకి ఎవరు దిగుతారు?”(B) అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?
8 మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(C) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. 9 యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.
11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(D) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(E) అని వ్రాయబడి ఉంది.
14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(F)
16 కాని సువార్తను అందరూ అంగీకరించలేదు. యెషయా ఈ విధంగా అన్నాడు: “ప్రభూ! మేము చెప్పినదాన్ని ఎవరు నమ్మారు?”(G) 17 తద్వారా, సువార్తను వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. క్రీస్తు సందేశం ద్వారా సువార్త వినటం సంభవిస్తుంది.
18 “వాళ్ళు వినలేదా?” అని నేనడుగుతున్నాను. వాళ్ళు విన్నారు. ఆ విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“వాళ్ళ స్వరం ప్రపంచమంతా వినిపించింది.
వాళ్ళు పలికిన మాటలు ప్రపంచం నలుమూలలా వినిపించాయి.”(H)
19 “ఇశ్రాయేలుకు ఈ విషయం తెలియదా?” అని నేను మళ్ళీ అడుగుచున్నాను. అవును వారికి తెలిసింది. మోషే మొదట ఈ విధంగా అన్నాడు:
“జనాంగము కానివారి ద్వారా మీరు అసూయ పడేటట్లు చేస్తాను
అర్థం చేసుకోలేని జనము ద్వారా మీరు కోపం చెందేటట్లు చేస్తాను.”(I)
20 యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు:
“నా కోసం వెదకనివాళ్ళు నన్ను కనుగొంటారు.
నా కోసం అడగని వాళ్ళకు నేను స్వయంగా ప్రత్యక్షమయ్యాను.”(J)
21 కాని ఇశ్రాయేలు ప్రజల్ని గురించి అతడు ఈ విధంగా అన్నాడు:
“అవిధేయతతో ఎదురుతిరిగి మాట్లాడుతున్న
ప్రజల కోసం దినమంతా వేచియున్నాను.”(K)
అమ్మోనును గురించిన సందేశం
49 ఈ వర్తమానం అమ్మోనీయులను గురించినది. యెహోవా ఇలా చెపుతున్నాడు,
“అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు
పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా?
తల్లి తండ్రులు చనిపోతే భూమిని
స్వతంత్రించుకొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటున్నారా?
బహుశః అందువల్లనే మల్కోము[a] గాదు[b] రాజ్యాన్ని తీసికొన్నాడా?”
2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను[c] ప్రజలు
యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది.
రబ్బోతు-అమ్మోను నాశనమవుతుంది.
అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది.
దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి.
ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు.
కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.”
మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు.
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
3 “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది.
రబ్బోతు-అమ్మోను మహిళల్లారా, విలపించండి!
విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి.
రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి.
ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు.
వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.
4 నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటావు.
కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు.
నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు.
నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.”
5 కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు,
“నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను.
మీరంతా పారిపోతారు.
మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”
6 “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
ఎదోమును గూర్చిన సందేశం
7 ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా?
ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా?
వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?
8 దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి!
ఎందుకంటే, నేను ఏశావును[d] తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.
9 “మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని ద్రాక్షకాయలను కోస్తారు.
అయినా వారు కొన్ని కాయలను చెట్లపై వదిలివేస్తారు.
రాత్రిళ్లు దొంగలు వచ్చినా వారికి కావలసిన
పరిమాణంలోనే తీసికొనిపోతారు.
10 కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను.
అతడు దాచుకొనే స్థలాలన్నింటినీ నేను కనుగొంటాను.
అతడు నానుండి ఏమీయు దాచలేడు.
అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు అంతా చనిపోతారు.
11 అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ మిగలరు.
అతని విధవరాండ్రు ఒంటరిగా విడువబడుతారు (యెహోవానైన) నేను మాత్రమే మీ అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను.
మరియు మీ విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.”
12 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.” 13 యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”
14 యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను,
దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు.
ఆ సందేశం ఇలా వుంది,
“మీ సైన్యాలను సమకూర్చుకోండి!
యుద్ధానికి సిద్ధపడండీ.
ఎదోము దేశం మీదికి కదలి వెళ్లండి!
15 ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను తగ్గించివేస్తాను.
ప్రతివాడూ నిన్ను అసహ్యించుకుంటాడు.
16 ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు.
అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు.
కాని నీవు మోసపోయావు.
నీ గర్వం నిన్ను మోసగించింది.
ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు.
పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు.
గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను.
అక్కడినుండి నేను నిన్ను క్రిందికి దింపుతాను,”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
17 “ఎదోము నాశనం చేయబడుతుంది.
నాశనమయిన నగరాన్ని చూచి ప్రజలు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు.
నాశనమయిన నగరాలను చూచి ప్రజలు ధిగ్భ్రాంతి చెంది సంభ్రమాశ్చర్య పడతారు.
18 సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది.
అక్కడ ఎవ్వరూ నివసించరు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
19 “యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నిసార్లు సింహం వస్తూఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”
20 కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా వేసిన పధకాన్ని వినండి.
తేమాను వాసులకు యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి
ఎదోము మంద (ప్రజలు)లో నుండి చిన్నవాటినన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు.
ఎదోము పచ్చిక బయళ్లు వారు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతాయి.
21 ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి కంపిస్తుంది.
వారి ఆక్రందన ఎర్ర సముద్రం వరకు ప్రతిధ్వనిస్తుంది.
22 దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు.
బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు.
ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.
దమస్కును గురించిన సందేశం
23 ఈ వర్తమానము దమస్కు[e] నగరాన్ని గురించినది:
“హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి.
దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి.
వారు అధైర్యపడ్డారు.
వారు వ్యాకులపడి బెదిరారు.
24 దమస్కు నగరం బలహీనమయ్యింది.
ప్రజలు పారిపోవాలనుకుంటున్నారు.
ప్రజలకు దిగులు పట్టుకున్నది.
ప్రసవ స్త్రీలా ప్రజలు బాధ, వేదన అనుభవిస్తున్నారు.
25 “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం.
ప్రజలింకా ఆ ‘వేడుక నగరాన్ని’ వదిలి పెట్టలేదు.
26 అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి స్థలాలలో చనిపోతారు.
ఆ సమయంలో దాని సైనికులందరూ చంపబడతారు.”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పినాడు.
27 “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను.
బెన్హదదు బలమైన కోటలను అది పూర్తిగా కాల్చివేస్తుంది.”
కేదారు, హాసోరులను గూర్చిన సందేశం
28 ఈ వర్తమానం కేదారు[f] వంశస్తులను గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించినది. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని ఓడించారు. యెహోవా ఇలా చెపుతున్నాడు,
“కేదారు వంశీయుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి.
తూర్పునవున్న ప్రజలను నాశనం చేయండి.
29 వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి.
వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి.
వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు.
‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.
30 త్వరగా పారిపొండి!
హాసోరు ప్రజలారా, దాగటానికి మంచి స్థలం చూడండి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది
“నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా పధకం పన్నాడు.
నిన్ను ఓడించటానికి అతడు ఒక తెలివైన పథకాన్ని ఆలోచించాడు.
31 “నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా.
ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు.
వారు ఒంటరిగా నివసిస్తారు.
‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.
32 వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను శత్రువు దొంగిలిస్తాడు.
శత్రువు వారి పెద్ద మందలను దొంగిలిస్తాడు.
చెంపలు కత్తిరించుకునే వారిని[g] భూమి నలుదిక్కులకు పంపివేస్తాను.
అన్నివైపుల నుండి వారి మీదికి మహా విపత్తులను తీసికొని వస్తాను.”
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
33 “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది.
అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు.
ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసం చేయడు.”
ఏలామును గూర్చిన సందేశం
34 యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము[h] దేశానికి సంబంధించినది.
35 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను.
విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.
36 నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి రప్పిస్తాను.
ఆకాశపు నాలుగు మూలల నుండి వాటిని రప్పిసాను.
భూమి మీదకు గాలి వీచే నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదరగొడతాను.
ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీలుగా కొనిపోబడతారు.
37 వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను.
వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను.
వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను.
నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.”
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
“ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను.
నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.
38 నా సింహాసనం ప్రతిష్ఠించి నేనే అదుపుదారుడనని నిరూపిస్తాను.
దాని రాజును, రాజ్యాధికారులను నేను నాశనం చేస్తాను.”
ఇదే యెహోవా సందేశం.
39 “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి మంచి సంభవించేటట్లుగా చేస్తాను.”
ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
దావీదు కీర్తన.
26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో
నేను ఒకడ్ని కాను.
5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము.
ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము.
10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి.
చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచం తీసుకొంటారు.
11 కాని నేను నిర్దోషిని.
కనుక దేవా, నన్ను కరుణించి, రక్షించుము.
12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను.
యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.
దావీదు కీర్తన.
27 యెహోవా, నీవే నా వెలుగు, నా రక్షకుడవు.
నేను ఎవరిని గూర్చి భయపడనక్కర్లేదు.
యెహోవా, నీవే నా జీవిత క్షేమస్థానం.
కనుక నేను ఎవరికి భయపడను.
2 దుర్మార్గులు నా మీద దాడి చేయవచ్చు.
వారు నా శరీరాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించవచ్చు.
వారు నా శత్రువులు, విరోధులు.
వారు కాలు తప్పి పడిపోదురు.
3 అయితే నా చుట్టూరా సైన్యం ఉన్నప్పటికీ నేను భయపడను.
యుద్ధంలో ప్రజలు నామీద విరుచుకు పడ్డప్పటికీ నేను భయపడను. ఎందుకంటే నేను యెహోవాను నమ్ముకొన్నాను.
4 యెహోవా నాకు అనుగ్రహించాలని నేను ఆయనను అడిగేది ఒకే ఒకటి ఉంది.
నేను అడిగేది ఇదే:
“నా జీవిత కాలం అంతా నన్ను యెహోవా ఆలయంలో కూర్చుండనిచ్చుట.
ఆయన రాజ భవనాన్ని నన్ను సందర్శించనిచ్చుట.
యెహోవా సౌందర్యాన్ని నన్ను చూడనిమ్ము.”
5 నేను ఆపదలో ఉన్నప్పుడు యెహోవా నన్ను కాపాడుతాడు.
ఆయన తన గుడారంలో నన్ను దాచిపెడతాడు.
ఆయన తన క్షేమ స్థానానికి నన్ను తీసుకొని వెళ్తాడు.
6 నా శత్రువులు నన్ను చుట్టుముట్టేశారు. కాని ఇప్పుడు వారిని ఓడించటానికి యెహోవా నాకు సహాయం చేస్తాడు.
అప్పుడు నేను ఆయన గుడారంలో బలులు అర్పిస్తాను. సంతోషంతో కేకలు వేస్తూ ఆ బలులు నేను అర్పిస్తాను.
యెహోవాను ఘనపరచుటకు నేను వాద్యం వాయిస్తూ గానం చేస్తాను.
7 యెహోవా, నా స్వరం ఆలకించి నాకు జవాబు ఇమ్ము.
నా మీద దయ చూపించుము.
8 యెహోవా, నా హృదయం నిన్ను గూర్చి మాట్లాడమంటున్నది.
వెళ్లు, నీ యెహోవాను ఆరాధించమంటున్నది అందువల్ల యెహోవా నేను నిన్ను ఆరాధించటానికి వచ్చాను.
9 యెహోవా, నా దగ్గర్నుండి తిరిగిపోకుము.
కోపగించవద్దు, నీ సేవకుని దగ్గర్నుండి తిరిగి వెళ్లిపోవద్దు.
నీవు నాకు సహాయమైయున్నావు, నన్ను త్రోసివేయకుము. నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నీవు నా రక్షకుడవు.
10 నా తల్లి, నా తండ్రి నన్ను విడిచిపెట్టారు.
అయితే యెహోవా నన్ను తీసుకొని, తన వానిగా చేసాడు.
11 యెహోవా, నాకు శత్రువులు ఉన్నారు, కనుక నాకు నీ మార్గాలు నేర్పించుము.
సరైన వాటిని చేయటం నాకు నేర్పించుము.
12 నా శత్రువుల కోరికకు నన్నప్పగించవద్దు.
నన్ను గూర్చి వాళ్లు అబద్ధాలు చెప్పారు. నాకు హాని కలిగించేందుకు వాళ్లు అబద్ధాలు చెప్పారు.
13 నేను చనిపోక ముందు యెహోవా మంచితనాన్ని నేను చూస్తానని
నిజంగా నేను నమ్ముచున్నాను.
14 యెహోవా సహాయం కోసం కనిపెట్టి ఉండుము.
బలంగా, ధైర్యంగా ఉండుము.
యెహోవా సహాయం కోసం కనిపెట్టుము.
© 1997 Bible League International