Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 11

11 ఒకనెల గడిచింది. తరువాత అమ్మోనీయుడైన నాహాషు తన సైన్యంతో వచ్చి యాబేష్గిలాదు నగరాన్ని ముట్టడించాడు. “నీవు మాతో ఒడంబడిక చేసుకొంటే మేము నీ సేవ చేస్తాము” అని యాబేషు ప్రజలు నాహాషుతో చెప్పారు.

“మీలోని ప్రతి ఒక్కని కుడి కంటినీ తోడివేయనిస్తే మీతో సంధికి ఒప్పుకుంటానన్నాడు నాహాషు.” అలా చేస్తే నేను ఇశ్రాయేలునంతటినీ అవమాన పర్చి నట్లువుతుందన్నాడు.

అది విన్న యాబేషు ప్రజల నాయకులు “ఏడు రోజులు గడువు ఇవ్వమని అడిగారు. ఇశ్రాయేలు నలుమూలలకు దూతలను పంపుతామనీ, ఎవ్వరూ సహాయం చేయటానికి ముందుకు రాకపోతే లొంగిపోతామనీ” వారు నాహాషుతో అన్నారు.

సౌలు యాబేషు గిలాదును రక్షించుట

వార్తాహరులు సౌలు నివసిస్తున్న గిబియాకు వెళ్లారు. అక్కడి ప్రజలకు ఆ వార్త అందజేశారు. ప్రజలు ఘోరంగా విలపించారు. సౌలు అప్పుడే తన పొలములోని తన పశువుల దగ్గరనుండి ఇంటికి వస్తూనే ప్రజల రోదన విన్నాడు. “ప్రజలకేమయ్యింది? వారెందుకు విలపిస్తున్నారు?” అని అడిగాడు.

అప్పుడు ప్రజలు యాబేషునుండి వచ్చిన దూతలు చెప్పినదంతా వినిపించారు. అది వినగానే సౌలు మీదకు దేవుని ఆత్మ శక్తివంతంగా వచ్చి ఆవరించింది. అతనికి పట్టరాని కోపం వచ్చింది. సౌలు ఒక జత కాడి ఎద్దులను తీసుకొని, వాటిని నరికి ముక్కలు చేసి, వాటిని ఆ వచ్చిన దూతలకు ఇచ్చి, వాటిని ఇశ్రాయేలు నలు మూలలకూ తీసుకొని వెళ్లమన్నాడు. వార్తాహరులు ఆ ఎడ్ల మాంస ఖండాలను వాడ వాడలా తిప్పుతూ “సౌలును, సమూయేలును వెంబడించని వారి ఎడ్లన్నిటికీ ఇదే గతి పడుతుందని చాటి చెప్పారు.”

యెహోవా భయం ప్రజలందరికీ ముంచు కొచ్చింది. వారంతా ఒక్కటై బయటికి వచ్చారు. సౌలు బెజెకు వద్ద వారిని సమావేశపరచినప్పుడు అక్కడ మూడులక్షల మంది ఇశ్రాయేలీయులు, ముప్పదివేలమంది యూదా వారు ఉన్నారు.

“గిలాదులో ఉన్న యాబేషుకు వెళ్లండి. ఆ ప్రజలు రేపు మధ్యాహ్నంలోగా రక్షించబడతారని ఆ ప్రజలతో చెప్పండి” అని సౌలు, అతని సైనికులు యాబేషునుండి వచ్చిన మనుష్యులకు చెప్పారు.

సౌలు సమాచారాన్ని యాబేషు ప్రజలకు ఆ దూతలు తెలియజేసినప్పుడు వారు చాలా ఆనందపడ్డారు. 10 యాబేషు ప్రజలు, “రేపు లొంగిపోతామనీ, అప్పుడు వారిని తనకు ఇష్టం వచ్చినట్లు చేయవచ్చనీ” అమ్మోనీయుడైన నాహాషుకు తెలియజేశారు.

11 అ మరునాటి ఉదయం సౌలు తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించాడు. సూర్యోదయానికి సౌలు సైన్యం అమ్మోనీయుల శిబిరాన్ని చేరింది. అమ్మోనీయుల గస్తీ తిరిగే జట్టు మారుతున్నప్పుడు సౌలు వారిమీద దాడి చేసాడు. సౌలు, అతని సైనికులు అమ్మోనీయులను ఓడించారు. చావగా మిగిలిన అమ్మో నీయులు చెల్లాచెదురై పోయారు. ఏ ఇద్దరూ కూడ కలిసి ఉండే అవకాశం వారికి లేకుండా పోయింది.

12 “సౌలు రాజుగా ఉండటానకి అంగీరకించని వాళ్లెవరు? వారిని ఇక్కడకి తీసుకొని రండి. వారిని చంపేస్తాము” అని ప్రజలు సమూయేలుతో అన్నారు.

13 “వద్దు. ఈ వేళ ఇశ్రాయేలీయులను రక్షించినవాడు యెహోవా. అందుచేత ఈ వేళ ఏ ఒక్కరూ చంపబడకూడదు” అని సౌలు చెప్పాడు.

14 “గిల్గాలుకు వెళదాం రండి. అక్కడ సౌలు రాజరికాన్ని తిరిగి కొనసాగేలా చేద్దాము” అన్నాడు సమూయేలు ప్రజలతో.

15 జనమంతా గిల్గాలుకు వెళ్లారు. అక్కడ యెహోవా ఎదుట వారు సౌలును మళ్లీ రాజుగా ఎన్నుకున్నారు. వారు యెహోవాకు సమాధాన బలులు కూడ అర్పించారు. సౌలు, ఇశ్రాయేలు ప్రజలు గొప్ప సంబరం జరుపుకొన్నారు.

రోమీయులకు 9

దేవుడు, తాను ఎన్నుకొన్న ప్రజలు

క్రీస్తు పేరట నేను నిజం చెపుతున్నాను. నేను అసత్యమాడటం లేదు. నా అంతరాత్మ పవిత్రాత్మ ద్వారా ఇది నిజమని సాక్ష్యం చెబుతోంది. నాలో చాలా దుఃఖం ఉంది. అంతంగాని ఆవేదన నా హృదయంలో ఉంది. నా జాతికి చెందిన నా సోదరుల కోసం దేవుడు నన్ను శపించినా, క్రీస్తు నుండి నన్ను వేరు చేసినా నాకు సంతోషమే. ఈ నా సోదరులు ఇశ్రాయేలు వంశానికి చెందిన వాళ్ళు. దేవుడు వాళ్ళను తన పుత్రులుగా చేసుకొని మహిమను, ఒడంబడికలను, ధర్మశాస్త్రాన్ని, ఆరాధనా విధానాన్ని ఇచ్చి వాగ్దానాలు చేసాడు. మూల పురుషులు వీళ్ళ వంశానికి చెందినవాళ్ళు. క్రీస్తు వీళ్ళ వంశంలో జన్మించాడు. క్రీస్తు అందరికీ దేవుడు. ఆయన్ని చిరకాలం అందరూ స్తుతించుగాక! ఆమేన్!

ఇశ్రాయేలు జాతికి చెందిన వాళ్ళందర్ని దేవుడు తన ప్రజలుగా ఎన్నుకోలేదు. కాబట్టి దేవుని మాట పరాజయం పొందిందని మనమనకూడదు. లేక అబ్రాహాము సంతానమందరూ నిజంగా అబ్రాహాము సంతానమని మనమనలేము. కాని ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “ఇస్సాకు వల్ల మాత్రమే నీ సంతానం గుర్తింపబడుతుంది.”(A) ఇంకొక రీతిగా చెప్పాలంటే అబ్రాహాముకు ప్రకృతి సహజంగా జన్మించినంత మాత్రాన దేవుని సంతానంగా పరిగణింపబడరు. కాని దేవుని వాగ్దానం మూలంగా అతనికి కలిగిన సంతానం అబ్రాహాము సంతానంగా పరిగణింపబడుతుంది. ఈ వాగ్దానం ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నియమిత సమయానికి నేను తిరిగి వస్తాను, శారాకు పుత్రుడు జన్మిస్తాడు.”(B)

10 అంతేకాదు. రిబ్కాకు, మన మూలపురుషుడైన ఇస్సాకు ద్వారా ఇద్దరు పుత్రులు కలిగారు. 11-12 కాని దేవుడు ఒక్కణ్ణే ఎన్నుకోవాలని, తద్వారా తన ఉద్దేశ్యం సంపూర్ణంగా నెరవేరాలని, రిబ్కాతో, “పెద్దవాడు, చిన్నవానికి సేవ చేస్తాడు”(C) అని అన్నాడు. అప్పటికింకా ఈ కవలలు జన్మించలేదు కనుక వాళ్ళు మంచి, చెడు, చేసే ప్రశ్నే రాదు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం పిలిచాడు. కాని, ఈ పిలుపు వాళ్ళు చేసిన పనులపై ఆధారపడలేదన్న మాట. 13 ఈ విషయంపై ఈ విధంగా వ్రాయబడి ఉంది: “నేను యాకోబును ప్రేమించాను, కాని ఏశావును ద్వేషించాను.”(D)

14 మరి, మనమేమనాలి? దేవుడు అన్యాయం చేసాడా? లేదు. 15 ఎందుకంటే ఆయన మోషేతో ఈ విధంగా అన్నాడు: “నాకిష్టం వచ్చిన వాళ్ళను కరుణిస్తాను, నాకిష్టం వచ్చిన వాళ్ళపై దయ చూపిస్తాను.”(E) 16 అందువల్ల ఇది మానవుని అభీష్టంపై కాని, లేక అతని శ్రమపై కాని ఆధారపడింది కాదు. ఇది దేవుని కనికరంపై ఆధారపడింది. 17 లేఖనము ఫరోతో ఈ విధంగా అంటుంది: “నీ ద్వారా నా శక్తి వ్యక్తం చెయ్యాలనీ, ప్రపంచమంతా నా పేరు ప్రకటింపబడాలనీ, నేను నిన్ను రాజుగా చేసాను.”(F) 18 అంటే, దేవుడు తనకిష్టమున్న వాళ్ళపై కనికరం చూపిస్తాడు, తనకిష్టమున్న వాళ్ళపై కఠినత్వం చూపిస్తాడు.

19 మీరు నాతో, “మరి, దేవుడు మమ్ముల్ని ఎందుకు ఇంకా నిందిస్తున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు కాదనగలరు?” అని అనవచ్చు. 20 కాని, ఓ మనిషీ! దేవునితో ఎదురు తిరిగి మాట్లాడటానికి నీవెవరవు? సృష్టింపబడింది సృష్టికర్తతో, “నన్నీవిధంగా ఎందుకు సృష్టించావు?” అని అడగవచ్చా? 21 కుమ్మరి ఒకే మట్టి ముద్దతో కొన్ని కుండల్ని మంచి పనులకోసం, మరి కొన్నిటిని మామూలుగా ఉపయోగించుకోవటానికి చేస్తాడు. అలా చెయ్యటానికి అతనికి అధికారం లేదా?

22 భవిష్యత్తులో దేవుడు తన కోపాన్ని చూపాలని, తన శక్తిని తెలియచెయ్యాలని, నాశనం చెయ్యతగిన దుర్మార్గుల పట్ల సహనం వహించాడంటే మనమేమనగలము? 23 దేవుడు తన తేజస్సులోని గొప్పతనాన్ని తెలియచెయ్యాలని తన మహిమను పంచుకోవటానికి దయతో ఇతర్లను సృష్టించాడంటే మనం ఏమనగలం? 24 యూదుల నుండే కాక, యూదులు కానివాళ్ళ నుండి కూడా దేవుడు ప్రజల్ని పిలిచాడు. ఆయన పిలిచింది మనల్నే. 25 హోషేయ గ్రంథంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు:

“నా ప్రజలు కాని వాళ్ళను
    నా ప్రజలని పిలుస్తాను.
నా ప్రియురాలు కాని జనాన్ని
    నా ప్రియురాలా అని పిలుస్తాను.”(G)

26 “మీరు నా ప్రజలు కారు అని అన్న చోటనే మీరు సజీవంగా ఉండే దేవుని పుత్రులు అని అనటం సంభవిస్తుంది.”(H)

27 యెషయా ప్రవక్త ఇశ్రాయేలు వంశాన్ని గురించి ఇలా అన్నాడు:

“ఇశ్రాయేలు పుత్రుల సంఖ్య సముద్ర తీరంపై ఉన్న ఇసుక రేణువుల్లా ఉన్నా,
    కొందరు మాత్రమే రక్షింపబడతారు.
28 ఎందుకంటే, ప్రపంచానికి విధించిన శిక్షను ప్రభువు త్వరలోనే నెరవేరుస్తాడు.”(I)

29 యెషయా జరుగుతుందని చెప్పినట్లు:

“సర్వ శక్తిసంపన్నుడైన ప్రభువు కొంత మందిని
మనకు వదిలి ఉండక పోయినట్లైతే
    మనం సొదొమ ప్రజలవలే,
    గొమొఱ్ఱా ప్రజలవలె ఉండే వాళ్ళం.”(J)

30 మరి మనమేమనాలి? నీతిమంతులు కావటానికి ప్రయత్నించని యూదులుకాని ప్రజలు నీతిమంతులయ్యారు. అది వాళ్ళల్లో విశ్వాసం ఉండటం వల్ల సంభవించింది. 31 కాని ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కావాలని ప్రయత్నించిన ఇశ్రాయేలు వంశీయులు నీతిమంతులు కాలేదు. 32 ఎందుకు? వాళ్ళు విశ్వాసంతో కాకుండా కార్యాలు చేసి ప్రయత్నించారు. కనుక అడ్డురాయి తగిలి తొట్రుపడ్డారు. 33 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నేను సీయోనులో ఒక రాయిని స్థాపించాను.
    దాని వల్ల కొందరు తొట్రుపడతారు. నేనొక శిలను స్థాపిస్తాను.
దాని వల్ల వాళ్ళు క్రింద పడతారు. ఆయన్ని నమ్మిన వానికెన్నడూ ఆశాభంగం కలుగదు.”(K)

యిర్మీయా 48

మోయాబును గురించిన సందేశం

48 ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,

“నెబో పర్వతానికి[a] చేటు కలుగుతుంది.
    నెబో పర్వతం నాశనమవుతుంది.
కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది.
    అది పట్టుబడుతుంది.
బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది.
    అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.
మోయాబు మరెన్నడూ ప్రశంసించబడడు.
    మోయాబును ఓడించటానికి హెష్బోను పట్టణవాసులు కుట్రపన్నుతారు.
    ‘రండి. మనమా దేశాన్ని రూపుమాపుదాము’ అని వారంటారు.
మద్మేనా, నీవు కూడ మాట్లాడకుండా చేయబడతావు.
    కత్తి నిన్ను వెంటాడుతుంది.
హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు విను.
    అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.
మోయాబు ధ్వంసం చేయబడుతుంది.
    దాని చిన్న పిల్లలు సహాయం కొరకు విలపిస్తారు.
మోయాబు ప్రజలు లూహీతు మార్గంలో వెళ్తున్నారు.
    వారు మార్గమధ్యంలో మిక్కిలిగా విలపిస్తున్నారు.
హొరొనయీము పట్టణ మార్గంలో ప్రయాసతోను,
    బాధతోను కూడిన రోదన వినిపించగలదు.
పారిపొండి! మీ ప్రాణరక్షణకై పారిపొండి!
    ఎడారిలో అరుహ వృక్షం[b] వీచినట్లు మీరు పారిపొండి.

“మీరు చేసిన వస్తువులలోను, మీ భాగ్యంలోనే మీరు విశ్వసిస్తారు.
    కావున మీరు పట్టుబడతారు.
కెమోషు[c] దైవం బందీగా కొనిపోబడతాడు.
    అతనితో పాటు అతని యాజకులు, అధికారులు కూడ తీసికొని పోబడతారు.
వినాశనకారుడు ప్రతి పట్టణం మీదికి వస్తాడు.
    ఒక్క పట్టణం కూడ తప్పించుకోలేదు.
లోయ శిథిలము చేయబడుతుంది.
    ఉన్నత మైదానం నాశనము చేయబడుతుంది.
యెహోవా ఇది జరుగుతుందని చెప్పినాడుగాన
    ఇది జరిగి తీరుతుంది.
మోయాబు పొలాలపైన ఉప్పు[d] చల్లుము.
    దేశం వట్టి ఎడారి అయిపోతుంది.
మోయాబు పట్టణాలు ఖాళీ అవుతాయి.
వాటిలో ఎవ్వరూ నివసించరు.
10 ఎవ్వరేగాని యెహోవా చెప్పినట్లు చేయకపోయినా,
    వారిని చంపటానికి తన కత్తిని వినియోగించకపోయినా, ఆ వ్యక్తికి కీడు మూడుతుంది.[e]

11 “మోయాబు ఇప్పటి వరకు ఆపద ఎరుగదు.
    కుదురుకోడానికి నిలకడగా పెట్టిన ద్రాక్షరసంవలె మోయాబు ఉంది.
మోయాబు ఇంతవరకు ఒక జాడీనుండి మరొక దానిలోకి పోయబడలేదు.
    అతడు నిర్బంధించబడి ఇతర దేశానికి కొనిపోబడలేదు.
పూర్వంవలెనే అతడు ఇప్పుడూ రుచిగానే వున్నాడు.
    అతని సువాసన మారలేదు.”
12 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.
“కాని మిమ్మల్ని మీ జాడీలలో[f] నుంచి బయట పోయుటకు
    అతి త్వరలోనే నేను మనుష్యులను పంపుతాను.
ఆ మనుష్యులు మోయాబు యొక్క జాడీలను ఖాళీ చేస్తారు.
    తరువాత ఆ జాడీలను వారు పగులగొడతారు.”

13 పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు[g] నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.

14 “‘మేము మంచి సైనికులం. మేము యుద్ధవీరులం’
    అని మీరు చెప్పుకోలేరు.
15 శత్రువు మోయాబును ఎదుర్కొంటాడు.
    శత్రువు ఆ పట్టణాలలో చొరబడి నాశనం చేస్తాడు.
మోయాబు యువ వీరులంతా నరకబడతారు.”
    ఈ వర్తమానం రాజునుండి వచ్చినది.
    ఆ రాజు పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
16 “మోయాబు అంతం దగ్గర పడింది.
    మోయాబు త్వరలో నాశనమైపోతుంది.
17 మోయాబు చుట్టుపట్ల నివసించు ప్రజలారా ఆ దేశంకొరకు విలపించండి.
    మోయాబు ఎంత ప్రసిద్ధి గాంచినవాడో మీకు తెలుసు.
అందువల్ల వానికొరకు మీరు విచారించండి.
    ‘అధిపతుల అధికారం విరిగిపోయింది.
మోయాబు కీర్తి ప్రతిష్ఠలు పోయాయి’
    అని మీరు చెప్పండి.

18 “దీబోను వాసులారా
    గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి.
నేలమీద మట్టిలో కూర్చోండి.
    ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు.
అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.

19 “అరోయేరు నివాసులారా,
    దారి ప్రక్కన నిలబడి కనిపెట్టుకొని ఉండండి.
పారిపోయే మనిషిని చూడండి.
    పారిపోయే స్త్రీని చూడండి.
    ఏమి జరిగిందో వారిని అడగండి.

20 “మోయాబు పాడుపడి,
    అవమానముతో నిండి పోతుంది.
మోయాబు ఏకరీతిగా విలపిస్తుంది.
    మోయాబు పాడుపడిపోయిందని అర్నోను నది[h] వద్ద ప్రకటించండి.
21 ఉన్నత మైదానంలోని ప్రజలు శిక్షింపబడ్డారు.
    తీర్పు హోలోనుకు వచ్చింది. యాహసు, మేఫాతు,
22 దీబోను, నెబో, బేత్‌-దిబ్లాతయీము,
23 కిర్యతాయిము, బేత్గామూలు, బేత్మెయోను,
24 కెరీయోతు మరియు బొస్రా పట్టణాలకు తీర్పు ఇవ్వబడింది.
    మోయాబుకు సమీపాన, దూరాన వున్న పట్టణాలన్నిటికి శిక్ష విధించబడింది.
25 మోయాబు బలం తగ్గిపోయింది.
    మోయాబు చేయి విరిగిపోయింది.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

26 “యెహోవా కంటె తానే ముఖ్యమైనట్లు మోయాబు భావించటం జరిగింది.
    కావున, తాగినవాని మాదిరి తూలిపోయే వరకు మోయాబును శిక్షించండి.
    మోయాబు తాను కక్కిన పదార్థంలోపడి దొర్లుతాడు.
ప్రజలు మోయాబును చూచి హేళన చేస్తారు.

27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు.
    ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది.
నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి,
    ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.
28 మోయాబు ప్రజలారా,
    మీ పట్టణాలను వదిలిపెట్టండి.
వెళ్లి గుట్టల్లో నివసించండి.
    గుహద్వారంలో గూడు చేసికొనే గువ్వల్లా ఉండండి.”

29 “మోయాబు గర్వాన్ని గురించి విన్నాము.
    అతడు మిక్కిలి గర్విష్ఠి.
తాను చాలా ముఖ్యమైన వానిలా అతడు తలంచినాడు.
    అతడు ఎల్లప్పుడూ గొప్పలు చెప్పుకొనేవాడు.
    అతడు మహా గర్విష్ఠి.”

30 యోహోవా ఇలా చెపుతున్నాడు, “మోయాబు ఏ కారణమూ లేకుండానే కోపం తెచ్చుకొంటాడు, స్వంత గొప్పలు చెప్పుకుంటాడని నాకు తెలుసు.
    కాని అతని గొప్పలన్నీ అబద్ధాలు.
    అతను చెప్పేవి చేయలేడు.
31 కావున, మోయాబు కొరకు నేను ఏడుస్తున్నాను.
    మోయాబులో ప్రతి పౌరుని కొరకు విచారిస్తున్నాను.
    కీర్హరెశు మనుష్యుల నిమిత్తం నేను బాధపడుతున్నాను.
32 యాజెరు ప్రజలతో కలిసి నేను కూడ యాజెరు కొరకై దుఃఖిస్తున్నాను!
    సిబ్మా, గతంలో నీ ద్రాక్షలతలు సముద్ర తీరం వరకు వ్యాపించాయి.
అవి యాజెరు పట్టణం వరకు వ్యాపించాయి.
    కాని వినాశనకారుడు నీ పంటను, ద్రాక్ష పండ్లను తీసికొన్నాడు.
33 మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి.
    గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను.
రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి
    వారి అలరింతలు అంతమయ్యాయి.

34 “హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది. 35 మోయాబు ఉన్నత స్థలాలలో దహన బలులు అర్పించటాన్ని నిలుపు చేస్తాను. వారు తమ దేవతలకు ధూపం వేయకుండా ఆపివేస్తాను.” ఇవి యెహోవా చెప్పిన విషయాలు.

36 “మోయాబు కొరకు నేను మిక్కిలి ఖిన్నుడనైయున్నాను. వేణువుపై విషాద గీతం ఆలపించినట్లు నా హృదయం విలపిస్తున్నది. కీర్హరెశు ప్రజల విషయంలో కూడా నేను విచారిస్తున్నాను. వారి ధన ధాన్యాలన్నీ తీసికొని పోబడ్డాయి. 37 ప్రతివాని తల గొరగబడింది. ప్రతివాని గడ్డం తీసివేయబడింది. గాయ పర్చబడటంతో ప్రతివాని చేతుల నుండి రక్తం కారుతున్నది.[i] ప్రతివాడూ తన మొలచుట్టూ విషాద సూచక బట్ట కట్టుకున్నాడు. 38 మోయాబులో ప్రతి చోట చనిపోయిన వారికోసం ప్రజలు దుఃఖిస్తున్నారు. వారు ప్రతి ఇంటిపైనా, జన సమ్మర్ద ప్రదేశాలలోనూ అలా విలపించారు. ఒక ఖాళీ జాడీని పగులగొట్టిన విధంగా నేను మోయాబును విచ్ఛిన్నం చేయటంతో విషాదం అలుముకున్నది.” యెహోవా ఈ మాటలు చెప్పాడు.

39 “మోయాబు విచ్ఛిన్నమవటంతో ప్రజలు ఏడుస్తున్నారు. మోయాబు లొంగిపోయాడు. మోయాబుకు తలవంపులయ్యాయి. మోయాబును చూచి ప్రజలు ఎగతాళి చేస్తారు. కాని అక్కడ జరిగిన విషయాలవల్ల ప్రజలు భయంతో నిండిపోతారు.”

40 యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడండి! ఆకాశం నుండి పక్షిరాజు (శత్రువు) దిగుతున్నాడు.
    అతను తన రెక్కలను మోయాబు మీదికి చాపుతున్నాడు.
41 మోయాబు పట్టణాలు పట్టుబడతాయి.
    బలమైన దుర్గాలు ఓడింపబడతాయి.
ఆ సమయంలో మోయాబు సైనికులు
    ప్రసవించే స్త్రీలా భయాందోళనలు చెందుతారు.
42 మోయాబు రాజ్యం నాశనం చేయబడుతుంది.
    ఎందువల్లనంటే వారు యెహోవా కంటె తమను ముఖ్యమైన వారిగా తలంచారు.”

43 యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు,
    “మోయాబు ప్రజలారా, మీ కొరకై భయం లోతైన గోతులు, ఉరులు[j] పొంచివున్నాయి.
44 ప్రజలు భయపడి పారిపోతారు.
    పరుగెత్తి లోతు గోతులల్లో పడిపోతారు.
ఎవడైనా ఆ లోతు గోతుల నుండి పైకివస్తే
    అతడు ఉరిలో చిక్కుకుంటాడు.
మోయాబుకు శిక్షా సంవత్సరాన్ని తీసికొనివస్తాను.”
    ఈ విషయాలన్నీ యెహోవా చెప్పాడు.

45 “బలవంతుడైన శత్రువునుండి జనం పారిపోయారు.
    వారు రక్షణకై హెష్బోను పట్టణానికి పారిపోయారు.
అయినా అక్కడ రక్షణ దొరకలేదు.
    హెష్బోనులో అగ్ని ప్రజ్వరిల్లింది.
సీహోను పట్టణంలో[k] నిప్పు చెలరేగింది.
    అది మోయాబు నాయకులను దహించివేస్తున్నది. అది గర్విష్ఠులను కాల్చివేస్తున్నది.
46 మోయాబూ, నీకు చెడు దాపురించింది.
    కెమోషు ప్రజలు నాశనం చేయబడుతున్నారు.
నీ కుమారులు, కుమార్తెలు చెరపట్టబడి
    బందీలుగా కొనిపోబడుతున్నారు.

47 “మోయాబు ప్రజలు బందీలుగా కొనిపోబడతారు. కాని రాబోయే కాలంలో మోయాబీయులను నేను వెనుకకు తీసికొని వస్తాను.” ఇది యెహోవా సందేశం.

ఇంతటితో మోయాబీయులపై తీర్పు సమాప్తం.

కీర్తనలు. 25

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
10 యెహోవా ఒడంబడికను, వాగ్దానాలను అనుసరించే మనుష్యులందరికి
    ఆయన మార్గాలు దయగలవిగా, వాస్తవమైనవిగా ఉంటాయి.

11 యెహోవా, నేను ఎన్నెన్నో తప్పులు చేసాను.
    కాని, నీ మంచితనం చూపించుటకు గాను, నేను చేసిన ప్రతి దానిని నీవు క్షమించావు.

12 ఒక వ్యక్తి యెహోవాను అనుసరించాలని కోరుకొంటే
    అప్పుడు శ్రేష్ఠమైన జీవిత విధానాన్ని దేవుడు ఆ వ్యక్తికి చూపిస్తాడు.
13 ఆ వ్యక్తి మేళ్లను అనుభవిస్తాడు.
    అతనికిస్తానని దేవుడు వాగ్దానం చేసిన భూమిని ఆ వ్యక్తి పిల్లలు వారసత్వంగా పొందుతారు.
14 యెహోవా తన అనుచరులకు తన రహస్యాలు చెబుతాడు.
    ఆయన తన అనుచరులకు తన ఒడంబడికను ఉపదేశిస్తాడు.
15 నా కళ్లు సహాయం కోసం ఎల్లప్పుడూ యెహోవా వైపు చూస్తున్నాయి.
    ఆయన నన్ను ఎల్లప్పుడూ నా కష్టాల్లో నుంచి విడిపిస్తాడు.

16 యెహోవా, నేను బాధతో ఒంటరిగా ఉన్నాను.
    నా వైపు తిరిగి, నాకు నీ కరుణ ప్రసాదించుము.
17 నా కష్టాలనుంచి నన్ను విడిపించుము.
    నా సమస్యలు పరిష్కరించబడుటకు నాకు సహాయం చేయుము.
18 యెహోవా, నా పరీక్షలు, కష్టాలు చూడుము.
    నేను చేసిన పాపాలు అన్నింటి విషయంలో నన్ను క్షమించుము.
19 నాకు ఉన్న శత్రువులు అందరినీ చూడుము,
    నా శత్రువులు నన్ను ద్వేషిస్తూ, నాకు హాని చేయాలని కోరుతున్నారు.
20 దేవా, నన్ను కాపాడుము, నన్ను రక్షించుము.
    నేను నిన్ను నమ్ముకొన్నాను కనుక నన్ను నిరాశపర్చవద్దు.
21 దేవా, నీవు నిజంగా మంచివాడివి. నిన్ను నేను నమ్ముకొన్నాను.
    కనుక నన్ను కాపాడుము.
22 దేవా, ఇశ్రాయేలు ప్రజలను, వారి కష్టములనుండి రక్షించుము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International