Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 9

సౌలు తన తండ్రి గాడిదలను వెదకబోవటం

బెన్యామీను గోత్రమునకు చెందిన వారిలో కీషు చాలా ముఖ్యడు. అతను అబీయేలు కుమారుడు. అబీయేలు సెరోరు కుమారుడు. సెరోరు బెకోరతు పుత్రుడు. బెకోరతు బెన్యామీనీయుడైన అఫీయ కుమారుడు. కీషుకు సౌలు అనే ఒక కుమారుడు ఉన్నాడు. సౌలు చాలా అందగాడు. సౌలుకంటె ఎక్కువ అందగాడు మరొకడు లేడు. ఇశ్రాయేలీయులందరిలోనూ అతడు ఆజానుబాహుడు.

ఒకనాడు కీషు గాడిదలు తప్పిపోయాయి. కనుక “సేవకులలో ఒకరిని తీసుకుని గాడిదలను వెదకవలసిందిగా” కీషు తన కుమారుడైన సౌలుతో చెప్పాడు. ఎఫ్రాయిము కొండలు, షాలిషా దేశమంతా వెదికారు. కాని సౌలు, అతని సేవకుడు గాడిదలను కనుక్కోలేకపోయారు. వారు షయలీము ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కూడా గాడిదలు లేవు. సౌలు బెన్యామీనీయుల దేశ ప్రాంతంలో కూడ తిరిగి వెదికాడు. అయినా అవి దొరకలేదు.

చివరికి సౌలు, అతని సేవకుడు కలసి సూపు పట్టణానికి వచ్చారు. సౌలు, “ఇంటికి వెళ్లి పోదామని తన సేవకునితో అన్నాడు. తన తండ్రి గాడిదల విషయం మర్చిపోయి తమను గురించి కంగారు (చింత) పడతాడని” అన్నాడు సౌలు.

“మనము ఈ పట్టణంలోనికి వెళ్దాము. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ప్రజలు అతనిని చాలా గౌరవిస్తారు, ఆయన చెప్పేది నెరవేరుతుంది. ఒకవేళ మనం యిప్పుడు ఎక్కడికి వెళ్లాల్సిందీ అతను చెప్పగలడేమో” అని సేవకుడు సౌలుతో అన్నాడు.

“సరే మంచిది. మనం పట్టణంలోనికి వెళ్దాము. కానీ ఆ దైవజనుడికి మనము ఏమి ఇవ్వగలం? మన సంచుల్లో ఆహారం అయిపోయింది. ఆయనకు ఇచ్చేందుకు మన దగ్గర మరి ఏ కానుకలూ లేవు. అందుచేత మనము ఏమి ఇవ్వగలము?” అని సౌలు అన్నాడు.

“చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని ఆ దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.

9-11 “ఇది మంచి ఆలోచన! వెళదాం పద” అన్నాడు సౌలు. కనుక వారిద్దరూ కలసి దైవ జనుడుండే పట్టణం వైపు బయలుదేరి వెళ్లారు.

సౌలు, “సేవకుడు ఆ పట్టణానికి కొండ ఎక్కి వెళ్తున్నారు. మార్గంలో వారు కొందరు యువతులను కలుసుకొన్నారు. వారు నీళ్లకోసం బయటికి వస్తున్నారు.” “దీర్ఘదర్శి ఇక్కడ ఉన్నాడా?” అని వారు ఆ యువతులను అడిగారు. (గతంలో ఇశ్రాయేలీయులు ప్రవక్తను, “దీర్ఘదర్శి” అని పిలిచేవారు. అందుచేత దేవుని నుండి వారు ఏదైనా అడిగి తెలుసుకోవాలనుకొంటే, “దీర్ఘదర్శి దగ్గరకు పోదాం పదండి” అనే వాళ్లు).

12 అది విన్న యువతులు, “అవును ఆ దీర్ఘదర్శి ఇక్కడే ఉన్నాడు. ఆయన ఈ వేళే పట్టణంలోకి వచ్చాడు. వీధిలో ఉన్నాడు ఆరాధనా స్థలంలో సమాధాన బలిలో పాలుపుచ్చుకొనేందుకు కొందరు ప్రజలు ఈ వేళ సమావేశం అవుతున్నారు. 13 మీరు పట్టణంలోకి ప్రవేశించగానే ఆయనను చూడగలరు. మీరు త్వరపడి వెళ్తే, ఆరాధన స్థలంలో ఆయన భోజనానికి వెళ్లక ముందే మీరు ఆయనను చూడగలుగుతారు. దీర్ఘదర్శి వచ్చి బలి పదార్థాలను ఆశీర్వదించే వరకూ ప్రజలు భోజనాలు మొదలు పెట్టరు. వెంటనే వెళ్తే మీరు ఆయనను చూడగలరు” అని ఆ కన్యకలు చెప్పారు.

14 సౌలు, అతని సేవకుడు పట్టణానికి వెళ్లారు. పట్టణంలోకి వెళ్లగానే వారు సమూయేలును చూసారు. ఆరాధనకు వెళ్లే నిమిత్తం సమూయేలు పట్టణంలోనుండి బయటకు వస్తూ వారికి ఎదురయ్యాడు.

15 ఒకరోజు ముందు యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: 16 “రేపు ఇంచుమించు ఇదే సమయానికి నేను నీ వద్దకు ఒక వ్యక్తిని పంపుతాను. అతడు బెన్యామీనువాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద నాయకునిగా ఉండేందుకు నీవు అతనిని అభిషేకించాలి[a] నా ప్రజల బాధ నేను గమనించాను. నా ప్రజల రోదన నేను విన్నాను గనుక ఫిలిష్తీయుల బారినుండి నా ప్రజలను అతడు రక్షిస్తాడు.”

17 సమూయేలు ప్రథమంగా సౌలును చూసినప్పుడు యెహోవా అతనితో, “నేను నీకు చెప్పిన వ్యక్తి ఇతడే; నా ప్రజలను పాలించువాడితడే” అన్నాడు.

18 సౌలు పట్టణ ద్వారం దగ్గర సమూయేలుకు కనబడెను. “దీర్ఘదర్శి ఇల్లెక్కడ?” అని సౌలు సమూయేలును అడిగాడు.

19 “నేనే దీర్ఘదర్శిని. నాకు ముందుగా నడుస్తూ ఆరాధనా స్థలానికి వెళ్లు. ఈ రోజు నీవు, నీ సేవకుడు నాతో కలిసి భోజనం చేయాలి. రేపటి ఉదయం నీ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పి నిన్ను ఇంటికి పంపుతాను. 20 మూడు రోజులనుండి మీరు పోగొట్టుకున్న గాడిదలను గురించి బాధ పడవద్దు. అవి దొరికాయి. ఇప్పుడు ఇశ్రాయేలు కోరుకుంటున్నది ఎవరిని? నీ తండ్రి కుటుంబాన్ని కదా?” అన్నాడు సమూయేలు.

21 అది విన్న సౌలు, “నేను బెన్యామీను వంశానికి చెందిన వాడిని! ఇశ్రాయేలు అంతటిలో నావంశం చిన్నదిగదా! అందులో నా ఇంటివారు అతి తక్కువ సంఖ్యలో వున్నారే! అలాంటి నన్ను ఇశ్రాయేలు కోరుతూ వుందని ఎందుకు చెబుతున్నావు?” అని అడిగాడు.

22 అప్పుడు సమూయేలు సౌలును, అతని సేవకుని భోజనాలు పెట్టే చోటికి తీసుకుని వెళ్లాడు. భోజనాల బల్లవద్ద సౌలుకి, అతని సేవకునికి ప్రముఖ స్థానాలను సమూయేలు ఇచ్చాడు. భోజనాల స్థలంలో సమాధాన అర్పణలో పాలుపుచ్చుకొనేందుకు సుమారు ముప్పది మంది ఆహ్వానించబడ్డారు. 23 వంటవానితో సమూయేలు, “నేను నీకిచ్చిన మాంసాన్ని తీసుకునిరా. ప్రత్యేకంగా భద్రపర్చమని నీతో చెప్పిన మాంస భాగం అది” అన్నాడు.

24 వంటవాడు తొడ మాంసాన్ని[b] తెచ్చి సౌలు ముందు బల్లమీద పెట్టాడు. అప్పుడు సమూయేలు, ఆ మాంసం అతని కోసం ప్రత్యేకించబడిందని సౌలుతో చెప్పాడు. ఈ ప్రత్యేకమైన సందర్భానికోసం అతని కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది. కనుక సౌలును దాన్ని స్వీకరించుమని సమూయేలు చెప్పాడు. కావున సౌలు ఆ రోజు సమూయేలుతో కలిసి భోజనం చేశాడు.

25 భోజనాలు అయిన తరువాత వారు ఆరాధనా స్థలం నుండి క్రిందికి దిగి పట్టణంలోకి వెళ్లారు. ఒక మిద్దెమీద సౌలుకు పడక ఏర్పాటు చేసారు. అక్కడ సౌలు నిద్రపోయాడు.

26 మరునాడుతెల్లవారుఝామున సమూయేలు లేచి మిద్దెమీద ఉన్న సౌలును మేల్కొలిపాడు. “బయల్దేరు, నిన్ను నీ దారిని నేను పంపిస్తాను” అన్నాడు సమూయేలు. సౌలు లేచి సమూయేలుతో కలిసి బయటికి వెళ్లాడు.

27 సౌలు, అతని సేవకుడు సమూయేలుతో కలిసి ఊరి బయటకు రాగానే సమూయేలు సౌలును పిలిచి, “నీ సేవకుణ్ణి మనకు ముందు నడుస్తూ వుండ మని చెప్పు. నేను నీకు చెప్పాల్సిన దేవుని సందేశం ఒకటి ఉంది” అని చెప్పాడు.

రోమీయులకు 7

వివాహ బంధం

సోదరులారా! నేను ధర్మశాస్త్రం తెలిసినవాళ్ళతో మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రానికి ఒక వ్యక్తిపై అతడు బ్రతికి ఉన్నంతవరకే అధికారం కలిగి ఉంటుందని మీకు తెలియదా? ఉదాహరణకు, ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీ ఆమె భర్త జీవించి ఉన్నంతవరకే అతనికి బద్ధురాలై ఉంటుంది. ఒకవేళ అతడు మరణిస్తే ధర్మశాస్త్ర బంధం నుండి ఆమెకు విముక్తి కలుగుతుంది. ఆమె భర్త జీవించి ఉండగా ఇంకొకణ్ణి వివాహమాడితే ఆమె వ్యభిచారి అనబడుతుంది. కాని ఆమె భర్త మరణిస్తే ఆమెకు ఆ చట్టం నుండి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఆమె ఇంకొకణ్ణి వివాహం చేసుకొన్నా ఆమె వ్యభిచరించినదానిగా పరిగణింపబడదు.

అదే విధంగా నా సోదరులారా! మీరు కూడా క్రీస్తు శరీరంతో పాటు చనిపోయి ధర్మశాస్త్ర బంధం నుండి విముక్తి పొందారు. మీరు బ్రతికింపబడ్డ క్రీస్తుకు చెందినవారై దేవుని కొరకు ఫలిస్తారు. ధర్మశాస్త్రం మూలంగా కలిగిన దురాశలు మన శరీరాల్లో పని చేయటంవల్ల మనం మరణాన్ని పొందాము. మనల్ని బంధించి ఉంచిన ధర్మశాస్త్రం విషయంలో మనం మరణించాము కనుక ఇప్పుడు మనము ఆ బంధం నుండి స్వేచ్ఛను పొందాము. అందువల్ల వ్రాత పూర్వకంగా ఉన్న ధర్మశాస్త్రానికి మనమిక బానిసలము కాము. దేవుని ఆత్మ చూపించిన క్రొత్త మార్గాన్ని అనుసరించి మనము ఆయన సేవ చేస్తున్నాము.

ధర్మశాస్త్రము, పాపము

అంటే, ధర్మశాస్త్రం పాపంతో కూడుకున్నదని అర్థమా? కాదు. ధర్మశాస్త్రం లేకపోయినట్లయితే పాపమంటే నాకు తెలిసేది కాదు. “ఇతర్లకు చెందిన వాటిని ఆశించవద్దని”(A) ధర్మశాస్త్రం చెప్పి ఉండకపోతే, ఆశించటమంటే ఏమో నాకు తెలిసేది కాదు. ధర్మశాస్త్రం చెప్పిన ఆజ్ఞను ఉపయోగించి పాపం నాలో అన్ని రకాల దురాశల్ని కలిగించింది. ధర్మశాస్త్రం లేకపోయినట్లైతే పాపంలో ప్రాణముండేది కాదు. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించాను. కాని ఆజ్ఞ రాగానే పాపం మొలకెత్తింది. దానితో నేను మరణించాను. 10 జీవాన్నివ్వటానికి ఉద్దేశింపబడిన ఆ ఆజ్ఞ నాకు మరణాన్ని కలుగ చెయ్యటం గమనించాను. 11 ఆజ్ఞ కలుగ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకొని, పాపం నన్ను మోసంచేసి ఆ ఆజ్ఞద్వారా నన్ను చంపివేసింది.

12 సరే! మరి, ధర్మశాస్త్రం పవిత్రమైంది. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞ పవిత్రమైంది. దానిలో నీతి, మంచితనము ఉన్నాయి. 13 అలాగైతే, మరి ఆ మంచి ధర్మశాస్త్రం నాకు మరణాన్ని కలిగించిందా? ఎన్నటికి కాదు. ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి పాపం నాకు మరణాన్ని కలిగించి తన నిజ స్వరూపాన్ని వ్యక్త పరిచింది. అందువల్ల ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ ద్వారా పాపం ఇంకా గొప్ప పాపంగా కనిపించింది.

మనలోని యుద్ధం

14 ధర్మశాస్త్రం ఆధ్యాత్మికమైనదని మనకు తెలుసు. కాని నేను బలహీనమైన మనిషిని, పాపానికి బానిసగా అమ్ముడుపోయినవాణ్ణి. 15 నేనేం చేస్తున్నానో నాకు తెలియదు. నేను చెయ్యలనుకొన్నదాన్ని చెయ్యటంలేదు. దేన్ని ద్వేషిస్తున్నానో దాన్నే చేస్తున్నాను. 16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. 17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. 18 నా శరీరంలో మంచి అనేది నివసించటం లేదని నాకు తెలుసు. మంచి చెయ్యాలనే కోరిక నాలో ఉంది కాని, అలా చెయ్యలేకపోతున్నాను. 19 చెయ్యాలనుకొన్న మంచిని నేను చెయ్యటం లేదు. దానికి మారుగా చెయ్యరాదనుకొన్న చెడును నేను చేస్తూ పోతున్నాను. 20 చెయ్యకూడదనుకొన్నదాన్ని నేను చేస్తున్నానంటే, దాన్ని చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపమే అలా చేయిస్తోంది.

21 అందువల్ల, “నేను మంచి చెయ్యాలని అనుకొన్నప్పుడు చెడు నాతో అక్కడే ఉంటుంది” అనే ఈ నియమం నాలో పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. 22 నా అంతరాత్మ దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విషయంలో ఆనందం పొందుతోంది. 23 కాని, నా అవయవాల్లో వేరొక నియమం పని చేస్తున్నట్లు గమనిస్తున్నాను. నన్ను పాపాత్మునిగా చేస్తున్న ఈ నియమం నా మెదడులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడి నన్ను ఖైదీగా చేస్తోంది. 24 నేనంత దౌర్భాగ్యుణ్ణి! మరణం యొక్క ఆధీనంలో ఉన్న ఈ నా శరీరంనుండి నన్ను ఎవరు రక్షిస్తారు? 25 అందువల్ల మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొందాం.

స్వయంగా, బుద్ధి పూర్వకంగా నేను దేవుని ధర్మశాస్త్రానికి బానిసను. కాని నా శరీరం పాపాన్ని కలుగచేసే నియమానికి బానిస.

యిర్మీయా 46

రాజ్యాలకు సంబంధించిన యెహోవా సందేశాలు

46 ప్రవక్తయైన యిర్మీయాకు ఈ సందేశాలు వచ్చాయి. ఆ సందేశాలు వివిధ దేశాలకు సంబంధించి ఉన్నాయి.

ఈజిప్టును గురించిన వర్తమానం

ఈ వర్తమానం ఈజిప్టు[a] దేశాన్ని గురించి చెప్పబడినది. అది ఫరోనెకో సైన్యానికి సంబంధించినది. నెకో ఈజిప్టు రాజు. అతని సైన్యం కర్కెమీషు అనే పట్టణం వద్ద ఓడింపబడింది. కర్కెమీషు యూఫ్రటీసు నదీతీర పట్టణం. బబులోను రాజైన నెబుకద్నెజరు ఫరోనెకో సైన్యాన్ని కర్కెమీషు వద్ద ఓడించాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీము పాలనలో నాల్గవ సంవత్సరం గడుస్తూ ఉంది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. ఈజిప్టుకు సంబంధించిన యెహోవా సందేశం ఇలా ఉంది:

“మీ చిన్న, పెద్దడాళ్లను తీసుకోండి.
    యుద్ధానికి నడవండి.
గుర్రాలను సిద్ధం చేయండి.
    సైనికులారా, మీరు గుర్రాలను ఎక్కండి.
యుద్ధానికై మీమీ సంకేత స్థలాలకు వెళ్లండి.
    మీ శిరస్త్రాణాలను పెట్టుకోండి.
మీ ఈటెలకు పదును పెట్టండి.
    మీ కవచాలను ధరించండి.
నేనేమిటి చూస్తున్నాను?
    ఆ సైన్యం భయపడింది!
సైనికులు పారిపోతున్నారు.
    ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు.
వారు తత్తరపడి పారిపోతున్నారు.
    వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు.
    ఎటు చూచినా భయం.”
యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“వేగంగా పరుగెత్తేవారు,
    బలవంతులు కూడా తప్పించుకోలేరు.
వారు తూలి పడిపోతారు.
    ఉత్తరదేశంలో యూఫ్రటీసు నదీ తీరాన ఇది జరుగుతుంది.
నైలు నదిలా ఆ వచ్చేది ఎవరు?
    పరవళ్లు తొక్కుతూ ప్రవహించే ఆ మహానదిలా వచ్చేది ఎవరు?
పొంగి ప్రవహించే నైలు నదిలా
    వచ్చేది ఈజిప్టు దేశమే.
మహా వేగంతో ప్రవహించే
    మహా నదిలా వచ్చేది ఈజిప్టు దేశమే.
‘నేను వచ్చి భూమిని కప్పివేస్తాను.
    నేను నగరాలను, వాటి నివాసులను నాశనం చేస్తాను’ అని ఈజిప్టు అంటున్నది.
గుర్రపు రౌతుల్లారా, యుద్ధానికి కదలండి.
    సారధుల్లారా, శరవేగంతో రథాలు తోలండి.
యోధుల్లారా ముందుకు పదండి.
    కూషు, పూతు సైనికులారా మీ డాళ్లను చేబూనండి.
    లూదీయులారా, మీ విల్లంబులు వాడండి.

10 “కాని ఆ రోజు సర్వశక్తిమంతుడైన మన యెహోవా గెలుస్తాడు!
    ఆ సమయంలో ఆయన శత్రువులకు తగిన శిక్ష ఆయన విధిస్తాడు.
యెహోవా శత్రువులు వారికి అర్హమైన శిక్ష అనుభవిస్తారు తన పని పూర్తి అయ్యేవరకు కత్తి హతమారుస్తుంది.
    దాని రక్తదాహం తీరేవరకు కత్తి సంహరిస్తుంది. ఇది జరుగుతుంది.
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన మన యెహోవాకు ఒక బలి జరగవలసి వుంది.
    ఆ బలి ఈజిప్టు సైన్యమే! అది ఉత్తర దేశాన యూఫ్రటీసు నది ఒడ్డున జరుగుతుంది.

11 “ఈజిప్టు, గిలియాదు వరకు వెళ్లి మందు తెచ్చుకో.
    నీవు మందులనేకం తయారుచేస్తావు, అయినా అవి నీకు ఉపయోగపడవు.
    నీ గాయాలు మానవు.
12 నీ రోదనను దేశాలు వింటాయి.
    నీ ఏడ్పు ప్రపంచమంతా వినపడుతుంది.
ఒక ధైర్యశాలి మరియొక ధైర్యశాలి అయిన యోధునిపై పడతాడు.
    ఆ యోధులిద్దరూ కలిసి క్రింద పడతారు.”

13 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా ఈ వర్తమానం అందజేశాడు. ఈజిప్టును ఎదుర్కోవటానికి కదలివచ్చే నెబుకద్నెజరును గురించి ఈ వర్తమానం ఇవ్వబడింది.

14 “ఈ సందేశాన్ని ఈజిప్టులో తెలియజెప్పండి.
    మిగ్దోలు నగరంలో బోధించండి.
    ఈ సందేశాన్ని నోపు (మెంఫిన్) లోను, తహపనేసులోను ప్రచారం చేయండి:
‘యుద్ధానికి సిద్ధపడండి.
    ఎందువల్లనంటే మీ చుట్టూవున్న ప్రజలు కత్తిచే చంపబడుతున్నారు.’
15 ఈజిప్టూ, నీ బలమైన యోధులెందుకు చంపబడతారు?
    వారు నిలువలేరు.
    ఎందువల్లనంటే యెహోవా వారిని నేలకు పడదోస్తాడు!
16 ఆ సైనికులు పదేపదే తూలిపోతారు.
    వారొకరి మీద మరొకరు పడతారు.
వారు, ‘లేవండి, మనం మన స్వంత ప్రజల వద్దకు వెళదాం.
    మనం మన మాతృభూమికి వెళ్లిపోదాము.
    మన శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు.
    మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి’ అని అంటారు.
17 వారి స్వస్థలాలో ఆ సైనికులు,
    ‘ఈజిప్టు రాజైన ఫరో కేవలం ఆడంబరమైన వాడు;
    అతని ప్రభావం అయిపోయింది, అని అనుకుంటారు.’”
18 ఈ వర్తమానం రాజునుండి వచ్చనది.
    సర్వశక్తిమంతుడైన యెహోవాయే ఆ రాజు.
“నిత్యుడనగు నా తోడుగా ప్రమాణము చేస్తున్నాను.
    ఒక మహాశక్తివంతుడైన నాయకుడు వస్తాడు.
తాబోరు కొండలా, సముద్రతీరానగల కర్మెలు పర్వతంలా అతడు గొప్పవాడై ఉంటాడు.
19 ఈజిప్టు ప్రజలారా, మీ వస్తువులు సర్దుకోండి.
బందీలై పోవటానికి సిద్ధమవండి.
    ఎందువల్లనంటే, నోపు (మెంఫిస్) నగరం శిథిలమై నిర్మానుష్యమవుతుంది.
నగరాలు నాశనమవుతాయి.
    వాటిలో ఎవరూ నివసించరు!

20 “ఈజిప్టు ఒక అందమైన ఆవులా ఉంది.
    కాని ఉత్తరాన్నుండి ఒక జోరీగ దాన్ని ముసరటానికి వస్తున్నది.
21 ఈజిప్టు సైన్యంలో కిరాయి సైనికులు కొవ్విన కోడెదూడల్లా ఉన్నారు.
అయినా వారంతా వెన్నుజూపి పారిపోతారు.
    శత్రు దాడికి వారు తట్టుకోలేరు.
వారి వినాశన కాలం సమీపిస్తూ ఉన్నది.
    వారు అనతి కాలంలోనే శిక్షింపబడుతారు.
22 బుసకొట్టుతూ పారిపోవటానికి ప్రయత్నించే
    పాములా ఈజిప్టు వుంది.
శత్రువు మిక్కిలి దరిజేరుతూ వున్నాడు.
    అందుచే ఈజిప్టు సైన్యం పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది.
గొడ్డళ్లు చేపట్టి శత్రవులు ఈజిప్టు మీదికి వస్తున్నారు.
    వారు చెట్లను నరికే మనుష్యుల్లా వున్నారు.”

23 యెహోవా ఈ విషయాలు చెప్పుచున్నాడు,
“ఈజిప్టు అరణ్యాన్ని (సైన్యం) శత్రువు నరికివేస్తాడు.
    అరణ్యంలో (సైన్యం) చెట్లు (సైనికులు) చాలా వున్నాయి. కాని
    అది నరికివేయబడుతుంది.
మిడుతలకంటె ఎక్కువగా శత్రు సైనికులున్నారు.
    లెక్కకు మించి శత్రు సైనికులున్నారు.
24 ఈజిప్టుకు తలవంపులవుతుంది.
    ఉత్తరాన్నుండి వచ్చే శత్రు సైన్యం వారిని ఓడిస్తుంది.”

25 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “అతి త్వరలో థేబెసు దేవతయైన ఆమోనును[b] నేను శిక్షింపనున్నాను. నేను ఫరోను, ఈజిప్టును మరియు దాని దేవతలను శిక్షిస్తాను. ఈజిప్టు రాజులను నేను శిక్షిస్తాను. ఫరో మీద ఆధారపడి, అతన్ని నమ్మిన ప్రజలను కూడా నేను శిక్షిస్తాను. 26 వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను.

“చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.

ఉత్తర ఇశ్రాయేలు రాజ్యానికి ఒక వర్తమానం

27 “నా సేవకుడవైన యాకోబూ,[c] భయపడవద్దు.
    ఇశ్రాయేలూ, బెదరవద్దు.
ఆ దూర ప్రాంతాలనుండి నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను.
    వారు బందీలుగా వున్న దేశాలనుండి మీ పిల్లల్ని కాపాడతాను.
యాకోబుకు మరల శాంతి, రక్షణ కల్పించబడతాయి.
    అతనిని ఎవ్వరూ భయపెట్టలేరు.”
28 యెహోవా ఇలా అంటున్నాడు,
“నా సేవకుడవైన యాకోబూ, భయపడకు.
    నేను నీతో వున్నాను.
నిన్ను అనేక ఇతర దేశాలకు నేను పంపియున్నాను.
    ఆ రాజ్యాలన్నిటినీ నేను సర్వనాశనం చేస్తాను.
    కాని నిన్ను నేను పూర్తిగా నాశనం కానీయను.
నీవు చేసిన నీచమైన కార్యాలకు నీవు తప్పక శిక్షింపబడాలి.
కావున నీవు శిక్ష తప్పించుకొనేలా నిన్ను వదలను.
నిన్ను క్రమశిక్షణలో పెడతాను. అయినా నీ పట్ల న్యాయపరమైన ఉదారంతో మాత్రమే ఉంటాను.”

కీర్తనలు. 22

సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.

22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
    నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
    సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
    కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.

దేవా, నీవు పవిత్రుడవు.
    నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
    అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
    వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కాని, నేను మనిషిని కానా, పురుగునా?
    మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
    నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
    ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
    నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”

దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
    నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
    నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.

11 కనుక దేవా, నన్ను విడువకు.
    కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
    వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
    (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
    వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.

14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
    నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
    నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
    నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
    “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.
16 “కుక్కలు” నా చుట్టూరా ఉన్నాయి.
    ఆ దుష్టుల దండు నన్ను చుట్టు ముట్టింది.
    సింహంలాగా వారు నా చేతుల్ని, నా పాదాలను గాయపర్చారు.
17 నేను నా ఎముకల్ని చూడగలను.
    ఆ ప్రజలు నా వైపు తేరి చూస్తున్నారు.
    వారు నన్ను అలా చూస్తూనే ఉంటారు!
18 ఆ ప్రజలు నా వస్త్రాలను వారిలో వారు పంచుకొంటున్నారు.
    నా అంగీ కోసం వారు చీట్లు వేస్తున్నారు.

19 యెహోవా, నన్ను విడువకుము!
    నీవే నా బలం. త్వరపడి నాకు సహాయం చేయుము!
20 యెహోవా, ఖడ్గం నుండి నా ప్రాణాన్ని రక్షించుము.
    ప్రశస్తమైన నా ప్రాణాన్ని ఆ కుక్కల నుండి రక్షించుము.
21 సింహం నోటినుండి నన్ను రక్షించుము.
    ఆబోతు కొమ్ములనుండి నన్ను కాపాడుము.

22 యెహోవా, నిన్ను గూర్చి నేను నా సోదరులతో చెబుతాను.
    ప్రజల మహా సమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను.
23 యెహోవాను ఆరాధించే ప్రజలారా! మీరంతా ఆయనను స్తుతించండి.
    ఇశ్రాయేలు వంశస్థులారా! యెహోవాను ఘనపర్చండి.
    ఇశ్రాయేలు వంశీయులారా! మీరంతా యెహోవాకు భయపడి, ఆయనను గౌరవించండి.
24 ఎందుకంటే కష్టాలలో ఉన్న పేద ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
    ఆ పేద ప్రజల విషయం యెహోవా సిగ్గుపడడు.
    యెహోవా వారిని ద్వేషించడు.
    ప్రజలు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నప్పుడు ఆయన వారికి కనబడకుండా ఉండడు. వారి మొరను వింటాడు.

25 యెహోవా, మహా సమాజంలో నా స్తుతి నిన్నుబట్టే వస్తుంది.
    నేను చేస్తానని వాగ్దానం చేసిన వాటన్నింటినీ, ఈ ఆరాధికులందరి ఎదుటనే నేను చేస్తాను.
26 పేద ప్రజలు తిని, తృప్తి పొందుతారు.
    యెహోవా కోసం చూస్తూ వచ్చే ప్రజలారా, మీరు ఆయనను స్తుతించండి.
    మీ హృదయాలు ఎప్పటికీ సంతోషంగా ఉండునుగాక!
27 దూరదేశాల్లోని ప్రజలంతా యెహోవాను జ్ఞాపకం చేసుకొని
    ఆయన వద్దకు తిరిగి వస్తారు.
28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే.
    ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు.
29 నిజంగా, భూమిలో నిద్రించబోయే వారందరూ ఆయన్ని ఆరాధిస్తారు.
    సమాధిలోనికి దిగిపోయేవారందరూ ఆయనకు తల వంచుతారు.
మరియు వారి ప్రాణాలను కాపాడుకొనలేనివారు కూడా తల వంచుతారు.
    చచ్చిన ప్రతి మనిషి ఆయనకు తల వంచాలి.
30 భవిష్యత్తులో మన వారసులు యెహోవాను సేవిస్తారు.
    యెహోవా విషయమై వారు నిత్యం చెప్పుతారు.
31 ఇంకా పుట్టని మనుష్యులకు దేవుని మంచితనం గూర్చి చెబుతారు.
    దేవుడు నిజంగా చేసిన మంచి కార్యాలను గూర్చి ఆ మనుష్యులు చెబుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International