M’Cheyne Bible Reading Plan
పవిత్ర పెట్టె మూలంగా ఫిలిష్తీయులకు కష్టకాలం
5 ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు. 2 దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను[a] దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు. 3 అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యెహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది.
అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు. 4 కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయి ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది. 5 అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు.
6 అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు. 7 అష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు.
8 అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.”
అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు.
9 అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు. 10 కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు.
కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు. 11 వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.”
ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది. 12 చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.
దేవుని పవిత్ర పెట్టె యధా స్థానానికి పంపబడుట
6 దేవుని పవిత్ర పెట్టెను ఏడునెలలు ఫిలిష్తీయులు తమ దేశమందు ఉంచుకున్నారు. 2 ఫిలిష్తీయులు వారి పూజారులను, మాంత్రికులను పిలిచి, “యెహోవా పవిత్ర పెట్టెను మేము ఏమి చేయాలి? ఈ పెట్టెను తిరిగి దాని స్థానానికి పంపాలంటే ఏమి చేయాలో మాకు చెప్పండి” అని అడిగారు.
3 “మీరు ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను తిరిగి పంపదలచుకుంటే ఊరక పంపవద్దు. ఆ దేవుడు మీ పాపాలను క్షమించే విధంగా తగిన కానుకలతో పంపాలి. అప్పుడు మీరు స్వస్థపరచబడి పవిత్రపరచబడతారు. దేవుడు మిమ్మల్ని క్షమించి, మిమ్మల్ని శిక్షించటం మానివేయాలంటే మీరు ఇలా చేయాలి” అని ఆ పూజారులు, మాంత్రికులు చెప్పారు.
4 “తమను క్షమించాలంటే ఇశ్రాయేలు దేవునికి ఏమి కానుకలు పంపాలని” ఫిలిష్తీయులు అడిగారు.
“ఫిలిష్తీ నాయకులు అయిదుగురు ఉన్నారు. (ఒక్కో పట్టణానికి ఒక్కో నాయకుడు.) మీ ప్రజలందరికీ, నాయకులకు ఒకటే సమస్య ఉంది. కనుక గడ్డల్లాంటి బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. మరియు ఎలుకల్లా కనబడే బంగారు ప్రతిరూపాలను మీరు చేయండి. 5 మరియు దేశాన్ని పాడుచేస్తోన్న ఎలుకల ప్రతిరూపాలు చేయండి. ఈ బంగారు ప్రతి రూపాలను ఇశ్రాయేలు దేవునికి వెలగా ఇవ్వండి. ఒకవేళ అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడు మిమ్మల్ని, మీ దేవుళ్లను, మీ దేశాన్ని శిక్షించటం మానివేస్తాడేమో. 6 ఈజిప్టు వాళ్లలా, ఫరోలా మొండిగా ఉండవద్దు. దేవుడు ఈజిప్టు వాళ్లను శిక్షించాడు. అందుకే ఈజిప్టువాళ్లు ఇశ్రాయేలువాళ్లను ఈజిప్టు విడిచి వెళ్లనిచ్చారు.
7 “మీరు ఒక కొత్త బండిని నిర్మించి, అప్పుడే ఈనిన రెండు ఆవులను తేవాలి. ఆ రెండు ఆవులను ఇదివరలో కాడికట్టి ఉండకూడదు. వాటిని ఆ బండికి కట్టండి. దూడలను ఇంటికి తీసుకుని వెళ్లి వాటిని గాటిలో ఉంచండి. వాటిని తల్లి ఆవుల వెనుక పోనీయవద్దు.[b] 8 యెహోవా పవిత్ర పెట్టెను ఆ బండి మీద ఉంచండి. బంగారు ప్రతిరూపాలను ఒక సంచిలో వేసి పెట్టె పక్కన పెట్టండి. అవి దేవుడు మీ పాపాలను క్షమించగలందులకు మీరిచ్చే కానుకలు. పిమ్మట బండిని మార్గాన వెళ్లనివ్వండి. 9 బండిని కనిపెట్టి వుండండి. బండి గనుక ఇశ్రాయేలులో బేత్షెమెషు దిశగా వెళితే యెహోవా నిజంగా మనకీ భయంకర రోగం కలుగజేసినట్లు అవుతుంది. ఒకవేళ ఆవులు బేత్షెమెషువైపు పోకపోతే, మనల్ని శిక్షించింది ఇశ్రాయేలు దేవుడు కాదని మనం గ్రహించవచ్చు. మన జబ్బు మనకు ఏదో అలా వచ్చేసింది అని మనం భావించాలి” అని అన్నారు యాజకులు, మాంత్రికులు.
10 యాజకులు, మాంత్రికులు చెప్పిన రీతిగా ఫిలిష్తీయులు అంతా చేశారు. దూడలున్న రెండు ఆవుల్ని తెచ్చి బండికి కట్టి, లేగదూడల్ని ఇంటివద్దనే వుంచారు. 11 ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను, మరియు బంగారు గడ్డలను ఎలుకల బంగారు ప్రతిరూపాలను ఆ బండిమీద పెట్టారు. 12 ఆవులు తిన్నగా బేత్షెమెషువైపు వెళ్లాయి, ఆవులు అదేపనిగా అరుస్తూ బాటమీదే సాగి పోయాయి. అవి కుడికిగాని, ఎడమకిగాని తిరగలేదు. బేత్షెమెషు పొలిమేరవరకు ఫిలిష్తీయుల పాలకులు ఆవులను అనుసరించి వెళ్లారు.
13 లోయలో బేత్షెమెషు ప్రజలు ఆ సమయంలో తమ గోధుమ పంట కోస్తున్నారు. వారు తలలు పైకెత్తి చూసినప్పుడు పవిత్ర పెట్టె కనబడింది. మరల పెట్టెను చూడగలిగినందుకు వారు ఎంతో ఆనందపడిరి. 14 బేత్షెమెషు వాడైన యెహోషువ పొలంలోకి వచ్చి ఒక పెద్ద బండ వద్ద బండి ఆగింది. బేత్షెమెషు ప్రజలు బండిని నరికివేశారు. ఆవులను చంపి యెహోవాకు బలి అర్పించారు.
15 లేవీయులు యెహోవా పవిత్ర పెట్టెను క్రిందికిదించారు. బంగారు ప్రతిరూపాలున్న సంచిని కూడ వారు దించారు. ఆ రెండింటినీ లేవీయులు ఆ పెద్ద బండమీద వుంచారు. ఆ రోజు బేత్షెమెషు ప్రజలు దహన బలులను సమర్పించారు.
16 బేత్షెమెషు ప్రజలు చేసిన ఈ సంగతులంతా ఫిలిష్తీయుల పాలకుల ఐదుగురు జాగ్రత్తగా తిలకించి ఎక్రోనునకు ఆ రోజే వెళ్లిపోయారు.
17 ఈ విధంగా వారికి లేచిన గడ్డల ప్రతిరూపాలను బంగారంతో చేయించి ఫిలిష్తీయులు తమ పాప పరిహారంగా యెహోవాకు కానుకలు పంపారు. అదేమాదిరి బంగారు బొమ్మలను ఒక్కొక్కటి చొప్పున ఫిలిష్తీయుల పట్టణాలయిన అష్డోదు, గాజా, అష్కెలోను, గాతు, ఎక్రోనులనుండి పంపారు. 18 ఫిలిష్తీయులు ఎలుకల బంగారు ప్రతిరూపాలను కూడ పంపారు. ఐదుగురు ఫిలిష్తీయుల పాలకుల అధీనంలో ఎన్ని పట్టణాలున్నాయో అన్ని బంగారు బొమ్మలను పంపారు ఈ ఫిలిష్తీయుల పట్టణాలలో చుట్టు ప్రాకారాలతో కట్టుదిట్టము చేయబడిన పట్టణాలు, వాటిక్రింద ఉన్న గ్రామాలు చేర్చబడ్డాయి.
ఏ బండ మీదయితే బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను ఉంచారో ఆ పెద్ద బండ బేత్షెమెషువాసి యెహోషువ పొలంలో ఈనాటికీ సాక్షిగావుంది. 19 కాని బేత్షెమెషు ప్రజలు యెహోవా పవిత్ర పెట్టెను చూసినప్పుడు అక్కడ యాజకులు లేరు. అందువల్ల దేవుడు బేత్షెమెషు వారిలో డెబ్బదిమందిని చంపాడు. అంత కఠినంగా తమను దేవుడు శిక్షించినందుకు బేత్షెమెషు వారు దుఃఖించారు. 20 “ఈ యెహోవా పవిత్ర దేవుని ముందర నిలబడగల యాజకుడు ఎక్కడ? ఇక్కడ నుండి ఈ పెట్టెను ఎక్కడికి తరలించాలి?” అని వారు యోచనచేశారు.
21 బేత్షెమెషు జనం కిర్యత్యారీము ప్రజలకు వర్తమానం పంపారు. “ఫిలిష్తీయులు యెహోవా పవిత్ర పెట్టెను తిరిగి తెచ్చారని, వచ్చి దానిని తమ నగరానికి తీసుకుని పోవలసినదని సందేశం పంపారు.”
దేవునితో స్నేహము
5 మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. 2 మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. 3 అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. 4 సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది. 5 దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు.
6 నిజానికి మనలో శక్తి లేని సమయాన భక్తిహీనులమైన మన కోసం క్రీస్తు మరణించాడు. 7 నీతిమంతుల కోసం మరణించటం చాలా అరుదు. మంచి స్నేహితుని కోసం ఒకడు ధైర్యం చేసి, మరణిస్తే మరణించవచ్చు. 8 కాని మనమింకా పాపంలో ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం మరణించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రేమను మనకోసం వ్యక్తం చేసాడు.
9 దేవుడు యేసు క్రీస్తు రక్తంద్వారా మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. కనుక మనము దేవుని ఆగ్రహం నుండి తప్పకుండా రక్షింపబడుతాము. ఇది యేసు క్రీస్తు ద్వారా సంభవిస్తుంది. 10 ఒకప్పుడు మనం దేవుని శత్రువులం. అయినా తన కుమారుని మరణంవల్ల మనకు ఆయనతో సమాధానం కలిగింది. కనుక క్రీస్తు జీవితం ద్వారా ఆయన మనల్ని తప్పకుండా రక్షిస్తాడు. 11 పైగా మన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో స్నేహం కలిగినందుకు మనం ఇప్పుడు ఆనందిస్తున్నాము.
ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం
12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. 13 ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. 14 అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యనివాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది.
ఆదాముకు, రానున్నవానికి కొంత పోలిక ఉంది. 15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి. 16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్థుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము. 17 ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపంవల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని” ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు సంభవిస్తుంది.
18 అందువల్ల ఒకడు చేసిన పాపంవల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటంవల్ల, అందరూ శిక్షను తప్పించుకొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్పడింది. 19 ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు. 20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది. 21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. మన యేసు క్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది.
43 వారి దేవుడైన యెహోవావద్ద నుండి వచ్చిన సందేశాన్ని యిర్మీయా అలా చెప్పి ముగించాడు. యెహోవా తనకు తెలియజేసిన రీతిగా యిర్మీయా ప్రజలందరికి పూర్తిగా చెప్పాడు.
2 కాని హోషేయా కుమారుడైన అజర్యా, కారేహ కుమారుడైన యోహానాను, ఇంకను మరికొంత మంది అహంభావంతో మొండివైఖరి దాల్చారు. వారు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. “యిర్మీయా నీవు అబద్ధమాడుతున్నావు! ‘ఓ ప్రజలారా, మీరు నివసించటానికి ఈజిప్టుకు వెళ్లరాదు’ అని మాకు చెప్పుమని మా ప్రభువైన దేవుడు నిన్ను పంపలేదు. 3 యిర్మీయా, నేరియా కుమారుడైన బారూకు నిన్ను మాకు వ్యతిరేకంగా పురికొల్పుచున్నాడని మేమనుకుంటున్నాము. నీవు మమ్మల్ని బబులోను వారికి అప్పగించాలని అతడు ఆశిస్తున్నాడు. నీవు ఇది చేస్తే, వారు మమ్మల్ని చంపాలని ఎదురు చూస్తున్నారు. లేదా, నీవిది చేస్తే వారు మమ్మల్ని బందీలుగా బబులోనుకు పట్టుకుపోవాలని కోరుకొని వుండవచ్చు” అని అన్నారు.
4 కావున యోహానాను, సైనికాధికారులు, ఇతర ప్రజలు ప్రభువాజ్ఞ తిరస్కరించారు. యెహోవా వారిని యూదాలో వుండమని ఆజ్ఞ ఇచ్చాడు. 5 కాని ప్రభువాజ్ఞ పాటించటానికి బదులు, యోహానాను మరియు సైనికాధికారులు యూదాలో మిగిలిన వారిని ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. గతంలో ఆ మిగిలిన వారిని శత్రువు ఇతర దేశాలకు తీసికొని వెళ్లాడు. కాని వారు మరల యూదా దేశానికి తిరిగి వచ్చారు. 6 ఇప్పుడు యోహానాను మరియు సైనికాధికారులు కలిసి పురుషులను, స్త్రీలను, పిల్లలను అందరినీ ఈజిప్టుకు తీసికొని వెళ్లారు. ఆ విధంగా తీసికొని వెళ్లబడిన వారిలో రాజు కుమార్తెలు కూడ వున్నారు. (నెబూజరదాను ఆ ప్రజలందరినీ గెదల్యా సంరక్షణలో వుంచాడు. నెబూజరదాను బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతి.) ప్రవక్తయైన యిర్మీయాను, నేరీయా కుమారుడగు బారూకును కూడ యోహానాను వెంట తీసికొని వెళ్లాడు. 7 వారు యెహోవా మాట పెడచెవినిబెట్టి ఈజిప్టుకు వెళ్లారు. వారు తహపనేసు[a] అనే పట్టణానికి వెళ్లారు.
8 తహపనేసు పట్టణంలో యెహోవా యొక్క ఈ వర్తమానం యిర్మీయాకు చేరింది: 9 “యిర్మీయా, కొన్ని పెద్ద రాళ్లను తీసికొనిరా, వాటిని తహపనేసులో ఫరో రాజు అధికార గృహానికి ఎదురుగా మట్టితోను, ఇటుకలతోను నిర్మించిన ప్రక్కబాట క్రింద పాతిపెట్టు. యూదా వారు చూస్తుండగా నీవీపని చేయ్యి. 10 అప్పుడు నిన్ను చూస్తూవున్న యూదా వారితో ఇలా చెప్పు, ‘ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు: బబులోను రాజైన నెబుకద్నెజరును ఇక్కడికి పిలుస్తాను. అతడు నా సేవకుడు. నేనిక్కడ పాతిపెట్టిన రాళ్లమీద నేనతని సింహాసనాన్ని నెలకొల్పుతాను. నెబుకద్నెజరు తన రత్నకంబళిని ఈ రాళ్లపై పరుస్తాడు. 11 నెబుకద్నెజరు ఇక్కడికి వచ్చిన ఈజిప్టును ఎదిరిస్తాడు. మరణించవలసిన వారికి అతడు మరణాన్ని తీసికొనివస్తాడు. బందీలుగా కొనిపోబడే వారికి దాస్యాన్ని తెస్తాడు. కత్తిచే హతము గావింపబడే వారి మీదికి ఖడ్గాన్ని తెస్తాడు 12 ఈజిప్టులోని బూటకపు దేవుళ్ల గుళ్లల్లో నెబుకద్నెజరు అగ్నిని రగుల్చుతాడు. అతడా గుళ్లను తగులబెట్టి, విగ్రహాలను తీసికొని పోతాడు. గొర్రెల కాపరి తమ బట్టలనుండి నల్లులను, ముండ్ల కాయలను ఏరివేయునట్లు నెబుకద్నెజరు ఈజిప్టును శుభ్రపర్చి వశం చేసికొంటాడు. ఆ తరువాత అతడు ఈజిప్టునుండి సురక్షితంగా వెళ్లిపోతాడు. 13 ఈజిప్టులో అతి ముఖ్యమైన సూర్య దేవాలయంలోని పవిత్ర రాతి స్తంభాలను నెబుకద్నెజరు నాశనం చేస్తాడు. పైగా ఈజిప్టులోని బూటకపు దేవతల ఆలయాలన్నిటినీ అతడు తగులబెడతాడు!’”
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
19 ఆకాశాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి.
యెహోవా చేతులు చేసిన మంచివాటిని అంతరిక్షం తెలియజేస్తుంది.
2 ప్రతి క్రొత్త రోజూ ఆ గాథను మరింత చెబుతుంది.
ప్రతి రాత్రి దేవుని గురించి మరింత ఎక్కువగా తెలియజేస్తుంది.
3 నిజానికి నీవు ఏ ఉపన్యాసం గాని మాటలుగాని వినలేవు.
మనం వినగలిగిన శబ్దం ఏదీ అవి చేయవు.
4 అయినా వాటి “స్వరం” ప్రపంచం అంతా ప్రసరిస్తుంది.
వాటి “మాటలు” భూమి చివరి వరకూ వెళ్తాయి.
అంతరిక్షం సూర్యునికి ఒక ఇల్లు లాంటిది.
5 తన పడక గది నుండి వచ్చే సంతోష భరితుడైన పెండ్లి కుమారునిలా సూర్యుడు బయటకు వస్తాడు.
పందెంలో పరుగెత్తడానికి ఆత్రంగా ఉన్న ఆటగానిలా సూర్యుడు
ఆకాశంలో తన దారిని మొదలు పెడతాడు.
6 సూర్యుడు అంతరిక్షంలోని ఒక దిశలో మొదలు పెడ్తాడు,
మరియు ఆవలి దిశకు అది పరుగెడుతుంది.
దాని వేడి నుండి ఏదీ దాక్కొలేదు. యెహోవా ఉపదేశాలు అలా ఉన్నాయి.
7 యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం.
అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి.
యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది.
జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది.
8 యెహోవా చట్టాలు సరియైనవి.
అవి మనుష్యులను సంతోషపెడ్తాయి.
యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి.
ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి.
9 యెహోవాను ఆరాధించుట మంచిది.
అది నిరంతరము నిలుస్తుంది.
యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి.
అవి సంపూర్ణంగా సరియైనవి.
10 శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి.
సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి.
11 యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి.
నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
12 యెహోవా, ఏ వ్యక్తీ, తన స్వంత తప్పులన్నింటినీ చూడలేడు.
కనుక నేను రహస్య పాపాలు చేయకుండా చూడుము.
13 యెహోవా, నేను చేయాలనుకొనే పాపాలు చేయకుండా నన్ను ఆపుచేయుము.
ఆ పాపాలు నా మీద అధికారం చెలాయించ నీయకుము.
నీవు నాకు సహాయం చేస్తే, అప్పుడు నేను గొప్ప పాపము నుండి, పవిత్రంగా దూరంగా ఉండగలను.
14 నా మాటలు, తలంపులు నిన్ను సంతోషపెడ్తాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా, నీవే నా ఆశ్రయ దుర్గం. నీవే నన్ను రక్షించేవాడవు.
© 1997 Bible League International