Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 3

దేవుడు సమూయేలును పిలుచుట

ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.

ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె[a] కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది. యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు.

“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.

సమూయేలు పోయి పడుకున్నాడు. దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు.

“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.

సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు.[b]

మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు.

యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది. ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు.

తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు. 10 యెహోవా వచ్చి అక్కడ నిలిచాడు. “సమూయేలూ!, సమూయేలూ” అంటూ మునుపటిలా పిలిచాడు.

“చెప్పండి, నేను మీ దాసుడను. నేను వింటున్నాను” అన్నాడు సమూయేలు.

11 యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు.[c] 12 నేను ఏలీకి, అతని కుటుంబానికి ఏది చేస్తానని చెప్పివున్నానో అదంతా అప్పుడు చేస్తాను. మొదటినుంచి చివరి వరకు అంతా చేసి తీరుతాను. 13 తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు. 14 అందువల్ల ఏలీ వంశం ఎన్ని బలులు, ధాన్యార్పణలు సమర్పించినా వారి పాపాన్ని మాపుకో లేరని నిశ్చితంగా చెప్పి ఉన్నాను.”

15 తెల్లవారేవరకూ సమూయేలు పక్కమీదే ఉన్నాడు. ఆ తరువాత లేచి దేవాలయ ద్వారం తెరిచాడు. దర్శనం గూర్చి ఏలీతో చెప్పటానికి సమూయేలు భయపడ్డాడు

16 కాని ఏలీ, “కుమారుడా సమూయేలూ” అని పిలిచాడు.

“ఇక్కడే ఉన్నానయ్యా” అన్నాడు సమూయేలు.

17 “యెహోవా నీతో ఏమన్నాడు? నాతో ఏమీ దాచవద్దు. ఆయన నీకు చెప్పిన సమాచారంలో నీవు ఏమి దాచినా దేవుడు నిన్ను బాగా శిక్షిస్తాడు” అని అన్నాడు.

18 దానితో సమూయేలు ఉన్నది వున్నట్లు ఏలీకి ఏమీ దాచకుండా చెప్పాడు.

అది విన్న ఏలీ, “ఆయన యెహోవా. ఆయనకు ఏది మంచిదనిపిస్తే అది చేయనీ” అన్నాడు.

19 సమూయేలు పెరుగుతూ వుండగా యెహోవా అతనికి తోడై ఉండెను. యెహోవా సమూయేలుతో చెప్పిన వర్తమానాలను ఎన్నడూ అబద్ధం కానీయలేదు. 20 అందువల్ల దానునుండి, బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు దేశమంతా సమూయేలును యెహోవా యొక్క నిజమైన ప్రవక్తగా గుర్తించింది. 21 షిలోహులో యెహోవా సమూయేలుకు దర్శనమిస్తూ వచ్చాడు. మాటలోనే సమూయేలుకు యెహోవా ప్రత్యక్షమయ్యేవాడు.

రోమీయులకు 3

సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:

“నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువౌతుంది.
    నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!”(A)

మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు?

“నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది.

నీతిమంతుడొక్కడూ లేడు

మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. 10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:

“నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!
11     అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు.
దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
    అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు.
మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”(B)

13 “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి.
    వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.”(C)

“వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”(D)

14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”(E)

15 “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.
16     వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.
17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”(F)

18 “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”(G)

19 ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 20 ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.

విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావటం

21 కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. 22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. 23 అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు[a] పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. 24 కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. 25 దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. 26 అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.

27 మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు. 28 మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కానివాళ్ళకు కూడా దేవుడే. 30 దేవుడు సున్నతి పొందినవాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందనివాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. 31 మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.

యిర్మీయా 41

41 ఎలీషామా మనుమడు, నెతన్యా కుమారుడు అగు ఇష్మాయేలు ఏడవ మాసంలో అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వచ్చాడు. అతనితో తమ మనుష్యులు పదిమంది ఉన్నారు. వారు మిస్పా పట్టణానికి వచ్చారు. ఇష్మాయేలు రాజ కుటుంబంలో ఒక సభ్యుడు. యూదా రాజు అధికారులలో ఒకడు. ఇష్మాయేలు, అతని మనుష్యులు గెదల్యాతో కలిసి భోజనం చేశారు. వారంతా కలిసి భోజనం చేస్తూవుండగా, ఇష్మాయేలు మరియు అతని పదిమంది మనుష్యులు లేచి అహీకాము కుమారుడైన గెదల్యాను కత్తితో పొడిచి చంపారు. గెదల్యా యూదా పాలకుడుగా బబులోను రాజుచే ఎంపిక చేయబడిన వ్యక్తి. మిస్పా పట్టణంలో గెదల్యాతో ఉన్న యూదా ప్రజలందరిని కూడ ఇష్మాయేలు చంపివేశాడు. అంతేగాదు. గెదల్యాతో వున్న కల్దీయుల సైనికులను కూడ ఇష్మాయేలు చంపివేశాడు.

4-5 గెదల్యా హత్య గావింపబడిన మరుసటి రోజు ఎనభై మంది మనుష్యులు మిస్పాకు వచ్చారు. వారు ధాన్యపు నైవేద్యాలు, ధూపానికి సాంబ్రాణిని దేవాలయానికి తీసికొని వస్తున్నారు. ఆ ఎనభై మంది వ్యక్తులూ వారి గడ్డాలు గీయించుకొని తమ బట్టలు చింపుకొని, తమ శరీరాలను చీరుకొన్నారు[a] వారు షెకెము, షిలోహు, షోమ్రోనుల నుండి వచ్చారు. వారిలో ఏ ఒక్కరికి గెదల్యా హత్య గావింపబడినట్లు తెలియదు. ఆ ఎనభై మందిని కలవటానికి ఇష్మాయేలు మిస్పా పట్టణం నుండి వారికి ఎదురేగాడు. అతడు వారిని కలవటానికి వెళుతూ రోదించాడు.[b] ఇష్మాయేలు ఆ ఎనభై మంది మనుష్యులనూ కలిసి కొని, “నాతో రండి. మనం అహీకాము కుమారుడైన గెదల్యాను కలుద్దాము” అని చెప్పాడు. ఆ ఎనభై మంది మిస్పా పట్టణంలోకి వెళ్లారు. అప్పుడు ఇష్మాయేలు, అతని మనుష్యులు కలిసి ఆ వచ్చిన వారిలో డెబ్బయి మందిని చంపివేశారు. వారా శవాలను నీళ్లను నిల్వచేయటానికి నిర్మించిన నూయి వంటి గోతిలో పడవేశారు. కాని మిగిలిన పదిమంది ఇష్మాయేలుతో, “మమ్మల్ని చంపవద్దు! మావద్ద గోధుమ, యవల ధాన్యాలు ఉన్నాయి. మావద్ద తైలము, తేనె కూడ ఉన్నాయి. వాటిని మేమొక పొలంలో దాచాము (వాటిని మీకు ఇస్తాము)” అని చెప్పారు. అందువల్ల ఇష్మాయేలు ఆ పది మందినీ వదిలి పెట్టాడు. ఇతరులతో పాటు అతడు వారిని చంపలేదు. (ఈ నీటి గొయ్యి చాలా పెద్దది. ఆసా అనే యూదా రాజుచే అది నిర్మించబడింది. యుద్ధ కాలంలో నీటిని నిలువచేయటానికి రాజైన ఆసా[c] దానిని నిర్మింప చేశాడు. ఇశ్రాయేలు రాజైన బయషా నుండి తన పట్టణాన్ని రక్షించుకోవటానికి ఆసా ఇలా చేశాడు. అయితే ఇష్మాయేలు మాత్రం ఆ గొయ్యి నిండేవరకు దానిలో శవాలను పడవేశాడు.)

10 మిస్పా పట్టణంలో ఉన్న ఇతర ప్రజలందరినీ ఇష్మాయేలు పట్టుకున్నాడు. అలా పట్టుకున్న వారిలో రాజు కుమార్తెలు మరియు అక్కడ మిగిలియున్న ఇతర ప్రజలు వున్నారు. ఎవరినైతే నెబూజరదాను పాలించమని గెదల్యాను నియమించాడో, వారే ఆ ప్రజలు. నెబూజరదాను బబులోను రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి. ఇష్మాయేలు తాను పట్టుకున్న ప్రజలను తీసికొని అమ్మోను దేశానికి పోవటానికి బయలు దేరాడు.

11 కారేహ కుమారుడైన యెహానాను మరియు అతనితో ఉన్న సైన్యాధికారులు ఇష్మాయేలు చేసిన క్రూరమైన పనులన్నిటి గురించి విన్నారు. 12 కావున యోహానాను, అతనితో వున్న సైన్యాధికారులు తమ సైనికులను వెంట తీసికొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎదుర్కోవటానికి వెళ్లారు. గిబియోను వద్ద గల పెద్ద చెరువు దగ్గర వారు ఇష్మాయేలును పట్టుకున్నారు. 13 ఇష్మాయేలును బందీలుగా పట్టుకు పోతున్న యోహానానును, సైన్యాధికారులను చూచి జనులు చాలా సంతోషించారు. 14 అప్పుడు మిస్పా పట్టణంలో ఇష్మాయేలు బందీలుగా తీసికొన్న వారంతా కారేహ కుమారుడైన యోహానాను వద్దకు పరుగెత్తారు. 15 కాని ఇష్మాయేలు మరియు అతనితో ఉన్న వారిలో ఎనిమిది మంది యోహోనాను నుండి తప్పించుకున్నారు. వారు అమ్మోనీయుల వద్దకు పారిపోయారు.

16 ఆ విధంగా కారేహ కుమారుడైన యోహానాను, సైనికాధికారులు బందీలను రక్షించారు. ఇష్మాయేలు గెదల్యాను హత్య చేసి ఆ ప్రజలను మిస్పా పట్టణంలో పట్టుకున్నాడు. బ్రతికి బయటపడిన వారిలో సైనికులు, స్త్రీలు, పిల్లలు మరియు న్యాయాధికారులు వున్నారు, యెహానాను వారిని గిబియోను పట్టణం నుండి తిరిగి తీసికొని వచ్చాడు.

ఈజిప్టుకు తప్పించుకొనుట

17-18 యోహానాను, ఇతర సైనికాధికారులు కల్దీయుల విషయంలో భయపడ్డారు. బబులోను రాజు గెదల్యాను యూదా రాజ్యానికి పాలకునిగా ఎంపిక చేశాడు. కాని ఇష్మాయేలు గెదల్యాను హత్య చేశాడు. దానితో కల్దీయులకు కోపం వస్తుందేమోనని యోహానాను భయపడ్డాడు. కావున వారు ఈజిప్టుకు పారిపోవాలని నిశ్చయించుకొన్నారు. ఈజిప్టుకు పోతూ మార్గం మధ్యలో వారు గెరూతు కింహాము వద్ద ఆగారు. గెరూతు కింహాము బేత్లెహేము పట్టణం దగ్గర ఉన్నది.

కీర్తనలు. 17

దావీదు ప్రార్థన.

17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
    నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
    నీవు సత్యాన్ని చూడగలవు.
నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
    దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
    నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
    నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
నేను నీ మార్గాలు అనుసరించాను.
    నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
    కనుక ఇప్పుడు నా మాట వినుము.
ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
    నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
    నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
    మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
    ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
    వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.

13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
    నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14     యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
    ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.

15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
    మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International