Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 2

హన్నా కృతజ్ఞతలు

హన్నా దేవుని ఇలా కీర్తించెను:

“నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది.
    నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను.
నా శత్రువులను నేను పరిహసించగలను.
    నా విజయానికి మురిసిపోతున్నాను.
యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు.
    నీవు తప్ప మరో దేవుడు లేడు!
    మన దేవుని వంటి బండ[a] మరొకడు లేడు.
ఇక డంబాలు పలుకవద్దు!
గర్వపు మాటలు కట్టి పెట్టండి!
    ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు,
వారికి తీర్పు తీరుస్తాడు.
మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి!
    బలహీనులు బలవంతులవుతారు!
ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు
    భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు
కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి
    ఇప్పుడు సమృద్ధిగా భోజనం!
గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు!
    సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
యెహోవా జనన మరణ కారకుడు!
దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు.
    ఆయన వారిని మరల బ్రతికించగలడు.
యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
    మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు.
పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు.
    యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు.
యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు.
    యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు.
పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే!
    యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు.
    వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు.
కాని దుష్టులు నాశనం చేయబడతారు.
    వారు అంధకారంలో పడిపోతారు.
వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.
10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు.
    సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు.
సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు!
    యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు.
    ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”

11 తరువాత ఎల్కానా తన కుటుంబంతో కలిసి రామాలో తన ఇంటికి వెళ్లిపోయాడు. బాలుడు మాత్రం యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో షిలోహులో యెహోవా సేవలో వుండిపోయాడు.

ఏలీ దుష్ట సంతానం-హొఫ్నీ, ఫీనెహాసు

12 ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యెహోవాను లక్ష్యపెట్టలేదు. 13 యాజకులు ప్రజల పట్ల ఎలా ప్రవర్తించాలో వారు చింత చేయలేదు. ప్రజలు వచ్చినప్పుడు యాజకులు ఇలా చేయాలి. ఒక వ్యక్తి బలి ఇచ్చిన ప్రతిసారీ ఆ మాంసాన్ని యాజకుడు ఒక కుండలో ఉడకబెట్టాలి. అప్పుడు యాజకుని సేవకుడు మూడు మొనలు గల ఒక కొంకి గరిటెతో రావాలి. 14 యాజకుని సేవకుడు గరిటెను ఉడుకుతోన్న బాణలిలో గుచ్చి తీయాలి. అప్పుడా గరిటె కొనలకు పట్టుకొని ఎంత మాంసం వస్తుందో అది మాత్రం యాజకునికి చెందుతుంది. బలులు ఇవ్వటానికి షిలోహుకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలకు యాజకులు చేయవలసిన విధి ఇదే. 15 కాని ఏలీ కుమారులు ఆ పద్ధతిని పాటించలేదు. కొవ్వును బలిపీఠం మీద దహించక మునుపే వారి సేవకులు బలులు ఇచ్చేవారి వద్దకు వెళ్లి “యాజకుని వంటకానికై కొంత మాంసం ఇవ్వమనీ, ఉడుకబెట్టిన మాంసం మీనుండి ఆయన తీసుకోడని అనేవారు.”

16 అయితే బలి ఇచ్చే వ్యక్తి గనుక కొవ్వును యధావిధిగా, “ముందు దహించిన తరువాత మీ ఇష్టం వచ్చినంత తీసుకోమని” అంటే యాజకుని సేవకుడు ఒప్పుకొనేవాడు కాదు. “అలా కాదు, ముందుగా మాంసం ఇవ్వండి. మీరు నాకు ఇవ్వక పోతే, బలవంతాన తీసుకోవలసి వస్తుంది!” అని బదులు చెప్పేవాడు.

17 ఈ విధంగా, యెహోవాకు అర్పించబడిన అర్పణలను వారు లక్ష్యపెట్టలేదని హొఫ్నీ, ఫీనెహాసులు వ్యక్తం చేసారు. ఇది చాలా చెడ్డపాపం.

18 కానీ సమూయేలు యెహోవాను సేవించాడు. సమూయేలు ఏఫోదు[b] ధరించిన ఒక బాల సహాయకుడు. 19 ప్రతి సంవత్సరం సమూయేలు తల్లి అతనికై ఒక చిన్న అంగీ తయారుచేసి, తన భర్తతో షిలోహుకు బలి అర్పించేందుకు వెళ్లినపుడు ఆ అంగీని సమూయేలు కొరకు తీసుకొని వెళ్లేది.

20 ఎల్కానాను, అతని భార్యను ఏలీ ఆశీర్వదించేవాడు: “హన్నా ప్రార్థన ఫలితంగా పుట్టిన వానిని మరల యెహోవా సేవకై ఇచ్చారు గనుక అతని స్థానాన్ని భర్తీ చేసే విధంగా హన్నాద్వారా యెహోవా మీకు పిల్లలను కలుగజేయుగాక.”

తర్వాత ఎల్కానా, హన్నా ఇంటికి వెళ్లిపోయారు. 21 దేవుని అనుగ్రహం వల్ల హన్నాకు క్రమేపీ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. బాలకుడైన సమూయేలు యెహోవా ఆలయములో దినదినము మంచి స్థితికి ఎదుగు చుండెను.

కుమారుల విషయంలో ఏలీ అసమర్థత

22 ఏలీ చాలా వృద్ధుడై పోయాడు. షిలోహుకు వచ్చే ఇశ్రాయేలీయులందరి యెడల తన కుమారులు చేస్తున్న పనులను గూర్చి అతడు నిరంతరం వింటూనే వున్నాడు. పైగా సన్నిధి గుడారపు ద్వారం వద్ద పరిచర్యలు చేసే స్త్రీలతో తన కుమారులు శయనిస్తున్నారని కూడా ఏలీ విన్నాడు.

23 ఏలీ తన కుమారులతో, “మీరు చేసిన చెడ్డ కార్యాలను గూర్చి ఇక్కడ ప్రజలు నాతో చెప్పారు. మీరెందుకు ఈ చెడ్డపనులు చేస్తున్నారు? 24 నా కుమారులారా, ఈ చెడ్డపనులు చేయకండి. యెహోవా ప్రజలు మీ గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. 25 ఒక వ్యక్తి మరో వ్యక్తి పట్ల అపచారం చేస్తే, దేవుడు ఒక వేళ అతనికి సహాయం చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి యెహోవా పట్ల అపచారం చేస్తే ఇక వానికి దిక్కెవరు?” అని అడిగాడు.

అయినా ఏలీ కుమారులు తండ్రి సలహాను లెక్కచేయలేదు; కాబట్టి యెహోవా ఏలీ కుమారులను చంపటానికి నిర్ణయించాడు.

26 బాలుడైన సమూయేలు మాత్రం దేవుని దయయందును, మనుష్యుల దయయందును పెరుగుతూ వచ్చాడు.

ఏలీ కుటుంబ విషయంలో భయంకర ప్రవచనం

27 దేవుని మనిషి[c]– ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు వారికి నేను ప్రత్యక్షమయ్యాను. 28 ఇశ్రాయేలులో వున్న నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు ధరించేలా కోరుకున్నాను. నీ తండ్రి కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలి మాంసాన్ని తీసుకునేలాగున చేశాను. 29 అయితే నీవు బలులను, కానుకలను ఎందువలన గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన మాంసాన్ని అర్పణలలో మంచి వాటిని సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.”

30 ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీ కుటుంబీకులు, నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే విధంగా అనుగ్రహించాడు. కాని యెహోవా ఇప్పుడిలా సెలవిస్తున్నాడు: ‘అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి. 31 మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయమాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ ఉండడు. 32 ఇశ్రాయేలు ప్రజలకు మంచి జరుగుతూ ఉండగా, నీ ఇంటి వద్ద మాత్రం కీడు జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో మాత్రం ముసలి వాడొకడును ఉండడు. 33 ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా కత్తివేటుకు బలైపోతారు. 34 నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్లుగా నీకు ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన హొఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు. 35 నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు. 36 నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని ఎదుట వంగి కొంచెం రొట్టె కోసం లేక కొద్దిగా డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం ఇప్పించమని అడుగుతారు.”’”

రోమీయులకు 2

దేవుని తీర్పు

ఇతర్లపై తీర్పు చెప్పే నీవు, ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఎందుకంటే ఏవిషయాల్లో నీవు ఇతర్లపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవుకూడా చేస్తున్నావు. అందువల్ల నీకు నీవే శిక్ష విధించుకుంటున్నావు. దేవుడు అలాంటి దుర్మార్గపు పనులు చేస్తున్నవాళ్ళకు సత్యం ఆధారం మీద న్యాయమైన శిక్ష విధిస్తాడని మనకు తెలుసు. మిత్రమా! ఏ కారణాలవల్ల నీవు వాళ్ళపై తీర్పు చెపుతున్నావో అవే పనులు నీవు కూడా చేస్తున్నావు. మరి అలాంటప్పుడు దేవుని శిక్షను తప్పించుకోగలనని ఎలా అనుకుంటున్నావు? లేక, నీవు దేవుని అనంతమైన దయను, క్షమను, సహనాన్ని ద్వేషిస్తున్నావా? నీవు మారుమనస్సు పొందాలని దేవుడు నీపై దయచూపాడు. ఈ విషయం నీకు తెలియదా?

కాని, నీది కఠిన హృదయం. అది పశ్చాత్తాపం పొందదు. కనుక దేవుడు ఆగ్రహం చూపే రోజున నీకు లభింపనున్న శిక్షను స్వయంగా ఎక్కువ చేసుకొంటున్నావు. ఆరోజు న్యాయమైన తీర్పు నీకు వ్యక్తమౌతుంది. ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు.(A) కొందరు ఎప్పుడూ మంచిపనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తేజస్సును, గౌరవాన్ని, నశించని దేహాన్ని పొందాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకే దేవుడు అనంత జీవాన్నిస్తాడు. మరికొందరు సత్యాన్ని తృణీకరించి, చెడును అనుసరిస్తూ స్వార్థంతో జీవిస్తూ ఉంటారు. దేవుడు అలాంటివాళ్ళపై తన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపుతాడు. చెడును చేసిన ప్రతి మనిషికి కష్టాలు, దుఃఖాలు సంభవిస్తాయి. అవి యూదులకు, తర్వాత ఇతరులకు కూడా సంభవిస్తాయి. 10 మంచి చేసిన ప్రతి ఒక్కనికి తేజస్సు, గౌరవము, శాంతి లభిస్తాయి. అవి మొదట యూదులకు తర్వాత ఇతరులకు కూడా లభిస్తాయి. 11 దేవుడు పక్షపాతం చూపడు.

12 ధర్మశాస్త్రము లేని పాపులు ధర్మశాస్త్రము లేకుండానే నశించిపోతారు. అలాగే ధర్మశాస్త్రం ఉండి కూడా పాపం చేసినవాళ్ళపై దేవుడు ధర్మ శాస్త్రానుసారం తీర్పు చెపుతాడు. 13 ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని విన్నంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులు కాలేరు. కాని ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని విధేయతతో ఆచరించేవాళ్ళను దేవుడు నీతిమంతులుగా పరిగణిస్తాడు.

14 యూదులుకానివాళ్ళకు ధర్మశాస్త్రం లేదు. కాని వాళ్ళు సహజంగా ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకొంటే వాళ్ళకు ధర్మశాస్త్రం లేకపోయినా, వాళ్ళు నడుచుకునే పద్ధతే ఒక ధర్మశాస్త్రం అవుతుంది. 15 వాళ్ళ ప్రవర్తన ధర్మశాస్త్ర నియమాలు వాళ్ళ హృదయాలపై వ్రాయబడినట్లు చూపిస్తుంది. ఇది నిజమని వాళ్ళ అంతరాత్మలు కూడా చెపుతున్నాయి. వాళ్ళు కొన్నిసార్లు సమర్థించుకొంటూ, మరి కొన్నిసార్లు నిందించుకొంటూ, తమలోతాము వాదించుకుంటూ ఉంటారు.

16 ఆ రోజు దేవుడు మానవుల రహస్య ఆలోచనలపై యేసు క్రీస్తు ద్వారా తీర్పు చెపుతాడు. నేను ప్రజలకు అందించే సువార్త ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రము

17 నీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. 18 నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గుర్తించ గలుగుతున్నావు. 19 అంధులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్ళకు వెలుగువంటివాడవని నీవనుకొంటున్నావు. 20 మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు. 21 ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? 22 వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? 23 ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? 24 ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకానివాళ్ళ మధ్య దూషింపబడింది”(B) అని వ్రాయబడి ఉంది.

25 ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి[a] విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు. 26 కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా? 27 యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు.

28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. 29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.

యిర్మీయా 40

యిర్మీయా విడుదల

40 యిర్మీయా రామా నగరంలో విడుదలైన పిమ్మట యోహోవా వాక్కు అతనికి వినిపించింది. బబులోను రాజు ప్రత్యేక అంగరక్షక దళాధిపతియైన నెబూజరదాను యిర్మీయాను రామా నగరంలో ఉన్నట్లు కనుగొన్నాడు. యిర్మీయా గొలుసులతో బంధింపబడ్డాడు. యెరూషలేము నుండి యూదా నుండి తేబడిన బందీలందరితో పాటు యిర్మీయా కూడా ఉన్నాడు. ఆ ప్రజలంతా బంధీలుగా బబులోనుకు తీసికొని పోబడుతున్నారు. దళాధిపతి నెబూజరదాను యిర్మీయాను చూచినప్పుడు అతనితో మాట్లాడి ఇలా అన్నాడు: “యిర్మీయా, నీ దేవుడైన యెహోవా ఈ విపత్తు ఈ ప్రదేశానికి వస్తుందని చెప్పియున్నాడు. యెహోవా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అంతా జరిగేలా చేశాడు. మీ యూదా ప్రజలంతా యెహోవాపట్ల పాపం చేశారు. కావున మీకు ఈ ఆపద సంభవించింది. మీ ప్రజలు దేవునికి విధేయులుగా లేరు. కాని యిర్మీయా, నిన్ను నేనిప్పుడు విడుదల చేస్తాను. నీ మణికట్టుల నుండి సంకెళ్లను తీసివేస్తున్నాను. నీవు రాదలచుకొంటే నాతో బబులోనుకు రా. వస్తే నీ యోగక్షేమాల విషయంలో నేను తగిన శ్రద్ధ తీసికొంటాను. నీకు నాతో రావటానికి ఇష్టం లేకపోతే రావద్దు. చూడు; దేశమంతా నీకు బాహాటంగా తెరచబడి ఉంది. నీ ఇష్టము వచ్చిన చోటికి వెళ్లు. లేక షాఫాను పుత్రుడైన ఆహీకాము కుమారుడు గెదల్యావద్దకు తిరిగి వెళ్లు.[a] యూదా పట్టణాల పరిపాలనా నిర్వహణకై బబులోను రాజు గెదల్యాను పాలకునిగా ఎంపిక చేశాడు. నీవు వెళ్లి గెదల్యాతో కలిసి ప్రజల మధ్య నివసించు. లేదా నీ ఇష్టమొచ్చిన మరెక్కడికైనా సరే వెళ్లు.”

పిమ్మట నెబూజరదాను యిర్మీయాకు కొంత ఆహారాన్ని, ఒక కానుకను ఇచ్చి అతనిని పంపివేశాడు. కావున యిర్మీయా మిస్పా వద్ద వున్న అహీకాము కుమారుడైన గెదల్యా వద్దకు వెళ్లాడు. యిర్మీయా గెదల్యాతో కలిసి యూదా రాజ్యంలో మిగిలి ఉన్న ప్రజల మధ్య నివసించాడు.

గెదల్యా యొక్క స్వల్పకాలిక పాలన

యెరూషలేము నాశనం చేయబడినప్పుడు యూదా రాజ్య సైన్యంలోని కొంతమంది, సైనికులు అధికారులు, తదితర మనుష్యులు బయట ప్రాంతంలో వుండిపోయారు. రాజ్యంలో మిగిలిన ప్రజలను పాలించటానికి అహీకాము కుమారుడైన గెదల్యాను బబులోను రాజు నియమించినట్లు ఆ సైనికులు విన్నారు. యూదా రాజ్యంలో మిగిలిన ప్రజలలో మిక్కిలి పేదవారు, బబులోనుకు బందీలుగా తీసికొనిపోవటానికి అనువుగాని స్త్రీ పురుషులు, పిల్లలు వున్నారు. కావున ఆ సైనికులు మిస్పావద్ద గెదల్యాను కలవటానికి వచ్చారు. ఆ వచ్చిన సైనికులలో నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు, కారేహ కుమారులైన యోహోనాను మరియు యోనాతాను, తన్హుమెతు కుమారుడైన శెరాయా, నెటోపాతీయుడైన ఏపయి యొక్క కుమారుడు, మాయకాతీయుని కుమారుడైన యెజన్యా, వారితో ఉన్న మనుష్యులు ఉన్నారు.

షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యా ఆ సైనికులకు, వారితో ఉన్న మనుష్యులకు భద్రత కల్పించటానికి ఒక ప్రమాణం చేశాడు. గెదల్యా ఇలా అన్నాడు: “సైనికులారా, కల్దీయులకు సేవ చేయటానికి మీరు భయపడకండి. రాజ్యంలో స్థిరపడి బబులోను రాజుకు సేవ చేయండి. మీరిది చేస్తే, మీకు అంతా సవ్యంగా జరిగిపోతుంది. 10 నేను కూడా మిస్పాలోనే నివసిస్తాను. కల్దీయులు ఇక్కడికి వచ్చినప్పుడు మీ తరపున నేను వారితో మాట్లాడతాను. మీరు ఆ పనిని నాకు వదలండి. వేసవి ద్రాక్షపంట నుండి రసం తీయాలి. నూనె కూడ తీయాలి. మీరు తయారు చేసినవన్నీ జాడీలలో నిలువ చేయండి. మీరు ఆక్రమించుకున్న పట్టణాలలో నివసించండి.”

11 మోయాబు, అమ్మోను, ఎదోము, ఇంకను ఇతర దేశాలలో వున్న యూదా ప్రజలంతా బబులోను రాజు యూదా రాజ్యంలో కొంతమందిని వదిలి వెళ్లినట్లువిన్నారు. షాఫాను మనుమడు, అహీకాము కుమారుడు అయిన గెదల్యాను బబులోను రాజు వారిపై పాలకునిగా నియమించినట్లు కూడ విన్నారు. 12 ఆ యూదా ప్రజలు ఈ వార్త విన్న తరువాత యూదా రాజ్యానికి తిరిగి వచ్చారు. చిందరవందరగా వివిధ దేశాల్లో ఉన్న యూదా వారంతా మిస్పాకు తిరిగి వచ్చి గెదల్యాను ఆశ్రయించారు. తిరిగి వచ్చి, వారు చాల ద్రాక్షరసాన్ని తీసి, వేసవి పండ్లను సేకరించారు.

13 బయట పల్లెల్లో ఉన్న కారేహ కుమారుడైన యోహానాను, ఇతర యూదా సైన్యాధికారులు గెదల్యా యొద్దకు వచ్చారు. గెదల్యా మిస్పా పట్టణంలో ఉన్నాడు. 14 యోహానాను, మరియు అతనితో ఉన్న అధికారులు గెదల్యాతో, “అమ్మోనీయుల రాజైన బయలీను నిన్ను చంపజూస్తున్నాడు. అది నీకు తెలుసా? నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నిన్ను చంపటానికి పంపాడు” అని అన్నారు. కాని అహీకాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.

15 పిమ్మట కారేహ కుమారుడైన యోహానాను మిస్పాలో గెదల్యాతో ఏకాంతంగా మాట్లాడాడు. గెదల్యాతో యోహానాను ఇలా అన్నాడు: “నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును నన్ను వెళ్లి చంపనిమ్ము. దానిని గురించి ఎవ్వరికీ తెలియకుండా నేను చేస్తాను. ఇష్మాయేలు నిన్ను చంపకుండా మేము చూస్తాము. అతడు నిన్ను చంపితే నిన్నాశ్రయించి వచ్చిన యూదా ప్రజలంతా మళ్లీ వివిధ దేశాలకు చెల్లాచెదురై పోతారు. అంటే మిగిలిన కొద్దిమంది యూదావారు కూడా నశించి పోతారన్నమాట.”

16 కాని, అహీకాము కుమారుడైన గెదల్యా తన హితంగోరి చెప్పిన కారేహ కుమారుడైన యోహానానుతో, “ఇష్మాయేలును చంపవద్దు. నీవు ఇష్మాయేలును గురించి చెప్పుచున్న విషయాలు నిజం కావు” అని అన్నాడు.

కీర్తనలు. 15-16

దావీదు కీర్తన.

15 యెహోవా, నీ పవిత్ర గుడారంలో ఎవరు నివసించగలరు?
    నీ పవిత్ర పర్వతం మీద ఎవరు నివసించగలరు?
ఎవరైతే పరిశుద్ధ జీవితం జీవించగలరో, మంచి కార్యాలు చేయగలరో తమ హృదయంలో నుండి సత్యం మాత్రమే మాట్లాడుతారో
    అలాంటి వ్యక్తులు మాత్రమే నీ పర్వతం మీద నివసించగలరు.
అలాంటి వ్యక్తి ఇతరులను గూర్చి చెడు సంగతులు మాట్లాడడు.
    ఆ మనిషి తన పొరుగు వారికి కీడు చేయడు.
    ఆ మనిషి తన స్వంత కుటుంబం గూర్చి సిగ్గుకరమైన విషయాలు చెప్పడు.
ఆ మనిషి దేవుని చేత నిరాకరింపబడిన ప్రజలను గౌరవించడు.
    అయితే యెహోవాను సేవించేవారందరినీ ఆ మనిషి గౌరవిస్తాడు.
ఆ మనిషి గనుక తన పొరుగువానికి ఒక వాగ్దానం చేస్తే
    అతడు ఏమి చేస్తానన్నాడో దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మనిషి ఎవరికైనా అప్పిస్తే
    అతడు దాని మీద వడ్డీ తీసుకోడు.
నిర్దోషులకు కీడు చేయుటకుగాను అతడు డబ్బు తీసుకోడు.
    ఒక మనిషి ఆ మంచి వ్యక్తిలాగ జీవిస్తే, అప్పుడు ఆ మనిషి ఎల్లప్పుడూ దేవునికి సన్నిహితంగా ఉంటాడు.

దావీదుకు అభిమాన కావ్యము.

16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
“యెహోవా, నీవు నా యజమానివి
    నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
    అని నేను యెహోవాతో చెప్పాను.
మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
    “వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”

కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
    ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
    ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
    యెహోవా, నీవే నన్ను బలపరచావు.
    యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
నా వంతు చాలా అద్భుతమయింది.
    నా స్వాస్థ్యము చాలా అందమయింది.
యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
    రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.

నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
    ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
    నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
    నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
    నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
    యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
    నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International