M’Cheyne Bible Reading Plan
ఎల్కానా కుటుంబము షిలోహులో ఆరాధించుట
1 ఎల్కానా అనబడే ఒక వ్యక్తి ఉండెను. అతను కొండల దేశమైన ఎఫ్రాయిములోని రామతయి మ్సోఫీము పట్టణవాసి. ఎల్కానా సూపు వంశస్థుడు. అతని తండ్రి యెరోహాము. యెరోహాము ఎలీహు యొక్క కుమారుడు. ఎలీహు తండ్రి తోహు. తోహు ఎఫ్రాయిము వంశపువాడైన సూపు కుమారుడు.
2 ఎల్కానాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు హన్నా. రెండవ భార్యపేరు పెనిన్నా. పెనిన్నా సంతానవతి. కాని హన్నాకు పిల్లలు కలుగలేదు.
3 ప్రతి సంవత్సరము ఎల్కానా రామతయి మ్సోఫీమునుండి షిలోహుకు వెళ్లి సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించేవాడు. అక్కడ అతను బలులు కూడ అర్పించేవాడు. షిలోహులో హొఫ్నీ, మరియు ఫీనెహాసు అనే వారిరువురు యెహోవా యాజకులుగా ఉండిరి. వారిరువురూ ఏలీ అనే ప్రధాన యాజకుని కుమారులు. 4 ప్రతిసారీ బలిఅర్పణలో ఒక భాగం ఎల్కానా తన భార్య పెనిన్నాకు ఇచ్చేవాడు. ఆమె కుమారులకు కూడా భాగాలు ఇచ్చేవాడు. 5 యెహోవా హన్నాను గొడ్రాలుగా చేసినప్పటికీ, ఎల్కానా మాత్రం ఆమెను బాగా ప్రేమించేవాడు గనుక ఆమెకు కూడ ఎల్లప్పుడు అర్పణలో సమానభాగం ఇచ్చేవాడు.
పెనిన్నా హన్నాను కలవర పెట్టుట
6 పెనిన్నా అదేపనిగా హన్నాను పీడిస్తూ ఆమె మనస్సుకు ఎంతో బాధ కలిగించేది. అందుకు కారణం దేవుడు ఆమెను గొడ్రాలుగా చేయటమే. 7 ప్రతి ఏటా ఇదిలా జరుగుతూ వచ్చింది. షిలోహులోని యెహోవా ఆలయానికి వెళ్లిన ప్రతిసారీ హన్నాను పెనిన్నా కించపరిచేది. ఒకరోజు ఎల్కానా బలి అర్పించుచుండగా హన్నా ఏడ్వసాగింది. భోజనం కూడా చేయలేదు. 8 ఆమె భర్త ఎల్కానా, “ఎందుకు విచారిస్తున్నావనీ, ఎందుకు తినటం లేదనీ, ఎందుకు దుఃఖంతో ఉన్నావనీ ఆమెను అడిగాడు. నీకు నేను ఉన్నాను, నేను నీ భర్తను. పదిమంది కొడుకులకంటె నేను నీకు ఎక్కువ” అని కూడ ఓదార్చాడు.
హన్నా ప్రార్థన
9 హన్నా అన్న పానాలు పుచ్చుకొన్న తర్వాత, యెహోవాను ప్రార్థించటానికి వెళ్లింది. యెహోవా పవిత్ర ఆలయ ద్వారం పక్కనే యాజకుడు ఏలీ ఆసీనుడైవున్నాడు. 10 హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. 11 ఒక పెద్ద మొక్కుబడి మొక్కింది. “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, నేను ఎంత దుఃఖంలో వున్నానో చూడు. నన్ను జ్ఞాపకముంచుకో! నన్ను మర్చిపోవద్దు. నాకొక కుమారుని కలుగజేస్తే వానిని నేను తిరిగి నీ సేవకై జీవితాంతం విడిచి పెడ్తాను. పైగా అతడు మద్యపానాది[a] వ్యసనాలకు లోనుగాడు. అతడు నాజీరవుతాడు. మరియు అతని తలవెంట్రుకలు ఎవ్వరూ కత్తిపట్టి తీయరు”[b] అని కోరుకున్నది.
12 ఆ విధంగా హన్నా ప్రార్థనలో ఉన్నంతసేపూ ఏలీ ఆమె నోటిని గమనిస్తూ ఉన్నాడు. 13 హన్నా అంతరంగంలోనే ప్రార్థిస్తూవుంది. ఆమె పెదవులు కదిలాయి గాని ఆమె గొంతు విప్పలేదు. అందుచేత హన్నా మద్యం సేవించి వుంటుందని ఏలీ భావించాడు. 14 “మద్యం తాగటం మానివేయి. నీ ద్రాక్షా రసాన్ని పారబోయి” అని హన్నాతో ఏలీ చెప్పాడు.
15 “లేదయ్యా, నేను ద్రాక్షారసం గాని, మరేదిగాని సేవించలేదు. నేను నా సమస్యలన్నీ యెహోవాతో చెప్పుకుంటున్నాను. 16 నేనొక చెడ్డ స్త్రీ నని తలంచవద్దు. ఇంత ఎక్కువ సేపు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానంటే నాకు ఎన్నో బాధలు, అంతులేని దుఃఖం ఉన్నాయి” అని హన్నా సమాధాన మిచ్చింది.
17 అంతట ఏలీ, “నీవు సమాధానంతో వెళ్లు. ఇశ్రాయేలు దేవుడు నీ కోర్కెలను నెరవేర్చునుగాక” అని హన్నాను పంపివేశాడు.
18 “నామీద దయ ఉంచండి” అని చెప్పి హన్నా వెళ్లి, కొంచెం ఆహారం తీసుకున్నది. ఆ తరువాత ఆమె మరెప్పుడూ అంత మనోవేదన చెందలేదు.
19 మరునాటి తెల్లవారు ఝామునే ఎల్కానా కుటుంబ సభ్యులంతా లేచి దేవుని ఆరాధించి రామాలో ఉన్న తమ ఇంటికి వెళ్లిపోయారు.
సమూయేలు జననం
ఎల్కానా తన భార్య హన్నాతో శయనించాడు. హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకున్నాడు. 20 మరు సంవత్సరం సమయానికి హన్నా గర్భవతియై, ఒక కుమారుని కని తన కుమారునికి సమూయేలు[c] అని పేరు పెట్టింది. “వీనిపేరు సమూయేలు. ఎందుకంటే వీని కొరకు నేను యెహోవాని ప్రార్థించాను. ఆయన నా ప్రార్థన ఆలకించాడు” అని అన్నది హన్న.
21 ఆ సంవత్సరం ఎల్కానా సకుటుంబంగా షిలోహుకు వెళ్లి, యెహోవాకు బలులు సమర్చించి, మొక్కిన మొక్కులు తీర్చేందుకు వెళ్లాడు. 22 కాని ఈ సారి ఎల్కానాతో హన్నా వెళ్లలేదు. “బిడ్డకు ఆహారం తినే వయస్సు వచ్చిన్నపుడు షిలోహుకు తీసుకుని వెళతాను. అప్పుడతనిని దేవునికి అంకితం చేస్తాను. అతడు నాజీరు అవుతాడు. అది మొదలు శాశ్వతంగా షిలోహులో ఉండిపోతాడు” అని హన్నా ఎల్కానాకు చెప్పింది.
23 “నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి. కుమారుడు స్వయంగా ఆహారం తినగలిగే వయస్సు వచ్చే వరకు ఇంటివద్దనే ఉండు. యెహోవా తన వాగ్దానం నెరవేర్చునుగాక” అని ఆమె భర్త ఎల్కానా అన్నాడు. తన కుమారుని పెంచుతూ హన్నా ఇంటి వద్దనే ఉండి పోయింది.
హన్నా సమూయేలును షిలోహులోని ఏలీ వద్దకు కొనిపోవటం
24 బాలునికి స్వయంగా అన్నం తినే వయస్సు వచ్చినప్పుడు హన్నా అతనిని షిలోహులోని యెహోవా ఆలయానికి తీసుకుని వెళ్లింది. తనతోపాటు మూడు సంవత్సరాల గిత్తదూడను, అరబస్తా పిండిని, ఒక ద్రాక్షారసం సీసాను తీసుకుని వెళ్లినది.
25 యెహోవా ముందరకు వెళ్లి ఎల్కానా యథావిధిగా కోడెదూడను యెహోవాకు బలిగా వధించాడు. అప్పుడు హన్నా బాలుని ఏలీ వద్దకు తీసుకుని వెళ్లింది. 26 అప్పుడామె ఏలీతో, “అయ్యా, నీ జీవము తోడుగా చెప్పుచున్నాను; నేను గతంలో నీ చెంత నిలబడి యెహోవాకి ప్రార్థించిన స్త్రీనే, 27 ఈ బిడ్డ కోసమే నేను ప్రార్థించాను. యెహోవా నా ప్రార్థన ఆలకించి ఈ బిడ్డను నాకు ప్రసాదించాడు. 28 ఇప్పుడు ఈ బిడ్డను తిరిగి యెహోవాకు ఇస్తున్నాను. వీడు జీవితాంతం యెహోవా సేవలో నిమగ్నమై ఉంటాడు” అని అన్నది.
హన్న తన కుమారుని అక్కడ వదిలి[d] యెహోవాను ఆరాధించింది.
1 యేసు క్రీస్తు సేవకుడైన పౌలు నుండి:
దేవుడు తన అపొస్తలునిగా[a] పని చేయటానికి రమ్మని నన్ను పిలిచినాడు. దేవుని సువార్తను ప్రకటించటానికి నన్ను ప్రత్యేకించినాడు. 2 దేవుడు ఈ సువార్తను తన ప్రవక్తలతో వ్రాయించి పవిత్ర లేఖనముల ద్వారా ఇంతకు క్రితమే తెలియచేసాడు. 3 ఈ సువార్త దేవుని కుమారుడును మన ప్రభువును అయిన యేసు క్రీస్తును గురించి. ఆయన దావీదు వంశంలో మానవునిగా జన్మించాడు. 4 పవిత్రమైన దేవుని ఆత్మ ఆయన్ని తన శక్తితో బ్రతికించి, ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారుడని నిరూపించినాడు.
5 ఆయన ద్వారా నేను దేవుని దయను పొంది ఆయన కోసం అపొస్తలుడనయ్యాను. ప్రజలందరు సువార్తను విశ్వసించి దాన్ని అనుసరించాలని దేవుని ఉద్దేశ్యం. 6 యేసు క్రీస్తుకు చెందిన వారవుటకు పిలువబడినవాళ్ళలో మీరు కూడా ఉన్నారు.
7 అందువల్ల రోము పట్టణంలో ఉన్న మీ అందరికీ వ్రాయుటమేమనగా మీరు దేవునికి ప్రియమైనవాళ్ళు. ఆయన మిమ్మల్ని తన ప్రజగా ఉండటానికి పిలిచాడు.
మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహాన్ని ప్రసాదించి మీలో శాంతి కలుగుజేయునుగాక!
రోము నగరాన్ని దర్శించాలని అభిలాష
8 మీ విశ్వాసాన్ని గురించి ప్రపంచానికంతా తెలిసింది. కనుక నన్ను ముందు యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతలు అర్పించనివ్వండి. 9 నేను దేవుని కుమారుని సువార్తను ప్రకటించి మనస్ఫూర్తిగా ఆయన సేవ చేస్తున్నాను. 10 నేను ప్రార్థనలు చేసినప్పుడెల్లా విడువకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొంటున్నాను. దానికి ఆ దేవుడే సాక్షి. చివరకు ఇప్పుడైనా నేను మీ దగ్గరకు రావటానికి దైవేచ్ఛవల్ల మార్గం ఏర్పడాలని ప్రార్థిస్తున్నాను. 11 మీకు ఆధ్యాత్మిక శక్తి కలిగేటట్లు ఆత్మీయవరాన్ని అందించాలని మీ దగ్గరకు రావాలనుకొంటున్నాను. 12 అంటే మీరూ, నేనూ మనలోవున్న విశ్వాసం ద్వారా పరస్పరం ప్రోత్సాహపరచుకోవాలని ఆశిస్తున్నాను.
13 సోదరులారా! నేను, మిగతా యూదులుకానివాళ్ళనుండి ఫలం పొందినట్లే మీనుండి కూడా ఫలం పొందాలని, మీ దగ్గరకు రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కాని ఇప్పటి వరకు ఆటంకాలు కలిగాయి. ఈ విషయం మీరు గ్రహించాలని నా కోరిక.
14 గ్రీకులకు, గ్రీకులు కానివాళ్ళకు, జ్ఞానులకు, అజ్ఞానులకు బోధించవలసిన కర్తవ్యం నాది. 15 అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకొంటున్నాను.
16 సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది. 17 ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[b] అని వ్రాయబడి ఉంది.
యూదులుకానివాళ్ళు చేసిన పాపాలు
18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు. 19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.
20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
21 ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. 22 వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. 23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.
24 అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు. 25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!
26 పురుషులు కూడా ఈ విధంగా చెయ్యటం వల్ల, దేవుడు వాళ్ళను సిగ్గుమాలిన తమ కోరికలకు వదిలివేసాడు. వాళ్ళ స్త్రీలు కూడా సహజ సంపర్కాలను వదిలివేసి అసహజమైన సంపర్కాలకు అలవాటు పడిపోయారు. 27 అదే విధంగా, పురుషులు కూడా స్త్రీలతో సహజ సంపర్కాలు వదిలివేసి పురుషులతో సంపర్కం పొందాలనే కోరికలతో చెలరేగి పోయారు. పురుషులు పురుషులతో అసహజమైన సహవాసాలు చేసి తమ అసహజతకు తగిన శిక్షను స్వయంగా అనుభవిస్తున్నారు.
28 పైగా వాళ్ళు దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని లెక్కచెయ్యలేదు. కనుక దేవుడు వాళ్ళను వాళ్ళ నీచ బుద్ధికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు చెయ్యరాని పనులు చేసారు. 29 అన్యాయం, దుష్టత్వం, దురాశ, దుర్నీతి, ద్వేషం, హత్య, పోరాటం, మోసం, అసూయ అనే గుణాలు వాళ్ళలో సంపూర్ణంగా నిండిపోయాయి. వాళ్ళు వృథాగా మాట్లాడుతూ, 30 ఇతర్లను నిందిస్తూ, దేవుణ్ణి ద్వేషిస్తూ, ఇతర్లపై దౌర్జన్యం చూపుతూ, గర్విస్తూ, బడాయిలు చెప్పుకొంటూ జీవిస్తూ ఉంటారు. దుర్మార్గపు పనులు చెయ్యటానికి రకరకలా మార్గాలు కనిపెడ్తూ ఉంటారు. అంతేకాక తమ తల్లిదండ్రుల పట్ల అవిధేయతగా ప్రవర్తిస్తూ ఉంటారు. 31 వాళ్ళలో తెలివిలేదు. విశ్వాసము లేదు, హృదయము లేదు, కనికరం లేదు. 32 దేవుని నీతి నియమములకు వ్యతిరేకంగా ఇలాంటి పనులు చేసేవాళ్ళకు మరణ శిక్ష తప్పదని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండటమే కాకుండా ఆ పనులు చేసేవాళ్ళను మెచ్చుకొంటూ ఉంటారు.
యెరూషలేము పతనం
39 యెరూషలేము ఈ విధంగా లోబరచుకోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు. 2 సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది. 3 దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
4 యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు. 5 కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు. 6 రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు. 7 తరువాత సిద్కియా కండ్లను నెబుకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.
8 బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు. 9 నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు. 10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.
11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 12 “యిర్మీయాను వెదకి తెలిసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.
13 ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు. 14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు[a] అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.
ఎబెద్మెలెకునకు యెహోవా వర్తమానం
15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది: 16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు. 17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను.’ ఇది యెహోవా సందేశం. ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను. 18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
13 యెహోవా, ఎన్నాళ్లు నన్ను మరచిపోతావు?
నీవు నన్ను శాశ్వతంగా మరచిపోతావా?
నీవు నన్ను స్వీకరించకుండా ఎన్నాళ్లు నిరాకరిస్తావు?
2 నీవు ఒకవేళ నన్ను మరచిపోయావేమోనని ఇంకెన్నాళ్లు నేను తలంచాలి?
ఇంకెన్నాళ్లు నేను నా హృదయంలో దుఃఖ అనుభూతిని పొందాలి?
ఇంకెన్నాళ్లు నా శత్రువు నా మీద విజయాలు సాధిస్తాడు?
3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము.
నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!
4 అప్పుడు నా శత్రువు, “నేనే వానిని ఓడించాను” అనవచ్చు.
నేను అంతం అయ్యానని నా శత్రువు సంతోషిస్తాడు.
5 యెహోవా, నాకు సహాయం చేయుటకు నీ ప్రేమనే నేను నమ్ముకొన్నాను.
నీవు నన్ను రక్షించి, నన్ను ఆనందింపజేశావు.
6 యెహోవా నాకు మేలైన కార్యాలు చేశాడు.
కనుక నేను యెహోవాకు ఒక ఆనందగీతం పాడుతాను.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
(వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
3 కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
మంచి పనులు చేయలేదు.
4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.
© 1997 Bible League International