Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
రూతు 2

రూతు బోయజును కలుసుకొనుట

బేత్లెహేములో నయోమి భర్త ఎలీమెలెకు వంశపు వాడైన బోయజు అనే దగ్గర బంధువు ఒకతను ఉండేవాడు. అతడు గొప్ప శక్తిసంపన్నుడు.

ఒక రోజు రూతు నయోమితో, “నేను పొలాల్లోకి వెళితే బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నామీద జాలిపడి తన పొలంలో తన వెనుక పరిగె ఏరుకోనిస్తారేమో.” అన్నది.

“సరే మంచిది బిడ్డా, అలాగే వెళ్లిరా” అన్నది నయోమి.

రూతు పొలం వెళ్లి, పంట కోస్తున్న పనివాళ్ల వెనకాల తిరుగుతూ, వాళ్లు విడిచిపెట్టే పరిగె ఏరు కుంటుంది. ఆ పొలము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుకు చెందినది.

బోయజు బేత్లెహేమునుండి అప్పుడే పొలముకు వచ్చాడు. “దేవుడే మీకు తోడుగా వుండును గాక!” అంటూ తన పనివాళ్లను అభినందించాడు.

పనివాళ్లు “యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక!” అంటూ జవాబిచ్చారు.

అప్పుడు ఆయన రూతును చూసి పనివాళ్లపైన నియమించబడ్డ పెద్ద సేవకునితో, “ఎవరి అమ్మాయి ఈమె?” అని అడిగాడు బోయజు.

“ఆమె మోయాబు కొండదేశము నుండి నయోమితో పాటు వచ్చిన మోయాబు స్త్రీ. పనివాళ్ల వెనక తిరుగుతూ అక్కడక్కడ మిగిలిపోయిన కంకులను (పరిగె) ఏరుకోనిమ్మని ప్రొద్దున్నే వచ్చి నన్ను ఆడిగింది. అప్పట్నిండి ఆమె ఎడతెరిపి లేకుండా పని చేస్తూనే వుంది. అదిగో ఆ కనబడేదే ఆమె ఇల్లు. కాసేపు మాత్రము అక్కడ విశ్రాంతి తీసుకుంది” అన్నాడు ఆ పెద్ద సేవకుడు.

అప్పుడు బోయజు రూతుతో ఇలా అన్నాడు: “నా కుమారీ వినుము. నీవు ఇక్కడే నా పొలంలోనే వుండి పరిగె ఏరుకో. ఇంకెవ్వరి పొలానికీ వెళ్లాల్సిన పనిలేదు. నా ఆడ కూలీలవెనకే పోతూవుండు. మగ వాళ్లు ఏ పొలములో కోత కోస్తుంటారో గమనిస్తూ ఆక్కడ ఆడకూలీల వెనకే ఉండు. నిన్నేమి గొడవ పెట్టొద్దని కుర్రాళ్లతో చెబుతాలే. దాహమైతే నా మనుషులు త్రాగే పాత్రలోని నీళ్లే త్రాగు.”

10 రూతు తల వంచుకొని, నేలవరకు వంగి బోయజుతో ఇలా అన్నది. “పరాయిదాననయిన నేను నీ దృష్ఠిలో పడటం, నీ దయకు పాత్రురాలను కావడం ఆశ్చర్యంగావుంది.”

11 బోయజు ఇలా జవాబిచ్చాడు: “నీ ఆత్తగారు నయోమికి నీవు చేసిన సహాయాన్ని గూర్చి నాకంతా తెలుసు. నీ భర్త చనిపోయిన తర్వాత కూడ నీవు ఆమెకు సహాయము చేశావని నాకు తెలుసు. అంతేకాదు, నీవు నీ తల్లిదండ్రులను నీ స్వదేశాన్ని కూడా విడిచిపెట్టేసి, ఈ దేశము వచ్చేశావు. ఇక్కడి వారెవ్వరూ నీకు తెలియదు. అయినా నయోమితో వచ్చేశావు. 12 నీవు చేసిన ఈ మంచి పనులన్నిటికీ యెహోవా నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఏ ఇశ్రాయేలు వారి దేవుని దగ్గర ఆశ్రయము కోరి వచ్చావో ఆ యెహోవా దేవుడు నీకు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునుగాక! మరియు ఆయన నిన్ను కాపాడునుగాక.”

13 “అయ్యా! నేను కేవలం ఒక పనిమనిషిని, మీ పని మనుషుల్లో కనీసం ఒకదానితో సమానము కాను నేను. అయినా నన్ను గూర్చి ఎంతో దయగా మాట్లాడి, నన్ను ఆదరించారు. మీ దయ నాకు ఉంటే చాలు” ఆన్నది రూతు.

14 మధ్యాహ్న భోజనము వేళ బోయజు, “ఇక్కడికి రా! మా భోజనము తిను. రొట్టెను ద్రాక్షారసములో ముంచుకో” అన్నాడు రూతుతో.

కనుక రూతు పనివాళ్లతో కలిసి కూర్చుంది. బోయజు ఆమెకు కోన్ని పేలాలు పెట్టాడు. రూతు తృప్తిగా భోజనము చేసిన తర్వాత ఇంకా కొంచెము మిగిలాయి. 15 తరువాత రూతు లేచి మళ్లీ పనికి వెళ్లింది.

బోయజు తన పనివారితో, “పనల మధ్యకూడ ఆమెను ఏరుకోనివ్వండి. ఆమెను అభ్యంతర పెట్టకండి. 16 ఆమె కోసం కొన్ని కంకులు పనల్లోనుంచి జారవిడుస్తూ, ఆమె ఏరుకొనేందుకు వాటిని విడిచిపెట్టండి, అలా ఆమె పనిని సులభం చేయండి.” అని చెప్పాడు.

నయోమి బోయజును గురించి వినుట

17 సాయంత్రంవరకు రూతు పొలాల్లో పని చేసింది. తర్వాత ఆమె ఆ కంకులను దుళ్లగొట్టింది. అవి సుమారు ఒక తూమెడు యవలయ్యాయి. 18 రూతు తాను ఏరుకొన్న గింజలను తన అత్తకు చూపెట్టేందుకని ఊరిలోనికి మోసుకొనిపోయింది. ఆ మధ్యాహ్న భోజనములో మిగిలినదానిని కూడ ఆమెకు ఇచ్చింది.

19 ఆమె అత్త ఇలా అన్నది: “ఈ గింజలన్నీ ఎక్కడ ఏరుకున్నావు? నీవు ఎక్కడ పని చేశావు? నిన్ను గమనించినవాడిని దేవుడు దీవించునుగాక.”

రూతు తన అత్తతో, “ఈ వేళ బోయజు అనే ఆయన దగ్గర నేను పని చేశాను” అని చెప్పింది.

“యెహోవా అతనిని ఆశీర్వదించునుగాక! బ్రతికిన వాళ్లకు, చచ్చినవాళ్లకు అందరికి దేవుడు దయ చూపెడుతూనేవుంటాడు.” అని తన కోడలితో చెప్పింది నయోమి.

20 “బోయజు మన బంధువే, మనలను కాపాడేవాళ్లలో బోయజు ఒకడు” అని తన కోడలితో చెప్పింది నయోమి.

21 అప్పుడు, “మళ్లీ వచ్చి పని చేసుకోమని, కోత పూర్తి అయ్యేవరకు తన పనివాళ్లతో కలిసే పని చేసుకోమన్నాడు బోయజు” అని చెప్పింది రూతు.

22 దానికి నయోమి తన కోడలు రూతుతో ఇలా చెప్పింది: “అతని ఆడ కూలీలతోనే కలిసి పని చేసుకోవటం మంచిది నీకు. ఇంకేదైనా పొలంలో పనిచేస్తే మరే మగాడైనా నిన్ను బాధించవచ్చు.” 23 అందుచేత రూతు బోయజురి ఆడ కూలీలనే సన్నిహితంగా వెంబడిస్తూ, పనిచేసుకొంటూ పోయింది. యవలకోత పూర్తయ్యేవరకు ఆమె పరిగె ఏరుకొంది. గోధుమ కోత అయ్యేంతవరకు కూడ ఆమె అక్కడే పనిచేసింది. రూతు తన అత్తగారు నయోమితో బాటే కలిసి వుంటోంది.

అపొస్తలుల కార్యములు 27

పౌలు రోమాకు వెళ్ళటం

27 మేము ఇటలీకి ఓడలో ప్రయాణం చేయాలని అధికారులు నిర్ణయించి పౌలును, ఇతర ఖైదీలను “యూలి” అనబడే శతాధిపతికి అప్పగించారు. ఇతడు చక్రవర్తి దళానికి చెందినవాడు. మేము ఆసియ తీరాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న అద్రముత్తియ అనే ఓడనెక్కి ప్రయాణం అయ్యాము. మాసిదోనియ ప్రాంతంలోని థెస్సలొనీకకు చెందిన అరిస్తార్కు అనేవాడు మా వెంట ఉన్నాడు.

మరునటి రోజు మేము సీదోను చేరుకున్నాము. యూలి, పౌలు తన స్నేహితుల్ని కలుసుకొని సహాయం పొందేటట్లు అతనికి అనుమతిచ్చి అతనిపై దయచూపాడు. అక్కడినుండి మళ్ళీ ఓడలో ప్రయాణం సాగించాము. ఎదురుగాలి వీస్తూ ఉంది. అందువల్ల కుప్రకు దక్షిణంగా గాలి వీచని నీళ్లలో ప్రయాణం సాగించాము. కిలికియ, పంఫూలియల దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ “లుకియ” ప్రాంతంలో ఉన్న “మూర” అనే పట్టణాన్ని చేరుకున్నాము. మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న “అలెక్సంద్రియ” ఓడను చూసి, మమ్మల్ని ఆ ఓడలో ఎక్కించాడు.

ఎదురు గాలి వీస్తూవుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది. చాలా కష్టంగా “క్నిదు” తీరాన్ని చేరుకున్నాము. ఎదురు గాలి వల్ల ముందుకు వెళ్ళలేక పోయ్యాము. అందువల్ల దక్షిణంగా వెళ్ళి “క్రేతు” ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని “సల్మోనే” తీరంగుండా ప్రయాణం సాగించాము. ఆ నీళ్లలో మా ప్రయాణం కష్టంగా సాగింది. ఏదో విధంగా “మంచి రేవులు” అనే స్థలాన్ని చేరుకున్నాము. ఈ తీరం లసైయ అనే పట్టణానికి దగ్గరగా ఉంది.

అప్పటికే చాలా కాలం వృథా అయిపోయింది. కాని ప్రయాణం చెయ్యటం ప్రమాదకరమై పోయింది. ఉపవాస దినం[a] చేసే దినం కూడా దాటి పోయింది. అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్తపడమని చెబుతూ, 10 “ప్రజలారా! ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకనిపిస్తూవుంది. ఓడను, సరుకును నష్టపోవటమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలుగవచ్చు!” అని అన్నాడు. 11 కాని ఆ శతాధిపతి పౌలు మాటలు వినక ఆ ఓడ యొక్క యజమాని మాటలు, నావికుని మాటలు విన్నాడు. 12 వాళ్ళున్న రేవు చలి కాలంలో ఉండటానికి పనికిరాదు. కనుక అనేకులు ప్రయాణం సాగించమని సలహాయిచ్చారు. చలికాలం గడపటానికి “ఫీనిక్సు” అనే రేవు చేరగలమని అంతా ఆశించారు. ఈ ఫీనిక్సు రేవు క్రేతు ద్వీపంలో ఉంది. నైరుతి, వాయవ్య దిశలనుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించటానికి వీలుంటుంది.

తుఫాను

13 దక్షిణ గాలి వీచగానే తమకు కావలసింది దొరికిందని వాళ్ళనుకున్నారు. లంగరు తీసి, ఓడను క్రేతు తీరం ప్రక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు. 14 అంతలోనే, ఊరకులోను అనబడే తీవ్రమైన తుఫాను గాలి క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది. 15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. 16 “కౌద” అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకొని దాని ప్రక్కగా ప్రయాణం సాగించాము. ఓడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడగలిగాము. 17 దానిని ఓడమీదకి ఎక్కించిన తర్వాత త్రాళ్ళు బిగించి ఓడను గట్టిగా కట్టారు. ఓడ “సూర్తిస్” ప్రాంతంలోని యిసుక తిప్పల మీదికి వెళ్తుందని భయపడ్డారు. కనుక తెరచాపలు దించి ఓడను గాలి వీచే వైపు పోనిచ్చారు.

18 మరుసటి రోజు, తుఫానుగాలి తీవ్రంగా వీచటంవల్ల ఓడలోవున్న సరుకులు సముద్రంలో పడవేసారు. 19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. 20 సూర్యుడు కాని, నక్షత్రాలు కాని చాలా రోజుల దాకా కనపడ లేదు. తుఫానుగాలి తీవ్రత తగ్గలేదు. మేము బ్రతుకుమీద ఆశ యిక పూర్తిగా వదులుకున్నాము.

21 చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. 22 కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. 23 నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: 24 ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ 25 అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 26 మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు.

27 పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. 28 బుడుదు[b] నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. 29 ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. 30 నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. 31 అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. 32 ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు.

33 సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. 34 ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. 35 ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. 36 అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. 37 మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. 38 వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు.

ఓడ పగిలి పోవటం

39 సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. 40 త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. 41 కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది.

42 నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, 43 కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. 44 మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.

యిర్మీయా 37

యిర్మీయాను బంధించటం

37 నెబుకద్నెజరు బబులోను రాజు. యూదా రాజుగా యెహోయాకీము కుమారుడైన యెహోయాకీను[a] స్థానంలో సిద్కియాను నెబుకద్నెజరు నియమించాడు. సిద్కియా రాజైన యోషీయా కుమారుడు. యెహోవా యిర్మీయాకు బోధననిమిత్తం ఇచ్చిన వర్తమానాలను సిద్కియా లక్ష్య పెట్టలేదు. సిద్కియా సేవకులు, యూదా ప్రజలు కూడ యెహోవా వర్తమానాల పట్ల శ్రద్ధ వహించలేదు.

యెహుకలు అనువానిని, యాజకుడైన జెఫన్యాను రాజైన సిద్కియా ప్రవక్తయగు యిర్మీయా వద్ధకు ఒక సందేశమిచ్చి పంపాడు. యెహుకలు తండ్రి పేరు షెలెమ్యా. యాజకుడైన జెఫన్యా తండ్రి పేరు మయశేయా. వారు యిర్మీయాకు తెచ్చిన వర్తమానం యిలా ఉంది: “యిర్మీయా, మా కొరకు మన యెహోవా దేవుని ప్రార్థించు.”

(ఆ సమయంలో ఇంకా యిర్మీయా చెరసాలలో నిర్బంధించబడలేదు. కావున అతనెక్కడికి వెళ్లాలన్నా స్వేచ్ఛ కలిగియున్నాడు. అదే సమయంలో ఈజిప్టు నుండి ఫరో సైన్యం కూడా యూదా వైపుకు కదలి వచ్చింది. కల్దీయుల సైన్యం యెరూషలేమును ఓడించటానికి దానిని చుట్టుముట్టింది. అయితే, ఈజిప్టు నుండి వచ్చిన సైన్యం (కల్దీయులు) తమ మీదికి వస్తున్నట్లు వారు విన్నారు. కావున బబులోను సైన్యం యెరూషలేమును వదలి ఈజిప్టు సైన్యాన్ని ఎదిరించటానికి వెళ్లింది.)

యెహోవా నుండి ఒక వర్తమానం ప్రవక్తయైన యిర్మీయాకు వచ్చింది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ వర్తమానం చెప్పుచున్నాడు: ‘యెహుకలు మరియు జెఫన్యా! యూదా రాజైన సిద్కియా నన్ను ప్రశ్నలడిగే నిమిత్తం మిమ్మల్ని నావద్దకు పంపినట్లు నాకు తెలుసు. రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: ఫరో సైన్యం బబులోను సైన్యాన్ని ఎదుర్కొనే విషయంలో నీకు సహాయం చేయాలని ఈజిప్టు నుండి ఇక్కడికి కదలి వస్తున్నది. కాని ఫరో సైన్యం ఈజిప్టుకు తిరిగి వెళ్లిపోతుంది. ఆ తరువాత బబులోను సైన్యం ఇక్కడికి తిరిగి వస్తుంది. వారు యెరూషలేము మీద దాడి చేస్తారు. బబులోను సైన్యం ఆ పిమ్మట యెరూషలేమును వశపర్చుకొని దానిని తగలబెడుతుంది.’ యెహోవా ఇలా అంటున్నాడు: ‘యెరూషలేము ప్రజలారా మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. “బబులోను సైన్యం మమ్మల్ని వదలి తప్పక వెళ్లి పోతుంది” అని మీకు మీరు అనుకోవద్దు. వారు మిమ్మల్ని వదలరు. 10 యెరూషలేము ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కొనే కల్దీయుల సైన్యాన్నంతా మీరు ఓడించగలిగినా వారి డేరాలలో కొద్దిమంది గాయపడిన సైనికులు మిగులుతారు. ఆ కొద్దిమంది గాయపడిన మనుష్యులే వారి డేరాల నుండి వచ్చి యెరూషలేమును తగలబెడతారు.’”

11 కల్దీయుల సైన్యం ఈజిప్టు రాజైన ఫరో సైన్యాన్ని ఎదుర్కొనటానికి యెరూషలేమును వదిలిన సమయంలో 12 యిర్మీయా యెరూషలేము నుండి బెన్యామీను దేశానికి[b] వెళ్లగోరాడు. అక్కడ తన కుటుంబ ఆస్తుల పంపకం విషయంలో యిర్మీయా వెళ్లాడు. 13 కాని యెరూషలేములో బెన్యామీను ద్వారం[c] వద్దకు వెళ్లే సరికి రక్షక భటాధికారి యిర్మీయాను నిర్బంధించాడు. ఈ అధికారి పేరు ఇరీయా. ఇరీయా తండ్రి పేరు షెలెమ్యా. షెలెమ్యో తండ్రి పేరు హనన్యా. రక్షక భటాధికారి అయిన ఇరీయా యిర్మీయాను నిర్బంధంలోకి తీసుకొని “యిర్మీయా, నీవు మమ్మల్ని వదిలి బబులోను పక్షం వహించటానికి వెళ్తున్నావు” అని అన్నాడు.

14 “అది నిజం కాదు! నేను బబులోను పక్షం వహించటానికి వెళ్లటం లేదు” అని యిర్మీయా ఇరీయాతో అన్నాడు. కాని యిర్మీయా చెప్పేది ఇరీయా వినటానికి నిరాకరించాడు. యిర్మీయాను ఇరీయా నిర్బంధించి యెరూషలేములో రాజ్యాధికారుల వద్దకు తీసికొని వెళ్లాడు. 15 ఆ అధికారులు యిర్మీయా పట్ల చాలా కోపగించారు. యిర్మీయాను దండించాలని వారు ఆజ్ఞ ఇచ్చారు. వారు యిర్మీయాను కారాగారంలో నిర్బంధించారు. యోనాతాను అనేవాని ఇంటిలో ఈ చెరసాల ఉంది. యోనాతాను యూదా రాజుకు లేఖకుడు. యోనాతాను ఇంటిని చెరసాలగా మార్చారు. 16 యోనాతాను ఇంటి క్రిందవున్న చెరసాల గదిలో వారు యిర్మీయాను నిర్బంధించారు. అది ఇంటి క్రింద భూమిలో కట్టిన ఒక చెరసాల గది. యిర్మీయా అందులో చాలాకాలం ఉన్నాడు.

17 పిమ్మట రాజైన సిద్కియా మనుష్యులను పంపగా వారు యిర్మీయాను రాజభవనానికి తీసికొని వచ్చారు. యిర్మీయాతో సిద్కియా ఏకాంతంగా మాట్లాడాడు. “యెహోవా నుండి ఏమైనా సందేశం వచ్చిందా?” అని యిర్మీయాను అడిగాడు.

“అవును. యెహోవా సందేశం ఒకటి ఉంది సిద్కియా, నీవు బబులోను రాజుకు ఇవ్వబడతావు” అని యిర్మీయా సమాధాన మిచ్చాడు. 18 తరువాత యిర్మీయా రాజైన సిద్కియాతో ఇలా అన్నాడు. “నేను ఏమి తప్పు చేశాను? నీ పట్లగాని, నీ అధికారుల పట్లగాని యెరూషలేము ప్రజల పట్లగాని నేను చేసిన నేరం ఏమిటి? నన్నెందుకు కారాగృహంలో పడవేశావు? 19 సిద్కియా రాజా, నీ ప్రవక్తలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఆ ప్రవక్తలు నీకు తప్పుడు వర్తమానం యిచ్చారు. ‘బబులోను రాజు నిన్నుగాని, ఈ యూదా రాజ్యాన్ని గాని ఎదుర్కోడు’ అని వారన్నారు. 20 కాని మహారాజా, ఇప్పుడు నేను చెప్పేది దయచేసి వినండి. దయచేసి నా విన్నపం ఆలకించండి. నేనడిగేది ఏమంటే లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపవద్దు. మీరు నన్ను మరల పంపితే నేనక్కడ చనిపోతాను.”

21 కావున యిర్మీయాను రాజభవనపు ఆవరణలోనే నిర్బందించి ఉంచాలని రాజైన సిద్కియా ఆజ్ఞాపించాడు. వీధిలోని రొట్టెల దుకాణము నుండి రొట్టె తెచ్చి యిర్మీయాకు ఇవ్వాలని కూడ రాజు ఆజ్ఞాపించాడు. నగరంలో అమ్మే రొట్టెలు అయిపోయే వరకు యిర్మీయాకు రొట్టెలు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా రాజ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నాడు.

కీర్తనలు. 10

10 యెహోవా, నీవెందుకు అంత దూరంగా ఉంటావు?
    కష్టాల్లో ఉన్న ప్రజలు నిన్ను చూడలేరు.
గర్విష్ఠులు, దుష్టులు వారి దుష్ట పథకాలు వేస్తారు.
    మరియు పేద ప్రజలను వారు బాధిస్తారు.
దుష్టులు వారికి కావలసిన వాటిని గూర్చి అతిశయపడతారు.
    లోభులు యెహోవాను దూషిస్తారు. ఈ విధంగా దుష్టులు యెహోవాను ద్వేషిస్తున్నట్టు వ్యక్తం చేస్తారు.
ఆ దుర్మార్గులు చాలా గర్విష్ఠులు కనుక దేవున్ని అనుసరించరు.
    వాళ్లు తమ పాపిష్టి పథకాలన్నీ తయారు చేస్తారు. పైగా దేవుడే లేడు అన్నట్టు వారు ప్రవర్తిస్తారు.
ఆ దుర్మార్గులు ఎల్లప్పుడూ వంకర పనులే చేస్తుంటారు.
    కనీసం నీ చట్టాలను, వివేకవంతమైన నీ ఉపదేశాలను కూడా వారు పట్టించుకోరు.
    దేవుని శత్రువులు ఆయన బోధనలను నిర్లక్ష్యం చేస్తారు.
వాళ్లకు కీడు ఎన్నటికీ జరగదని ఆ మనుష్యులు తలుస్తారు.
    “మాకు ఎన్నడూ కష్ట సమయాలు ఉండవు” అని వారు అంటారు.
ఆ మనుష్యులు ఎల్లప్పుడూ దూషిస్తారు. ఇతరుల విషయంలో వారు ఎల్లప్పుడూ చెడు సంగతులే చెబుతారు.
    దుష్టకార్యాలు చేసేందుకే వారు ఎల్లప్పుడూ పథకం వేస్తుంటారు.
ఆ మనుష్యులు రహస్య స్థలాల్లో దాగుకొని ప్రజలను పట్టుకొనేందుకు కనిపెడతారు.
    ప్రజలను బాధించుటకు వారికోసం చూస్తూ దాగుకుంటారు.
    నిర్దోషులను వారు చంపుతారు.
తినవలసిన జంతువులను పట్టుకోవటానికి ప్రయత్నించే సింహాలవలె వారుంటారు.
    ఆ దుర్మార్గులు, పేదల మీద దాడిచేస్తారు. దుష్టులు వేసే ఉచ్చులలో పేదలు చిక్కుకొంటారు.
10 పేదలను, బాధపడేవారిని,
    ఆ దుష్టులు మరల, మరల బాధిస్తారు.
11 అందుచేత ఆ పేదలు ఈ సంగతులను ఇలా ఆలోచించటం మొదలు పెడ్తారు: “దేవుడు మమ్ముల్ని మరచిపోయాడు!
    దేవుడు మానుండి శాశ్వతంగా విముఖుడయ్యాడు!
    మాకు ఏమి జరుగుతుందో దేవుడు చూడటం లేదు!”

12 యెహోవా, లేచి ఏదైనా చేయుము!
    దేవా, దుష్టులను శిక్షించుము!
    పేదలను మాత్రం మరువకుము!

13 దుష్టులు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉంటారు?
    ఎందుకంటే దేవుడు వారిని శిక్షించడు అనుకొంటారు గనుక.
14 యెహోవా, దుర్మార్గులు చేసే కృ-రమైన చెడ్డ సంగతులను నీవు నిజంగా చూస్తున్నావు.
    నీవు వాటిని చూచి వాటి విషయమై ఏదో ఒకటి చేయుము.
ఎన్నో కష్టాలతో ప్రజలు నీ దగ్గరకు సహాయం కోసం వస్తారు.
    యెహోవా, తల్లి దండ్రులు లేని పిల్లలకు సహాయం చేసే వాడివి నీవే. కనుక వారికి సహాయం చేయుము.

15 యెహోవా, దుర్మార్గులను నాశనం చేయుము.
16 యెహోవా నిరంతరం రాజైయున్నాడు.
    ఆ ప్రజలు ఆయన దేశంలోనుండి నశించెదరు గాక!
17 యెహోవా, పేదలు కోరుకొనే వాటిని గూర్చి నీవు విన్నావు.
    నీవు వారిని ప్రోత్సాహ పరచెదవు. వారి ప్రార్థనలు ఆలకించెదవు.
18 యెహోవా, అనాథ పిల్లలను కాపాడుము. దుఃఖంలో ఉన్న వారిని ఇంకా ఎక్కువ కష్టాలు పడనీయకుము.
    దుర్మార్గులు ఇక్కడ ఉండకుండుటకు చాలా భయపడేటట్టుగా చేయుము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International