Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 21

బెన్యామీను మనుష్యులు భార్యలను పొందటం

21 మిస్పా వద్ద ఇశ్రాయేలు మనుష్యులు ఒక ప్రతిజ్ఞ చేశారు. అది ఏదనగా, “బెన్యామీను కుటుంబ వంశంవారికి చెందిన ఏ ఒక్కడూ కూడా ఇశ్రాయేలు వాళ్ల కుమార్తెలను వివాహము చేసుకోనియ్యము.”

ఇశ్రాయేలు మనుష్యులు బేతేలు నగరానికి వెళ్లారు. అక్కడ సాయంకాలంవరకు వారు దేవుని ముందు కూర్చొని పెద్దగా ఏడ్చారు. వారు దేవునితో, “యెహోవా, నీవు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడవు. ఈ భయంకరమైన విషయం మాకెందుకు సంభవించింది? ఎందుకుగాను ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశపు వారు తీసుకు వెళ్లబడ్డారు” అని అడిగారు.

ఆ మరుసటి రోజు ఉదయం ఇశ్రాయేలు ప్రజలు ఒక బలిపీఠం నిర్మించారు. ఆ బలిపీఠం మీద వారు దహన బలులు, సమాధాన బలులు దేవునికి సమర్పించారు. “యెహోవా సమక్షంలో మమ్మల్ని కలుసుకోవడానికి రాని ఇశ్రాయేలు వంశాలవారెవరైనా ఉన్నారా?” అని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. ఒక తీవ్రమైన ప్రతిజ్ఞ చేశారు కనుక, వారీ ప్రశ్న అడిగారు. ఇతర ఇశ్రాయేలీయుల వంశముల నుండి మిస్పా నగరం రాకుంటే వారిని హతమార్చుతామని వారు ప్రతిజ్ఞ చేశారు.

అప్పుడు బెన్యామీను ప్రజలైన తమ బంధువుల నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. వారు ఇలా అన్నారు: “నేడు ఇశ్రాయేలు నుండి ఒక వంశం వేరు చేయబడింది. మేము యెహోవా సమక్షాన ఒక ప్రతిజ్ఞ చేశాము. బెన్యామీను మనుష్యులలో ఎవ్వరినీ మా కుమార్తెలలో ఎవ్వరూ వివాహము చేసుకోరాదని ప్రతిజ్ఞ చేశాము. అందువల్ల బెన్యామీను మనుష్యులకు భార్యలు ఎలా కలుగుతారో మేము నిస్సందేహంగా ఎలా చెప్పగలము?” అని అన్నారు.

అప్పుడు ఇశ్రాయేలు మనుష్యులు, “ఇశ్రాయేలుకి చెందిన ఏ వంశం వారు మిస్పాకి రాలేదు? మేము దేవుని సమక్షమున ఏకమైనాము. ఒక వంశం ఇక్కడికి రాలేదని మేము అనుకొంటున్నాము” అని అడిగారు. ఆ తర్వాత యాబేష్గీలాదు నగరం నుండి ఎవ్వరూ వచ్చి ఇశ్రాయేలుకి చెందిన ఇతరుల్ని కలుసుకోలేదని వారు కనుగొన్నారు. ఎవరున్నారో, ఎవరు లేరో అని తెలుసుకునేందుకు ఇశ్రాయేలు మనుష్యులు అందరినీ లెక్క పెట్టారు. యాబేష్గీలాదు నుండి ఎవ్వరూ అక్కడ లేరని వారు కనుగొన్నారు. 10 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు పన్నెండువేల మంది సైనికులను యాబేష్గిలాదు నగరానికి పంపించారు. ఆ సైనికులతో వారు, “యాబేష్గిలాదుకు వెళ్లండి. అక్కడున్న ప్రతి వ్యక్తినీ స్త్రీలను పిల్లలను మీ ఖడ్గాలతో సంహరించండి. 11 మీరు ఇది చెయ్యాలి. యాబేష్గిలాదులో ఉన్న ప్రతి వ్యక్తినీ మీరు చంపాలి. పైగా పురుషునితో సంభోగించిన ప్రతి స్త్రీని కూడా మీరు చంపాలి. కాని పురుషునితో సంభోగము ఎరగని ఏ స్త్రీనీ మీరు చంపకూడదు.” అని చెప్పారు. 12 ఆ పన్నెండువేల మంది సైనికులు యాబేష్గిలాదులో నాలుగువందల మంది యువతులు ఏ పురుషునితోను సంభోగించలేదని తెలుసుకున్నారు. ఆ సైనికులు ఆ యువతులను షిలోహు ప్రాంతానికి తీసుకు వచ్చారు. షిలోహు కనాను ప్రదేశంలో ఉన్నది.

13 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బెన్యామీను వారికి ఒక సందేశం పంపించారు. బెన్యామీను మనుష్యులతో సంధి చేసుకుంటామన్నారు. బెన్యామీను మనుష్యులు రిమ్మోను బండ అనేచోట ఉన్నారు. 14 అందువల్ల బెన్యామీను మనుష్యులు ఇశ్రాయేలుకి తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలు యాబేష్గిలాదులో తాము చంపని స్త్రీలను వారికి ఇచ్చారు. కాని బెన్యామీను పురుషులకందరికీ సరిపడ్డ స్త్రీలు లేరు.

15 బెన్యామీను పురుషుల్ని తలచుకుని ఇశ్రాయేలు ప్రజలు విచారించారు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాల నుండి వాళ్లను యెహోవా వేరు చేసినందుకు వారు విచారించారు. 16 ఇశ్రాయేలు ప్రజల నాయకులు ఇలా అన్నారు; “బెన్యామీను వంశానికి చెందిన స్త్రీలు చంపబడ్డారు. ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు మేము భార్యల్ని ఎలా తేగలము? 17 ఇంకా సజీవులై ఉన్న బెన్యామీను పురుషులకు వారి వంశాలు కొనసాగేందుకుగాను పిల్లలు ఉండాలి. ఇశ్రాయేలుకి చెందిన ఒక వంశం మరణించకుండా ఉండడానికి ఇది చేయబడాలి. 18 కాని మేము మా కుమార్తెలు బెన్యామీను పురుషుల్ని వివాహము చేసుకోనియ్యము. మేము ఈ ప్రతిజ్ఞ చేశాము, ‘ఎవరైనా సరే బెన్యామీను పురుషునికి భార్యనిస్తే, అతనికి చెరుపు కలుగుతుంది.’ 19 మాకో ఆలోచన ఉంది. షిలోహు నగరంలో ఇప్పుడు యెహోవాకు ఉత్సవం జరిగే కాలం. అక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవం జరుగుతుంది.” (షిలోహు నగరం బేతేలు నగరానికి ఉత్తరాన ఉంది, బేతేలునుంచి షెకెముకు పోయే బాటకి తూర్పున వుంది. అది లెబోనా నగరానికి దక్షిణాన ఉంది.)

20 అందువల్ల బెన్యామీను మనుష్యులకి పెద్దలు (నాయకులు) తమ ఆలోచన తెలియజేశారు. “వెళ్లండి ద్రాక్షతోటల్లో దాగుకొనండి. 21 ఉత్సవంలో షిలోహునుండి యువతులు వచ్చి నాట్యంలో పాల్గొంటారు. వేచివుండండి. మీరే ద్రాక్షాతోటల్లో దాగి ఉన్నారో, అక్కడినుండి మీరు పారిపోండి. మీలో, ప్రతి ఒక్కడూ షిలోహు నగరానికి చెందిన ఒక యువతిని తీసుకునివెళ్లాలి. ఆ యువతుల్ని బెన్యామీను నగరానికి తీసుకుని వెళ్లండి, వివాహము చేసుకోండి. 22 ఆ యువతుల తండ్రులుగాని సోదరులుగాని వెలుపలికి వచ్చి, మాకు ఇది ఫిర్యాదు చేస్తారు. అప్పుడు, ‘బెన్యామీను పురుషుల ఎడల దయకలిగి ఉండండి. వారు ఆ యువతుల్ని వివాహము చేసుకోనివ్వండి. వారు ఈ స్త్రీలను తీసుకున్నారు. కాని మీతో యుద్ధం చెయ్యలేదు. వారు స్త్రీలను తీసుకువెళ్లారు. అందువల్ల దేవునివద్ద చేసిన ప్రతిజ్ఞ మీరు ఉల్లంఘించలేదు. వారికి ఆ యువతులను ఇచ్చి వివాహము చెయ్యమని మీరు ప్రతిజ్ఞ పట్టారు. బెన్యామీను పురుషులకు మీరా యువతులను యివ్వలేదు. వారు మీ వద్దనుంచే ఆ యువతుల్ని తీసుకువెళ్లారు. అందువల్ల మీరు మీ ప్రతిజ్ఞ తప్పలేదు.’” అన్నారు.

23 అందువల్ల బెన్యామీను వంశపు మనుష్యులు చేసినది అదే. ఆ యువతులు నాట్యం చేసేటప్పుడు, ప్రతి పురుషుడూ వారిలో ఒక్కొక్కరిని పట్టుకున్నాడు. ఆ యువతులను వారు తీసుకుపోయి, వివాహము చేసుకున్నారు. వారు తమ దేశానికి తిరిగి వెళ్లిపోయారు. ఆ దేశంలో బెన్యామీను మనుష్యులు మళ్లీ నగర నిర్మాణం చేసుకున్నారు, వారా భూమిలోనే నివసించారు. 24 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులు ఇళ్లకు వెళ్లిపోయారు. వారు తమ దేశానికి, తమ వంశం వద్దకు వెళ్లారు.

25 ఆ రోజుల్లో ఇశ్రాయేలు మనుష్యులకు రాజు లేడు. అందువల్ల ప్రతి ఒక్కడూ తనకు ఏది సరి అని తోచిందో, అదే చేశాడు.

అపొస్తలుల కార్యములు 25

ఫేస్తు సమక్షంలో విచారణ

25 ఫేస్తు ఆ ప్రాంతానికి వచ్చిన మూడు రోజుల తర్వాత కైసరియనుండి యెరూషలేమునకు వెళ్ళాడు. అక్కడ ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతణ్ణి కలుసుకొని, పౌలును గురించి చెప్పారు. పౌలును వెంటనే యెరూషలేముకు పంపి తమకు ఉపకారం చెయ్యమని వేడుకున్నారు. ఎవ్వరికీ తెలియకుండా పౌలును దారిలో చంపేయాలని వాళ్ళ కుట్ర. ఫేస్తు, “పౌలు కైసరియలో బందీగా ఉన్నాడు. నేను కూడా అక్కడికి త్వరలోనే వెళ్తున్నాను. మీలో ముఖ్యమైనవాళ్ళు నావెంట వస్తే, అతడు ఒకవేళ ఏదైనా నేరం చేసి ఉంటే అతనిపై మీ నేరారోపణలు అక్కడే చేయవచ్చు” అని అన్నాడు.

అక్కడ వాళ్ళతో ఎనిమిది, పది రోజులు గడిపాక కైసరియకు వెళ్ళాడు. వెళ్ళిన మరుసటి రోజు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు పిలుచుకు రమ్మని ఆజ్ఞాపించాడు. పౌలు కనపడగానే యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టూ చేరి అతనిపై తీవ్రమైన నేరాలు ఆరోపించారు. ఎన్ని నేరాల్ని ఆరోపించినా, ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక పోయారు. తదుపరి పౌలు, తాను నేరస్థుడు కాదని నిరూపించుకోవటానికి ఈ విధంగా వాదించాడు, “నేను యూదుల ధర్మశాస్త్రాన్ని కాని, మందిర నియమాల్ని కాని అతిక్రమించ లేదు. చక్రవర్తికి ఎదురు తిరిగి ప్రవర్తించనూ లేదు.”

ఫేస్తు, యూదులకు ఉపకారం చేయాలని, పౌలుతో, “నీవు యెరూషలేము వచ్చి అక్కడ నా ఎదుట న్యాయస్థానంలో నిలుచోగలవా?” అని అడిగాడు.

10 పౌలు ఈ విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు. 11 మరణదండన పొందవలసిన నేరం నేను ఒక వేళ ఏదైనా చేసివుంటే, మరణించటానికి నేను వెనుకంజ వేయను. కాని వీళ్ళు ఆరోపించిన నేరాలు అసత్యమైతే నన్ను వీళ్ళకప్పగించే అధికారం ఎవ్వరికీ లేదు. చక్రవర్తినే ఈ విషయంపై తీర్పు చెప్పమని నేను విన్నవించుకొంటాను.”

12 ఫేస్తు తన సలహాదార్లతో సంప్రదించి యిలా ప్రకటించాడు: “నీవు చక్రవర్తి సమక్షంలో విన్నవించుకోవాలని కోరావు. కనుక నిన్ను చక్రవర్తి దగ్గరకు పంపుతాను.”

ఫేస్తు అగ్రిప్పను సంప్రదించటం

13 కొద్ది రోజుల తర్వాత అగ్రిప్పరాజు, బెర్నీకే ఫేస్తును కలుసుకొందామని కైసరియకు వచ్చారు. 14 వాళ్ళక్కడ చాలా రోజులున్నారు. ఫేస్తు పౌలు విషయాన్ని రాజుగారితో చర్చిస్తూ, “ఇక్కడ, ఫేలిక్సు కారాగారంలో ఉంచిన వాడొకడున్నాడు. 15 నేను యెరూషలేముకు వెళ్ళినప్పుడు ప్రధానయాజకులు, యూదుల పెద్దలు అతనిపై నేరారోపణ చేసి అతనికి మరణదండన విధించమని నన్ను కోరారు. 16 నేను, ‘నేరమారోపింపబడినవానికి తనపై నేరారోపణ చేసినవాళ్ళను ప్రత్యక్షంగా కలుసుకొని, వాళ్ళారోపించిన నేరాలకు ప్రతిగా తన రక్షణార్థం మాట్లాడే అవకాశం కలగాలి, దానికి ముందు అతణ్ణి అప్పగించటం రోమీయుల పద్ధతి కాదు’ అని జవాబు చెప్పాను.

17 “నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను. 18 అతనిపై నేరారోపణ చేసినవాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున్న ఏ నేరాన్నీ అతనిపై ఆరోపించలేదు. 19 దానికి మారుగా తామనుసరించే మతాన్ని గురించి అతనితో వాదించారు. చనిపోయిన యేసును గురించి తర్కించారు. కాని పౌలు యేసు బ్రతికే ఉన్నాడని వాదించాడు. 20 అలాంటి విషయాలు ఏ విధంగా విచారణ చెయ్యాలో నాకు తెలియదు. అందువల్ల నేను అతణ్ణి, ‘విచారణ కోసం నీవు యెరూషలేము వెళ్తావా?’ అని అడిగాను. 21 చక్రవర్తే తీర్పు చెప్పాలని, అంతదాకా తనను కారాగారంలో ఉంచమని పౌలు కోరాడు. ఆ కారణంగా అతణ్ణి కైసరు దగ్గరకు పంపేదాకా కారాగారంలో ఉంచమని ఆజ్ఞాపించాను” అని చెప్పాడు.

22 అగ్రిప్ప ఫేస్తుతో, “అతడు మాట్లాడే విషయాలు వినాలని నాక్కూడా ఉంది” అని అన్నాడు.

“రేపు మీరతని మాటలు వింటారు” అని ఫేస్తు జవాబు చెప్పాడు.

23 మరుసటి రోజు అగ్రిప్ప, బెర్నీకే మిక్కిలి ఆడంబరంగా సభలోకి వచ్చి సహస్రాధిపతులతో, పట్టణ ప్రముఖులతో కలిసి కూర్చున్నారు. ఫేస్తు ఆజ్ఞాపించగానే పౌలు సభలోకి తేబడ్డాడు.

24 ఫేస్తు యిలా అన్నాడు: “అగ్రిప్ప రాజా! సభికులారా! మీరు చూస్తున్న ఈ వ్యక్తిని గురించి యూదులు యెరూషలేములో, ఇక్కడ, ‘ఇతడిక ఎక్కువ రోజులు బ్రతకటానికి వీల్లేదు’ అని బిగ్గరగా కేకలు వేసి నాకు ఫిర్యాదు చేసారు. 25 మరణదండన విధించవలసిన నేరమేదీ అతడు చేయలేదని నాకర్థమైనది. కాని అతడు చక్రవర్తికి విన్నవించుకొంటానని అన్నాడు. కనుక అతణ్ణి చక్రవర్తి దగ్గరకు పంపాలని నిశ్చయించుకున్నాను. 26 ఇతణ్ణి గురించి చక్రవర్తికి వ్రాయటానికి నాకేదీ కనిపించలేదు. అందువల్ల యితణ్ణి మీ ముందుకు పిలుచుకు వచ్చాను. అగ్రిప్ప రాజా! ముఖ్యంగా మీకోసం యితణ్ణి పిలిపించాను. మీ విచారణ వల్ల వ్రాయటానికి నాకేదైనా కనిపించవచ్చు. 27 ఒక బంధీని, అతడు చేసిన నేరం స్పష్టంగా చూపకుండా పంపటం న్యాయం కాదని నా అభిప్రాయం.”

యిర్మీయా 35

మార్గదర్శకమైన రేకాబీయుల మంచి కుటుంబం

35 యెహోయాకీము యూదా రాజ్యాన్ని పరిపాలించే కాలంలో యిర్మీయాకు యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది. రాజైన యెహోయాకీము యోషీయా కుమారుడు. యెహోవా సందేశం ఇలా ఉంది: “యిర్మీయా, రేకాబీయుల[a] వద్దకు వెళ్లుము. యెహోవా దేవాలయపు ప్రక్కగదులలో ఒక దాని లోనికి వారిని ఆహ్వానించుము. వారు తాగటానికి ద్రాక్షారసాన్ని అందించుము.”

కావున నేను (యిర్మీయా) యజన్యాను[b] తీసికొని రావటానికి వెళ్లాను. యజన్యా యిర్మీయా[c] అనువాని కూమారుడు. యిర్మీయా హబజ్జిన్యా కుమారుడు. యజన్యా సోదరులను; కుమారులను కూడ ఆహ్యానించాను, రేకాబీయుల కుటుంబం వారినందరినీ పిలువనంపాను. ఆ రేకాబీయుల నందరినీ మందిరంలోనికి తీసికొని వచ్చాను. అందరం హానాను కుమారుల గది అనబడే దానిలోనికి వెళ్లాము. హానాను అనువాడు యిగ్దల్యా కుమారుడు. హానాను ఒక దైవజనుడు. ఈ గది యూదా రాజు ముఖ్యఅధికారులు బసచేసే గది ప్రక్కనే ఉంది, ఇది మయశేయా గదిపైనవుంది. మయశేయా అనేవాడు షల్లూము కుమారుడు. మయశేయా దేవాలయంలో ద్వార పాలకుడు. పిమ్మట నేను (యిర్మీయా) ద్రాక్షారసం పోసిన కొన్ని పాత్రలు, మరికొన్ని గిన్నెలు రేకాబీయుల ముందు ఉంచాను. “కొంచెం ద్రాక్షారసం తీసుకోండి” అని నేను వారికి చెప్పాను.

కాని రేకాబీయులు ఇలా సమాధాన మిచ్చారు: “మేమెన్నడూ ద్రాక్షారసం త్రాగము. మా పితరుడైన రేకాబు కుమారుడైన యెహోనాదాబు మాకు ఆజ్ఞ యిచ్చిన కారణంగా మేము దానిని త్రాగము. అతని ఆజ్ఞ ఏమనగా: ‘మీరు మీ సంతతివారు ఎన్నడూ ద్రాక్షారసం త్రాగవద్దు. పైగా మీరు ఎన్నడు ఇండ్లు కట్టవద్దు, విత్తనములు నాటవద్దు. ద్రాక్షా తోటలు పెంచవద్దు. వీటిలో దేనినీ మీరు ఎన్నడూ చేయరాదు. మీరు కేవలం గుడారాలలోనే నివసించాలి. మీరిలా చేస్తే, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తిరుగుతూ మీరీ దేశంలో చిరకాలం జీవించగలుగుతారు.’ కావున రేకాబీయులమైన మేము మా పితరుడైన యెహోనాదాబు ఇచ్చిన ఆజ్ఞకు బద్ధులమైయున్నాము. మేమెన్నడూ ద్రాక్షారసం త్రాగము. మా భార్యాలు, కుమారులు, కుమార్తెలు కూడా ద్రాక్షారసం త్రాగరు. నివసించటానికి మేము ఇండ్లను నిర్మించము. ద్రాక్షాతోటలు గాని, పొలాలు గాని మేము కలిగివుండము. మేమెన్నడూ పంటలు పండించము. 10 మేము గుడారాల్లో నివసిస్తూ. మా పూర్వీకుడైన యెహోనాదాబు యొక్క ఆజ్ఞలన్నీ పాలిస్తున్నాము. 11 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజ్యాన్ని ముట్టడించినప్పుడు, మేము యెరూషలేములో ప్రవేశించాము. అప్పుడు మాలో మేము, ‘రండి, మనమంతా యెరూషలేము నగరానికి వెళదాం. అలా వెళ్లి బబులోను సైన్యం నుండి, అరాము దేశ (కల్దీయుల) సైన్యం నుండి మనల్ని మనం రక్షించుకుందాము’ అని అనుకున్నాము. ఆ విధంగా మేము యెరూషలేములో ఉండి పోయాము.”

12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది: 13 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు: “యిర్మీయా, ఈ వర్తమానం యూదా వారికి, యెరూషలేము ప్రజలకు తెలియ జేయుము. ఓ ప్రజలారా, మీరొక గుణపాఠం నేర్చుకొని, నా సందేశాన్ని పాటించాలి.” ఇదే యెహోవా వాక్కు. 14 “రేకాబు కుమారుడైన యెహోనాదాబు ద్రాక్షారసం త్రాగవద్దని తన కుమారులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ శిరసావహించబడింది. ఈ రోజు వరకూ యెహోనాదాబు సంతతి వారు తమ పితరుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చారు. వారు ద్రాక్షారసం త్రాగరు. కాని నేను యెహోవాను. యూదా ప్రజలైన మీకు అనేక పర్యాయాలు సందేశాలు పంపియున్నాను. కాని మీరు నాకు విధేయులుకాలేదు. 15 ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీ వద్దకు నా సేవకులగు ప్రవక్తలను పంపాను. వారిని అనేక పర్యాయాలు మీ వద్దకు పంపినాను. ఆ ప్రవక్తలు మీతో, ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీలో ప్రతి ఒక్కడు చెడు కార్యాలు చేయటం మానివేయాలి. మంచి చెయ్యండి, ఇతర దేవతలను వెంబడించవద్దు, పూజించవద్దు, మీరు నాకు విధేయులై, మీ పూర్వీకులకు, మీకు నేను ఇచ్చిన భూమియందు మీరు నివసించవచ్చు’ అని అన్నాను. కాని మీరు నా మాటను వినుటకు తిరస్కరించారు. 16 యెహోనాదాబు సంతతివారు వారి పూర్వీకుడు ఇచ్చిన ఆజ్ఞను తప్పక పాటించారు. కాని యూదా ప్రజలు మాత్రం నాకు విధేయులు కాలేదు.”

17 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదాకు, యెరూషలేముకు చాలా కష్టాలు సంభవిస్తాయని నేను చెప్పియున్నాను. త్వరలో ఆ విపత్తులన్నీ సంభవించేలా చేస్తాను. నేను ఆ ప్రజలతో మాట్లాడాను. కాని వారు వినటానికి నిరాకరించారు. నేను వారిని పిలిచాను. కాని వారు సమాధానం మియ్యలేదు.”

18 రేకాబీయులతో యిర్మీయా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘మీరంతా మీ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞ పాటించినారు. యెహోనాదాబు బోధనలను మీరు అనుసరించారు. అతను చెప్పినదంతా మీరు ఆచరించారు. 19 కావున ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతిలో ఒకడు సదా నాసేవలో నిమగ్నమై ఉంటాడు.’”

కీర్తనలు. 7-8

యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన సౌలును గూర్చినది ఈ పాట.

యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను.
    నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము.
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను.
    నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు.

యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు.
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు.
    నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు.
కాని నేను అలా చేసియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము.
    నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద త్రొక్కనిమ్ము.
    మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము.

యెహోవా, లెమ్ము. నీ కోపాన్ని చూపెట్టుము.
    నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము.
    లేచి న్యాయంకోసం వాదించుము.
జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి,
    వారి మీద పైనుండి పరిపాలించుము.
ప్రజలకు తీర్పు తీర్చుము. యెహోవా, నాకు తీర్పు తీర్చుము.
    నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము.
    నేను నిర్దోషిని అని రుజువు చేయుము.
చెడ్డవాళ్లను శిక్షించి
    మంచివాళ్లకు సహాయం చేయుము.
దేవా, నీవు మంచివాడవు,
    మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు.

10 నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు.
    కనుక దేవుడు నన్ను కాపాడుతాడు.
11 దేవుడు మంచి న్యాయమూర్తి,
    మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు.
12 దేవుడు ఒక నిర్ణయం చేస్తే
    ఆయన తన మనస్సు మార్చుకోడు.
13 ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది.

14 కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు.
    అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు.
15 వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు.
    అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు.
16 వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు.
    ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు.
    అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు.

17 యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను.
మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను.

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International