Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 20

ఇశ్రాయేలుకీ బెన్యామీనుకీ మధ్య యుద్ధం

20 అందువల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ ఏకమైనారు. వారందరూ మిస్పా నగరంలోని యెహోవా సమక్షమున నిలబడుటకు కలిసివచ్చారు. ఇశ్రాయేలులోని ప్రతిచోటునుండి వచ్చారు. గిలాదులోని ఇశ్రాయేలు మనుష్యులు కూడా వచ్చారు. ఇశ్రాయేలులోని వివిధ వంశాల నాయకులూ వచ్చారు. దేవుని ప్రజలు బహిరంగ సభలో వారు తమతమ స్థానములు అలంకరించారు. నాలుగు లక్షల సైనికులు కత్తులతో ఆ చోట వున్నారు. బెన్యామీను వంశమునకు చెందిన మనుష్యులు ఇశ్రాయేలు ప్రజలు మిస్పాలో సమావేశమైన విషయం తెలుసుకొనిరి. “ఈ భయంకర విషయం ఎలా జరిగిందో మాకు చెప్పండి” అని ఇశ్రాయేలు ప్రజలన్నారు.

అప్పుడు చంపబడిన ఆ స్త్రీ భర్త వారితో జరిగిన కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు, “నా దాసి, నేనూ బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరమునకు వచ్చాము. మేమారాత్రి అక్కడ గడిపాము. కాని రాత్రి సమయాన గిబియా నగరపు నాయకులు నేను నివసించే ఇంటికి వచ్చారు. వారు ఇల్లు చుట్టుముట్టారు. నన్ను కూడాలి అనుకున్నారు. వారు నా దాసిని బలాత్కరించారు. ఆమె చనిపోయింది. అందువల్ల నా దాసిని తీసుకుని వచ్చి, ఈమెను పన్నెండు భాగాలుగా ఖండించితిని. తర్వాత ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క వంశంవారికి పంపించాను. నేను మనము స్వీకరించిన పన్నెండు ప్రదేశాలకు పన్నెండు భాగాలను పంపించాను. ఎందుకు చేశాననగా బెన్యామీను ప్రజలు ఈ భయంకర విషయాన్ని ఇశ్రాయేలులో జరిగించారు. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలారా, మాట్లాడండి. మనమేమి చేయవలెనో మీరు నిర్ణయం తీసుకోండి.”

ఒకేసారి, అందరు మనుష్యులు లేచి నిలబడ్డారు. ముక్తకంఠంతో అన్నారు: “మేమెవ్వరమూ ఇళ్లకి వెళ్లము. అవును. మాలో ఏ ఒక్కరూ తన ఇంటికి తిరిగి వెళ్లడు. ఇప్పుడు గిబియా నగరానికి ఇలా చేద్దాము. ఆ ప్రజల్ని ఏం చేయాలో దేవుడు తోవ చూపడానికి చీట్లు వేద్దాము. 10 ఇశ్రాయేలు విభిన్న వంశాల నుండి ప్రతి వంద మందిలోనుండి పదిమందిని ఎన్నుకుందాము. ప్రతి వేయి మంది నుండి వంద మందిని ఎన్నుకుందాము. ప్రతి పదివేల మందినుండి వేయి మందిని ఎన్నుకుందాము. మనము ఎంపిక చేసిన ఆ మనుష్యులు సైన్యం కోసం పనులు చేస్తారు. తర్వాత బెన్యామీను ప్రదేశంలోని గిబియా నగరానికి సైన్యం తరలి వెళుతుంది. ఇశ్రాయేలు ప్రజల సైన్యం భయంకరమైన ఈ విషయం జరిపిన ఆ మనుష్యుల్ని శిక్షిస్తుంది.”

11 అందువల్ల ఇశ్రాయేలుకి చెందిన వారందరూ గిబియా నగరానికి చేరారు. వారేమి చేస్తున్నారో, దానికి వారందరూ సమ్మతించారు. 12 ఇశ్రాయేలు ప్రజలు ఒక సందేశమిచ్చి బెన్యామీను వారి వద్దకు పంపించారు. ఆ సందేశమేమనగా, “మీకు చెందిన కొందరు మనుష్యులు చేసిన ఈ ఘోర కృత్యమేమిటి? 13 గిబియా నగరం నుంచి ఆ దుర్జనుల్ని మా వద్దకు పంపండి. వారిని మాకు అప్పజెప్పండి. మేము వారిని చంపుతాము. ఇశ్రాయేలు ప్రజలనుండి ఆ పాపాన్ని తొలగించదలచాము.”

కాని బెన్యామీను వంశానికి చెందిన వారు తమ బంధువులు పంపిన ఆ సందేశాన్ని వినదలచుకోలేదు. ఆ బంధువులు ఇశ్రాయేలులోని ఇతర ప్రజలు. 14 బెన్యామీను వంశంవారు తమ నగరములు విడిచి గిబియా నగరమునకు వెళ్లారు. ఇశ్రాయేలులోని ఇతర వంశాలకు చెందినవారితో పోరాడాలని వారు గిబియా వెళ్లారు. 15 బెన్యామీను వంశం వారు ఇరవై ఆరువేలమంది సైనికుల్ని సమకూర్చుకున్నారు. ఆ సైనికులందరూ యుద్ధానికి తర్ఫీదు పొందినవారు. వారు గిబియా నగరం నుండి ఏడువందల మంది తర్ఫీదు పొందిన సైనికులను సమకూర్చుకున్నారు. 16 పైగా ఎడమ చేతి వాటం గల ఏడువందల మంది తర్ఫీదు పొందిన సైనికులు కూడా ఉన్నారు. వారిలో ప్రతి ఒక్కరూ చాలా సామర్థ్యంతో వడిసెలను ఉపయోగించగలరు. వారందరూ వడిసెలతో తలవెంట్రుక మీదకి గురి తప్పకుండా రాయి విసరిగలిగేవారు.

17 బెన్యామీను తప్ప మిగిలిన ఇశ్రాయేలు వంశాల వారు మొత్తం మీద నాలుగు లక్షల మంది వీరయోధుల్ని సమకూర్చుకున్నారు. ఆ నాలుగు లక్షల మంది వద్ద ఖడ్గాలున్నాయి. ప్రతి ఒక్కరూ సుశిక్షితుడైన సైనికుడు. 18 ఇశ్రాయేలు ప్రజలు బేతేలు నగరం దాకా వెళ్లారు. బేతేలు వద్ద వారు దేవుని ఇలా అడిగారు: “బెన్యామీను వంశం వారిని ఏ వంశం వారు మొదట ఎదుర్కోవాలి?”

“యూదా వంశం వారు మొదట ఎదుర్కొంటారు” అని యెహోవా బదులు చెప్పాడు.

19 ఆ మరునాటి ఉదయం ఇశ్రాయేలు ప్రజలు మేల్కొన్నారు. గిబియా నగరం వద్ద ఒక గుడారం వేశారు. 20 తర్వాత ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను సైన్యాన్ని ఎదుర్కోడానికి గిబియా నగరం వద్దకి తరలివెళ్లింది. 21 ఆ తర్వాత బెన్యామీను సైన్యం గిబియా నగరం నుండి బయటికి వచ్చింది. బెన్యామీను సైన్యం ఆ రోజు జరిగిన యుద్ధంలో ఇరవై రెండు వేలమంది ఇశ్రాయేలు సైనికుల్ని హతమార్చింది.

22-23 ఇశ్రాయేలీయులు యెహోవావద్దకు వెళ్లారు. సాయంకాలందాకా విలపించారు. వారు యెహోవాను అడిగారు; “బెన్యామీను ప్రజలతో మళ్లీ మేము యుద్ధం చేయాలా? ఆ మనుష్యులు మా బంధువులు.”

“వెళ్లి, వాళ్లతో యుద్ధం చేయండి” అని యెహోవా సమాధానమిచ్చాడు. ఇశ్రాయేలు మనుష్యులు ఒకరినొకరిని ప్రోత్సాహ పరుచుకున్నారు. మొదటి రోజున చేసినట్లుగా, వారు మళ్లీ యుద్ధానికి తరలి వెళ్లారు.

24 అప్పుడు బెన్యామీను సైన్యం దగ్గరికి ఇశ్రాయేలు సైన్యం వచ్చింది. ఇది యుద్ధం రెండవరోజు. 25 రెండవరోజున సైన్యాన్ని ఎదుర్కొనాలని గిబియా నగరం వెలుపలికి బెన్యామీను సైన్యం వచ్చింది, బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైన్యంలోని పద్దెనిమిది వేలమందిని చంపివేసింది. ఇశ్రాయేలు సైన్యంలోని మనుష్యులు సుశిక్షితులైన సైనికులు.

26 తర్వాత ఇశ్రాయేలు మనుష్యులందరు బేతేలు నగరం దాకా వెళ్లారు. ఆ చోట వారు కూర్చుని యెహోవాను పిలిచారు. సాయంకాలంవరకు ఆ రోజు వారేమీ తినలేదు. వారు దహన బలులు సమాధాన బలులను అర్పించారు. 27 ఇశ్రాయేలు మనుష్యులు యెహోవాను ఒక ప్రశ్న అడిగారు. (ఆ రోజుల్లో దేవుని ఒడంబడిక పెట్టె బేతేలులో ఉంది. 28 ఫినెహాసు యాజకునిగా వుండి దేవుణ్ణి సేవిస్తూ వున్నాడు. ఫినెహాసు ఎలీయాజరు కుమారుడు ఎలీయాజరు అహరోను కుమారుడు) ఇశ్రాయేలు ప్రజలు ఇలా అడిగారు: “బెన్యామీను ప్రజలు మా బంధువులు. మళ్లీ మేము వారిని ప్రతిఘటించడానికి వెళ్లవలెనా? లేకపోతే మేము యుద్ధం ఆపివేయవలెనా?”

యెహోవా, “వెళ్లండి, రేపు వారిని ఓడించేందుకు నేను సహాయం చేస్తాను” అన్నాడు.

29 తర్వాత ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరం పరిసరాలలో కొందరు మనుష్యులను దాచి ఉంచింది. 30 మూడో రోజున ఇశ్రాయేలు సైన్యం గిబియా నగరంతో యుద్ధానికి తలపడింది. అంతకు మునుపు చేసినట్లుగా, వారు యుద్ధ సన్నద్ధులయ్యారు. 31 బెన్యామీను సైన్యం గిబియా నగరం వెలుపలికి వచ్చింది, ఇశ్రాయేలు సైనికుల్ని ఎదుర్కొనడానికి. ఇశ్రాయేలు సైన్యం వెనుకకు మరలింది. బెన్యామీను సైన్యం తమను తరుముకు రావాలని అలా చేసింది. ఈ విధంగా బెన్యామీను సైన్యం నగరానికి చాలా దూరంలో ఉండాలని మాయోపాయం పన్నబడింది.

బెన్యామీను సైన్యం, తాము పూర్వం చేసినట్లుగా, ఇశ్రాయేలు సైనికుల్ని చంపడం మొదలు పెట్టింది. ఇశ్రాయేలుకి చెందిన సుమారు ముఫ్పై మందిని చంపివేయడం జరిగింది. పొలాలలో ఉండేవారిని కొందరిని చంపివేశారు. రాజమార్గం మీద ఉన్న వారిని కొందరిని చంపివేశారు. ఒక రాజమార్గం బేతేలు నగరానికి వెళుతుంది. మరొక రాజమార్గం గిబియా నగరానికి వెళుతుంది. 32 “పూర్వంలా మనం జయిస్తున్నాము” అని బెన్యామీను మనుష్యులు అనుకున్నారు.

ఇశ్రాయేలు మనుష్యులు పరుగు పెట్టుచున్నారు. కాని అదొక యుక్తి, బెన్యామీను మనుష్యులు తమ నగరమునుండి రాజమార్గం మీదికి రావాలని వారు అభిలాషించారు. 33 అందువల్ల అందరు మగవాళ్లూ పరుగెత్తారు. వారు బయల్తామారు అనే చోట ఆగారు. ఇశ్రాయేలుకి చెందిన కొందరు మనుష్యులు గిబియాకి పడమరగా దాగుకొని ఉన్నారు. వారు తాము దాగిన స్థలములనుండి పరుగెత్తి గిబియాను ఎదుర్కొన్నారు. 34 ఇశ్రాయేలుకి చెందిన సుశిక్షితులైన పదివేల మంది సైనికులు గిబియా నగరాన్ని ఎదుర్కొన్నారు. యుద్ధం చాలా ఘోరంగా ఉంది. కాని బెన్యామీను సైన్యానికి ఏమి భయంకరమైన సంఘటన జరుగుతుందో తెలియదు.

35 ఇశ్రాయేలు సైన్యాన్ని ఉపయోగించి యెహోవా బెన్యామీను సైన్యాన్ని ఓడించాడు. ఆనాడు ఇశ్రాయేలు సైన్యం ఇరవై అయిదువేల వంద మంది బెన్యామీను సైనికులను చంపివేసింది. ఆ సైనికులందరూ యుద్ధానికి తర్ఫీదు పొందినవారే. 36 అందువల్ల బెన్యామీను ప్రజలు తాము ఓడిపోయినట్లుగా గ్రహించారు.

ఇశ్రాయేలు సైన్యం వెనుదిరిగింది. వారు ఎందుకు వెనుదిరిగారనగా, అశ్చర్యకరమైన దాడిమీద వారు ఆధారపడి ఉన్నారు. గిబియా వద్ద వారి మనుష్యులు కొందరు దాగి ఉన్నారు. 37 దాగివున్న మనుష్యులు గిబియా నగరం వైపు హడావిడిగా పోయారు. వారు అటూ ఇటూ వెళ్లి నగరంలో వున్న ప్రతివాడినీ కత్తులతో చంపివేశారు. ఇప్పుడు 38 ఇశ్రాయేలు మనుష్యులు దాగివున్న మనుష్యుల ద్వారా ఒక యుక్తిపన్నారు. దాగివున్న మనుష్యులు ఒక ప్రత్యేక సూచన పంపాలి. ఒక పెద్ద పొగమేఘం వారు కల్పించాలి.

39-41 బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైనికుల్ని సుమారు ముఫ్పై మందిని చంపారు. అందువల్ల, బెన్యామీను మనుష్యులు ఇలా అన్నారు; “మునుపటివలె మేము జయిస్తున్నాము” కాని అప్పుడు ఒక పెద్ద పొగ మేఘం నగరంనుండి వెలువడింది. బెన్యామీను మనుష్యులు చుట్టూ తిరిగి పొగచూశారు. నగరమంతా దగ్ధమవుతోంది. అప్పుడు ఇశ్రాయేలు సైన్యం పరుగిడిపోవడం ఆపివేశారు. వారు చుట్టు తిరిగి యుద్ధం చేయసాగారు. బెన్యామీను ప్రజలు భయపడ్డారు. అప్పుడు తమకు భయంకరమైన విషయం జరిగినట్లుగా వారు తెలుసుకున్నారు.

42 అందువల్ల బెన్యామీను సైన్యం ఇశ్రాయేలు సైన్యంనుంచి పారిపోయింది. వారు ఎడారివైపు పారిపోయారు. కాని వారు యుద్ధం నుంచి తప్పించుకొనలేకపోయారు. ఇశ్రాయేలు మనుష్యులు తమ నగరాలనుండి వెలుపలికి వచ్చి వారిని చంపారు. 43 ఇశ్రాయేలు మనుష్యులు బెన్యామీను మనుష్యుల్ని చుట్టు ముట్టారు. వారిని వెంటాడసాగారు. వారిని ఆగనీయకుండా తరిమి, గిబియా తూర్పు ప్రదేశాన వారిని వారు ఓడించారు. 44 అందువల్ల బెన్యామీను సైన్యానికి చెందిన పద్దెనిమిది వేలమంది బలవంతులైన వీరయోధులు చంపబడ్డారు.

45 బెన్యామీను సైన్యం ఎడారి వైపుకి పరుగెత్త సాగింది. రిమ్మోనుబండ వద్దకు వారు పరుగెత్తారు. కాని ఇశ్రాయేలు సైన్యం బెన్యామీను తాలూకు ఐదువేల మంది వీరుల్ని, రాజమార్గం పక్కనున్న వారిని చంపింది. బెన్యామీను మనుష్యుల్ని వారు వెంటాడసాగారు. గిదోము అనే పేరుగల ప్రదేశం దాకా వారిని వెంటాడారు. అక్కడ ఇశ్రాయేలు సైన్యం బెన్యామీనుకు చెందిన రెండువేల మందిని చంపివేసింది.

46 ఆనాడు, బెన్యామీను సైన్యంలోని ఇరవై ఐదువేల మంది మనుష్యులు చంపబడ్డారు. వారందరూ తమ ఖడ్గాలతో వీరోచితంగా పోరాడారు. 47 కాని బెన్యామీను తాలూకు ఆరువందల మంది ఎడారికి పారిపోయారు. వారు రిమ్మోను బండ అనే ప్రదేశంవరకు వెళ్లి, అక్కడ నాలుగు నెలల పాటు ఉన్నారు. 48 ఇశ్రాయేలు మనుష్యులు బెన్యామీను దేశానికి తిరిగి వెళ్లారు. ఎదురైన భూమిలోని ప్రతి మనిషిని వారు చంపారు. వారు జంతువులనన్నిటినీ చంపారు. తమకు కనిపించిన వాటిని అన్నిటినీ వారు నాశనం చేశారు. వారు వచ్చిన ప్రతి నగరాన్నీ దగ్ధం చేశారు.

అపొస్తలుల కార్యములు 24

ఫేలిక్సు సమక్షంలో విచారణ

24 అయిదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయ, కొంతమంది పెద్దలతో, తెర్తుల్లు అనబడే న్యాయవాదితో కలిసి కైసరియ చేరుకున్నాడు. పౌలు పట్ల తాము చేయదలచిన నేరారోపణల్ని రాష్ట్రాధిపతి ముందు ఉంచాడు. తెర్తుల్లు తన వాదనను ప్రారంభిస్తూ, “మీ పాలనలో చాలాకాలం శాంతంగా జీవించాము. ఇది మా అదృష్టం. మీ ముందు చూపువల్ల ఈ దేశంలో ఎన్నో సంస్కరణలు జరిగాయి.

“మహా ఘనత పొందిన ఫేలిక్సు ప్రభూ! మీరు చేసిన వాటిని అన్ని ప్రాంతాల్లో ఉన్న మా ప్రజలు, ఎంతో కృతజ్ఞతతో, సంపూర్ణంగా అంగీకరిస్తున్నారు. మిమ్మల్ని ఎక్కువగా విసిగించటం మాకు ఇష్టం లేదు. కనుక క్లుప్తంగా చెపుతాము. మేము చెప్పేది మాపై దయ ఉంచి వినమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇతడు సమస్యలు, కష్టాలు కలిగిస్తాడని మాకు తెలిసింది. ప్రపంచంలో ఉన్న యూదులందరిలో ఇతడు అల్లర్లు లేపాడు. ఇతడు కుట్రలు పన్నే నజరేతు జాతికి నాయకుడు. ఇతడు దేవాలయాన్ని అపవిత్రం చెయ్యటానికి ప్రయత్నించాడు. [a] మీరితణ్ణి విచారిస్తే మేము చేసిన ఆరోపణల యొక్క నిజానిజాలు మీకే తెలుస్తాయి” అని అన్నాడు. న్యాయస్థానంలో యూదులందరూ ఈ ఆరోపణలు నిజమని చెబుతూ, తెర్తుల్లు వాదనను బలపరిచారు.

పౌలు నిర్దోషినని ఫేలిక్సుముందు చెప్పుకొనటం

10 రాష్ట్రాధిపతి పౌలును మాట్లాడమని సంజ్ఞ చేసాడు. పౌలు ఈ విధంగా మాట్లాడటం మొదలు పెట్టాడు: “మీరు ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నారు. అందువల్ల నేను ఆనందంగా నా నిర్దోషత్వం నిరూపిస్తాను. 11 నేను ఆరాధించటానికి యెరూషలేము వెళ్ళి యింకా పన్నెండు రోజులు కాలేదు. నేను చెబుతున్నదానిలోని నిజానిజాలు మీరు సులభంగా విచారించవచ్చు. 12 నాపై నేరారోపణ చేసిన వీళ్ళు నేను మందిరంలో వాదిస్తుండగా చూసారా? లేదు. సమాజమందిరంలో కాని పట్టణంలో మరెక్కడైనా కాని, నేను ప్రజల్ని పురికొల్పటం వీళ్ళు చూసారా? లేదు. 13 వీళ్ళు ప్రస్తుతం నాపై మోపుతున్న నేరాల్ని నిరూపించలేరు.

14 “వాళ్ళు, దేన్ని వేరొక మతంగా పరిగణిస్తారో దాన్ని నేను అనుసరిస్తున్నానని ఒప్పుకుంటాను. ఈ మార్గాన్ననుసరించి నేను మా పూర్వికుల దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. పైగా, ధర్మశాస్త్రంలో వ్రాయబడినవాటిని, మన ప్రవక్తలు వ్రాసిన వాటిని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను. 15 వాళ్ళలాగే నాకూ దేవుడంటే నమ్మకం ఉంది. వాళ్ళలాగే, సన్మార్గుడు, దుర్మార్గుడు బ్రతికి వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. 16 అందువలన నా ఆత్మను దేవుని దృష్టిలో, మానవుని దృష్టిలో మలినం కాకుండా ఉంచుకోవటానికి ఎప్పుడూ మనసారా ప్రయత్నిస్తున్నాను.

17 “పేదవాళ్ళకు డబ్బు దానం చెయ్యాలని, దేవునికి కానుకలివ్వాలని ఎన్నో ఏండ్ల తర్వాత నేను యెరూషలేముకు వచ్చాను. 18 నేనీ కార్యాలు మందిరావరణంలో చేస్తుండగా వాళ్ళు చూసారు. నేను శాస్త్రయుక్తంగా శుభ్రమయ్యాను. నా వెంట ప్రజా సమూహం లేదు. నేను ఏ అల్లర్లు మొదలు పెట్టలేదు. 19 కాని ఆసియనుండి అక్కడికి వచ్చిన కొందరు యూదులకు నేను నేరం చేసానని అనిపిస్తే, యిక్కడికి వచ్చి నేరారోపణ చేయవలసి ఉంది. 20 నేను మహాసభ ముందు నిలుచున్నప్పుడు నాలో ఏ అపరాధం కనిపెట్టారో ఇక్కడ నిలుచున్నవాళ్ళను చెప్పమనండి. 21 ఔను! నేను ఒకటి చేసాను. వాళ్ళ సమక్షంలో నిలుచొని బిగ్గరగా ‘చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని నమ్మినందుకు మీ ముందు ఈ రోజు నేరస్థునిగా నిలుచున్నాను’ అని అన్నాను. ఇది తప్ప నేనేమీ చెయ్యలేదు.”

22 యేసు ప్రభువు మార్గం బాగా తెలిసిన ఫేలిక్సు సభను ముగిస్తూ, “సహస్రాధిపతి లూసియ వచ్చాక నీ విషయం నిర్ణయిస్తాను” అని అన్నాడు. 23 శతాధిపతితో, “పౌలును కాపలాలో ఉంచు! కాని కొంత స్వేచ్ఛనివ్వు. అతని స్నేహితులు అతనికి ఏదైనా ఇవ్వటానికి వస్తే వాళ్ళనాపవద్దు” అని అన్నాడు.

పౌలు ఫేలిక్సుతో, అతని భార్యతో మాట్లాడటం

24 కొద్ది రోజుల తర్వాత ఫేలిక్సు తన భార్య ద్రుసిల్లతో వచ్చాడు. ద్రుసిల్ల యూదురాలు. ఫేలిక్సు పౌలును పిలిపించాడు. “యేసు క్రీస్తులో విశ్వాసం” అనే విషయాన్ని గురించి, పౌలు మాట్లాడాడు. ఫేలిక్సు విన్నాడు. 25 పౌలు సన్మార్గాన్ని గురించి, మనో నిగ్రహాన్ని గురించి, రానున్న తీర్పును గురించి చెప్పటం విని ఫేలిక్సు భయపడి, “ఇప్పటికి చాలించి, వెళ్ళు! నాకు వీలున్నప్పుడు నిన్ను మళ్ళీ పిలిపిస్తాను” అని అన్నాడు. 26 కాని తనకు లంచమిస్తాడని ఆశించి అతణ్ణి మాటిమాటికి పిలిపించి అతనితో మాట్లాడేవాడు.

27 రెండు సంవత్సరాలు గడిచాక పోర్కియు ఫేస్తు ఫేలిక్సు స్థానంలో వచ్చాడు. ఫేలిక్సు యూదులకు ఒక ఉపకారం చెయ్యాలనే ఉద్దేశంతో పౌలును కారాగారంలోనే ఉంచాడు.

యిర్మీయా 34

సిద్కియాకు హెచ్చరిక

34 యిర్మీయాకు యెహోవా నుండి వర్తమానం వచ్చింది. బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేముతోను, దాని చుట్టు పట్ల నున్న పట్టణాలతోను యుద్ధం చేసే సమయంలో ఈ వర్తమానం వచ్చింది. నెబుకద్నెజరు పాలన క్రింద ఉన్న మహా సామ్రాజ్యంలోని దేశాల, సామంతుల సైన్యంతో పాటు తన సైన్యం యావత్తూ నెబుకద్నెజరుతో యెరూషలేమును ముట్టడించుటకు కదలి వచ్చింది.

ఆ వర్తమానం ఇలా వుంది: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యిలా అంటున్నాడు: యిర్మీయా, యూదా రాజైనా ‘సిద్కియా వద్దకు వెళ్లి ఈ సందేశాన్ని అందజేయి: సిద్కియా, యెహోవా ఈ విధంగా తేలియ జెప్పుచున్నాడు: యెరూషలేము నగరాన్ని అతి త్వరలో నేను బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. అప్పుడతను దానిని తగలబెడతాడు! సిద్కియా, బబులోను రాజు నుండి నీవు తప్పించుకోలేవు. నీవు ఖచ్చితంగా పట్టుబడి అతనికి అప్పగింపబడతావు. బబులోను రాజును నీ కళ్లతో స్వయంగా చూస్తావు.! అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడుతాడు. నీవు బబులోనుకు వెళతావు. కాని, యూదా రాజువైన సిద్కియా! యెహోవా వాగ్దానం శ్రద్ధగా వినుము. నిన్ను గురించి యెహోవా యిలా చెప్పుచున్నాడు: నీవు కత్తిచేత చంపబడవు. నీవు ప్రశాంతంగా చనిపోతావు. నీ కంటె ముందు ఏలిన రాజులైన నీ పూర్వీకులు చనిపోయినప్పుడు వారి గౌరవార్థం ప్రజలు దహన సంస్కారాలు జరిపినారు. అదే రీతిగా ప్రజలు నీ గౌరవార్థం కూడా దహన క్రియలు జరుపుతారు. వారు నీ కొరకు విలపిస్తారు. “అయ్యో, మా నాయకుడా!” అని విచారిస్తారు. నాకై నేనే ఈ వాగ్దానం చేస్తున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.

యెహోవా యొక్క ఈ సమాచారాన్ని యెరూషలేములో వున్న సిద్కియాకు యిర్మీయా ఇచ్చాడు. అది బబులోను సైన్యం యెరూషలేముతో యుద్ధం చేస్తున్న సమయం. కైవసం చేసికొనని యూదా నగరాలతో కూడ బబులోను సైన్యం పోరాడుతూ ఉంది. అవి లాకీషు, అజేకా అనే నగరాలు. చుట్టూ ప్రాకారాలతో పటిష్టం చేయబడిన యూదా రాజ్య నగరాలలో అవి రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ప్రజలు ఒప్పందాన్ని ఉల్లంఘించుట

హెబ్రీ బానిసలకు స్వేచ్ఛ నివ్వాలని రాజైన సిద్కియా యెరూషలేము ప్రజలందరితో ఒక ఒడంబడిక చేశాడు. సిద్కియా ఆ ఒడంబడిక చేసిన పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు వినవచ్చింది. ప్రతి పౌరుడు తనవద్ద ఉన్న హెబ్రీ బానిసలను విడుదల చేయవలసి ఉంది. స్త్రీ పురుష భేదం లేకుండ హెబ్రీ బానిసలందరూ విడుదల చేయబడాలి. యూదా వంశీయులలో ఎవ్వరినీ ఏ ఒక్కరూ బానిసగా ఉంచుకోరాదు. 10 అందువల్ల యూదా నాయకులు, ప్రజలు ఈ ఒడంబడికను అంగీకరించారు. ప్రతి పౌరుడు తన వద్దగల హెబ్రీ స్త్రీ, పురుష బానిసలను విడుదలచేయాలి. వారిని ఎంత మాత్రము బానిసలుగా పని చేయించరాదు. అందుకు ప్రతి పౌరుడు ఒప్పుకున్నాడు. దానితో బానిసలంతా స్వేచ్ఛగా వదిలివేయబడ్డారు. 11 కాని ఆ తరువాత[a] బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.

12 పిమ్మట యెహోవా వాక్కు యిర్మీయాకు చేరింది: 13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “‘యిర్మీయా, బానిసలుగా ఉన్న మీ పూర్వీకులను ఈజిప్టు నుండి నేను తీసుకొని వచ్చాను. నేనా పని చేసినప్పుడు, వారితో నేనొక నిబంధన చేసినాను. 14 మీ పితరులతో నేనిలా చెప్పాను: “ప్రతి ఏడు సంవత్సరాల అనంతరం ప్రతి పౌరుడు తన వద్ద ఉన్న హెబ్రీ బానిసలను వదిలి వేయాలి. మీకు అమ్ముడు పోయిన మీ సాటి హెబ్రీయుడు మీ వద్దనుంటే, అతడు ఆరు సంవత్సరాల పాటు సేవ చేసినాక అతనిని మీరు వదిలివేయాలి.” కాని మీ పూర్వీకులు నామాట వినలేదు. నన్ను లక్ష్యపెట్టలేదు. 15 కొద్ది కాలంక్రిందట మీరు మీ హృదయాలను మార్చుకొని ఏది సక్రమమైనదో దానిని చేయటానికి సిద్ధమయ్యారు. బానిసలుగా ఉన్న సాటి హెబ్రీయులకు మీలో ప్రతి ఒక్కడూ స్వేచ్ఛ నిచ్చాడు. నా నామాన పిలువబడే నా ఆలయంలో నా ముందు ఆ మేరకు మీరొక ఒడంబడిక కూడ చేశారు. 16 కాని ఇప్పుడు మీరు మనస్సు మార్చుకున్నారు. మీరు నా పేరును గౌరవించరని నిరూపించుకున్నారు. ఇది మీరెలా చేశారు? వదిలి పెట్టిన ప్రతి స్త్రీ, పురుష బానిసను మీలో ప్రతివాడూ తిరిగి తీసుకున్నారు. వారు తిరిగి బానిసలయ్యేలా ఒత్తిడి చేశారు.’

17 “అందుచేత యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రజలారా, నాకు మీరు విధేయులుగా లేరు. మీరు మీ సాటి హెబ్రీయులకు స్వేచ్ఛ నివ్వలేదు. మీరు నా ఒడంబడికను ఉల్లంఘించిన కారణంగా నేను స్వేచ్ఛ నిస్తాను. కత్తికి, కరువుకు, భయంకర రోగాలకు నేను స్వేచ్ఛ నిస్తాను. అవి మిమ్మల్ని చంపివేస్తాయి.’” ఇదే యెహోవా వాక్కు. “‘మిమ్మల్ని గురించి చెప్పగానే ప్రపంచ రాజ్యాలన్నీ ఆశ్చర్యం చెందేలా మీకు మహా విపత్తు కలుగజేస్తాను. 18 నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే.[b] 19 యూదా, యెరూషలేము నాయకులు, న్యాయస్థాన అధికారులు, మరియు యాజకులూ, రాజ్యంలోని ప్రజలు నా ముందు ఒడంబడిక చేసి కోడెదూడ ముక్కల మధ్య నడచిన వారిలో ఉన్నారు. 20 కావున ఆ ప్రజలను వారి శత్రువులకు అప్పగిస్తాను. వారిని చంప తలపెట్టిన ప్రతివానికి వారిని వదిలి వేస్తాను. వారి శవాలు పక్షులకు, క్రూర మృగాలకు ఆహారమవుతాయి. 21 యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి[c] నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను. 22 బబులోను సైన్యాన్ని యెరూషలేముకు పిలిపిస్తాను.’ ఇదే యెహోవా వాక్కు ‘ఆ సైన్యం యెరూషలేముతో పోరాడుతుంది. వారు నగరాన్ని పట్టుకొని, దానికి నిప్పుపెట్టి తగలబెడతారు. నేను యూదా రాజ్యంలోని నగరాలను నాశనం చేస్తాను. ఆ నగరాలు వట్టి ఎడారులవలె మారి పోతాయి. మనుష్యులెవ్వకూ అక్కడ నివసించరు.’”

కీర్తనలు. 5-6

సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, నా మాటలు ఆలకించుము.
    నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
నా రాజా, నా దేవా
    నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
    సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.

యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
    చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
    ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
    ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.

యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
    యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
    కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
    అది నాకు తేటగా చూపించుము.
ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
    వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
    ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
    వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
    కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
    ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
    అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.

సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
    కోపగించి నన్ను శిక్షించవద్దు.
యెహోవా, నా మీద దయ ఉంచుము.
    నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
    నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
    నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
    సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
    నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
    నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
    ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
    ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.

చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
    ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.

10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
    వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International