M’Cheyne Bible Reading Plan
లేవీ వంశపు వ్యక్తి మరియు అతని దాసి
19 ఆ సమయమున, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. చాలా దూరానవున్న కొండదేశమైన ఎఫ్రాయిములో లేవీ వంశమునకు చెందిన వ్యక్తి ఉండెను. అతనికి ఒక దాసి[a] వుండెను. ఆమె అతనికి భార్యవలె ఉండెను. యూదాలోని బేత్లెహేముకు ఆ దాసి చెందింది. 2 కాని ఆ దాసి లేవీ వంశపు వ్యక్తితో ఒక ఒడంబడిక చేసుకొంది. ఆమె అతనిని విడిచి పెట్టి, యూదాలోని బేత్లెహేములో ఉన్న తన తండ్రి వద్దకు వెళ్లింది. అక్కడ ఆమె నాలుగు నెలలపాటు ఉంది. 3 తర్వాత ఆమె భర్త ఆమెకోసం వచ్చాడు. ఆమెతో అతను ప్రీతిపూర్వకంగా మాటలాడాడు. ఆమె మరల తన వద్దకు రావాలని అలా మాటలాడాడు. అతను తన సేవకుని, రెండు గాడిదలను తీసుకొని వెళ్లాడు. లేవీ వంశపు వ్యక్తి ఆమె తండ్రి ఇంటికి వచ్చాడు. లేవీ వంశపు వ్యక్తిని చూసి ఆమె తండ్రి బయటికి వచ్చి అతనిని అభినందించాడు. ఆమె తండ్రికి చాలా సంతోషం కలిగింది. 4 ఆ స్త్రీ తండ్రి లేవీ వ్యక్తిని ఇంటిలోనికి తీసుకుని వెళ్లాడు. లేవీ వ్యక్తి మామ అతనిని ఇంట ఉండమని కోరాడు. అందువల్ల ఆ లేవీ వ్యక్తి మూడురోజులున్నాడు. అతను తిని, త్రాగి, మామ ఇంట నిదురించాడు.
5 నాలుగవ రోజున, తెల్లవారుజామున వారు మేల్కొన్నారు. లేవీ వంశపు వ్యక్తి బయలుదేరే సన్నాహంలో వున్నాడు. కాని ఆ యువతి తండ్రి తన అల్లుడితో ఇలా అన్నాడు: “మొట్టమొదట ఏమైనా తిను. నీవు తిన్న తర్వాత వెళ్లవచ్చును.” 6 అందువల్ల లేవీ వంశపు వాడు అతని మామరు తినుటకు, త్రాగుటకు కలిసి కూర్చొన్నారు. ఆ తర్వాత మామ అతనితో, “ఈ సాయంకాలందాకా ఇక్కడే వుండి, విశ్రాంతి తీసుకుని, ఆనందించి వెళ్లవచ్చు” అన్నాడు. అందువల్ల ఆ ఇద్దరూ కలసి తిన్నారు. 7 లేవీ వంశపువాడు వెళ్లాలని లేచాడు. కాని అతని మామ ఆ రాత్రికి ఉండిపొమ్మని అతనిని వేడుకొన్నాడు.
8 తర్వాత, ఐదవరోజున తెల్లవారు జామునే లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతడు బయలుదేరే సన్నాహంలో ఉన్నాడు. కాని ఆ స్త్రీ తండ్రి అల్లుడితో ఇలా చెప్పాడు: “మొదట ఏదైనా తిను. నిశ్చింతగా ఈ సాయంకాలందాకా ఉండు.” కనుక వాళ్లిద్దరూ మళ్లీ కలసి తిన్నారు.
9 తర్వాత లేవీ వంశపువాడు, అతని దాసి అతని సేవకుడు బయలుదేరడానికి లేచారు. కాని ఆ యువతి తండ్రి, “చాలా ప్రొద్దు పోయింది. రోజు చాలావరకు అయిపోయింది. కనుక రాత్రికి ఇక్కడే వుండి సంతోషమనుభవించు. రేపు ఉదయం నీవు తెల్లవారుజామునే మేల్కొని నీ తోవను వెళ్లు” అన్నాడు.
10 కాని లేవీ వంశపువాడు మరోరాత్రికి అక్కడ వుండదలచుకోలేదు. అతను తన రెండు గాడిదలను, తన దాసిని వెంటబెట్టుకున్నాడు. యెబూసు నగరాన్ని సమీపించాడు. (యెరూషలేముకు మరోపేరు యెబూసు). 11 ఆ రోజు చాలావరకు అయిపోయింది. యెబూసు నగరము దగ్గరికి వచ్చారు. అప్పుడు సేవకుడు తన యజమానిని చూసి, “యెబూసు నగరం వద్ద మనము ఆగిపోదాము. ఈ రాత్రికి ఇక్కడే ఉందాము” అన్నాడు.
12 కాని అతని యజమాని అయిన లేవీ వంశపు వాడు, “కాదు, మనము తెలియని నగరం లోపలికి వెళ్లకూడదు. అక్కడి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు కారు. గిబియా నగరానికి మనము వెళదాము” అన్నాడు. 13 లేవీ వంశపు వ్యక్తి, “పదండి, గిబియా లేక రామా నగరానికి వెళదాము. ఈ రెండు నగరాలలో ఒక దానిలో మనము ఈ రాత్రి గడుపుదాము” అన్నాడు.
14 అందువల్ల లేవీ వంశపువాడు, అతనితో ఉన్న మనుష్యులు ముందుకు ప్రయాణం చేశారు. గిబియా నగరమును వారు ప్రవేశించే సమయానికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. బెన్యామీను వంశీయుల ప్రదేశంలో గిబియా ఉంది. 15 అందువల్ల వారు గిబియాలో ఆగిపోయారు. ఆ నగరములో ఆ రాత్రికి ఉండాలని వారనుకున్నారు. వారు నగరం మధ్యకు వచ్చి అక్కడ కూర్చున్నారు. కాని ఎవ్వరూ వారిని తమ ఇంటికి రమ్మని పిలవలేదు.
16 ఆ సాయంకాలం పొలంనుంచి ఒక వృద్ధుడు నగరములోనికి వచ్చాడు. అతని ఇల్లు కొండ దేశమయిన ఎఫ్రాయిములో ఉంది. కాని ఇప్పుడతను గిబియా నగరములో నివసిస్తున్నాడు. (గిబియా మనుష్యులు బెన్యామీను వంశమునకు చెందిన వారు). 17 ఆ వృద్ధుడు లేవీ వంశపువాడయిన ఆ ప్రయాణికుని చూశాడు. ఆ వృద్ధుడు, “మీరెక్కడికి వెళ్తున్నారు? ఎక్కడినుంచి వచ్చారు?” అని ప్రశ్నించాడు.
18 లేవీ వంశపువాడు ఇలా సమాధానం చెప్పాడు: “మేము యూదాలోని బేత్లెహేమునుంచి ప్రయాణం చేస్తున్నాము. మేము స్వగృహానికి వెళ్తున్నాము. అయితే ఈ రాత్రి ఎవరూ మమ్ములను ఉండమని ఆహ్వానించలేదు. ఎఫ్రాయిము కొండదేశానికి వెనకవున్న వాళ్లము మేము. 19 మా గాడిదలకు తగినంత గడ్డి ఆహారం వున్నాయి. మాకు రొట్టె, మద్యము వున్నాయి. అంటే, నాకు, యువతికి మరియు నా సేవకుడికి. మాకేమీ అవసరము లేదు.”
20 వృద్ధుడు ఇలా చెప్పాడు: “నీవు మా ఇంట్లో ఉండవచ్చు. నీకు కావలసిందంతా నేనిస్తాను. నగర మధ్యలో మాత్రం రాత్రివేళ ఉండకూడదు.” 21 తర్వాత లేవీ వంశపువానిని, అతని మనుష్యుల్ని అతను తన ఇంటికి తీసుకొని వెళ్లాడు. అతని గాడిదలకు ఆయన మేత పెట్టాడు. వారు కాళ్లు కడుగుకున్నారు. ఆ తర్వాత తినుటకు, త్రాగుటకు అతడు వారికిచ్చాడు.
22 ఆ లేవీ వంశపు వ్యక్తి, అతనితో వున్న మనుష్యులు సంతోషంగా వుండగా, ఆ నగరానికి చెందినవారు కొందరు ఇంటిని చుట్టుముట్టారు. వారు దుర్జనులు. వారు తలుపు కొట్టసాగారు. ఆ ఇంటి స్వంతదారైన వృద్ధుని వుద్దేశించి కేకలు వేయసాగారు. వారు ఇలా అన్నారు; “మీ ఇంటికి వచ్చిన ఆ వ్యక్తిని వెలుపలికి తీసుకొని రా. మేమతనితో సంభోగింపదలచాము.”
23 వృద్ధుడు వెలుపలికి పోయి ఆ దుర్జనులతో మాటలాడాడు: “వద్దు, నా స్నేహితులారా! అటువంటి చెడ్డ పనులు చేయవద్దు. అతను మా ఇంటి అతిథి. ఈ మహా పాపకృత్యం మీరు చేయవద్దు అన్నాడు. 24 ఇదుగో చూడండి. ఇక్కడ నా కుమార్తె ఉంది. ఆమెకి ఇంతకు మునుపెన్నడూ సంభోగమంటే ఏమో తెలియదు. ఆమెను నేను వెలుపలికి తీసుకు వస్తాను. మరియు అతని దాసిని కూడ బయటికి తీసుకు వస్తాను. మీ ఇష్టమొచ్చినట్లు వారికి చేయవచ్చు. కాని మా యింటికి వచ్చిన వ్యక్తితో పాపకృత్యం చేయవద్దు” అన్నాడు.
25 కాని ఆ చెడ్డ మనుష్యులు వృద్ధుని మాటలు వినదలచుకోలేదు. అందువల్ల లేవీ వంశపువాడు తన దాసిని వెలుపలికి తీసుకువెళ్లి, ఆమెను చెడ్డవారి చెంత ఉంచాడు. ఆ చెడ్డవారు ఆ రాత్రి అంతా ఆమెను బలాత్కరించారు. తర్వాత తెల్లవారుజామున ఆమెను విడిచిపెట్టారు. 26 తెల్లవారుజామున తన యజమాని నివసిస్తున్న ఇంటికి ఆమె వచ్చింది. ఆమె తలుపు ముందు పడిపోయింది. ఆమె అక్కడే వెలుతురు వచ్చేవరకు పడివుంది.
27 ఉదయాన లేవీ వంశపువాడు మేల్కొన్నాడు. అతను ఇంటికి వెళ్లాలని అనుకొన్నాడు. వెలుపలికి వెళ్లుటకుగాను తలుపు తెరిచాడు. గడపవద్ద ఒక చేయి ఉంది. అక్కడ అతని దాసి ఉంది. 28 లేవీ వంశపువాడు, “లే, మనం వెళ్లిపోదాం” అన్నాడు. కాని ఆమె సమాధానం చెప్పలేదు. ఆమె చనిపోయింది.
లేవీ వంశపు వాడు తన దాసిని గాడిదమీద వేసుకొని ఇంటికి వెళ్లాడు. 29 అతను ఇల్లు చేరుకోగానే ఒక కత్తి తీసుకొని దాసిని పన్నెండు భాగాలుగా ఖండించాడు. తర్వాత అతను ఆ పన్నెండు భాగాలను ఇశ్రాయేలు ప్రజలు నివసించిన అన్ని ప్రదేశాలకు పంపించాడు. 30 ఇది చూసిన వారు, “ఇశ్రాయేలులో ఇంతకు మునుపు ఎన్నడూ ఇలా జరగలేదు, ఈజిప్టునుంచి మనం వచ్చిన నాటినుండి మనం ఇప్పటివరకు ఇలాంటిది చూచి వుండలేదు. దీన్ని గురించి చర్చించి మనమేమి చేయాలో చెప్పండి” అన్నారు.
23 పౌలు మహాసభ వైపు సూటిగా చూసి, “సోదరులారా! నేను ఈనాటి వరకు నిష్కల్మషంగా జీవించాను. దీనికి దేవుడే సాక్షి” అని అన్నాడు. 2 ఈ మాటలు అనగానే ప్రధాన యాజకుడైన అననీయ, పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళతో, “అతని మూతి మీద కొట్టి నోరు మూయించండి” అని ఆజ్ఞాపించాడు. 3 అప్పుడు పౌలు అతనితో, “దేవుడు నీ నోరు మూయిస్తాడు. నీవు సున్నం కొట్టిన గోడవి. ధర్మశాస్త్రం ప్రకారం నా మీద తీర్పు చెప్పటానికి నీవక్కడ కూర్చున్నావు. కాని నన్ను కొట్టమని ఆజ్ఞాపించి నీవా ధర్మశాస్త్రాన్నే ఉల్లంఘిస్తున్నావు” అని అన్నాడు.
4 పౌలు ప్రక్కన నిలుచున్నవాళ్ళు, “దేవుని ప్రధానయాజకుని అవమానించటానికి నీకెంత ధైర్యం?” అని అన్నారు.
5 అందుకు పౌలు, “సోదరులారా! ప్రధానయాజకుడని నాకు తెలియదు. మన లేఖనాల్లో యిలా వ్రాయబడివుంది, ‘ప్రజానాయకుల్ని గురించి చెడుగా మాట్లాడరాదు.’”(A)
6 పౌలుకు వాళ్ళలో కొందరు సద్దూకయ్యులని, మరి కొందరు పరిసయ్యులని తెలుసు. అందువల్ల అతడు ఆ మహాసభలో బిగ్గరగా, “సోదరులారా! నేను పరిసయ్యుణ్ణి. నా తండ్రి పరిసయ్యుడు. నేను యిక్కడ నిందితునిగా నిలుచోవటానికి కారణం చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారన్నదే నాలోని ఆశ” అని అన్నాడు.
7 అతడీ మాట అనగానే, సద్దూకయ్యులకు, పరిసయ్యులకు సంఘర్షణ జరిగి వాళ్ళు రెండు భాగాలుగా చీలిపోయారు. 8 సద్దూకయ్యులు మనుష్యులు బ్రతికి రారని, దేవదూతలు, ఆత్మలు అనేవి లేవని వాదిస్తారు. కాని పరిసయ్యులు యివి ఉన్నాయి అంటారు. 9 సభలో పెద్ద అలజడి మొదలైంది. పరిసయ్యులకు సంబంధించిన కొందరు పండితులు లేచి బిగ్గరగా వాదిస్తూ, “యితనిలో మాకే తప్పు కనిపించలేదు. దేవదూతో లేక ఆత్మో అతనితో మాట్లాడి ఉండవచ్చు!” అని అన్నారు.
10 సంఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయింది. ఆ రెండు గుంపులు కలిసి, పౌలును చీల్చివేస్తారేమోనని సహస్రాధిపతి భయపడిపొయ్యాడు. అతడు తన సైనికులతో, “వెళ్ళండి! అతణ్ణి వాళ్ళనుండి విడిపించుకొచ్చి కోట లోపలికి తీసుకెళ్ళండి” అని ఆజ్ఞాపించాడు.
11 ఆ రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలుచొని, “ధైర్యంగా ఉండి, నా గురించి నీవు యెరూషలేములో బోధించిన విధంగా రోమాలో కూడా బోధించాలి” అని అన్నాడు.
పౌలును చంపటానికి కుట్ర
12 మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు. 13 నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. 14 వాళ్ళు ప్రధానయాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి, “మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం. 15 కనుక మీరు మహాసభ పక్షాన ‘అతణ్ణి గురించి మేము యింకా విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము’ అని అబద్ధాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు.
16 పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు. 17 పౌలు శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒకటుంది” అని అన్నాడు. 18 శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు!” అని అన్నాడు.
19 సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” అని అడిగాడు.
20 ఆ యువకుడు, “పౌలును గురించి యింకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు. 21 వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతణ్ణి చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు.
22 సహస్రాధిపతి యువకుణ్ణి వెళ్ళమని చెబుతూ, తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు.
పౌలును కైసరియకు పంపటం
23 తదుపరి తన శతాధిపతుల్ని యిద్దర్ని పిలిచి, “రెండు వందల సైనికుల్ని, డెబ్బైమంది గుఱ్ఱపు రౌతుల్ని, బళ్ళేలు ఉపయోగించే రెండు వందల సైనికుల్ని మీ వెంట తీసుకొని ఈ రాత్రి తొమ్మిది గంటలకు కైసరియకు వెళ్ళండి. 24 పౌలుకు గుర్రాన్నిచ్చి రాష్ట్రాధిపతియైన ఫేలిక్సు దగ్గరకు క్షేమంగా పంపండి” అని ఆజ్ఞాపించాడు. 25 సహస్రాధిపతి యిలా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాడు:
26 గౌరవనీయులైన ఫేలిక్సు రాష్ట్రాధిపతికి,
క్లౌదియ లూసియ అభివందనాలు చెప్పి వ్రాయునది,
27 ఇతణ్ణి యూదులు పట్టుకొని చంపబొయ్యారు. కాని, నేను యితడు రోమా పౌరుడు అని తెలుసుకొని నా దళాలతో వెళ్ళి అతణ్ణి రక్షించాను. 28 వాళ్ళెందుకు అతణ్ణి అపరాధి అంటున్నారో తెలుసుకోవాలని అతణ్ణి వాళ్ళ మహాసభకు పిలుచుకు వెళ్ళాను. 29 వాళ్ళు, తమ ధర్మశాస్త్రం విషయంలో యితణ్ణి అపరాధి అంటున్నారని నాకు తెలిసింది. కారాగారంలో ఉంచవలసిన నేరం కాని, మరణదండన వేయవలసిన నేరం కాని ఇతడు చేయలేదు. 30 వాళ్ళు ఇతణ్ణి చంపటానికి కుట్ర పన్నుతున్నారని తెలిసింది. అందువలన వెంటనే మీ దగ్గరకు పంపుతున్నాను. ఇతనిపై నేరారోపణ చేసినవాళ్ళతో ఆ నేరారోపణ మీ సమక్షంలో చెయ్యవచ్చని చెప్పాను.
31 సహస్రాధిపతి ఆజ్ఞాపించినట్లు సైనికులు పౌలును రాత్రి వేళ తమతో పిలుచుకు వెళ్ళి అంతిపత్రికి చేరుకున్నారు. 32 మరుసటి రోజు రౌతుల్ని పౌలు వెంట పంపి, సైనికులు కోటకు తిరిగి వచ్చారు. 33 పౌలుతో వెళ్ళినవాళ్ళు కైసరియ చేరుకొని ఆ ఉత్తరాన్ని, పౌలును, రాష్ట్రాధిపతికి అప్పగించారు.
34 రాష్ట్రాధిపతి ఆ ఉత్తరాన్ని చదివి, “నీవు ఏ ప్రాంతం వాడవు?” అని పౌలును అడిగాడు. అతడు కిలికియ వాడని తెలుసుకొని, 35 “నీపై నేరారోపణ చేసినవాళ్ళు యిక్కడికి వచ్చాక నీ విషయం విచారిస్తాను” అని అన్నాడు. ఆ తర్వాత పౌలును హేరోదు భవనంలో ఉంచి కాపలా కాయమని భటులతో చెప్పాడు.
దేవుని వాగ్దానం
33 యెహోవా నుండి సందేశం రెండవసారి యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా ఇంకను రక్షక భటుని ఆవరణలో బందీయైయున్నాడు. 2 యెహోవా భూమిని సృష్టించాడు. ఆయన దానిని సురక్షితంగా ఉంచుతాడు. ఆ సృష్టికర్త పేరే యెహోవా! యెహోవా ఇలా అంటున్నాడు: 3 “ఓ యూదా, నన్ను ప్రార్థించు. నేను నీకు జవాబిస్తాను. నేను నీకు అతి ముఖ్యమైన రహస్యాలను తెలియజేస్తాను. అవి నీవు ముందెన్నడు విని ఎరుగవు. 4 యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. యెరూషలేములోని ఇండ్ల విషయం, యూదా రాజుల భవనాల గురించి యెహోవా ఈ విషయాలు తెలియజేస్తున్నాడు శత్రువు ఆ ఇండ్లను నేల మట్టం చేస్తాడు. శత్రువు నగర గోడల చుట్టూ పై వరకు దిమ్మలు నిర్మిస్తాడు. శత్రువు కత్తి పట్టి ఈ నగరాల ప్రజలతో యుద్ధం చేస్తాడు.
5 “యెరూషలేము నగరంలో ప్రజలు చాలా చెడు కార్యాలు చేశారు. వారి పట్ల నేను చాలా కోపంగా ఉన్నాను. నేను ఈ పట్టణానికి విముఖుడనైనాను. కావున వారిలో చాలా మందిని చంపివేస్తాను. కల్దీయుల సైన్యం యెరూషలేముతో యుద్ధానికి వస్తుంది. యెరూషలేము నగరంలోని ఇండ్లలో అనేక మంది శవాలు పడి ఉంటాయి.
6 “కాని ఆ నగరంలోని ప్రజలను నేను స్వస్థపరచి వారికి ఉపశమనం కలుగజేస్తాను. వారు శాంతి, రక్షణ కలిగి ఉండేలా చేస్తాను. 7 యూదాను, ఇశ్రాయేలును గతంలో మాదిరిగా మిక్కిలి బలపడేలా చేస్తాను. 8 వారు నాకు విరోధంగా పాపం చేశారు కాని నేను ఆ పాపాన్ని కడిగి వేస్తాను. నాకు విరోధంగా వారు పోరాడారు కాని వారిని క్షమిస్తాను. 9 అప్పుడు యెరూషలేము ఒక అద్భుతమైన స్థలంగా మారి పోతుంది. ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇతర దేశాల ప్రజలు దిగ్భ్రాంతులవుతారు. మరియు నేను ఇశ్రాయేలీయులకు కలుగజేసే క్షేమాన్ని విశ్రాంతిని చూచి వణకుతారు. అనేక మంచి పనులు జరగడం గురించి వారు విన్నప్పుడు ఇది జరుగుతుంది. ఇతర రాష్ట్రాల వారు నేను ఇశ్రాయేలుకు అనుగ్రహించిన మంచి వాటిని గురించి వింటారు.
10 “ప్రజలారా మీరిలా అంటున్నారు, ‘మా దేశం వట్టి ఎడారి అయిపోయింది. మనుష్యులు గాని, జంతుజాలం గాని ఏదీ ఇక్కడ నివసించటం లేదు.’ యెరూషలేము వీధులలోను, యూదా పట్టణాలలోను ఇప్పుడు ప్రశాంతత నెలకొన్నది. కాని త్వరలో అక్కడ సందడి ఏర్పడుతుంది. 11 అక్కడ తిరిగి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. వధూవరుల వేడుకలు నెలకొంటాయి. దేవాలయానికి కానుకలు తెచ్చే జన సందోహాల సందడి వినిపిస్తుంది. ‘సర్వశక్తిమంతుడయిన యెహోవాకు జయగీతం పాడండి! యెహోవా దయామయుడు. ఆయన కరుణ శాశ్వతంగా మనకు లభిస్తుంది!’ అని ప్రజలు అంటారు. యూదాకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. గనుక ప్రజలా మాటలు చెపుతారు. అప్పుడు యూదా తన పూర్వ వైభవం తిరిగి నెలకొంటుంది.” ఇదే యెహోవా వాక్కు.
12 సర్వశక్తిమంతుడయిన యెహోవా ఇలా అంటున్నాడు: “ఈ ప్రదేశం ఇప్పుడు ఖాళీగా వుంది. ఇది నిర్మానుష్యంగా, జంతు సంచారం కూడ లేకుండా ఉంది. కాని యూదా పట్టణాలన్నీ ప్రజలతో నిండిపోతాయి. గొర్రెల కాపరులుంటారు. పచ్చిక బయళ్లు మళ్లీ చిగురిస్తాయి. మందలు పచ్చిక మేసి హాయిగా వాటిలో విశ్రమిస్తాయి. 13 గొర్రెలు తమ ముందు నడుస్తూ ఉండగా, కాపరులు వారి గొర్రెలను లెక్కిస్తారు. మన్యం ప్రాంతంలో, పచ్చిమ కొండవాలు ప్రాంతంలో, నెగేవు ఎడారి ప్రాంతంలో, ఇంకా యూదా పట్టణాలన్నిటిలో ప్రజలు తమ తమ గొర్రెలను లెక్కపెట్టుకుంటూ ఉంటారు.”
మంచి కొమ్మ
14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”
17 యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. 18 లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”
19 యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది. 20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు, 21 నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. 22 కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”
23 యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు: 24 “యిర్మీయా, ప్రజలేమనుకుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయ్యాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.”
25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను. 26 బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన
3 యెహోవా, నాకు ఎందరెందరో శత్రువులు ఉన్నారు
అనేకమంది ప్రజలు నాకు విరోధంగా తిరిగారు.
2 చాలామంది మనుష్యులు నా విషయమై మాట్లాడుతున్నారు. “అతన్ని దేవుడు తప్పించడు!” అని ఆ మనుష్యులు అంటారు.
3 అయితే, యెహోవా, నీవు నాకు కేడెము.
నీవే నా అతిశయం.
యెహోవా, నీవు నన్ను ప్రముఖునిగా[a] చేస్తావు.
4 యెహోవాకు నేను ప్రార్థిస్తాను.
ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబు ఇస్తాడు!
5 నేను పడుకొని విశ్రాంతి తీసుకోగలను, మరి నేను మేల్కొందును.
ఇది నాకు ఎలా తెలుస్తుంది? ఎందుచేతనంటే యెహోవా నన్ను ఆవరించి, కాపాడును గనుక!
6 వేలకు వేలుగా సైనికులు నా చుట్టూ మోహరించి ఉండవచ్చును.
కాని ఆ శత్రువులకు నేను భయపడను.
7 యెహోవా, లెమ్ము[b]
నా దేవా, వచ్చి నన్ను రక్షించుము!
నీవు చాలా బలవంతుడవు! నా దుష్ట శత్రువుల దవడమీద నీవు కొట్టి,
వారి పళ్లన్నీ నీవు విరుగగొడతావు.
8 యెహోవా తన ప్రజలను రక్షించగలడు.
యెహోవా, దయచేసి నీ ప్రజలకు నీవు మంచి సంగతులను జరిగించుము.
సంగీత నాయకునికి: తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
4 నా మంచి దేవా, నేను నిన్ను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇమ్ము.
నా ప్రార్థన ఆలకించి, నా యెడల దయ చూపించుము!
ఎప్పుడైనా నాకు కష్టాలు వస్తే, వాటిని తొలగించుము.[c]
2 ప్రజలారా, ఎన్నాళ్లు మీరు నన్నుగూర్చి చెడ్డమాటలు చెబుతారు?
ప్రజలారా, మీరు నన్ను గూర్చి చెప్పుటకు కొత్త అబద్ధాలకోసం చూస్తూనే ఉంటారు. అలాంటి అబద్ధాలు చెప్పటం అంటే మీకు ఇష్టం.
3 యెహోవా తన మంచి ప్రజల మొర వింటాడని మీకు తెలుసు.
నేను యెహోవాను ప్రార్థించినప్పుడు, ఆయన నా ప్రార్థన వింటాడు.
4 మిమ్ములను ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, అప్పుడు కోప్పడవచ్చు.
కాని పాపం చేయవద్దు. మీరు పడకకు వెళ్లినప్పుడు ఆ విషయాలను గూర్చి ఆలోచించండి, అప్పుడు విశ్రాంతి తీసుకోండి.
5 దేవునికి మంచి బలులు అర్పించండి.
మరి యెహోవాయందు విశ్వాసం ఉంచండి.
6 “దేవుని మంచితనాన్ని మనకు ఎవరు చూపిస్తారు?
యెహోవా! ప్రకాశించే నీ ముఖాన్ని మమ్ముల్ని చూడనిమ్ము.” అని చాలామంది ప్రజలు అంటారు.
7 యెహోవా, నీవు నన్ను చాలా సంతోషపెట్టావు. ధాన్యం, ద్రాక్షారసం మాకు విస్తారంగా ఉన్నందుచేత పంట కోత సమయంలో సంబరపడే దానికంటే ఇప్పుడు మేము ఎక్కువ సంతోషంగా ఉన్నాము.
8 నేను పడకకు వెళ్లి, ప్రశాంతంగా నిద్రపోతాను.
ఎందుకంటె యెహోవా, నీవే నన్ను భద్రంగా నిద్ర పుచ్చుతావు గనుక.
© 1997 Bible League International