M’Cheyne Bible Reading Plan
సమ్సోను వివాహం
14 సమ్సోను తిమ్నాతు నగరానికి వెళ్లాడు. అక్కడ ఒక ఫిలిష్తీయుల యువతిని అతను చూశాడు. 2 అతను ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: “తిమ్నాతులో నేనొక ఫిలిష్తీయుల స్త్రీని చూశాను. మీరామెను తీసుకు రావాలి అని నా కోరిక. నేనామెను పెళ్లి చేసుకుంటాను.”
3 అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్పారు: “నీవు పెళ్లి చేసుకోవటానికి! ఇశ్రాయేలు ప్రజల మధ్య తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. కాని ఫిలిష్తీయుల మధ్యగల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు.”
కాని సమ్సోను ఇలా అన్నాడు: “ఆ స్త్రీని నా కోసం తీసుకురండి ఆమె నాకు కావాలి.” 4 (యెహోవా ఇది జరగాలని ఆశించినట్టు సమ్సోను తల్లిదండ్రులకు తెలియదు. ఫిలిష్తీయులకు విరుద్ధంగా ఏదో ఒకటి చేయటానికి యెహోవా ఒక అవకాశం కోసం చూడసాగాడు. ఫిలిష్తీయులు అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చలాయించే వారు.)
5 సమ్సోను తన తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని తిమ్నాతు నగరానికి వెళ్లాడు. నగరానికి దగ్గరగా ఉన్న ద్రాక్షతోటలదాకా వారు వెళ్లారు. అప్పుడు ఒక మదించిన సింహం ఉన్నట్టుండి గర్జించింది. అది సమ్సోను మీదికి దుమికింది. 6 అప్పుడు యెహోవా ఆత్మ సమ్సోనుని బలపరచగా, గొప్ప శక్తితో, వట్టి చేతులతోనే అతను సింహాన్ని చీల్చివేశాడు. అది అతనికి సులభంగా తోచింది. ఒక పడుచు మేకను చీల్చునంత సులభంగా తోచిందాపని. కాని అతనేమి చేశాడో, ఆ సంగతి తల్లికి గాని తండ్రికి గాని తెలుపలేదు.
7 అందువల్ల సమ్సోను నగరానికి వెళ్లి, ఆ ఫిలిష్తీయుల స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనిని సంతోషపెట్టింది. 8 చాలారోజుల తర్వాత, సమ్సోను ఫిలిష్తీయుల స్త్రీని వివాహమాడేందుకు తిరిగి వచ్చాడు. త్రోవలో చచ్చిపోయిన ఆ సింహాన్ని చూడటానికి వెళ్లాడు. మృత సింహం శరీరం మీద తేనెటీగల గుంపు చూశాడు. అవి కొంచెం తేనె తయారు చేశాయి. 9 తన చేతులతో సమ్సోను ఆ తేనెను తీసుకున్నాడు. ఆ తేనె తింటూ అతను నడిచాడు. తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆ తేనె కొంచెం వారికి ఇచ్చాడు. వారు కూడా తిన్నారు. కాని మృత సింహం శరీరంనుంచి తాను తేనెను తెచ్చినట్లు సమ్సోను తల్లిదండ్రులకు చెప్పలేదు.
10 సమ్సోను తండ్రి ఆ ఫిలిష్తీయుల స్త్రీని చూసేందుకు వెళ్లాడు. పెళ్లికొడుకు విందు ఇవ్వడం ఆ రోజులలో ఆచారంగా ఉండేది. అందువల్ల సమ్సోను ఒక విందు ఇచ్చాడు. 11 ఫిలిష్తీయుల ప్రజలు అతను విందు యివ్వడం చూసి అతనికి తోడుగా ముప్ఫై మంది మనుషుల్ని పంపారు.
12 అప్పుడు సమ్సోను ముప్ఫై మంది మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను మీకో విప్పుడుకథను చెపుతాను. ఈ విందు ఏడు రోజులపాటు సాగుతుంది. ఈలోగా మీరు సమాధానం వెతకాలి. ఈలోగా కనుక మీరు విప్పుడుకథకు సమాధానం చెప్పగలిగితే, నేను మీకు ముప్ఫై నార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలు ఇస్తాను. 13 కానీ మీకు సమాధానం దొరక్కపోతే అప్పుడు మీరు ముప్ఫైనార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలను ఇవ్వాలి.” అప్పుడు ఆ ముప్ఫై మంది మనుష్యులు ఇలా అన్నారు. “నీ విప్పుడుకథ ఏమిటో మాకు చెప్పు. అది మేము వినదలచాము.”
14 సమ్సోను ఈ విప్పుడుకథ వాళ్లకి చెప్పాడు:
“బలమైన దానిలోనుండి తీపి వచ్చింది.
తినుదానిలో నుండి తిండి వచ్చింది.”
మూడు రోజుల పాటు ఆ ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు.
15 నాలుగవ రోజున,[a] ఆ మనుష్యులు సమ్సోను భార్య వద్దకు వచ్చారు. వారన్నారు: “మమ్మల్ని పేదవారుగా చేసేందుకు ఇక్కడికి ఆహ్వానించావా? ఆ విప్పుడుకథకు సమాధానం చెప్పవలసిందిగా నీవు నీ భర్తను ప్రేరేపించాలి. మా కోసం కనుక నీవు సమాధానం రప్పించకపోతే మేము నిన్ను కాల్చివేస్తాము. అలాగే మీ తండ్రి వద్ద ఉన్న మనుష్యులందరినీ చంపివేస్తాము.”
16 అందువల్ల సమ్సోను భార్య అతనిని సమీపించి విలపించింది. ఆమె అన్నది: “నీవు నన్ను ద్వేషిస్తున్నావు. నీవు నిజంగా నన్ను ప్రేమించడంలేదు. నీవు మా మనుష్యులకో విప్పుడుకథ ఇచ్చావు. నీవు నాకైనా సమాధానం చెప్పవా?”
అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. నేను నీకు ఎందుకు చెప్పాలి?”
17 విందులోని కడమ యేడు రోజులూ సమ్సోను భార్య ఏడుస్తూ కూర్చుంది. చివరికతను సమాధానం చెప్పాడు. ఏడవ రోజున ఆ విప్పుడుకథకు సమాధానం తెలియజేశాడు. ఆమె తనను వేధించుకు తినడంవల్ల ఆమెకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆమె తన మనుష్యుల వద్దకు వెళ్లి, విప్పుడుకథకు సమాధానం చెప్పింది.
18 ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు:
“తేనె కంటె మధురమైనదేది?
సింహంకంటె బలంకలది ఏది?”
తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు:
“మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే
మీరు నా విప్పుడుకథను పరిష్కరించి ఉండలేరు.”
19 సమ్సోను ఉగ్రుడయ్యాడు. యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనుని నింపింది. అతను అష్కెలోను నగరానికి వెళ్లాడు. ఆ నగరంలో అతను ముప్ఫైమంది ఫిలిష్తీయులను చంపివేశాడు. తర్వాత వారి మృత శరీరాల మీది నుంచి అన్ని వస్త్రాలు, సొమ్ములు తీసుకున్నాడు. అతను ఆ వస్త్రాలను తిరిగి తీసుకు వచ్చి, తన విప్పుడుకథకు సమాధానం చెప్పిన ఆ ముప్ఫై మంది మనుష్యులకు ఇచ్చివేశాడు. తర్వాత అతను తన తండ్రి ఇంటికి వెళ్లాడు. 20 సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను సమ్సోను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా అంగీకరించెను.
కొరింథు
18 ఆ తరువాత పౌలు ఏథెన్సు వదిలి కొరింథుకు వెళ్ళాడు. 2 అక్కడ అకుల అనే యూదుణ్ణి కలుసుకొన్నాడు. ఇతని స్వగ్రామం పొంతు. క్లౌదియ యూదులందర్ని రోమా నగరం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించటంవలన అకుల ఇటలీనుండి తన భార్య ప్రిస్కిల్లతో కలసి ఈ మధ్య యిక్కడికి వచ్చాడు. పౌలు వాళ్ళను చూడటానికి వెళ్ళాడు. 3 తనలాగే వాళ్ళు కూడా గుడారాలు చేసి జీవించేవాళ్ళు కనుక వాళ్ళతో కలిసి ఉండి పని చేసాడు.
4 ప్రతి విశ్రాంతి రోజూ సమాజమందిరాల్లో తర్కించి యూదుల్ని, గ్రీకుల్ని ఒప్పించటానికి ప్రయత్నించేవాడు. 5 మాసిదోనియనుండి సీల, తిమోతి వచ్చాక పౌలు తన కాలాన్నంతా బోధించటానికి వినియోగించాడు. యూదుల సమక్షంలో మాట్లాడి, యేసు ప్రభువే క్రీస్తు అని నిరూపించే వాడు. 6 కాని యూదులు ఎదురు తిరిగి అతణ్ణి దూషించారు. పౌలు తన నిరసనను వ్యక్తపరుస్తూ తన దుస్తుల్ని దులిపి, “మీరు పొందనున్న శిక్షకు మీరే బాధ్యులు, నేను బాధ్యుణ్ణి కాదు. ఇక మీదట నేను యూదులు కానివాళ్ళ దగ్గరకు వెళ్తాను” అని అన్నాడు.
7 పౌలు సమాజమందిరాన్ని వదిలి ప్రక్కనున్న తీతియు యూస్తు అనే విశ్వాసి యింటికి వెళ్ళాడు. 8 యూదుల సమాజమందిరంపై అధికారిగా పని చేస్తున్న క్రిస్పు అనే వ్యక్తి అతని యింట్లోనివాళ్ళు ప్రభువును విశ్వసించారు. చాలా మంది కొరింథు ప్రజలు పౌలు చెప్పిన వాటిని విని ప్రభువును విశ్వసించి బాప్తిస్మము పొందారు.
9-10 ఒకనాటి రాత్రి ప్రభువు పౌలుకు కలలో కనిపించి, “ఈ పట్టణంలో నా ప్రజలు చాలా మంది ఉన్నారు. కనుక మౌనం వహించక ధైర్యంగా బోధించు. నేను నీ వెంటే ఉన్నాను. ఎవ్వరూ నీకు ఎదురు తిరగలేరు. ఏ హానీ చెయ్యలేరు” అని అన్నాడు. 11 పౌలు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడుండి దైవసందేశాన్ని వాళ్ళకు బోధించాడు.
పౌలు గల్లియో ఎదుటికి తీసుకురాబడ్డాడు
12 గల్లియో అనే పేరుగల ఒక వ్యక్తి అకయ ప్రాంతానికి సామంత రాజుగా ఉండేవాడు. అతని కాలంలో యూదులందరూ కలిసి పౌలుకు ఎదురు తిరిగారు. అతణ్ణి న్యాయస్థానం ముందుకు తెచ్చి, 13 “ఇతడు మన శాస్త్రానికి విరుద్ధమైన పద్ధతిలో దేవుణ్ణి పూజించమని ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నాడు” అని అతణ్ణి నిందించారు.
14 పౌలు సమాధానం చెప్పటానికి సిద్ధం అయ్యాడు. ఇంతలో గల్లియో యూదులతో, “మీరు ఘోరమైన నేరాన్ని గురించి కాని, లేక చెడు నడతను గురించి కాని చెప్పదలిస్తే నేను మీ విన్నపం వినటం సమంజసంగా ఉంటుంది. 15 కాని మీ ఆరోపణ పదాలను గురించి, పేర్లను గురించి, మీ శాస్త్రాల్ని గురించి కాబట్టి మీలో మీరు తీర్మానం చేసుకోండి. 16 అలాంటి వాటిపై నేను తీర్పు చెప్పను” అని అంటూ వాళ్ళను న్యాయస్థానంనుండి తరిమివేసాడు.
17 వాళ్ళు యూదుల సమాజమందిరానికి పెద్ద అయినటువంటి సోస్తెనేసును పట్టుకొని అతణ్ణి న్యాయస్థానం ముందు కొట్టారు. అయినా గల్లియో తనకు సంబంధం లేనట్టు ఊరుకొన్నాడు.
అంతియొకయకు తిరిగి వెళ్ళటం
18 పౌలు కొరింథులో కొంతకాలం ఉన్నాడు. ఆ తర్వాత అక్కడున్న సోదరుల్ని వదిలి, ప్రిస్కిల్లను, అకులను తన వెంట పిలుచుకొని ఓడలో సిరియ దేశానికి ప్రయాణమయ్యాడు. ప్రయాణానికి ముందు తాను మ్రొక్కుబడి తీర్చుకోవటానికి కెంక్రేయలో తన వెంట్రుకలు కత్తిరించుకున్నాడు. 19 వాళ్ళు ఎఫెసుకు చేరుకున్నారు. అక్కడ పౌలు ప్రిస్కిల్లను, అకులను వదిలి తానొక్కడే సమాజమందిరానికి వెళ్ళి యూదులతో తర్కించాడు. 20 వాళ్ళు అతణ్ణి తమతో మరికొన్ని రోజులుండమని అడిగారు. అతడు వీల్లేదన్నాడు. 21 కాని వెళ్ళే ముందు, “దేవుని చిత్తమైతే మళ్ళీ వస్తాను” అని వాళ్ళతో చెప్పి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసాడు.
22 అతడు కైసరియ తీరాన్ని చేరుకొని అక్కడినుండి యెరూషలేము వెళ్ళాడు. అక్కడున్న సంఘానికి శుభాకాంక్షలు తెలిపి అక్కడినుండి అంతియొకయకు వెళ్ళాడు. 23 అంతియొకయలో కొద్ది రోజులు గడిపి అక్కడినుండి ప్రయాణమై గలతియ, ఫ్రుగియ ప్రాంతాల్లో పర్యటన చేసి, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల్లో విశ్వాసం అభివృద్ధి చెందేటట్లు చేసాడు.
ఎఫెసులో అపొల్లో
24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు. 25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు. 26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధ విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.
27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించినవాళ్ళకు చాలా సహాయం చేసాడు. 28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.
యెహోవా నెబుకద్నెజరును పాలకునిగా చేయుట
27 యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట తన పరిపాలనలో నాలుగవ సంవత్సరం[a] జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. రాజైన సిద్కియా యోషీయా కుమారుడు. 2 యోహోవా నాకు ఈ విధంగా చెప్పాడు. “యిర్మీయా! వారులతోను, నిలువు కట్టెతోను ఒక కాడి తయారు చేయి. ఆ కాడిని నీ మెడపై వేసుకో. 3 తరువాత ఎదోము, మోయబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా రాజైన సిద్కియాను చూడటానికి యెరూషలేముకు వచ్చే ఆయా రాజ దూతల ద్వారా వర్తమానాలను పంపు.[b] 4 ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని ఆ దూతలతో ఇలా చెప్పుము. ‘ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పేదేమంటే: మీ యాజమానులతో 5 నేనే భూమండలాన్ని, దానిపై ఉండే మనుష్యులందరినీ సృష్టించానని చెప్పండి. భూమి పైగల జంతుజలాన్ని కూడా నేనే సృష్టించాను. ఇదంతా నా గొప్ప మహిమ చేతను, నా దృఢమైన హస్తముతోను చేసియున్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వాని కెవనికైనా ఇచ్చి వేయగలను. 6 ఇప్పుడు మీ దేశాలన్నిటినీ బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చి వేశాను. అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడ అతనికి లోబడి వుండేలా చేస్తాను. 7 దేశాన్నీ నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవచేస్తాయి. ఆ తరువాత బబులోను పతనానికి సమయం ఆసన్నమౌతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపర్చుకొని దాస్యం చేయించుకుంటారు.
8 “‘కాని ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు నెబుకద్నెజరుకు దాస్యం చేయటానికి నిరాకరించవచ్చు. వారు అతని కాడిని తమ మెడపై పెట్టుకోటానికి నిరాకరించవచ్చు. (తమపై అతని ఆధిపత్యాన్ని తిరస్కరించవచ్చు.) అది గనుక జరిగితే, ఆయా దేశాలను, రాజ్యాలను కత్తితోను, ఆకలితోను, రోగాలతోను శిక్షిస్తాను. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనది చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యం పైకి అతనినే వినియోగించి దానిని నాశనం చేయిస్తాను. 9 కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల ఆంతర్యాలను చెపుతామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడుతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించే వారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుష్యులు, “మీరు బబులోను రాజుకు బానిసలు కానేరరు” అని చెపుతారు. 10 కాని వారు మీతో అబద్దమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూర దేశాలకు తీసుకొని పోబడటానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు వాకిళ్లు వదిలి పోయేలా నేను వత్తిడిచేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు.
11 “‘తమ మెడవంచి బబులోను రాజు కాడిని ధరించి అతనికి విధేయులై ఉన్న దేశాల వారు జీవిస్తారు. అటువంటి వారిని బబులోను రాజును సేవిస్తూ తమ దేశంలోనే ఉండేలా చేస్తాను.’ ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది ‘ఆయా దేశాల వారంతా తమ తమ స్వదేశాలలోనే ఉంటూ. తమ భూముల్లో సేద్యం చేసుకుంటూ ఉంటారు.’”
12 యూదా రాజైన సిద్కియాకు కూడ ఇదే సందేశం ఇచ్చాను. నేనిలా చెప్పాను: “సిద్కియా, బబులోను రాజు యొక్క కాడి క్రింద నీ మెడ వుంచి అతనికి విధేయుడవై వుండాలి. నీవు బబులోను రాజుకు, అతని ప్రజలకు దాస్యం చేస్తే నీవు బ్రతుకుతావు. 13 నీవు బబులోను రాజుకు దాస్యం చేయటానికి ఒప్పుకొనకపోతే నీవు, నీ ప్రజలు శత్రువు యొక్క కత్తివాత బడి, ఆకలితోను, భయంకర రోగాలతోను చనిపోతారు. ఇవి జరిగి తీరుతాయని యెహోవా చెప్పాడు! 14 కాని అబద్ధ ప్రవక్తలు మాత్రం, ‘నీవు బబులోను రాజుకు బానిసవు కానేరవు’ అని చెపుతున్నారు.
“ఆ ప్రవక్తలు చెప్పేది వినవద్దు. ఎందువల్లనంటే వారు నీకు అబద్దాలు చెపుతున్నారు. 15 ‘నేనా ప్రవక్తలను పంపలేదు.’ ఇదే యెహోవా వాక్కు ‘వారు అబద్దాలు బోధిస్తున్నారు. పైగా, ఆ సందేశం నా నుండి వచ్చినదే అని కూడ చెపుతున్నారు. కావున ఓ యూదా ప్రజలారా, మిమ్ముల్ని దూరంగా పంపివేస్తాను. మీరు చనిపోతారు! మీకు బోధించే ఆ ప్రవక్తలు కూడా చనిపోతారు.’”
16 అప్పుడు యిర్మీయానైన నేను యాజకులతోను, అ ప్రజలందరితోను ఇలా చెప్పాను: “యెహోవా చెప్పేదేమంటే ఆ అబద్ధ ప్రవక్తలు, ‘బబులోనీయులు యెహోవా నుండి ఎన్నో వస్తువులు తీసుకొని పోయారు. అవన్నీ శీఘ్రమే తిరిగి తీసుకొని రాబడుతాయి.’ అని చెపుతున్నారు. వారి మాటలు మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే వారు మీకు అబద్ధ ప్రవచనాలను బోధిస్తున్నారు. 17 ఆ ప్రవక్తలు చెప్పే వాటిని మీరు వినవద్దు. బబులోను రాజుకు దాస్యంచేయండి. మీ శిక్షను మీరు ఆమోదించండి. మీరు జీవిస్తారు. ఈ యెరూషలేము నగరం సర్వనాశనం అయ్యేలా మీరు చేయటానికి కారణమే కన్పించటం లేదు. 18 ఈ మనుష్యులు నిజంగానే ప్రవక్తలయితే, వారికి యెహోవా సందేశం అందితే వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా దేవునిలో వున్న వస్తువుల గురించి ప్రార్థన చేయనివ్వండి. రాజ భవనంలో యింకా మిగిలివున్న వస్తువుల గురించి వారిని ప్రార్థన చేయనివ్వండి. ఇంకా యెరూషలేములో వున్న వాటిని గురించి ప్రార్థన చేయనివ్వండి. ఆయా వస్తుసముదాయాలు బబులోనుకు తీసుకొని పోబడకుండా వుండేలా ఆ ప్రవక్తలను ప్రార్థన చేయనివ్వండి.
19 “సర్వశక్తిమంతుడైన యెహోవా యెరూషలేములో ఇంకా మిగిలివున్న వస్తువులను గూర్చి ఇది చెపుతున్నాడు. దేవాలయంలో స్తంభాలు, కంచుకోనేరు, కదిలించగల దిమ్మెలు ఇంకా ఇతరమైన వస్తు సామగ్రి ఉంది.[c] బబులోను రాజైన నెబుకద్నెజరు వీటిని యెరూషలేములో వదిలి వేశాడు. 20 యూదా రాజైన యెహోయాకీనును[d] బందీగా కొనిపోయేటప్పుడు నెబుకద్నెజరు వాటన్నిటినీ తీసుకొని పోలేదు. రాజైన యెహోయాకీను యెహోయాకీము కుమారుడు. యూదా నుండి, యెరూషలేము నుండి ఇతర ప్రముఖ వ్యక్తులను కూడా నెబుకద్నెజరు బందీలుగా పట్టుకుపోయాడు. 21 దేవాలయంలోను, రాజభవనంలోను, మరియు యెరూషలేములోను ఇంకా మిగిలివున్న వస్తువుల విషయంలో ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘ఆ వస్తువులన్ని బబులోనుకు తీసుకొని పోబడతాయి. 22 నేను వాటిని తిరిగి తీసుకొని వచ్చే రోజు వరకు అవి అక్కడే వుంచబడతాయి.’ ఇది యెహోవా వాక్కు. ‘పిమ్మట వాటిని నేను తీసుకొని వస్తాను. తిరిగి వాటిని యధాస్థానంలో వుంచుతాను.’”
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మత్తయి 24:1-25; లూకా 21:5-24)
13 యేసు మందిరం నుండి వెళ్తుండగా శిష్యుల్లో ఒకడు, “బోధకుడా! చూడండి, ఎంత అద్భుతమైన పెద్ద రాళ్ళో! ఎంత పెద్ద కట్టడాలో చూడండి!” అని అన్నాడు.
2 యేసు సమాధానంగా, “నీవు పెద్ద కట్టడాన్ని చూస్తున్నావా? రాయి మీద రాయి నిలువకుండా రాళ్ళన్ని పడిపోతాయి” అని అన్నాడు.
3 యేసు మందిరానికి ఎదురుగా ఉన్న ఒలీవల కొండపై కూర్చొన్నాడు. ఆయన వెంట ఆయన శిష్యులు పేతురు, యాకోబు, యోహాను మరియు అంద్రెయ ఉన్నారు. వాళ్ళు ఆయనతో 4 “ఇది ఎప్పుడు జరుగుతుందో మాకు చెప్పండి. ఇవి జరుగబోయే సమయం వచ్చిందని సూచించటానికి ఏం జరుగుతుంది?” అని అడిగారు.
5 యేసు వాళ్ళతో, “మిమ్మల్నెవరూ మోసం చేయకుండా జాగ్రత్తపడండి. 6 అనేకులు నా పేరు పెట్టుకొని వచ్చి, నేనే ఆయన్ని అని చెప్పి అనేకుల్ని మోసం చేస్తారు. 7 మీరు యుద్ధాల్ని గురించి కాని, యుద్ధాల వదంతుల్ని గురించి కాని వింటే వెంటనే ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. 8 దేశాలకు, రాజ్యాలకు మధ్య యుద్ధాలు సంభవిస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు వస్తాయి. కరువులు వస్తాయి. అంటే ప్రసవించే ముందు కలిగే నొప్పులు ప్రారంభమయ్యాయన్నమాట.
9 “మీరు జాగ్రత్తగా ఉండండి. కొందరు మనుష్యులు మిమ్మల్ని మహాసభలకు అప్పగిస్తారు. సమాజ మందిరాల్లో మీరు కొరడా దెబ్బలు తినవలసి వస్తుంది. నా కారణంగా మీరు రాజ్యాధికారుల ముందు, రాజుల ముందు నిలుచొని సాక్ష్యం చెప్పవలసి వస్తుంది. 10 మొదట మీరు అన్ని దేశాలకు సువార్త తప్పక ప్రకటించాలి. 11 మిమ్మల్ని బంధించి విచారణ జరపటానికి తీసుకు వెళ్తారు. అప్పుడు మీరు ఏం మాట్లాడాలో అని చింతించకండి. ఆ సమయంలో మీకు తోచింది మాట్లాడండి. ఎందుకంటే, అప్పుడు మాట్లాడేది మీరు కాదు. పవిత్రాత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.
12 “సోదరులు ఒకరికొకరు ద్రోహం చేసుకొని, ఒకరి మరణానికి ఒకరు కారకులౌతారు. అదే విధంగా తండ్రి తన కుమారుని యొక్క మరణానికి కారకుడౌతాడు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళ మరణానికి కారకులౌతారు. 13 నా కారణంగా ప్రజలందరూ మిమ్మల్ని ఏవగించుకొంటారు. కాని చివరిదాకా పట్టుదలతో ఉన్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు.
14 “నాశనం కలిగించేది, అసహ్యమైనది, తనది కాని స్థానంలో నిలుచొని ఉండటం మీకు కనిపిస్తే[a] యూదయలో ఉన్నవాళ్ళు కొండల మీదికి పారిపొండి. 15 ఇంటి మిద్దె మీద ఉన్న వాళ్ళు క్రిందికి దిగి తమ వస్తువులు తెచ్చుకోవటానికి తమ యిళ్ళలోకి వెళ్ళరాదు. 16 పొలాల్లో పని చేస్తున్న వాళ్ళు తమ దుస్తులు తెచ్చుకోవటానికి యిళ్ళకు వెళ్ళరాదు.
17 “గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఆ రోజులు ఎంత దుర్భరంగా ఉంటాయో కదా! 18 ఈ సంఘటన చలికాలంలో సంభవించకూడదని ప్రార్థించండి. 19 ప్రపంచంలో ఇదివరకు ఎన్నడూ, అంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన నాటినుండి ఈనాటి వరకూ సంభవించని దుర్భరమైన కష్టాలు ఆ రోజుల్లో సంభవిస్తాయి. అలాంటి కష్టాలు యిక ముందు కూడా ఎన్నడూ కలగవు. 20 కాని దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసాడు. లేకపోయినట్లయితే ఎవ్వరూ బ్రతికేవాళ్ళు కాదు. తానెన్నుకున్న తన ప్రజల కోసం ఆ రోజుల సంఖ్యను తగ్గించాడు.
21 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా ‘ఇదిగో! క్రీస్తు యిక్కడ ఉన్నాడని’ కాని, ‘అదిగో అక్కడున్నాడని’ కాని అంటే నమ్మకండి. 22 దొంగ క్రీస్తులు, దొంగ ప్రవక్తలు వచ్చి అద్భుతాలు, మహత్యాలు చేసి ఐనంతవరకు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళను మోసం చెయ్యాలని చూస్తారు. 23 అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలని, అన్ని విషయాలు మీకు ముందే చెబుతున్నాను.
24 “కాని ఆ కష్టాలు గడిచిన తర్వాత వచ్చే రోజుల్లో,
‘సూర్యుడు చీకటైపోతాడు.
చంద్రుడు తన వెలుగును వెదజల్లడు.
25 ఆకాశంలోని నక్షత్రాలు రాలిపోతాయి.
ఆకాశంలో వున్నవన్నీ మార్పుచెందుతాయి.’(A)
26 “అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో, తేజస్సుతో, మేఘాలమీద రావటం మానవులు చూస్తారు. 27 ఆయన నలువైపుల నుండి, అంటే ఈ మూలనుండి ఆ మూల దాకా, తన దేవదూతలను పంపి తానెన్నుకున్న ప్రజలను ప్రోగు చేయిస్తాడు.
28 “అంజూరపు చెట్టును చూసి పాఠం నేర్చుకొండి. దాని రెమ్మలు ఆకులు చిగురించుట చూసి ఎండాకాలం రానున్నదని మీరు గ్రహిస్తారు. 29 అదే విధంగా యివి జరగటం మీరు చూసినప్పుడు ఆయన త్వరగా రానైయున్నాడని గ్రహిస్తారు. 30 ఇది నిజం. ఈ కాలపువాళ్ళు జీవిస్తూండగానే ఇవన్ని జరుగును. 31 ఆకాశం, భూమి గతించి పోతాయి కాని, నా మాటలు ఎన్నటికి గతించిపోవు.
32 “ఆ దినము, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో, పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారునికి గాని మరెవ్వరికి గాని తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. 33 జాగ్రత్తగా, సిద్ధంగా ఉండండి.[b] ఆ సమయం ఎప్పుడు రాబోతోందో మీకు తెలియదు.
34 “ఇది తన యిల్లు విడిచి దూరదేశం వెళ్ళే ఒక మనిషిని పోలి ఉంటుంది. అతడు తన యింటిని సేవకులకు అప్పగిస్తాడు. ప్రతి సేవకునికి ఒక పని అప్పగిస్తాడు. ద్వారం దగ్గరవున్నవానికి కాపలా కాయమని చెబుతాడు. 35 ఎల్లప్పుడు సిద్ధంగా ఉండమని చెబుతాడు. ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వస్తాడో మీకు తెలియదు. సాయంత్రం వస్తాడో, మధ్యరాత్రి వస్తాడో, కోడికూసే వేళకు వస్తాడో, సూర్యోదయం వేళకు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు. 36 అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రిస్తూ ఉండటం చూస్తాడేమో. 37 హెచ్చరికగా ఉండండి అని మీకు చెబుతున్నాను. అదే ప్రతి ఒక్కనికి చెబుతున్నాను.”
© 1997 Bible League International