Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 12

యెఫ్తా మరియు ఎఫ్రాయిము

12 ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులు వారి సైనికులందరినీ సమావేశ పరిచారు. తరువాత వారు నది దాటి సఫోను పట్టణం వెళ్లారు. వారు, “అమ్మోనీయులతో పోరాడేందుకు సహాయంగా నీవు మమ్మల్ని ఎందుకు పిలువలేదు? నీతోపాటే నీ ఇంటిని కాల్చివేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.

వారికి యెఫ్తా జవాబు చెప్పాడు: “అమ్మోనీయులు మాకు చాలా కష్టాలు కలిగించారు. కనుక నేను, నా ప్రజలు వారి మీద యుద్ధం చేశాము. నేను మిమ్మల్ని పిలిచాను, కాని మాకు సహాయం చేయటానికి మీరు రాలేదు. మీరు మాకు సహాయం చేయరని నాకు తెలిసింది. కనుక నేను నా ప్రాణాన్ని లెక్కచేయలేదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి నేను నది దాటివెళ్లాను. వారిని ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాతో పోరాడటానికి మీరెందుకు ఈ వేళ వచ్చారు?”

అప్పుడు యెఫ్తా గిలాదు మనుష్యులను సమావేశ పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్ధం చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవమానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. “గిలాదు వారైన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం సొంత దేశం కూడా లేదు. మీలో కొందరు ఎఫ్రాయిముకు మరికొందరు మనష్షేకు చెందినవారు” అని వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము మనుష్యులను ఓడించారు.

ప్రజలు యోర్దాను నదిని దాటే రేవులను గిలాదు మనుష్యులు పట్టుకొన్నారు. ఆ రేవులు ఎఫ్రాయిము దేశానికి పోయేదారులు. ఎఫ్రాయిము వారిలో తప్పించుకున్నవాడు ఎప్పుడైనా నది దగ్గరకు వచ్చి, “నన్ను దాటనివ్వండి” అని చెబితే గిలాదువారు, “నీవు ఎఫ్రాయిము వాడవా?” అని అడుగుతారు. “లేదు” అని వాడు చెబితే “షిబ్బోలెతు అనే మాట పలుకు” అని వారు అంటారు. ఎఫ్రాయిము మనుష్యులు ఆ మాటను సరిగ్గా పలుకలేరు. వారు ఆ మాటను “సిబ్బోలెతు” అని పలుకుతారు. కనుక అటువంటి వారిని ఒకడు “సిబ్బోలెతు” అని చెబితే అతడు ఎఫ్రాయిము వాడని గిలాదు వారికి తెలిసిపోతుంది. కనుక ఆ రేవు దగ్గరే వారు చంపేస్తారు. అలాగున వారు నలభై రెండువేల మంది ఎఫ్రాయిము మనుష్యులను చంపివేశారు.

ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు యెఫ్తా న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్పుడు గిలాదు వాడైన యెఫ్తా చనిపోయాడు. వారు అతని పట్టణమైన గిలాదులో అతనిని పాతిపెట్టారు.

న్యాయాధిపతి ఇబ్సాను

యెఫ్తా తర్వాత ఇబ్సాను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇబ్సాను బేత్లెహేము నగరానికి చెందినవాడు. ఇబ్సానుకి ముప్ఫై మంది కొడుకులు, ముప్ఫై మంది కుమార్తెలు ఉన్నారు. తమ బంధువులు కాని వారిని వివాహం చేసుకోవలసిందిగా అతను ముప్ఫై మంది కుమార్తెలను కోరాడు. తమ బంధువులు కాని ముప్ఫై మంది స్త్రీలను అతను కనుగొన్నాడు. వారిని అతని కుమారులు వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్సాను ఏడు సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 10 తర్వాత ఇబ్సాను మరణించాడు. అతనిని బేత్లెహేం నగరంలో సమాధి చేశారు.

న్యాయాధిపతి ఏలోను

11 ఇబ్సాను అనంతరం, ఇశ్రాయేలు ప్రజలకు ఏలోను న్యాయాధిపతి అయ్యాడు. ఏలోను జెబూలూను వంశమునుండి వచ్చినవాడు. అతను ఇశ్రాయేలు ప్రజలకు పది సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 12 అప్పుడు జెబూలూను వంశంనుండి వచ్చిన ఏలోను చనిపోయాడు. అతను ఆయ్యాలోను లోని జెబూలూను పట్టణంలో సమాధి చేయబడ్డాడు.

న్యాయాధిపతి అబ్దోను

13 ఏలోను మరణానంతరం, హిల్లేలు కుమారుడైన అబ్దోను అనే అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. 14 అబ్దోను పిరాతోను అనే నగరానికి చెందినవాడు. అబ్దోనుకు 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు డెబ్భయి గాడిదలెక్కి తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలకు అబ్దోను ఎనిమిదేళ్ల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 15 ఆ తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను మరణించాడు. అతనిని పిరాతోను నగరంలో సమాధి చేశారు. పిరాతోను ఎఫ్రాయిము అనే ప్రదేశంలో ఉంది. ఇది కొండదేశం లోనిది, అక్కడ అమాలేకీయుల ప్రజలు నివసించేవారు.

అపొస్తలుల కార్యములు 16

పౌలు, సీల వెంట తిమోతి వెళ్ళటం

16 ఆ తర్వాత పౌలు దెర్బే వెళ్ళి అక్కడినుండి లుస్త్రకు వెళ్ళాడు. లుస్త్రలో తిమోతి అనే పేరుగల ఒక విశ్వాసి ఉండేవాడు. అతని తల్లి భక్తిగల యూదురాలు; తండ్రి గ్రీసు దేశస్థుడు. లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలో నివసించే యూదులందరికి తెలుసు. కాబట్టి అతనికి సున్నతి చేయించాడు.

అపొస్తలులు, పెద్దలు యెరూషలేములో నిర్ణయించిన నియమాల్ని, వాళ్ళు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రజలకు తెలియచేసి, వాటిని పాటించమని చెప్పారు. తద్వారా సంఘాల్లో భక్తి అభివృద్ధి చెందింది. రోజు రోజుకూ ఆ సంఘాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

పౌలుకు దివ్యదర్శనం కలగటం

వాళ్ళు ఆసియ ప్రాంతాలకు వెళ్ళి ఈ సందేశాన్ని బోధించాలనుకొన్నారు. కాని పరిశుద్ధాత్మ వాళ్ళను ఆపాడు. కనుక, వాళ్ళు ఫ్రుగియ, గలతీయలోని ప్రతి గ్రామానికి వెళ్ళారు. ముసియ పొలిమేరలకు వచ్చాక బితూనియకు వెళ్ళటానికి ప్రయత్నించారు. కాని యేసు ఆత్మ అందుకు అంగీకరించలేదు. ఆ కారణంగా వాళ్ళు ముసియ దాటి త్రోయకు వెళ్ళారు.

మాసిదోనియ ప్రాంతం వాడొకడు, “మాసిదోనియకు వచ్చి మమ్మల్ని రక్షించండి” అని వేడుకొన్నట్లు ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగింది. 10 పౌలుకు దర్శనం కలిగాక మాసిదోనియ నివాసులకు సువార్త ప్రకటించటానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకొన్నాడని గ్రహించి తక్షణమే మేము అక్కడికి వెళ్ళటానికి సిద్ధం అయ్యాము.

లూదియ భక్తురాలు కావటం

11 “త్రోయ” నుండి సముద్ర ప్రయాణం చేసి నేరుగా సమొత్రాకేకు వెళ్ళి మరుసటి రోజు నెయపొలి చేరుకొన్నాము. 12 అక్కడినుండి ప్రయాణమై రోమా సామ్రాజ్యంలోని ఫిలిప్పీకి వెళ్ళాం. ఫిలిప్పీ మాసిదోనియలోని ప్రాంతంలో చాలా ముఖ్యమైన పట్టణం. మేము ఆ పట్టణంలో చాలా రోజులు గడిపాము.

13 ఒక విశ్రాంతి రోజున ప్రార్థనలు చేయటానికి స్థలం దొరుకుతుందని ఆశిస్తూ ఊరి బయట ఉన్న నది దగ్గరకు వెళ్ళాము. అక్కడికి వచ్చిన ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడటం మొదలుపెట్టాము. 14 మా మాటలు వింటున్న ఒకామె పేరు “లూదియ.” ఈమె తుయతైర గ్రామానికి చెందింది. ఊదారంగు పొడిని వ్యాపారం చేసే ఈ లూదియ భక్తురాలు. దేవుడు ఆమె మనస్సును మార్చి పౌలు సందేశం వినేటట్లు చేసాడు. 15 ఆమె, ఆమె యింట్లో ఉన్న వాళ్ళంతా బాప్తిస్మము పొందాక మమ్మల్ని యింటికి ఆహ్వానించింది. “నేను నిజంగా ప్రభువు భక్తురాలననే నమ్మకం మీలో ఉన్నట్లయితే వచ్చి మా యింట్లో ఉండండి” అని మమ్మల్ని వేడుకొని చాలా బలవంతం చేసింది.

పౌలు మరియు సీల కారాగారంలో

16 ఒకసారి మేము ప్రార్థనా స్థలానికి వెళ్తుండగా ఒక బానిస పిల్ల కనిపించింది. ఆమెకు సోదె చెప్పే శక్తిగల “పుతోను” అనే దయ్యము పట్టివుంది. ఆమె సోదె చెప్పటం వల్ల ఆమె యజమానులు చాలా డబ్బు గడించారు. 17 ఆమె పౌలును, మమ్మును అనుసరిస్తూ, “వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు. రక్షణకు దారి చూపుతున్నారు” అని బిగ్గరగా కేక పెట్టేది. 18 ఇలా చాలా రోజులు చేసింది. చివరకు పౌలు విసుగు చెంది వెనక్కి తిరిగి ఆమెలో ఉన్న దయ్యంతో, “యేసు క్రీస్తు పేరిట ఆమెను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే దయ్యం ఆమెను వదిలివేసింది.

19 ఆ బానిస పిల్ల యజమానులు తాము డబ్బు చేసుకొనే ఆశ నశించిందని గ్రహించి పౌలును, సీలను బంధించారు. 20 వాళ్ళను బహిరంగంగా రోమా సైనికాధికారుల ముందుకు పిలుచుకు వచ్చి, “వీళ్ళు యూదులు. మన పట్టణంలో అలజడి లేపుతున్నారు. 21 రోమా పౌరులుగా మనము ఆచరించలేని ఆచారాలను వాళ్ళు మనకు చెబుతున్నారు. వాటిని అంగీకరించటం కూడా న్యాయం కాదు” అని అన్నారు.

22 ప్రజల గుంపు పౌలు, సీలల మీద పడింది. అధికారులు వాళ్ళ దుస్తుల్ని చింపి కొట్టమని ఆజ్ఞాపించారు. 23 చావకొట్టి, వాళ్ళను చెరసాలలో పడవేస్తూ, “వీళ్ళను జాగ్రత్తగా కాపలా కాయండి” అని ఆ చెరసాల అధికారితో చెప్పారు. 24 కనుక ఆ చెరసాల అధికారి వాళ్ళ కాళ్ళను బొండ కొయ్యకు గల రంధ్రాల్లో బిగించి లోపలి గదిలో పడవేసాడు.

25 అర్థరాత్రి వేళ పౌలు, సీల ప్రార్థనలు చేస్తూ, దైవకీర్తనలు పాడుతుండగా ఇతర బంధీలు వింటున్నారు. 26 అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపం వచ్చింది. దానితో చెరసాల పునాదులు కదిలిపోయాయి. వెంటనే చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి. వీళ్ళకు కట్టిన కట్లు తెగిపొయ్యాయి. 27 చెరసాల అధికారి మేలుకొని చెరసాల తలుపులు తెరచి ఉండటం చూసి నేరస్థులు అందరు తప్పించుకు పోయారనుకొని కత్తి దూసి తనను తాను చంపుకోబోయాడు. 28 కాని పౌలు, “హాని చేసుకోవద్దు! మేమంతా యిక్కడే ఉన్నాము” అని బిగ్గరగా అన్నాడు.

29 ఆ అధికారి దీపాలు తెప్పించి లోపలికి పరుగెత్తికొంటూ వెళ్ళి వణకుతూ పౌలు, సీలల కాళ్ళ మీద పడ్డాడు. 30 ఆ తర్వాత వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చి, “అయ్యా! నేను రక్షణ పొందాలంటే ఏమి చేయాలి?” అని అడిగాడు.

31 వాళ్ళు, “యేసు ప్రభువును నమ్ము! నీకు, నీ యింట్లోని వాళ్ళకందరికీ రక్షణ లభిస్తుంది” అని సమాధానం చెప్పారు. 32 ఆ తరువాత వాళ్ళు ప్రభువు సందేశాన్ని అతనికి, అతని యింట్లోని వాళ్ళకందరికీ చెప్పారు. 33 ఆ అధికారి, ఆ రాత్రివేళ వాళ్ళను పిలుచుకు వెళ్ళి గాయాలను కడిగాడు. వెంటనే అతడు, అతని యింట్లోనివాళ్ళు బాప్తిస్మము పొందారు. 34 ఆ తరువాత అతడు వాళ్ళను తన యింటికి పిలుచుకు వెళ్ళి వాళ్ళకు భోజనం పెట్టాడు. అతడు, అతని యింట్లోనివాళ్ళు తాము దేవుణ్ణి విశ్వసించటం మొదలు పెట్టినందుకు చాలా ఆనందించారు.

35 తెల్లవారగానే న్యాయాధికారులు తమ భటుల్ని చెరసాల అధికారి దగ్గరకి పంపి వాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞాపించారు.

36 “నిన్ను, సీలను విడుదల చేయమని న్యాయాధికారులు సెలవిచ్చారు. మీరిక వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళండి!” అని చెరసాల అధికారి అన్నాడు.

37 కాని పౌలు వాళ్ళతో, “మేము రోమా పౌరులమైనా విచారణ జరుపకుండా ప్రజల ముందు మమ్మల్ని కొరడా దెబ్బలు కొట్టారు. కారాగారంలో పడవేసారు. కాని యిప్పుడు రహస్యంగా పంపివేయాలని చూస్తున్నారు. వీల్లేదు, స్వయంగా వచ్చి మమ్మల్ని విడుదల చేయమని అధికారులతో చెప్పండి” అని అన్నాడు.

38 భటులు ఈ వార్త అధికారులకు తెలియజేసారు. వాళ్ళు పౌలు, సీల రోమా పౌరులని విని భయపడిపోయారు. 39 అందువల్ల అధికారులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తమ తప్పు క్షమించమని వేడుకొన్నారు. వాళ్ళను ఊరి బయటకు పిలుచుకు వెళ్ళి, దయ ఉంచి తమ ఊరు విడిచి వెళ్ళమని వాళ్ళను కోరారు. 40 పౌలు, సీల కారాగారంనుండి లూదియ యింటికి వెళ్ళారు. అక్కడున్న సోదరులను కలుసుకొని వాళ్ళలో విశ్వాసం పెరిగే విధంగా మాట్లాడి వెళ్ళిపోయారు.

యిర్మీయా 25

యిర్మీయా బోధనల సంగ్రహం

25 యూదా ప్రజలందరి గురించి యిర్మీయాకు చేరిన సందేశం ఇది. యెహోయాకీము యూదాకు రాజై పాలిస్తున్న నాల్గవ సంవత్సరంలో[a] ఈ సందేశం వచ్చింది. యోషీయా కుమారుడు యెహోయాకీము. ఇతని పాలనలో నాల్గవ సంవత్సరం అయ్యే సరికి నెబుకద్నెజరు బబులోనుకు రాజు కావటం, పరిపాలన ఒక సంవత్సరం కొనసాగించటం జరిగింది. ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరికి, యెరూషలేము వాసులందరికి ఈ సందేశం ఇచ్చాడు:

యెహోవా నుండి వచ్చిన సందేశాలను గత ఇరవై మూడు సంవత్సరాలలో నేను మీకు పదే పదే ఇచ్చియున్నాను. అమోను కుమారుడైన యోషీయా యూదా రాజ్యాన్ని పదమూడవ సంవత్సరంలో పాలిస్తూ ఉన్నప్పటినుండి నేను ప్రవక్తగా కొనసాగుతున్నాను. ఆనాటి నుండి ఈ నాటి వరకు నేను మీకు యెహోవా సందేశాలను అందజేస్తూ వస్తున్నాను. కాని మీరు వినిపించుకోలేదు. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను మరల, మరల మీ వద్దకు పంపాడు. కాని వారు చెప్పేది మీరు వినలేదు. మీరసలు వారిని లక్ష్య పెట్టలేదు.

ఆ ప్రవక్తలు, “మీ జీవిత విధానం మార్చుకోండి. ఆ చెడు కార్యాలు చేయటం మానండి. మీలోమార్పు వస్తే, ఏనాడో దేవుడు మీరు నివసించుటకు మీ పితరులకు ఇచ్చిన రాజ్యానికి మీరు తిరిగి రాగలరు. మీరు శాశ్వాతంగా నివసించటానికి ఈ రాజ్యాన్ని ఆయన మీకిచ్చాడు. అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!”[b]

“కాని మీరు నా మాట వినలేదు” ఇది యెహోవా వాక్కు “ఎవడో ఒక వ్యక్తి చేసిన విగ్రహాలను మీరు పూజించారు. అది నన్ను ఆగ్రహపర్చింది. అదే మిమ్ము బాధ పెట్టింది.”

కావున సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుతున్నాడు: “మీరు నా వర్తమానాలను వినలేదు. అందుచేత నేను శీఘ్రమే ఉత్తరదేశం నుండి ప్రజలందరి కొరకు ఒకనిని పంపుతాను.” ఇదే యెహోవా వాక్కు. “బబులోను రాజైన నెబుకద్నెజరును వెంటనే పిలిపిస్తాను. అతడు నా సేవకుడు. ఆ జనాన్ని యూదా రాజ్యం మీదికి, దాని ప్రజలపైకి రప్పిస్తాను. అంతేగాదు. వారిని మీ చుట్టూ వున్న దేశాల మీదికి కూడ రప్పిస్తాను. ఆయా దేశాలన్నిటినీ నేను నాశనం చేస్తాను. వాటిని శాశ్వతమైన ఎడారిగా మార్చి వేస్తాను. ప్రజలు ఆయా దేశాలను చూచి అవి ఎలా నాశనమయినాయో అని విస్మయం పొందుతారు. 10 ఆ ప్రాంతంలో ఆనందోత్సాహాలను అంతం చేస్తాను. వివాహ వేడుకలు ఏ మాత్రం ఉండవు. తిరుగలి రాళ్ల శబ్దాలను, దీపాల వెలుగును మాయం చేస్తాను. 11 ఆ ప్రాంతమంతా ఒక పనికిరాని ఎడారిలా మారి పోతుంది. ఆ ప్రజలంతా బబులోను రాజుక్రింద డెబ్బయి ఏండ్ల పాటు బానిసలవుతారు.

12 “కాని డెబ్బయి సంవత్సరాల అనంతరం నేను బబులోను రాజును శిక్షిస్తాను. బబులోను రాజ్యాన్ని కూడా శిక్షకు గురి చేస్తాను.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “కల్దీయుల దేశాన్ని కూడా వారు పాపాల నిమిత్తంగా శిక్షిస్తాను. ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా ఎడారిలా మార్చివేస్తాను. 13 బబులోనుకు చాలా కష్టనష్టాలు కలుగుతాయిని చెప్పియున్నాను. అవన్నీ జరిగి తీరుతాయి. యిర్మీయా ఆ పరాయి రాజ్యాల గురించి ప్రవచించియున్నాడు. ఆ హెచ్చరికలన్నీ ఈ గ్రంథంలో వ్రాయబడినాయి. 14 అవును. బబులోను ప్రజలు చాలా దేశాలలో ఎక్కువమంది గొప్ప రాజులకు సేవలు చేయాల్సి ఉంటుంది. వారు చేసే పనులన్నిటికీ అర్హమైన శిక్ష వారికి నేను విధిస్తాను.”

ప్రపంచ రాజ్యాలపై తీర్పు

15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, ఈ ద్రాక్షా రసపు గిన్నెను నా చేతి నుండి తీసుకో. ఇది నా కోపరసం. నిన్ను నేను వివిధ దేశాలకు పంపుతున్నాను. ఆయా దేశాల వారిని ఈ గిన్నె నుండి తాగేలా చేయుము. 16 వారీ ద్రాక్షారసాన్ని తాగుతారు. పిదప వారు వాంతి చేసుకొని, పిచ్చివారిలా ప్రవర్తిస్తారు. నేను త్వరలో వారి పైకి పంపబోయే కత్తి దృష్ట్యా వారలా చేస్తారు.”

17 కావున యెహోవా చేతి నుండి నేను ఆ గిన్నె అందుకొని యెహోవా పంపిన ప్రజలందరి యొద్దకు వెళ్లాను. 18 యెరూషలేము వాసులకు, యూదా వారికి ఈ ద్రాక్షారసం పోశాను. యూదా రాజులను, నాయకులను ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. వారిని ఎడారిలా మార్చివేయాలని. నేనీ విధంగా ఎందుకు చేశానంటే ఆ ప్రదేశం సర్వనాశనం కావాలని, అది చూచి ప్రజలు కలవర పడిరి. దానిని శపించితిని. చివరికి అలానే జరిగింది. యూదా ఇప్పుడు అలానే తయారయింది.

19 ఈజిప్టు రాజైన ఫరోను కూడా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. అతని అధికారులను, అతని ముఖ్య నాయకులను, మరియు అతని ప్రజలందరినీ యెహోవా కోపపు గిన్నె నుండి తాగేలా చేశాను.

20 అరబి దేశీయులు, మరియు ఊజు దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా నేను చేశాను.

ఫిలిష్తీయుల రాజులను కూడా ఈ గిన్నెతో తాగేలా చేశాను. వీరు అష్కెలోను, గాజా, ఎక్రోను నగరాల రాజులు, మరియు అష్డోదులో మిగిలిన రాజ్యానికి అధిపతులు.

21 పిమ్మట ఎదోము, మోయాబు, మరియు అమ్మోను ప్రజలు ఈ గిన్నెతో తాగేలా చేశాను.

22 తూరు రాజులు సీదోను రాజులు కూడ ఈ గిన్నెతో తాగేలా చేశాను.

దూరదేశాపు రాజులందరి చేత ఆ గిన్నెతో తాగించాను. 23 దదాను ప్రజలు, తేమానీయులు, బూజీయులందరూ ఈ గిన్నెతో తాగేలా చేశాను. కణతల వద్ద తమ వెంట్రుకలు గొరిగించుకొనే వారందరినీ ఈ గిన్నెతో తాగేలా చేశాను. 24 అరబి రాజులంతా ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఈ రాజులు ఎడారిలో నివసిస్తారు. 25 జిమ్రీ రాజులు, ఏలాము రాజులు, మరియు మాదీయుల రాజులు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. 26 దగ్గరలో ఉన్న, దూరాన ఉన్న ఉత్తర దేశపు రాజులందరు ఈ గిన్నె నుండి తాగేలా చేశాను. ఒకరి తరువాత ఒకరు వారంతా తాగేలా చేశాను. యెహోవా కోపపు గిన్నె నుండి భూమిమీద గల రాజ్యాల వారంతా తాగేలా చేశాను. కాని బబులోను రాజు మాత్రం ఇతర రాజ్యాల వారంతా తాగిన పిమ్మట ఆ గిన్నె నుండి ఆఖరికి తాగుతాడు.

27 “యిర్మీయా! ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడని ఆయా రాజ్యాల వారికి తెలియజేయుము: ‘నా కోపపు గిన్నె నుండి తాగండి. మైకం వచ్చేలా తాగి వాంతి చేసుకోండి! క్రింద పడి మరల లేవకుండా ఉండండి. ఎందువల్లనంటే మిమ్మల్ని చంపటానికి కత్తిని మీమీదికి పంపుతున్నాను!’

28 “ఆ ప్రజలు నీ చేతి నుండి గిన్నెను తీసికోవటానికి నిరాకరిస్తారు. వారు దాని నుండి త్రాగటానికి ఒప్పుకోరు. అయినా నీవు వారిని పిలిచి ఇలా చెప్పాలి: ‘సర్వశక్తిమంతుడైన దేవుడీ సంగతులు తెలియజేస్తున్నాడు. మీరు నిజానికి ఈ గిన్నె నుండి తాగాలి! 29 నా పేరుతో పిలవబడే యోరూషలేము నగరానికి ముప్పు తేవటం మొదలు పెట్టాను. బహుశః మీరు శిక్షింపబడక పోవచ్చునని మీరనుకుంటూ ఉండవచ్చు. అయితే మీరు పొరబడుతున్నారు. మీరు శిక్షింపబడతారు. భూమి మీదనున్న ప్రజలందరినీ ఎదుర్కోవటానికి నేను కత్తిని పంపుతున్నాను.’” ఇదే యెహోవా వాక్కు.

30 “యిర్మీయా, ఈ వర్తమానం వారికి అందజేయి:
‘ఉన్నతమైన, పవిత్రమైన తన ఆలయం నుండి
    యెహోవా ఎలుగెత్తి చాటుతున్నాడు.
యెహోవా తన పచ్చిక బీడు (ప్రజలు)కు వ్యతిరేకంగా చాటుతున్నాడు.
    ఆయన ద్రాక్షారసం తీసే వారిలా బిగ్గరగా కేకలేస్తున్నాడు.
31 ఆ శబ్దం మోత భూమిపై ప్రజలందరికి చేరుతుంది.
    అసలీ శబ్దం ఎందుకు?
యెహోవా అన్ని దేశాల ప్రజలనూ శిక్షిస్తున్నాడు.
    యెహోవా ప్రజలకు వ్యతిరేకంగా తన వాదన తెలియజెప్పాడు
ఆయన ప్రజలపై తీర్పు ఇచ్చాడు.
    ఆయన కత్తితో దుష్ట సంహారం చేస్తున్నాడు.’”
ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.

32 సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పినదేమంటే:
“ఒక దేశాన్నుండి మరొక దేశానికి
    విపత్తులు త్వరలో వ్యాపిస్తున్నాయి.
అవి పెనుతుఫానులా భూమిపై
    సుదూర తీరాల వరకు వ్యాపిస్తాయి!”

33 ఆ ప్రజల శవాలు దేశం ఒక అంచు నుండి మరో అంచువరకు పడి ఉంటాయి. చనిపోయిన వారి కొరకు విలపించే వారొక్కరూ ఉండరు. ఆ శవాలను ఎవ్వరూ సేకరించి సమాధి చేయరు పశువుల పేడవలె అవి నేలపై పడి ఉంటాయి.

34 కాపరులారా (నాయకులారా), మీరు మందను (ప్రజలను) కాయవలసి ఉంది.
కాని ఓ గొప్ప నాయకులారా, రోదించటం మొదలు పెట్టండి.
    గొర్రెల కాపరులారా, నేలమీద పడి బాధతో పొర్లండి
ఎందువల్లనంటే మీరు సంహరించబడే సమయం సమీపిస్తూ ఉంది.
    మిమ్ములను కొట్టి చెల్లా చెదరు చేస్తాను. పగిలిన కుండ పెంకుల్లా మీరు చిందర వందరై పోతారు!
35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు!
    ఆ నాయకులు తప్పించుకోలేరు!
36 కాపరులు (నాయకులు) అరవటం నేను వింటున్నాను.
    మంద (ప్రజలు) కాపరులు రోదించటం నేను వింటున్నాను!
    యెహోవా వారి పచ్చిక బయళ్లను (దేశం) నాశనం చేస్తున్నాడు!
37 ఆ ప్రశాంతమైన పచ్చిక బయళ్లు (భవనాలు) నాశనం చేయబడి వట్టి ఎడారిలా అవుతాయి.
    యెహోవా మిక్కిలి కోపంగా వున్న కారణంగా ఇది జరిగింది.
38 తన గుహనుండి బయటికి వస్తున్న ఒక భయంకరమైన సింహంలా యెహోవా ఉన్నాడు.
    యెహోవా కోపంగా ఉన్నాడు!
యెహోవా కోపం ఆ ప్రజలకు హాని కల్గించింది!
    వారి రాజ్యం వట్టి ఎడారిలా అయిపోయింది.

మార్కు 11

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; లూకా 19:28-40; యోహాను 12:12-19)

11 వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’[a] అని సమాధానం చెప్పండి” అని అన్నాడు.

శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్ళను పోనిచ్చారు.

వాళ్ళా గాడిదను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి మీద పరిచారు. ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు,

“‘హోసన్నా,[b]
    ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’(A)

10 “రానున్న మన తండ్రి
    దావీదు రాజ్యం ధన్యమైనది.
మహోన్నతుడైన వానికి హోసన్నా!”

అని బిగ్గరగా కేకలు వేసారు.

11 యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి[c] వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు.

ఎండిపొయిన అంజూరపు చెట్టు

(మత్తయి 21:18-19)

12 మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు.

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మత్తయి 21:12-17; లూకా 19:45-48; యోహాను 2:13-22)

15 యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. 16 దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. 17 ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు.(B) కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు”(C) అని అన్నాడు.

18 అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు. 19 సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.

యేసు విశ్వాస శక్తిని చూపటం

(మత్తయి 21:20-22)

20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.” 26 [d]

యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 21:23-27; లూకా 20:1-8)

27 యేసు, ఆయన శిష్యులు యెరూషలేం చేరుకొన్నారు. ఆయన మందిరావరణంలో నడుస్తుండగా ప్రధానయాజకులు, శాస్త్రులు పెద్దలు ఆయన దగ్గరకు వచ్చారు. 28 వాళ్ళాయన్ని, “ఎవరిచ్చిన అధికారంతో నీవు వీటిని చేస్తున్నావు? ఇవి చేయటానికి అధికారమెవరిచ్చారు?” అని అడిగారు.

29 యేసు సమాధానంగా, “నన్ను ఒక్క ప్రశ్న అడుగనివ్వండి. దానికి మీరు సమాధానం చెప్పండి. అప్పుడు నేనివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 30 యోహాను బాప్తిస్మము పరలోకంలో నుండి వచ్చినదా? లేక మానవులనుండి వచ్చినదా? సమాధానం చెప్పండి” అన్నాడు.

31 వాళ్ళు, ఆ విషయాన్ని గురించి పరస్పరం చర్చించుకొని, “మనం ‘పరలోకం నుండి’ అని అంటే, ‘మరి అలాగైతే మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. 32 మనం ‘మానవుల నుండి’ అని అంటే ప్రజలకు మనమంటే కోపం వస్తుంది” అని అనుకున్నారు. యోహాను ఒక ప్రవక్త అని ప్రతి ఒక్కడు నమ్మటంవల్ల వాళ్ళు ప్రజలంటే భయపడ్డారు.

33 కనుక వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.

యేసు, “అలాగైతే నేను కూడా యివి ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International