Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 10:1-11:11

న్యాయముర్తి తోలా

10 అబీమెలెకు చనిపోయిన తరువాత ఇశ్రాయేలు ప్రజలను రక్షించుటకు దేవుడు మరో న్యాయమూర్తిని పంపించాడు. ఆ మనిషి పేరు తోలా. తోలా, పువ్వా అనే పేరుగల మనిషి కుమారుడు. పువ్వా, దోదో అనే పేరుగల వాని కుమారుడు. తోలా ఇశ్శాఖారు వంశానికి చెందినవాడు. తోలా షామీరు పట్టణంలో నివసించేవాడు. షామీరు పట్టణం ఎఫ్రాయిము కొండ దేశంలో ఉంది. తోలా ఇరవైమూడు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. తర్వాత తోలా చనిపోయి, షామీరు పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.

న్యాయమూర్తి యాయీరు

తోలా మరణించిన తరువాత మరో న్యాయమూర్తి దేవుని చేత పంపబడ్డాడు. ఆ మనిషి పేరు యాయీరు. యాయీరు గిలాదు ప్రాంతంలో నివసించేవాడు. యాయీరు ఇరవైరెండు సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయమూర్తిగా ఉన్నాడు. యాయీరుకు ముప్పయి మంది కుమారులు. ఆ ముప్పయి మంది కుమారులు ముప్పయి గాడిదల మీద తిరిగేవారు. వారు గిలాదు ప్రాంతంలోని ముప్పయి పట్టణాల మీద అధికారం చేసేవారు. ఈ రోజు వరకు ఆ పట్టణాలు యాయీరు పట్టణాలు అని పిలువబడుతున్నాయి. యాయీరు మరణించి కామోను పట్టణంలో పాతిపెట్టబడ్డాడు.

అమ్మోనీయులు ఇశ్రాయేలు మీద యుద్ధం చేయుట

మరల ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా చెడ్డవి అని చెప్పిన వాటినే చేసారు. బూటకపు దేవతలు బయలు, అష్టారోతులను వారు పూజించటం మొదలు పెట్టారు. వారు అరాము ప్రజల దేవుళ్లను, సీదోను ప్రజల దేవుళ్లను, మోయాబు ప్రజల దేవుళ్లను, అమ్మోను ప్రజల దేవుళ్లను, ఫిలిష్తీయ ప్రజల దేవుళ్లను కూడా పూజించారు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను విడిచిపెట్టి ఆయనను సేవించటం మానుకున్నారు.

కనుక ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు కోపం వచ్చింది. ఫిలిష్తీ ప్రజలు, అమ్మోను ప్రజలు వారిని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. అదే సంవత్సరం యోర్దాను నదికి తూర్పు వైపునగల గిలాదు ప్రాంతంలో నివసించే ఇశ్రాయేలు ప్రజలను ఆ మనుష్యులు నాశనం చేసారు. అది అమ్మోరీ ప్రజలు నివసించిన దేశం. ఆ ఇశ్రాయేలు ప్రజలు పద్దెనిమిది సంవత్సరాలు శ్రమ అనుభవించారు. అప్పుడు అమ్మోనీయులు యోర్దాను నది దాటి వెళ్లారు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము ప్రజల మీద యుద్ధం చేసేందుకు వారు వెళ్లారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలకు అనేక కష్టాలు కలిగించారు.

10 కనుక ఇశ్రాయేలు ప్రజలు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. “దేవా, మేము నీకు విరోధంగా పాపం చేశాము. మేము మా దేవుని విడిచిపెట్టి బూటకపు బయలు దేవతను పూజించాము” అని వారు చెప్పారు.

11 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా జవాబు చెప్పాడు: “ఈజిప్టు ప్రజలు అమ్మోరీయులు, అమ్మోనీయులు, ఫిలిష్తీయులు మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. వారి బారినుండి నేను మిమ్మల్ని రక్షించాను. 12 సీదోను ప్రజలు, అమాలేకీయులు, మిద్యానీయులు[a] మిమ్మల్ని బాధించినప్పుడు మీరు నాకు మొరపెట్టారు. ఆ ప్రజల నుండి కూడా నేను మిమ్మల్ని రక్షించాను. 13 కానీ మీరు నన్ను విడిచిపెట్టేశారు. మీరు ఇతర దేవుళ్లను పూజించారు. కనుక మిమ్మల్ని మరల రక్షించటానికి నేను నిరాకరిస్తున్నాను. 14 ఆ దేవుళ్లను పూజించటం మీకు ఇష్టం కనుక వెళ్లి, సహాయం కోసం వాటికి మొరపెట్టండి. మీరు కష్టంలో ఉన్నప్పుడు ఆ దేవుళ్లనే మీకు సహాయం చేయనీయండి.”

15 కానీ ఇశ్రాయేలు ప్రజలు, “మేము పాపం చేశాము. మమ్మల్ని నీవు ఏమి చేయాలనుకొంటే అలాగే చేయి. కానీ ఈ వేళ నీవు మమ్మల్ని రక్షించు” అని యెహోవాను అడిగారు. 16 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ అన్యదేవతలను పారవేశారు. వారు మరల యెహోవాను ఆరాధించటం మొదలు పెట్టారు. కనుక వారు శ్రమపడుతున్నప్పుడు యెహోవా వారిని చూచి సంతాపపడ్డాడు.

నాయకునిగా యెఫ్తా ఎన్నుకోబడుట

17 అమ్మోనీయులు యుద్ధానికి సమావేశమయ్యారు. గిలాదు ప్రాంతంలో వారు విడిది చేసారు. ఇశ్రాయేలు ప్రజలు ఒక్కచోట సమావేశమయ్యారు. మిస్పా పట్టణం వద్ద ఉంది వారి విడిది. 18 గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజల నాయకులు, “అమ్మోను ప్రజలమీద దాడి చేసేందుకు మనల్ని ఎవరు నడిపిస్తారు? ఆ మనిషి, గిలాదు ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ ప్రధాని అవుతాడు” అన్నారు.

11 యెఫ్తా గిలాదు వంశంవాడు. అతడు బలమైన సైనికుడు. అయితే యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. అతని తండ్రి పేరు గిలాదు. గిలాదు భార్యకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు పెద్దవారైనప్పుడు, యెఫ్తా అంటే వారికి ఇష్టంలేకపోయింది. ఆ కుమారులు యెఫ్తాను అతని స్వగ్రామం నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. “మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లేదు. నీవు మరో స్త్రీ కుమారుడివి” అని వారు అతనితో చెప్పారు. కనుక యెఫ్తా తన సోదరుల మూలంగా వెళ్లిపోయాడు. అతడు టోబు దేశంలో నివసించాడు. టోబు దేశంలో కొందరు అల్లరి జనం యెఫ్తాను వెంబడించటం మొదలు పెట్టారు.

కొంతకాలం తర్వాత అమ్మోనీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు గనుక గిలాదులోని పెద్దలు (నాయకులు) యెఫ్తా దగ్గరకు వెళ్లారు. యెఫ్తా టోబు దేశం విడిచిపెట్టి, గిలాదుకు తిరిగి రావాలని వారు కోరారు.

ఆ పెద్దలు, “మనం అమ్మోనీయులతో యుద్ధం చేయగలిగేటట్టు, నీవు వచ్చి మాకు నాయకునిగా ఉండు” అని యెఫ్తాతో చెప్పారు.

కానీ యెఫ్తా, “మీరే నన్ను నా తండ్రి ఇంటి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. నేనంటే మీకు అసహ్యం. కనుక మీకు కష్టం వచ్చిందని మీరు ఇప్పుడు నా దగ్గరకు రావటం ఎందుకు?” అని గిలాదు దేశపు పెద్దలను (నాయకులను) అడిగాడు.

“ఆ కారణం వల్లనే ఇప్పుడు మేము నీ దగ్గరకు వచ్చాము. దయచేసి మాతో వచ్చి అమ్మోనీయుల మీద యుద్ధం చేయి. గిలాదులో నివసిస్తున్న ప్రజలందరి మీద నీవు సైన్యాధికారిగా ఉంటావు” అని గిలాదు పెద్దలు యెఫ్తాతో చెప్పారు.

అప్పుడు యెఫ్తా, “నేను గిలాదుకు తిరిగి వచ్చి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలని మీరు కోరితే, మంచిదే. కానీ గెలిచేందుకు యెహోవా నాకు సహాయం చేస్తే, అప్పుడు మీకు నేను కొత్త నాయకునిగా ఉంటాను” అని గిలాదు పెద్దలతో చెప్పాడు.

10 గిలాదు పెద్దలు (నాయకులు), “మనం చెప్పుకొంటున్నది అంతా యెహోవా వింటున్నాడు. మేము చేయాలని నీవు చెప్పేది అంతా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము” అని యెఫ్తాతో చెప్పారు.

11 కనుక గిలాదు పెద్దలతో యెఫ్తా వెళ్లాడు. ఆ ప్రజలు యెఫ్తాను తమ నాయకునిగా, సైన్యాధికారిగా చేసుకున్నారు. మిస్పా పట్టణంలో యెహోవా ఎదుట యెఫ్తా తన మాటలన్నింటినీ మళ్లీ చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 14

ఈకొనియలో

14 ఈకొనియలో పౌలు, బర్నబా ఎప్పటిలాగే యూదుల సమాజమందిరానికి వెళ్ళి, బాగా మాట్లాడారు. తద్వారా చాలా మంది యూదులు, యూదులు కానివాళ్ళు విశ్వాసులయ్యారు. వాళ్ళ సందేశాన్ని నమ్మని యూదులు, యూదులు కానివాళ్ళను రేకెత్తించి మన సోదరులకు విరుద్ధంగా వాళ్ళ మనసుల్ని పాడుచేసారు.

కాబట్టి, వాళ్ళు ప్రభువు పట్ల తమ విశ్వాసము విడువక ధైర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలాకాలం ఉన్నారు. ప్రభువు వాళ్ళకు అద్భుతాలను, మహిమలను చేసే శక్తినిచ్చాడు. ఈ విధంగా తన అనుగ్రహాన్ని గురించి రుజువు చేసాడు. ఆ పట్టణంలోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి కొందరు యూదుల పక్షం, మరికొందరు అపొస్తలుల పక్షం చేరిపోయారు.

యూదులు కానివాళ్ళు, యూదులు తమ తమ నాయకులతో కలిసి అపొస్తలుల్ని అవమానించి, రాళ్ళతో కొట్టి చంపివేయాలనుకొన్నారు. కాని అపొస్తలులు ఇది కనిపెట్టి లుకయొనియలోని లుస్త్ర, దెర్బే అనే పట్టణాల చుట్టూ ఉన్న ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఆయా ప్రాంతాల్లో వాళ్ళు దేవుని సువార్తను ప్రకటించటం కొనసాగించారు.

లుస్త్ర, దెర్బే పట్టణాల్లో

లుస్త్రలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు. పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి, 10 “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు.

11 పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు. 12 బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. 13 వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు.

14 కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు: 15 “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికిరానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు.

16 “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు. 17 కాని ఆకాశంనుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.”

18 ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.

19 కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు. 20 శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు.

పిసిదియ ప్రాంత సేవను బలపర్చటం

21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. 22 శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు. 23 పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించినవాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.

24 ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంఫూలియ చేరుకొన్నారు. 25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు. 26 అత్తాలియనుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.

సిరియా అంతియొకయకు తిరిగి రావటం

27 అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు. 28 వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.

యిర్మీయా 23

23 “యూదా కాపరులకు (నాయకులకు) చాలా చెడ్డదిగా ఉంటుంది. వారు నా గొర్రెలను (ఇశ్రాయేలీయులను) చెదరు గొట్టుతున్నారు. నా పచ్చిక బయలు నుండి గొర్రెలను పొమ్మని నలుదిశలా తోలి వేస్తున్నారు.” ఇది యెహోవా నుంచి వచ్చిన వాక్కు.

ఆ కాపరులు (నాయకులు) నా ప్రజలకు బాధ్యులు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆ కాపరులకు ఈ విషయాలు చెపుతున్నాడు: “ఓ కాపరులారా (నాయకులు), మీరు నా గొర్రెల మందను నలుదిశలా పారిపోయేలా చేశారు. వారు పోవటానికి మీరు ఒత్తిడి తెచ్చారు. మీరు వారిని గురించి శ్రద్ధ వహించలేదు. కాని నేను మీతో వ్యవహరిస్తాను. మీరు చేసిన చెడుకార్యాలకు నేను మిమ్మల్ని శిక్షిస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “నేను నా గొర్రెల మందను (ప్రజలను) ఇతర దేశాలకు పంపాను. పోయిన నా మందలను (ప్రజలను) నేను చేరదీస్తాను. వాటిని పచ్చిక బయలుకు (దేశానికి) మరల చేర్చుతాను. నా మందలు (ప్రజలు) వాటి పచ్చిక బీటికి (దేశానికి) తిరిగి చేరుకోగానే వాటికి సంతానోత్పత్తి జరిగి, అభివృద్ధి చెందుతాయి. నా గొర్రెల మందపై నేను క్రొత్త కాపరులను (నాయకులను) నియమిస్తాను. ఆ కాపరులు నా మంద విషయమై శ్రద్ధ వహిస్తారు. నా మంద బెదరిపోయేలా గాని, జడిసి పోయేలా గాని చేయబడదు. నా మందలో ఒక్క గొర్రె కూడా తప్పిపోదు.” ఇదే యెహోవా వాక్కు.

నీతియుక్తమైన “అంకురం” (క్రొత్త రాజు)

“నేనొక నీతి యుక్తమైన అంకురాన్ని[a] మొలిపింప జేసే సమయం వస్తూవుంది,”
ఇదే యెహోవా వాక్కు.
    అతడు మంచి తెలివి తేటలతో పరిపాలించగల రాజు.
    దేశానికి ఏది యోగ్యమైనదో, ఏది మంచిదో అతడది చేస్తాడు.
శుద్ధమైన మంచి బీజోత్పత్తి సమయమందు యూదా ప్రజలు రక్షింపబడతారు.
    ఇశ్రాయేలు సురక్షితంగా నివసిస్తుంది.
“యెహోవా మనకు న్యాయం”[b]
    అని అతనికి పేరుగా ఉంటుంది.

కావున సమయం ఆసన్నమవుతూ ఉంది ఇదే యెహోవా వాక్కు, “అప్పుడు ప్రజలు ఎంత మాత్రం యెహోవా పేరుమీద పాతవిధంగా ప్రమాణం చేయరు. ‘నిత్యుడగు యెహోవా తోడు’ అనేది ‘ఈజిప్టు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించి తీసికొని వచ్చిన యెహోవా తోడు’ అనేవి పాత ప్రమాణాలు. కాని ఇశ్రాయేలు ప్రజలు క్రొత్త విధంగా ప్రమాణం చేస్తారు. ‘నిత్యుడగు యెహోవా తోడు. యెహోవా తన ప్రజలను ఉత్తర రాజ్యం నుండి విముక్తి చేసి తీసుకొని వచ్చాడు. ఆయన వారిని పంపిన రాజ్యాలన్నిటి నుండి ప్రజలను తిరిగి తీసికొని వచ్చాడు’ అని ప్రజలు చెప్పుకుంటారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వదేశంలో నివసిస్తారు.”

దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పు

ప్రవక్తలకు పవిత్రమైన మాటలు:
నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది.
    నా ఎముకలు వణుకుతున్నాయి.
నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను.
    యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.
10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది.
    వారనేక విధాలుగా అవిశ్వాసులై ఉన్నారు.
యెహోవా రాజ్యాన్ని శపించాడు.
    అందుచే అది బీడై పోయింది.
పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి.
    పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి.
ప్రవక్తలంతా దుష్టులయ్యారు.
    ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు.
    వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.”
ఇదే యెహోవా వాక్కు.

12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను.
    వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచినట్లుంటుంది.
ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది.
    గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు.
వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను.
    ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.”
ఇదే యెహోవా వాక్కు.

13 “సమరయ[c] ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను.
బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను.
    ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.
14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన
    పనులు చేయటం నేను చూశాను.
ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు.
    వారు అబద్ధాలను వింటారు.
వారు తప్పుడు బోధలను అనుసరించారు.
    వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు.
అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు.
    వారు సొదొమ నగరం వలె ఉన్నారు.
యెరూషలేము ప్రజలు నా దృష్టిలో
    గొమొర్రా నగరం వలె ఉన్నారు!”
15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు.
“ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
    ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది.
ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన
    ఒక రుగ్మతను ప్రబలింప చేశారు.
ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
    ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”

16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు:
    “ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు.
    వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు.
    కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు.
వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.
17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు.
    అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు.
    ‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు.
కొంత మంది ప్రజలు బహు మొండివారు.
    వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు.
కావున వారికి ఆ ప్రవక్తలు,
    ‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.
18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో[d] నిలవలేదు.
    వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు.
    వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.
19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది!
యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది!
    ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.
20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు
    ఆయన కోపం చల్లారదు.
అంత్యదినాల్లో దీనిని మీరు
    సరిగా అర్థం చేసుకుంటారు.
21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు.
    కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు.
నేను వారితో మాట్లాడలేదు.
    కాని వారు నా పేరుతో ప్రవచించారు.
22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే
    వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు.
ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు.
    వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”

23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను.
    నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను.
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం
    నేను దూరంలో లేను!
24 ఒక వ్యక్తి నాకు కనపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు.
కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే
    నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”

25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను. 26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలోచిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు. 27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు. 28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి. 29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహోవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.

30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.[e] 31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు. 32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు.

యెహోవా నుండి విషాద వార్త

33 “యూదా ప్రజలు గాని, ఒక ప్రవక్త గాని, లేక ఒక యాజకుడు గాని నిన్ను పిలిచి, ‘యిర్మీయా, యెహోవా ఏమి ప్రకటిస్తున్నాడు?’ అని అడుగవచ్చు. అప్పుడు వారికి సమాధానంగా, ‘యెహోవాకు మీరే భారంగా[f] ఉన్నారు! ఈ పెద్ద భారాన్ని క్రిందికి విసరి వేస్తాను.’ ఇదే యెహోవా వాక్కు, అని నీవు చెప్పు.

34 “ఒక ప్రవక్తే గాని, యాజకుడే గాని, లేక ప్రజలలో ఎవ్వరే గాని, ‘ఇది యెహోవా నుండి వచ్చిన ప్రకటన ….’ అని చెప్పితే, అది అబద్ధం. అటువంటి వ్యక్తిని, వాని కుటుంబాన్నంతటినీ నేను శిక్షిస్తాను. 35 మీరొకరికొకరు ఇలా చెప్పుకోండి, ‘యెహోవా ఏమి సమాధానమిచ్చాడు?’ లేక ‘యెహోవా ఏమి చెప్పాడు?’ 36 అంతేగాని మరెన్నడు, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం)’ అనే పదాన్ని తిరిగి మరలా వాడరు. ఎందువల్లనంటే యెహోవా సందేశం ఎన్నడూ, ఎవరికీ భారం కాకూడదు. కాని మీరు మన దేవుని మాటలు మార్చివేశారు! ఆయన నిత్యుడైన సర్వశక్తిమంతుడగు యెహోవా!

37 “మీరు దేవుని సందేశం తెలుసుకొనదలిస్తే ఒక ప్రవక్తను, ‘యెహోవా నీకేమి సమాధానం చెప్పాడు’ అని గాని; ‘యెహోవా ఏమి చెప్పినాడు?’ అని గాని అడగండి. 38 కాని, ‘యెహోవా ప్రకటన (పెద్ద భారం) ఏమిటి?’ అని అడగవద్దు. మీరామాటలు వాడితే, ‘అప్పుడు యెహోవా మీకు ఈ మాటలు చెప్పుతాడు: “మీరు నా సందేశాన్ని యెహోవా ప్రకటన” (పెద్ద భారం) అని చెప్పకుండా ఉండవలసింది. ఆ మాటలు వాడవద్దని నేను మీకు చెప్పియున్నాను. 39 కాని నా సందేశాన్ని పెద్ద భారమని పిలిచారు. కావున మిమ్మల్ని పెద్ద భారంలా ఎత్తి నా నుండి విసరి పారవేస్తాను. యెరూషలేము నగరాన్ని మీ పూర్వీకులకు నేను ఇచ్చియున్నాను. కాని మిమ్మల్ని, మీ నగరాన్నీ నా నుండి దూరంగా పార వేస్తాను. 40 పైగా మీకు శాశ్వతంగా తలవంపులు కలిగేలా చేస్తాను. మీ సిగ్గును మీరెన్నడూ మరువలేరు.’”

మార్కు 9

ఆయన వాళ్ళతో, “ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యం శక్తితో రావటం చూస్తారు. దానికి ముందు వాళ్ళు మరణించరు” అని అన్నాడు.

యేసుని రూపాంతరం

(మత్తయి 17:1-13; లూకా 9:28-36)

ఆరురోజుల తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును ఒక ఎత్తైన కొండ మీదికి తనవెంట పిలుచుకు వెళ్ళాడు. వాళ్ళు అక్కడ ఏకాంతంగా ఉన్నారు. అక్కడ యేసు వాళ్ళ సమక్షంలో దివ్యరూపం పొందాడు. ఆయన దుస్తులు మెరువ సాగాయి. ప్రపంచంలో ఏ చాకలి చలువ చేయలేనంత తెల్లగా మారిపొయ్యాయి. ఏలీయా, మోషేలు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు యేసుతో మాట్లాడటం శిష్యులు చూసారు.

పేతురు యేసుతో, “రబ్బీ! మనిమిక్కడే ఉండటం మంచిది. మేము మూడు పర్ణశాలలు వేస్తాము. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి” అన్నాడు. శిష్యులు భయపడుతూ ఉండటం వల్ల పేతురుకు ఏమనాలో తోచలేదు.

అప్పుడు ఒక మేఘం కనిపించి వాళ్ళను కప్పి వేసింది. ఆ మేఘం నుండి, “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి” అని అనటం వినిపించింది.

వెంటనే వాళ్ళు తమ చుట్టూ చూశారు. మిగతా యిద్దరూ వాళ్ళకు కనిపించలేదు. యేసు మాత్రమే కనిపించాడు.

వాళ్ళు కొండదిగి క్రిందికి వస్తుండగా యేసు, “మనుష్య కుమారుడు చనిపోయి బ్రతికి వచ్చేవరకు మీరు చూసిన దృశ్యాన్ని ఎవ్వరికి చెప్పకండి” అని ఆజ్ఞాపించాడు.

10 అందువల్ల వాళ్ళావిషయాన్ని తమలోనే దాచుకొని, చనిపోయి బ్రతికి రావటాన్ని గురించి చర్చించుకొన్నారు. 11 వాళ్ళాయనతో, “ఏలీయా మొదట రావాలని శాస్త్రులు ఎందుకంటున్నారు?” అని అడిగారు.

12 యేసు సమాధానం చెబుతూ, “ఏలీయా మొదట వచ్చినప్పుడు సరి చేస్తాడన్నమాట నిజం. కాని, మనుష్యకుమారుడు కష్టాలను అనుభవించాలని, తృణీకరింపబడాలని ధర్మశాస్త్రంలో ఎందుకు వ్రాసారు? 13 ఏలీయా వచ్చాడు. లేఖనాల్లో వ్రాసిన విధంగా ప్రజలు చేయలానుకొన్నవన్నీ ఇతనికి చేసారు” అని అన్నాడు.

యేసు ఒక బాలుని దయ్యంనుండి విడిపించటం

(మత్తయి 17:14-20; లూకా 9:37-43)

14 యేసు, పేతురు, యోహాను మరియు యాకోబు మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. అక్కడ ఒక పెద్ద ప్రజల గుంపు శిష్యుల చుట్టూ ఉండటం, వాళ్ళతో ఏమో వాదిస్తూ ఉండటం చూసారు. 15 యేసును చూడగానే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి స్వాగతం చెప్పటానికి ఆయన దగ్గరకు పరుగెత్తారు.

16 యేసు శిష్యులను, “వాళ్ళతో మీరేమి వాదిస్తున్నారు” అని అడిగాడు.

17 ఆ గుంపులో నుండి ఒకడు, “అయ్యా! నేను నా కుమారుణ్ణి మీదగ్గరకు పిలుచుకు వచ్చాను. దయ్యం పట్టి అతనికి మాట పడిపోయింది. 18 ఆ దయ్యం అతని మీదికి వచ్చినప్పుడల్లా అది అతణ్ణి నేలపై పడవేస్తుంది. అప్పుడు నా కుమారుని నోటినుండి నురుగు వస్తుంది. పండ్లు కొరుకుతాడు. అతని శరీరం కట్టెబారిపోతుంది. ఆ దయ్యాల్ని వదిలించమని మీ శిష్యుల్ని అడిగాను. కాని వాళ్ళు ఆ పని చేయలేక పోయారు” అని అన్నాడు.

19 యేసు, “ఈనాటి వాళ్ళలో విశ్వాసం లేదు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మిమ్మల్ని భరించాలి? ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకురండి” అని అన్నాడు.

20 వాళ్ళు ఆ బాలుణ్ణి పిలుచుకు వచ్చారు. ఆ దయ్యం యేసును చూసిన వెంటనే, ఆ బాలుణ్ణి వణికేటట్లు చేసింది. ఆ బాలుడు క్రింద పడ్డాడు. నురుగు కక్కుతూ పొర్లాడటం మొదలు పెట్టాడు.

21 యేసు ఆ బాలుని తండ్రితో, “ఎంత కాలం నుండి యితడీవిధంగా ఉన్నాడు?” అని అడిగాడు.

“చిన్ననాటి నుండి” అని అతడు సమాధానం చెప్పాడు. 22 “ఆ దయ్యం అతణ్ణి చంపాలని ఎన్నో సార్లు అతణ్ణి నిప్పుల్లో, నీళ్ళలో పడవేసింది. మీరేదైనా చేయగల్గితే మా మీద దయవుంచి మాకు సహాయం చెయ్యండి” అని ఆ బాలుని తండ్రి అన్నాడు.

23 యేసు, “నీవు విశ్వసించగలిగితే, విశ్వాసమున్న వానికి ఏదైనా సాధ్యమౌతుంది” అని అన్నాడు.

24 వెంటనే ఆ బాలుని తండ్రి, “నేను విశ్వసిస్తున్నాను. నాలో ఉన్న అపనమ్మకం తొలిగిపోవటానికి సహాయపడండి చెయ్యండి” అన్నాడు.

25 యేసు ప్రజల గుంపు తన దగ్గరకు పరుగెత్తుకుంటూ రావటం చూసి ఆ దయ్యంతో, “ఓ చెవిటి, మూగ దయ్యమా! అతని నుండి బయటకు రమ్మని, మళ్ళీ అతనిలో ప్రవేశించవద్దని నేను ఆజ్ఞాపిస్తున్నాను” అని అన్నాడు.

26 ఆ దయ్యం కేకపెట్టి అతణ్ణి తీవ్రంగా వణికించి బయటకు వచ్చింది. ఆ బాలుడు శవంలా పడివుండుట వల్ల చాలా మంది అతడు చనిపొయ్యాడనుకొన్నారు. 27 కాని, యేసు అతని చేతులు పట్టుకొని లేపి నిలుచోబెట్టాడు.

28 ఇంట్లోకి వెళ్ళాక శిష్యులు రహస్యంగా, “మేమెందుకు వెళ్ళగొట్టలేక పొయ్యాము?” అని అడిగారు.

29 యేసు, “ఈ రకమైన దయ్యాన్ని ప్రార్థనతో[a] మాత్రమే వెళ్ళగొట్టగలము” అని సమాధానం చెప్పాడు.

యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం

(మత్తయి 17:22-23; లూకా 9:43b-45)

30-31 వాళ్ళా ప్రాంతాన్ని వదిలి గలిలయ ద్వారా ప్రయాణం సాగించారు. యేసు తన శిష్యులకు బోధిస్తూ ఉండటం వల్ల తామెక్కడ ఉన్నది కూడా ఎవ్వరికి తెలియకూడదని ఆశించాడు. ఆయన వాళ్ళతో, “ఒకడు మనుష్యకుమారునికి ద్రోహం చేసి శత్రువులకు అప్పగిస్తాడు. వాళ్ళాయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బ్రతికివస్తాడు” అని అన్నాడు. 32 కాని యేసు చెప్పింది శిష్యులకు అర్థంకాలేదు. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు భయం వేసింది.

దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?

(మత్తయి 18:1-5; లూకా 9:46-48)

33 వాళ్ళు కపెర్నహూము అనే పట్టణాన్ని చేరుకొన్నారు. అందరూ యింట్లోకి వెళ్ళాక యేసు వాళ్ళతో, “దార్లో దేన్ని గురించి చర్చించుకొన్నారు?” అని అడిగాడు. 34 వాళ్ళు వచ్చేటప్పుడు అందరికన్నా గొప్ప వాడెవరన్న విషయాన్ని గురించి చర్చించారు. కాబట్టి అందరూ మౌనంగా ఉండిపొయ్యారు.

35 యేసు కూర్చుంటూ, పన్నెండుగురిని పిలిచి, “ముఖ్యస్థానాన్ని వహించాలనుకొన్నవాడు అందరికన్నా చివరన ఉండి సేవచెయ్యాలి” అని అన్నాడు.

36 ఒక బాలుణ్ణి పిలుచుకు వచ్చి వాళ్ళ మధ్య నిలుచోబెట్టాడు. ఆ బాలుణ్ణి ఎత్తుకొని, 37 “నా పేరిట ఇలాంటి పసివానిని అంగీకరించేవాడు నన్ను అంగీకరించినవానిగా పరిగణింపబడతాడు. నన్ను అంగీకరించేవాడు నన్నే కాదు, నన్ను పంపినవానిని కూడా అంగీకరిస్తాడు” అని అన్నాడు.

మనకు విరోధికానివాడు మనవాడే

(లూకా 9:49-50)

38 “బోధకుడా! ఒకడు, మీ పేరిట దయ్యాల్ని వదిలించటం మేము చూశాము. అతడు మనవాడు కానందువల్ల అలా చెయ్యటం మానెయ్యమని అతనికి చెప్పాము” అని యోహాను అన్నాడు.

39 యేసు ఈ విధంగా అన్నాడు: “అతణ్ణి ఆపకండి, నా పేరిట అద్భుతం చేసినవాడు నాకు వ్యతిరేకంగా మాట్లాడలేడు. 40 ఎందుకంటే, మనకు వ్యతిరేకంగా లేనివాడు మన పక్షాన ఉన్న వానితో సమానము. 41 ఇది నిజం, మీరు క్రీస్తుకు చెందిన వాళ్ళని గమనించి నా పేరిట ఒక గిన్నెడు నీళ్ళు మీకు త్రాగటానికి యిచ్చినవాడు తప్పక ప్రతిఫలం పొందుతాడు.

పాపకారకుల గురించి యేసు హెచ్చరించటం

(మత్తయి 18:6-9; లూకా 17:1-2)

42 “నన్ను విశ్వసించే ఈ పసివాళ్ళు పాపం చేయటానికి కారకులు అవటంకన్నా మెడకు ఒక పెద్ద తిరుగటిరాయి కట్టుకొని సముద్రంలో పడటం మేలు. 43 మీరు పాపం చెయ్యటానికి మీ చేయి కారణమైతే దాన్ని నరికి వేయండి. ఆరని మంటలు మండే నరకానికి రెండు చేతులతో వెళ్ళటం కన్నా, అవిటివానిగా నిత్య జీవంపొందటం ఉత్తమం. 44 [b] 45 పాపం చెయ్యటానికి మీ కాలు కారణమైతే దాన్ని నరికివేయండి. రెండు కాళ్ళుండి నరకంలో పడటంకన్నా కుంటివానిగా నిత్య జీవం పొందటం ఉత్తమం. 46-47 [c] పాపం చెయ్యటానికి మీ కన్ను కారణమైతే దాన్ని పీకివేయండి. రెండు కళ్ళతో నరకంలో పడటంకన్నా ఒక కన్నుతో దేవుని రాజ్యాన్ని ప్రవేశించటం ఉత్తమం. 48 అక్కడ నరకంలో పడ్డవాళ్ళు చావరు. వాళ్ళను కరుస్తున్న పురుగులు చావవు! ఆ మంటలు ఆరిపోవు(A)

49 “ప్రతి వాడు ఈ అగ్నిలో శిక్షననుభవిస్తాడు.

50 “ఉప్పు మంచిదే. కాని దానిలో ఉన్న ఉప్పు గుణం పోతే ఆ గుణం మళ్ళీ ఏవిధంగా తేగలరు? కాబట్టి మీరు మంచివారై ఉండండి. ఒకరితో ఒకరు శాంతంగా ఉండండి.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International