M’Cheyne Bible Reading Plan
7 మరునాడు ఉదయాన్నే యెరుబ్బయలు, (గిద్యోను) మరియు అతని మనుష్యులందరూ హరోదు బావి దగ్గర దిగారు. మోరె కొండ దిగువన ఉన్న లోయలో మిద్యాను ప్రజలు బసచేసారు. ఇది గిద్యోనుకు, అతని మనుష్యులకు ఉత్తరాన ఉంది.
2 అప్పుడు యెహోవా, “మిద్యాను ప్రజలను ఓడించేందుకు నేను నీ మనుష్యులకు సహాయం చేయబోతున్నాను. కాని ఆ పని కోసం నీ దగ్గర ఉన్న మనుష్యులు చాలా ఎక్కువ మంది. ఇశ్రాయేలు ప్రజలు వారిని వారే రక్షించుకొన్నారని అతిశయించి నన్ను మరచిపోవటం నాకు ఇష్టం లేదు. 3 కనుక ఇప్పుడు నీ మనుష్యులకు ఒక ప్రకటన చెయ్యి. ‘భయపడేవారు ఎవరైనా సరే గిలాదు కొండ విడిచి పోవచ్చును. అలాంటి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోవచ్చును’ అని వారితో చెప్పుము” అని గిద్యోనుతో అన్నాడు.
ఆ సమయంలో ఇరవైరెండు వేల మంది గిద్యోనును విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కానీ ఇంకా పదివేల మంది మనుష్యులు మిగిలిపోయారు.
4 “ఇంకా చాలా మంది మనుష్యులున్నారు. ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి తీసుకుని వెళ్లు, అక్కడ నేను నీ కోసం వారిని పరీక్షిస్తాను. ‘ఇతడు నీతో వెళ్తాడు’ అని నేను చెబితే అతడు వెళతాడు. కాని నేను, ‘అతడు నీతో వెళ్లడు’ అని అంటే ఆ మనుష్యుడు వెళ్లకూడదు” అని గిద్యోనుతో యెహోవా చెప్పాడు.
5 కనుక గిద్యోను ఆ మనుష్యులను నీళ్ల దగ్గరకు క్రిందికి నడిపించాడు. ఆ నీళ్ల దగ్గర గిద్యోనుతో యెహోవా ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులను ఈ విధంగా వేరు చెయ్యి. కుక్క గతికినట్లు గతుకుతూ నీళ్లు తాగే వారంతా ఒక గుంపు. మరియు మోకాళ్ల మీద వంగి నీళ్లు తాగే మనుష్యులంతా మరో గుంపుగా చేయబడాలి.”
6 నోటి దగ్గరకు నీళ్లు తెచ్చేందుకు తమ చేతులనుపయోగించి కుక్క గతికినట్లు గతికిన వారు మూడు వందల మంది. మిగిలిన వాళ్లంతా మోకాళ్ల మీద వంగి నీళ్లు త్రాగారు. 7 యెహోవా గిద్యోనుతో, “కుక్కలా గతికి నీళ్లు తాగిన మూడువందల మందిని నేను వాడుకొంటాను. మిమ్మల్ని రక్షించేందుకు ఆ మనుష్యులను నేను వాడుకొంటాను. మరియు మిద్యాను ప్రజలను ఓడించేట్లుగా నేను చేస్తాను. మిగిలిన మనుష్యులను వారి ఇళ్లకు వెళ్లిపోనియ్యి” అని చెప్పాడు.
8 కనుక మిగిలిన ఇశ్రాయేలు మనుష్యులను గిద్యోను వారి ఇళ్లకు పంపి వేసాడు. గిద్యోను ఆ మూడు వందల మంది మనుష్యులను తన వెంట ఉంచుకొన్నాడు. ఇళ్లకు వెళ్లిపోయిన వారి బూరలను, ఆహార పదార్థాలను ఆ మూడు వందల మంది ఉంచుకొన్నారు.
గిద్యోను పాళెమునకు క్రింద లోయలో మిద్యానీయుల పాళెము ఉండెను. 9 రాత్రివేళ గిద్యోనుతో యెహోవా మాట్లాడాడు. అతనితో యెహోవా ఇలా చెప్పాడు: “లెమ్ము, మిద్యాను సైన్యాన్ని నీవు ఓడించేటట్టు నేను చేస్తాను. వారి పాళెము వద్దకు దిగి వెళ్లు. 10 ఒంటరిగా వెళ్లేందుకు నీవు భయపడితే, నీ సేవకుడు పూరాను నీ వెంట తీసుకుని వెళ్లు. 11 మిద్యాను ప్రజల పాళెము లోపలికి వెళ్లు. ఆ మనుష్యులు చెప్పుకుంటున్న విషయాలు విను. ఆ తర్వాత వారి మీద దాడి చేసేందుకు నీకు భయం ఉండదు.”
కనుక గిద్యోను, అతని సేవకుడు పూరా శత్రువుల పాళెము చివరి భాగానికి వెళ్లారు. 12 మిద్యాను ప్రజలు, అమాలేకు ప్రజలు, తూర్పు ప్రాంత ప్రజలందరూ ఆ లోయలో విడిదిచేశారు. వారు చాలామంది మనుష్యులు ఉన్నందుచేత వారు ఒక మిడతల దండులా కనిపించారు. సముద్రతీరంలో ఇసుక రేణువులవలె ఆ ప్రజలకు ఒంటెలు ఉన్నట్టు కనిపించింది.
13 గిద్యోను శత్రువుల విడిది దగ్గరకు వచ్చి, అక్కడ ఒక మనిషి మాట్లాడటం విన్నాడు. అతడు తాను చూచిన ఒక కలను గూర్చి తన స్నేహితునితో చెబుతున్నాడు, “ఒక గుండ్రని రొట్టె దొర్లుకుంటూ మిద్యాను ప్రజల విడిదిలోకి వచ్చింది. ఆ రొట్టె గుడారాన్ని బలంగా గుద్దుకోవటం చేత ఆ గుడారం తలక్రిందులై నేల మట్టంగా పడిపోయింది” అని ఆ మనిషి చెబుతూ ఉన్నాడు.
14 ఆ మనిషి స్నేహితునికి అతని కల భావం తెలుసు. “నీ కలకు ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇశ్రాయేలు వాడగు ఆ మనిషిని గూర్చినదే నీ కల. అది యోవాషు కుమారుడు గిద్యోను గూర్చినది. మిద్యాను సైన్యం అంతటినీ ఓడించేందుకు గిద్యోనుకు దేవుడు సహాయం చేస్తాడని దాని భావం” అని ఆ మనిషి స్నేహితుడు చెప్పాడు.
15 ఆ మనుష్యులు ఆ కలను గూర్చి, దాని భావం గూర్చి చెప్పుకోవటం విన్న తర్వాత గిద్యోను దేవునికి సాష్టాంగ పడ్డాడు. తర్వాత గిద్యోను ఇశ్రాయేలీయుల విడిదికి తిరిగి వెళ్లిపోయాడు. గిద్యోను ప్రజలందరినీ పిలిచి, “లేవండి! మిద్యాను ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని చెప్పాడు. 16 అప్పుడు గిద్యోను మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసాడు. ఒక్కో మనిషికీ ఒక్కో బూరను, ఒక్కో ఖాళీ కుండనూ గిద్యోను ఇచ్చాడు. ప్రతి ఖాళీ కుండలోను మండుతున్న ఒక దివిటీ ఉంది. 17 అప్పుడు గిద్యోను వారితో ఇలా చెప్పాడు: “నన్ను గమనించి నేను చేసినట్టు చేయండి. శత్రువు విడిది చివరి భాగం వరకు నన్ను అనుసరించండి. నా వెంబడి రండి. ఆ విడిది చివరి భాగానికి నేను వెళ్లగానే, సరిగ్గా నేను చేసినట్టే చేయండి. 18 మీరు శత్రువు విడిదిని చుట్టుముట్టండి. నేనూ, నాతో ఉన్న వాళ్లందరూ బూరలు ఊదుతాము. మేము బూరలు ఊదినప్పుడు మీరు కూడా మీ బూరలు ఊదండి. అప్పుడు ‘యెహోవాకు, గిద్యోనుకు విజయం అని కేకలు వేయండి!’”
19 కనుక గిద్యోను, అతనితో ఉన్న వంద మంది మనుష్యులు వారి శత్రువుల విడిది చివరి భాగానికి వెళ్లారు. కావలి వారు మారిన వెంటనే వారు అక్కడికి వచ్చారు. అది నడిజాము వేళ. గిద్యోను, అతనితో ఉన్న మనుష్యులు వారి బూరలు ఊది, వారి కుండలు పగులగొట్టారు. 20 అప్పుడు గిద్యోను మనుష్యులు మొత్తం మూడు గుంపులవారు వారి బూరలు ఊది వారి కుండలు పగులగొట్టారు. ఆ మనుష్యులు దివిటీలను వారి ఎడమ చేతులలోను, బూరలు వారి కుడిచేతులలోను పట్టుకొన్నారు. ఆ మనుష్యులు వారి బూరలు ఊదుతూ, “యెహోవాకు ఒక ఖడ్గం, గిద్యోనుకు ఒక ఖడ్గం” అని కేకలు వేసారు.
21 గిద్యోను మనుష్యులు వారు ఉన్న చోటనే నిలబడ్డారు. కాని ఆ విడిదిలో మిద్యాను వారు కేకలు వేస్తూ పారిపోవటం మొదలుపెట్టారు. 22 గిద్యోను మూడు వందల మంది మనుష్యులు వారి బూరలు ఊదటం మొదలు పెట్టగానే మిద్యాను మనుష్యులు వారి కత్తులతో వారే ఒకర్నొకరు చంపుకొనేట్టు యెహోవా చేశాడు. సెరేరాతు పట్టణం వైపు ఉన్న బేత్‌షిత్తా పట్టణానికి శత్రుసైన్యం వాళ్లు పారిపోయారు. తబ్బాతు పట్టణం దగ్గర ఉన్న ఆబేల్మెహోలా పట్టణ సరిహద్దు వరకు ఆ మనుష్యులు పారిపోయారు.
23 అప్పుడు నఫ్తాలి, ఆషేరు, మొత్తం మనష్షే వంశాల నుండి వచ్చిన సైనికులు మిద్యాను ప్రజలను తరమవలసిందిగా ఆజ్ఞాపించబడ్డారు. 24 ఎఫ్రాయిము కొండ దేశమంతటికీ గిద్యోను వార్తాహరులను పంపించాడు. “దిగి వచ్చి మిద్యాను ప్రజలను ఎదుర్కొనండి. వీరిని బేత్బారా వరకూ తరిమి, నదిని అదుపు చేసి, యోర్దాను నదిని స్వాధీనం చేసుకోండి. మిద్యాను ప్రజలు అక్కడికి చేరక ముందే ఈ పని చేయండి” అని వార్తాహరులు చెప్పారు.
కనుక ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులందరినీ వారు పిలిచారు. బేత్బారా వరకు వారు నదిని స్వాధీనం చేసుకున్నారు. 25 మిద్యాను నాయకులు ఇద్దరిని ఎఫ్రాయిము మనుష్యులు పట్టుకున్నారు. ఈ ఇద్దరు నాయకుల పేర్లు ఓరేబు, జెయేబు, ఓరేబు బండ అనుచోట ఎఫ్రాయిము మనుష్యులు ఓరేబును చంపివేసారు. జెయేబు ద్రాక్షగానుగ అనుచోట వారు జెయేబును చంపివేసారు. ఎఫ్రాయిము మనుష్యులు మిద్యాను వారిని ఇంకా తరుముతూనే ఉన్నారు. కానీ మొదట ఓరేబు, జెయేబు తలలను వారు నరికివేసి ఆ తలలను గిద్యోను వద్దకు తీసుకుని వెళ్లారు. ప్రజలు యోర్దాను నదిని దాటేచోట గిద్యోను ఉన్నాడు.
పేతురు తన అనుభవాల్ని చెప్పటం
11 అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కానివాళ్ళకు కూడా దైవసందేశం లభించిందని విన్నారు. 2 పేతురు యెరూషలేము వచ్చాడు. సున్నతి చేసుకోవాలి అని వాదించే వాళ్ళ గుంపు అతణ్ణి విమర్శిస్తూ, 3 “నీవు సున్నతి చేసుకోనివాళ్ళ యిళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి తిన్నావు!” అని అన్నారు.
4 పేతురు వాళ్ళకు జరిగింది జరిగినట్లు ఈ విధంగా విడమర్చి చెప్పటం మొదలు పెట్టాడు: 5 “నేను యొప్పే పట్టణంలో ప్రార్థిస్తుండగా నాకు దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక దివ్యమైన సంగతి చూసాను. ఆ దివ్య దర్శనంలో ఒక పెద్ద దుప్పటి లాంటిది ఆకాశంనుండి ఎవరో దాని నాలుగు మూలలు పట్టుకొని క్రిందికి దింపుతున్నట్లు చూసాను. అది నేనున్న స్థలంలో దిగింది. 6 నేను అందులో ఏముందోనని జాగ్రత్తగా చూసాను. భూమ్మీద నివసించే నాలుగు కాళ్ళ జంతువులు, క్రూర మృగాలు, ప్రాకే ప్రాణులు, గాల్లో ఎగిరే పక్షులు కనిపించాయి. 7 అంతలో నాకొక స్వరం వినిపించి నాతో, ‘పేతురూ! లే! వీటిలో ఏ జంతువునైనా చంపి దానిని తిను!’ అని అంది.
8 “‘నేనాపని చేయలేను ప్రభూ! తినకూడదన్నదాన్ని నా నాలుక ఎన్నడూ రుచి చూడలేదు’ అని నేను సమాధానం చెప్పాను.
9 “ఆకాశంనుండి ఆ స్వరం రెండవసారి యిలా అంది: ‘దేవుడు తినవచ్చని అన్నవాటిని తినకూడదని అనకు.’
10 “ఇలా మూడుసార్లు జరిగాక అది ఆకాశానికి తీసుకు వెళ్ళబడింది. 11 అదే క్షణంలో నన్ను పిలుచుకు వెళ్ళడానికి కైసరియనుండి వచ్చిన ముగ్గురు వ్యక్తులు నేనున్న యింటి ముందు ఆగారు. 12 వాళ్ళతో వెళ్ళటానికి నేను ఏ మాత్రం వెనకాడరాదని దేవుని ఆత్మ నాతో చెప్పాడు. అక్కడున్న ఆరుగురు సోదరులు కూడా నాతో వచ్చారు. మేమంతా కలిసి కొర్నేలీ యింటికి వెళ్ళాం. 13 అతడు తన యింట్లో ఒక దేవదూత ప్రత్యక్షమైన విషయము, అతణ్ణి తాను చూసిన విషయము, దేవదూత, ‘పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు, 14 అతడు మాట్లాడే విషయాలు నిన్ను, నీ యింట్లోని వాళ్ళనందరిని రక్షిస్తాయి’ అని తనతో చెప్పిన విషయము మాకు చెప్పాడు.
15 “నేను మాట్లాడటం మొదలెడుతుండగా, మొట్టమొదట మన మీదికి వచ్చినట్లే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకు కూడా వచ్చాడు. 16 ‘యోహాను నీళ్ళతో బాప్తిస్మము యిచ్చాడు కాని నీవు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతావు!’ అని అన్న యేసు ప్రభువు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి. 17 మనం యేసు క్రీస్తు ప్రభువును నమ్మినందుకు మనకిచ్చిన వరమునే దేవుడు వాళ్ళకు కూడా యిచ్చాడు. అలాంటప్పుడు దేవుణ్ణి ఎదిరించటానికి నేనెవర్ని?”
18 వాళ్ళీ మాటలు విన్నాక వేరే ఆక్షేపణలు చేయలేదు. దేవుడు యూదులు కానివాళ్ళకు కూడా మారుమనస్సు కలిగి రక్షణ పొందే అవకాశ మిచ్చాడంటూ వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు.
అంతియొకయ ప్రజలకు శుభవార్త తెలియటం
19 స్తెఫను చనిపోయిన తర్వాత జరిగిన హింసలకు భక్తులు చెదిరిపోయారు. వీళ్ళలో కొందరు ఫొనీషియ, సైప్రసు, అంతియొకయ పట్టణాలకు వెళ్ళి దైవసందేశాన్ని యూదులకు మాత్రమే చెప్పారు. 20 సైప్రసు, కురేనీ పట్టణాలకు చెందిన వీళ్ళలో కొందరు అంతియొకయకు వెళ్ళి, గ్రీకువారితో కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. 21 ప్రభువు అభయ హస్తం వాళ్ళ వెంట ఉంది. కనుక అనేకులు వాళ్ళు చెప్పిన దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి ప్రభువునందు విశ్వాసులయ్యారు.
22 యెరూషలేములో వున్న సంఘం ఈ వార్త విని బర్నబాను అంతియొకయకు పంపింది. 23 అతడు అంతియొకయకు వెళ్ళి అక్కడి ప్రజలపై దైవానుగ్రహం అమితంగా ఉండటం గమనించి చాలా ఆనందించాడు. ప్రభువు పట్ల మనసారా భక్తి చూపుతూ ఉండమని అక్కడి వాళ్ళందర్ని వేడుకున్నాడు. 24 బర్నబా ఉత్తముడు. పరిశుద్ధాత్మ ప్రభావం అతనిపై సంపూర్ణంగా ఉంది. అంతేకాక దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసం ఉంది. అనేకులు ప్రభువునందు విశ్వాసులయ్యారు.
25 ఆ తర్వాత బర్నబా, తార్సు అనే పట్టణానికి వెళ్ళి సౌలు కోసం చూసాడు. అతణ్ణి కలుసుకొని అంతియొకయకు పిలుచుకు వచ్చాడు. 26 సౌలు, బర్నబా ఒక సంవత్సరం అంతియొకయలో ఉన్నారు. అక్కడి సంఘాన్ని కలుసుకొంటూ అనేకులకు బోధించేవాళ్ళు. అంతియొకయలోని శిష్యులు మొదటిసారిగా “క్రైస్తవులు” అని పిలువబడ్డారు.
27 ఆ రోజుల్లో కొంత మంది ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చారు. 28 వాళ్ళలో ఒకతని పేరు అగబు. అతడు లేచి నిలబడి పరిశుద్ధాత్మ శక్తితో, “తీవ్రమైన కరువు త్వరలో ప్రపంచమంతా రాబోతోంది” అని సూచించాడు. ఈ కరువు క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో సంభవించింది. 29 ఇది విని అంతియొకయలో ఉన్న శిష్యులు యూదయలో నివసిస్తున్న తమ సోదరుల కోసం తమకు చేతనయిన సహాయం వాళ్ళు చెయ్యాలని నిర్ణయించుకొన్నారు. 30 అనుకొన్న విధంగా బర్నబా, సౌలు ద్వారా తాము పంపదలచిన వాటిని యూదయలోని పెద్దలకు పంపారు.
యిర్మీయా, పషూరు
20 ఆ దేవాలయంలో పషూరు అనబడే ఒక యాజకుడున్నాడు. అతడు దేవాలయంలో ప్రధానాధికారి. పషూరు తండ్రి పేరు ఇమ్మేరు. యిర్మీయా ఈ భవిష్యత్ విషయాలు ఆలయ ప్రాంగణంలో చెప్పటం పషూరు విన్నాడు. 2 అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య[a] వేయించాడు. 3 ఆ మరునాడు యిర్మీయాను పషూరు బొండ కొయ్య బంధం నుండి తొలగించాడు. అప్పుడు యిర్మీయా పషూరుతో ఇలా అన్నాడు, “దేవుడు నిన్ను పిలిచే పేరు పషూరు కాదు. ఆయన నీకు మాగోర్ మిస్సాబీబ్[b] అని పేరు పెడతాడు. 4 ఎందువల్లనంటే దేవుడు ఇలా చెపుతున్నాడు: ‘నీ వంటే నీకె భీతి కలిగేలా త్వరలో చేస్తాను! అంతేగాదు. నీవంటే నీ స్నేహితులందరికీ భయాందోళనలు కలిగేలా చేస్తాను. నీ స్నేహితులంతా శత్రువుల కత్తికి గురియై చనిపోతూ వుంటే నీవు చూస్తూ వుంటావు. యూదా ప్రజలందరినీ బబులోను రాజుకు అప్పగిస్తాను. అతడు యూదా వారందరినీ బబులోను దేశానికి తీసికొని పోతాడు. తన సైనికులు యూదా ప్రజలను కత్తులతో నరికి వేస్తారు. 5 యెరూషలేము నగర వాసులు ధనాన్ని కూడబెట్టటానికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకు చాలా కష్టపడినారు. కాని వాటన్నిటినీ వారి శత్రువులకు ఇచ్చివేస్తాను. యెరూషలేములోని రాజుకు ధనాగారాలు వున్నాయి. ఆ ధనాగారాలను నేను శత్రువుకు ఇచ్చివేస్తాను. శత్రువు ఆ ధనరాశులను తీసుకొని బబులోను దేశానికి పట్టుకు పోతాడు. 6 ఓ పషూరూ, నీవు, మరియు నీ ఇంటి వారందరునూ కూడా తీసుకొని పోబడతారు. బబులోనులో నివసించటానికి నీవు బలవంతంగా కొనిపోబడతావు! నీవు బబులోనులోనే చనిపోతావు. నీవా అన్య దేశంలోనే సమాధి చేయబడతావు. నీ స్నేహితులకు నీవు అబద్ధాలు బోధించావు. నేను చెప్పే విషయాలన్నీ జరగవని నీవు చెప్పినావు. నీ సహచరులంతా బబులోనులో చనిపోయి అక్కడే సమాధి చేయబడతారు.’”
ఐదవసారి యిర్మీయా విన్నపం
7 యెహోవా, నీవు నన్ను భ్రమలో పడవేశావు. నేను నిజంగా మోసగింపబడ్డాను.
నీవు నాకంటె బలవంతుడవు, అందువల్ల నీవు గెలిచావు.
నేను నవ్వుల పాలయ్యాను.
రోజంతా ప్రజలు నన్ను జూచి నవ్వటం ఎగతాళి చేయటం మొదలు పెట్టారు.
8 నేను మాట్లాడిన ప్రతిసారీ అరుస్తున్నాను.
దౌర్జన్యం గురించి, వినాశనాన్ని గురించి నేను ఎప్పుడూ అరుస్తున్నాను.
యెహోవా నుంచి నాకు అందిన సమాచారాన్నే నేను బహిరంగంగా చెపుతున్నాను.
కాని నా ప్రజలు నన్ను కేవలం అవమానపర్చి,
హేళనచేస్తున్నారు.
9 “నేనిక దేవుని గురించి మర్చిపోతాను.
ఇక ఏ మాత్రం దేవుని నామం పేరిట నేను మాట్లాడను!”
అని నేను కొన్ని సార్లు అనుకున్నాను.
కాని నేనలా అన్నప్పుడు దేవుని వర్తమానం నాలో అగ్నిలా రగులుతుంది!
అది నన్ను లోపల దహించి వేస్తుంది.
దేవుని వర్తమానం నాలో ఇముడ్చుకొన ప్రయత్నించి వేసారి పోయాను.
ఇక ఎంత మాత్రం దానిని నాలో వుంచుకోలేను.
10 అనేక మంది నాకు వ్యతిరేకంగా గుసగుసలాడు కోవటం నేను వింటున్నాను.
ప్రతి చోటా నన్ను భయపెట్టే విషయాలు వింటున్నాను.
నా స్నేహితులు కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
నేనేదైనా తప్పు చేయాలని జనం కనిపెట్టుకుని వున్నారు.
“మనం అబద్ధమాడి అతడేదైనా తప్పు చేశాడని చెపుదాం!
లేదా యిర్మీయాను మనం మోసపుచ్చవచ్చు!
అప్పుడతనిని మనం ఎలాగో ఇరికించవచ్చు.
తద్వారా అతనిని మనం వదిలించుకోవచ్చు.
లేదా అప్పుడు మనం అతనిని పట్టుకొని మన కక్ష తీర్చుకోవచ్చు” నని వారంటున్నారు.
11 కాని యెహోవా నాతో వున్నాడు.
యెహోవా ఒక బలమైన సైనికునిలా వున్నాడు.
కావున నన్ను తరిమే వారంతా పడిపోతారు.
వారు నన్ను ఓడించలేరు.
వారి ప్రయత్నం వ్యర్థం.
వారు ఆశా భంగం చెందుతారు.
వారు అవమానం పాలవుతారు.
వారి అవమానాన్ని వారెన్నడు మరువలేరు.
12 సర్వశక్తి మంతుడవైన ఓ యెహోవా, నీవు మంచి వారిని పరీక్షిస్తావు.
మనిషి గుండెలోకి, మనస్సులోకి సూటిగా నీవు చూడగలవు.
ఆ ప్రజలకు వ్యతిరేకంగా నావాదాన్ని నేను నీకు విన్నవించాను
కావున నీవు వారికి తగిన శిక్ష విధించటం నన్ను చూడనిమ్ము.
13 యెహోవాను ఆరాధించుము! యెహోవాను స్తుతించుము!
యెహోవా పేద వారిని ఆదుకుంటాడు!
ఆయన వారిని దుర్మార్గుల బారి నుండి రక్షిస్తాడు!
యిర్మీయా ఆరవసారి మొరపెట్టుకొనుట
14 నేను పుట్టిన రోజు శపింపబడును గాక!
నా తల్లీ! నన్ను నీవు కన్న రోజును ఆశీర్వదించవద్దు.
15 నేను పుట్టినట్లు నా తండ్రికి వర్తమానం యిచ్చిన మనుష్యుని శపించుము
“నీకు పుత్ర సంతానం కలిగింది”
అని చెప్పి అతడు
నా తండ్రిని మిక్కిలి సంతోషపరిచాడు.
16 యెహోవా సర్వనాశనం చేసిన ఆ నగరాల మాదిరిగానే[c] ఆ మనుష్యుడు కూడా దౌర్భాగ్యుడగును గాక!
యెహోవా ఆ నగరాలపై ఏమాత్రం కనికరం చూపలేదు
వారు ఉదయాన్నే యుద్ధ నినాదాలను విందురుగాక!
మధ్యాహ్న సమయంలో అతడు యుద్ధశోకాలు వినును గాక!
17 ఎందువల్లననగా అతడు నేను నా తల్లి గర్భంలో
ఉండగానే నన్ను చంపలేదు.
అతడే గనుక అప్పుడు నన్ను చంపి వుంటే
నా తల్లి గర్భమే నాకు నా సమాధి అయివుండేది.
నేను పుట్టివుండే వాడినే కాను.
18 నా తల్లి గర్భం నుండి నేనెందుకు బయటికి వచ్చినట్లు?
నేను వచ్చి చూచినదంతా కష్టము, దుఃఖమే!
నా జీవితం అవమానంతో అంతమవుతుంది.
యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం
(మత్తయి 13:53-58; లూకా 4:16-30)
6 యేసు అక్కడినుండి తన శిష్యులతో కలిసి స్వగ్రామానికి వెళ్ళాడు. 2 విశ్రాంతి రోజు రాగానే సమాజమందిరంలో బోధించటం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపడ్డారు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా మాట్లాడుకొన్నారు. “ఈయన కింత జ్ఞానం ఏవిధంగా లభించింది? ఈ జ్ఞానం ఎలాంటిది? ఈయన మహత్యాలు ఎట్లా చేస్తున్నాడు. 3 ఈయన వడ్రంగి కదా! మరియ కుమారుడు కదూ! యాకోబు, యోసేపు, యూదా, సీమోనుల సోదరుడే యితడు. ఇతని చెల్లెండ్లు యిక్కడ మనతోనే ఉన్నారు కదూ!” అని అంటూ వాళ్ళు ఆయన్ని తృణీకరించారు.
4 యేసు వాళ్ళతో, “ప్రవక్తకు స్వగ్రామంలో, తన బంధువుల్లో, తన యింట్లో తప్ప అన్నిచోట్లా గౌరవం లభిస్తుంది” అని అన్నాడు. 5 యేసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి, వాళ్ళకు నయం చేయటం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేక పోయాడు. 6 వాళ్ళలో విశ్వాసం లేక పోవటం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత యేసు, గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు.
యేసు అపోస్తలులను పంపటం
(మత్తయి 10:1, 5-15; లూకా 9:1-6)
7 ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్ళకు దయ్యాలపై అధికారమిచ్చాడు. ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ, 8 వాళ్ళకు ఈ విధంగా ఉపదేశించాడు: “ప్రయాణం చేసేటప్పుడు చేతి కర్రను తప్ప మరేది తీసుకు వెళ్ళకండి. ఆహారము, సంచీ, దట్టీలో డబ్బు, తీసుకువెళ్ళకండి. 9 చెప్పులు వేసుకోండి. కాని మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి. 10 ఒకరి యింటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ యింట్లోనే ఉండండి. 11 ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతమివ్వక పోతే, లేక మీ బోధనల్ని వినకపోతే మీరా గ్రామం వదిలేముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ కాలికంటిన వాళ్ళ ధూళిని దులపండి.”[a]
12 వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారుమనస్సు పొందమని బోధించారు. 13 ఎన్నో దయ్యాలను వదిలించారు. చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనెరాచి నయం చేసారు.
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మత్తయి 14:1-12; లూకా 9:7-9)
14 యేసుకు పేరు ప్రఖ్యాతులు రావడంతో హేరోదు రాజుకు వీటిని గురించి తెలిసింది. బాప్తిస్మము[b] నిచ్చే యోహాను బ్రతికివచ్చాడని, కనుకనే మహత్వపూర్వకమైన కార్యాలు చేసేశక్తి అతనిలో ఉన్నదని అన్నాడు.
15 “ఆయన ఏలియా” అని కొందరన్నారు.
“ఆయన ప్రవక్త, పూర్వకాలపు ప్రవక్తల్లాంటివాడు” అని మరికొందరన్నారు.
16 కాని హేరోదు వీటిని గురించి విని, “నేను తల నరికించిన యోహాను బ్రతికి వచ్చాడు” అని అన్నాడు.
బాప్తిస్మము నిచ్చే యోహాను మరణం
17 క్రితంలో హేరోదు, స్వయంగా యోహానును బంధించి కారాగారంలో వేయమని ఆజ్ఞాపించాడు. తాను వివాహం చేసుకొన్న హేరోదియ కారణంగా ఈ పని చేయవలసి వచ్చింది. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పు భార్య. 18 పైగా యోహాను హేరోదుతో, “నీ సహోదరుని భార్యను చేసుకోవటం అన్యాయం” అంటూ ఉండేవాడు. 19 అందువల్ల హేరోదియకు యోహాను అంటే యిష్టం వుండేదికాదు. అంతేకాక, ఆమె అతణ్ణి చంపి వేయాలని ఆశించింది. కాని యోహాను అంటే హేరోదు భయపడేవాడు. కనుక అలాచెయ్య లేక పొయ్యాడు. 20 పైగా యోహాను నీతిమంతుడని, పవిత్రమైనవాడని హేరోదుకు తెలుసు. కనుక అతణ్ణి కాపాడుతూ వుండేవాడు. హేరోదు యోహాను మాటలు విన్నప్పుడు ఎంతో కలవరం చెందేవాడు, అయినా అతని మాటలు వినటానికి యిష్టపడేవాడు.
21 చివరకు హేరోదియకు అవకాశం లభించింది. హేరోదు తన రాజ్యంలోని ప్రముఖ అధికారులను, సైన్యాధిపతులను గలిలయలోని ప్రముఖులను పిలిచి తన పుట్టినరోజు పండుగ చేసాడు. 22 హేరోదియ కూతురు వచ్చి నాట్యం చేసింది. ఆమె హేరోదును, అతని అతిథుల్ని మెప్పించింది.
హేరోదు ఆమెతో, “నీకు కావలసింది ఏదైనా కోరుకో! యిస్తాను!” అని అన్నాడు. 23 “నీవేదడిగినా యిస్తాను, అర్ధ రాజ్యాన్నైనా సరే!” అని ప్రమాణం చేసాడు.
24 ఆమె వెళ్ళి తన తల్లితో, “నన్నేమి కోరుకోమంటావు?” అని అడిగింది.
“బాప్తిస్మము నిచ్చే యోహాను తల కోరుకో!” అని ఆమె సమాధానం చెప్పింది.
25 వెంటనే ఆమె రాజు దగ్గరకు పరుగెత్తి, “బాప్తిస్మము నిచ్చే యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే యిప్పించమని మిమ్మల్ని వేడుకొంటున్నాను” అని అన్నది.
26 రాజుకు చాలా దుఃఖం కలిగింది. కాని తాను ప్రమాణం చేసాడు. పైగా అతిథులక్కడే ఉన్నారు. కనుక ఆమె కోరికను నిరాకరించ దలచుకోలేదు. 27 అందువల్ల అతడు వెంటనే యోహాను తల తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుణ్ణి పంపాడు. ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికి వేసి, 28 దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకు వచ్చి ఆమెకు బహూకరించాడు. ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది. 29 యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకువెళ్ళి సమాధిచేసారు.
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-14)
30 అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. 31 వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33 కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు. 34 యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు.
35 అప్పటికే మధ్యాహ్నం దాటి సాయంకాలమవుతూ వుంది. ఆయన శిష్యులు వచ్చి, “ఇది నిర్మానుష్య ప్రాంతం. ఇప్పటికే సాయంకాలమవుతూ వుంది. 36 మీరి ప్రజల్ని పంపివేస్తే వాళ్ళు చుట్టూవున్న పల్లెలకో లేక గ్రామలకో వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు” అని అన్నారు.
37 కాని యేసు, “వాళ్ళు తినటానికి మీరే ఏదైనా ఇవ్వండి!” అని సమాధానం చెప్పాడు.
“రెండు వందల దేనారాలకు రొట్టెలు కొని వాళ్లకు పంచి పెట్టమంటావా?” అని ఆయన్ని అడిగారు.
38 “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయో వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు.
వాళ్ళు వెళ్ళి చూసి వచ్చి, “ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్నాయి” అని అన్నారు.
39 పచ్చిగడ్డి మీద అందరిని గుంపులు గుంపులుగా కూర్చోబెట్టమని శిష్యులతో చెప్పాడు. 40 ప్రజలు గుంపుకు యాబై, నూరుగురి చొప్పున కూర్చున్నారు.
41 యేసు ఆ ఐదు రొట్టెల్ని రెండు చేపల్ని తీసుకొని ఆకాశం వైపు చూసి కృతజ్ఞత చెప్పి రొట్టెల్ని తుంచాడు. అవి తన శిష్యులకిచ్చి ప్రజల ముందుంచమన్నాడు. అదే విధంగా ఆ రెండు చేపల్ని కూడా భాగాలు చేసి అందరికి పంచాడు.
42 అందరూ సంతృప్తిగా తిన్నారు. 43 శిష్యులు మిగిలిన రొట్టెముక్కల్ని, చేప ముక్కల్ని పన్నెండు గంపల నిండా నింపారు. 44 ఆ రోజు అక్కడ ఐదు వేలమంది పురుషులు భోజనం చేసారు.
యేసు నీళ్ళపై నడవటం
(మత్తయి 14:22-33; యోహాను 6:16-21)
45 ఆ తదుపరి యేసు తన శిష్యులతో, పడవనెక్కి, తనకన్నాముందు బేత్సయిదాకు వెళ్ళమని గట్టిగా చెప్పాడు. బేత్సాయిదా సముద్రంకు ఆవలివైపున ఉంది. యేసు ప్రజల్ని తమ తమ యిండ్లకు వెళ్ళమని చెప్పాడు. 46 వాళ్ళను వదిలి ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు.
47 అర్ధరాత్రికి శిష్యులున్న పడవ సముద్రం మధ్యవుంది. యేసు మాత్రం యింకా గట్టునే ఉన్నాడు. 48 ఎదురు గాలి వీయటంవల్ల శిష్యులు కష్టంగా తెడ్లు వేయటం ఆయన చూసాడు. తెల్లవారు ఝామున యేసు నీళ్ళ మీదుగా నడిచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. వాళ్ళను దాటి ముందుకు వెళ్తుంటే 49 ఆయన శిష్యులు ఆయన నీళ్ళమీద నడవటం చూసి, దయ్యం అనుకొని భయపడి బిగ్గరగా కేకలు వేసారు. 50 వెంటనే ఆయన వాళ్ళతో మాట్లాడుతూ, “ధైర్యంగా ఉండండి. నేనే! భయపడకండి!” అని అన్నాడు. 51 ఆయన పడవనెక్కగానే గాలి తీవ్రత పూర్తిగా తగ్గి పోయింది. వాళ్ళు ఇది చూసి దిగ్భ్రాంతి చెందారు. రొట్టెలు పంచిన అద్భుతాన్ని వాళ్ళు చూశారు. 52 కాని దానిని అర్థం చేసుకోలేక పోయారు.
యేసు రోగులనేకులను నయం చేయటం
(మత్తయి 14:34-36)
53 సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకొని అక్కడ పడవను నిలిపారు. 54 వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. 55 ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు వచ్చారు. 56 పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమై పోయింది.
© 1997 Bible League International