Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 3

1-2 ఇతర రాజ్యాల ప్రజలంతా ఇశ్రాయేలీయుల దేశం విడిచిపెట్టేటట్టు యెహోవా బలవంతం చేయలేదు. ఇశ్రాయేలీయులను యెహోవా పరీక్షించాలనుకున్నాడు. ఈ సమయంలో జీవిస్తూ ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఒక్కరు కూడ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన యుద్ధాల్లో పాల్గొనలేదు. అందుచేత ఆ ఇతర రాజ్యాలను యెహోవా వారి దేశంలో ఉండనిచ్చాడు. (ఆ యుద్ధాలలో పాల్గొనని ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించాలని యెహోవా ఇలా చేసాడు). ఆ దేశంలో యెహోవా ఉండనిచ్చిన రాజ్యాల పేర్లు ఇవి: ఫిలిష్తీయుల అయిదుగురు పరిపాలకులు, కనానీయులు అందరూను, సీదోను ప్రజలు, గయెలు హెర్మోను నుండి లెబోహమాతు వరకు గల లెబానోను కొండల్లో జీవించిన హివ్వీ ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించటానికి యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. వారి పూర్వీకులకు మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశాలకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులవుతారేమోనని ఆయన చూడాలనుకున్నాడు.

కనానీయులతో, హిత్తీ ప్రజలతో, అమోరీ ప్రజలతో, పెరిజ్జీ ప్రజలతో, హివ్వీ ప్రజలతో, యెబూసీ ప్రజలతో కలిసి ఇశ్రాయేలు ప్రజలు జీవించారు. ఇశ్రాయేలు ప్రజలు, ఆ ప్రజల కుమార్తెలను వివాహము చేసుకోవటం మొదలు పెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు తమ కుమార్తెలను ఆ మనుష్యుల కుమారులు వివాహము చేసుకోనిచ్చారు. మరియు ఇశ్రాయేలు ప్రజలు ఆ మనుష్యుల దేవుళ్లను పూజించటం మొదలు పెట్టారు.

మొదటి న్యాయమూర్తి, ఒత్నీయేలు

ఇశ్రాయేలు ప్రజలు చెడు పనులు చేసినట్టు యెహోవా చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడు యెహోవాను మరచిపోయి, బయలు మరియు అషేరా[a] అను బూటకపు దేవుళ్లను సేవించారు. ఇశ్రాయేలీయుల మీద యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా అరామునహరాయిము[b] రాజు కూషన్రిషాతాయిము ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, వారిని పాలించనిచ్చాడు. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరాల పాటు ఆ రాజు పాలనలో ఉన్నారు. కానీ ఇశ్రాయేలీయులు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. వారిని రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఒత్నీయేలు. అతడు కనజు అనే వ్యక్తి కుమారుడు. కనజు కాలేబుకు చిన్న తమ్ముడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను రక్షించాడు. 10 యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి వచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులకు న్యాయమూర్తి అయ్యాడు. ఇశ్రాయేలీయులను ఒత్నీయేలు యుద్ధానికి నడిపించాడు. అరాము రాజు కూషన్రిషాతాయిమును ఓడించేందుకు యెహోవా ఒత్నీయేలుకు సహాయం చేసాడు. 11 అందుచేత కనజు కుమారుడు ఒత్నీయేలు చనిపోయేంతవరకు నలభై సంవత్సరాలు దేశం శాంతితో ఉండెను.

న్యాయమూర్తి ఏహూదు

12 ఇశ్రాయేలు ప్రజలు మరల చెడుకార్యాలు చేయటం యెహోవా చూశాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలను ఓడించేందుకు మోయాబు రాజు ఎగ్లోనుకు యెహోవా శక్తి ఇచ్చాడు. 13 అమ్మోనీ ప్రజలు, అమాలేకు ప్రజల దగ్గర నుండి ఎగ్లోను సహాయం పొందాడు. వారు అతనితో కలిసి, ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేశారు. ఎగ్లోను, అతని సైన్యం ఇశ్రాయేలు ప్రజలను ఓడించి, ఖర్జూరపు చెట్ల పట్టణం నుండి (యెరికో) వారిని బలవంతంగా వెళ్లగొట్టారు. 14 ఎగ్లోను ఇశ్రాయేలు ప్రజలను పద్దెనిమిది సంవత్సరాలు పాలించాడు.

15 ప్రజలు యెహోవాకు మొరపెట్టారు. ఇశ్రాయేలు ప్రజలను రక్షించేందుకు యెహోవా ఒక మనిషిని పంపించాడు. ఆ మనిషి పేరు ఏహూదు. ఏహూదు ఎడమచేతి వాటంగలవాడు. ఏహూదు బెన్యామీను వంశానికి చెందిన గెరా అనే పేరుగల వాని కుమారుడు. మోయాబు రాజు ఎగ్లోనుకు కొంత పన్ను డబ్బు చెల్లించేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును పంపించారు. 16 ఏహూదు అతనికోసం ఒక ఖడ్గం చేసుకున్నాడు. ఆ ఖడ్గానికి రెండంచులున్నాయి, దాని పొడవు పద్ధెనిమిది అంగుళాలు. ఏహూదు ఆ ఖడ్గాన్ని తన కుడి తొడకు కట్టుకొని తన బట్టల క్రింద దానిని కప్పిపెట్టాడు.

17 ఏహూదు మోయాబు రాజైన ఎగ్లోను దగ్గరకు వచ్చి పన్ను డబ్బు చెల్లించాడు. (ఎగ్లోను చాలా లావు పాటి మనిషి) 18 ఏహూదు ఆ డబ్బును ఎగ్లోనుకు చెల్లించిన తర్వాత, ఆ డబ్బును మోసుకుని వచ్చిన ఆ మనుష్యులను తిరిగి ఇంటికి పంపించివేసాడు. 19 ఏహూదు వెళ్లేందుకు బయలుదేరాడు. గిల్గాలు పట్టణంలో విగ్రహాలను అతడు సమీపించినప్పుడు అతడు వెనుకకు తిరిగాడు. అప్పుడు ఏహూదు, “ఓ రాజా, నీకు చెప్పాల్సిన ఒక రహస్య సందేశం నా దగ్గర ఉంది” అని ఎగ్లోనుతో చెప్పాడు.

ఊరకవుండు అన్నాడు రాజు. తర్వాత అతడు సేవకులందరినీ ఆ గదిలోనుండి బయటకు పంపివేసాడు. 20 ఏహూదు ఎగ్లోను రాజు దగ్గరకు వెళ్లాడు. ఎగ్లోను తన వేసవి కాలపు రాజ భవనంలో ఒంటరిగా కూర్చునియున్నాడు.

అప్పుడు ఏహూదు, “దేవుని దగ్గరనుండి నీ కోసము ఒక సందేశం నా వద్ద వుంది” అని చెప్పాడు. రాజు తన సింహాసనం నుండి లేచి ఏహూదుకు చాలా దగ్గరగా వచ్చాడు. 21 రాజు తన సింహాసనం నుండి లేచి నిలబడగా, ఏహూదు తన కుడి తొడకు కట్టబడిన ఖడ్గాన్ని తన ఎడమ చేతితో అందుకొని బయటకు తీసాడు. అప్పుడు ఏహూదు ఆ ఖడ్గాన్ని రాజు పొట్టలో పొడిచి వేసాడు. 22 ఆ ఖడ్గం పిడికూడ లోపలకు దిగిపోవునంతగా రాజు కడుపులోనికి దిగిపోయింది. రాజు కొవ్వు ఖడ్గము నిండా అతుక్కుపోయింది. కనుక ఏహూదు ఆ ఖడ్గాన్ని ఎగ్లోను పొట్టలోనే విడిచిపెట్టేసాడు.

23 ఏహూదు గదిలో నుండి బయటకు వెళ్లి దాని తలుపులు మూసి తాళం వేసాడు. 24 ఏహూదు వెళ్లిపోగానే సేవకులు తిరిగి వచ్చారు. ఆ గది తలుపులు తాళము వేసి ఉండటం ఆ సేవకులు చూశారు. కనుక ఆ సేవకులు, “రాజు తన విశ్రాంతి గదిలో మూత్ర విసర్జనకు వెళ్లి ఉంటాడు” అని చెప్పుకున్నారు. 25 అందుచేత ఆ సేవకులు చాలా సేపు వేచి ఉన్నారు. చివరికి వారు దిగులు చెందారు. వారు తాళం చెవి తెచ్చి తలుపులు తెరిచారు. ఆ సేవకులు ప్రవేశించినప్పుడు, వారి రాజు నేల మీద చచ్చిపడి ఉండటం చూశారు.

26 ఆ సేవకులు రాజు కొరకు వేచి ఉండగా, ఏహూదు పారిపోయేందుకు సమయం దొరికింది. ఏహూదు విగ్రహాలను దాటి శెయీరా అను స్థలంవైపు వెళ్లాడు. 27 ఏహూదు శెయీరా అను స్థలం చేరాడు. అప్పుడు అతడు అక్కడ ఎఫ్రాయిమీయుల కొండ దేశంలో బూర ఊదాడు. ఇశ్రాయేలు ప్రజలు బూర శబ్దం విని, ఏహూదు వారిని నడిపిస్తుండగా వారు కొండలు దిగివెళ్లారు. 28 ఏహూదు, “నన్ను వెంబడించండి! మన శత్రువులైన మోయాబు ప్రజలను ఓడించేందుకు యెహోవా మనకు సహాయం చేస్తాడు” అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు.

కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏహూదును వెంబడించారు. ఎక్కడైతే యోర్దాను నదిని తేలికగా దాటి, మోయాబు దేశంలోనికి వెళ్లవచ్చునో ఆ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు వారు ఏహూదు వెంట వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు ఏ ఒక్కరినీ కూడా యోర్దాను నదిని దాటనివ్వలేదు. 29 మోయాబు ప్రజలలో ధైర్యం, బలంగల పదివేల మందిని ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మోయాబు వాడు ఒక్కడు కూడా తప్పించుకోలేదు. 30 కనుక ఆ రోజు నుండి ఇశ్రాయేలు ప్రజలు మోయాబు ప్రజలను పాలించటం మొదలు పెట్టారు. మరియు ఆ దేశంలో ఎనభై సంవత్సరాల వరకు శాంతి ప్రబలింది.

న్యాయమూర్తి షమ్గరు

31 ఏహూదు ఇశ్రాయేలు ప్రజలను రక్షించిన తర్వాత మరో మనిషి ఇశ్రాయేలీయులను రక్షించాడు. ఆ మనిషి పేరు షమ్గరు. అతడు అనాతు కుమారుడు. ఫిలిష్తీ మనుష్యులు ఆరువందల మందిని చంపేందుకు షమ్గరు ఒక ములుకోల (ఎద్దులను తోలే ముల్లుగల కర్ర)ను ప్రయోగించాడు.

అపొస్తలుల కార్యములు 7

స్తెఫను ఉపన్యాసం

ఆ తర్వాత ప్రధాన యాజకుడు, “ఈ నేరారోపణలు నిజమా?” అని అతణ్ణి అడిగాడు. అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు.

“అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు. దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు.

“దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు. వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు.

“సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.

“వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.

12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.

17 “దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం ఫలించే సమయం దగ్గరకు వచ్చింది. ఈజిప్టులో మన వాళ్ళ సంఖ్య బహుగా పెరిగింది. 18 కొంత కాలం తర్వాత యోసేపును గురించి ఏమీ తెలియనివాడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 19 అతడు మన వాళ్ళను మోసం చేసాడు. మన వాళ్ళ సంతానం చనిపోవాలని, వాళ్ళకు పుట్టిన పసికందుల్ని బయట వేయించి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.

20 “ఆ కాలంలోనే మోషే జన్మించాడు. ఇతడు సామాన్యుడు కాడు. మోషే మూడు నెలల దాకా తన తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. 21 ఇతణ్ణి యింటి బయట ఉంచగానే ఫరో కుమార్తె తీసుకెళ్ళి తన స్వంత కుమారునిగా పెంచుకుంది. 22 ఈజిప్టు దేశస్థుల జ్ఞానాన్నంతా అతనికి నేర్పించింది. మోషే గొప్ప విషయాలు చెప్పటంలో గొప్ప పనులు చేయటంలో ఆరితేరినవాడయ్యాడు.

23 “మోషేకు నలభై సంవత్సరాలు రాగానే అతడు తన తోటి ఇశ్రాయేలు ప్రజల్ని కలుసుకొన్నాడు. 24 ఒకసారి, మోషే ఈజిప్టు దేశస్థుడు ఇశ్రాయేలు వానితో అన్యాయంగా ప్రవర్తించటం చూసి ఇశ్రాయేలువానికి సహాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో, అతణ్ణి రక్షించటానికి వెళ్ళాడు. ఈజిప్టు దేశస్థుణ్ణి చంపి ఇశ్రాయేలు వాని పక్షాన పగ తీర్చుకున్నాడు. 25 ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి దేవుడు తనను ఉపయోగిస్తున్న విషయం వాళ్ళు తెలుసుకొంటారని మోషే ఆశించాడు. కాని వాళ్ళకది అర్థం కాలేదు.

26 “మరుసటి రోజు మోషే యిద్దరు ఇశ్రాయేలీయులు పోట్లాడటం చూసి, వాళ్ళను శాంత పరచాలనే ఉద్దేశ్యంతో, ‘అయ్యా! మీరు సోదరులు! పరస్పరం ఎందుకు పోట్లాడుతున్నారు?’ అని అడిగాడు. 27 ఏ ఇశ్రాయేలు వాడు తోటివాడికి అన్యాయం చేశాడో వాడు, మోషేను ప్రక్కకు త్రోసి, ‘మా మీద తీర్పు చెప్పటానికి, మమ్మల్ని పాలించటానికి నిన్నెవరు నియమించారు? 28 ఈజిప్టు దేశస్థుణ్ణి నిన్న చంపినట్లు నన్ను కూడా చంపాలని చూస్తున్నావా?’ అని అన్నాడు. 29 ఈ విమర్శ విని మోషే ఈజిప్టు దేశాన్ని వదిలి, మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ పరదేశీయునిగా స్థిరపడ్డాడు. అక్కడ అతనికి యిద్దరు కుమారులు కలిగారు.

30 “నలభై సంవత్సరాలు గడిచాయి. ఒక రోజు సీనాయి పర్వతంపై మండుతున్న పొదలో మోషేకు ఒక దేవదూత కనిపించాడు. 31 ఆ దృశ్యాన్ని చూసి మోషే దిగ్భ్రాంతి చెందాడు. దగ్గరనుండి చూడాలనుకొని ముందుకు వెళ్తుండగా అతనికి ప్రభువు స్వరం వినిపించింది. 32 ఆ స్వరం అతనితో ‘నేను మీ పూర్వుల దేవుణ్ణి! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి!’(A) అని అన్నాడు. మోషే వణికిపోయాడు. తలెత్తి చూడటానికి అతనికి ధైర్యం చాలలేదు.

33 “ప్రభువు, ‘చెప్పులు తీసెయ్యి! నీవు నిలుచున్న స్థలం పవిత్రమైనది. 34 నా ప్రజల్ని ఈజిప్టులో అణచి ఉంచటం చూసాను. వాళ్ళ ఏడుపులు విన్నాను. వాళ్ళకు విముక్తి కలిగించటానికి వచ్చాను. రా! నిన్ను తిరిగి ఈజిప్టు పంపుతాను!’”(B) అని అన్నాడు.

35 స్తెఫను ఇంకా ఇలా చెప్పాడు: “‘నిన్ను పాలకునిగా, న్యాయాధిపతిగా చేసిందెవరు?’ అని వాళ్ళచే తిరస్కరించబడినవాడే ఈ మోషే. ఈ మోషేను దేవుడు వాళ్ళ పాలకునిగా, రక్షకునిగా పంపినట్లు పొదలో కనిపించిన దేవదూత ద్వారా తెలియచేసాడు. 36 మోషే అద్భుతాలు, మహత్యాలు చేసి వాళ్ళను ఈజిప్టునుండి వెలుపలికి పిలుచుకు వచ్చాడు. ఎఱ్ఱ సముద్రం దగ్గర, ఆ తర్వాత నలభై సంవత్సరాలు ఎడారుల్లో కూడా అద్భుతాలు, మహత్యాలు చేసాడు.

37 “‘నాలాంటి ప్రవక్తను దేవుడు మీనుండి ఎన్నుకొని మీకందిస్తాడు’ అని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పిన మోషే ఇతడే! 38 ఇశ్రాయేలు ప్రజలందరూ ఎడారిలో సమావేశమైనప్పుడు, అక్కడున్న మన పూర్వికులతో కలిసి ఉన్నవాడు మోషేనే. సీనాయి పర్వతంపై దేవదూతతో మాట్లాడింది మోషేనే. మనకు అందివ్వటానికి సజీవమైన దైవసందేశాన్ని పొందింది మోషేనే.

39 “కాని మన పూర్వికులు అతని మాటలు వినలేదు. పైగా అతణ్ణి తిరస్కరించి ఈజిప్టు దేశానికి తిరిగి వెళ్ళాలనుకొన్నారు. 40 అందువల్ల అహరోనుతో, ‘మాకు దారి చూపించగల దేవుళ్ళ విగ్రహాలను సిద్ధం చేయించు. మమ్మల్ని ఈజిప్టునుండి పిలుచుకు వచ్చిన ఆ మోషేకు ఏమైందో ఏమో!’(C) అని అన్నారు. 41 వెంటనే అందరూ కలిసి దూడ రూపంలో ఒక విగ్రహాన్ని సిద్ధం చేసారు. ఆ విగ్రహానికి బలి అర్పించారు. తమ చేతుల్తో తయారు చేసిన ఆ విగ్రహం పేరిట పండుగ చేసుకొన్నారు. 42 కాని దేవుడు విరక్తి చెంది, ‘ఆకాశంలోని మీ దేవుళ్ళను మీరు పూజించుకొండి’ అని అన్నాడు. దీన్ని గురించి ప్రవక్తల గ్రంథంలో యిలా వ్రాయబడి వుంది:

‘ఓ ఇశ్రాయేలు ప్రజలారా! ఎడారుల్లో నలభై సంవత్సరాలు పశువుల్ని బలి యిచ్చింది నా కోసం కాదు!
43 మీరు మీ వెంట మోసుకు వెళ్ళింది, మొలొకు యొక్క డేరా!
    మీరు మోసుకు వెళ్ళింది మీరు దేవుడనుకొంటున్న రొంఫా నక్షత్రం యొక్క విగ్రహాన్ని!
దాన్ని మీరు పూజించుకోవటానికి సృష్టించుకున్నారు.
    కనుక మిమ్మల్ని బబులోను నగరానికి దూరంగా పంపుతాను!’(D)

44 “మన పూర్వులు ఎడారుల్లో ఉన్నప్పుడు వాళ్ళ వద్ద దేవుని గుడారం ఉంది. ఇది మోషేచే నిర్మింపబడినది. ఇది నిర్మింపబడక ముందు దేవుడు ఒక నమూనాను మోషేకు చూపి దాని ప్రకారం నిర్మించుమని ఆజ్ఞాపించాడు. 45 ఆ తర్వాత ఇది మన పూర్వికులకు లభించింది. వాళ్ళు యెహోషువ నాయకత్వాన, దేవుడు పారద్రోలిన ప్రజలు వదిలి వెళ్తున్న భూమిపై స్థిరపడుతున్న సమయాన ఈ గుడారం వాళ్ళ దగ్గరే ఉంది. దావీదు కాలందాకా అది ఆ దేశంలో ఉంది. 46 దావీదు దేవుని అనుగ్రహం పొంది యాకోబు వంశీయుల కోసం మందిరాన్ని నిర్మించే అవకాశం యివ్వుమని దేవున్ని కోరాడు. 47 అయితే ఈ మందిరాన్ని నిర్మించింది సొలొమోను రాజు.

48 “కాని సర్వోన్నతుడైన దేవుడు మానవులు నిర్మించిన మందిరాల్లో నివసించడు. దీన్ని గురించి ప్రవక్త యిలా అన్నాడు:

49 ‘ఆకాశం నా సింహాసనం!
    భూమి నా పాదపీఠం!
నాకెలాంటి మందిరం నిర్మిస్తారు మీరు?
    విశ్రాంతికి నాకు స్థలం ఏది?
50 ఇవన్నీ నిర్మించింది నేనే కాదా?’ అని ప్రభువన్నాడు.”(E)

51 స్తెఫను ఉపన్యాసం సాగిస్తూ, “మూర్ఖులారా! మీ హృదయాలు యూదులు కానివాళ్ళ హృదయాల వలే ఉన్నాయి. మీ చెవులు దైవసందేశాన్ని వినటానికి నిరాకరిస్తున్నాయి. మీరు మీ పూర్వులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళవలె మీరు కూడా అన్ని వేళలా పవిత్రాత్మను తృణీకరించారు. 52 మీ పూర్వులు హింసించని ప్రవక్త ఒక్కడైనా ఉన్నాడా! నీతిమంతుడు రానున్నాడని ప్రవచనం చెప్పినవాళ్ళను వాళ్ళు చంపివేసారు. ఇక మీరు ద్రోహం చేసి క్రీస్తుని కూడా చంపేసారు. 53 దేవదూతల ద్వారా అందివ్వబడిన దేవుని ధర్మశాస్త్రం లభించింది మీకు. కాని దాన్ని మీరు పాటించను కూడా లేదు” అని అన్నాడు.

స్తెఫన్ను రాళ్ళతో కొట్టి చంపటం

54 ఈ మాటలు విని వాళ్ళు కోపంతో మండిపోయి, అతణ్ణి చూసి పళ్ళు కొరికారు. 55 కాని స్తెఫను పవిత్రాత్మతో నిండిపోయి పరలోకం వైపు చూసి దేవుని తేజస్సును, యేసు దేవుని కుడి వైపు ఉండటం చూసాడు. 56 “అదిగో చూడండి! పరలోకం తెరుచుకోవటం. దేవుని కుమారుడు ఆయన కుడి వైపు నిలుచొని వుండటం చూస్తున్నాను!” అని అన్నాడు.

57 ఈ మాటలు విని వెంటనే వాళ్ళు తమ చెవులు మూసుకున్నారు. బిగ్గరగా కేకలు వేస్తూ అతని మీదికి వెళ్ళారు. 58 అతణ్ణి ఊరి బయటికి లాగి రాళ్ళతో కొట్టటం మొదలు పెట్టారు. ఈ సంఘటనను చూస్తున్నవాళ్ళు తమ వస్త్రాల్ని “సౌలు” అనబడే ఒక యువకుని కాళ్ళ ముందు వుంచారు. 59 వాళ్ళు రాళ్ళు విసరుతుండగా స్తెఫను, “యేసు ప్రభూ! నా ఆత్మను నీలో చేర్చుకో!” అని ప్రార్థించాడు. 60 ఆ తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై ఈ పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.

యిర్మీయా 16

ఆపద రోజు

16 యెహోవా వర్తమానం నాకు వచ్చింది: “యిర్మీయా, నీవు వివాహం చేసికోరాదు. ఈ స్థలములో నీవు కొడుకులను, కూతుళ్లను కలిగి యుండరాదు.”

యూదా రాజ్యంలో పుట్టిన కొడుకులు, కూతుళ్లను గురించి యెహోవా ఈ విషయాలు చెప్పాడు. మరియు ఆ పిల్లల తల్లిదండ్రులను గూర్చి యెహోవా ఇలా సెలవిచ్చాడు: “ఆ ప్రజలు ఒక భయంకరమైన చావు చస్తారు! వారిని గురించి ఒక్కడు కూడా ఏడ్వడు, విచారించడు. వారినెవ్వడూ సమాధిచేయడు. పశువుల పేడవలె వారి శవాలు నేలమీద పడివుంటాయి. వారు శత్రువు కత్తికి బలియైపోతారు. లేదా ఆకలితో మాడి చనిపోతారు. వారి శవాలు ఆకాశ పక్షులకు, అడవి జంతువులకు ఆహారమవుతాయి.”

అందువల్ల యెహోవా ఇలా చెప్పాడు: “యిర్మీయా, ఏ ఇంటిలోనయితే చావు దినపు భోజనాలు జరుగుతూ వుంటాయో, నీవా ఇంటిలోనికి పోవద్దు. చనిపోయిన వారికొరకు విలపించటానికి గాని, నీ సంతాపాన్ని వెలిబుచ్చటానికి గాని నీవక్కడికి వెళ్లవద్దు. ఆ పనులు నీవు చేయవద్దు. ఎందువల్లనంటే, నా ఆశీర్వాదాన్ని నేను తిరిగి తీసుకున్నాను. యూదా ప్రజలకు నేను కరుణ చూపను. వారి కొరకు నేను బాధపడను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

“యూదా రాజ్యంలో ప్రముఖులు, సామాన్యులు అంతా చనిపోతారు. వారినెవరూ సమాధిచేయరు. లేక వారి కొరకు ఎవ్వరూ దుఃఖించరు. మృతుల కొరకు దుఃఖ సూచకంగా ఎవ్వడూ తన శరీరం చీరుకొనటంగాని, తల గొరిగించుకోవటం గాని చేయడు. చనిపోయిన వారికొరకై విలపించేవారికి ఎవ్వరూ ఆహారం తెచ్చియివ్వరు. తల్లిదండ్రులు చనిపోయి విలపించేవారిని ఎవ్వరూ ఓదార్చరు. మృతుల కొరకు రోదించేవారిని ఆదరించుటకు ఎవ్వరూ తాగటానికి నీరు ఇవ్వరు.

“విందు జరుపుకుంటూన్న ఏ ఇంటిలోనికీ నీవు వెళ్లవద్దు. ఆ ఇంట్లోకి వెళ్లి తాగటానికి, తినటానికి కూర్చోవద్దు. ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా ఇలా చెప్పినాడు: ‘వేడుక చేసుకొనే వారు ఆనందమును నేను వెంటనే ఆపివేస్తాను. ఇది నీ జీవితకాలంలోనే జరుగుతుంది. ఇవన్నీ త్వరలోనే చేస్తాను.’

10 “యిర్మీయా, యూదా ప్రజలకు నీవు ఈ విషయాలన్నీ చెపుతావు. తిరిగి వారు నిన్నిలా అడుగుతారు: ‘మా విషయంలో దేవుడు ఆ భయంకర విషయాలు జరుగుతాయని ఎందుకు చెప్పాడు? మేము చేసిన తప్పేమిటి? మా యెహోవా దేవునికి వ్యతిరేకంగా మేము చేసిన పాపం ఏమిటి?’ 11 అప్పుడు వారికి నీవు ఈ విషయాలు చెప్పాలి: ‘ఈ భయంకర పరిణామాలు జరగబోవడానికి కారణం మీ పితరులు నన్ను అనుసరించటం మానివేయటమే’ ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది: ‘వారు నన్ను వదిలి అనేక ఇతర దైవముల ననుసరించి ఆరాధించినారు. మీ పితరులు నన్ను వదిలి, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించుట మానివేశారు. 12 కాని మీరు మీ పూర్వీకులకంటె నీచంగా పాపం చేశారు. మీరు కఠినాత్ములై చాలా మొండివైఖిరి దాల్చారు. మీరు చేయదలచుకున్నదే మీరు చేస్తున్నారు. మీరు నాకు విధేయులుగా లేరు. మీకు యిష్టమైనదే మీరు చేస్తున్నారు. 13 కావున మిమ్మల్ని ఈ దేశంనుండి బహిష్కరిస్తాను. మిమ్మల్ని అన్యదేశానికి తరిమివేస్తాను. మీరు, మీ పూర్వీకులు ముందెన్నడూ చూడని దేశానికి మీరు వెళతారు. అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు బూటకపు దేవతలను వెంబడించవచ్చు. నేను మీకు సహాయం చేయను. ఏ రకమైన ఉపకారమూ చేయను.’

14 “ప్రజలు ప్రమాణాలు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన దేవునితోడు’ అని వారు అంటారు. కాని ప్రజలు ఈ మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూఉంది.” ఇది యెహోవా వాక్కు. 15 ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.

16 “ఈ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేటగాండ్రను పిలిపిస్తాను. ఈ వేటగాండ్రు[a] యూదావారిని ప్రతి కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్లోను వేటాడతారు. 17 వారు చేసేదంతా నేను చూస్తాను. యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు. 18 యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”

19 యెహోవా, నీవే నాకు బలం; నీవే నాకు రక్షణ.
    ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు.
ప్రపంచ దేశాలన్నీ నీ శరణు వేడి వస్తాయి.
    ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు.
వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
    కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేవు.
20 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా?
    చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”

21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను గుణపాఠం నేర్పుతాను.
    ఇప్పుడే వారికి నా శక్తిని గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబుతాను.
అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగుతుంది.
    నేనే యోహోవా అని వారు తెలుసుకుంటారు.”

మార్కు 2

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మత్తయి 9:1-8; లూకా 5:17-26)

కొద్ది రోజుల తర్వాత యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణానికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వచ్చాడన్న వార్త ప్రజలకు తెలిసింది. చాలా మంది ప్రజలు సమావేశం అవటం వల్ల స్థలం చాలలేదు. తలుపు అవతల కూడా స్థలం లేకపోయింది. యేసు వాళ్ళకు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఇంతలో నలుగురు మనుష్యులు ఒక పక్షవాత రోగిని మోసికొని అక్కడికి తీసుకు వచ్చారు. చాలామంది ప్రజలుండటం వల్ల రోగిని యేసు ముందుకు తీసుకు రాలేకపోయారు. అందువల్ల వాళ్ళు యేసు వున్న గది పైకప్పు తెరచి, ఆ పక్షవాత రోగిని, అతడు పడుకొని ఉన్న చాపతో సహా ఆ సందు ద్వారా యేసు ముందుకు దించారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి పక్షవాత రోగితో, “కుమారుడా! నీ పాపాలు క్షమించబడ్డాయి!” అని అన్నాడు.

అక్కడే కూర్చొని ఉన్న కొందరు శాస్త్రులు తమలో తాము ఈ విధంగా అనుకొన్నారు. “ఇతడెందుకు ఈ విధంగా అంటున్నాడు? ఇది దైవ దూషణ కాదా? దేవుడు తప్ప వేరెవ్వరు పాపాల్ని క్షమించగలరు?” అని అనుకొన్నారు.

వాళ్ళు తమ మనస్సులో ఈ విధంగా ఆలోచిస్తున్నారని యేసు మనస్సు తక్షణమే గ్రహించింది. ఆయన వాళ్ళతో, “మీరు దీన్ని గురించి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏది సులభం? పక్షవాత రోగితో, ‘నీ పాపాలు క్షమించబడ్డాయి!’ అని అనటం సులభమా లేక, ‘నీ చాప తీసుకొని నడిచి వెళ్ళు!’ అని అనటం సులభమా? 10 భూలోకంలో పాపాలు క్షమించే అధికారం మనుష్య కుమారునికి ఉందని మీరు తెలుసుకోవాలి!” అని అంటూ, పక్షవాత రోగితో, 11 “నేను చెబుతున్నాను, లేచి నీ చాప తీసుకొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

12 వెంటనే ఆ పక్షవాత రోగి లేచి నిలబడి తన చాప తీసుకొని అందరూ చూస్తుండగా నడుస్తూ వెళ్ళి పోయాడు. ఇది చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. “మేము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు!” అని అంటూ దేవుణ్ణి స్తుతించారు.

లేవి (మత్తయి) యేసును వెంబడించటం

(మత్తయి 9:9-13; లూకా 5:27-32)

13 యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. 14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి[a] పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు.

15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు. 16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు.

17 ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మత్తయి 9:14-17; లూకా 5:33-39)

18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.

19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు, 20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.

21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; లూకా 6:1-5)

23 ఒక విశ్రాంతి రోజు యేసు పొలాల ద్వారా వెళ్తూవున్నాడు. ఆయన శిష్యులు కూడా ఆయన వెంటే ఉన్నారు. వాళ్ళు తినటానికి కొన్ని దాన్యపు కంకుల్ని త్రుంచారు. 24 పరిసయ్యులు ఆయనతో, “అదిగో చూడండి! వాళ్ళు విశ్రాంతి రోజు చేయకూడని పని ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

25 యేసు, “దావీదు, అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళకు ఆహారం కావలసివచ్చింది. అప్పుడు దావీదు ఏం చేసాడో మీరు ఎన్నడూ చదవలేదా? 26 అబ్యాతారు ప్రధానయాజకుడుగా ఉన్న కాలంలో దావీదు దేవాలయంలోకి ప్రవేశించి దేవుని సముఖమున పెట్టిన రొట్టె తీసుకొని, తానుతిని, తన సహచరులకు కూడా కొంత యిచ్చాడు. ఈ రొట్టెను యాజకులు తప్ప యితరులు తినకూడదు” అని అన్నాడు.

27 యేసు వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “విశ్రాంతి రోజు మానవుని కోసం సృష్టింపబడింది. కాని మానవుడు విశ్రాంతి రోజు కోసం సృష్టింపబడలేదు. 28 అందువల్ల మనుష్యకుమారునికి విశ్రాంతి రోజుపై కూడా అధికారం ఉంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International