Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 20-21

ఆశ్రయ పురాలు

20 అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు. ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.

“ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతణ్ణి ఆ పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు. అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది. ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”

కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.) యొర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.

ఏ ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.

యాజకులకు, లేవీయులకు లభించిన పట్టణాలు

21 లేవీ వంశంపు ప్రధానులు యాజకుడైన ఎలియాజరుతో, నూను కుమారుడు యెహోషువతో, ఇశ్రాయేలీయుల ఇతర వంశాల ప్రధానులతో మాట్లాడేందుకు వెళ్లారు. ఇది కనాను దేశంలోని షిలోహు పట్టణంలో సంభవించింది. “మోషేకు యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మేము నివసించేందుకు మీరు మాకు పట్టణాలు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు. మా పశువులు మేత మేసేందుకు పొలాలుకూడ మీరు మాకు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు.” అని లేవీ ప్రధానులు వారితో చెప్పారు. కనుక యెహోవా ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. లేవీ ప్రజలకు వారు ఈ పట్టణాలు, ప్రాంతాలు ఇచ్చారు:

కహతు వంశంలో ఒక భాగం వారికి పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. యూదా, షిమ్యోను, బెన్యామీను వారికి చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి. (కహతు వంశం, లేవీ వంశంలో ఒక భాగం. లేవీ యాజకుడైన అహరోను సంతానము).

కహతు వంశంలోని మరో భాగం వారికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పది పట్టణాలు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్ధగోత్రం వారి ప్రాంతాల్లో ఉన్నాయి.

గెర్షోము వంశపు ప్రజలకు పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్ధ గోత్రం వారి ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.

మెరారీ కుటుంబం వారికి పన్నెండు పట్టణాలు ఇవ్వబడ్డాయి. రూబేను, గాదు, జెబూలూనుకు చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.

కనుక ఈ పట్టణాలు, వీటి పరిసరాల్లోని పొలాలు లేవీ ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా వారు ఇలా చేసారు.

యూదా, షిమ్యోనుకు చెందిన దేశంనుండి తీసుకొనబడిన పట్టణాల పేర్లు ఇవి. 10 మొదట నిర్ణయించబడిన పట్టణాలు కహత్ కుటుంబానికి ఇవ్వబడ్డాయి (లేవీ ప్రజలు). 11 కిర్యత్ అర్బ (హెబ్రోను), దాని పొలాలు అన్నీ వారు వారికి ఇచ్చారు. ఇది యూదా కొండ దేశంలో ఉంది. (అనాకు తండ్రి అర్బ). ఆ పట్టణం దగ్గర్లో వారి పశువులు మేసేందుకు పొలాలు కూడ వారికి లభించాయి. 12 అయితే కిర్యత్ అర్బ చుట్టు ఉన్న చిన్న పట్టణాలు, పొలాలు యెపున్నె కుమారుడైన కాలేబుకు చెందినవి. 13 కనుక హెబ్రోను పట్టణాన్ని వారు అహరోను సంతతివారికి ఇచ్చారు. హెబ్రోను ఆశ్రయ పట్టణం. అహరోను సంతతివారికి లిబ్నా 14 యత్తీరు, యష్టెమోయ 15 హోలోను, దెబీరు, 16 అయ్యిను, యుట్ట, బెత్‌షెమెషు పట్టణాలను కూడ వారు ఇచ్చారు. ఈ పట్టణాల చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నింటిని కూడ వారు వీరికి ఇచ్చారు. ఈ రెండు వంశాలకు ఇవ్వబడినవి తొమ్మిది పట్టణాలు.

17 బెన్యామీను సంతతివారికి చెందిన పట్టణాలను కూడా అహరోను సంతతివారికి ఇచ్చారు. ఆ పట్టణాలు గిబియోను, గెబ, 18 అనాతోతు, అల్మాను. ఈ నాలుగు పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న పొలాలు అన్నింటినీ వారు వీరికి ఇచ్చారు. 19 కనుక యాజకులకు ఇవ్వబడిన పట్టణాలు ఇవి. ఈ యాజకులు అహరోను సంతానం వారు. మొత్తం మీద అవి పదమూడు పట్టణాలు మరియు వాటి పొలాలు.

20 కహతీ కుటుంబంలో ఇతర ప్రజలకు ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టణాలు ఎఫ్రాయిము వంశంనుండి తీసుకోబడ్డాయి. 21 ఎఫ్రాయిము కొండ ప్రదేశంనుండి షెకెము పట్టణం (షెకెము ఒక ఆశ్రయ పట్టణం) వారువారికి గెజెర్ 22 కిబ్సాయిము, బెత్‌హారాను కూడ ఇచ్చారు. మొత్తం మీద అవి నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.

23 దాను వంశం వారు వారికి ఎత్తేకె, గిబ్బెతాను 24 అయ్యలోను, గాత్ రిమ్మోను ఇచ్చారు. మొత్తం మీద నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.

25 మనష్షే వంశంలోని సగంమంది తానాను, గాత్ రిమ్మోను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న పొలాలు అన్నీ వారికి ఇవ్వబడ్డాయి.

26 కనుక దీనితో ఇంకా పది పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న భూమి మొత్తం కహత్ కుటుంబం వారికి ఇవ్వబడ్డాయి.

27 లేవీ వంశంలోని గెర్షోను కుటుంబం వారికి ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి.

మనష్షే వంశంలోని సగంమంది బాషానులోని గొలానును వారికి ఇచ్చారు. (గొలాను ఆశ్రయ పట్టణం) మనష్షేకూడ బెష్టెరాను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.

28 ఇశ్శాఖారు వంశంవారు వారికి కిషియొను, దబెరాతు 29 యార్ముతు, ఎన్‌గన్నీము ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు, వాటిచుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారి పశువులకోసం ఇశ్శాఖారు వంశానికి ఇచ్చారు.

30 ఆషేరు వంశం వారు వారికి మిషాలు, అబ్దోను 31 హెల్కాతు, రెహబు ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు వాటి చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారు వారి పశువుల కోసం ఇచ్చారు.

32 నఫ్తాలి వంశంవారు గలలీయలోని కెదెషును వారికి ఇచ్చారు. (కెదెషు ఆశ్రయ పట్టణం). హమ్మోత్ దోరు, కర్తానుకూడ నఫ్తాలి వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.

33 మొత్తం మీద గెర్షోను కుటుంబం వారికి పదమూడు పట్టణాలు, ఈ పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం పొలాలు లభించాయి.

34 మరో లేవీ కుటుంబం మెరారీ కుటుంబం. మెరారీ కుటుంబం వారికి ఇవ్వబడిన పట్టణాలు ఇవి: జెబూలూను వంశంవారు ఇచ్చినవి: యొకెనియము, కర్తా 35 దిమ్నా, నహలాలు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ ప్రజలకే ఇవ్వబడింది. 36 రూబేను వంశంవారు వారికి ఇచ్చినవి బెసెరు, యహసు 37 కెదెమోతు, మోఫాతు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ కుటుంబానికే ఇవ్వబడింది. 38 గాదు వంశం వారు వారికి ఇచ్చినవి గిలాదులోని రామోత్. (గిలాదు ఒక ఆశ్రయ పట్టణం). వారు ఇంకా మహనయీము, 39 హెష్బోను, యాజెరు కూడ ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ గాదువారు వారికి ఇచ్చారు.

40 మొత్తం మీద మెరారీ వారికి ఇవ్వబడినవి పన్నెండు పట్టణాలు.

41 మొత్తం మీద లేవీ వంశానికి నలభై ఎనిమిది పట్టణాలు లభించాయి. ఈ పట్టణాలన్నీ ఇశ్రాయేలు ప్రజల స్వాధీనంలో ఉన్న దేశంలోనే ఉన్నాయి. 42 ఈ పట్టణాలు ప్రతిదాని చుట్టూ పశువులు బ్రతికేందుకు గాను భూమి, పొలాలు ఉన్నాయి.

43 కనుక ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన వాగ్దానం చేసిన దేశం అంతటినీ ఆ ప్రజలకు ఆయన ఇచ్చాడు. ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడ నివసించారు. 44 మరియు వారి దేశానికి అన్నివైపులా ఆ ప్రజలు శాంతి కలిగి ఉండేటట్లు యెహోవా చేసాడు. చాలా కాలం క్రిందట వారి పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసింది ఇదే. వారి శత్రువులు ఎవరూ వారిని ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రతి శత్రువును ఓడించేటట్టు యెహోవా చేసాడు. 45 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన నెరవేర్చాడు. నెరవేరని వాగ్దానాలంటూ ఏమీ లేవు. ప్రతి వాగ్దానం నిజమయింది.

అపొస్తలుల కార్యములు 1

యెరూషలేములో సమావేశం

ప్రియమైన థెయొఫిలాకు,

నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను. ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు[a] వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”

యేసు పరలోకానికి వెళ్ళటం

వాళ్ళంతా కలుసుకొన్నప్పుడు, “ప్రభూ! మీరు ఈ సమయాన ఇశ్రాయేలు ప్రజలకు రాజ్యాన్ని తిరిగి ఇస్తారా?” అని యేసును అడిగారు.

ఆయన వాళ్ళతో, “తండ్రి తన అధికారంతో గడియలను, రోజులను నియమించాడు. కాని వాటిని తెలుసుకొనే అవసరం మీకు లేదు. కాని పవిత్రాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోనూ, యూదయ, సమరయ ప్రాంతాలన్నిటిలోనూ, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యమిస్తారు” అని అన్నాడు.

ఈ విధంగా చెప్పాక వాళ్ళ కళ్ళ ముందే ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు. వాళ్ళకు కనపడకుండా ఒక మేఘం ఆయన్ని కప్పివేసింది. 10 ఆయన వెళ్తూ ఉంటే వాళ్ళు దీక్షతో ఆకాశం వైపు చూస్తూ నిలుచున్నారు. అకస్మాత్తుగా తెల్లని దుస్తులు వేసుకొన్న యిద్దరు వ్యక్తులు వాళ్ళ ప్రక్కన నిలుచొని వాళ్ళతో, 11 “గలిలయ ప్రజలారా! ఆకాశంలోకి చూస్తూ ఎందుకు నిలుచున్నారు? మీనుండి పరలోకానికి తీసుకు వెళ్ళబడిన ఈ యేసు మీరు చూస్తున్నప్పుడు పరలోకానికి వెళ్ళినట్లే మళ్ళీ తిరిగి వస్తాడు” అని అన్నారు.

మత్తీయని ఎన్నుకోవటం

12 ఆ తర్వాత వాళ్ళు ఒలీవల కొండనుండి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఈ కొండ పట్టణానికి విశ్రాంతి రోజున నడిచినంత దూరంలో ఉంటుంది.[b] 13 వాళ్ళు వచ్చి మేడ మీద తాము నివసిస్తున్న గదిలోకి వెళ్ళారు. అక్కడున్న అపొస్తలులు ఎవరనగా: పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, “జెలోతే”[c] అని పిలువబడే సీమోను, యాకోబు కుమారుడు యూదా.

14 వీళ్ళంతా సమావేశమై ఒకే మనస్సుతో ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. కొందరు స్త్రీలు, యేసు తల్లి మరియ, యేసు సోదరులు కూడా వీళ్ళతో ఉండేవాళ్ళు.

15 ఒక రోజు భక్తులందరూ సమావేశం అయ్యారు. వాళ్ళ సంఖ్య నూట ఇరవై. పేతురు మాట్లాడటానికి లేచి నిలుచున్నాడు. 16 అతడు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా సోదరులారా! చాలా కాలం క్రిందటే పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. లేఖనాల్లో వ్రాయబడిన ఈ విషయాలు తప్పక జరుగవలసినవి. ఈ యూదా యేసును బంధించిన వాళ్ళకు దారి చూపాడు. 17 యూదా మాలో ఒకడు. మాతో కలిసి సేవ చెయ్యటానికి ఎన్నుకోబడ్డవాడు.”

18 యూదా చేసిన ఈ కుట్రకు అతనికి డబ్బు దొరికింది. ఆ డబ్బుతో ఒక భూమి కొనబడింది. ఆ తర్వాత యూదా తలక్రిందుగా పడిపోయాడు. అతని దేహం చీలిపోయి ప్రేగులు బయటపడ్డాయి. 19 యెరూషలేములోని వాళ్ళంతా దీన్ని గురించి విన్నారు. అందువలన తమ భాషలో ఆ భూమిని అకెల్దమ అని పిలిచేవాళ్ళు. దీని అర్థం “రక్తపు భూమి.”

20 పేతురు యింకా ఈ విధంగా అన్నాడు: “దీన్ని గురించి కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడివుంది:

‘అతని భూమిని పాడు పడనిమ్ము
    అక్కడెవ్వరూ నివసించకుండా పోనిమ్ము.’(A)

‘అతని స్థానాన్ని యింకొకడు ఆక్రమించనిమ్ము!’(B)

21 “ఇప్పుడు యింకొకడు మనలో చేరాలి. అతడు వాళ్ళలో, అంటే యేసు మనతో కలిసి జీవించినంత కాలం మనతో కలిసి ఉన్నవాళ్ళలో ఒకడై ఉండాలి. 22 అతడు యేసు ప్రభువు చావునుండి బ్రతికి వచ్చాడన్న దానికి మనతో కలిసి సాక్ష్యం చెప్పాలి. యోహాను బాప్తిస్మము నివ్వటం మొదలు పెట్టినప్పటినుండి యేసును మననుండి పరలోకానికి తీసుకు వెళ్ళిన దినం దాకా మనతో కలిసి జీవించినవాడై ఉండాలి.”

23 వాళ్ళు ఇద్దరి పేర్లను సూచించారు. బర్సబ్బా అని పిలువబడే యోసేపు పేరు, ఇతన్నే యూస్తు అని కూడా అంటారు, మత్తీయ పేరు. 24-25 అంతా కలిసి ఈ విధంగా ప్రార్థించారు: “ప్రభూ! నీకు ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు. యూదా తన స్థానాన్ని వదిలి తాను వెళ్ళతగిన స్థానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో అపొస్తలత్వాన్ని, ఈ సేవా స్థానాన్ని ఆక్రమించటానికి నీవెన్నుకొన్నవాణ్ణి మాకు చూపించు.” 26 ఆ తర్వాత వాళ్ళు చీటీలు వేసారు. వాళ్ళు తీసిన చీటీలో మత్తీయ పేరు వ్రాయబడి ఉంది. అందువల్ల అతడు ఆ పదకొండుగురిలాగే అపొస్తలుడయ్యాడు.

యిర్మీయా 10

దేవుడు మరియు విగ్రహాలు

10 ఇశ్రాయేలు వంశీయులారా యెహోవా చెప్పే మాట వినుము! యెహోవా ఇలా చెప్పుచున్నాడు:

“అన్యదేశ ప్రజలవలె నీవు జీవించవద్దు!
    ఆకాశంలో వచ్చే ప్రత్యేక సంకేతాలకు[a] నీవు భయపడవద్దు!
అన్యదేశాలవారు ఆకాశంలో తాము చూచే కొన్ని సంకేతాలకు భయపడతారు.
    కాని మీరు మాత్రం అలాంటి వాటికి భయపడరాదు.
ఇతర దేశ ప్రజల ఆచారాలు లెక్క చేయవలసినవికావు.
వారి విగ్రహాలు అడవిలో దొరికే కర్రముక్కల కంటే వేరేమీ కాదు.
వారి విగ్రహాలను ఒక పనివాడు తన ఉలితో చెక్కి మలుస్తాడు.
వెండి బంగారాలతో వారి విగ్రహాలను అందంగా తీర్చిదిద్దుతారు.
వాటిని పడిపోకుండా సుత్తులతో
    మేకులు కొట్టి నిలబెడతారు.
బీర తోటలోని దిష్టి బొమ్మల్లా వారి విగ్రహాలుంటాయి.
    వారి విగ్రహాలు మాట్లాడవు.
వారి విగ్రహాలు నడవలేవు.
    ఆ విగ్రహాలను మనుష్యులు మోయాలి!
కావున ఆ విగ్రహాలకు భయపడకు.
    అవి నిన్ను ఏమీ చేయలేవు.
పైగా అవి నీకసలు ఏ రకమైన సహాయమూ చేయలేవు!”

యెహోవా, నీవంటి దైవం మరొకరు లేరు!
    నీవు గొప్పవాడవు!
    నీ నామము గొప్పది మరియు శక్తి గలది.
ఓ దేవా, ప్రతివాడూ నిన్ను గౌరవించాలి. సర్వదేశాలకూ నీవు రాజువు.
    వారందరి గౌరవానికి నీవు అర్హుడవు.
ప్రపంచ దేశాలలో చాలామంది జ్ఞానులున్నారు.
    కాని వారిలో ఏ ఒక్కడు నీకు సాటిరాడు.

అన్యదేశవాసులు మందబుద్ధులు, మూర్ఖులు.
వారి బోధనలన్నీ పనికిరాని చెక్క బొమ్మల పేరుతో వచ్చినవి.
వారు తర్షీషు నగరంనుండి వెండిని,
    ఉపాజు నగరం నుండి బంగారాన్ని తెచ్చి విగ్రహాలను చేస్తారు.
విగ్రహాలు వడ్రంగులచే, లోహపు పని వారిచే చేయబడతాయి.
ఈ విగ్రహాలను నీలి రంగు, ఊదారంగు బట్టలతో అలంకరిస్తారు.
    “జ్ఞానులు” ఆ “దేవుళ్ల” ని చేస్తారు.
10 కాని యెహోవా నిజమైన దేవుడు.
    ఆయన మాత్రమే నిజంగా జీవిస్తున్న దేవుడు!
    శాశ్వతంగా పాలించే రాజు ఆయనే.
దేవునికి కోపం వచ్చినప్పుడు భూమి కంపిస్తుంది.
    ప్రపంచ రాజ్యాల ప్రజలు ఆయన కోపాన్ని భరించలేరు.

11-12 “ఈ వర్తమానం ఆ ప్రజలకు తెలియజేయుము,
    ‘ఆ బూటకపు దేవతలు భూమిని, ఆకాశాన్ని సృష్టించలేదు. ఆ చిల్లర దేవుళ్లు నాశనం చేయబడతారు.
    వారు భూమి నుండి, ఆకాశము నుండి మాయమవుతారు.’”[b]

తన శక్తితో భూమిని సృష్టించినది నిత్యుడగు దేవుడే.
    దేవుడు తన జ్ఞాన సంపదచే ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు.
తన అవగాహనతో దేవుడు
    ఆకాశాన్ని భూమిపైన వ్యాపింపజేశాడు.
13 భయంకరమైన శబ్ధంగల పిడుగులను దేవుడే కలుగజేస్తాడు.
    ఆకాశంనుండి ధారాపాతంగా వర్షం పడేలా కూడా దేవుడే చేస్తాడు.
భూమి నలుమూలల నుండీ ఆకాశంలోకి మేఘాలు లేచేలా ఆయన చేస్తాడు.
    ఆయన ఉరుములు మెరుపులతో వానపడేలా చేస్తాడు.
    ఆయన తన గిడ్డంగుల నుండి గాలి వీచేలా చేస్తాడు.

14 ప్రజలు మందబుద్ధి గలవారయ్యారు!
    లోహపు పనివారు వారు చేసిన విగ్రహాల చేత మూర్ఖులయ్యారు.
వారి బొమ్మలు అబద్ధాలకు ప్రతీకలు.
    అవి జడపదార్థములు[c]
15 ఆ విగ్రహాలు ఎందుకూ కొరగానివి.
    అవి హాస్యాస్పదమైనవి.
తీర్పు తీర్చే కాలంలో
    ఆ విగ్రహాలు నాశనం చేయబడతాయి.
16 కాని యాకోబు యొక్క దేవుడు[d] ఆ విగ్రహాలవంటి వాడు కాదు.
ఆయన సర్వసృష్టికి కారకుడు.
    ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు.
ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”

నాశనం వస్తూవుంది

17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి.
యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు.
    శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు.
18 యెహోవా ఇలా చెప్పాడు,
“ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను.
    వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను.
    వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.”[e]

19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను
    నా గాయం మానరానిది.
“ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే”
    అని నేను తలపోశాను.
20 నా గుడారం పాడైపోయింది.
    దాని తాళ్లన్నీ తెగిపోయాయి.
నా పిల్లలు నన్ను వదిలేశారు.
    వారు వెళ్లిపోయారు.
నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు.
    నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.
21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు!
    వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు,
వారు జ్ఞాన శూన్యులు.
    అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదురై తప్పిపోయాయి.
22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము!
    ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది.
అది యూదా నగరాలను నాశనం చేస్తుంది.
    యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది.
    అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.

23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు.
    ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు.
జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు.
    ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము!
    నీవు మమ్ము నశింపజేయవచ్చు
కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము!
    కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!
25 నీకు కోపంవస్తే,
    అన్యదేశాలను శిక్షించుము.
వారు నిన్నెరుగరు; గౌరవించరు.
    ఆ ప్రజలు నిన్ను పూజించరు.
ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి.
    వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు.
    వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.

మత్తయి 24

యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం

(మార్కు 13:1-31; లూకా 21:5-33)

24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.

యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.

యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.

“ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.

15 “అసహ్యం కలిగించేది, సర్వ నాశనం కలిగించేది పవిత్ర స్థానంలో నిలుచొని ఉండటం మీరు చూస్తారు. దీన్ని గురించి దానియేలు ప్రవక్త మాట్లాడాడు. పాఠకుడు దీని అర్థం గ్రహించాలి. 16 అప్పుడు యూదయ ప్రాంతలోవున్న ప్రజలు కొండల మీదికి పారిపోవటం మంచిది. 17 మిద్దె మీద ఉన్నవాడు తన యింట్లోకి వెళ్ళి ఏదీ తీసుకోరాదు. 18 పొలంలో వున్నవాడు తన వస్త్రాన్ని తీసుకు రావటానికి వెనక్కు మళ్ళరాదు.

19 “ఆ రోజుల్లో గర్భిణీ స్త్రీలకు, పురిటి స్త్రీలకు ఎంత దుఃఖం కలుగుతుందో కదా! 20 ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుంది. కనుక చలికాలంలో కాని, లేక విశ్రాంతి రోజు కాని పారిపోవలసిన పరిస్థితి ఏర్పడ కూడదని ప్రార్థించండి. 21 ప్రపంచం సృష్టింపబడిన నాటి నుండి నేటి దాకా అలాంటి కష్టం ఎన్నడూ సంభవించలేదు. యిక ముందు సంభవించదు.

22 “దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చేసి ఉండక పోయినట్లయితే, ఎవ్వరూ బ్రతికి ఉండే వాళ్ళు కాదు. కాని దేవుడు తానెన్నుకొన్న వాళ్ళకోసం ఆ రోజుల సంఖ్య తగ్గించాడు.

23 “ఆ రోజుల్లో మీలో ఎవరైనా, ‘ఇదిగో చూడండి క్రీస్తు యిక్కడ ఉన్నాడు’ అని కాని, లేక, ‘అక్కడున్నాడు’ అని కాని అంటే నమ్మకండి. 24 ఎందుకంటే క్రీస్తులమని, ప్రవక్తలమని చెప్పుకొంటూ ప్రజల్ని మోసం చెయ్యటానికి గొప్ప మహత్యాలు, ఆశ్చర్యం కలిగించే కార్యాలు చేసే మోసగాళ్ళు బయలు దేరుతారు. వీళ్ళు వీలైతే దేవుడు ఎన్నుకొన్నవాళ్ళను కూడా మోసం చెయ్యటానికి ప్రయత్నిస్తారు. 25 చూడండి! ముందే మీకు చెబుతున్నాను.

26 “కనుక మీతో ఎవరైనా, ‘అదిగో! ఆయన నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్నాడు’ అంటే, అక్కడికి వెళ్ళకండి. లేక, ‘యిక్కడ గదుల్లో ఉన్నాడు’ అంటే, నమ్మకండి. 27 తూర్పునుండి పడమర దాకా మెరిసే మెరుపు వలే మనుష్యకుమారుడు వస్తాడు. 28 శవమున్న చోటే రాబందులు ప్రోగౌతాయి.

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!

ఆ దినం కాని, ఆ ఘడియ కాని ఎవ్వరికీ తెలియదు

(మార్కు 13:32-37; లూకా 17:26-30, 34-36)

36 “ఆ రోజును గురించి లేక ఆ ఘడియను గురించి పరలోకంలోని దేవ దూతలకు గాని, కుమారునికి గాని ఎవ్వరికి తెలియదు. తండ్రికి మాత్రం తెలుసు.

37 “నోవహు కాలంలో ఏ విధంగా ఉందో మనుష్యకుమారుడు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వుంటుంది. 38 నోవహు తన నావలో ప్రవేశించేదాకా, ప్రళయానికి ముందు రోజుల్లో ప్రజలు తింటూ, త్రాగుతూ, పెళ్ళిళ్ళు చేసుకొంటూ, పెళ్ళిళ్ళు చేస్తూ జీవించారు. 39 ప్రళయం వచ్చి వాళ్ళందరూ కొట్టుకొని పోయేదాకా ఆ విధంగా జరుగుతుందని వాళ్ళకు తెలియదు.

“మనుష్యకుమారుడు కూడా అదే విధంగా అకస్మాత్తుగా వస్తాడు. 40 ఆ రోజు ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేస్తూవుంటే ఒకడు ఆయన వెంట తీసుకు పోబడతాడు. రెండవ వాడు వదిలి వేయబడతాడు. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒక స్త్రీని తన వెంట తీసుకువెళ్తాడు. రెండవ స్త్రీని వదిలి వేస్తాడు.

42 “మీ ప్రభువు ఏ రోజు రానున్నాడో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి. 43 కాని ఈ విషయం తెలుసుకొండి. ఇంటి యజమానికి దొంగ ఎప్పుడు వస్తాడో తెలిసి ఉంటే, తన యింట్లోకి దొంగను రానీయకుండా కాపలాకాస్తాడు. 44 మనుష్య కుమారుడు కూడా మీరు అనుకోని ఘడియలో వస్తాడు. కనుక మీరు కూడా అదే విధంగా సిద్ధంగా ఉండాలి.

మంచి దాసుడు, చెడ్డ దాసుడు

(లూకా 12:41-48)

45 “విశ్వాసము, తెలివిగల ఒక సేవకుణ్ణి ఉదాహరణగా తీసుకోండి. అతని యజమాని అతణ్ణి తన యింట్లో పనిచేసే వాళ్ళకు సరియైన సమయంలో భోజనం పెట్టడానికి నియమించాడు. 46 యజమాని వచ్చినప్పుడు ఆ సేవకుడు తన యజమాని చెప్పినట్లు చేస్తూవుంటే ధన్యుడు. 47 నేను మీకు నిజం చెబుతున్నాను: యజమాని ఆ నౌకరును తనకున్న ఆస్తి అంతటిపై అధికారిగా నియమిస్తాడు.

48 “ఒక వేళ ఆ సేవకుడు దుర్మార్గుడైతే తనలో తాను ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని 49 తన తోటి పని వాళ్ళను కొట్టడం మొదలు పెడ్తాడు. అంతేకాక త్రాగుబోతులతో కలసి తిని, త్రాగుతాడు. 50 యజమాని తన సేవకుడు ఎదురు చూడని రోజు, అతనికి తెలియని ఘడియలో వచ్చి, 51 అతణ్ణి చంపించి పాపులతో సహా నరకంలో పడవేస్తాడు. ఆ నరకంలో వాళ్ళంతా ఏడుస్తూ పండ్లు కొరుకుతూ బాధననుభవిస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International