Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 18-19

మిగిలిన భూమిని పంచటం

18 ఇశ్రాయేలు ప్రజలంతా షిలోహు అనే ప్రాంతంలో సమావేశం అయ్యారు. అక్కడ సన్నిధి గుడారాన్ని[a] వారు నిలబెట్టారు. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని వారి ఆధీనంలో ఉంచుకొన్నారు. ఆ దేశంలోని శత్రువులందరినీ వారు ఓడించారు. అయితే దేవుడు వాగ్దానం చేసిన ప్రదేశంలో భాగం పొందని ఇశ్రాయేలు వంశాలు అప్పటికి యింకా ఏడు ఉన్నాయి.

కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరుకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు. కనుక మీ వంశాల్లో ఒక్కోదాని నుండి ముగ్గురు మనుష్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. దేశాన్ని పరిశీలించి చూచేందుకు నేను ఆ మనుష్యుల్ని బయటకు పంపిస్తాను. ఆ దేశ పటాన్ని వారు తయారు చేస్తారు. తర్వాత వారు తిరిగి నా దగ్గరకు వస్తారు. దేశాన్ని వారు ఏడు భాగాలుగా విభజిస్తారు. యూదా ప్రజలు వారి దేశాన్ని దక్షిణాన ఉంచుకొంటారు. యోసేపు ప్రజలు వారి దేశాన్ని ఉత్తరాన ఉంచుకొంటారు. అయితే మీరు పటం గీసి, దేశాన్ని ఏడు భాగాలుగా విభజించాలి. ఆ పటాన్ని నా దగ్గరకు తీసుకొని రండి, ఏ వంశానికి ఏ భూమి రావాలో అది మనం యెహోవా దేవుడినే నిర్ణయం చేయనిద్దాం. కానీ లేవీ ప్రజలకు మాత్రం ఈ భూముల్లో ఎలాంటి భాగమూ ఉండదు. వారు యాజకులు, వారి పని యెహోవాను సేవించటమే. గాదు, రూబేను, మనష్షే వంశాలలో సగం మంది వారికి వాగ్దానం చేయబడిన దేశాన్ని ఇదివరకే తీసుకొన్నారు. వారు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నారు. యెహోవా సేవకుడు మోషే ఇదివరకే వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు.”

కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు.

కనుక ఆ మనుష్యులు ఆ చోటు విడిచి ఆ దేశంలో ప్రవేశించారు. ఆ మనుష్యులు ఆ దేశాన్ని పరిశీలించి, యెహోషువ కొరకు పటాలు తయారుచేసారు. ప్రతి పట్టణాన్నీ వారు పరిశీలించి, దేశం ఏడు భాగాలు అయ్యేటట్టు చేసారు. వారు ఆ పటాలు తయారుచేసి యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. యెహోషువ ఇంకా షిలోహులోని పాళెములోనే ఉన్నాడు. 10 ఆ సమయంలో యెహోషువ యెహోవాను సహాయం కొరకు వేడుకున్నాడు. ఒక్కో వంశానికి ఇవ్వాల్సిన దేశాలను యెహోషువ నిర్ణయించాడు.

బెన్యామీనీయులకు భూభాగం

11 యూదాకు యోసేపుకు మధ్యగల ప్రాంతంలోని దేశం బెన్యామీను వంశానికి ఇవ్వబడింది. బెన్యామీను వంశంలోని ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. బెన్యామీనుకు నిర్ణయించబడిన భూమి ఇది: 12 ఉత్తర సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలయింది. యెరికో ఉత్తరపు అంచున కొనసాగింది ఆ సరిహద్దు. తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన కొండ దేశంలోనుండి వెళ్లింది. బెత్ అవెనుకు సరిగ్గా తూర్పున చేరేంతవరకు ఆ సరిహద్దు కొనసాగింది. 13 తర్వాత ఆ సరిహద్దు లూజుకు (బేతేలు) దక్షిణంగా విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు అతారోతు అద్దారుకు వెళ్లింది. దిగువ బెత్ హరానుకు దక్షిణాన కొండమీద ఉంది అతారోత్ అద్దార్. 14 బెత్‌హరానుకు దక్షిణంగా ఒక కొండ ఉంది. ఈ కొండ దగ్గర ఆ సరిహద్దు మళ్లుకొని కొండ పడమటి పక్కకు దగ్గర్లో దక్షిణంగా వెళ్లింది. ఆ సరిహద్దు కిర్యత్ బాలాకు (కిర్యత్యారం) పోయింది. ఇది యూదా ప్రజలు నివసించిన ఒక పట్టణం. ఇది పడమటి సరిహద్దు.

15 దక్షిణ సరిహద్దు కిర్యత్యారీము దగ్గర మొదలై నెఫ్తోయ నదివరకు విస్తరించింది. 16 తర్వాత బెన్‌హిన్నోము లోయ దగ్గర కొండ మట్టానికి ఆ సరిహద్దు విస్తరించింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తర దిశ. ఆ సరిహద్దు యెబూసు పట్టణానికి దక్షిణంగా హిన్నోము లోయగుండా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు ఎన్‌రోగెలుకు విస్తరించింది. 17 అక్కడ ఆ సరిహద్దు ఉత్తరంగా మళ్లి ఎన్‌షెమెషుకు పోయింది. ఆ సరిహద్దు గెలిలోతుకు (పర్వతాల్లోని అదుమీము కనుమ దగ్గర ఉంది గెలిలోతు) కొనసాగింది. ఆ సరిహద్దు రూబేను కుమారుడు బోహను కోసం పేరుపెట్టబడిన మహాశిలవరకు క్రిందికి విస్తరించింది. 18 బెత్‌అరబా ఉత్తర ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు అరబాలోనికి విస్తరించింది. 19 తర్వాత ఆ సరిహద్దు బెత్‌హోగ్లా ఉత్తర ప్రాంతంవరకు వెళ్లి, ఉప్పు సముద్రపు ఉత్తర తీరాన ముగిసింది. ఇక్కడే యొర్దాను నది ఆ సముద్రంలో పడుతుంది. అది దక్షిణ సరిహద్దు.

20 తూర్పు వైపున యొర్దాను నది సరిహద్దు. కనుక బెన్యామీను వంశానికి ఇవ్వబడిన దేశం ఇది. అవే అన్ని వైపులా సరిహద్దులు. 21 కనుక బెన్యామీను కుటుంబాలు ప్రతీ ఒక్కటీ ఈ దేశాన్ని పొందాయి. మరియు వారి స్వంత పట్టణాలు ఇవి: యెరికో, బెత్‌హోగ్లా, ఎమెక్ కెజిబ్ 22 బెత్ అరాబా, సెమరాయిము, బేతేలు 23 అవ్విము, పారా, ఓఫ్రా 24 కెఫెరు అమ్మోని, ఓఫ్ని, గెబ. ఇవి పన్నెండు పట్టణాలు, ఈ పట్టణాల దగ్గర ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి.

25 బెన్యామీను వంశం స్వంత పట్టణాల్లో గిబియోను, రామా, బెయెరొతు 26 మిస్పే, కెఫిరా, మోసా, 27 రెకెము, ఇర్పెయెలు, తరలా 28 సేలా, ఎలెపు, యెబూసీ పట్టణం (యెరుషలేము), గిబియా, కిర్యత్ ఉన్నాయి. ఇవి పద్నాలుగు పట్టణాలు, వీటి దగ్గర్లో ప్రజలు నివసిస్తున్న చిన్న ప్రాంతాలు కూడ ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ బెన్యామీను వంశానికి లభించిన భూములు.

షిమ్యోను వంశం వారికి భూమి

19 అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది. వారికి లభించిన భూమి యిది; బెయెర్‌షెబ (షెబ) మోలాదా, హజర్‌షువలు, బాలా, ఎజెము, ఎల్తోలదు, బెతూలు, హొర్మా సిక్లగు, బెత్‌మార్కాబొదు, హజర్‌సుస బెత్‌లబాయొతు మరియు షారుహను. ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.

అయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను పట్టణాలు కూడా వారికి లభించాయి. ఇవి నాలుగు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. బాలాత్ బెయెరు వరకు ప్రజలు నివసిస్తున్న అతి చిన్న ప్రాంతాలు కూడ అన్నీ వారికి లభించాయి. (ఇది నెగెవు ప్రాంతంలో ఉన్న రామా వంటిదే.) కనుక షిమ్యోనీ ప్రజల కుటుంబాలకు ఇవ్వబడిన భూములు అవి. ఒక్కో కుటుంబానికి ఈ భూములు లభించాయి. షిమ్యోనీ ప్రజల భూమి యూదా భూభాగంలోనుండి తీసికోబడింది. యూదా వారికి అవసరమైన దానికంటె చాలా ఎక్కువ భూమి ఉంది. కనుక వారి భూమిలో షిమ్యోనీ ప్రజలకు కొంత భాగం లభించింది.

జెబూలూను వంశం వారికి లభించిన భూమి

10 తర్వాత భూమి లభించిన వంశం జెబూలూను. జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికీ, వారికి వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూను సరిహద్దు శారీదు వరకు విస్తరించింది. 11 తర్వాత అది పశ్చిమాన మరాలా వరకు పోయి, దబ్బాషెతు ప్రాంతానికి సమీంపంగా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు యొక్నెయాము దగ్గర ప్రాంతానికి విస్తరించింది. 12 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. శారీదు నుండి అది కిస్లోత్ తాబోరు ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు దబెరాతు. యాఫియకు విస్తరించింది. 13 తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్‌హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు మళ్లుకొని నేయావరకు కొనసాగింది. 14 నేయావద్ద ఆ సరిహద్దు మరల మళ్లుకొని ఉత్తరానికి విస్తరించింది. ఆ సరిహద్దు హన్నాతొన్ వరకు విస్తరించి, ఇఫ్తాయెల్ లోయవరకు కొనసాగింది. 15 ఈ సరిహద్దు లోపల కట్టాత్, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లేహేము పట్టణాలు ఉన్నాయి. మొత్తం మీద పన్నెండు పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి.

16 కనుక జెబూలూనుకు లభించిన పట్టణాలు, ప్రాంతాలు ఇవి. జెబూలూను ప్రతి వంశానికీ ఈ భూమి లభించింది.

ఇశ్శాఖారు వంశం వారికి భూమి

17 నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. 18 ఆ కుటుంబాలకు వారికి ఇవ్వబడిన భూమి యిది; యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, 19 హపరాయిము, షియోను, అనాహరతు 20 రబ్బితు, కిష్యోను, ఎబెజు 21 రెమెతు, ఎన్‌గన్నిము, ఎన్‌హద్దా, బెత్‌పెసెసు.

22 వారి దేశ సరిహద్దు తాబోరు, షహజును, బెత్‌షెమెషు అనే ప్రాంతాలను తాకుతుంది. ఆ సరిహద్దు యొర్దాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద 16 పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి. 23 ఈ పట్టణాలు, పురాలు ఇశ్శాఖారు వంశానికి యివ్వబడిన దేశంలోని భాగం. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.

ఆషేరు వంశంవారికి లభించిన భూమి

24 దేశంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ భూమిలో కొంత లభించింది. 25 ఆ వంశానికి ఇవ్వబడిన దేశం ఇది; హెల్కతు, హాలి, బెతెను, అక్షాపు, 26 అలమ్మేలెకు, అమద్, మిషల్.

పడమటి సరిహద్దు కర్మెలు పర్వతం, షీహోరు లిబ్నాతు వరకు కొనసాగింది. 27 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. ఆ సరిహద్దు బెత్ దాగొనుకు విస్తరించింది. ఆ సరిహద్దు జెబూలూను, ఇఫెలు లోయలను తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్‌ఎమెక్, నెయీఎల్‌కు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు కాబూలుకు ఉత్తరంగా దాటిపోయింది. 28 తర్వాత అబ్దోను,[b] రెహోబు, హమ్మోను, కానా వరకు ఆ సరిహద్దు కొనసాగింది. మహాసీదోను ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. 29 తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్లుకొని హొసాకు పోయింది. సముద్రం దగ్గర అక్జీబు ప్రాంతంలో 30 ఉమ్మా, అఫెకు, రెహోబు దగ్గర సరిహద్దు అయిపోయింది.

మొత్తం మీద ఇరవై రెండు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. 31 ఆషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో ఈ పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఒక భాగం. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో ఒక భాగం లభించింది.

నఫ్తాలి వంశం వారికి లభించిన భూమి

32 నఫ్తాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది. 33 వారి దేశ సరిహద్దు జయనన్నీములోని సింధూరవనము దగ్గర ప్రారంభమయింది. ఇది హెలెపు సమీపంలో ఉంది. తర్వాత ఆదామి, నెకెబు, యబ్నెయెలుగుండా ఆ సరిహద్దు కొనసాగింది. ఆ సరిహద్దు లక్కుం ప్రాంతం వరకు విస్తరించి, యొర్దాను నది దగ్గర ముగిసింది. 34 తర్వాత ఆ సరిహద్దు అస్నొతు తాబోరుగుండా పడమటికి వెళ్లింది. హుక్కొకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. దక్షిణాన సరిహద్దు జెబూలూను ప్రాంతం వరకు వెళ్లింది. పశ్శిమాన ఆ సరిహద్దు ఆషేరు ప్రాంతం వరకు వెళ్లింది. తూర్పున యొర్దాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా వరకు వెళ్లింది. 35 ఈ సరిహద్దుల లోపల కొన్ని బలమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరతు 36 అదామా, రామా, హషొరు 37 కెదెషు, ఎద్రేయి, ఎన్‌హసోరు 38 ఇరోను, మిగ్దల్ ఎల్, హోరేం, బెత్‌అనాతు, బెత్‌షెమెషు. మొత్తం మీద పంతొమ్మిది, పట్టణాలు వాటి పొలాలు మొత్తము.

39 ఆ పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు నఫ్తాలి వంశం వారికి యివ్వబడిన దేశంలో ఉన్నాయి. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది.

దాను వంశం వారికి లభించిన భూమి

40 తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భూమి లభించింది. 41 వారికి ఇవ్వబడిన భూమి ఇది: జొర్యా, ఎష్తాయోలు, ఇర్‌షెమెషు 42 షయల్బీను, అయ్యాలోను, ఇత్లా, 43 ఎలోను, తిమ్నా, ఎక్రోను 44 ఎలైకే, గిబ్బెతాను, బాలాతా 45 యెహుదు బెనెబెరక్, గాత్ రిమ్మోను 46 మేయర్కోను రక్కోను, యొప్ప దగ్గర ప్రాంతం.

47 అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు. 48 దాను వంశానికి యివ్వబడిన దేశం ఈ పట్టణాలు, పురాలు మొత్తము. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.

యెహోషువకు లభించిన భూమి

49 కనుక దేశాన్ని విభజించటం, వేర్వేరు వంశాలకు దానిని పంచి ఇవ్వటం నాయకులు ముగించారు. వారు ముగించిన తర్వాత, నూను కుమారుడైన యెహోషువకు గూడ కొంత భూమి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలంతా నిర్ణయించారు. ఇది అతనికి వాగ్దానం చేయబడిన భూమి. 50 అతనికి ఈ భూమి రావాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక ఎఫ్రాయిము కొండ దేశంలోని తిమ్నాత్ సెరహు పురమును వారు యెహోషువకు ఇచ్చారు. ఈ పట్టణమే తనకు కావాలని యెహోషువ వారితో చెప్పాడు. కనుక యెహోషువ ఆ పట్టణాన్ని మరింత గట్టిగా కట్టి, అక్కడ నివసించాడు.

51 కనుక ఇశ్రాయేలీయుల వేర్వేరు వంశాలకు ఈ భూములన్నీ ఇవ్వబడ్డాయి. ఈ దేశాన్ని విభాగించేందుకు యాజకుడైన ఎలీయేజరు, నూను కుమారుడైన యెహోషువ, ఒక్కో వంశాల నాయకులు షిలోహు అనే స్థలంలో సమావేశం అయ్యారు. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర యెహోవా సన్నిధిలో వారు సమావేశమయ్యారు. ఇప్పుడు దేశాన్ని విభాగించటం వారు ముగించారు.

కీర్తనలు. 149-150

149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
    ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
    సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
    నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
    దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
    ఆయన వారిని రక్షించాడు!
దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
    పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.

ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
    ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
    వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
ఆ రాజులకు, ప్రముఖులకు
    దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
    దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.

యెహోవాను స్తుతించండి!

150 యెహోవాను స్తుతించండి!
దేవుని ఆలయంలో ఆయనను స్తుతించండి!
    ఆకాశంలో ఆయన శక్తిని బట్టి ఆయనను స్తుతించండి!
ఆయన గొప్ప కార్యములను బట్టి ఆయనను స్తుతించండి!
    ఆయన గొప్పతనమంతటి కోసం ఆయనను స్తుతించండి!
బూరలతో, కొమ్ములతో ఆయనను స్తుతించండి!
    స్వరమండలాలతో, సితారాలతో ఆయనను స్తుతించండి!
తంబురలతో, నాట్యంతో దేవుని స్తుతించండి!
    తీగల వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి!
పెద్ద తాళాలతో దేవుణ్ణి స్తుతించండి!
    పెద్దగా శబ్దం చేసే తాళాలతో ఆయనను స్తుతించండి!

సజీవంగా ఉన్న ప్రతీది యెహోవాను స్తుతించాలి!

యెహోవాను స్తుతించండి.

యిర్మీయా 9

నా తల నీటితో నిండియున్నట్లయితే,
    నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన
    నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!

ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం
    ఎడారిలో నాకొకటి ఉంటే
అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను.
    వారినుండి నేను దూరంగా పోగలను!
ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు.
    వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.

“వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు.
    వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి.
సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది.
వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు.
    వారు నన్నెరుగకున్నారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.

“మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి!
    మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు!
ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే.
    ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.
ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును.
    ఎవ్వడూ సత్యం పలుకడు.
యూదా ప్రజలు అబద్ధమాడుటలో
    తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు.
వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!
ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది.
    అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి!
    ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ
విషయాలను యెహోవా చెప్పినాడు!

కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు,
“లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను!
    నాకు వేరే మార్గం లేదు.
    నా ప్రజలు పాపం చేశారు.
యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు.
    వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి.
ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు.
    కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.
మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?”
“ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు.
    నేను వారికి తగిన శిక్ష విధించాలి.”
ఇది యెహోవా వాక్కు.

10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను.
    వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను.
    ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి.
ఎవ్వడూ అక్కడ పయనించడు.
    ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు.
పక్షులు ఎగిరి పోయాయి:
    పశువులు పారిపోయాయి.

11 “నేను (యెహోవా) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను.
    అది గుంట నక్కలకు[a] స్థావరమవుతుంది.
నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను.
    అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”

12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా?
    యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా?
యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా?
    రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది?
    జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.

13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు.
వారికి నా ఉపదేశములు ఇచ్చాను.
    కాని వారు వినటానికి నిరాకరించారు.
    వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.
14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు.
    వారు మొండివారు.
వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు.
    బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”

15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు,
“యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను.
    విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.
16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను.
వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది.
    వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు.
కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను.
    యూదా ప్రజలను వారు చంపివేస్తారు.
    ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”

17 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
“ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము!
    శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను పిలిపించుము.
    కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.
18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి.
అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి.
    కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.

19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన,
    ‘మేము నిజంగా నాశనమయ్యాము!
    మేము నిజంగా అవమానం పాలైనాము!
మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”

20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి.
    యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనివ్వండి.
యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి.
    ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:
21 “మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది.
    మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది.
వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది.
    బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.”

22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము,
పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి.
    పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి
    కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’”

23 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి
    గొప్పలు చెప్పుకోరాదు.
బలవంతులు తమ బలాన్ని గురించి
    గొప్పలు చెప్పుకోరాదు.
శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి
    గొప్పలు చెప్పుకోరాదు.
24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము.
    నన్నతను అర్థం చేసుకున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
    నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనిమ్ము.
    యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము.
    నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.”
ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.

25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయము ఆసన్నమవుతూ ఉంది. 26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”

మత్తయి 23

యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం

(మార్కు 12:38-40; లూకా 11:37-52; 20:45-47)

23 ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “శాస్త్రులు, పరిసయ్యులు మోషే స్థానంలో కూర్చునివున్నారు. అందువల్ల వాళ్ళు చెప్పినది విధేయతతో చెయ్యండి. కాని వాళ్ళు బోధించినవి వాళ్ళే ఆచరించరు కనుక వాళ్ళు చేసేవి చెయ్యకండి. వాళ్ళు బరువైన మూటలు కట్టి ప్రజల భుజాలపై పెడతారు. కాని వాళ్ళు మాత్రం ఆ బరువు మొయ్యటానికి తమ వేలు కూడా కదలించరు.

“పెద్ద దేవుని వాక్యములు వ్రాసి పెట్టుకొన్న సంచులను కట్టుకొని, వెడల్పాటి అంచులుగల వస్త్రాలు ధరించి చేసే ప్రతిపని ప్రజలు చూడాలని చేస్తారు. విందుల్లో, సమాజమందిరాల్లో ముఖ్యమైన స్థానాల్ని ఆక్రమించటానికి చూస్తారు. సంతల్లో, ప్రజలు తమకు నమస్కరించాలని, తమను రబ్బీ అని పిలవాలని ఆశిస్తారు.

“మీకందరికి బోధకుడు ఒకడే! మీరంతా సోదరులు. కనుక మిమ్మల్ని రబ్బీ అని పిలువనీయకండి. ప్రపంచంలో ఎవ్వర్నీ ‘తండ్రి!’ అని సంబోధించకండి. మీ అందరికి తండ్రి ఒక్కడే. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడు. 10 అదే కాకుండా మిమ్మల్ని ‘గురువు!’ అని పిలువ నియ్యకండి. మీకు ఒకే గురువు ఉన్నాడు. ఆయనే ‘క్రీస్తు.’ 11 మీలో గొప్ప వాడు మీ సేవకునిగా ఉండాలి. 12 ఎందుకంటే గొప్పలు చెప్పుకొనేవాణ్ణి దేవుడు అణచి వేస్తాడు. అణకువతో ఉన్న వాణ్ణి దేవుడు గొప్పవానిగా చేస్తాడు.

13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]

15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.

16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!

33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.

35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.

యెరూషలేము విషయంలో దుఃఖించటం

(లూకా 13:34-35)

37 “ఓ యెరూషలేమా! యెరూషలేమా! నీవు ప్రవక్తల్ని చంపావు! దేవుడు నీదగ్గరకు పంపిన వాళ్ళను నీవు రాళ్ళతో కొట్టావు! కోడి తన పిల్లల్ని దాని రెక్కల క్రింద దాచినట్లే నేను నీ సంతానాన్ని దాయాలని ఎన్నోసార్లు ఆశించాను. కాని నీవు అంగీకరించలేదు. 38 అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను. 39 ‘ప్రభువు పేరిట రానున్న వాడు ధన్యుడు!’ అని నీవనే దాకా నన్ను మళ్ళీ చూడవని చెబుతున్నాను.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International