M’Cheyne Bible Reading Plan
ఎఫ్రాయిము, మనష్షే వంశీయులకు భూములు
16 యోసేపు కుటుంబానికి లభించిన దేశం ఇది. ఈ దేశం యెరికో సమీపాన యొర్దాను నది దగ్గర ప్రారంభమై యెరికో జలాల వరకు కొనసాగింది (ఇది యెరికోకు సరిగ్గా తూర్పున ఉంది). ఆ సరిహద్దు యెరికోనుండి పైకి, బేతేలు కొండ ప్రాంతంవరకు వ్యాపించింది. 2 తర్వాత ఆ సరిహద్దు బేతేలు (లూజు) నుండి అతరోత్ వద్ద అర్కీయ సరిహద్దువరకు కొనసాగింది. 3 తర్వాత ఆ సరిహద్దు పశ్చిమాన యాఫ్లెతీయ ప్రజల సరిహద్దువైపు పోయింది. దిగువ బెత్‌హరను వరకూ ఆ సరిహద్దు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు గెజెరుకు పోయి, సముద్రం వరకు వ్యాపించింది.
4 కనుక మనష్షే, ఎఫ్రాయిం ప్రజలకు వారి భూమి లభించింది. (మనష్షే, ఎఫ్రాయిము యోసేపు కుమారులు)
5 ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన భూమి ఇది: తూర్పున ఎగువ బేత్‌హోరోను సమీపంలో అతారోతు అద్దారు వద్ద వారి సరిహద్దు మొదలయింది. 6 మరియు పశ్చిమ సరిహద్దు మిస్మెతతు వద్ద మొదలయింది. ఆ సరిహద్దు తూర్పున తానతు షిలోహుకు మళ్లి, యానోయకు విస్తరించింది. 7 అప్పుడు ఆ సరిహద్దు యానోయనుండి క్రిందికి అతారోతు మరియు నారాకు వెళ్ళింది. ఆ సరిహద్దు యెరికోను తాకి, యొర్దాను నది దగ్గర నిలిచిపోయేంతవరకు కొనసాగింది. 8 ఆ సరిహద్దు తప్పూయ మొదలుకొని కానా ఏటివరకు పశ్చిమంగా వ్యాపించి, సముద్రం దగ్గర అంతమయింది. అది మొత్తం ఎఫ్రాయిము ప్రజలకు ఇవ్వబడిన దేశం. ఆ వంశంలోని ఒక్కో కుటుంబానికి ఈ దేశంలో కొంత భాగం దొరికింది. 9 ఎఫ్రాయిము వారి సరిహద్దు పట్టణాలు అనేకం నిజానికి మనష్షే వారి సరిహద్దుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పట్టణాలు, ఆ పొలాలు ఎఫ్రాయిము వారికే వచ్చాయి. 10 అయితే గెజరు పట్టణంనుండి కనానీ ప్రజలను ఎఫ్రాయిము ప్రజలు వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ ఎఫ్రాయిము ప్రజల మధ్య కనానీ ప్రజలు నివసిస్తున్నారు. కానీ కనానీ ప్రజలు ఎఫ్రాయిము ప్రజలకు బానిసలుగా అయ్యారు.
17 తర్వాత మనష్షే వంశానికి భూమి ఇవ్వబడింది. యోసేపు మొదటి కుమారుడు మనష్షే. మనష్షే మొదటి కుమారుడు మాకీరు, ఇతడు గిలాదు తండ్రి.[a] మాకీరు గొప్ప వీరుడు, కనుక గిలాదు, బాషాను ప్రాంతాలు మాకీరు వంశానికి ఇవ్వబడ్డాయి 2 మనష్షే వంశంలోని ఇతర కుటుంబాలకు కూడా భూమి యివ్వబడింది. ఆ కుటుంబాలు అబియెజెరు, హెలెకు, అజ్రియెలు, షెకెము, హెఫెరు, షెమిద. యోసేపు కుమారుడగు మనష్షే మిగిలిన కుమారులు వీరంతాను. ఈ మనుష్యుల కుటుంబాలకు కూడ కొంత భూమి లభించింది.
3 హెపెరు కుమారుడు సెలోపెహాదు. గిలాదు కుమారుడు హెపెరు. గిలాదు మాకీరు కుమారుడు, మాకీరు మనష్షే కుమారుడు. కానీ సెలోపెహాదుకు కుమారులు లేరు. అతనికి ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల పేర్లు మహల, నోయ, హోగ్ల, మీల్కా, తిర్సా. 4 యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ ఇశ్రాయేలు నాయకులందరి దగ్గరకు ఆ కుమార్తెలు వెళ్లారు. “మగవారికి ఇచ్చినట్టే మాకూ భూమి ఇవ్వాలని మోషేతో యెహోవా చెప్పాడు” అన్నారు ఆ కుమార్తెలు. కనుక ఎలియాజరు యెహోవాకు విధేయుడై, ఆ కుమార్తెలకు కొంత భూమి యిచ్చాడు. కనుక కుమారులవలెనే ఈ కుమార్తెలకుగూడ కొంత భూమి లభించింది.
5 కనుక మనష్షే వంశానికి యొర్దాను నదికి పశ్చిమాన పది ప్రాంతాలు, యొర్దాను నది ఆవలి ప్రక్క గిలాదు, బాషాను అనే మరి రెండు ప్రాంతాలు ఉన్నాయి. 6 మనష్షే కుమార్తెలకు గూడ కుమారులవలెనే భూమి లభించింది. మనష్షే మిగిలిన కుటుంబాలకు గిలాదు దేశం ఇవ్వబడింది.
7 మనష్షే భూములు ఆషేరు, మిక్మెతాతు మధ్య ప్రాంతంలో ఉన్నాయి. ఇది షెకెము దగ్గర సరిహద్దు దక్షిణాన ఎన్‌తపూయా వరకు వెళ్లింది. 8 తపూయ దేశం మనష్షేకు చెందినదే కాని తపూయ పట్టణం మాత్రం కాదు. తపూయా పట్టణం మనష్షే దేశ సరిహద్దు పక్కగా ఉంది, అది ఎఫ్రాయిము కుమారులకు చెందినది. 9 మనష్షే సరిహద్దు దక్షిణాన కానా ఏటివరకు వ్యాపించింది. ఈ మనష్షే ప్రాంతంలోని పట్టణాలు ఎఫ్రాయిముకు చెందినవి. నదికి ఉత్తరాన ఉంది మనష్షే సరిహద్దు మరియు అది పశ్చిమాన సముద్రం వరకు విస్తరించింది. 10 దక్షిణ దేశం ఎఫ్రాయిముకు చెందినది. ఉత్తర దేశం మనష్షేది. మధ్యధరా సముద్రం పడమటి సరిహద్దు. ఆ సరిహద్దు ఉత్తరాన ఆషేరు దేశాన్ని, తూర్పున ఇశ్శాఖారు దేశాన్ని తాకుతుంది.
11 ఇశ్శాఖారు, ఆషేరు ప్రాంతంలో బెత్‌షియాను, దాని తాలూకు చిన్న పట్టణాలు, ఇబ్లెయాము, దాని తాలుకు చిన్న పట్టణాలు మనష్షే స్వంతం. దోరు పట్టణంలో, దాని తాలూకు చిన్న పట్టణాల్లో, ఎన్‌దోరు పట్టణంలో దాని తాలూకు చిన్న పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం. తానాకు, దాని చిన్న పట్టణాల్లో, మెగిద్దో, దాని చిన్న పట్టణాల్లో, నాఫోతు మూడు పట్టణాల్లో నివసించే ప్రజలంతా మనష్షే స్వంతం. 12 మనష్షే ప్రజలు ఆ పట్టణాలను ఓడించలేకపోయారు. కనుక కనానీ ప్రజలు అక్కడనే నివసించటం కొనసాగించారు. 13 అయితే ఇశ్రాయేలు ప్రజలు బలవంతులుగా ఎదిగారు. ఇది జరిగినప్పుడు కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకొన్నారు. కానీ ఆ దేశం విడిచి పొమ్మని మాత్రం కనానీ ప్రజలను వారు ఒత్తిడి చేయలేదు.
14 యోసేపు వంశంవారు యెహోషువతో మాట్లాడి “నీవు మాకు ఒక్క ప్రాంతం మాత్రమే ఇచ్చావు. కానీ మేము చాలమందిమి ఉన్నాము. యెహోవా తన ప్రజలకు ఇచ్చిన భూమి అంతటిలో ఒక్క భాగం మాత్రమే మాకు ఎందుకు యిచ్చావు?” అన్నారు.
15 అప్పుడు యెహోషువ, “మీరు గనుక చాలినంతమంది ఉంటే, మీరు కొండ ప్రదేశానికి వెళ్లి, మీకు నివాస స్థలాన్ని చేసుకోండి. ఇది పెరిజ్జీ ప్రజలకు, రెఫాయిము ప్రజలకు చెందిన దేశం. ఇది ఎఫ్రాయిము వారి కొండ ప్రదేశం కాదు. ఎఫ్రాయిము కొండ ప్రదేశం మీకు మరీ చిన్నది అవుతుంది” అని బదులు చెప్పాడు.
16 యోసేపు ప్రజలు, “నిజమే, ఎఫ్రాయిము కొండ దేశం మాకు చాలదు. కానీ కనానీ ప్రజలు నివసిస్తున్న ప్రదేశం ప్రమాదకరమయింది. వారు నైపుణ్యంగల యుద్ధ వీరులు. మరియు బెత్‌షియనులోను, ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాలన్నింటిలోను వారికి బలమైన ఆయుధాలు, ఇనుప రథాలు ఉన్నాయి. పైగా యెజ్రెయేలు లోయలోకూడ వాళ్ళున్నారు” అని చెప్పారు.
17 అప్పుడు యోసేపు కుమారులు ఎఫ్రాయిము, మనష్షే ప్రజలతో యెహోషువ ఇలా చెప్పాడు: “అయితే మీరు చాల విస్తారంగా ఉన్నారు. మీకూ మహాగొప్ప శక్తి ఉంది. మీకు చాల ఎక్కువ భూమిని ఇవ్వాలి. 18 కొండ ప్రదేశం మీదే. అది అడవి అయినా మీరు చెట్లు నరికి మంచి నివాస ప్రదేశంగా దాన్ని మార్చుకోవచ్చు. అది మొత్తం మీ స్వంతం అవుతుంది. కనానీ ప్రజలను మీరు ఆ దేశం నుండి వెళ్లగొట్టివేయాలి. వారికి బలమూ, బలమైన ఆయుధాలూ ఉన్నప్పటికీ మీరు వారిని ఓడించేస్తారు.”
148 యెహోవాను స్తుతించండి!
పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి!
2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి!
ఆయన సర్వ సైనికులారా,[a] ఆయనను స్తుతించండి!
3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి.
ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి!
4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి.
ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి.
5 యెహోవా నామాన్ని స్తుతించండి.
ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది.
6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు.
ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు.
7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు!
మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి.
8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి,
తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు.
9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను,
దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు.
10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు.
11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు.
నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు.
12 యువతీ యువకులను దేవుడు చేశాడు.
వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు.
13 యెహోవా నామాన్ని స్తుతించండి!
ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి!
భూమిపైన, ఆకాశంలోను ఉన్న
సమస్తం ఆయనను స్తుతించండి!
14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు.
దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు.
ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి!
8 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “ఆ సమయంలో యూదా రాజులయొక్క, ముఖ్యపాలకుల యొక్క ఎముకలను ప్రజలు సమాధులనుండి తీస్తారు. వారు యాజకుల యొక్క, ప్రవక్తల యొక్క ఎముకలను సమాధులనుండి తీస్తారు. యెరూషలేము ప్రజలు ఎముకలను కూడ వారి సమాధుల నుండి తీస్తారు. 2 ఆ మనుష్యులు ఆ ఎముకలను ఆరుబయట సూర్యునికి, చంద్రునికి, నక్షత్రాలకు కనపడేలా పడవేస్తారు. యోరూషలేము ప్రజలు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆరాధించటానికి యిష్టపడతారు. ఆ ఎముకలను తిరిగి ఎవ్వరూ ప్రోగుచేసి పాతిపెట్టరు. కావున ఆ యెముకలన్నీ పశువుల పేడవలె బయట పారవేయబడును.
3 “యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
పాపము శిక్ష
4 “యిర్మీయా, ఈ విషయం యూదా ప్రజలకు తెలియజేయుము: ‘యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:
“‘ఒక వ్యక్తి క్రింద పడితే
తిరిగి లేస్తాడని మీకు తెలుసు.
ఒక వ్యక్తి తప్పుదారిలో వెళ్లితే
అతడు మరల తిరిగి వెనుకకు వస్తాడు.
5 యూదా ప్రజలు చెడు జీవితం గడిపారు.
కాని యెరూషలేము ప్రజలు ఎప్పుడూ ఎందుకు పెడమార్గాన వెళ్లుచున్నారు?
వారి అబద్ధాలను వారే నమ్ముతారు.
వారు వెనుదిరిగి రావటానికి నిరాకరిస్తారు.
6 వారు చెప్పేది నేను బహు శ్రద్ధగా ఆలకించాను.
కాని వారు ఏది సరైనదో తెలియజెప్పరు.
ప్రజలు వారి పాపాలకు విచారించుట లేదు.
ప్రజలు వారు చేసిన నేరాల గురించి ఆలోచించుట లేదు.
ప్రజలు ఆలోచనారహితంగా పనులు చేస్తారు.
వారు యుధ్ధానికి పరుగెత్తే గుర్రాల్లా ఉన్నారు.
7 ఆకాశంలో ఎగిరే పక్షులకు సైతం
తమ పనులకు ఒక నిర్ణీత కాలం తెలుసు.
కొంగలు, గువ్వలు, వాన కోవిలలు, ఓదెకరువులు (ఒక జాతి కొంగ)
వీటన్నిటికీ ఇతర ప్రాంతాలకు వలసపోయే కాలము క్రమము తప్పక తెలుసు.
కాని నా ప్రజలకు మాత్రం వారి యెహోవా వారిని ఏమి చేయమని కోరుతున్నాడో తెలియదు.
8 “‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు.
కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు[a] (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.
9 ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు.
కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు.
ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు.
వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.
10 కావున వారి భార్యలను నేనితరులకిచ్చి వేస్తాను.
వారి పొలాలను క్రొత్త యజమానులకిచ్చివేస్తాను.
ఇశ్రాయేలు ప్రజలంతా అధిక ధనసంపాదనపై ఆసక్తిగలవారు.
ప్రాముఖ్యంలేని అతి సామాన్యుల నుండి ముఖ్యుల వరకు ప్రజలంతా అలాంటివారే.
ప్రవక్తల నుండి యాజకుల వరకు ప్రజలంతా అబద్ధాలు చెప్పేవారే.
11 నా ప్రజలు బాగా గాయపడ్డారు.
కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు.
“అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!” అని వారంటారు.
కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!
12 ఆ ప్రజలు తాము చేసే దుష్కార్యాలకు చాలా సిగ్గుపడాలి.
కాని వారు సిగ్గుపడనే లేదు.
వారి పాపాలకు వారు కలవరపాటు చెందాలనేది కూడా వారికి తెలియదు.
అందరితో పాటు వారూ శిక్షించబడతారు.
నేను వారిని శిక్షిస్తాను; వారిని క్రిందికి పడవేస్తాను.’”
ఇది యెహోవా వాక్కు.
13 “‘వారి ఫలాలను, పంటను నేను తీసుకుంటాను
అందుచేత అక్కడ పంటకోత ఉండదు. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది
ద్రాక్ష తీగలపై కాయలేమాత్రం ఉండవు. అంజూరపు చెట్లకు కూడ కాయలుండవు.
వాటి ఆకులు సైతం ఎండిపోయి చనిపోతాయి.
నేను వారికిచ్చినవన్నీ తిరిగి తీసుకుంటాను.’”[b]
14 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము?
రండి, బలమైన నగరాలకు పారిపోదాం.
మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం.
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం.
అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
15 మనం శాంతిని కోరుకున్నాం;
కాని శాంతి కలుగలేదు.
స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం,
కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
16 దాను వంశీయుల రాజ్యంనుండి
శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి.
వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది.
వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ
నాశనం చేయాలని వచ్చియున్నారు.
వారీ నగరాన్ని, నగరవాసులను
సర్వనాశనం చేయటానికి వచ్చారు.
17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను[c] పంపుతున్నాను.
ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు.
ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
18 దేవా, నాకు దుఃఖం వస్తూ ఉంది; భయమేస్తూ ఉంది.
19 నా ప్రజల మొరాలకించుము!
దేశంలో ప్రతిచోటా వారు సహాయాన్ని అడుగుచున్నారు.
“సీయోనులో యెహోవా ఇంకా వున్నాడా?
సీయోను రాజు ఇంకా అక్కడ ఉన్నాడా?” అని వారంటున్నారు.
కాని దేవుడిలా అంటున్నాడు: “యూదా ప్రజలు వారి విగ్రహాలను ఆరాధించి నాకెందుకు కోపం కల్గించారు?
వారు అన్యదేశాల వారి పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.”
20 మళ్లీ ప్రజలు ఈ విధంగా అన్నారు:
“పంటకోత కాలం అయిపోయింది.
వేసవి వెళ్లిపోయింది. అయినా మేము రక్షించబడలేదు.”
21 నా జనులు బాధపడియుండుటచేత[d] బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
22 వాస్తవానికి గిలియాదులో తగిన ఔషధం ఉంది!
వాస్తవానికి గిలియాదులో వైద్యుడు కూడా ఉన్నాడు!
అయితే నా ప్రజల గాయాలు ఎందుకు నయం చేయబడలేదు?
పెళ్ళి విందు ఉపమానం
(లూకా 14:15-24)
22 యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 2 “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. 3 ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.
4 “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.
5 “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. 6 మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. 7 ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
8 “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. 9 వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. 10 ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.
11 “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. 12 ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. 13 వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.
14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:13-17; లూకా 20:20-26)
15 ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు. 16 వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. 17 మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.
18 యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? 19 ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. 20 ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు.
21 “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
22 ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:18-27; లూకా 20:27-40)
23 అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: 24 “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. 25 మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. 26 రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. 27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. 28 ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”
29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. 30 పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. 31 ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? 32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”
33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.
అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?
(మార్కు 12:28-34; లూకా 10:25-28)
34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. 35-36 వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.
37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.(B) 38 ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. 39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’(C) 40 ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”
క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?
(మార్కు 12:35-37; లూకా 20:41-44)
41 పరిసయ్యులు సమావేశమయ్యారు. యేసు వాళ్ళను 42 “మీరు క్రీస్తును గురించి ఏమనుకుంటున్నారు? ఆయన ఎవరి కుమారుడు?” అని అడిగాడు.
“దావీదు కుమారుడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
43 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “మరి దావీదు దేవుని ఆత్మద్వారా మాట్లాడుతూ క్రీస్తును ‘ప్రభూ!’ అని ఎందుకు పిలిచాడు? దావీదు,
44 ‘ప్రభువు, నా ప్రభువుతో నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసే దాకా,
నా కుడి వైపు కూర్చో’(D)
అని అనలేదా? 45 దావీదు క్రీస్తును ‘ప్రభూ’ అని అన్నాడు కదా. అలాంటప్పుడు క్రీస్తు దావీదు కుమారుడెట్లవుతాడు?”
46 ఎవ్వరూ ఏ సమాధానం చెప్పలేక పొయ్యారు. ఆ రోజు నుండి ఆయన్ని మరే ప్రశ్నలు అడగటానికి ఎవ్వరికి ధైర్యం చాలలేదు.
© 1997 Bible League International