M’Cheyne Bible Reading Plan
ఉత్తర ప్రాంతాలను వశపర్చుకొనటం
11 జరిగిన ఈ సంగతులు అన్నింటిని గూర్చి హాసోరు రాజు యాబిను విన్నాడు. అందుచేత అతడు అనేకమంది రాజుల సైన్యాలను సమకూర్చాలని నిర్ణయించాడు. మదోను రాజైన యోబాబు, షిమ్రోను రాజు, అక్షపు రాజు, 2 ఉత్తరాన కొండదేశం, ఎడారి రాజులు ఇద్దరికి యాబిను సందేశం పంపించాడు. కిన్నెరెత్, నెగెవ్, పడమటి దిగువ కొండల రాజులకు యాబిను సందేశం పంపించాడు. పడమట నఫోత్‌దార్ రాజుకుగూడ యాబిను సందేశం పంపించాడు. 3 యాబిను ఆ సందేశాన్ని తూర్పు, పడమరలలో ఉన్న కనానీ ప్రజల రాజులకు పంపించాడు. కొండ ప్రదేశాల్లో నివసిస్తున్న అమోరీ ప్రజలకు, హిత్తీ ప్రజలకు, పెరిజ్జీ ప్రజలకు, యెబూసీ ప్రజలకు పంపించాడు. మిస్పా ప్రాంతంలో హెర్మోను కొండ దిగువలో నివసిస్తున్న హివ్వీ ప్రజలకుగూడ అతడు ఆ సందేశం పంపించాడు. 4 కనుక ఈ రాజులందరి సైన్యాలు కూడి వచ్చాయి. అక్కడ ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అది అతి విస్తారమైన సైన్యం. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నట్టున్నారు.
5 ఈ రాజులంతా మెరోము అనే చిన్న నది దగ్గర సమావేశ మయ్యారు. వారు తమ సైన్యాలను ఒకే చోట చేర్చారు. ఇశ్రాయేలీయుల మీద పోరాడేందుకు వారు ఏర్పాట్లు చేసారు.
6 అప్పుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని ఓడించేటట్టు నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను నరికివేసి, వారి రథాలను తగులబెట్టేస్తారు” అని యెహోషువతో చెప్పాడు.
7 యెహోషువ, అతని సర్వసైన్యం శత్రువును ఆశ్చర్యచకితులుగా చేసారు. మెరోము నది వద్ద వారు శత్రువుమీద దాడి చేసారు. 8 ఇశ్రాయేలీయులు వారిని ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఇశ్రాయేలీయులు వారిని ఓడించి, మహా సీదోను, మిస్రెపోత్మాయిము, తూర్పున మిస్పాలోయ వరకు వారిని తరిమివేసారు. శత్రువులలో ఒక్కరుకూడ బతకకుండా చచ్చేవరకు ఇశ్రాయేలు సైన్యం పోరాడింది. 9 యెహోషువ ఏమి చేయాలని యెహోవా చెప్పాడో అతడు అలాగే చేసాడు-యెహోషువ వారి గుర్రాల కుడికాళ్ల నరాలను తెగగొట్టి, వారి రథాలను కాల్చివేసాడు.
10 అప్పుడు యెహోషువ వెనుకకు వెళ్లి హసోరు పట్టణాన్ని పట్టుకొన్నాడు. హసోరు రాజును యెహోషువ చంపివేసాడు. (ఇశ్రాయేలీయుల మీద యుద్ధంచేసిన రాజ్యాలన్నింటికీ హసోరు నాయకుడు.) 11 ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు సైన్యం చంపేసింది. వారు ఆ ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేసారు. ప్రాణంతో ఏదీ విడువబడలేదు. అప్పుడు వారు ఆ పట్టణాన్ని కాల్చివేసారు.
12 ఈ పట్టణాలన్నింటినీ యెహోషువ పట్టుకొన్నాడు. వాటి రాజులందరినీ అతడు చంపివేసాడు. ఆ పట్టణాల్లో ఉన్న సమస్తాన్నీ పూర్తిగా యెహోషువ నాశనం చేసాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టే అతడు ఇలా చేసాడు. 13 కానీ వారి కొండలమీద కట్టబడిన పట్టణాలలోని ఒక్కటికూడ ఇశ్రాయేలు సైన్యం కాల్చివేయలేదు. వారు కాల్చివేసిన కొండ మీద పట్టణం హజోరు మాత్రమే. ఇది యెహోషువ కాల్చిన పట్టణం. 14 ఈ పట్టణాల్లో దొరికిన వాటన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు వారికోసమే ఉంచుకొన్నారు. ఆ పట్టణంలోని జంతువులన్నింటినీ వారే ఉంచుకొన్నారు. కానీ అక్కడ ప్రజలను అందరినీ చంపివేసారు. మనుష్యులు ఎవరినీ వారు బ్రతకనివ్వలేదు. 15 ఇలా చేయుమని చాలకాలం క్రితమే యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఇలా చేయుమని మోషే యెహోషువకు ఆజ్ఞాపించియున్నాడు. కనుక యెహోషువ దేవునికి విధేయుడయ్యాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యెహోషువ జరిగించాడు.
16 కనుక ఈ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ యెహోషువ ఓడించాడు. కొండదేశం, నెగెవు ప్రాంతం, గోషెను ప్రాంతం అంతాను, పడమటి కొండల దిగువ ప్రాంతం, అరాబా ప్రాంతం, ఇశ్రాయేలు పర్వతాలు, వాటి దగ్గర్లో ఉన్న కొండలు అన్నింటిమీదా అతడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. 17 శేయీరు దగ్గర హాలాకు కొండ నుండి హెర్మోను కొండ దిగువన లెబానోను లోయలో బయల్గాదు వరకు ఉన్న దేశం అంతా యెహోషువ స్వాధీనంలో ఉంది. ఆ దేశంలోని రాజులందరినీ యెహోషువ పట్టుకొని చంపివేసాడు. 18 యెహోషువ ఆ రాజులతో చాల సంవత్సారాలు యుద్ధం చేసాడు. 19 ఆ దేశం మొత్తంలో ఒక్క పట్టణం మాత్రమే ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొంది. గిబియోనులో నివసిస్తున్న హివ్వీ ప్రజలే వారు. మిగతా పట్టణాలన్నీ యుద్ధంలో ఓడించబడ్డాయి. 20 ఆ ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే యెహోవా కోరాడు. అప్పుడే వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమిచేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన వారిని నాశనం చేయబడనిచ్చాడు.
21 హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా ప్రాంతాల్లోను, కొండదేశంలోను అనాకీ ప్రజలు[a] నివసించారు. ఈ అనాకీ ప్రజలతో యెహోషువ యుద్ధం చేసాడు. ఆ ప్రజలందరినీ, వారి పట్టణాలను యెహోషువ పూర్తిగా నాశనం చేసాడు. 22 ఇశ్రాయేలు దేశంలో అనాకీ ప్రజలు ఎవ్వరూ ప్రాణంతో మిగుల లేదు. మిగిలిన అనాకీ ప్రజలు గాజా, గాతు, అష్డోదులలో నివసించారు. 23 ఇశ్రాయేలు దేశం అంతటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా మోషేకు చెప్పింది ఇదే. యెహోవా వాగ్దానం చేసినందువల్ల ఆయన ఆ దేశాన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యెహోషువ ఆ దేశాన్ని ఇశ్రాయేలు వంశాలకు పంచిపెట్టాడు. అప్పుడు యుద్ధం ముగిసింది. చివరికి దేశంలో శాంతి నెలకొంది.
దావీదు కీర్తన.
144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
2 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
3 యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
4 మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.
5 యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
6 యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
7 యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
ఇతరుల నుండి నన్ను రక్షించుము.
8 ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్య విషయాలు చెబుతారు.
9 యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్యాలు చెబుతారు.
12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14 మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.
15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.
యూదా వారి దుష్టత్వం
5 “యెరూషలేము నగర వీధులలో తిరుగుతూ చుట్టుప్రక్కల పరిశీలిస్తూ ఈ విషయాలపై ఆలోచించు. నగర కూడలి స్థలాలలో వెదకి ఏ ఒక్కడైనా మంచి వ్యక్తి కనిపిస్తాడేమో చూడు. నీతిగా వ్యవహరించే ఏ ఒక్కడు గాని, సత్యాన్వేషిగాని ఉన్నాడేమో చూడు. ఏ ఒక్క మంచి వ్యక్తిని చూడ గలిగినా, నేను యెరూషలేమును క్షమిస్తాను! 2 ప్రజలు ప్రమాణాలు చేస్తూ ‘నిత్యుడైన యెహోవాతోడు’ అంటారు. కాని అది పేరుకు మాత్రం. వారు చెప్పింది చేయరు.”
3 యెహోవా, నీవు ప్రజలలో నమ్మకస్థులకై
చూస్తున్నావని నాకు తెలుసు.
యూదా వారిని నీవు కొట్టావు.
అయినా వారికి నొప్పి కలుగలేదు.
వారిని నాశనం చేశావు,
అయినా వారొక గుణపాఠం నేర్చుకోటానికి తిరస్కరించారు.
వారు మొండి వైఖరి దాల్చారు.
వారి దుష్కార్యాలకు వారు చింతించ నిరాకరించారు.
4 కాని నేను (యిర్మీయా) ఇలా అనుకున్నాను:
“కేవలం పేద మరియు సామాన్య వర్గాల వారే అలా మూర్ఖులై ఉండాలి.
వారే యెహోవా మార్గాన్ని అనుసరించటం నేర్చుకోలేదు.
పేదలు వారి దేవుని బోధనలు తెలుసుకోలేదు.
5 కావున యూదా ప్రజల నాయకుల వద్దకు నేను వెళతాను.
నేను వారితో మాట్లాడతాను.
నాయకులు తప్పక యెహోవా మార్గాన్ని మరియు ఉపదేశాలను అర్థం చేసుకుంటారు.
వారి దేవుని న్యాయమార్గం వారికి తెలుస్తుందనే నమ్మిక నాకు ఉంది!”
కాని నాయకులంతా యెహోవా సేవను
నిరాకరించే నిమిత్తం ఏకమైనారు.[a]
6 వారు దేవునికి వ్యతిరేకులైనారు.
అందువల్ల అరణ్యంలోనుండి ఒక సింహం వారిని ఎదిరిస్తుంది.
ఎడారిలో నుండి ఒక తోడేలు వచ్చి వారిని చంపుతుంది.
వారి నగరాల దాపున ఒక చిరుతపులి పొంచి ఉంది.
నగరంలో నుంచి ఎవడు బయటికి వచ్చినా చిరుతపులి చీల్చి చెండాడుతుంది.
యూదా ప్రజలు మరల మరల చేసిన పాపాల ఫలితంగా ఇదంతా జరుగుతుంది.
అనేక పర్యాయములు వారు యెహోవాకు దూరమైనారు.
7 దేవుడిలా అన్నాడు: “యూదా, నేను నిన్నెందుకు క్షమించాలో ఒక కారణం చూపించు.
నీ పిల్లలు నన్ను త్యజించారు.
దేవుళ్లే కానటువంటి వ్యర్థమైన విగ్రహాలకు వారు ప్రమాణాలు చేశారు.
నీ సంతానానికి కావలసిన ప్రతుది నేను యిచ్చి వున్నాను.
అయినా వారింకా నా పట్ల విశ్వాసఘాతకులై ఉన్నారు!
వారెక్కువ కాలం వ్యభిచార గృహాలలోనే గడిపారు
8 వారు తినటానికి సమృద్ధిగా ఉండి, సంభోగించటానికి సిద్ధంగా ఉన్న గుర్రాలవలె ఉన్నారు.
పొరుగువాని భార్య కోసం మదించి సకిలిస్తున్న గుర్రంలా వున్నారు.
9 ఈ పనులన్నీ చేసినందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఇదే యెహోవా వాక్కు.
“అవును! ఇటువంటి దేశాన్ని నేను శిక్షించాలిగదా.
వారికి తగిన శిక్ష విధించాలి.
10 “యూదావారి ద్రాక్షతోటల వరుసలగుండా వెళ్లు.
ద్రాక్షలతలన్నీ నరికివేయుము. (కాని వాటి మొద్దులను నరికి నాశనం చేయవద్దు).
వాటి కొమ్మలన్నీ నరికివేయి. ఎందువల్లనంటే, ఈ తీగెలు యెహోవాకు చెందినవికావు.[b]
11 ఇశ్రాయేలు వంశీయులు, యూదా వంశీయులు
ప్రతి విషయంలోనూ నాకు విశ్వాసఘాతుకులుగా ఉన్నారు.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.
12 “యెహోవా విషయంలో ఆ ప్రజలు అబద్ధమాడారు.
వారిలా అన్నారు: ‘యెహోవా మమ్మల్ని ఏమీ చేయడు.
మాకు ఏ రకమైన కీడూ రాదు.
మమ్మల్ని ఏ శత్రు సైన్యం ఎదిరించగా మేము చూడము.
మేము ఆకలికి మాడిపోము.’
13 తప్పుడు ప్రవక్తలు కేవలం వట్టి మాటలు పలుకుతారు,
దేవుని వాక్కు వారియందు లేదు.
వారికి కీడు మూడుతుంది.”
14 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు:
“నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు.
కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి.
ఆ ప్రజలు కొయ్యలాంటివారు.
అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.”
15 ఓ ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవా ఇలా చెప్పినాడు:
“మీ మీదికి బహు దూరంలో ఉన్న ఒక దేశాన్ని తీసుకొని వస్తున్నాను.
అది ఒక ప్రాచీన రాజ్యం
అది ఒక శక్తివంతమైన రాజ్యం.
మీకు అర్థంకాని భాషను వారు మాట్లాడతారు.
వారు చెప్పేది మీకు అర్థం కాదు.
16 వారి అమ్ముల పొదులు తెరచిన సమాధుల్లా వున్నాయి.
వారంతా యోధాన యోధులు.
17 మీరు పండించిన పంటనంతా ఆ సైనికులు తినివేస్తారు.
మీ ఆహారాన్నంతా వారు తినివేస్తారు.
మీ కుమారులను, కుమార్తెలను వారు నాశనం చేస్తారు.
వారు మీ గొర్రెల మందలను, పశువుల మందలను తింటారు.
మీ ద్రాక్షాపంటను, అంజూరపు చెట్లను వారు తింటారు.
కత్తులతో వారు మీ బలమైన నగరాలను నాశనం చేస్తారు.
మీరు నమ్మి తల దాచుకున్న బలమైన నగరాలను వారు నాశనం చేస్తారు!”
18 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“కాని ఆ భయంకరమైన రోజులు వచ్చినప్పుడు,
ఓ యూదా, నేను నిన్ను పూర్తిగా నాశనం కానివ్వను.
19 యూదా ప్రజలు నిన్ను,
‘యిర్మీయా, మా దేవుడైన యెహోవా మాకెందుకీ ఆపద తెచ్చిపెట్టాడు?’ అని అడుగుతారు.
అప్పుడు నీవు,
‘ఓ యూదా ప్రజలారా, మీరు యెహోవాను విస్మరించారు.
మీ స్వంత దేశంలోనే పరదేశాల వారి విగ్రహాలను పూజించారు.
మీరలా ప్రవర్తించారు గనుక
ఇప్పుడు మీరు పరాయి రాజులను మీకు చెందని రాజ్యంలో సేవించవలసి ఉంది!’ అని సమాధానం చెప్పు.”
20 యెహోవా ఇలా అన్నాడు: “యాకోబు వంశస్తులకు ఈ వర్తమానం అందజేయుము.
యూదా రాజ్యానికి ఈ సమాచారం తెలియజేయుము.
21 బుద్ధిహీనులైన మూర్ఖుపు జనులారా ఈ వర్తమానం వినండి:
మీకు కళ్లు ఉండికూడా చూడరు!
మీకు చెవులు ఉండి కూడా వినరు!
22 నేనంటే మీరు నిజంగా భయపడటం లేదు.”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది
“మీరు నాముందు భయంతో కంపించాలి.
సముద్రానికి తీరాన్ని ఏర్పరచిన వాడను నేనే.
తద్వారా సముద్రజలాలు తమ పరిధిలో శాశ్వతంగా ఉండేలా చేశాను.
అలల తాకిడికి సముద్రతీరం దెబ్బతినదు.
అలలు ఘోషిస్తూ తీరాన్ని చేరుతాయి, కాని అవి దానిని దాటిపోవు.
23 కాని యూదా ప్రజలు మొండి వైఖరి వహించారు.
వారు నాకు వ్యతిరేకంగా తిరగటానికి అనేక మార్గాలు అన్వేషిస్తున్నారు.
నాకు విముఖులై, నానుండి వారు దూరంగా పోయారు.
24 మనం మన దేవుడైన యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండాలని,
‘ఆయన మనకు శీతాకాల, వసంతకాల వర్షాలు సకాలంలో ఇస్తున్నాడనీ,
ఆయన సకాలంలో, సక్రమంగా మనం పంటనూర్పిడి చేసుకొనేలా చేస్తున్నాడనీ’
యూదా ప్రజలు ఎన్నడూ అనుకోలేదు.
25 యూదా ప్రజలారా, మీరు చెడు చేశారు. అందువల్ల వర్షాలు లేవు; నూర్పిళ్లు లేవు.
నీవు యెహోవా ఇచ్చే అనేక మంచి విషయాలను మీరు అనుభవించకుండా మీ పాపాలు అడ్డు పడుతున్నాయి.
26 నా ప్రజల మధ్య దుష్ట వ్యక్తులున్నారు.
ఆ దుష్టులు పక్షులను పట్టటానికి వలలు పన్నే కిరాతకుల్లా[c] ఉన్నారు.
వారు తమ బోనులు సిద్ధంచేసి పొంచి వుంటారు.
కాని వాళ్లు పక్షులకు బదులు మనుష్యులను పట్టుకుంటారు.
27 పంజరం నిండా పక్షులున్నట్లుగా,
ఈ దుష్టుల ఇండ్ల నిండా అబద్దాలే!
వారి అబద్ధాలు వారిని ధనికులుగా, శక్తివంతులుగా చేశాయి.
28 వారు చేసిన దుష్కార్యాల ద్వారా వారు బాగా ఎదిగి, కొవ్వెక్కినారు.
వారు చేసే అకృత్యాలకు అంతం లేదు.
వారు అనాధ శిశువుల తరఫున వాదించరు.
వారు అనాధలను అదుకోరు.
వారు పేదవారికి న్యాయం జరిగేలా చూడరు.
29 వారు ఈ కృత్యాలన్నీ చేస్తున్నందుకు యూదా ప్రజలను నేను శిక్షించవద్దా?”
ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.
“ఈ రకమైన దేశాన్ని నేను శిక్షించాలని నీకు తెలుసు.
వారికి తగిన శిక్ష నేను విధించాలి.”
30 యెహోవా ఇలా అన్నాడు,
“యూదా రాజ్యంలో ఆశ్చర్యం కలిగించే ఒక భయానక సంఘటన జరిగింది. అదేమంటే,
31 ప్రవక్తలు అబద్ధం చెప్పటం;
యాజకులు దేన్ని చేయుటకై ఎంచుకోబడ్డారో దానిని చేయరు[d]
నా ప్రజలు దానినే ఆదరించారు.
కానీ, ఓ ప్రజలారా చివరలో మీరు శిక్షకు
గురియైన నాడు మీరేమి చేస్తారు?”
విడాకులను గురించి బోధించటం
(మార్కు 10:1-12)
19 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. 2 ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.
3 కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.
4-5 యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’(A) ఇది మీరు చదువలేదా? 6 ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు.
7 “మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు.
8 యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. 9 కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.
10 శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.
11-12 యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు.
యేసు చిన్నపిల్లల్ని దీవించటం
(మార్కు 10:13-16; లూకా 18:15-17)
13 యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు. 14 కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళనాపకండి!” అని అన్నాడు. 15 వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మార్కు 10:17-31; లూకా 18:18-30)
16 ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు.
17 యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు.
18 “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు.
యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు. 19 తల్లితండ్రుల్ని గౌరవించాలి.(B) మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు.(C)
20 ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు.
21 యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు.
22 ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు.
23 ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం. 24 నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు.
25 శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు.
26 యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.
27 అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం లభిస్తుంది?” అని అన్నాడు.
28 యేసు, “ఇది సత్యం. క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు. 29 నాకోసం ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. 30 కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు. వెనుకనున్న వాళ్ళలో చాలా మంది ముందుకు వస్తారు!” అని అన్నాడు.
© 1997 Bible League International