M’Cheyne Bible Reading Plan
ఆకాను పాపం
7 అయితే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విధేయులు కాలేదు. యూదా వంశానికి చెందిన జబ్ది మనుమడు, కర్మి కుమారుడు ఆకాను అనే పేరుగలవాడు ఒకడు ఉన్నాడు. నాశనం చేయాల్సిన వస్తువుల్లో కొన్నింటిని ఆకాను దాచిపెట్టుకున్నాడు. అందుచేత ఇశ్రాయేలు ప్రజల మీద యెహోవాకు చాల కోపం వచ్చింది.
2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి[a] పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.
3 తర్వాత ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు తిరిగి వచ్చారు. “హాయి బలహీన ప్రాంతం. ఆ దేశాన్ని జయించేందుకు మనకు మన మనుష్యులంతా అవసరం లేదు. అక్కడ యుద్ధానికి రెండువేల మంది లేక మూడు వేల మందిని పంపించు. మన ప్రజలందర్నీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. మనమీద పోరాడేందుకు అక్కడ కొద్దిమంది మనుష్యులే ఉన్నారు” అన్నారు వారు.
4-5 కనుక సమారు మూడువేల మంది మనుష్యులు హాయికి వెళ్లారు. కాని హాయివారు ఇశ్రాయేలు మనుష్యులను 36 మందిని చంపివేసారు. పైగా ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. హాయివాళ్లు తమ పట్టణ ద్వారాల దగ్గరనుండి షేబారీమువరకు వాళ్లను తరిమివేసారు. హాయివాళ్లు వారిని బాగా కొట్టివేసారు.
ఇశ్రాయేలు ప్రజలు అది చూసి, చాలా భయపడిపోయారు, ధైర్యం కోల్పోయారు. 6 యెహోషువ ఇది విని, తన బట్టలు చింపుకొని, పవిత్ర పెట్టె ముందర నేలమీద సాగిలపడ్డాడు. సాయంత్రం వరకు యెహోషువ అక్కడే ఉండిపోయాడు. ఇశ్రాయేలు నాయకులంతా అలానే చేసారు. వారు వారి తలలమీద ధూళి పోసుకొన్నారు.
7 అప్పుడు యెహోషువ చెప్పాడు: “అయ్యో యెహోవా ప్రభువా! మా ప్రజలను నీవే యొర్దాను నది దాటించావు. కానీ నీవెందుకు మమ్మల్ని ఇంత దూరం తీసుకొని వచ్చి, అమోరీవాళ్లు మమ్మల్ని నాశనం చేయునట్లు చేశావు. యొర్దాను నది ఆవల మేము తృప్తిపడి, అక్కడే ఉండిపోవాల్సింది. 8 నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు. 9 కనానీ ప్రజలు, ఈ దేశంలోని ప్రజలందరూ జరిగిన దానిగూర్చి వింటారు. తరువాత వాళ్లు మా మీదికి వచ్చి, మమ్మల్ని అందర్నీ చంపేస్తారు. అప్పుడు నీ గొప్ప పేరు కాపాడేందుకు నీవు ఏమి చేస్తావు?”
10 యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: “లేచి నిలబడు! ఎందుకు నీవు సాష్టాంగ పడతావు? 11 ఇశ్రాయేలు ప్రజలు నాకు విరోధంగా పాపం చేసారు. వాళ్లు విధేయులు కావాలని నేను చేసిన ఒడంబడికను వారు ఉల్లంఘించారు. నాశనం చేయాలని నేను ఆజ్ఞాపించిన వాటిలో వారు కొన్ని తీసుకొన్నారు. వారు నా దగ్గర దొంగతనం చేసారు. వాళ్లు అబద్ధం చెప్పారు. ఆ వస్తువుల్ని వాళ్లు వారికోసం దాచుకొన్నారు. 12 అందుచేతనే ఇశ్రాయేలు సైన్యం యుద్ధంలో ఓడిపోయి పారిపోయింది. వారు తప్పు చేసినందువల్లనే ఇలా జరిగింది. వాళ్లు నాశనం కావాలి. నేను ఇంక మీకు సహాయం చేయను. మీరు నాశనం చేయాలని నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేస్తేనే తప్ప నేను ఇక మీదట మీకు తోడుగా ఉండును.
13 “ఇప్పుడు వెళ్లి, ప్రజలను పవిత్రం చేసి, ప్రజలతో ఇలా చెప్పు, ‘మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి. రేపటికోసం సిద్ధపడండి. ఇశ్రాయేలీయులు యెహోవా దేవుడు నాశనం చేయుమని ఆజ్ఞాపించిన వాటిని కొంత మంది దాచిపెట్టుకొన్నారని ఆయన చెబుతున్నాడు. వాటిని మీరు పారవేసేటంతవరకు మీరెన్నటికీ మీ శత్రువుల్ని ఓడించలేరు.
14 “‘రేపు ఉదయం మీరంతా యెహోవా ఎదుట నిలవాలి. అన్ని గోత్రాలూ యెహోవా యెదుట నిలబడాలి. ఒక గోత్రాన్ని యెహోవా నిర్ణయం చేస్తాడు. అప్పుడు ఆ గోత్రం మాత్రమే యెహోవా యెదుట నిలబడాలి. అప్పుడు ఆ గోత్రం నుండి ఒక వంశాన్ని యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ వంశం వాళ్లు మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. ఆ వంశంలో నుండి ఒక్క కుటుంబాన్ని మాత్రమే యెహోవా నిర్ణయిస్తాడు. అప్పుడు ఆ ఒక్క కుటుంబం మాత్రమే యెహోవా ఎదుట నిలబడాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఒక్కొక్క పురుషుని యెహోవా చూస్తాడు. 15 మనం నాశనం చేయాల్సిన వాటిని దాచిపెట్టుకొన్న మనిషి పట్టుబడతాడు. అప్పుడు ఆ మనిషిని అగ్నితో కాల్చి నాశనం చేయాలి. మరియు అతనికి కలిగిన సమస్తం అతనితో బాటు నాశనం చేయబడుతుంది. యెహోవా ఆజ్ఞాపించిన ఒడంబడికను ఆ మనిషి ఉల్లంఘించాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య అతడు మహాఅపరాధం చేసాడు.’”
16 మర్నాడు ఉదయం పెందలాడే ఇశ్రాయేలు ప్రజలందరినీ యెహోవా ఎదుటకు యోహోషువ నడిపించాడు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. యూదా గోత్రాన్ని యెహోవా నిర్ణయించాడు. 17 కనుక యూదా గోత్రములోని వంశాలన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జెరహు వంశాన్ని యెహోవా నిర్ణయం చేసాడు. అప్పుడు జెరహు వంశంలోని కుటుంబాలు అన్నీ యెహోవా ఎదుట నిలిచాయి. జబ్ది కుటుంబం నిర్ణయించబడింది. 18 అప్పుడు ఆ కుటుంబంలోని పురుషులంతా యెహోవా ఎదుటికి రావాలని యెహోషువ చెప్పాడు. కర్మీ కుమారుడైన ఆకానును యెహోవా నిర్ణయం చేసాడు. (జిమ్రి కుమారుడు కర్మి, జెరహు కుమారుడు జబ్ది).
19 అప్పుడు ఆకానుతో యెహోషువ అన్నాడు: “నా కుమారుడా, (నీ ప్రార్థన చేసుకో) ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించి, నీవు ఒప్పుకో. నీవేం చేసావో నాతో చెప్పు. నా దగ్గర ఏమీ దాచేందుకు ప్రయత్నించకు!”
20 ఆకాను ఇలా జవాబిచ్చాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా నేను పాపం చేసిన మాట నిజమే. నేను చేసింది ఏమిటంటే, 21 యెరికో పట్టణాన్ని అందులో ఉన్న వాటన్నిటినీ మనం పట్టుకొన్నాము గదా! వాటిలో అందమైన ఒక బబులోను అంగీ, రెండు వందల తులాల వెండి, యాభైతులాలకంటె ఎక్కువ బంగారం నేను చూసాను. ఇవన్నీ తప్పక నాకు కావాలనిపించింది. అందుచేత నేను వాటిని తీసుకొన్నాను. నా గుడారంలో నేల తవ్వితే అవి మీకు కనబడుతాయి. వెండి కూడ అంగీ క్రిందనే ఉంది.”
22 కనుక యెహోషువ కొందరు మనుష్యుల్ని ఆ గుడారానికి పంపించాడు. వారు ఆ గుడారానికి పరుగెత్తి వెళ్లి, ఆ వస్తువులు గుడారంలో దాచిపెట్టబడి ఉండటం చూసారు. వెండి కూడా అంగీ క్రిందనే ఉంది. 23 ఆ మనుష్యులు ఆ వస్తువుల్ని గుడారంలోనుంచి వెలుపలికి తీసుకొనివచ్చారు. వారు ఆ వస్తువుల్ని యెహోషువ దగ్గరకు, ప్రజలందరి దగ్గరకు తీసుకొని వెళ్లారు. వారు యెహోవా ఎదుట వాటిని నేలమీద పెట్టారు.
24 అప్పుడు యెహోషువ, ప్రజలందరూ కలిసి జెరహు కుమారుడు ఆకానును ఆకోరు[b] లోయకు తీసుకొని వెళ్లారు. వెండి, అంగీ, బంగారం, ఆకాను కుమారులు, కూతుళ్లు, అతని పశువులు, అతని గాడిదలు, అతని గొర్రెలు, అతని గుడారం, అతనికి ఉన్న సర్వమును వారు తీసుకొని వెళ్లారు. వారు వీటన్నింటినీ ఆకానుతోబాటు ఆకోరు లోయకు తీసుకొని వెళ్లారు. 25 అప్పుడు యెహోషువ, “నీవు మాకు ఇంత కష్టం ఎందుకు తెచ్చిపెట్టావో నాకు తెలియదు! కానీ ఇప్పుడు యెహోవా నిన్ను బాధిస్తాడు!” అన్నాడు. అప్పుడు ప్రజలు ఆకాను చచ్చేంతవరకు అతణ్ణి రాళ్లతో కొట్టారు. అతని కుటుంబాన్నికూడ వారు చంపేసారు. అప్పుడు వాళ్లందర్నీ, అతనికి ఉన్నదాన్నంతటినీ ప్రజలు కాల్చివేసారు. 26 వారు ఆకానును కాల్చేసిన తర్వాత, అతని శరీరం మీద చాల రాళ్లు కుప్పగా వేసారు. ఆ రాళ్లు నేటికీ అక్కడ ఉన్నాయి. (కనుక యెహోవా ఆకానును బాధించాడు.) అందుకే ఆ స్థలం ఆకోరు లోయ అని పిలువబడుతుంది. ఆ తర్వాత యెహోవా ప్రజల మీద కోపగించలేదు.
137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
4 కాని విదేశంలో మనం యెహోవాకు
కీర్తనలు పాడలేము!
5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
వాగ్దానం చేస్తున్నాను.
7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
9 నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
1 ఇవి యిర్మీయా వర్తమానాలు. యిర్మీయా తండ్రి పేరు హిల్కీయా. అనాతోతు నగరంలో నివసించే[a] యాజకుల కుటుంబానికి చెందిన వాడు యిర్మీయా. ఆ నగరం బెన్యామీను వంశానికి చెందిన వారి ప్రాంతంలో వుంది. 2 యూదా రాజ్యాన్ని యోషీయా పాలిస్తున్న రోజులలో యెహోవా యిర్మీయాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. యోషీయా తండ్రి పేరు ఆమోను. యోషీయా రాజ్యపాలన పదమూడవ సంవత్సరం[b] జరుగుతూ ఉండగా యెహోవా యిర్మీయాతో మాట్లాడటం ప్రారంభించాడు. 3 యెహోయాకీము యూదాకు రాజై యున్న కాలం వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం కొనసాగించాడు. యెహోయాకీము తండ్రి పేరు యోషీయా. సిద్కియా రాజ్యపాలన యూదాపై పదకొండు సంవత్సరాల ఐదు మాసాలు జరిగే వరకు యెహోవా యిర్మీయాతో మాట్లాడటం సాగించాడు. సిద్కియా కూడ యోషీయా కుమారుడే. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాలు దాటి ఐదవ నెల జరుగుతూ ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలు బందీలుగా కొనిపోబడ్డారు.
యిర్మీయాకు దేవుని పిలుపు
4 యెహోవా వాక్కు నాకు చేరింది. ఈ వర్తమానం యెహోవా వద్ద నుండి వచ్చింది.
5 “నీ తల్లి గర్భంలో నిన్ను నేను రూపించక ముందే
నిన్ను నేనెరిగియున్నాను.
నీవు పుట్టకముందే
నిన్నొక ముఖ్యమైన పనికి ఎన్నుకున్నాను.
దేశాలకు నిన్నొక ప్రవక్తగా నియమించాను.”
6 అప్పుడు, యిర్మీయానగు నేను “సర్వశక్తిమంతుడవైన యెహోవా! నేనెలా మాట్లాడాలో నాకు తెలియదు. నేను బాలుడను” అని అన్నాను.
7 కాని యెహోవా ఇలా అన్నాడు:
“బాలుడనని అనవద్దు.
నేను నిన్నెక్కడికి పంపుతానో నీవచ్చటికి తప్పక వెళ్లాలి.
నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా నీవు చెప్పాలి.
8 ఎవ్వరికీ భయపడకు.
నేను నీతో ఉన్నాను. నేను నిన్ను కాపాడతాను”.
ఈ వర్తమానం యెహోవానైన నా వద్దనుండి వచ్చినది.
9 పిమ్మట యెహోవా తన చేయి చాచి నా నోటిని తాకాడు. యెహోవా నాతో ఇలా అన్నాడు:
“యిర్మీయా, నేను నా వాక్కును నీ నోటిలో ఉంచుతున్నాను.
10 దేశాలను, సామ్రాజ్యాలను ఈ రోజు నీ జవాబుదారిలో ఉంచుతున్నాను.
నీవు వారిని కూకటి వేళ్లతో పెకలించి చీల్చివేస్తావు.
నీవు వాటిని సర్వనాశనం చేసి పడత్రోస్తావు.
నీవు వాటిని కట్టి నాటుతావు.”
రెండు దర్శనాలు
11 యెహోవా యొక్క సందేశం నాకు చేరింది యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తూ ఉన్నావు?”
అప్పుడు యెహోవాకు నేనిలా సమాధాన మిచ్చాను: “బాదపు చెట్టుకొమ్మతో చేయబడిన ఒక కర్రను నేను చూస్తున్నాను.”
12 “నీవు చాలా బాగా కనిపెట్టావు. నేను నీకిచ్చిన సందేశం నిజం కావాలని ఎదురు చూస్తున్నాను”[c] అని యెహోవా అన్నాడు.
13 యెహోవా సందేశం నాకు మళ్లీ వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు?”
“నేను ఒక మరుగుతున్న నీళ్ల కుండను చూస్తున్నాను. ఆ కుండ ఉత్తర దిశనుండి ఒరిగి ఉంది” అని నేను యెహోవాకు చెప్పాను.
14 నాతో యెహోవా ఇలా అన్నాడు: “ఉత్తర దిశనుండి ఉపద్రవం రాబోతూవుంది.
ఈ దేశంలో నివసిస్తూ ఉన్న వారందరికీ ఆ విపత్తు వస్తుంది.
15 అనతి కాలంలోనే ఉత్తర ప్రాంత సామ్రాజ్యాల ప్రజలందరికీ నేను పిలుపు యిస్తాను.”
ఇది యెహోవా వాక్కు.
“ఆయా రాజ్యాధినేతలు వస్తారు.
యెరూషలేము ద్వారాల వద్ద వారు తమ సింహాసనాలను ప్రతిష్ఠించుతారు.
యెరూషలేము నగర గోడలమీదికి దండెత్తి వస్తారు.
యూదా రాజ్యంలోని అన్ని నగరాలపై వారు దండయాత్రలు చేస్తారు.
16 అప్పుడు నా ప్రజలపై నా తీర్పును ప్రకటిస్తాను.
వారు చెడు నడతగల వారగుటచేతను, వారు నాపట్ల విముఖులైనందువల్లను నేనిది చేస్తున్నాను. నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు.
ఇతర దేవతలకు వారు బలులు అర్పించారు. వారి చేతితో వారు చేసిన బొమ్మలనే వారు ఆరాధించారు.
17 “యిర్మీయా, నీవు మాత్రం సిద్ధంగా ఉండు.
ధైర్యంగా నిలబడి ప్రజలతో మాట్లాడు.
నిన్ను ఏమి చెప్పమని అంటానో అదంతా వారికి తెలియజేయి.
ప్రజలకు నీవు భయపడవద్దు.
నీవు ప్రజలకు భయపడితే,
వారిముందు నీవు భయపడటానికి తగిన కారణం కల్పిస్తాను.
18 నేను మాత్రం ఈ రోజు నిన్నొక
బలమైన నగరం మాదిరిగాను,
ఒక ఇనుప స్థంభం వలెను,
ఒక కంచుగోడ వలెను బలపరుస్తాను.
దానివల్ల ఈ రాజ్యంలో ప్రతి వాని ఎదుట
నీవు ధైర్యంగా నిలువగలవు.
యూదా రాజుల ఎదుట,
యూదా నాయకుల ఎదుట,
యూదా యాజకుల ఎదుట,
మరియు యూదా ప్రజల ఎదుట నీవు ధైర్యంగా నిలువగలవు.
19 వారంతా నిన్నెదిరిస్తారు;
కాని నిన్ను ఓడించలేరు.
ఎందుకంటె నేను నీతో ఉన్నాను;
నేను నిన్ను ఆదుకుంటాను.”
ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం.
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మార్కు 7:1-23)
15 కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, 2 “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు.
3 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? 4 దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. 5-6 కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. 7 మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు,
8 ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి.
9 వాళ్ళ ఆరాధనలు వ్యర్థం!
వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’”(A)
అని అన్నాడు.
10 యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. 11 మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు.
12 ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు.
13 యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. 14 వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు.
15 పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు.
16 యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? 17 నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? 18 కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. 19 ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. 20 వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.
యేసు యూదులు కాని స్త్రీకి సహాయం చేయటం
(మార్కు 7:24-30)
21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.
23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.
24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల[a] కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.
25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.
26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.
27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.
28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.
యేసు అనేకులను నయం చేయటం
29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.
30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. 31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.
యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మార్కు 8:1-10)
32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.
33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.
34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు.
“ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. 37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.
© 1997 Bible League International