M’Cheyne Bible Reading Plan
దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించేందుకు యెహోషువను ఎన్నుకొనటం
1 యెహోవా సేవకుడు మోషే. నూను కుమారుడైన యెహోషువ, మోషేకు సహాయకుడు. మోషే చనిపోయాక యెహోషువతో యెహోవా మాట్లాడాడు. యెహోషువతో యెహోవా అన్నాడు: 2 “నా సేవకుడు మోషే మరణించాడు. ఇప్పుడు నీవు, ఈ ప్రజలు వెళ్లి, యొర్దాను నది దాటండి. ఇశ్రాయేలు ప్రజలైన మీకు నేను ఇస్తున్న దేశంలోకి మీరు వెళ్లాలి. 3 ఈ దేశాన్ని నేను మీకు ఇస్తానని మోషేకు వాగ్దానం చేసాను. కనుక మీరు వెళ్లే ప్రతి చోటునూ నేను మీకు ఇస్తాను. 4 హిత్తీ ప్రజల దేశం అంతా, అంటే ఎడారి, లెబానోను మొదలుకొని మహానది (యూఫ్రటీసు) వరకునున్న దేశమంతా మీదే. మరియు ఇక్కడ నుండి పశ్చిమాన (అది సూర్యాస్తమయ దిశ) మధ్యధరా సముద్రం వరకు మీ సరిహద్దు. 5 నేను మోషేకు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా వుంటాను. నీ జీవితాంతం నిన్నెవ్వరూ అడ్డగించలేరు. నేను నిన్ను విడిచి పెట్టను. ఎన్నటికీ నిన్ను నేను ఎడబాయను.
6 “యెహోషువా, నీవు బలంగా, ధైర్యంగా ఉండాలి! ఈ ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగేటట్టు నీవు ఈ ప్రజలను నడిపించాల్సి ఉంటుంది. వారి పితరులకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన దేశం ఇది. 7 అయితే నీవు మరో విషయంలో కూడ బలంగా, ధైర్యంగా ఉండాలి. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించే విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. అతని ప్రబోధాలను నీవు సరిగ్గా పాటిస్తే, నీవు చేసే ప్రతి పనిలోనూ నీకు విజయం కలుగుతుంది. 8 ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకో. ఆ గ్రంథాన్ని రాత్రి, పగలు ధ్యానించు. అప్పుడు అందులో వ్రాయబడిన విషయాలను పాటించగలుగుతావు. నీవు ఇలా చేస్తే, నీవు చేసే ప్రతీదీ తెలివిగా, విజయవంతంగా చేయగలుగుతావు. 9 నీవు బలంగా ధైర్యంగా ఉండాలని నేను ఆజ్ఞాపించినట్టు జ్ఞాపకం ఉంచుకో. అందుచేత భయపడవద్దు. ఎందుచేతనంటే, నీవు వెళ్లే ప్రతిచోటా నీ యెహోవా దేవుడు నీకు తోడుగా ఉంటాడు గనుక.”
యెహోషువ తన కార్యాన్ని నిర్వహించటం
10 కనుక యెహోషువ ప్రజానాయకులకు ఆదేశాలు ఇచ్చాడు. అతడు చెప్పాడు: 11 “గుడారాల్లోనికి వెళ్లి ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పండి. ప్రజలతో ఇలా చెప్పండి, ‘భోజనం తయారు చేసుకోండి. మూడు రోజుల్లో మనం యొర్దాను నది దాటాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మనం వెళ్లి తీసుకొందాము.’”
12 తర్వాత రూబేను, గాదు, మనష్షే వంశంలో సగభాగం వారితో యెహోషువ మాట్లాడాడు. యెహోషువ చెప్పాడు: 13 “యెహోవా సేవకుడు మోషే మీతో ఏమి చెప్పాడో జ్ఞాపకం చేసుకోండి. మీకు విశ్రాంతి కోసం మీ దేవుడైన యెహోవా మీకు ఒక స్థలం ఇస్తాడు అని అతడు చెప్పాడు. ఆ దేశాన్ని యెహోవా మీకు యిస్తాడు. 14 ఇప్పుడు యొర్దాను నదికి తూర్పున ఉన్న ఈ దేశాన్ని యెహోవా మీకు ఇచ్చాడు. మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు ఈ దేశంలో నివసించవచ్చు. అయితే యుద్ధం చేసే మీ పురుషులంతా మీ సోదరులతో కలిసి యొర్దాను నది దాటాలి. మీరు యుద్ధానికి సిద్ధపడి మీ సోదరులు వారి దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు సహాయపడాలి. 15 విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యొర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.”
16 అప్పుడు ప్రజలు యెహోషువాకు బదులు చెప్పారు: “మమ్మల్ని ఏమి చేయమని నీవు ఆజ్ఞాపిస్తే, మేము అలా చేస్తాము. నీవు మమ్మల్ని ఎక్కడికి పంపిస్తే మేము అక్కడికి వెళ్తాము. 17 మేము మోషేకు పూర్తిగా విధేయులం అయ్యాము. అలాగే, నీవు చెప్పే ప్రతిదానికీ మేము విధేయులవుతాము. ఒక్క విషయం మాత్రమే మేము యెహోవాను అడుగుతాము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడుగా ఉన్నట్టే నీకునూ తోడుగా ఉండాలని అడుగుతాము. 18 తర్వాత, ఎవరైనా నీ ఆజ్ఞలను తిరస్కరించినా, లేక ఎవరైనా నీమీద తిరుగుబాటు చేసినా అలాంటివాడు చావాల్సిందే. బలంగా, ధైర్యంగా ఉండు!”
యాత్ర కీర్తన.
120 నేను కష్టంలో ఉన్నాను.
సహాయం కోసం నేను యెహోవాకు మొరపెట్టాను.
ఆయన నన్ను రక్షించాడు.
2 యెహోవా, మోసకరమైన నాలుకనుండి,
నాకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పిన వారినుండి నన్ను రక్షించుము.
3 అబద్దికులారా, యెహోవా మిమ్మల్ని ఎలా శిక్షిస్తాడో మీకు తెలుసా?
మీరేమి పొందుతారో మీకు తెలుసా?
4 మిమ్మల్ని శిక్షించటానికి దేవుడు సైనికుని వాడిగల బాణాన్ని,
మండుతున్న నిప్పులను ఉపయోగిస్తాడు.
5 అబద్ధికులారా, మీ దగ్గర్లో నివసించటం మెషెకులో నివసించటంలాగే ఉంటుంది.
అది కేదారు[a] గుడారాల్లో నివసించినట్టే ఉంటుంది.
6 శాంతిని ద్వేషించే ప్రజలతో నేను చాలా ఎక్కువ కాలం జీవించాను.
7 నాకు శాంతి కావాలి. అయితే, నేను చెప్పినట్లు ఆ ప్రజలకు యుద్ధం కావాలి.
యాత్ర కీర్తన.
121 కొండల తట్టు నేను చూసాను.
కాని నిజానికి నా సహాయం ఎక్కడనుండి వస్తుంది?
2 భూమిని, ఆకాశాన్ని సృష్టించిన యెహోవా దగ్గరనుండి
నాకు సహాయం వస్తుంది.
3 దేవుడు నిన్ను పడిపోనివ్వడు.
నిన్ను కాపాడేవాడు నిద్రపోడు.
4 ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు.
దేవుడు ఎన్నడూ నిద్రపోడు.
5 యెహోవాయే నిన్ను కాపాడేవాడు.
యెహోవా తన మహా శక్తితో నిన్ను కాపాడుతాడు.
6 పగటి సూర్యుడు నీకు బాధ కలిగించడు.
రాత్రివేళ చంద్రుడు నీకు బాధ కలిగించడు.
7 ప్రతి అపాయం నుండి యెహోవా నిన్ను కాపాడుతాడు.
యెహోవా నీ ప్రాణాన్ని కాపాడుతాడు.
8 నీవు వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
ఇప్పుడు, ఎల్లప్పుడూ యెహోవా నీకు సహాయంగా ఉంటాడు.
దావీదు యాత్ర కీర్తన.
122 “మనం యెహోవా ఆలయానికి వెళ్దాం” అని ప్రజలు
నాతో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను.
2 ఇక్కడ యెరూషలేము ద్వారాల దగ్గర మనం నిలిచిఉన్నాము.
3 కొత్త యెరూషలేము
ఒకే ఐక్యపట్టణంగా మరల కట్టబడింది.
4 దేవునికి చెందిన గోత్రాల వారు అక్కడికి వెళ్తారు.
యెహోవా నామాన్ని స్తుతించుటకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వెళ్తారు.
5 ప్రజలకు న్యాయం తీర్చడానికి, రాజులు వారి సింహాసనాలు వేసుకొనే స్థలం అది.
దావీదు వంశపు రాజులు వారి సింహాసనాలు అక్కడే వేసుకొన్నారు.
6 యెరూషలేములో శాంతి కోసం ప్రార్థించండి.
“యెరూషలేమును ప్రేమించే ప్రజలకు అక్కడ శాంతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను.
7 నీ ప్రాంగణాలలో శాంతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను.
నీ మహాభవనాల్లో భద్రత ఉంటుందని నేను ఆశిస్తున్నాను.”
8 నా పొరుగువారు, ఇతర ఇశ్రాయేలీయులు క్షేమంగాను,
శాంతితోను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.
9 మన యెహోవా దేవుని ఆలయక్షేమం కోసం
ఈ పట్టణానికి మంచి సంఘటనలు సంభవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
యెహోవా స్వాతంత్య్ర సందేశం
61 యెహోవా సేవకుడు చెబుతున్నాడు, నా ప్రభువు యెహోవా తన ఆత్మను నాలో ఉంచాడు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేయటానికి యెహోవా నన్ను ఏర్పరచుకొన్నాడు. పేద ప్రజలకు శుభవార్త ప్రకటించుటకు, దుఃఖంలో ఉన్న మనుష్యులను ఓదార్చుటకు, స్వాతంత్య్రంలేని ప్రజలకు స్వాతంత్య్రం ప్రకటించుటకు, బలహీన ప్రజలకు నూతన బలం ఇచ్చేందుకు, 2 యెహోవా తన దయ చూపించే సమయాన్ని ప్రకటించేందుకు; దుష్టులను మన దేవుడు శిక్షించే సమయాన్ని ప్రకటించేందుకు; దుఃఖంలో ఉన్న వాళ్లను ఆదరించేందుకు; 3 దుఃఖంలో ఉన్న సీయోను వాసులకు గౌరవం చేకూర్చేందుకు (ఇప్పుడు వారికి బూడిద మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు ఆనందతైలం ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది); సీయోను ప్రజలకు దేవుని స్తుతిగీతాలు ఇచ్చుటకు (ఇప్పుడు వారికి దుఃఖం మాత్రమే ఉంది;) “మంచి వృక్షాలు” అని ఆ ప్రజలకు పేరు పెట్టుటకు; “యెహోవా అద్భుత చెట్టు” అని వారికి పేరు పెట్టుటకు.
4 పాడు చేయబడిన పాత పట్టణాలు ఆ సమయంలో మరల నిర్మించబడతాయి. ఆ పట్టణాలు మొదట్లో ఉన్నట్టే మరల నూతనంగా చేయబడతాయి. ఎన్నెన్నో సంవత్సరాలుగా పాడు చేయబడిన ఆ పట్టణాలు క్రొత్తవాటిలా చేయబడతాయి.
5 అప్పుడు మీ శత్రువులు మీ దగ్గరకు వచ్చి, మీ గొర్రెలను గూర్చి జాగ్రత్త వహిస్తారు. మీ శత్రువుల పిల్లలు మీ పొలాల్లోనూ, మీ తోటల్లోనూ పనిచేస్తారు. 6 మీరు “యెహోవా యాజకులు” అని, “మన దేవుని సేవకులు” అని పిలువబడతారు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నింటి నుండీ వచ్చిన ఐశ్వర్యాలు మీకు ఉంటాయి. అది మీకు ఉన్నందువల్ల మీరు గర్విస్తారు.
7 గతంలో ఇతరులు మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని చెడ్డ మాటలు అన్నారు. ఏ ఇతర ప్రజల కంటెకూడా మీరు ఎక్కువగా అవమానించబడ్డారు. కనుక ఇతర ప్రజలకంటె రెండంతలు ఎక్కువగా మీరు మీ దేశంలో పొందుతారు. శాశ్వతంగా కొనసాగే సంతోషం మీకు లభిస్తుంది. 8 ఎందుకు ఇలా జరగుతుంది? ఎందుకంటె, నేను యెహోవాను గనుక, న్యాయం అంటే నాకు ఇష్టం గనుక. దొంగతనం, సమస్త చెడుగు నాకు అసహ్యం. కనుక ప్రజలకు తగిన శిక్ష నేను ఇస్తాను. నా ప్రజలతో శాశ్వతంగా నేను ఒక ఒడంబడిక చేసుకొన్నాను. 9 అన్ని రాజ్యాలలో ప్రతి ఒక్కరూ నా ప్రజలను తెలుసుకొంటారు. నా దేశం పిల్లలను ప్రతి ఒక్కరు తెలుసుకొంటారు. యెహోవా వారిని ఆశీర్వదించునని, వారిని చూచే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది.
దేవుని సేవకుడు రక్షణను, తీసుకొనివస్తాడు
10 యెహోవా నన్ను ఎంతో ఎంతో సంతోషింపజేస్తాడు.
నా దేవునియందు నేను సంపూర్ణంగా సంతోషిస్తున్నాను.
రక్షణ వస్త్రాలతో యెహోవా నన్ను కప్పాడు.
ఆ వస్త్రాలు ఒకడు తన పెండ్లికి ధరించే వస్త్రాల్లా ఉన్నాయి.
దయ అనే పైబట్టతో యెహోవా నన్ను కప్పాడు.
ఈ పైబట్ట ఒక స్త్రీ తన పెండ్లికి ధరించే అందమైన వస్త్రాల్లా ఉంది.
11 భూమి మొక్కలను మొలిపిస్తుంది.
ప్రజలు తోటలో విత్తనాలు చల్లుతారు. ఆ తోట ఆ విత్తనాలను ఎదిగింపజేస్తుంది.
అదే విధంగా యెహోవా దయను ఎదిగింప జేస్తాడు. సకల రాజ్యాలలో యెహోవా స్తుతిని ఎదిగింప జేస్తాడు.
యేసు పక్షవాత రోగిని నయం చేయటం
(మార్కు 2:1-12; లూకా 5:17-26)
9 యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. 2 కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
3 ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.
4 వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? 5 ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? 6 పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
7 పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. 8 ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
మత్తయిని పిలవటం
(మార్కు 2:13-17; లూకా 5:27-32)
9 యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.
10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.
12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. 13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’(A) అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మార్కు 2:18-22; లూకా 5:33-39)
14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.
16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. 17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.
యేసు బాలికను బ్రతికించటం, ఒక స్త్రీని నయం చేయటం
(మార్కు 5:21-43; లూకా 8:40-56)
18 యేసు ఈ విధంగా మాట్లాడుతుండగా యూదుల సమాజమందిరానికి అధికారిగా ఉన్నవాడు ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరిల్లి, “నా కూతురు చనిపోయింది. కాని మీరు వచ్చి మీ చేయి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుంది” అని అన్నాడు.
19 యేసు, ఆయన శిష్యులు లేచి అతని వెంట వెళ్ళారు.
20 వాళ్ళు వెళ్తుండగా పండ్రెండేండ్ల నుండి రక్త స్రావంతో బాధ పడ్తున్న ఒక స్త్రీ వెనుక నుండి వచ్చి ఆయన అంగీ యొక్క కొనను తాకింది. 21 ఆమె, “నేను ఆయన వస్త్రాన్ని తాకగలిగితే చాలు నాకు నయమైపోతుంది” అని తనలో తాను అనుకొన్నది.
22 యేసు వెనక్కు తిరిగి ఆమెను చూసి, “ధైర్యంగా వుండమ్మా! నీ విశ్వాసమే నిన్ను బాగుచేసింది” అని అన్నాడు.
23 యేసు ఆ అధికారి యింట్లోకి ప్రవేశిస్తూ, అక్కడ పిల్లన గ్రోవి వాయించే వాళ్ళు, గోల చేస్తున్న వాళ్ళు ఉండటం చూసాడు. 24 వాళ్ళతో, “వెళ్ళిపొండి, ఆమె చనిపోలేదు. నిద్రపోతూ ఉంది, అంతే!” అని అన్నాడు. వాళ్ళాయన్ని హేళన చేసారు. 25 ఆయన వాళ్ళను పంపేసాక లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి తాకాడు. ఆమె వెంటనే లేచి నిలుచుంది. 26 ఈ వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపు కలిగించటం
27 యేసు అక్కడినుండి బయలుదేరి వెళ్తుండగా యిద్దరు గ్రుడ్డివాళ్ళు, “దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని పిలుస్తూ ఆయన్ని అనుసరించారు.
28 యేసు యింట్లోకి వెళ్ళాక ఆ గుడ్డివాళ్ళాయన దగ్గరకు వెళ్ళారు. ఆయన వాళ్ళను, “ఇది నేను చేయగలననే విశ్వాసం మీకుందా?” అని అడిగాడు. “ఉంది ప్రభూ!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
29 అప్పుడాయన వాళ్ళ కళ్ళను తాకుతూ, “మీకెంత విశ్వాసముంటే అంత ఫలం కలుగనీ!” అని అన్నాడు. 30 వాళ్ళకు చూపు వచ్చింది. యేసు, “ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడండి!” అని వాళ్ళను హెచ్చరించాడు. 31 కాని వాళ్ళు వెళ్ళి ఆయన్ని గురించి ఆ ప్రాంతమంతా ప్రచారం చేసారు.
32 వాళ్ళు వెలుపలికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు దయ్యం పట్టిన మూగవాడి నొకణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. 33 యేసు దయ్యాన్ని వదిలించాక ఆ మూగవాడు మాట్లాడటం మొదలు పెట్టాడు. అక్కడున్న ప్రజలు నిర్ఘాంతపోయి, “ఇలాంటిదేదీ ఇదివరకెన్నడూ ఇశ్రాయేలులో జరగలేదే?” అని అన్నారు.
34 కాని పరిసయ్యులు, “అతడు దయ్యాల రాజు సహాయంతో దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
కొద్దిమంది పనివాళ్ళు
35 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ అన్ని పట్టణాలు, పల్లెలు పర్యటన చేసాడు. దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటించాడు. అన్నిరకాల రోగాల్ని, బాధల్ని నయం చేసాడు. 36 ప్రజలు కాపరిలేని గొఱ్ఱెల్లా అలసిపోయి, చెదరిపోయి ఉండటం చూసి యేసు వాళ్ళపై జాలి పడ్డాడు. 37 ఆ తర్వాత తన శిష్యులతో, “పంట బాగా పండింది కాని పని వాళ్ళే తక్కువగా ఉన్నారు. 38 పంట ప్రభువును, పంట కోయటానికి పనివాళ్ళను పంపమని ప్రార్థించండి” అని అన్నాడు.
© 1997 Bible League International