Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 31

కొత్త నాయకుడు యెహోషువ

31 అప్పుడు మోషే వెళ్లి, ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పాడు. మోషే వాళ్లతో ఇలా చెప్పాడు, “ఇప్పుడు నాకు 120 సంవత్సరాల వయస్సు. ఇంక మిమ్మల్ని నేను నడిపించలేను. ‘నీవు యొర్దాను నది దాటి వెళ్లవు’ అని యెహోవా నాతో చెప్పాడు. మీ దేవుడైన యెహోవా మీకు ముందు వెళ్తాడు. మీకోసం ఈ రాజ్యాలను ఆయనే నాశనం చేస్తాడు. వారి దగ్గరనుండి వారి రాజ్యాన్ని మీరు తీసుకుంటారు. యెహోషువ మిమ్మల్ని ముందుగా దాటిస్తాడు. ఇది యెహోవా చెప్పాడు:

“అమోరీ రాజులైన సీహోను, ఓగులకు చేసినట్టే యెహోవా ఈ రాజ్యాలకు చేస్తాడు. ఆ రాజుల దేశానికి చేసిన విధముగానే ఆయన చేస్తాడు. వారి దేశాన్ని యెహోవా నాశనం చేసాడు. మరియు మీరు ఈ రాజ్యాలను నాశనం చేసేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. మీరు చేయాలని నేను చేప్పిన విషయాలన్నీ మీరు వాళ్లకు చేయాలి. నిబ్బరంగా, ధైర్యంగా ఉండండి. ఈ జనాలకు భయపడకండి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో పాటు వెళ్తున్నాడు. యెహోవా మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు సహాయం చేయకుండా ఉండడు.”

అప్పుడు మోషే యెహోషువాను పిలిచాడు. మోషే యెహోషువతో చెబుతుంటే ఇశ్రాయేలు ప్రజలంతా విన్నారు: “నిబ్బరంగా, ధైర్యంగా ఉండు, వారి పూర్వీకులకు యిస్తానని యెహోవా వాగ్దానం చేసిన దేశంలోనికి ఈ ప్రజలను నీవు నడిపించాలి. ఈ దేశాన్ని తమ స్వంతంగా తీసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలకు నీవు సహాయం చేయాలి. యెహోవా నీకు ముందు వెళ్తాడు. సాక్షాత్తూ ఆయనే నీతో ఉంటాడు. ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడు నిన్ను విడువడు, భయపడవద్దు, దిగులుపడవద్దు.”

ప్రబోధాల పుస్తకాన్ని మోషే వ్రాయటం

అప్పుడు మోషే ఈ ధర్మశాస్త్రం వ్రాసి, లేవీ సంతానపు యాజకులకు ఇచ్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టె మోసే పని వాళ్లదే. ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు నాయకులందరికి కూడా మోషే యిచ్చాడు. 10 తర్వాత మోషే నాయకులకు ఆజ్ఞాపించాడు. అతను ఇలా చెప్పాడు: “ప్రతి ఏడు సంవత్సరాల ఆఖరిలో, స్వాతంత్ర్యపు సంవత్సరంలో, పర్ణశాలల పండుగ సమయములో ఈ ధర్మశాస్త్రం చదవండి. 11 ఆ సమయంలో మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకునేందుకు ఇశ్రాయేలు ప్రజలంతా వస్తారు. అప్పుడు ప్రజలు వినగలిగేటట్టు నీవు వారికి ఈ ధర్మశాస్త్రం చదివి వినిపించాలి. 12 పురుషులు, స్త్రీలు చిన్నపిల్లలు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు అందరిని సమావేశ పర్చాలి. వాళ్లు ధర్మశాస్త్రాన్ని విని, మీ దేవుడైన యెహోవాను గౌరవించంటం నేర్చుకుంటారు. ఈ ధర్మశాస్త్రంలోని ఆదేశాలకు వారు జాగ్రత్తగా విధేయులవుతారు. 13 ధర్మశాస్త్రం ఎరుగనివారి సంతానంవాళ్లంతా దానిని వింటారు. వాళ్లు మీ దేవుడైన యెహోవాను గౌరవించటం నేర్చుకుంటారు. యొర్దాను నది ఆవలి ప్రక్క మీరు స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో మీరు జీవించినంత కాలం వారు ఆయనను గౌరవిస్తారు.”

మోషేను, యెహోషువను యెహోవా పిలవటం

14 “నీవు చనిపోయే సమయం దగ్గరపడింది. యెహోషువను వెంటబెట్టుకుని, సన్నిధి గుడారం దగ్గరకు రా. యెహోషువ చేయాల్సిన పనులు నేను ఆతనికి చెబుతాను” అని మోషేతో యెహోవా చెప్పాడు. కనుక మోషే, యెహోషువ సన్నిధి గుడారానికి వెళ్లారు.

15 ఆ గుడారంలో ఒక మేఘస్తంభంలో యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మేఘస్తంభం గుడార ద్వారం దగ్గర నిలిచింది. 16 మోషెతో యెహోవా ఇలా చెప్పాడు: “త్వరలో నీవు చనిపోతావు. నీవు నీ పూర్వీకులతో ఉండేందుకు వెళ్లిపోయిన తర్వాత, ఈ ప్రజలు నాకు నమ్మకంగా ఉండరు. నేను వాళ్లతో చేసిన ఒడంబడికను వాళ్లు ఉల్లంఘిస్తారు. వాళ్లు నన్ను విడిచిపెట్టేసి, వారు వెళ్తున్న దేశంలోని ఇతర దేవుళ్లను, అబద్ధపు దేవుళ్లను పూజించటం మొదలు పెడ్తారు. 17 ఆ సమయంలో నేను వారిమీద చాలా కోపగించి, వాళ్లను విడిచి పెడ్తాను. వాళ్లకు సహాయం చేయటానికి నేను ఒప్పుకోను, వాళ్లు నాశనం చేయబడతారు. వాళ్లకు భయంకరమైన సంగతులు జరుగుతాయి, వాళ్లకు కష్టాలు వస్తాయి. అప్పుడు ‘మన దేవుడు మనతో లేడు గనుక ఈ కీడులు మనకు కలిగాయి’ అని వారు అంటారు. 18 వాళ్లు కీడు చేసి, ఇతర దేవుళ్లను పూజించారు గనుక నేను వారికి సహాయం చేయటానికి ఒప్పుకోను.

19 “కనుక ఈ పాట వ్రాసుకొని, ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించు, అది పాడటం వారికి నేర్పించు. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నాకు ఈ పాట సాక్ష్యంగా ఉంటుంది. 20 వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన, మంచి వాటితో నిండిపోయిన దేశం లోనికి నేను వాళ్లను తీసుకొని వెళ్తాను. వారు తినేందుకు కావాల్సినవి అన్నీ వారికి ఉంటాయి. ఐశ్వర్యవంతమైన జీవితం వారికి ఉంటుంది. కానీ అప్పుడు వాళ్లు యితర దేవుళ్ల వైపు తిరిగి, వారిని సేవిస్తారు. నా నుండి వాళ్లు తిరిగిపోయి నా ఒడంబడికను ఉల్లంఘిస్తారు. 21 అప్పుడు వాళ్లకు ఎన్నో భయంకర సంగతులు జరుగుతాయి, వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అప్పటికి ఇంకా వారి ప్రజలకు ఈ పాట జ్ఞాపకం ఉంటుంది, వారిది ఎంత తప్పు అని యిది వారికి తెలియజేస్తుంది. నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి నేను యింకా వారిని తీసుకొని వెళ్లలేదు; కానీ వాళ్లు అక్కడ ఏం చేయాలని పథకం వేస్తున్నారో నాకు అప్పుడే తెలుసు.”

22 కనుక ఆ రోజే మోషే ఆ పాట వ్రాసాడు. ఆ పాటను ఇశ్రాయేలు ప్రజలకు ఆతను నేర్పించాడు.

23 తర్వాత నూను కుమారుడైన యెహోషువతో యెహోవా మాట్లాడాడు: ఆతనితో, “దైర్యంగా, నిబ్బరంగా ఉండు. నేను ఇశ్రాయేలీయులకు వాగ్దానం చేసిన దేశంలోకి నీవు ఆ ప్రజలను నడిపిస్తావు. నేను నీతో ఉంటాను” అని యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలు ప్రజలను మోషే హెచ్చరించటం

24 ఈ ఉపదేశాలు అన్నింటినీ మోషే జాగ్రత్తగా ఒక గ్రంథంలో వ్రాసాడు. అతడు ముంగించినప్పుడు 25 లేవీయులకు అతడు ఒక ఆజ్ఞ యిచ్చాడు. (వీళ్లు యెహోవా ఒడంబడిక పెట్టె విషయలో జాగ్రత్త తీసుకుంటారు.) అని మోషే చెప్పాడు, 26 “ఈ ధర్మశాస్త్రపు గ్రంథం తీసుకొని. మీ దేవుడైన యెహోవా ఒడంబడిక పెట్టె పక్కగా పెట్టండి. అప్పుడు అది మీ మీద సాక్ష్యంగా అక్కడ ఉంటుంది. 27 మీరు చాలా మొండి వాళ్లని నాకు తెలుసు. మీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్లాలని మీకు ఉంటుందని నాకు తెలుసు. చూడండి, నేను యింకా మీతో ఉన్న ఈనాడే మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. నేను చనిపోయిన తర్వాత మీరు యెహోవాకు విధేయులయ్యేందుకు ఇంకా ఎక్కువ నిరాకరిస్తారు. 28 మీ వంశాల నాయకుల్ని, మీ అధికారుల్ని అందరిని సమావేశపర్చండి. వారికి నేను ఈ విషయాలు చెబుతాను. భూమిని, ఆకాశాన్ని నేను వారికి విరుద్ధంగా సాక్ష్యం పలికేందుకు పిలుస్తాను. 29 నా మరణం తర్వాత మీరు చెడ్డ వాళ్లవుతారని నాకు తెలసు, మీరు వెంబడించాలని నేను మీకు ఆదేశించిన మార్గంనుండి మీరు తిరిగి పోతారు. అప్పుడు భవిష్యత్తులో చెడ్డ సంగతులు మీకు జరుగుతాయి. ఎందుకంటే, ఏవి చెడ్డవని యెహోవా చెబుతాడో అవే మీరు చేయాలనుకుంటారు గనుక. మీరు చేసే పనుల మూలంగా మీరు ఆయనకు కోపం పుట్టిస్తారు.”

మోషే కీర్తన

30 అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ ఈ పాట చెప్పాడు. మొత్తం పాట అంతా ముగించేంత వరకు అతడు ఆపుజేయలేదు.

కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

యెషయా 58

ప్రజలు దేవుణ్ణి వెంబడించాలని చెప్పాలి

58 మీకు చేతనైనంత గట్టిగా కేకలు వేయండి. మీరు ఆపవద్దు.
    బూరలా కేకలు వేయండి.
ప్రజలు చేసిన చెడు పనులను గూర్చి వారికి చెప్పండి.
    యాకోబు వంశానికి వారి పాపాలను గూర్చి చెప్పండి.
అప్పుడు వారు నన్ను ఆరాధించేందుకు రోజూ వస్తారు.
    మరియు ప్రజలు నా మార్గాలు తెలుసుకోవాలని కోరుతారు.
అప్పుడు వారు సరైన పనులు చేసే ఒక రాజ్యం అవుతారు.
    ఆ ప్రజలు దేవుని మంచి ఆదేశాలను పాటించడం మానివేయరు.
వారికి న్యాయంగా తీర్పు తీర్చమని ఆ ప్రజలు నన్ను అడుగుతారు.
    దేవుని న్యాయ నిర్ణయాలకోసం వారు దేవుని దగ్గరకు వెళ్లాలని కోరుకొంటారు.

ఇప్పుడు ఆ ప్రజలు చెబుతారు: “నీ గౌరవ సూచకంగా మేము భోజనం మానివేశాం. నీవెందుకు మమ్మల్ని చూడవు? నీ గౌరవ సూచకంగా మేము మా దేహాలను బాధించుకొంటాం. నీవెందుకు మమ్మల్ని గమనించవు?”

అయితే యెహోవా అంటున్నాడు, “ఆ ప్రత్యేక దినాల్లో భోజనం చేయకుండా ఉండి మిమ్మల్ని మీరే సంతోషపెట్టుకొనేందుకు ఈ పనులు చేస్తారు. మరియు మీరు మీ శరీరాలను గాక, మీ సేవకుల్ని శిక్షిస్తారు. మీరు ఆకలిగా ఉన్నారు కాని అన్నంకోసర కాదు. ఆహారంకోసం గాక వాదనకోసం, పోరాటం కొసం మీరు ఆకలిగా ఉన్నారు. మీ చెడ్డ చేతులతో ప్రజలను కొట్టాలని మీరు ఆకలిగా ఉన్నారు. మీరు భోజనం మానివేయటం నాకోసం కాదు. నన్ను స్తుతించుటకు మీరు మీ స్వరం వినియోగించటం మీకు ఇష్టం లేదు. నేను కోరేది అంతా ఆ ప్రత్యేక దినాల్లో ప్రజలు భోజనం మానివేసి, వారి శరీరాలను శిక్షించు కోవటం చూడాలని మాత్రమేనని మీరు తలస్తున్నారా? ప్రజలు దుఃఖంగా కనబడాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? ప్రజలు చచ్చిన మొక్కల్లా తలలు వంచుకోవాలనీ, దుఃఖసూచక వస్త్రాలు ధరించాలని నేను కోరుతున్నానని మీరు తలస్తున్నారా? ప్రజలు వారి దుఃఖాన్ని తెలియచేసేందుకు బూడిదలో కూర్చోవాలని నేను కోరుతున్నానని మీరు తలుస్తున్నారా? భోజనం మానివేసే ఆ ప్రత్యేక దినాల్లో మీరు చేసేది అదే. యెహోవా కోరేది కూడా అదే అని మీరు తలస్తున్నారా?

“నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రులను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.”

వీటిని మీరు చేస్తే, మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. అప్పుడు మీ గాయాలు బాగవుతాయి. మీ “మంచితనం” (దేవుడు) మీకు ముందు నడువగా, యెహోవా మహిమ మీ వెనుకగా మిమ్మల్ని వెంబడిస్తుంది. అప్పుడు మీరు యెహోవాకు మొరపెడ్తారు, యెహోవా మీకు జవాబు ఇస్తాడు. మీరు యెహోవాకు గట్టిగా కేకెలు వేస్తారు. ఆయన “ఇదిగో నేనిక్కడే ఉన్నాను” అంటాడు.

మీరు ప్రజలకు కష్టాలు, భారాలు కలిగించటం మానివేయాలి. విషయాలను బట్టి మీరు ప్రజలమీద కోపంగా మాట్లాడటం. వారిని నిందించటం మీరు మానివేయాలి. 10 ఆకలితో ఉన్న ప్రజలను గూర్చి మీరు విచారపడి, వారికి భోజనం పెట్టాలి. కలవరపడిన వారికి మీరు సహాయం చేయాలి వారి అవసరాలు తీర్చాలి. అప్పుడు మీ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. మరియు మీకు దుఃఖం ఉండదు. మధ్యాహ్నపు సూర్యకాంతిలా మీరు ప్రకాశిస్తారు.

11 అప్పుడు యెహోవా మిమ్మల్ని సదా నడిపిస్తాడు. ఎండిన భూములలో ఆయన మీ ఆత్మకు సంతృప్తినిస్తాడు. మీ ఎముకలకు యెహోవా బలం ఇస్తాడు. విస్తారమైన నీళ్లుగల తోటలా మీరు ఉంటారు. ఎల్లప్పుడు నీళ్లు ఉబుకుతూ ఉండే ఊటలా మీరుంటారు.

12 ఎన్నెన్నో సంవత్సరాలుగా మీ పట్టణాలు నాశనం చేయబడ్డాయి. కానీ క్రొత్త పట్టణాలు నిర్మించబడతాయి. మరియు ఈ పట్టణాల పునాదులు ఎన్నెన్నో సంవత్సరాల వరకు నిలిచి కొనసాగుతాయి. “కంచెలను బాగు చేసేవాడు” అని నీవు పిలువబడతావు, “త్రోవలు, ఇళ్లు నిర్మించువాడు” అని నీవు పిలువబడతావు.

13 సబ్బాతు విషయంలో దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నీవు పాపం చేయటం మానివేసినప్పుడు అది జరుగుతుంది. మరియు ఆ ప్రత్యేక రోజున నీ సంతోషం కోసం నీవు పనులు చేయటం మాని వేసినప్పుడు ఆది జరుగుతుంది. సబ్బాతు సంతోష దినంగా నీవు ఎంచుకోవాలి. యెహోవా ప్రత్యేక రోజును నీవు గౌరవించాలి. మిగిలిన ప్రతిరోజూ నీవు చెప్పేవి, చేసేవి మానివేయటం ద్వారా నీవు ఆ ప్రత్యేక రోజును గౌరవించాలి. 14 అప్పుడు నీవు యెహోవా, నాయందు దయచూపమని అడగవచ్చు. మరియు యెహోవా అంటాడు, భూమికి పైగా ఉన్నతమైన చోట్లకు నేను నిన్ను మోసికొనివెళ్తాను. నేను నీకు భోజనం పెడ్తాను. నీ తండ్రి యాకోబుకు కలిగిన వాటిని నేను నీకు ఇస్తాను. ఈ విషయాలు యెహోవా చెప్పాడు గనుక అవి జరుగుతాయి.

మత్తయి 6

యేసు ఇచ్చుటను గురించి బోధించటం

“జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.

“అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

యేసు ప్రార్థన గురించి బోధించటం

(లూకా 11:2-4)

“మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

“అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి:

‘పరలోకంలో ఉన్న మా తండ్రీ,
    నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
10 నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే
    ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.
11 ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము.
12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి,
    మేము చేసిన పాపాలను కూడా క్షమించుము.
13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు.
    పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’[a]

14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. 15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.

యేసు ఉపవాసమును గురించి బోధించటం

16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.

నీవు ఇద్దరు యజమానులను సేవించలేవు

(లూకా 12:33-34; 11:34-36; 16:13)

19 “మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. 20 మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. 21 మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.

22 “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. 23 మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా.

24 “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.

మొదట దేవుని రాజ్యం

(లూకా 12:22-34)

25 “అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కాని, మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కాని చింతించకండి. జీవితం ఆహారం కన్నా, దేహం దుస్తులకన్నా, ముఖ్యమైనవి కావా? 26 ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి. అవి విత్తనం విత్తి పంటను పండించవు. ధాన్యాన్ని ధాన్యపు కొట్టులో దాచివుంచవు. అయినా పరలోకంలోవున్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని యిస్తాడు. మీరు వాటికన్నా విలువైన వాళ్ళు కారా! 27 చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా?

28 “మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు? గడ్డిమీద పెరిగే పువ్వుల్ని గమనించండి. అవి పని చేసి దారాన్ని వడకవు. 29 అయినా, నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న సొలొమోను రాజుకూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు. 30 ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని యింకెంత అందంగా అలంకరిస్తాడో కదా! మీలో దృఢ విశ్వాసం లేదు.

31 “‘ఏమి తినాలి? ఏమి త్రాగాలి? ఏ దుస్తుల్ని వేసుకోవాలి?’ అని చింతించకండి. 32 యూదులు కానివాళ్ళు వాటివైపు పరుగెత్తుతూ ఉంటారు. పరలోకంలో ఉన్న మీ తండ్రికి యివన్నీ మీకవసరమని తెలుసు. 33 కాని మొదట ఆయన రాజ్యం కొఱకు, నీతి కొఱకు ప్రయాస పడండి; అప్పుడు అవన్నీ దేవుడు మీకిస్తాడు. 34 రేపటిని గురించి చింతించకండి. రేపటి చింత రేపటిదే. ఏరోజుకు తగ్గ కష్టాలు ఆరోజుకు ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International