Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 30

ఇశ్రాయేలీయులు వారి దేశానికి తిరిగి వెళ్తారు

30 “నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాలనుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించివేస్తాడు. అప్పుడు మీరు ఈ విషయాలను గూర్చి తలుస్తారు. ఆ సమయంలో మీరూ, మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వస్తారు. నేడు నేను మీకు యిచ్చిన ఆయన ఆదేశాలన్నింటికీ పూర్తిగా విధేయులై, మీ హృదయపూర్తిగా మీరు ఆయనను వెంబడిస్తారు. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్లీ స్వతంత్రుల్ని చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాలనుండి తిరిగి వెనుకకు తీసుకొనివస్తాడు. ఆయన మిమ్మల్ని చివరి భూదిగంతాలవరకు పంపించినాసరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపర్చి, అక్కడనుండి తిరిగి వెనుకకు తీసుకొని వస్తాడు. యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకొనివస్తాడు, ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటె మీకు ఎక్కువ ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్కయు హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టే మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు మనస్సుతోను ప్రేమించి బతుకుతారు.

“మిమ్మల్ని ద్వేషించి. మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు. మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటికీ మీరు విధేయులవుతారు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతిదీ విజయవంతం చేస్తాడు. ఆయన మీకు చాలా మంది పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలను ఇచ్చి మీ మందలను, మంచి పంటలతో మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తాడు. యెహోవా మీ యెడల మంచి జరిగిస్తాడు. యెహోవా మీ పూర్వీకులకు మేలు చేసి సంతోషించినట్టు, ఆయన మరల మీకు మేలు చేయటంలో ఆనందిస్తాడు. 10 అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినవాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రంలోని వ్రాయబడిన నియమాలు మీరు పాటించాలి, ఆదేశాలకు మీరు విధేయులు కావాలి, మీ నిండు హృదయంతో, మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలన్నీ మీకు సంభవిస్తాయి.

జీవం లేక మరణం

11 “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞ చాలా కష్టతరమయింది కాదు. అది చాలా దూరమైనదీ కాదు. 12 మేము దానిని విని, దానిని జరిగించేందుకు ‘ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్లి దాన్ని తీసుకొని వస్తారు అని మీరు చేప్పేందుకు ఈ ఆదేశం ఆకాశంలో లేదు.’ 13 మేము దానిని విని, దానిని జరిగించడానికి ‘మాకోసం ఎవరు సముద్రం దాటి వెళ్లి, దానిని మాకోసం తీసుకొని వస్తారు అని చెప్పటానికి ఈ ఆదేశం సముద్రానికి అవతలపక్క లేదు.’ 14 లేదు, మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది.

15 “జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకొనే అవకాశం ఈ వేళ నేను మీకు యిచ్చాను. 16 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలనీ, ఆయన మార్గాల్లో నడచుకోవాలనీ, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలనీ ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. మరియు స్వంతంగా మీరు తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 17 అయితే మీరు యెహోవా నుండి మరలిపోయి, వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్లను పూజించి, సేవించేందుకు మీరు తిప్పివేయబడితే 18 మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశించాలని సిద్ధంగా ఉన్నయొర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు.

19 “ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. 20 మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు.”

కీర్తనలు. 119:73-96

యోద్

73 యెహోవా, నీవు నన్ను చేశావు, నీ చేతులతో నన్ను నిలబెడుతావు.
    నీ ఆదేశాలు నేర్చుకొని గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
74 యెహోవా, నీ అనుచరులు నన్ను చూచి సంతోషిస్తారు.
    నీవు చెప్పే విషయాలను నేను నమ్ముతాను. కనుక వారికి చాలా సంతోషం.
75 యెహోవా, నీ నిర్ణయాలు న్యాయంగా ఉంటాయని నాకు తెలుసు.
    నీవు నన్ను శిక్షించటం నీకు సరియైనదే.
76 ఇప్పుడు నిజమైన నీ ప్రేమతో నన్ను ఆదరించుము.
    నీ వాగ్దాన ప్రకారం నన్ను ఆదరించుము.
77 యెహోవా, నన్ను ఆదరించి, నన్ను బ్రతుకనిమ్ము.
    నీ ఉపదేశములలో నిజంగా నేను ఆనందిస్తాను.
78 నాకంటే తామే మంచివాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి అబద్ధం చెప్పారు కనుక వారిని సిగ్గుపరచు.
    యెహోవా, నేను నీ ఆజ్ఞలను అధ్యయనం చేస్తాను.
79 నీ అనుచరులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
    నీ ఒడంబడిక తెలిసిన మనుష్యులను తిరిగి నా దగ్గరకు రానిమ్ము.
80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము.
    అందుచేత నేను అవమానించబడను.

కఫ్

81 నీవు నన్ను రక్షిస్తావని నిరీక్షిస్తూ నేను చనిపోబోతున్నాను.
    కాని యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నమ్ముతాను.
82 నీవు వాగ్దానం చేసిన వాటికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను. కాని నా కళ్లు అలసిపోతున్నాయి.
    యెహోవా, నీవు నన్ను ఎప్పుడు ఆదరిస్తావు?
83 నేను చెత్తకుప్పలో ఎండిపోయిన ద్రాక్ష తొక్కలా ఉన్నప్పుడు కూడా
    నీ న్యాయ చట్టాలను నేను మరచిపోలేదు.
84 నేను ఎంత కాలం జీవిస్తాను?
    యెహోవా, నన్ను హింసించే మనుష్యులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావు?
85 కొందరు గర్విష్ఠులు వారి అబద్ధాలతో నన్ను పొడిచారు.
    మరి అది నీ ఉపదేశాలకు విరుద్ధం.
86 యెహోవా, మనుష్యులు నీ ఆజ్ఞలన్నింటిని నమ్మగలరు.
    అబద్ధికులు నన్ను హింసిస్తారు. నాకు సహాయం చేయుము!
87 ఆ అబద్ధికులు నన్ను దాదాపుగా నాశనం చేశారు.
    నేను మాత్రం నీ ఆదేశాలను అనుసరించటం మానలేదు.
88 యెహోవా, నిజమైన నీ ప్రేమ చూపించి నన్ను జీవించనిమ్ము.
    నీవు చెప్పే వాటిని నేను చేస్తాను.

లామెద్

89 యెహోవా, నీ మాట శాశ్వతంగా కొనసాగుతుంది. నీ మాట పరలోకంలో శాశ్వతంగా కొనసాగుతుంది.
90 నీవు ఎప్పటికీ నమ్మదగిన వాడవు.
    యెహోవా, భూమిని నీవు చేశావు, అది ఇంకా నిలిచి ఉంది.
91 నీ ఆజ్ఞ మూలంగా, ఇంకా అన్నీ కొనసాగుతాయి.
    యెహోవా, అన్నీ నీ సేవకుల్లా నీ ఆజ్ఞకు లోబడుతాయి.
92 నీ ఉపదేశాలు నాకు స్నేహితుల్లా ఉండకపోతే,
    నా శ్రమ నన్ను నాశనం చేసి ఉండేది.
93 యెహోవా, నీ ఆజ్ఞలు నన్ను జీవింపజేస్తాయి
    కనుక నేను ఎన్నటికీ వాటిని మరచిపోను.
94 యెహోవా, నేను నీ వాడను. నన్ను రక్షించుము.
    ఎందుకంటే, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనగుటకు కష్టపడి ప్రయత్నిస్తాను.
95 దుష్టులు నన్ను నాశనం చేయాలని ప్రయత్నించారు.
    అయితే నీ ఒడంబడిక నాకు తెలివినిచ్చింది.
96 నీ ధర్మశాస్త్రానికి తప్ప
    ప్రతిదానికీ ఒక హద్దు ఉంది.

యెషయా 57

ఇశ్రాయేలీయులు దేవుణ్ణి వెంబడించరు

57 మంచి మనుష్యులు పోయారు. కానీ ఏ వ్యక్తి అది గమనించలేదు.
    ఏం జరుగుతుందో ప్రజలు గ్రహించరు.
కానీ వారు మంచి మనుష్యులందరిని సమావేశపరచారు.
    కష్టాలు వస్తున్నాయని ప్రజలు గ్రహించరు.

మంచి వాళ్లంతా భద్రతకోసం
    సమావేశం చేయబడ్డారని వారికి తెలియదు.
అయితే శాంతి కలుగుతుంది. మరియు ప్రజలు వారి స్వంత పడకలమీద విశ్రాంతి తీసుకొంటారు.
    వారు ఎలా జీవించాలని దేవుడు కోరుతాడో వారు అలా జీవిస్తారు.

“దయ్యాల పిల్లల్లారా, ఇక్కడకు రండి.
    మీ తండ్రి (సాతాను) లైంగిక పాపాల మూలంగా దోషి.
    మరియు మీ తల్లి (ఇశ్రాయేలు) లైంగిక పరంగా తన శరీరాన్ని అమ్ముకొంటుంది. ఇక్కడకు రండి!
మీరు అబద్ధాలు చెప్పేవాళ్లు, చెడ్డవాళ్లు.
    మీరు నన్ను ఎగతాళి చేస్తారు.
మీరు నన్ను వెక్కిరిస్తారు.
    మీరు నా మీద నాలుకలు చాపుతారు.
మీరు చేయగోరేదంతా ఏమిటంటే ప్రతి పచ్చని చెట్టు క్రింది
    తప్పుడు దేవుళ్లనూ పూజించటమే.
మీరు ప్రతికాలువ ప్రక్క పిల్లల్నీ చంపుతారు,
    బండల స్థలాల్లో వారిని బలి ఇస్తారు.
నదులలో నున్నటి రాళ్లను పూజించటం మీకు ఇష్టం.
    వాటిని పూజించుటకు మీరు వాటిమీద ద్రాక్షమద్యం పోస్తారు.
మీరు వాటికి బలులు ఇస్తారు. కానీ మీకు దొరికేది అంతా ఆ రాళ్లే.
    ఇది నాకు సంతోషం కలిగిస్తుందని మీరు తలుస్తున్నారా?
    లేదు! అది నాకు సంతోషం కలిగించదు.
మీరు ప్రతి కొండ మీద,
    ప్రతి పర్వతంమీద మీ పడక వేసుకొంటారు.
మీరు ఆ స్థలాలకు వెళ్లి
    బలులు అర్పిస్తారు.
తర్వాత మీరు ఆ పడకల మీదికి వెళ్లి,
    ఆ దేవుళ్లను ప్రేమించటం ద్వారా నాకు వ్యతిరేకంగా పాపం చేస్తారు.
మీరు ఆ దేవతలను ప్రేమిస్తారు.
    వాటి దిగంబర దేహాలను చూడటం మీకు ఇష్టం.
మీరు నాతో ఉన్నారు
    కాని వాటితో ఉండేందుకు మీరు నన్ను విడిచి పెట్టారు.
నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు
    సహాయపడే వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
గుమ్మాల వెనుక, ద్వారబంధాల వెనుక వాటిని మీరు దాచిపెట్టేస్తారు.
    మరియు మీరు వెళ్లి ఆ తప్పుడు దేవుళ్ళతో ఒడంబడికలు చేసుకుంటారు.
మొలెక్[a] దేవతకు అందంగా కనబడాలని
    మీరు తైలాలు, పరిమళాలు ఉపయోగిస్తారు.
మీరు మీ సందేశకులను దూరదేశాలకు పంపించారు.
    ఇది మిమ్మల్ని పాతాళానికి, మరణ స్థానానికి తీసుకొని వస్తుంది.
10 ఈ పనులు చేయటానికి మీరు కష్టపడి పని చేశారు
    కానీ మీరు ఎన్నడూ అలసిపోలేదు.
మీరు క్రొత్త బలం కనుగొన్నారు.
    ఎందుకంటే, వీటిలో మీరు ఆనందించారు.
11 మీరు నన్ను జ్ఞాపకం చేసికోలేదు
    మీరు నన్ను కనీసం గుర్తించలేదు.
కనుక మీరు ఎవరిని గూర్చి చింతిస్తున్నారు?
    మీరు ఎవరిని గూర్చి భయపడుతున్నారు?
    మీరెందుకు అబద్ధం పలికారు?
చూడండి, చాలాకాలంగా నేను మౌనంగా ఉన్నాను.
    మరి మీరు నన్ను గౌరవించలేదు.
12 మీ ‘మంచితనం’ గూర్చి, మీరు చేసే ‘మతపరమైన’ పనులు అన్నింటిని గూర్చి నేను చెప్పగలను.
    కానీ అవన్నీ పనికిమాలినవి.
13 మీకు సహాయం అవసరమైనప్పుడు
    మీరు మీ చుట్టూరా ప్రోగుచేసుకొన్న ఆ తప్పుడు దేవుళ్ళకు మొరపెట్టండి.
అయితే, వాటినన్నింటినీ గాలి కొట్టిపారేస్తుందని నేను మీకు చెబుతున్నాను.
    ఒక్క గాలి విసురు వాటినన్నింటినీ మీ వద్దనుండి తొలగించివేస్తుంది.
అయితే నా మీద ఆధారపడే వ్యక్తి
    భూమిని సంపాదించుకొంటాడు.
    ఆ వ్యక్తికి నా పరిశుద్ధ పర్వతం దొరుకుతుంది.”

యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు

14 మార్గం సరళం చేయండి; మార్గం సరళం చేయండి.
    నా ప్రజలకోసం మార్గం చక్కజేయండి.

15 మహోన్నతుడైన దేవుడు, పైకి ఎత్తబడినవాడు
    శాశ్వతంగా జీవించేవాడు,
పవిత్రుడైన దేవుడు అనే నామం గలవాడు చెబుతున్నాడు:
“నేను ఉన్నతమైన పవిత్ర స్థానంలో నివసిస్తాను.
    అయితే దుఃఖంలో ఉన్న దీన జనులతో కూడా ఉంటాను.
ఆత్మలో దీనంగా ఉండేవారికి నేను నూతన జీవం ప్రసాదిస్తాను.
    హృదయమందు విచారంగా ఉన్నవారికి నేను నూతన జీవితం ప్రసాదిస్తాను.
16 నేను శాశ్వతంగా పోరాటం కొనసాగించను.
    నేను ఎప్పటికీ కోపంగానే ఉండను.
నేను కోపంగా కొనసాగితే మనిషి ఆత్మ,
    వారికి నేను ఇచ్చిన జీవం నా ఎదుటనే మరణిస్తుంది.
17 ఈ ప్రజలు చెడు కార్యాలు చేశారు. అది నాకు కోపం కలిగించింది.
    కనుక నేను ఇశ్రాయేలును శిక్షించాను.
నేను కోపంగా ఉన్నాను గనుక
    అతని నుండి నేను తిరిగిపోయాను.
మరియు ఇశ్రాయేలు నన్ను విడిచిపెట్టాడు.
    ఇశ్రాయేలు తనకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్లాడు.
18 ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్లింది నాకు తెలుసు. కనుక నేను అతణ్ణి స్వస్థపరుస్తాను (క్షమిస్తాను).
    నేను అతణ్ణి ఆదరించి, అతడు బాగానే ఉంది అనుకొనేట్టు చేసే మాటలు నేను చెబుతాను. అప్పుడు అతడు, అతని ప్రజలు విచారంగా ఉండరు.
19 ఆ ప్రజలకోసం ‘శాంతి’ అనే క్రొత్త పదం నేను ఉపదేశిస్తాను.
    నాకు సమీపంగా ఉన్న ప్రజలకు, చాలా దూరంగా ఉన్న ప్రజలకు, నేను శాంతి ప్రసాదిస్తాను.
ఆ ప్రజలను నేను స్యస్థపరుస్తాను (క్షమిస్తాను).”
ఈ సంగతులు యెహోవా చెప్పాడు.

20 అయితే చెడ్డవాళ్లు భీకరంగా ఉన్న మహాసముద్రంలాంటి వాళ్లు.
    వారు నెమ్మదిగా, శాంతంగా ఉండలేరు.
వారు కోపంగా ఉన్నారు,
    మహాసముద్రంలా మట్టిని కెలుకుతారు.
21 “దుష్టులకు శాంతి లేదు”
    అని నా దేవుడు చెబుతున్నాడు.

మత్తయి 5

కొండ మీద ఉపదేశం

(లూకా 6:20-23)

యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు:

“ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం.
    కనుక వాళ్ళు ధన్యులు.
దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు.
    కనుక వాళ్ళు ధన్యులు.
నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు.
    కనుక వాళ్ళు ధన్యులు.
అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది.
    కనుక వాళ్ళు ధన్యులు.
దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది.
    కనుక వాళ్ళు ధన్యులు.
శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు.
    కనుక వాళ్ళు ధన్యులు.
శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు.
    కనుక శాంతి స్థాపకులు ధన్యులు.
10 నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం.
    కనుక వాళ్ళు ధన్యులు.

11-12 “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.

ఉప్పు—వెలుగు

(మార్కు 9:50; 4:21; లూకా 14:34-35; 8:16)

13 “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు.

14 “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. 15 దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. 16 అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.

ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం

17 “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. 18 ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి.

19 “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. 20 ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల[a] కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.

హత్య చెయ్యరాదు

21 “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 22 కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది.

23-24 “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి.

25 “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. 26 ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు.

వ్యభిచారం చేయరాదు

27 “‘వ్యభిచారం చేయరాదు’(A) అని చెప్పటం మీరు విన్నారు. 28 కాని నేను చెప్పేదేమిటంటే, పరస్త్రీ వైపు కామంతో చూసినవాడు, హృదయంలో ఆమెతో వ్యభిచరించిన వానిగా పరిగణింపబడతాడు. 29 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి కన్ను కారణమైతే దాన్ని పీకి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది. 30 మీరు పాపం చెయ్యటానికి మీ కుడి చెయ్యి కారణమైతే దానిని నరికి పారవేయండి. మీ శరీరమంతా నరకంలో పడటం కన్నా మీ శరీరంలోని ఒక అవయవము పోగొట్టుకోవటం మంచిది.

విడాకులను గురించి బోధించటం

(మత్తయి 19:9; మార్కు 10:11-12; లూకా 16:18)

31 “‘తన భార్యకు విడాకులివ్వదలచిన వ్యక్తి ఆమెకు ఒక విడాకుల పత్రం ఇవ్వాలి’(B) అని చెప్పే వాళ్ళు. 32 కాని నేను చెప్పేదేమంటే భార్య మీద వ్యభిచార కారణంలేకుండా భర్త ఆమెకు విడాకులిస్తే ఆమె వ్యభిచారిణిగా పరిగణింప బడటానికి అతడు కారకుడౌతాడు. అలా విడాకులు పొందిన స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. వ్యభిచార కారణాన మాత్రానే తన భార్యకు విడాకులివ్వాలి గాని వేరే కారణాన కాదు.

ప్రమాణాలు

33 “అంతేకాక మాట తప్పకండి. ‘ప్రభువుతో చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోండి,’ అని పూర్వం ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 34 కాని నేను చెప్పేదేమిటంటె, దేని మీదా ప్రమాణం చెయ్యకండి, ఆకాశం దేవుని సింహాసనం కనుక ఆకాశం మీద ప్రమాణం చెయ్యకండి. 35 భూమి దేవుని పాదపీఠం కనుక భూమ్మీద ప్రమాణం చెయ్యకండి. యెరూషలేము మహారాజు నగరం కనుక దానిపై ప్రమాణం చెయ్యకండి. 36 మీ తలపై ఉన్న ఒక్క వెంట్రుకను కూడా తెలుపుగా కాని, నలుపుగా కాని మార్చలేరు. కనుక, మీ తలపై ప్రమాణం చెయ్యకండి. 37 మీరు ‘ఔను’ అని అనాలనుకొంటే ఔననండి. ‘కాదు’ అని అనాలనుకొంటే కాదనండి. మరేవిధమైన ప్రమాణం మీ నుండి వచ్చినా దానికి కారణం ఆ సైతానే.

కంటికి కన్ను

(లూకా 6:29-30)

38 “‘కంటికి కన్ను, పంటికి పన్ను ఊడ దీయాలి’(C) అని అనటం మీరు విన్నారు. 39 కాని నేను చెప్పేదేమిటంటే దుష్టుల్ని ఆపటానికి ప్రయత్నించకండి. మిమ్మల్ని ఎవరైనా కుడి చెంపమీద కొడితే మీ రెండవ చెంప కూడా అతనికి చూపండి. 40 ఎవరైనా మీపై వ్యాజ్యము వేసి మీ చొక్కాను కూడా లాక్కోవాలని చూస్తే, మీ కండువా కూడా తీసుకు వెళ్ళనివ్వండి. 41 ఎవరైనా మిమ్మల్ని తమతో మైలు దూరం రమ్మని బలవంతం చేస్తే, అతనితో రెండు మైళ్ళు వెళ్ళండి. 42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి.

శత్రువులను ప్రేమించు

(లూకా 6:27-28, 32-36)

43 “‘పొరుగింటి వాణ్ణి ప్రేమించండి. శత్రువును ద్వేషించండి’(D) అని చెప్పటం మీరు విన్నారు. 44 కాని నేను చెప్పేదేమిటంటే ‘మీ శత్రువుల్ని ప్రేమించండి[b] మిమ్మల్ని హింసించిన వాళ్ళ కోసం దేవుణ్ణి ప్రార్థించండి.’ 45 అప్పుడు మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి బిడ్డలౌతారు. ఎందుకంటే దేవుడు చెడ్డవాళ్ళ కోసం, మంచి వాళ్ళ కోసం సూర్యోదయం కలిగిస్తాడు. నీతిమంతుల కోసం, అనీతిమంతుల కోసం వర్షాలు కురిపిస్తాడు. 46 మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను మీరు ప్రేమిస్తే మీకేం ప్రతిఫలం కలుగుతుంది? పాపులు కూడా అలాచెయ్యటం లేదా? 47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! 48 పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. మీరును ఆయనలా ఉండాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International