Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 29

మోయాబులో ఒడంబడిక

29 మోయాబు దేశంలో మోషే ఇశ్రాయేలు ప్రజలతో చేయాల్సిందిగా. యెహోవా చెప్పిన ఒడంబడికలో భాగమే ఈ విషయాలు. హోరేబు (సీనాయి) కొండమీద ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చేసిన ఒడంబడిక గాక యిది ఆయన చేసిన మరో ఒడంబడిక.

మోషే ఇశ్రాయేలు ప్రజలందిర్నీ సమావేశపర్చాడు. అతను వాళ్లతో ఇలా చేప్పాడు: “ఈజిప్టు దేశంలో యెహోవా చేసిన వాటన్నింటినీ మీరు చూసారు. ఫరోకు, ఫరో నాయకులకు, అతని దేశం అంతటికీ యెహోవా చేసిన వాటిని మీరు చూసారు. ఆయన వాళ్లకు కలిగించన గొప్ప కష్టాలు అన్నీ మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు మీరు చూసారు. కానీ జరిగిందేమిటో ఈ రోజూకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు. 40 సంవత్సరాలు యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించాడు. ఆ కాలం అంతటిలో మీ బట్టలు పాతబడలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. మీ వద్ద భోజనం ఏమీలేదు. ద్రాక్షారసంగాని తాగేందుకు మరేదీగాని మీ దగ్గరలేదు. కానీ మీ విషయంలో యెహోవా శ్రద్ధతీసుకొన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా చేసాడు.

“మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు, హెష్భోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మన మీద యుద్ధానికి వచ్చారు. కానీ మనం వాళ్లను ఓడించాం. అప్పుడు వారి దేశాన్ని మనం స్వాధీనం చేసుకొని, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారికి స్వంతంగా ఇచ్చాము. కనుక ఈ ఒడంబడికలోని ఆదేశాలకు పూర్తిగా లోబడుతుంటే మీరు చేసే ప్రతి దానిలో మీరు విజయం పొందుతూ ఉంటారు.

10 “ఈ వేళ మీరంతా ఇక్కడ మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. మీ నాయకులు, మీ అధికారులు, మీ పెద్దలు, మిగిలిన మనుష్యులంతా ఇక్కడ ఉన్నారు. 11 మీ భార్యలు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ మధ్య నివసిస్తూ, మీ కట్టెలు కొట్టి, మీకు నీళ్లు మోసే విదేశీయులు కూడా ఇక్కడ ఉన్నారు. 12 మీరంతా మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకొనేందుకు ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ ఒడంబడిక చేస్తున్నాడు. 13 ఈ ఒడంబడిక మూలంగా యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటున్నాడు. మరియు సాక్షాత్తూ ఆయనే మీకు దేవుడుగా ఉంటాడు. ఇది ఆయన మీతో చెప్పాడు. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన దీనిని వాగ్దానం చేశాడు. 14 యెహోవా ఈ వాగ్దానాలన్నింటితో కూడిన ఈ ఒడంబడికను మీతో మాత్రమే చేయటం లేదు. 15 ఈ వేళ ఇక్కడ మన దేవుడైన యెహోవా యెదుట నిలిచిన మనందరితో ఆయన ఈ ఒడంబడిక చేస్తున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనతో లేని మన సంతానానికి కూడ ఈ ఒడంబడిక వర్తిస్తుంది. 16 మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే. 17 చెక్క, రాయి, వెండి, బంగారంతో వారు చేసిన అసహ్యమైన విగ్రహాలను మీరు చూసారు. 18 ఈ వేళ ఇక్కడ ఉన్న పురుషుడుగాని, స్త్రీగాని, కుటుంబంగాని, వంశం గాని మీ దేవుడైన యెహోవా నుండి తిరిగిపోకుండా గట్టి జాగ్రత్తలో ఉండండి. ఏ వ్యక్తి కూడా పోయి ఆ రాజ్యల దేవుళ్లను సేవించకూడదు. అలా చేసేవాళ్లు చేదైన విష ఫలాలు ఫలించే మొక్కల్లా ఉంటారు.

19 “ఒక వ్యక్తి ఈ శాపాలన్నీ విని, ‘నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూనే ఉంటాను. నాకేమీ కీడు సంభవించదు’ అంటూ తనను తాను ఆదరించుకో వచ్చును. ఆ వ్యక్తి తనకు మాత్రమేగాక ప్రతి ఒక్కరికీ చివరకు మంచి వాళ్లకుకూడ కీడు జరిగిస్తాడు. 20-21 ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం:

22 “భవిష్యత్తులో మీ సంతానంవారు, దూరదేశాల్లోని విదేశీయులు మీ దేశం ఎలా పాడైపోయిందో చూస్తారు. యెహోవా దాని మీదికి రప్పించిన రోగాలను వారు చూస్తారు. 23 దేశం అంతా మండే గంధకం, ఉప్పుతో నిష్ప్రయోజనంగా ఉంటుంది. దేశంలో ఏమీ నాట బడదు ఏవీ, చివరకు గురుగులుకూడ పెరగవు. యెహోవా చాలా కోపగించినప్పుడు నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, జెబోయిం పట్టణాల్లా ఈ దేశం ఉంటుంది.

24 “‘యెహోవా ఈ దేశానికి ఎందుకు ఇలా చేసాడు? ఆయనకు ఎందుకు ఇంతకోపం వచ్చింది?’ అని ఇతర రాజ్యాలన్నీ అడుగుతాయి. 25 జవాబు ఇదే: ‘ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా ఒడంబడికను విడిచిపెట్టేసారు గనుక యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా వారిని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చినప్పుడు ఆయన వారితో చేసిన ఒడంబడికను పాటించటం వాళ్లు మానివేసారు. 26 ఇశ్రాయేలు ప్రజలు ఇదివరకు ఎన్నడూ ఆరాధించని ఇతర దేవుళ్లను ఆరాధించటం మొదలు పెట్టారు. ఆ దేవుళ్లను పూజించ వద్దని యెహోవా ఆ ప్రజలతో చెప్పాడు. 27 అందువల్లనే ఈ దేశ ప్రజల మీద యెహోవాకు అంతగా కోపం వచ్చింది. అందుచేత ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ ఆయన వారి మీదికి రప్పించాడు. 28 యెహోవా వారి మీద చాలా కోపగించాడు. కనుక ఆయన వాళ్లను వారి దేశంనుండి బయటకు లాగేసాడు. ఈనాడు వారు ఉన్న మరో దేశంలో ఆయన వాళ్లను ఉంచాడు.’

29 “మన దేవుడైన యెహోవా రహస్యంగా ఉంచిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఆ సంగతులు ఆయనకు మాత్రమే తెలుసు. ఆయితే యెహోవా తన ధర్మశాస్త్రాన్ని మాత్రం మనల్ని తెలసుకోనిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మనకోసం, మన సంతతివారికోసం. మనం దానికి శాశ్వతంగా విధేయులం కావాలి.

కీర్తనలు. 119:49-72

జాయిన్

49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
    ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
    నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
    కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
    యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
    నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
    నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
    నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
    కనుక నాకు ఈలాగు జరుగుతుంది.

హేత్

57 యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకొన్నాను.
58 యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధారపడుతున్నాను.
    నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
59 నేను నా జీవితాన్ని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాను.
    మళ్లీ నీ ఒడంబడికను అనుసరించటానికే వచ్చాను.
60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను.
61 దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు.
    అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
62 నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించటానికి
    అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను.
63 నిన్ను ఆరాధించే ప్రతి మనిషికీ నేను స్నేహితుడను.
    నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను.
64 యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.

తేత్

65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
    నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
    నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
    కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
    కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
    నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
    నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
    వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.

యెషయా 56

అన్ని జనాంగాలు యెహోవాను వెంబడిస్తాయి

56 యెహోవా ఈ సంగతులు చెప్పాడు, “మనుష్యులందరికి న్యాయం చూపండి. సరైన వాటినే చేయండి. ఎందుకంటే త్వరలోనే నా రక్షణ మీకు లభిస్తుంది. నా మంచితనం[a] త్వరలోనే సర్వలోకానికి చూపించబడుతుంది గనుక.” సబ్బాతును[b] గూర్చిన దేవుని చట్టానికి విధేయత చూపే వ్యక్తి ఆశీర్వదించబడును. ఏ కీడు చేయని వ్యక్తి సంతోషంగా ఉంటాడు.

యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవా వైపు తిరుగుతారు. “యెహోవా తన ప్రజలతో పాటు నన్ను స్వీకరించడు” అని ఆ మనుష్యులు చెప్పకూడదు. “నేను ఎండిన కట్టె ముక్కను, నాకు పిల్లలు పుట్టరు” అని నపుంసకుడు చెప్పకూడదు.

4-5 “సబ్బాతుకు సంబంధించిన చట్టాలకు విధేయులయ్యే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. నేను కోరే వాటిని జరిగించే నపుంసకులకు నేను శక్తి, కీర్తి ప్రసాదిస్తాను. వారు నా ఆలయంలో, నా పట్టణంలో ఉంటారు. నా ఒడంబడికను[c] పాటించే నా ప్రజలందరికీ నేను ఈ విషయాలు జరిగిస్తాను. కుమారులు, కుమార్తెలకంటె శ్రేష్ఠమైన దానిని నేను వారికి ఇస్తాను. శాశ్వతంగా కొనసాగే పేరు నేను వారికి ఇస్తాను” అని యెహోవా చెబుతున్నాడు గనుక వారు ఆ మాటలు చెప్పకూడదు.

యూదులు కాని మనుష్యులు కొందరు యెహోవావైపు చేరుతారు. యెహోవాను సేవించి, ఆయనను ప్రేమించగలిగేట్టు వారు ఇలా చేస్తారు. వారు యెహోవాకు సేవకులు అయ్యేందుకు యెహోవావైపు చేరుతారు. సబ్బాతును ప్రత్యేక ఆరాధన రోజుగా వారు పాటిస్తారు, నా ఒడంబడిక (ధర్మశాస్త్రాన్ని) సన్నిహితంగా పాటించటం కొనసాగిస్తారు. “ఆ మనుష్యులను నా పరిశుద్ధ పర్వతానికి నేను తీసుకొని వస్తాను. నా ప్రార్థనా మందిరంలో నేను వారిని సంతోషింప చేస్తాను. వారు నాకు అర్పించే అర్పణలు, బలులు నాకు సంతోషం కలిగిస్తాయి. ఎందుకంటే, నా ఆలయం సకల రాజ్యాలకూ ప్రార్థనా మందిరం అని పిలువబడుతుంది” అని యెహోవా చెబుతున్నాడు. నా ప్రభువు యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఇశ్రాయేలు ప్రజలు వారి దేశంనుండి బలవంతంగా వెళ్లగొట్టబడ్డారు. కానీ యెహోవా వారిని మరల ఒక్కచోట చేరుస్తాడు. “ఈ ప్రజలను నేను మరల ఒక్కచోట చేరుస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.

అరణ్యంలోని అడవి మృగములారా తినుటకురండి!
10 కావలి వాళ్లు (ప్రవక్తలు) అందరు గుడ్డివాళ్లు.
    వారు చేస్తుంది ఏమిటో వారికే తెలియదు.
వారు మొరగటం చేతకాని కుక్కల్లాంటి వాళ్లు.
    వారు నేలమీద పండుకొని, నిద్రపోతారు.
    ఆహా, నిద్రపోవటం వారికి ఇష్టం.
11 వారు ఆకలిగొన్న కుక్కల్లా ఉన్నారు.
    వారు ఎన్నటికి తృప్తిపొందరు.
ఆ కాపరులు ఏమిచేస్తున్నది. వారికే తెలియదు.
    తప్పిపోయి తిరుగుతున్న వారి గొర్రెల్లానే ఉన్నారు వారూను.
వారు దురాశపరులు.
    వారు చేయాలని ఆశించేది అంతా వారిని వారు తృప్తిపరచుకోవటమే.
12     “నేను కొంచెం ద్రాక్షమద్యం త్రాగుతాను.
    నేను కొంచెం మద్యం త్రాగుతాను.
    నేను రేపు కూడా ఇలానే చేస్తాను.
    ఆ తర్వాత నేను ఇంకా ఎక్కువ కూడా త్రాగుతాను”
అని వారు వచ్చి చెబుతారు.

మత్తయి 4

యేసుకు కలిగిన పరీక్షలు

(మార్కు 1:12-13; లూకా 4:1-13)

ఆ తర్వాత సైతాను కలిగించే పరీక్షల్ని ఎదుర్కోవాలని పవిత్రాత్మ యేసును ఎడారి ప్రదేశానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ యేసు నలభై రోజులు ఉపవాసం చేసాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది. సైతాను ఆయన దగ్గరకు వచ్చి, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చు” అని అన్నాడు.

యేసు సమాధానంగా,

“‘మనుష్యులను బ్రతికించేది కేవలం ఆహారం మాత్రమే కాదు.
    కాని దేవుడు పలికిన ప్రతి మాటవలన బ్రతకగలడు’(A)

అని వ్రాసారు” అని అన్నాడు.

ఆ తర్వాత సైతాను ఆయన్ని పవిత్ర నగరానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ దేవాలయం మీది ఒక ఎత్తైన స్థలంపై నిలుచో బెట్టి, “నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఎందుకంటే,

‘నీకు సహాయం చెయ్యమని, దేవుడు తన దూతల్ని ఆజ్ఞాపిస్తాడు.
    వాళ్ళు వచ్చి నీ పాదం ఏ రాయికీ తగలకుండా
నిన్ను తమ హస్తాలతో ఎత్తి పట్టుకొంటారు,’(B)

అని వ్రాసివుంది కదా!” అని అన్నాడు.

యేసు వానితో,

“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు!’(C)

అని కూడా వ్రాసి వుంది” అని అన్నాడు.

సైతాను ఆయన్ని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకు వెళ్ళి ఆయనకు ప్రపంచంలోని రాజ్యాలను, వాటి వైభవాన్ని చూపి, “నీవు నా ముందు మోకరిల్లి నన్ను పూజిస్తే వీటన్నిటిని నీకిస్తాను” అని అన్నాడు.

10 యేసు:

“సైతానా! నా ముందునుండి వెళ్ళిపో!
    ఎందుకంటే ‘నీ ప్రభువైన దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన సేవ మాత్రమే చెయ్యాలి!’(D)

అని కూడా వ్రాసి ఉంది” అని అన్నాడు.

11 అప్పుడు సైతాను ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యాడు. తర్వాత దేవదూతలు వచ్చి యేసుకు పరిచర్యలు చేసారు.

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మార్కు 1:14-15; లూకా 4:14-15)

12 యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు. 13 ఆయన నజరేతును వదిలి, అక్కడి నుండి కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళి అక్కడ నివసించాడు. కపెర్నహూము, జెబూలూను మరియు నఫ్తాలి ప్రాంతంలోని సరస్సు ఒడ్డున ఉంది. 14 ఈయన ఇలా చెయ్యటం వల్ల దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన విషయాలు నిజమయ్యాయి. యెషయా ప్రవక్త ఈ విధంగా అన్నాడు:

15 “జెబూలూను ప్రాంతమా! నఫ్తాలి ప్రాంతమా!
    సముద్రం ప్రక్కన ఉన్న ఓ జనమా! యొర్దాను నదికి అవతలి వైపుననున్న ప్రదేశమా!
    యూదులుకాని వాళ్ళు నివసించే ఓ గలిలయా!
16 చీకట్లో నివసిస్తున్న ప్రజలు
    గొప్ప వెలుగును చూసారు!
మృత్యుఛాయలు పడే ప్రాంతాల్లో నివసిస్తున్న
    ప్రజలపై వెలుగు ప్రకాశించింది.”(E)

17 ఆ నాటి నుండి యేసు, “దేవుని రాజ్యం దగ్గర లోనే వుంది. కనుక మారుమనస్సు పొందండి!” అని ఉపదేశించటం మొదలు పెట్టాడు.

యేసు కొందరు శిష్యులను ఎన్నుకొనటం

(మార్కు 1:16-20; లూకా 5:1-11)

18 యేసు గలిలయ సముద్రం ఒడ్డున నడుస్తూ పేతురు అని పిలువబడే సీమోనును, అతని సోదరుడు అంద్రెయను చూశాడు. ఈ సోదరులు చేపలు పట్టేవారు. వాళ్ళు అప్పుడు నీళ్ళల్లో వల వేస్తూ ఉన్నారు. 19 యేసు వాళ్ళతో, “నన్ను అనుసరించండి! మీరు మనుష్యుల్ని పట్టుకొనేటట్లు చేస్తాను” అని అన్నాడు. 20 వాళ్ళు వెంటనే తమ వలల్ని వదిలి ఆయన్ని అనుసరించారు.

21 యేసు అక్కడ నుండి వెళ్తూ మరో యిద్దర్ని చూశాడు. వాళ్ళు కూడా సోదరులు. ఒకని పేరు యాకోబు, మరొకని పేరు యోహాను. తండ్రి పేరు జెబెదయి. ఆ సోదరులు తమ తండ్రితో కలసి పడవలో కూర్చొని వలను సరిచేసుకొంటూ ఉన్నారు. యేసు వాళ్ళను పిలిచాడు. 22 వాళ్ళు వెంటనే పడవను, తమ తండ్రిని వదిలి ఆయన్ని అనుసరించారు.

యేసు బోధించి రోగులను నయం చేయటం

(లూకా 6:17-19)

23 యేసు సమాజమందిరాల్లో బోధిస్తూ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తూ గలిలయ ప్రాంతమంతా పర్యటించాడు. ఆయన ప్రతి రోగిని, బాధపడ్తున్న ప్రతి వ్యక్తిని బాగు చేసాడు. 24 ఆయన కీర్తి సిరియ దేశమంతటా వ్యాపిస్తూవుండింది. ప్రజలు రకరకాల రోగాలు ఉన్నవాళ్ళను, బాధ పడ్తున్న వాళ్ళను, దయ్యాలు పట్టిన వాళ్ళను, మూర్చరోగుల్ని, పక్షవాత రోగుల్ని, ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన వాళ్ళను నయం చేశాడు. 25 గలిలయ నుండి, దెకపొలి[a] నుండి, యెరూషలేము నుండి, యూదయ నుండి, యొర్దాను నది అవతలి వైపుననున్న ప్రాంతాల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International