M’Cheyne Bible Reading Plan
ప్రజలకోసం రాళ్ల జ్ఞాపికలు
27 మోషే. ఇశ్రాయేలు నాయకులతో కలసి, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయులుగా ఉండండి. 2 మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. ఈ రాళ్లకు సున్నము పూయండి. 3 ఈ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు చేయాలి. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న – పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా దీనిని మీకు వాగ్దానం చేసాడు.
4 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ వేళ నేను మీకు ఆదేశించినట్టు ఏబాలు కొండ మీద మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు సున్నము పూయాలి. 5 మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు. 6 మీరు మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టేటప్పుడు, పగులగొట్టని బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించండి. 7 మరియు మీరు అక్కడ బలి అర్పణలు అర్పించి, సమాధాన బలులను అర్పించాలి. అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా సమయం గడపండి. 8 మీరు నిలబెట్టే బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా మీరు రాయాలి.”
దేవుని నియమాలకు ప్రజల సమ్మతి
9 లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడి ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి. ఈ వేళ మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు. 10 కనుక మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు కావాలి.”
11 అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా చెప్పాడు: 12 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత గెరీజీము కొండమీద నిలబడి ప్రజలకు దీవెనలు ప్రకటించాల్సిన వంశాలు ఏవనగా: షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను. 13 శాపం ప్రకటించటానికి రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను నఫ్తాలి వంశాలు ఏబాలు కొండమీద నిలబడాలి.
14 “అప్పుడు లేవీయులు పెద్ద స్వరంతో ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పాలి:
15 “‘విగ్రహాలను తయారు చేసుకొని, రహస్య స్థలంలో దాచిపెట్టుకొనేవాడు శాపగ్రస్థుడు. ఈ విగ్రహాలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసిన చెక్క, రాయి, లోహపు బొమ్మ మాత్రమే, వాటిని యెహోవా అసహ్యించుకొంటాడు.’
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
16 “అప్పుడు లేవీయులు ‘తన తల్లినిగానీ తండ్రిని గానీ గౌరవించటం లేదని సూచించే పనులు చేసేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
17 “అప్పుడు లేవీయులు ‘తన పొరుగువాని సరిహద్దు రాయి తొలగించినవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
18 “అప్పుడు లేవీయులు ‘గుడ్డివాడు, దారి తప్పి పోయేటట్టు నడిపించేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
19 “అప్పుడు లేవీయులు ‘విదేశీయులకు, అనాథలకు, విధవలకు న్యాయంగా తీర్పు చెప్పనివాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
20 “అప్పుడు లేవీయులు, ‘ఒకడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
21 “‘ఏ జంతువుతోనైనా లైంగిక సంపర్కం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
22 “‘తన సోదరితోగాని, తన తండ్రి కుమార్తెతోగాని, తన తల్లి కుమార్తెతోగాని లైంగిక సంబంధం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చేప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
23 “‘తన అత్తగారితో లైంగిక సంబంధం ఉన్నవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
24 “అతడు పట్టుబడనప్పటికీ ‘రహస్యంగా మరొకడ్ని చంపినవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
25 “‘నిర్దోషిని ఒకణ్ణి చంపటానికి డబ్బు తీసుకొనేవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
26 “‘ధర్మశాస్త్రాన్ని బలపర్చకుండా, దీనికి విధేయుడు కానివాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి.
“అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి.
ధర్మశాస్త్రానికి లోబడినందుకు ఆశీర్వాదాలు
28 “మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులై, ఈ రోజు నేను మీకు చెబుతోన్న ఆయన ఆదేశాలన్నింటినీ పాటిస్తే, అప్పుడు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఈ భూలోక రాజ్యాలన్నింటికంటె ఉన్నత స్థానంలో ఉంచుతాడు. 2 మీరు గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి, మీ స్వంతం అవుతాయి.
3 “యెహోవా మీ పట్టణాలు
మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు.
4 యెహోవా మీకు అధిక సంతానం
యిచ్చి ఆశీర్వాదిస్తాడు.
మీ పొలాలను మంచి పంటలతో
ఆయన ఆశీర్వదిస్తాడు
మీ పశువులకు సంతానాభివృద్ధి కలిగిస్తాడు
మీకు పశువులు,
గొర్రెలు విస్తారంగా ఉంటాయి.
5 మీకు ధాన్యపు పంటలు,
ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
6 మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.
7 “మీ మీదికి వచ్చే మీ శత్రువులను మీరు ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదికి ఒకే మార్గంలో వచ్చి, ఏడు మార్గాల్లో పారిపోతాడు.
8 “మీ కొట్లు నిండుగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 9 యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు విధేయులై, ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే ఆయన దీనిని మీకు వాగ్దానం చేసాడు. 10 అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయపడతారు.
11 “మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు. 12 యెహోవా తన గొప్ప ఆశీర్వాదాల్ని దాచి ఉంచిన ఆకాశాన్ని తెరచి. సరైన సమయంలో మీ భూమిమీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే పనులన్నింటినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది. కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. 13 యెహోవా మిమ్మల్ని తలగానే ఉంచు తాడుగాని తోకగాకాదు. మీరు పైవారు గానే ఉంటారు కాని క్రిందవారుగా ఉండరు. ఈ వేళ నేను మీకు చెబుతున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు మీరు విధేయులైతే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి. 14 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ప్రభోధాల్లో దేనినుండీ మీరు తప్పి పోకూడదు. మీరు కుడి ప్రక్కకు గాని ఎడమ ప్రక్కకు గాని తొలగిపోకూడదు. మీరు ఇతర దేవుళ్లను సేవించడానికి వారిని వెంబడించ కూడదు.
ధర్మశాస్త్రానికి లోబడనందుకు శాపాలు
15 “అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పే విషయాలను మీరు వినకపోతే, ఈ వేళ నేను మీకు చెప్పే ఆయన ఆదేశాలకు, చట్టాలకు మీరు విధేయులు కాకపోతే అప్పుడు మీకు ఇదిగో ఈ చెడ్డ సంగతులన్నీ సంభవిస్తాయి:
16 “మీ పట్టణాల్ని,
పొలాల్ని యెహోవా శపిస్తాడు.
17 మీకు పంటలు ఉండకుండేలా యెహోవా మిమ్మల్ని శపిస్తాడు.
మీకు సరిపడేటంత ఆహారం ఉండదు.
18 యెహోవా మిమ్మల్ని శపిస్తాడు,
మీకు అనేక మంది పిల్లలు కలగరు.
ఆయన మీ భూమిని శపిస్తాడు,
గనుక మంచి పంటను మీరు పొందరు.
ఆయన మీ పశువులను శపిస్తాడు,
గనుక అవి ఎక్కువ పిల్లల్ని ఈనవు.
ఆయన మీ దూడలను గొర్రె పిల్లలను శపిస్తాడు.
19 మీరు చేసే వాటన్నింటిలో ఎల్లప్పుడూ యెహోవా శపిస్తాడు.
ఆలెఫ్[a]
119 పవిత్ర జీవితాలు జీవించేవాళ్లు సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు యెహోవా ఉపదేశాలను అనుసరిస్తారు.
2 యెహోవా ఒడంబడికకు విధేయులయ్యే ప్రజలు సంతోషిస్తారు.
వారు వారి హృదయపూర్తిగా యెహోవాకు విధేయులవుతారు.
3 ఆ మనుష్యులు చెడ్డ పనులు చెయ్యరు.
వారు యెహోవాకు విధేయులవుతారు.
4 యెహోవా, నీవు మాకు నీ ఆజ్ఞలిచ్చావు.
ఆ ఆజ్ఞలకు మేము పూర్తిగా విధేయులము కావాలని నీవు మాతో చెప్పావు.
5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు
ఎల్లప్పుడూ విధేయుడనౌతాను,
6 అప్పుడు నేను నీ ఆజ్ఞలను
ఎప్పుడు చదివినా సిగ్గుపడను.
7 అప్పుడు నేను నీ న్యాయం, నీ మంచితనం గూర్చి చదివి
నిన్ను నిజంగా ఘనపర్చగలుగుతాను.
8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము!
బేత్
9 యువకుడు పవిత్ర జీవితం ఎలా జీవించగలడు?
నీ ఆజ్ఞలను అనుసరించుట ద్వారానే.
10 నేను నా హృదయపూర్తిగా దేవుని సేవించుటకు ప్రయత్నిస్తాను.
దేవా, నీ ఆజ్ఞలకు విధేయుడనవుటకు నాకు సహాయం చేయుము.
11 నీ ఉపదేశాలను నేను చాలా జాగ్రత్తగా ధ్యానం చేసి నా హృదయంలో భద్రపరచుకొంటాను.
ఎందుకంటే, నేను నీకు విరోధంగా పాపం చేయను
12 యెహోవా, నీకే స్తుతి.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
13 జ్ఞానంగల నీ నిర్ణయాలను గూర్చి నేను మాట్లాడుతాను.
14 ఒకడు గొప్ప ఐశ్వర్యంలో ఆనందించేలా
నేను నీ ఆజ్ఞలు అనుసరించటంలో ఆనందిస్తాను.
15 నీ నియమాలను నేను చర్చిస్తాను.
నీ జీవిత విధానం నేను అనుసరిస్తాను.
16 నీ న్యాయ చట్టాలలో నేను ఆనందిస్తాను.
నీ మాటలు నేను మరచిపోను.
గీమెల్
17 నీ సేవకుడనైన నాకు మేలుగా నుండుము.
తద్వారా నేను జీవించగలను. నేను నీ ఆజ్ఞలకు విధేయుడను అవుతాను.
18 యెహోవా, నా కళ్లు తెరువుము, అప్పుడు నేను నీ ఉపదేశములను అనుసరించి
నీవు చేసిన ఆశ్చర్యకార్యాలను గూర్చి చదువుతాను.
19 ఈ దేశంలో నేను పరాయివాణ్ణి.
యెహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి
చదవాలని కోరుతున్నాను.
21 యెహోవా, గర్వించే ప్రజలను నీవు గద్దిస్తావు.
ఆ గర్విష్ఠులకు కీడులే సంభవిస్తాయి.
నీ అజ్ఞలకు విధేయులవుటకు వారు నిరాకరిస్తారు.
22 నన్ను సిగ్గుపడనియ్యకు, ఇబ్బంది పడనియ్యకు.
నేను నీ ఒడంబడికకు విధేయుడనయ్యాను.
23 నాయకులు కూడ నన్ను గూర్చి చెడు విషయాలు చెప్పారు.
అయితే యెహోవా, నేను నీ సేవకుడను; మరియు నేను నీ న్యాయ చట్టాలు చదువుతాను.
24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు.
అది నాకు మంచి సలహా ఇస్తుంది.
దేవుడు తన ప్రజలను స్వదేశానికి తీసుకొనివస్తాడు
54 ఓ స్త్రీ, సంతోషంగా ఉండు!
నీకు పిల్లలు పుట్టలేదు,
కానీ నీవు చాలా సంతోషంగా ఉండాలి.
“భర్తగల స్త్రీకంటె ఒంటరి స్త్రీ[a]
ఎక్కువ మంది పిల్లలను కంటుంది.”
అని యెహోవా చెబుతున్నాడు.
2 నీ గుడారం విశాలం చేయి.
నీ ద్వారాలు పూర్తిగా తెరువు.
నీ కుటుంబాన్ని వృద్ధి చేయటం ఆపుజేయకు.
నీ గుడారాన్ని విశాలం చేయి, బలంగా చేయి.
3 ఎందుకంటే నీవు చాలా పెరిగిపోవటం మొదలు పెడతావు.
నీ పిల్లలు అనేక రాజ్యాల నుండి ప్రజలను తీసుకొనివస్తారు.
నాశనం చేయబడిన పట్టణాల్లో ఆ పిల్లలు తిరిగి నివసిస్తారు.
4 భయపడవద్దు!
నీవు నిరాశ చెందవు.
నీ మీద ప్రజలు చెడ్డ మాటలు చెప్పరు.
నీవేమీ ఇబ్బంది పడవు.
నీవు చిన్నదానివిగా ఉన్నప్పుడు నీవు సిగ్గుపడ్డావు.
కానీ ఆ సిగ్గు నీవు ఇప్పుడు మరచిపోతావు.
నీ భర్త పోయినప్పుడు నీకు కలిగిన అవమానాన్ని
నీవు జ్ఞాపకం చేసుకోవు.
5 ఎందుకంటే నిన్ను చేసిన వాడు నీ భర్త (దేవుడు)
గనుక ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.
ఇశ్రాయేలును రక్షించేవాడు ఆయనే. ఆయన ఇశ్రాయేలు పరిశుద్ధుడు.
ఆయన సర్వభూమికి దేవుడు అని పిలువ బడతాడు.
6 నీవు భర్త విడిచిన భార్యవలె ఉన్నావు.
ఆత్మలో నీవు చాలా దుఃఖించావు.
కానీ యెహోవా నిన్ను తనదిగా ఉండేందుకు పిలిచాడు.
యవ్వనంలో వివాహమై, భర్తచే విడిచి పెట్టబడిన స్త్రీలా నీవు ఉన్నావు.
కానీ దేవుడు నిన్ను తనదానిగా ఉండుటకు పిలిచాడు.
7 దేవుడు చెబుతున్నాడు,
“నేను నిన్ను విడిచిపెట్టాను. కానీ కొంతకాలం మట్టుకే.
నేను నిన్ను మళ్లీ నా దగ్గరకు చేర్చుకొంటాను. నేను నీకు గొప్ప దయ చూపిస్తాను.
8 నేను చాలా కోపగించి కొద్ది కాలం పాటు నీ నుండి దాక్కున్నాను.
కానీ శాశ్వతంగా నిన్ను నేను దయతో ఆదరిస్తాను.”
నీ రక్షకుడైన యెహోవా ఇది చెప్పాడు.
9 దేవుడు చెబుతున్నాడు:
“నోవహు కాలంలో ప్రళయంతో నేను ప్రపంచాన్ని శిక్షించినట్టుగా ఉంది ఇది.
ప్రపంచాన్ని మళ్లీ ఎన్నడూ ప్రళయంతో ముంచివేయనని నొవహుకు నేను వాగ్దానం చేశాను.
అదే విధంగా, నేను మరల ఎన్నడు నీ మీద కోపగించి, నిన్నుగూర్చి చెడుగా మాట్లాడనని ప్రమాణం చేస్తున్నాను.”
10 యెహోవా చెబుతున్నాడు: “పర్వతాలు కనిపించకుండా పోవచ్చు,
కొండలు ధూళి కావచ్చును.
కానీ నా దయ నిన్ను ఎన్నటికీ విడువదు.
నేను నీతో సమాధానపడతాను,
అది ఎన్నటికీ అంతం కాదు.”
యెహోవా నీ యెడల కరుణ చూపిస్తాడు. మరియు ఈ సంగతులు చెప్పిన వాడు ఆయనే.
11 “అయ్యో, దీన పట్టణమా!
తుఫానులు నిన్ను బాధించాయి,
మరియు నీవు ఓదార్చబడలేదు.
నేను నిన్ను మరల నిర్మిస్తాను.
ప్రశస్తమైన రాళ్లను ఉపయోగించి నేను నీ పునాదులు వేస్తాను.
నీలాంజనాలు, నీలాలు నేను ఉపయోగిస్తాను.
12 మాణిక్య మణులతో నేను నీ గోడలు కడతాను.
సూర్యకాంతాలతో నేను నీ ద్వారాలు కడతాను.
ప్రశస్త రత్నాలతో నేను నీ గోడలన్నింటినీ కడతాను.
13 నీ పిల్లలు దేవుని వెంబడిస్తారు, ఆయన వారికి ఉపదేశం చేస్తాడు.
నీ పిల్లలకు ఎంతో శాంతి ఉంటుంది.
14 న్యాయం ప్రయోగించి నేను నిర్మిస్తాను.
కనుక నీవు అన్యాయానికి, కృ-రత్వానికి దూరంగా ఉండాలి.
అప్పుడు నీవు భయపడాల్సింది.
ఏమీ ఉండదు. ఏదీ నిన్ను బాధించుటకు రాదు.
15 నా సైన్యాలు ఏవీ నీకు వ్యతిరేకంగా పోరాడవు.
మరియు ఏ సైన్యమైనా నీ మీద దాడి చేసేందుకు ప్రయత్నిస్తే నీవు ఆ సైన్యాన్ని ఓడిస్తావు.
16 “చూడు, కమ్మరిని నేను చేశాను. అగ్నిని రాజ బెట్టేందుకు అతడు నిప్పుమీద విసరుతాడు. అప్పుడు అతడు వేడి ఇనుమును తీసుకొని, తాను చేయదలచుకొన్న పనిముట్టును చేస్తాడు. అదేవిధంగా నాశనం చేసే ‘నాశన కర్తను’ నేను సృజించాను.
17 “నీ మీద పోరాడుటకు మనుష్యులు ఆయుధాలు చేస్తారు. కానీ ఆ ఆయుధాలు నిన్ను ఓడించవు. కొంత మంది నీకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. కానీ నీకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తిది తప్పు అని చూపించబడుతుంది.”
“యెహోవా సేవకులకు ఏమి లభిస్తుంది? నా దగ్గర లభించే మంచి వాటన్నింటినీ వారు పొందుతారు” అని యెహోవా చెబుతున్నాడు.
తూర్పు నుండి జ్ఞానులు రావటం
2 హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి 2 “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.
3 ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. 4 అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని[a] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. 5 వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:
6 “‘యూదయ దేశంలోని బేత్లెహేమా!
నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు!
ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు.
ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”(A)
7 ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. 8 వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.
9 వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. 10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.
11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. 12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.
ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం
13 వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.
14 యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. 15 యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను”(B) అని అన్న మాట నిజమైంది.
హెరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపటం
16 జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు. 17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:
18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో
ఏడుస్తున్న స్వరం వినిపించింది.
రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది.
ఎవరు ఓదార్చిన వినలేదు.
ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”(C)
నజరేతుకు తిరుగు ప్రయాణం
19 హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, 20 “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.
21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. 22 కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు. 23 అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.
© 1997 Bible League International