M’Cheyne Bible Reading Plan
25 “ఇద్దరు మనుష్యులకు వివాదం ఉంటే వారు న్యాయస్థానానికి వెళ్లాలి. న్యాయమూర్తులు వారి వివాదాన్ని విచారించి, ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయం ప్రకటిస్తారు. 2 నిందితుడు కొరడా దెబ్బలు తినాల్సివస్తే, న్యాయమూర్తి అతణ్ణి బోర్లా పండుకోబెట్టాలి. న్యాయమూర్తి చూస్తూ ఉండగా ఎవరో ఒకరు ఆ దోషిని కొట్టాలి. అతని నేరానికి తగినన్ని దెబ్బలు ఆ దోషిని కొట్టాలి. 3 ఒక మనిషిని ఒకే సారి 40 కంటె ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. అంతకంటె ఎక్కువగా అతడ్ని కొడితే, నీ సోదరుని జీవితం అంటే నీకు లెక్కలేదని తెలుస్తుంది.
4 “నూర్చే ఎద్దు తినకుండా దాని మూతికి చిక్కం వేయకూడదు.
5 “ఇద్దరు సోదరులు కలిసి జీవిస్తుండగా, వారిలో ఒకరు చనిపోవటం, అతనికి కుమారుడు లేకపోవటం జరిగితే, చనిపోయిన సోదరుని భార్య, ఆ కుటుంబానికి దూరస్తుల్ని ఎవరినీ పెళ్లి చేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమెను భార్యగా స్వీకరించి, ఆమెకు భార్యాధర్మం జరిగించాలి. ఒక భర్త సోదరుని విధులను ఆమె భర్త సోదరుడు ఆమెకు జరిగించాలి. 6 అప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డ, ఆ పురుషుని మృత సోదరునికి వారసుడుగా ఉంటాడు. అప్పుడు చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు నుండి రూపు మాసిపోదు. 7 ఒకవేళ ఆ మనుష్యుడు తన సోదరుని భార్యను స్వీకరించడానికి ఇష్టపడకపోతే, ఆమె పట్టణ సమావేశ స్థలం దగ్గర నాయకుల వద్దకు వెళ్లాలి. అతని సోదరుని భార్య, ‘నా భర్త సోదరుడు తన సోదరుని పేరు ఇశ్రాయేలులో సజీవంగా ఉంచేందుకు నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని విధులను అతడు నాకు జరిగించటం లేదు’ అని నాయకులతో చెప్పాలి. 8 అప్పుడు ఆ పట్టణపు నాయకులు అతణ్ణి పిలిపించి, అతనితో మాట్లాడాలి. అతడు మొండివాడై, ‘ఆమెను నేను స్వీకరించను’ అని చెబితే 9 అతని సోదరుని భార్య ఆ నాయకుల ముందుకు రావాలి. ఆమె అతని కాలి నుండి అతని చెప్పు ఊడదీయాలి. అప్పుడు ఆమె అతని ముఖం ముందు ఉమ్మివేయాలి. ‘తన సోదరుని కుటుంబాన్ని ఉద్ధరించని సోదరునికి యిలా చేస్తున్నాను’ అని ఆమె చెప్పాలి. 10 అప్పుడు ఆ సోదరుని కుటుంబం ‘చెప్పు తీయబడ్డ మనిషి కుటుంబంగా’ ఇశ్రాయేలులో చెప్పుకోబడుతుంది.
11 “ఇద్దరు మనుష్యులు ఒకరితో ఒకరు పోట్లాడుతూ వుండవచ్చును. వారిలో ఒకని భార్య తన భర్తకు సహాయం చేయటానికి రావచ్చును. కాని ఆమె అవతల వాని పురుషాంగములను లాగకూడదు. 12 ఆమె అలా చేస్తే ఆమె చేతిని నరికి వేయాలి. ఆమెను గూర్చి విచారించవద్దు.
13 “మనుష్యుల్ని మోసం చేయటానికి తూనికెలో దొంగ రాళ్లు ఉంచవద్దు. మరీ బరువుగా గాని, మరీ తేలికగా గాని ఉండే రాళ్లు ఉపయోగించవద్దు. 14 మరీ పెద్దవి లేక చిన్నవిగా ఉండే కొలతలు నీ ఇంటిలో ఉంచవద్దు. 15 సరిగ్గాను, నిజాయితీగాను ఉండే రాళ్లు, కొలతలు నీవు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో నీవు చాలా కాలం జీవిస్తావు. 16 తప్పుడు తూకాలు, కొలతలు ఉపయోగించే వాళ్లను మీ దేవుడైన యెహోవా అసహ్యించుకొంటాడు. అవును, తప్పు చేసే వాళ్లందర్నీ ఆయన అసహ్యించుకొంటాడు.
అమాలేకీయులు నాశనం చేయబడాలి
17 “మీరు ఈజిప్టు నుండి వస్తున్నప్పుడు అమాలేకీయులు మీకు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకోండి. 18 అమాలేకీయులు దేవుణ్ణి గౌరవించలేదు. మీరు అలసి బలహీనంగా ఉన్నప్పుడు వాళ్లు మీమీద దాడి చేసారు. వెనుక నడుస్తోన్న మీ ప్రజలందర్నీ వాళ్లు చంపేసారు. 19 అందుకే అమాలేకీయుల జ్ఞాపకం కూడ ప్రపంచంలో లేకుండా మీరు నాశనం చేయాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు దీనిని చేయాలి. అక్కడ మీ చుట్టూరా ఉన్న శత్రువులందరి నుండి ఆయన మీకు విశ్రాంతిని ఇస్తాడు. అయితే అమాలేకీయులను నాశనం చేయటం మాత్రం మరచిపోవద్దు.
116 యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు
నాకు ఎంతో సంతోషం.
2 సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర
ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం.
3 నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి.
సమాధి నా చుట్టూరా మూసికొంటుంది.
నేను భయపడి చింతపడ్డాను.
4 అప్పుడు నేను యెహోవా నామం స్మరించి,
“యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను.
5 యెహోవా మంచివాడు, జాలిగలవాడు.
యెహోవా దయగలవాడు.
6 నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధ తీసుకొంటాడు.
నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు.
7 నా ఆత్మా, విశ్రమించు!
యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు.
8 దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు.
నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు.
నేను పడిపోకుండా నీవు నన్ను పట్టుకొన్నావు.
9 సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను.
10 “నేను నాశనమయ్యాను!”
అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను.
11 నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే”
అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను.
12 యెహోవాకు నేను ఏమివ్వగలను?
నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు.
13 నన్ను రక్షించినందుకు
నేను ఆయనకు పానార్పణం యిస్తాను.
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
14 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను.
15 యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము.
యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని.
16 నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను.
యెహోవా, నీవే నా మొదటి గురువు.
17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను.
యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను.
18 నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను.
ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను.
19 యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను.
యెహోవాను స్తుతించండి!
ఇశ్రాయేలు రక్షించబడుతుంది
52 మేలుకో! మేలుకో!
సీయోనూ మేలుకో. నీవు వస్త్రాలు ధరించు.
నీ బలంతొడుగుకో. పవిత్ర యెరూషలేమా, నిలుచో!
దేవుణ్ణి వెంబడించేందుకు ఒప్పు కొని ప్రజలు,[a]
పవిత్రంగా లేని ప్రజలు నీలో మరల ప్రవేశింపరు.
2 ధూళి దులిపివేయి! అద్భుతమైన నీ వస్త్రాలు ధరించు!
సీయోను కుమారీ, యెరూషలేమా, నీవు ఒక ఖైదీవి.
కాని ఇప్పుడు నీ మెడ చుట్టూ ఉన్న గొలుసుల నుండి నిన్ను నీవు విడుదల చేసుకో!
3 యెహోవా చెబుతున్నాడు,
“నీవు డబ్బుకు అమ్మబడలేదు.
అందుచేత డబ్బు లేకుండనే నీవు రక్షించబడతావు.”
4 నా ప్రభువు యెహోవా చెబుతున్నాడు: “నా ప్రజలు నివాసం ఉండేందుకు మొదట ఈజిప్టుకు దిగిపోయారు, ఆ తర్వాత వారు బానిసలయ్యారు. ఆ తర్వాత వారిని అష్షూరు బానిసలను చేసింది. 5 ఇప్పుడు చూడండి ఏమయిందో! మరో రాజ్యాం నా ప్రజలను తీసుకొంది. నా ప్రజలను బానిసలుగా తీసుకొన్న ఆ రాజ్యం ఏది? నా ప్రజలను తీసుకొనేందుకు ఈ రాజ్యం ఏమీ చెల్లించలేదు. ఈ రాజ్యం నా ప్రజలను పాలిస్తూ, వారిని చూచి నవ్వుతుంది. ఆ మనుష్యులు ఎప్పుడూ నన్ను గూర్చి చెడ్డ మాటలే చెబుతుంటారు.”
6 “నా ప్రజలు నన్ను గూర్చి నేర్చుకొనేందుకు ఇది జరిగింది. నేను ఎవరినో నా ప్రజలు తెలుసుకొంటారు. నా ప్రజలు నా పేరు తెలుసుకొంటారు, ఉన్నవాడను[b] అనే నేను వారితో మాట్లాడుతున్నానని వారు తెలుసుకొంటారు” అని యెహోవా చెబుతున్నాడు.
7 శుభవార్తతో కొండల మీదుగా ఒక వార్తాహరుడు రావటం ఎంతో అద్భుతంగా ఉంటుంది. “శాంతి ఉంది! మేము రక్షించబడ్డాం! మీ దేవుడే రాజు!” అని ఒక వార్తాహరుడు ప్రకటించగా వినటం అద్భుతం.
8 పట్టణపు కావలి వాళ్లు[c] కేకలు వేయటం మొదలు పెట్టారు.
వాళ్లంతా కలిసి ఆనందిస్తున్నారు. ఎందుకు?
ఎందుకంటే, యెహోవా సీయోనుకు[d] తిరిగి రావటం వారిలో ప్రతి ఒక్కరూ చూస్తారు.
9 యెరూషలేమా, నాశనం చేయబడిన నీ కట్టడాలు మరల సంతోషిస్తాయి.
మీరంతా కలిసి ఆనందిస్తారు.
ఎందుకంటే, యెరూషలేము మీద యెహోవా దయగలిగి ఉంటాడు. యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు.
10 యెహోవా తన పవిత్ర శక్తిని సకల రాజ్యాలకు చూపిస్తాడు.
మరియు దేవుడు తన ప్రజలను ఎలా రక్షిస్తాడో అది దూర దేశాలన్నీ చూస్తాయి.
11 ప్రజలారా మీరు బబులోను విడిచిపెట్టాలి.
ఆ స్థలం విడిచిపెట్టండి!
ఆరాధనలో ఉపయెగించే వస్తువులను మోసే మనుష్యులారా
మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోండి.
అపవిత్రమైన దేన్ని ముట్టుకోవద్దు.
12 మీరు బబులోను విడిచిపెడ్తారు.
కానీ మీరు ఆత్రంగా విడిచిపెట్టేందుకు బలవంతం చేయబడరు.
పారిపోయేందుకు మీరు బలవంతం చేయబడరు.
మీరు బయటకు నడుస్తారు మరియు యెహోవా మీతో నడుస్తాడు. యెహోవా మీకు ముందు ఉంటాడు.
ఇశ్రాయేలీయుల దేవుడు మీ వెనుక ఉంటాడు.[e]
దేవుని శ్రమపడు సేవకుడు
13 “నా సేవకుని చూడు. అతనికి విజయం కలుగుతుంది. అతడు చాలా ప్రముఖుడవుతాడు. భవిష్యత్తులో ప్రజలు అతన్ని సన్మానించి, గౌరవిస్తారు. 14 కానీ చాలా మంది మనుష్యులు నా సేవకుని చూచి అదరిపోయారు. అతణ్ణి ఒక మనిషిగా వారు గుర్తించలేనంతగా అతడు బాధించబడ్డాడు. 15 కానీ అంతకంటె ఎక్కువమంది ప్రజలు ఆశ్చర్యపోతారు. రాజులు అతన్ని చూచి ఆశ్చర్యపోయి, నోట మాట రాకుండా ఉండిపోతారు. నా సేవకుని గూర్చిన కథ వారు వినలేదు – జరిగింది వారు చూశారు. ఈ ప్రజలు ఆ కథ వినలేదు గాని వారు గ్రహించారు.”
22 ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, 2 పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి.
3 ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. 4 వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. 5 ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు.
6 ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు. 7 ‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు.
8 యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. 9 కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు.
10 అతడు యింకా ఈ విధంగా అన్నాడు: “కాలం సమీపిస్తోంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. 11 తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.”
12 “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. 13 ఆదియు, అంతమును[a] నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే.
14 “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. 15 పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు.
16 “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.”
17 ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు.
18 ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. 19 ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు.
20 యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు.
ఆమేన్! రండి యేసు ప్రభూ!
21 యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
© 1997 Bible League International