M’Cheyne Bible Reading Plan
24 “ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకొన్న తర్వాత ఆమెను గూర్చిన రహస్యం ఏదో తెలిసి ఆమెను ఇష్టపడడు. అతనికి ఆమె ఇష్టం లేకపోతే అతడు విడాకుల పత్రం వ్రాసి, దానిని ఆమెకు ఇవ్వాలి. అప్పుడు అతడు ఆమెను తన ఇంటినుండి పంపించి వేయాలి. 2 ఆమె అతని ఇల్లు విడిచి వెళ్లిపోయాక, ఆమె మరొకనికి భార్య కావచ్చును. 3-4 అయితే ఒకవేళ ఆ కొత్త భర్తకుకూడా ఆమె నచ్చకపోవటంతో అతడు ఆమెను వెళ్లగొట్టవచ్చును. ఒకవేళ అతడు ఆమెకు విడాకులు ఇచ్చినా, మొదటి భర్త ఆమెను మళ్లీ తన భార్యగా చేర్చుకోకూడదు. లేక ఆమె కొత్త భర్త చనిపోతే, మొదటి భర్త ఆమెను మరల తన భార్యగా చేర్చుకోకూడదు. అతనికి ఆమె అపవిత్రమయిందిగా ఉంటుంది. అతడు ఆమెను మళ్లీ పెళ్లి చేసుకొంటే, యెహోవాకు అసహ్యమైనదానిని అతడు చేసినవాడవుతాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ఇలా పాపం చేయకూడదు.
5 “ఒక పురుషునికి పెళ్లయిన కొత్తలోనే అతణ్ణి సైన్యంలోనికి పంపకూడదు. అతనికి ఎలాంటి ప్రత్యేక పనినీ విధించకూడదు. ఒక్క సంవత్సరం అతడు ఇంటి దగ్గరే ఉండి, తన కొత్త భార్యను సంతోషపెట్టేందుకు అతడు స్వేచ్చగా ఉండాలి.
6 “ఒకనికి నీవు ఏదైనా బదులు ఇస్తే, దానికి భద్రతగా అతని తిరుగటి రాయిని నీవు తీసుకోకూడదు. ఎందుకంటే, అది అతని భోజనాన్ని తీసుకొన్నట్టే అవుతుంది గనుక.
7 “ఒకడు తన స్వంత ప్రజల్లోనుండి (ఇశ్రాయేలు వాడ్ని) ఎత్తుకొనిపోయి, అతడ్ని బానిసగా వాడినా, అమ్మినా, ఆ ఎత్తుకు పోయినవాడు చావాల్సిందే. ఈ విధంగా మీ మధ్య ఎలాంటి చెడుగునైనా మీరు తొలగిస్తారు.
8 “కుష్ఠు రోగంవంటి వ్యాధి నీకు ఉంటే, లేవీ యాజకులు నీకు ప్రబోధించేవాటన్నింటినీ నీవు జాగ్రత్తగా పాటించాలి. చేయాల్సిందిగా నేను యాజకులకు చెప్పిన విషయాలను నీవు జాగ్రత్తగా పాటించాలి. 9 మీరు ఈజిప్టునుండి బయటకు వచ్చిన ప్రయాణంలో మిర్యాముకు[a] మీ దేవుడైన యెహోవా చేసినదాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి.
10 “నీవు ఎవరికైనా ఎలాంటి అప్పు ఇచ్చినా, దానికి భద్రతగా దేనినైనా తీసుకొనేందుకు నీవు అతని ఇంటిలోనికి వెళ్లకూడదు. 11 నీవు బయటనే నిలిచి ఉండాలి. అప్పుడు నీవు ఎవరికైతే అప్పు ఇచ్చావో అతడే దానికి భద్రతగా దేనినైనా బయటకు తెచ్చి నీకు ఇస్తాడు. 12 ఒకవేళ అతడు పేదవాడైతే అతని వస్తువును తెల్లవారేవరకు నీ దగ్గర ఉంచుకోకూడదు. 13 అతని వస్తువును ప్రతి సాయంత్రం నీవు అతనికి ఇస్తూ ఉండాలి. అప్పుడు అతడు తన స్వంత బట్టలతో నిద్రపోగల్గుతాడు. అతడు నీకు కృతజ్ఞతలు చెబుతాడు, నీవు ఈ మంచి పని చేసినట్టు నీ దేవుడైన యెహోవా చూస్తాడు.
14 “పేదవాడు, అవసరంలో ఉన్నవాడునైన జీతగాడ్ని నీవు మోసం చేయకూడదు. అతడు నీతోటి ఇశ్రాయేలు వాడైనా, మీ పట్టణాలు ఒక దానిలో నివసిస్తున్న విదేశీయుడైనాసరే. 15 ప్రతి రోజూ సూర్యుడు అస్తమించక ముందే అతని జీతం అతనికి ఇచ్చి వేయాలి. ఎందుకంటే, అతడు పేదవాడు, ఆ డబ్బే అతనికి ఆధారం. నీవు అతనికి అలా చెల్లించకపోతే అతడు నీ మీద యెహోవాకు ఫిర్యాదు చేస్తాడు. నీవు పాప దోషివి అవుతావు.
16 “పిల్లలు చేసిన దేనికోసమైనా తండ్రులను చంపకూడదు. అలాగే తల్లిదండ్రులు చేసిన దేని కోసమూ పిల్లలను చంపకూడదు. ఒక వ్యక్తి స్వయంగా తాను చేసిన కీడు నిమిత్తము చంపబడాలి.
17 “విదేశీయులకు, అనాధలకు న్యాయం జరిగేట్టు నీవు చూడాలి. ఒక విధవ దగ్గర తాకట్టుగా బట్టలు నీవెన్నటికీ తీసుకోకూడదు. 18 మీరు ఒకప్పుడు ఈజిప్టులో బానిసలు అని ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అక్కడ్నుండి బయటకు తీసుకొనివచ్చాడని మరచిపోవద్దు. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
19 “నీవు నీ పొలంలో పంటకూర్చుకొంటూ, మరచిపోయి ఒక పన అక్కడే విడిచిపెట్టావనుకో, నీవు మళ్లీ దానికోసం వెళ్లకూడదు. విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం అది ఉంటుంది. వారికోసం నీవు కొంత ధాన్యం విడిచిపెడితే, నీ ప్రతి పనిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. 20 నీవు నీ ఒలీవ చెట్లను రాల్చినప్పుడు కొమ్మలను పరిశీలించేందుకు నీవు తిరిగి అక్కడకు వెళ్లకూడదు. నీవు అలా విడిచిపెట్టే ఒలీవలు విదేశీయులకు, అనాథలకు, విధవలకు ఉంటాయి. 21 నీ ద్రాక్షతోటనుండి నీవు ద్రాక్షా పండ్లు కూర్చుకొనేటప్పుడు, నీవు విడిచిపెట్టిన పండ్లు తీసుకొనేందుకు నీవు తిరిగి అక్కడికి వెళ్లకూడదు. ఆ ద్రాక్షాపండ్లు విదేశీయుల కోసం, అనాథల కోసం, విధవల కోసం ఉంటాయి. 22 మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారని జ్ఞాపకం ఉంచుకో. అందుకే మీరు పేదవారికి ఇలా చేయాలని నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
114 ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు.
యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు.
2 ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు.
ఇశ్రాయేలు ఆయన రాజ్యం అయింది.
3 ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది.
యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది.
4 పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి.
కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి.
5 ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు?
యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు?
6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు?
కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు?
7 యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది.
8 బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే.
ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు.
115 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది.
నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే.
2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి?
3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు.
4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే.
ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి.
5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు.
వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు.
6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు.
వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు.
7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు.
వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు.
వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు.
8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు.
9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము.
యెహోవా వారి బలము, ఆయన వారి డాలు.
10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు.
యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు.
11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు.
యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు.
12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు.
యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు.
యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు.
13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు.
14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.
ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు.
16 ఆకాశం యెహోవాకు చెందుతుంది.
కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు.
17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు.
కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు.
18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం.
మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము!
యెహోవాను స్తుతించండి!
ఇశ్రాయేలు అబ్రాహాము వలె ఉండాలి
51 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ బండ ఆయనే. 2 అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.”
3 అదే విధంగా సీయోనును[a] యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.
4 “నా ప్రజలారా, నా మాట వినండి!
ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు.
5 నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను.
నేను నా శక్తిని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను.
దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి.
నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి.
6 ఆకాశాలవైపు చూడండి.
మీ చుట్టూ క్రింద ఉన్న భూమిని చూడండి.
ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి.
భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది.
భూమి మీద మనుష్యులు మరణిస్తారు.
అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
నా దయ ఎప్పటికీ అంతంకాదు.
7 దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు నా మాట వినాలి.
నా ఉపదేశాలను పాటించే ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి.
దుష్ట ప్రజలు విషయం భయపడకండి.
వారు మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయపడకండి.
8 ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. చిమ్మెటలు వాటిని తినివేస్తాయి.
వారు గొర్రెబొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తినివేస్తాయి.
అయితే నా దయ శాశ్వతంగా కొనసాగుతుంది.
నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగుతుంది.”
దేవుని స్వంత శక్తి తన ప్రజలను రక్షిస్తుంది
9 యెహోవా హస్తమా (శక్తి) మేలుకో!
మేలుకో! నీ బలం సిద్ధం చేయి.
చాలాకాలం క్రిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు.
రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు.
10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు.
సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు.
నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు.
11 యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు.
వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు.
వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు.
వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది.
ఆనందంతో వారు పాటలు పాడుతూంటారు.
దుఃఖం అంతా దూరమైపోతుంది.
12 యెహోవా చెబుతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే.
కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి?
వాళ్లు కేవలం బ్రతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులు. వారు కూడా గడ్డిలాగే చస్తారు.”
13 యెహోవా మిమ్మల్ని చేశాడు.
తన శక్తితో ఆయన భూమిని చేశాడు.
తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు.
కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచిపోతారు.
కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు.
ఆ మనుష్యులు మిమ్మును నాశనం చేయాలని పథకం వేసారు.
కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.
14 చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల చేయబడతారు.
వాళ్లు చెరసాలలోనే మరణించి, కుళ్లిపోరు.
ఆ మనుష్యులకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
15 “నేను యెహోవాను, మీ దేవుడను.
నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.”
(ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.)
16 “నా సేవకా, నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పిఉంచి కాపాడుతాను. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. ‘మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకొంటాను.’”
ఇశ్రాయేలును దేవుడు శిక్షించాడు
17 మేలుకో! మేలుకో!
యెరూషలేమా, లెమ్ము!
నీ మీద యెహోవా చాలా కోపగించాడు.
అందువల్ల నీవు శిక్షించబడ్డావు.
నీవు తాగాల్సిన ఒక విషపుపాత్రలా ఉంది ఆ శిక్ష.
నీవు దానిని తాగావు.
18 యెరూషలేముకు చాలామంది ప్రజలు ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఆమెకు నాయకులు కాలేదు. ఆమె పెంచిన పిల్లలు ఎవ్వరు ఆమెను నడిపించే మార్గదర్శులు కాలేదు. 19 యెరూషలేముకు జంట జంటలుగా కష్టాలు వచ్చాయి, దొంగిలించటం, చొరబడటం, మహా ఆకలిపోరాటం. నీవు శ్రమ అనుభవిస్తున్నప్పుడు నీకు ఎవ్వరూ సహాయం చేయలేదు.
ఎవరూ నీ మీద దయచూపించలేదు. 20 నీ ప్రజలు బలహీనులయ్యారు. వారు నేలమీద పడి, అలానే ఉండిపోయారు. ప్రతి వీధిమలుపులోను వారు పడివున్నారు. వారు వలలో పట్టబడిన జంతువుల్లా ఉన్నారు. వారు ఇంకెంత మాత్రం భరించలేనంతగా, యెహోవా కోపంచేత శిక్షించబడ్డారు. దేవుడు వారికి ఇంకా ఎక్కువ శిక్ష విధిస్తాను అన్నప్పుడు వారు మరీ బలహీనులై పోయారు.
21 అయ్యో, యెరూషలేమూ, నా మాట విను. ఒక త్రాగుబోతువానిలా నీవు బలహీనంగా ఉన్నావు, కానీ నీవు ద్రాక్షరసం తాగినందుచేత కాదు మత్తుగా ఉన్నది. నీవు ఆ “విషపు పాత్ర” మూలంగా బలహీనంగా ఉన్నావు.
22 నీ దేవుడు, యజమానియైన యెహోవా తన ప్రజలకోసం పోరాడుతాడు. ఆయన నీతో ఇలా అంటున్నాడు: “చూడు, ఈ ‘విషపు పాత్రను’ (శిక్షను) నీ వద్దనుండి నేను తొలగించి వేస్తున్నాను. నీ మీద నా కోపాన్ని తీసివేస్తున్నాను. ఇంకెంత మాత్రం నీవు నా కోపం మూలంగా శిక్షించబడవు. 23 నీకు హాని చేసిన వారిని శిక్షించటానికి ఇప్పుడు నేను నా కోపాన్ని వినియోగిస్తాను. ఆ ప్రజలు నిన్ను చంపటానికి ప్రయత్నించారు. ‘మా యెదుట, సాష్టాంగపడు, మేము నీ మీద నడుస్తాం’ అని వారు నీతో చెప్పారు. వాళ్ల ముందు సాష్టాంగ పడేట్టు వారు నిన్ను బలవంతం చేశారు. అప్పుడు ఆ మనుష్యులు నడుచుటకు నీ వీపును ధూళిగా చేశారు. వారు ప్రయాణం చేయుటకు నీవు ఒక తోవలా ఉన్నావు.”
క్రొత్త యెరూషలేము
21 ఆ తర్వాత నేను ఒక క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని[a] చూసాను. మొదటి ఆకాశం, మొదటి భూమి అదృశ్యమయ్యాయి. ఇప్పుడు సముద్రము లేదు. 2 నేను పరిశుద్ధ పట్టణమైన క్రొత్త యెరూషలేము పరలోకం నుండి దిగిరావటం చూసాను. అది దేవుని నుండి, పెళ్ళి కుమారుని కోసం పెళ్ళికూతురిలా అలంకరించుకొని దిగి వచ్చింది.
3 సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక నుండి దేవుడు మానవులతో ఉంటాడు. వాళ్ళతో నివసిస్తాడు. వాళ్ళు ఆయన ప్రజలు; ఆయన వాళ్ళ దేవుడై వాళ్ళతో స్వయంగా ఉంటాడు. 4 వాళ్ళ కళ్ళ నుండి కారిన ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు. పాత సంగతులు గతించిపోయాయి. కనుక యిక మీదట చావుండదు. దుఃఖం ఉండదు. విలాపం ఉండదు, బాధ వుండదు” అని అన్నది.
5 సింహాసనంపై కూర్చొన్నవాడు, “నేను ప్రతి వస్తువును క్రొత్తగా చేస్తాను” అని అన్నాడు. “ఇవి విశ్వసింప దగినవి, సత్యం, కనుక యివి వ్రాయి” అని అన్నాడు.
6 ఆయన నాతో, “అంతా సమాప్తమైంది. అల్ఫా (ఆది), ఓమెగా (అంతం) నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే. దాహంతోవున్నవానికి ఊటనుండి జీవజలాన్ని ఉచితంగా ఇస్తాను. 7 జయించినవాడు వీటన్నిటికీ వారసుడౌతాడు. నేను అతనికి దేవునిగా, అతడు నాకు కుమారునిగా ఉంటాము. 8 కాని, పిరికివాళ్ళు, విశ్వాసం లేనివాళ్ళు, నీచులు, హంతకులు, అవినీతిపరులు, మంత్రగాళ్ళు, విగ్రహారాధకులు, అసత్యాలాడేవాళ్ళు మండే గంధకమున్న భయానకమైన గుండంలో ఉంటారు. యిది రెండవ మరణం” అని అన్నాడు.
9 ఏడు పాత్రలతో ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉన్నవారిలో ఒక దూతవచ్చి నాతో, “పెళ్ళికూతుర్ని, అంటే గొఱ్ఱెపిల్ల భార్యను చూపిస్తాను, రా!” అని అన్నాడు. 10 అతడు నన్ను ఆత్మ ద్వారా ఎత్తుగా ఉన్న గొప్ప పర్వతం మీదికి తీసుకు వెళ్ళాడు. పరలోకంలో ఉన్న దేవుని దగ్గరనుండి దిగివస్తున్న పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమును చూపించాడు.
11 అది దేవుని మహిమతో వెలుగుతూ ఉంది. దాని మహిమ అమూల్యమైన ఆభరణంగా, అంటే సూర్య కాంతమణిలా ఉంది. అది స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంది. 12 దాని చుట్టూ ఎత్తైన ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారానికి పన్నెండు ద్వారాలు ఉన్నాయి. పన్నెండుమంది దేవదూతలు ఆ ద్వారాల యొద్ద ఉన్నారు. ఆ ద్వారాల మీద ఇశ్రాయేలీయుల పన్నెండు గోత్రాల పేర్లు వ్రాయబడ్డాయి. 13 తూర్పు వైపు మూడు ద్వారాలు, ఉత్తరం వైపు మూడు ద్వారాలు, దక్షిణం వైపు మూడు ద్వారాలు, పడమర వైపు మూడు ద్వారాలు ఉన్నాయి. 14 ఆ నగర ప్రాకారానికి పన్నెండు పునాదులున్నాయి. వాటి మీద గొఱ్ఱెపిల్ల యొక్క పన్నెండుగురు అపొస్తలుల పేర్లు ఉన్నాయి.
15 నాతో మాట్లాడిన దూత దగ్గర బంగారంతో చేసిన కొలత బద్ద ఉంది. అతడు దాని పట్టణాన్ని, దాని ప్రాకారాన్ని, ద్వారాలను కొలవటానికి తెచ్చాడు. 16 ఆ పట్టణం చతురస్రంగా కట్టబడి ఉంది. దాని వెడల్పు, పొడవు సమానంగా ఉన్నాయి. అతడు కొలతబద్దతో పట్టణాన్ని కొలిచాడు. దాని పొడవు, వెడల్పు, ఎత్తు, 1,500 మైళ్ళు[b] ఉన్నట్లు కనుగొన్నాడు. 17 ఆ పట్టణం యొక్క ప్రాకారాన్ని కొలిచి దాని ఎత్తు ఆ నాటి కొలత పద్ధతి ప్రకారం 144 మూరలు[c] ఉన్నట్లు కనుగొన్నాడు. 18 ఆ ప్రాకారం సూర్యకాంతములతో కట్టబడి ఉంది. ఆ పట్టణం బంగారంతో కట్టబడి ఉంది. అది గాజువలె స్వచ్ఛంగా ఉంది.
19 ఆ ప్రాకారాల పునాదులు రకరకాల రత్నాలతో అలంకరింపబడి ఉన్నాయి. మొదటి పునాదిరాయి సూర్యకాంతం, రెండవది నీలం, మూడవది యమున, నాలుగవది పచ్చ, 20 ఐదవది వైఢూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణ సునీయము, పదకొండవది పద్మరాగము, పన్నెండవది సుగంధము. 21 ఆ పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలతో చేయబడి ఉన్నాయి. ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ముత్యంతో చేయబడి ఉంది. ఆ పట్టణపు వీధులు మేలిమి బంగారంతో చేయబడి ఉన్నాయి. అవి గాజువలె స్వచ్ఛంగా ఉన్నాయి.
22 ఆ పట్టణంలో నాకు మందిరం కనిపించలేదు. సర్వశక్తి సంపన్నుడు, ప్రభువు అయినటువంటి దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి మందిరమై ఉన్నారు. 23 దేవుని తేజస్సు ఆ పట్టణానికి వెలుగునిస్తుంది. గొఱ్ఱెపిల్ల ఆ పట్టణానికి జ్యోతి కాబట్టి ఆ పట్టణానికి వెలుగునివ్వటానికి సూర్యచంద్రులు అవసరం లేదు.
24 జనులు ఆ వెలుగులో నడుస్తారు. ప్రపంచంలో ఉన్న రాజులు తమ ఘనతను ఆ పట్టణానికి తీసుకు వస్తారు. 25 ఆ పట్టణంలో రాత్రి అనేది ఉండదు. కనుక ఆ పట్టణం యొక్క ద్వారాలు ఎన్నటికీ మూయబడవు. 26 జనముల గౌరవము, వారి కీర్తి ఈ పట్టణానికి తేబడతాయి. 27 అపవిత్రమైనది ఆ పట్టణంలో ప్రవేశింపదు. అదే విధంగా అవమానకరమైన పనులు చేసేవాళ్ళు, మోసగాళ్ళు ఆ పట్టణంలోకి ప్రవేశించరు. గొఱ్ఱెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో వాళ్ళు మాత్రమే ప్రవేశించగలుగుతారు.
© 1997 Bible League International