Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 23

ఆరాధనలో పాల్గొనలేని మనుష్యులు

23 “ఈ వ్యక్తులు యెహోవాను ఆరాధించుటలో ఇశ్రాయేలు ప్రజల్లో భాగంగా ఉండకూడదు. వృషణాలు గాయపడినవాడు, పురుషాంగం కోసివేయబడ్డవాడు లేక వివాహం కాని తల్లిదండ్రులకు పుట్టినవాడు. ఇతని సంతతిలో ఏ వ్యక్తీ యెహోవా ప్రజల్లో భాగంగా ఉండకూడదు.

“అమ్మోనీవాడు, మోయాబువాడు యెహోవా ప్రజలకు చెందడు. వారి సంతానంలో ఎవ్వరూ, చివరికి పదో తరం వారు కూడా యెహోవా ప్రజల్లో భాగం కాజాలరు. ఎందుకంటే, మీరు ఈజిప్టునుండి వచ్చినప్పుడు మీ ప్రయాణంలో అమ్మోనీయులు, మోయాబీయులు మీకు భోజనం, నీళ్లు ఇవ్వటానికి నిరాకరించారు. మరియు మిమ్మల్ని శపించేందుకు వారు బిలాముకు డబ్బు ఇచ్చారు గనుక వారు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండజాలరు. (యరాము[a] లోని పెతోరు పట్టణపువాడైన బెయొరు కుమారుడు బిలాము.) అయితే యెహోవా దేవుడు బిలాము మాట వినకుండా నిరాకరించాడు. శాపాన్ని మీకు ఆశీర్వాదంగా యెహోవా మార్చాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుక. అమ్మోనీ ప్రజలతోగాని, మోయాబీ ప్రజలతో గాని సమాధాన పడేందుకు మీరు ఎన్నడూ ప్రయత్నించకూడదు. మీరు జీవించినంత కాలం వారితో స్నేహంగా ఉండవద్దు.

ఇశ్రాయేలీయులు అంగీకరించాల్సిన ప్రజలు

“ఎదోము వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతడు మీకు బంధువు. ఈజిప్టు వాణ్ణి మీరు ద్వేషించకూడదు. ఎందుకంటే అతని దేశంలో మీరు పరాయివారుగా ఉన్నారు. ఎదోము, ఈజిప్టు వాళ్ల మూడో తరంవారి పిల్లలు యెహోవా ప్రజల్లో భాగంగా ఉండవచ్చును.

సైన్యం పాళెమును పరిశుభ్రంగా ఉంచటం

“మీ సైన్యం మీ శత్రువుల మీదికి వెళ్లినప్పుడు, మిమ్మల్ని అపవిత్రపరచే వాటన్నింటికీ దూరంగా ఉండండి. 10 రాత్రిపూట కలలో తడిసి అపవిత్రమైన వాడు మీ మధ్య ఎవడైనా ఉంటే అతడు మీ పాళెము నుండి బయటకు వెళ్లిపోవాలి. అతడు పాళెమునుండి దూరంగా ఉండాలి. 11 అయితే సాయంకాలం అతడు స్నానంచేయాలి. సూర్యుడు అస్తమించాక అతడు పాళెములోనికి రావచ్చును.

12 “నీకు పాళెము వెలుపల బహిర్భూమిగా ఒక స్థలం ఉండాలి. 13 మరియు నీ ఆయుధాలతో పాటు ఒక కట్టె నీకు ఉండాలి; నీవు బహిర్భూమికి వెళ్లవల్సినప్పుడు ఆ కట్టెతో నీవు ఒక గుంట తవ్వుకొని తర్వాత దానిని పూడ్చివేయాలి. 14 ఎందుకంటే మిమ్మల్ని రక్షించి, మీ శ్రతువులను ఓడించటానికి మీ దేవుడైన యెహోవా మీ పాళెములో ఉన్నాడు. అందు చేత మీ పాళెము పవిత్రంగా ఉండాలి. అప్పుడు మీ మధ్యలో అపరిశుభ్రం లేదని చూసి, మీ దగ్గరనుండి వెళ్లిపోడు.

ఇతర ఆజ్ఞలు

15 “బానిస ఒకడు తన యజమాని దగ్గర్నుండి పారిపోయి నీ దగ్గరకు వస్తే, ఆ బానిసను నీవు తిరిగి అతని యజమానికి అప్పగించకూడదు. 16 ఈ బానిస నీతో, తనకు ఇష్టం వచ్చిన చోట నివసించవచ్చును. అతడు కోరుకొన్న పట్టణంలో నివసించవచ్చు. నీవు అతన్ని తొందరపెట్టకూడదు.

17 “ఇశ్రాయేలు పురుషుడేగాని, స్త్రీగాని ఎన్నటికీ ఆలయ వేశ్య కాకూడదు. 18 ఒక వేశ్య లేక పురుషగామి సంపాదించిన డబ్బును నీ దేవుడైన యెహోవా ఆలయానికి తీసుకొని రాకూడదు. దేవునికి చేసిన మొక్కు బడి చెల్లించటానికి ఎవరూ ఆ డబ్బు ఉపయోగించకూడదు. మీ దేవుడైన యెహోవాకు వ్యభిచారులు అంటే అసహ్యం.

19 “మరో ఇశ్రాయేలు వానికి నీవు డబ్బు అప్పు ఇస్తే, నీవు వడ్డీ తీసుకోకూడదు. వడ్డీ ఆర్జించిపెట్టే దేనిమీదగానీ, డబ్బు మీద, ఆహారం మీదగాని వడ్డీ వసూలు చేయవద్దు. 20 ఒక విదేశీయుని దగ్గర నీవు వడ్డీ తీసుకోవచ్చును. కానీ మరో ఇశ్రాయేలువాని దగ్గర మాత్రం నీవు వడ్డీ తీసుకోకూడదు. ఈ నియమాలు నీవు పాటిస్తే, నీవు నివసించబోయే దేశంలో నీవు చేసే వాటన్నింటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు.

21 “నీ దేవుడైన యెహోవాకు నీవు ఒక వాగ్దానం చేస్తే, నీ వాగ్దానం అంతటినీ చెల్లించేందుకు వెనుకాడవద్దు. ఎందుకంటే, నీవు దాన్ని చెల్లించాలని నీ దేవుడైన యెహోవా అడుగుతాడు. నీవు వాగ్దానం చేసినదానిని చెల్లించకపోతే అది నీకు పాపం అవుతుంది. 22 నీవు ఆ వాగ్దానం చేయకపోతే నీయందు పాపం వుండదు. 23 కానీ నీవు చేస్తానని చెప్పిన వాటిని మాత్రం నీవు చేయాలి. నీవు నీ దేవుడైన యెహోవాకు స్వచ్ఛందంగా వాగ్దానం చేసినప్పుడు, నీ వాగ్దానం ప్రకారం నీవు చేయాలి.

24 “మరొకరి ద్రాక్షా పొలంగుండా నీవు వెళ్లినప్పుడు, నీవు కోరినన్ని ద్రాక్షాపండ్లు నీవు తినవచ్చును. కానీ నీ బుట్టలో మాత్రం ద్రాక్షాపండ్లు ఏమీ వేసుకోకూడదు. 25 నీవు మరొకరి పంట పొలంలోనుంటి వెళ్లినప్పుడు నీవు నీ చేతుల్తో వెన్నులు త్రుంచుకొని తినవచ్చును. కానీ అవతలివాడి పంట తీసుకొనేందుకు నీవు కొడవలితో కోయకూడదు.

కీర్తనలు. 112-113

112 యెహోవాను స్తుతించండి.
    యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
    ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
    మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
    అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
    దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
    తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
    ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
    ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
    అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
    అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
    వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
    దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.

113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
    యెహోవా నామాన్ని స్తుతించండి.
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
    సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
    ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
    దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
    ఆయన తప్పక కిందికి చూడాలి.
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
    భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
    ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
    కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.

యెహోవాను స్తుతించండి!

యెషయా 50

పాపం చేసినందువల్ల ఇశ్రాయేలు శిక్షించబడింది

50 యెహోవా చెబుతున్నాడు:
“ఇశ్రాయేలు ప్రజలారా, మీ తల్లి యెరూషలేముకు నేను విడాకులిచ్చానని మీరంటున్నారు.
    అయితే ఆమెను నేను విడనానట్లు నిదర్శన కాయితాలు ఏయి?
నా పిల్లలారా, ఎవరికైనా నేను డబ్బు రుణం ఉన్నానా?
    అప్పు తీర్చటానికి నేను మిమ్నల్ని అమ్ముకొన్నానా?
లేదు. చూడండి, మీరు చేసిన చెడ్డ పనుల మూలంగానే నేను మిమ్మల్ని విడిచి పెట్టేసాను.
    మీ తల్లి (యెరూషలేము) చేసిన చెడ్డ పనుల వల్లనే ఆమెను నేను పంపివేశాను.
నేను ఇంటికి వచ్చాను, ఎవరూ కనబడలేదు.
    నేను పిలిచి, పిలిచి, ఎంత పిలిచినా ఎవరూ పలుక లేదు.
నేను మిమ్మల్ని రక్షించలేనని మీరు తలుస్తున్నారా?
    మీ కష్టాలనుండి మిమ్మును రక్షించే శక్తినాకు ఉంది.
చూడండి, సముద్రాన్ని ఎండి పొమ్మని నేను ఆజ్ఞాపిస్తే అది ఎండిపోతుంది!
    అక్కడ నీళ్లు ఉండవు గనుక చేపలు చస్తాయి, అవి కుళ్లిపోతాయి.
ఆకాశాన్ని నేను చీకటి కమ్మివేసేలా చేయగలను.
    విచార వస్త్రాల్లా ఆకాశం నల్లగా అవుతుంది.”

దేవుని సేవకుడు దేవుని మీద ఆధారపడతాడు

ఉపదేశం చేయగల సామర్థ్యాన్ని నా ప్రభువైన యెహోవా నాకు ఇచ్చాడు. కనుక ఈ విచారగ్రస్థ ప్రజలకు ఇప్పుడు నేను ఉపదేశము చేస్తాను. ప్రతి ఉదయం ఆయన నన్ను మేల్కొలిపి, ఒక విద్యార్థిలా నాకు ఉపదేశిస్తాడు. నేను నేర్చుకొనేందుకు నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. మరియు నేను ఆయన మీద తిరుగబడలేదు. నేను ఆయనను వెంబడించటం మానను. నేను ఆ ప్రజల్ని నన్ను కొట్టనిస్తాను. వాళ్లను నా గడ్డం పీకనిస్తాను. వాళ్లు నన్ను చెడ్డ మాటలు తిట్టి, నా మీద ఉమ్మి వేసినప్పుడు నేను నా ముఖం దాచుకోను. నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. కనుక వారు చెప్పే చెడ్డ మాటలు నాకు హాని కలిగించవు. నేను బలవంతుడనై ఉంటాను. నేను నిరాశ చెందనని నాకు తెలుసు.

యెహోవా నాతో ఉన్నాడు. నేను నిర్దోషినని ఆయనకు తెలుసును. కనుక నేను దోషినని ఎవరూ చూపించలేరు. నాదే తప్పు అని ఎవరైనా రుజువు చేయాలనుకొంటే, ఆ వ్యక్తి నా దగ్గరకు రావాలి. మేము ఒక తీర్పు జరిగిస్తాం. అయితే చూడండి, నా ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తాడు. అందుచేత నేను చెడ్డవాడినని ఎవ్వరూ చూపించలేరు. అలాంటి వాళ్లంతా పనికిమాలిన గుడ్డల్లా అవుతారు. వాటిని చెదలు తినేస్తాయి.

10 యెహోవాను గౌరవించే ప్రజలు ఆయన సేవకుని మాటకూడా వింటారు. ఆ సేవకుడు ఏం జరుగుతుందో తెలియకుండానే సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకొని జీవిస్తాడు. అతడు వాస్తవంగా యెహోవా నామాన్నే నమ్ముకొంటాడు, మరియు ఆ సేవకుడు తన దేవుని మీద ఆధారపడతాడు.

11 “ప్రజలారా, చూడండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా జీవించాలనుకొంటున్నారు. మీ మంటలను, జ్వాలలను మీరే అంటిస్తున్నారు. అలానే, మీ దారిన మీరు జీవిస్తున్నారు. కానీ మీరు శిక్షించబడతారు. మీరు మీ మంటల్లో, జ్వాలల్లో పడతారు, మీరు కాల్చివేయబడుతారు. అలా జరిగేట్టు నేను చేస్తాను.

ప్రకటన 20

వెయ్యి సంవత్సరాలు

20 పరలోకంలో నుండి ఒక దూత దిగి రావటం చూసాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది. అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు. అతడు దాన్ని పాతాళలోకంలో పడవేసి, తాళం వేసి, దాని మీద ముద్ర వేసాడు. వెయ్యి ఏండ్లు ముగిసేదాకా, అది దేశాలను మళ్ళీ మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేసాడు. ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వబడుతుంది.

నేను సింహాసనాలు చూసాను. తీర్పు చెప్పటానికి అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధించినందుకు దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు తలలు కొట్టివేయబడినవాళ్ళ ఆత్మల్ని చూసాను. వీళ్ళు మృగాన్నిగాని, దాని విగ్రహాన్ని గాని ఆరాధించ లేదు. వాళ్ళు దాని ముద్రను వాళ్ళ నొసళ్ళ మీదగాని, చేతుల మీదగాని వేయించుకోలేదు. వాళ్ళు మళ్ళీ బ్రతికి క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్లు పాలించారు. మిగతా చనిపోయినవాళ్ళు వెయ్యి ఏండ్లు పూర్తి అయ్యేదాకా బ్రతికి రాలేదు.

ఈ విధంగా చనిపోయి బ్రతికి రావటం యిది మొదటిసారి. మొదటిసారి బ్రతికి వచ్చినవాళ్ళ గుంపుకు చెందినవాళ్ళు ధన్యులు, పరిశుద్ధమైనవాళ్ళు. ఇక రెండవ మరణానికి[a] వాళ్ళపై అధికారము ఉండదు. వాళ్ళు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో సహా వెయ్యి ఏండ్లు రాజ్యం చేస్తారు.

సాతాను అపజయం పొందటం

వెయ్యి ఏండ్లు గడిచాక సాతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు. వాడు బయటకు వచ్చి దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలుమూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్ళి యుద్ధం చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ళ సంఖ్య ఉంటుంది.

వాళ్ళు భూమి నలుమూలలకు వెళ్ళి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పరలోకంలో నుండి అగ్ని కురిసి వాళ్ళను నాశనం చేసింది. 10 ఇక వాళ్ళను మోసం చేసిన సాతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు.

చనిపోయినవాళ్ళపై తీర్పు

11 తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి చూసాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారిపొయ్యాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్యమయ్యాయి. 12 నేను చనిపోయినవాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది.

13 సముద్రం తనలో చనిపోయినవాళ్ళను విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో ఉన్నవాళ్ళను విడుదల చేసింది. వాళ్ళు చేసిన వాటిని బట్టి తీర్పు చెప్పబడింది. 14 ఆ తర్వాత మృత్యువు, మృత్యులోకము మంటలు ఉన్న గుండంలో పారవేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం. 15 జీవగ్రంథంలో పేరులేనివాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International