M’Cheyne Bible Reading Plan
ఒకడు హత్య చేయబడి ఉంటే
21 “మీరు నివసించేందుకు, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఒక పొలంలో హత్య చేయబడిన వాడు ఒకడు కనబడవచ్చును. కాని ఆతణ్ణి చంపింది ఎవరో ఎవరికీ తెలియదు. 2 అప్పుడు మీ నాయకులు, న్యాయమూర్తులు బయటకు వచ్చి, చంపబడిన మనిషి చుట్టూ ఉన్న పట్టణాల దూరాన్ని కొలత వేయాలి. 3 చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, ఆ పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ ఏ పనికీ వినియోగించబడనిది కావాలి. 4 అప్పుడు ఆ పట్టణపు నాయకుడు, నీరు ప్రవహిస్తున్న ఒక లోయలోనికి ఆ ఆవును తీసుకొని రావాలి. ఆ లోయ ఇదివరకు ఎన్నడూ దున్ననిది, మొక్కలు నాటనిదిగా ఉండాలి. అప్పుడు నాయకులు ఆ లోయలో ఆవు మెడను విరుగగొట్టాలి. 5 లేవీ సంతతివారు యాజకులుకూడ అక్కడికి వెళ్లాలి. (యెహోవాను సేవించేందుకు, ఆయన పేరిట ప్రజలను దీవించేందుకు మీ దేవుడైన యెహోవా ఈ యాజకులను ఏర్పాటు చేసుకొన్నాడు. వివాదానికి సంబంధించిన ప్రతి విషయంలో న్యాయం ఎవరిదో యాజకులే నిర్ణయిస్తారు.) 6 ఆ శవానికి అతి సమీపంగా ఉన్న పట్టణపు నాయకులంతా, లోయలో మెడ విరుగగొట్టబడిన ఆవుమీద వారి చేతులు కడుగుకోవాలి. 7 ఈ నాయకులు ఇలా చెప్పాలి, ‘ఈ మనిషిని మేము చంపలేదు. అది జరగటం మేము చూడలేదు. 8 యెహోవా, నీవు విమోచించిన నీ ఇశ్రాయేలు ప్రజలను క్షమించు. నీ ప్రజల్లో నిర్దోషిని ఎవరినీ నిందించబడనీయకు.’ అప్పుడు ఆ హత్య నిమిత్తం వారు నిందించబడరు. 9 అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయటమే మీకు సరి. అలా చేయటం ద్వారా నిర్దోషులు ఎవరి హత్యనుగూర్చీ నిందించబడరు.
యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలు
10 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేస్తారు, మీరు వారిని ఓడించేటట్టు మీ దేవుడైన యెహోవా చేస్తాడు. అప్పుడు మీరు మీ శత్రువులను బందీలుగా కొనిపోతారు. 11 ఆ బందీలలో అందమైన ఒక స్త్రీని నీవు చూడవచ్చు. నీవు ఆమెను వాంఛించి, నీ భార్యగా చేసుకోవాలని తలంచవచ్చు. 12 అప్పుడు నీవు ఆమెను నీ ఇంటికి తీసుకొని రావాలి. ఆమె తన తల గొరిగించుకొని, గోళ్లు కత్తిరించుకోవాలి. 13 ఆమె ధరించి ఉన్న బట్టలు తీసివేయాలి. ఆమె నీ ఇంటనే ఉండి తన తల్లిదండ్రుల కోసం నెల రోజులు విలపించాలి, ఆ తర్వాత నీవు ఆమె దగ్గరికి పోవచ్చును. ఆమెకు భర్తవు కావచ్చును. ఆమె నీకు భార్య అవుతుంది. 14 కాని ఆమె వలన నీకు సంతృప్తి కలుగకపోతే, తనకు ఇష్టంవచ్చిన చోటికి నీవు ఆమెను పోనివ్వాలి. ఆయితే నీవు ఆమెను అమ్మకూడదు. నీవు ఆమెను బానిసగా చూడరాదు. ఎందుకంటే నీ వలన ఆమెకు అవమానము కలిగింది గనుక.
జ్యేష్ఠ కుమారడు
15 “ఒక పురుషునికి ఇద్దరు భార్యలు ఉండి, వారిలో ఒకదానికంటె మరొక దానిని అతడు ఎక్కువగా ప్రేమిస్తూ ఉండవచ్చును. ఆ ఇద్దరు భార్యలూ అతనికి పిల్లలను కనవచ్చును. అతడు ప్రేమించని భార్యకు పుట్టిన బిడ్డ మొదటి బిడ్డ కావచ్చును. 16 అతడు తన ఆస్తిని తన పిల్లలకు పంచి ఇచ్చేటప్పుడు జ్యేష్ఠునికి చెందిన ప్రత్యేకమైనవాటిని, తాను ప్రేమించే భార్య కుమారునికి అతడు ఇచ్చివేయకూడదు. 17 తన ప్రేమకు పాత్రము కాని మొదటి భార్య బిడ్డను అతడు స్వీకరించాలి. అతడు అన్నింటిలో రెండంతల భాగం మొదటి కుమారునికి ఇవ్వాలి. ఎందుకంటే, ఆ బిడ్డ అతని మొదటి బిడ్డ గనుక. ప్రథమ సంతానం హక్కు ఆ బిడ్డకే చెందుతుంది.
లోబడేందుకు తిరస్కరించే కుమారులు
18 “ఒకని కుమారుడు మొండివాడు, లోబడడు. ఈ కుమారుడు తండ్రికి గాని తల్లికి గాని విధేయుడు కాడు. తల్లిదండ్రులు ఆ కుమారుని శిక్షిస్తారు. అయినప్పటికీ వారి మాట అతడు నిరాకరిస్తాడు. 19 అప్పుడు పట్టణ సమావేశ స్థలం దగ్గర ఉండే ఆ పట్టణ నాయకుల దగ్గరకు ఆ తల్లిదండ్రులు వానిని తీసుకొని వెళ్లాలి. 20 ఆ పట్టణ నాయకులతో వారు ఇలా చెప్పాలి: ‘మా కుమారుడు మొండివాడు, లోబడటం లేదు. మేము చెప్పిన ఏ పనీ అతడు చేయడు. వాడు విపరీతంగా తిని, తాగుతున్నాడు.’ 21 అప్పుడు ఆ పట్టణంలోని మనుష్యులు ఆ కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇలా చేయటం ద్వారా ఈ చెడుతనాన్ని మీ నుండి తొలగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలంతా దీనిగూర్చి విని భయపడతారు.
నేరస్థులు చంపబడి చెట్టుకు వ్రేలాడదీయబడటం
22 “ఒక వ్యక్తి మరణ శిక్షకు యోగ్యమైన పాపం చేసి నేరస్థుడు కావచ్చును. అతణ్ణి చంపేసిన తర్వాత అతని శవాన్ని ఒక చెట్టుకు వేలాడదీయాలి. 23 అలా జరిగినప్పుడు అతని శవం రాత్రి అంతా చెట్టుకు ఉండకూడదు. ఆ మనిషిని మీరు ఆ రోజే తప్పక సమాధి చేయాలి. ఎందుకంటే, చెట్టుమీద వేలాడే మనిషి దేవుని చేత శపించబడ్డాడు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని మీరు పాడు చేయకూడదు.
దావీదు స్తుతి కీర్తన
108 దేవా, నా హృదయం, నా ఆత్మ నిశ్చలముగాఉన్నాయి.
నేను పాడుటకు, స్తుతి కీర్తనలు
వాయించుటకు సిద్ధంగా ఉన్నాను.
2 స్వర మండలములారా, సితారలారా,
మనం సూర్యున్ని[a] మేల్కొలుపుదాం
3 యెహోవా, ఆయా జనములలో మేము నిన్ను స్తుతిస్తాము.
ఇతర ప్రజల మధ్య మేము నిన్ను స్తుతిస్తాము.
4 యెహోవా, నీ ప్రేమ ఆకాశాల కన్న ఉన్నతమైనది. నీ నిజమైన ప్రేమ మహా ఎత్తయిన మేఘాల కన్న ఉన్నతమైనది.
నీ సత్యం ఆకాశాలవరకు కూడా చేరుకున్నది.
5 దేవా, ఆకాశాలకు పైగా లెమ్ము!
సర్వ ప్రపంచం నీ మహిమను చూడనిమ్ము.
6 దేవా, నీకిష్టులైనవారిని రక్షించుము.
నా ప్రార్థనకు జవాబు ఇచ్చి నాకు సహాయం చేయుము.
7 యెహోవా తన ఆలయము నుండి[b] మాట్లాడి యిలా చెప్పాడు,
“యుద్ధంలో నేను గెలుస్తాను! ఆ గెలుపును బట్టి సంతోషంగా ఉంటాను.
(ఈ భూమిని నా ప్రజలకు విభాగించి ఇస్తాను)
నా ప్రజలకు షెకెమును ఇస్తాను.
వారికి సుక్కోతులోయను ఇస్తాను.
8 గిలాదు, మనష్షే నావి.
ఎఫ్రాయిము నా శిరస్త్రాణం.
యూదా నా రాజదండం.
9 మోయాబు నా పాదాలు కడుగుకొనే పళ్లెం.
ఎదోము నా చెప్పులు మోసే బానిస.
ఫిలిష్తీయులను జయించాక నేను విజయంతో కేకలు వేస్తాను.”
10 శత్రు దుర్గములోనికి నన్ను ఎవరు నడిపిస్తారు?
ఎదోమును జయించటానికి నాకు ఎవరు సహాయం చేస్తారు?
11 దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టేశావని మా సైన్యంతో
నీవు వెళ్లవు అని అనటం నిజమేనా?
12 దేవా, మా శత్రువును ఓడించుటకు దయచేసి మాకు సహాయం చేయుము
మనుష్యులు మాకు సహాయం చేయలేరు!
13 దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు.
దేవుడు మాత్రమే మా శత్రువులను ఓడించగలడు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
109 దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు.
2 దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబుతున్నారు.
నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబుతున్నారు.
3 ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబుతున్నారు.
ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు.
4 నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు.
కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను.
5 ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను.
కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు.
నేను వారిని ప్రేమించాను.
కాని వారు నన్ను ద్వేషించారు.
6 నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము.
వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము.
7 నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము.
నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము.
8 నా శత్రువును త్వరగా చావనిమ్ము.
నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక!
9 నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక!
10 వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక!
11 నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము.
అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము.
12 నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ.
13 నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము.
తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక.
14 నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను
యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
15 ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ.
ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ.
16 ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు.
అతడు ఎన్నడూ ఎవరిని ప్రేమించలేదు.
అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టతరం చేసాడు.
17 ప్రజలకు సంభవించే చెడు సంగతులు, శాపము చూడటానికి ఆ దుర్మార్గునికి ఎంతో ఇష్టం.
కనుక ఆ చెడు సంగతులు అతనికే సంభవించనిమ్ము.
ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు.
కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము.
18 శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము.
దుర్మార్గులు త్రాగేందుకు శాపాలే నీళ్లుగా ఉండనిమ్ము
శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము.
19 శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము.
శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము.
20 నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను.
21 యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు.
నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము.
22 నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని,
నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది.
23 దినాంతంలో దీర్ఘ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనిపిస్తుంది.
ఎవరో నలిపివేసిన నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది.
24 నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి.
నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను.
25 చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు.
వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు.
26 దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము!
నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము.
27 అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు.
28 ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు.
వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము.
అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను.
29 నా శత్రువులను ఇబ్బంది పెట్టుము!
వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము.
30 యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను.
31 ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు.
వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు.
దేవుడు తన ప్రపంచాన్ని పాలిస్తాడు
48 యెహోవా చెబుతున్నాడు: “యాకోబు వంశమా, నా మాట విను!
మిమ్మల్ని మీరు ‘ఇశ్రాయేలు’ అని చెప్పుకొంటారు.
మీరు యూదా వంశస్థులు.
ప్రమాణాలు చేయటానికి మీరు యెహోవా నామం ప్రయోగిస్తారు. ఇశ్రాయేలు దేవుణ్ణి మీరు స్తుతిస్తారు.
కానీ ఈ సంగతులను మీరు చేస్తున్నప్పుడు మీరు నమ్మకంగా ఉండరు.”
2 ప్రజలారా, పవిత్ర పట్టణంలో సభ్యులని మీరు పిలువబడుతున్నారు.
ఇశ్రాయేలు దేవుని మీద మీరు ఆధారపడుతున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఆయన పేరు.
3 “జరుగబోయే సంగతులను గూర్చి చాలా కాలం క్రిందట నేను మీకు చెప్పాను.
వాటిని గూర్చి నేను మీకు చెప్పాను.
అకస్మాత్తుగా ఆ సంగతులు సంభవించేట్టు నేను చేశాను.
4 మీరు మొండివాళ్లని నాకు తెలుసు గనుక నేను అలా చేశాను.
నేను చెప్పిన ప్రతిది మీరు నమ్మటానికి నిరాకరించారు.
వంగని ఇనుములా మీరు చాలా మొండివాళ్లు. మీ తల ఇత్తడితో చేసినట్టుగా ఉంది.
5 కనుక జరుగబోయే సంగతులను గూర్చి నేను మీతో చెప్పాను.
ఆ సంగతులు జరుగకముందే చాలాకాలం క్రిందటనే నేను మీకు చెప్పాను.
‘మా స్వంత శక్తితో మేమే వీటిని చేశాము’ అని మీరు చెప్పకుండా నేనిలా చేశాను.
‘మా ప్రతిమలు-విగ్రహాలే వీటిని జరిగించాయి’
అని మీరు చెప్పకుండా ఉండాలనే నేను ఇలా చేసాను.”
ఇశ్రాయేలీయులను పవిత్రం చేసేందుకు దేవుడు వారిని శిక్షించటం
6 “జరిగిన సంగతులన్నింటినీ మీరు చూశారు, విన్నారు
గనుక మీరు ఇతరులకు ఈ వార్త చెప్పాలి.
మీకు ఇంకా తెలియని క్రొత్త సంగతులను
ఇప్పుడు నేను మీకు చెబుతాను.
7 ఇవి చాలాకాలం క్రిందట జరిగిపోయిన సంగతులు కావు. ఇవి ఇప్పుడు సంభవించటం మొదలైన సంగతులు.
ఈ సంగతులను గూర్చి ఈ వేళకు ముందు మీరు ఎన్నడూ వినలేదు.
అందుచేత ‘అది మాకు ముందే తెలుసు’ అని మీరు చెప్పజాలరు.
8 కానీ భవిష్యత్తులో ఏమి జరుగబోతుందో అది నేను మీకు చెప్పినప్పటికీ మీరు ఇంకా నా మాట వినేందుకు నిరాకరిస్తారు.
మీరు నేర్చు కొనేది శూన్యం.
నేను మీకు చెప్పింది ఎన్నడూ ఏదీ మీరు వినలేదు.
మీరు నాకు వ్యతిరేకంగా ఉంటారని మొదట్నుండి నాకు తెలుసు. మీరు
పుట్టినప్పట్నుండి తప్పుడు పనులే చేశారు.
9 “కానీ నేను ఓపిగ్గా ఉంటాను.
నా కోసమే నేను ఇలా చేస్తాను.
నేను కోపగించి మిమ్మల్ని నాశనం చేయనందుకు ప్రజలు నన్ను స్తుతిస్తారు.
సహించినందుకు మీరూ నన్ను స్తుతిస్తారు.
10 “చూడండి, నేను మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
వెండిని పవిత్రం చేసేందుకు ప్రజలు వేడినిప్పును ప్రయోగిస్తారు.
కానీ నేను మీకు కష్టాలు కలిగించటం ద్వారా మిమ్మల్ని పవిత్రం చేస్తాను.
11 నా కోసం, నా కోసమే నేను ఇలా చేస్తాను.
ప్రాముఖ్యం లేనివానిగా మీరు నన్ను చేయలేరు.
నా మహిమ, స్తుతులను ఎవరో తప్పుడు దేవతలను నేను తీసుకోనివ్వను.
12 “యాకోబూ, నా మాట విను!
ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నా ప్రజలుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను.
కనుక నా మాట వినండి.
నేనే ఆది, నేనే అంతం.
13 నా స్వహస్తాలతో (శక్తితో) నేనే భూమిని చేశాను.
ఆకాశాన్ని నా కుడి హస్తం చేసింది.
మరియు నేను గనుక వాటిని పిలిస్తే
అవి కలిసి నా ఎదుటికి వస్తాయి.
14 “కనుక మీరంతా సమావేశమై, నా మాట వినండి!
ఈ సంగతులు జరుగుతాయని తప్పుడు దేవుళ్లలో ఏదైనా చెప్పిందా? లేదు.
యెహోవా ఇశ్రాయేలును ప్రేమిస్తున్నాడు.
బబులోను, కల్దీయులకు యెహోవా ఏమి చేయాలనుకొంటే అది చేస్తాడు.
15 “యెహోవా చెబుతున్నాడు, నేను అతన్ని[a] పిలుస్తానని నేను మీతో చెప్పాను.
మరియు నేను అతణ్ణి తీసుకొని వస్తాను.
అతడు జయించేట్టు నేను చేస్తాను.
16 నా దగ్గరకు వచ్చి, నా మాట వినండి.
ప్రజలు నా మాట వినగలుగునట్లు
మొదటనుంచి నేను తేటగా మాట్లాడాను.
బబులోను ఒక దేశంగా ప్రారంభమయినప్పుడు నేను అక్కడ ఉన్నాను.”
అంతట యెషయా, “ఇప్పుడు ఈ సంగతులు, ఆయన ఆత్మను మీతో చెప్పేందుకు నా ప్రభువైన యెహోవా నన్ను పంపుతున్నాడు” అని అన్నాడు. 17 ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, రక్షకుడు, యెహోవా చెబుతున్నాడు,
“నేనే మీ దేవుణ్ణి, యెహోవాను.
మంచి పనులు చేయమని నేను మీకు ఉపదేశిస్తాను.
మీరు నడవాల్సిన మార్గంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను.
18 మీరు నాకు విధేయులై ఉంటే
అప్పుడు మీకు నిండుగా ప్రవహిస్తోన్న
నదివలె శాంతి లభించి ఉండేది.
సముద్ర తరంగాల్లా మంచివి మీ వద్దకు ప్రవహించి ఉండేవి.
19 మీరు నాకు విధేయులై ఉంటే,
అప్పుడు మీకు ఎంతోమంది పిల్లలు పుట్టి ఉండేవారు. వాళ్లు ఇసుక రేణువులంత మంది ఉండేవాళ్లు.
మీరు నాకు విధేయులై ఉంటే, అప్పుడు మీరు నాశనం చేయబడి ఉండేవాళ్లు కాదు.
మీరు నాతోనే కొనసాగి ఉండేవాళ్లు.”
20 నా ప్రజలారా, బబులోను విడిచిపెట్టండి.
నా ప్రజలారా, కల్దీయుల దగ్గర్నుండి పారిపొండి.
ఈ వార్త సంతోషంగా ప్రజలకు చెప్పండి.
భూమిమీద దూర ప్రాంతాల వరకు ఈ వార్త వ్యాపింపచేయండి. ప్రజలతో
ఇలా చెప్పండి: “యెహోవా తన సేవకుడు యాకోబును విమోచించాడు!
21 యెహోవా తన ప్రజలను అరణ్యంలో నడిపించాడు. ఆ ప్రజలు ఎన్నడూ దప్పిగొనలేదు.
ఎందుకంటే, ఆయన తన ప్రజలకోసం బండనుండి నీళ్లు ప్రవహింపజేశాడు గనుక.
ఆయన బండను చీల్చాడు.
నీళ్లు ప్రవహించాయి.”
22 కానీ “చెడ్డ వారికి శాంతి లేదు”
అని యెహోవా చెబుతున్నాడు.
బాబిలోను పతనము
18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. 2 అతడు బిగ్గరగా యిలా అన్నాడు:
“బాబిలోను మహానగరం
కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
అది సంచరించు స్థలమైంది.
3 దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”
4 ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:
“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
5 దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
6 అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
7 ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
నేను ఎన్నటికీ వితంతువును కాను.
నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
8 అందువల్ల చావు, దుఃఖము, కరువు,
తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.
9 “దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
శక్తివంతమైన బాబిలోను నగరమా!
ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’
అని విలపిస్తారు.
11 “ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు. 12 వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు, 13 దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు. 14 వాళ్ళు,
‘నీవు కోరిన ఫలము దొరకలేదు.
నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపొయ్యాయి.
అవి మళ్ళీ రావు’
అని అన్నారు.
15 “వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. 16 వాళ్ళు,
‘అయ్యో! అయ్యో! సున్నితమైన వస్త్రాల్ని,
ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా!
బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన
నగలు ధరించిన మహానగరమా!
17 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే!’
అని విలపిస్తారు.
“ప్రతి నావికాధికారి, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు. 18 ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు. 19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ,
‘అయ్యో! అయ్యో! మహానగరమా!
సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే!
ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు!
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి.
అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”
అని అంటారు.
21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు:
“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది.
అది మళ్ళీ కనిపించదు.
22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు.
పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు.
తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు.
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు.
నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు.
నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.
24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది.
ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”
© 1997 Bible League International