M’Cheyne Bible Reading Plan
యుద్ధ నియమాలు
20 “మీరు మీ శత్రువులతో యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు, మీకంటె ఎక్కువ గుర్రాలు, రథాలు, మనుష్యులు కనబడితే మీరు వారిని గూర్చి భయపడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీతో ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొని వచ్చాడు.
2 “యుద్ధానికి మీరు దగ్గరగా వెళ్లినప్పుడు యాజకుడు సైనికుల దగ్గరకు వెళ్లి, వారితో మాట్లాడాలి. 3 యాజకుడు ఇలా చెప్పాలి, ‘ఇశ్రాయేలు మనుష్యులారా నా మాట వినండి. ఈవేళ మీరు మీ శ్రతువులతో యుద్ధానికి వెళ్తున్నారు. మీ ధైర్యం విడువవద్దు. కలవరపడవద్దు. శత్రువునుగూర్చి భయపడవద్దు. 4 ఎందుకంటే మీ పక్షంగా మీ శత్రువులతో పోరాడేందుకు మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు. మీ దేవుడైన యెహోవా మీరు విజయం పొందేటట్లు సహాయం చేస్తాడు.’
5 “లేవీ అధికారులు సైనికులతో ఇలా చెప్పాలి: ‘కొత్త ఇల్లు కట్టుకొని దానిని ఇంకా ప్రతిష్ఠించనివారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అలాంటివాడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోవాలి. అతడు యుద్ధంలో చంపబడతాడేమో. అలాంటప్పుడు మరో మనిషి అతని ఇంటిని ప్రతిష్ఠిస్తాడు. 6 ద్రాక్షాతోటను నాటి, ఇంకా ద్రాక్షాపండ్లు కూర్చుకొననివాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. ఆ మనిషి యుద్ధంలో మరణిస్తే, అప్పుడు అతని పొలంలోని ఫలాలను మరొకడు అనుభవిస్తాడు. 7 వివాహం కోసం ప్రధానం జరిగినవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ మనిషి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలి. యుద్ధంలో అతడు మరణిస్తే, అతనికి ప్రధానం చేయబడిన స్త్రీని మరొకడు వివాహం చేసుకొంటాడు.’
8 “ఆ లేవీ అధికారులు ప్రజలతో ఇంకా ఇలా చెప్పాలి. ‘ధైర్యం పోయి, భయపడ్తున్నవాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అతడు తిరిగి ఇంటికి వెళ్లాలి. అప్పుడు అతడు మిగిలిన సైనికులుకూడా ధైర్యం కోల్పోయేటట్టు చేయకుండా ఉంటాడు.’ 9 తర్వాత అధికారులు సైన్యంతో మాట్లాడటం అయిపోయిన తర్వాత, సైన్యాన్ని నడిపించేందుకు సేనాధిపతులను వారు నియమించాలి.
10 “మీరు ఒక పట్టణం మీద దాడి చేయక ముందు అక్కడి ప్రజలకు మీరు శాంతి రాయబారం పంపించాలి. 11 మీ రాయబారాన్ని వారు అంగీకరించి, వారి గుమ్మాలు తెరచినట్లయితే ఆ పట్టణంలోని ప్రజలంతా మీకు కప్పం కట్టేవాళ్లవుతారు. మీకు బానిసలై మీకు పని చేయవలసివస్తారు. 12 అయితే ఆ పట్టణం మీతో సమాధానపడేందుకు నిరాకరించి మీతో పోరాడితే అప్పుడు మీరు ఆ పట్టణాన్ని చుట్టుముట్టాలి. 13 మరియు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆ పట్టణం స్వాధీనం చేసుకోనిచ్చినప్పుడు, మీరు దానిలోని పురుషులందరినీ చంపివేయాలి. 14 ఆయితే ఆ పట్టణంలోని స్త్రీలను, పిల్లలను, పశువులను, మిగిలిన సమస్తం మీరు తీసుకోవచ్చును. మీ దేవుడైన యెహోవా వీటిని మీకు ఇచ్చాడు. 15 మీరు నివసించబోయే దేశంలోగాక, మీకు దూరంగా ఉన్న పట్టణాలన్నింటికీ మీరు అలాగే చేయాలి.
16 “ఆయితే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలోని పట్టణాలను మీరు స్వాధీనం చేసుకొన్నప్పుడు ప్రతి ఒక్కరినీ మీరు చంపేయాలి. 17 హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు, మొత్తం ప్రజలందరినీ పూర్తిగా మీరు నాశనం చేయాలి. మీరు ఇలా చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించాడు. 18 ఎందుకంటే అలా చేస్తే, మీరు మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయమని వారు మీకు నేర్పించజాలరు. వారు వారి దేవుళ్లను పూజించేటప్పుడు చేసే భయంకర పనులు ఏవీ వారు మీకు నేర్పించరు.
19 “మీరు ఒక పట్టణం మీద యుద్ధం చేస్తుంటే, చాలా కాలంవరకు మీరు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేసి ఉండవచ్చు. ఆ పట్టణం చుట్టూ ఉండే ఫలవృక్షాలను మీరు నరికి వేయకూడదు. ఆ చెట్ల ఫలాలు మీరు తినవచ్చును గాని ఆ చెట్లను నరికి వేయకూడదు. ఈ చెట్లు మీ శత్రువులు కాదు, అందుచేత వాటితో యుద్ధం చేయవద్దు. 20 ఆయితే ఫలాలు ఇవ్వని చెట్లు అని మీకు తెలిసిన వాటిని మీరు నరికివేయ వచ్చును. ఆ పట్టణం మీద యుద్ధం చేయటానికి అవసరమైన ఆయుధాలను తయారు చేసేందుకు ఈ చెట్లను మీరు ఉపయోగించ వచ్చును. ఆ పట్టణం పతనం ఆయ్యేంత వరకు మీరు వాటిని ఉపయోగించవచ్చును.
అయిదవ భాగం
(కీర్తనలు 107–150)
107 యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
ఆయన ప్రేమ శాశ్వతం.
2 యెహోవా రక్షించిన ప్రతి మనిషి ఆ మాటలు చెప్పాలి.
వారి శత్రువుల నుండి యెహోవా రక్షించిన ప్రతి మనిషీ ఆయనను స్తుతించాలి.
3 అనేక దేశాల నుండి యెహోవా తన ప్రజలను ఒక్కచోట సమావేశపర్చాడు.
తూర్పు పడమరల నుండి, ఉత్తర దక్షిణాల[a] నుండి ఆయన వారిని తీసుకొని వచ్చాడు.
4 ప్రజల్లో కొందరు ఎండిన ఎడారిలో సంచరించారు.
వారు నివసించుటకు ఒక పట్టణంకోసం ఆ ప్రజలు వెదకుచుండిరి.
కాని వారికి ఒక్కపట్టణం కూడా దొరకలేదు.
5 ఆ ప్రజలు ఆకలితో, దాహంతో ఉండి
బలహీనం అయ్యారు.
6 అప్పుడు వారు సహాయం కోసం ఏడ్చి, యెహోవాకు మొరపెట్టి వేడుకొన్నారు.
యెహోవా ఆ ప్రజలను వారి కష్టాలన్నింటి నుండి రక్షించాడు.
7 ఆ ప్రజలు ఏ పట్టణంలో నివసించాలో సరిగ్గా ఆ పట్టణానికే దేవుడు ఆ ప్రజలను నడిపించాడు.
8 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెప్పండి!
ప్రజల కోసం, దేవుడు చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
9 దాహంతో ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు.
ఆకలితో ఉన్న ప్రాణాన్ని మంచి పదార్థాలతో దేవుడు నింపుతాడు.
10 దేవుని ప్రజల్లో కొందరు కటిక చీకటి కారాగారాల్లో
బంధింపబడి ఖైదీలుగా ఉన్నారు.
11 ఎందుకంటే దేవుడు చెప్పిన విషయాలకు ఆ ప్రజలు విరోధంగా పోరాడారు.
సర్వోన్నతుడైన దేవుని సలహా వినుటకు వారు నిరాకరించారు.
12 ఆ ప్రజలు చేసిన పనుల మూలంగా
దేవుడు వారికి జీవితాన్ని కష్టతరం చేశాడు.
వారు తొట్రిల్లి, పడిపోయారు.
మరి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేకపోయారు.
13 ఆ ప్రజలు కష్టంలో ఉన్నారు; కనుక వారు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నారు.
వారి కష్టాలనుండి యెహోవా వారిని రక్షించాడు.
14 దేవుడు వాళ్లను వారి కటిక చీకటి కారాగారాలనుండి బయటకు రప్పించాడు.
మరియు వారు బంధించబడిన తాళ్లను దేవుడు తెంచివేసాడు.
15 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం ఆయన చేసే ఆశ్చర్య కార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
16 దేవా, మా శత్రువులను ఓడించుటకు మాకు సహాయం చేయుము.
వారి ఇత్తడి తలుపులను దేవుడు పగులగొట్టగలడు.
వారి ద్వారాల మీది ఇనుప గడియలను దేవుడు చితకగొట్టగలడు.
17 కొందరు ప్రజలు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా తెలివితక్కువ వాళ్లయ్యారు.
మరియు వారి పాపాలవల్ల కష్టాన్ని అనుభవించారు.
18 ఆ మనుష్యులు తినటానికి నిరాకరించారు,
వారు చావుకు సమీపించారు.
19 వారు కష్టంలో ఉన్నారు, అందుచేత సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు.
యెహోవా వారిని వారి కష్టాల నుండి రక్షించాడు.
20 దేవుడు ఆజ్ఞ ఇచ్చి, ప్రజలను స్వస్థపర్చాడు.
కనుక ఆ ప్రజలు సమాధి నుండి రక్షించబడ్డారు.
21 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
22 యెహోవా చేసిన వాటన్నింటికీ కృతజ్ఞతగా ఆయనకు బలులు అర్పించండి.
యెహోవా చేసిన పనులను గూర్చి సంతోషంగా చెప్పండి.
23 కొందరు ఓడలో సముద్రం మీద ప్రయాణం చేశారు.
వారు సముద్రాల మీద వ్యాపారం చేశారు.
24 ఆ ప్రజలు యెహోవా చేయగలిగిన సంగతులను చూశారు.
సముద్రం మీద యెహోవా చేసిన ఆశ్చర్యకార్యాలను వారు చూశారు.
25 దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, బలమైన గాలి వీచటం మొదలయింది.
అలలు అంతకంతకు పెద్దవయ్యాయి.
26 అలలు ఆకాశమంత ఎత్తు లేస్తున్నాయి.
తుఫాను మహా ప్రమాదకరంగా ఉండటంచేత మనుష్యులు ధైర్యాన్ని కోల్పోయారు.
27 ఆ మనుష్యులు తూలిపోతూ, తాగుబోతుల్లా పడిపోతున్నారు.
నావికులుగా వారి నైపుణ్యం నిష్ప్రయోజనం.
28 వారు చిక్కులో పడ్డారు. అందుచేత సహాయం కోసం వారు యెహోవాకు మొర పెట్టారు.
మరియు యెహోవా వారిని వారి కష్టాల్లోనుంచి రక్షించాడు.
29 దేవుడు తుఫానును ఆపివేసి,
అలలను నెమ్మది పర్చాడు.
30 సముద్రం నిమ్మళించినందుకు నావికులు సంతోషించారు.
వారు వెళ్లాల్సిన స్థలానికి దేవుడు వారిని క్షేమంగా నడిపించాడు.
31 యెహోవా ప్రేమకోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
ప్రజలకోసం యెహోవా చేసే ఆశ్చర్యకార్యాల కోసం ఆయనకు వందనాలు చెల్లించండి.
32 మహా సమాజంలో యెహోవాను స్తుతించండి.
పెద్దలు సమావేశమైనప్పుడు ఆయనను స్తుతించండి.
33 దేవుడు నదులను ఎడారిగా మార్చాడు.
నీటి ఊటలు ప్రవహించకుండా ఆయన నిలిపివేశాడు.
34 సారవంతమైన భూమిని పనికిమాలిన ఉప్పు భూమిగా దేవుడు మార్చాడు.
ఎందుకంటే, అక్కడ నివసిస్తున్న ప్రజలు చేసిన చెడ్డపనులవల్లనే.
35 దేవుడు ఎడారిని సరస్సులుగల దేశంగా మార్చాడు.
ఎండిన భూమి నుండి నీటి ఊటలు ప్రవహించేలా చేశాడు.
36 దేవుడు ఆకలితో ఉన్న ప్రజలను ఆ మంచి దేశానికి నడిపించాడు.
ఆ ప్రజలు నివాసం ఉండుటకు ఒక పట్టణాన్ని నిర్మించాడు.
37 ఆ ప్రజలు వారి పొలాల్లో విత్తనాలు చల్లారు. పొలంలో ద్రాక్షలు వారు నాటారు.
వారికి మంచి పంట వచ్చింది.
38 దేవుడు ఆ ప్రజలను ఆశీర్వదించాడు. వారి కుటుంబాలు పెద్దవయ్యాయి.
వారికి ఎన్నెన్నో పశువులు ఉన్నాయి.
39 విపత్తు, కష్టాల మూలంగా వారి కుటుంబాలు
చిన్నవిగా బలహీనంగా ఉన్నాయి.
40 దేవుడు వారి నాయకులను ఇబ్బంది పెట్టి అవమానించాడు.
బాటలు లేని ఎడారిలో దేవుడు వారిని తిరుగులాడనిచ్చాడు.
41 అయితే, అప్పుడు దేవుడు ఆ పేద ప్రజలను వారి దౌర్భాగ్యం నుండి తప్పించాడు.
ఇప్పుడు వారి కుటుంబాలు గొర్రెల మందల్లా పెద్దవిగా ఉన్నాయి.
42 మంచి మనుష్యులు యిది చూచి సంతోషిస్తారు.
కాని దుర్మార్గులు యిది చూచి ఏమి చెప్పాలో తెలియక ఉంటారు.
43 ఒక వ్యక్తి తెలివిగలవాడైతే ఈ సంగతులను జ్ఞాపకం ఉంచుకొంటాడు.
ఒక వ్యక్తి తెలివిగలవాడైతే నిజంగా దేవుని ప్రేమ అంటే ఏమిటో గ్రహిస్తాడు.
బబులోనుకు దేవుని సందేశం
47 “కల్దీయుల కుమారీ, కన్యకా
మట్టిలో పడి, అక్కడే కూర్చో. నేల మీద కూర్చో.
ఇప్పుడు నీవు పరిపాలించటం లేదు.
ప్రజలు ఇంక నిన్ను చక్కనిదానా అని, అందగత్తె అని పిలువరు.
2 ఇప్పుడు నీవు కష్టపడి పనిచేయాలి. అందమైన నీపై వస్త్రాలు తీసివేయి. తిరుగటి రాళ్లు తీసుకొని పిండి విసురు. మనుష్యులకు నీ కాళ్లు కనబడేంతమట్టుకు నీ పైవస్త్రం లేపి నదులు దాటు. నీ దేశాన్ని విడిచిపెట్టు.
3 మనుష్యులు నీ శరీరాన్ని చూస్తారు.
మనుష్యులు నిన్ను లైంగికంగా వాడుకొంటారు. నీవు చేసిన చెడ్డ పనులకు నీచేత నేను విలువ కట్టిస్తాను. మరియు ఎవ్వడూ వచ్చి నీకు సహాయం చేయడు.
4 “‘దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు.
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్దుడు’” అని నా ప్రజలు అంటారు.
5 “అందుచేత బబులోనూ, నీవు మౌనంగా కూర్చోవాలి.
కల్దీయుల కుమారీ[a] చీకట్లోనికి వెళ్లు
ఎందుకంటే నీవు ఇక మీదట ‘రాజ్యాలకు యజమానురాలివి’ కావు.
6 “నేను నా ప్రజల మీద కోపగించాను.
ఈ ప్రజలు నావాళ్లే కానీ నేను కోపగించాను, అందుచేత నేను వాళ్లకు ప్రాముఖ్యం లేకుండా చేశాను.
నేను వాళ్లను నీకు అప్పగించాను. నీవు వారిని శిక్షించావు.
నీవు వారికి ఎలాంటి దయా చూపించలేదు.
వాళ్లు ముసలి వాళ్ల కోసం
చాలా కష్టపడి పనిచేసేట్టు నీవు చేశావు.
7 ‘నేను శాశ్వతంగా జీవిస్తాను.
శాశ్వతంగా నేను రాణిగానే ఉంటాను’ అని నీవు చెప్పావు.
నీవు ఆ ప్రజలకు చేసిన చెడు కార్యాలను నీవు గమనించలేదు.
ఏమి జరుగుతుందో అని నీవు గమనించలేదు.
8 కనుక ‘అందమైన అమ్మాయీ’, ఇప్పుడు నా మాట విను.
నీవు క్షేమంగానే ఉన్నావు అనుకొంటున్నావు.
‘నేను ఒక్కదాన్నే ప్రాముఖ్యమైన దాన్ని, ఇంకెవ్వరూ నా అంతటి ప్రముఖులు కారు.
నేను ఎప్పటికీ విధవనుకాను. నాకు ఎల్లప్పుడూ పిల్లలు ఉంటారు’ అని నీలోనీవు అనుకొంటున్నావు.
9 నీకు ఈ రెండు సంగతులు జరుగుతాయి:
మొట్టమొదట నీవు నీ పిల్లలను (ప్రజలు) పోగొట్టుకొంటావు. తర్వాత నీవు నీ భర్తను (రాజ్యం) పోగొట్టుకొంటావు.
ఈ సంగతులు నీకు నిజంగా జరుగుతాయి. నీ మంత్రాలన్నీ, శక్తివంతమైన నీ ఉపాయాలన్నీ నిన్ను రక్షించవు.
10 నీవు చెడ్డ పనులు చేసి కూడ క్షేమంగా ఉన్నానని అనుకొంటున్నావు.
‘నేను చేసే తప్పు పనులు ఎవరూ చూడటం లేదు’ అని నీవు అనుకొంటావు.
నీవు తప్పు చేస్తావు. కానీ నీ జ్ఞానం, నీ తెలివి నిన్ను రక్షిస్తాయి అనుకొంటావు.
‘నేను ఒక్క దాన్ని తప్ప నా అంతటి ప్రముఖులు ఇంకెవరూ లేరు’ అని నీవు అంటావు.
11 “అయితే నీకు కష్టాలు వస్తాయి.
అది ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు. కాని నాశనం వచ్చేస్తుంది.
ఆ కష్టాలను ఆపుజేసేందుకు నీవు ఏమీ చేయలేవు. నీవు త్వరగా నాశనం చేయబడతావు.
నీకు ఏమి జరిగిపోయిందో కూడా నీకు తెలియదు.
12 నీ జీవితాంతం నీవు కష్టపడి పనిచేశావు.
ఉపాయాలు, మంత్రాలు నేర్చుకొన్నావు.
కనుక నీ ఉపాయాలు, మంత్రాలు ప్రయోగించటం ప్రారంభించు.
ఒకవేళ ఆ ఉపాయాలు నీకు సహాయపడతాయేమో!
ఒకవేళ నీవు ఎవరినైనా భయపెట్టగలుగుతావేమో.
13 నీకు ఎంతెంతో మంది సలహాదారులు
వాళ్లు నీకిచ్చే సలహాలతో నీవు విసిగిపోయావా?
నక్షత్ర శాస్త్రం తెలిసిన నీ మనుష్యులను వాళ్లు బయటకు పంపిస్తారు.
నెల ప్రారంభం ఎప్పుడో వాళ్లు చెప్పగలుగుతారు.
ఒకవేళ నీ కష్టాలు ఎప్పుడు మొదలవుతాయో వాళ్లు చెప్పగలుగుతారేమో.
14 అయితే ఆ మనుష్యులు కనీసం వాళ్లనే వాళ్లు రక్షించుకోలేరు.
వాళ్లు గడ్డిలా కాలిపోతారు.
వాళ్లు త్వరగా కాలిపోయినందుచేత రొట్టె కాల్చుకొనేందుకు గూడ నిప్పులు మిగులవు.
వెచ్చగా కాచుకొనేందుకు మంటగూడా మిగలదు.
15 నీవు కష్టపడి సంపాదించిన దానంతటికీ అలా జరుగుతుంది.
నీవు చిన్న పిల్లగా ఉన్నప్పట్నుంచీ నీతో వ్యాపారం చేసిన వారు నిన్ను వదిలివేస్తారు
ప్రతివాడూ వాని వాని దారిన పోతాడు.
నిన్ను రక్షించేందుకు ఒక్క మనిషి కూడా ఉండడు.”
మృగముపైనున్న స్త్రీ
17 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా. 2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”
3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి ఉంది. 5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది:
మర్మము, మహా బాబిలోను
వేశ్యలకు తల్లి!
ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!
6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళది.
నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను. 7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. 8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని చూసి దిగ్ర్భాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు.
9 “దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” ఆ ఏడుతలలు ఆ స్త్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి. 10 ఐదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొకడు యింకా రాలేదు. అతడొచ్చాక కొద్దికాలం ఉంటాడు. 11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
12 “నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. కాని వాళ్ళకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది. 13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. 14 వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఉంటారు.”
15 ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది. 16 నీవు చూసిన మృగము, దాని పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి. 17 దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయాలకు చెప్పాడు. కనుక ఆ పది కొమ్ములు తమ రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి యివ్వటానికి అంగీకరించాయి. 18 నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.”
© 1997 Bible League International