Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 18

యాజకులను, లేవీయులను బలపరచటం

18 “ఇశ్రాయేలు దేశంలో లేవీ వంశపువారికి భూమిలో ఎలాంటి వాటా దొరకదు. ఆ ప్రజలు యాజకుల సేవ చేస్తారు. నిప్పుమీద వంటచేసి, యెహోవాకు అర్పించబడిన బలులు తింటూ వారు బ్రదుకుతారు. లేవీ వంశపు ప్రజల వాటా అదే. ఇతర వంశాల వారిలా ఆ లేవీ ప్రజలకు భూమిలో వాటా ఏమీ ఉండదు. యెహోవాయే లేవీయుల వాటా, యెహోవా ఇది వారికి వాగ్దానం చేసాడు.

“మీరు ఒక ఆవును, ఎద్దును, లేక గొర్రెను బలిగా చంపినప్పుడు, జబ్బ, రెండు దవడలు, పొట్ట మీరు యాజకులకు ఇవ్వాలి. మీ మొదటి పంటలోనుండి మీ ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, నూనె మీరు యాజకులకు ఇవ్వాలి. మీ గొర్రెలనుండి కత్తిరించిన మొదటి ఉన్ని మీరు లేవీయులకు ఇవ్వాలి. ఎందుకంటే, మీ దేవుడైన యెహోవా మీ వంశాలన్నింటినీ చూసి, శాశ్వతంగా తనకు యాజకులుగా ఉండేందుకు లేవీయుని, అతని సంతతివారిని ఏర్పరచుకొన్నాడు.

“ఇశ్రాయేలులోని ఏ పట్టణం నుండియైనా లేవీయుడు యెహోవా నియమించిన స్థలానికి తన ఇష్ట మున్నప్పుడెల్ల రావచ్చు. అప్పుడు ఈ లేవీయుడు తన దేవుడైన యెహోవా పేరుమీద పరిచర్య చేయవచ్చు. అతడు విధి నిర్వహిస్తున్న తన సోదర లేవీయులందరిలాగే యెహోవా ప్రత్యేక ఆలయంలో పరిచర్య చేయాలి. ఆ లేవీయుడికి సామాన్యంగా తన కుటుంబానికి వచ్చే వాటా కాకుండా, మిగిలిన లేవీయులతోను సమానంగా వాటా వస్తుంది.

ఇశ్రాయేలీయులు ఇతర జనాంగములను అనుసరించకూడదు

“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించినప్పుడు అక్కడ ఉండే ఇతర రాజ్యాల ప్రజలు చేసే దారుణమైన పనులు చేయటం నేర్చు కోవద్దు. 10 మీ బలిసీఠాల అగ్నిమీద మీ కుమారులను గాని మీ కుమార్తెలను గాని బలి ఇవ్వవద్దు. జ్యోతిష్యం చెప్పేవానితోగాని, మాంత్రికుని దగ్గర గాని, భూతవైద్యుని దగ్గర గాని సోదెచెప్పేవారి దగ్గరగాని మాట్లాడి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని తెలిసికొనేందుకు ప్రయత్నించవద్దు. 11 ఎవరినీ యితరుల మీద మంత్ర ప్రభావంతో బంధించనీయవద్దు. మీ మధ్య ఎవ్వరూ కర్ణపిశాచము అడిగేవారుగా గాని, సోదె చెప్పే వాడుగాగాని, ఉండకూడదు. ఎవ్వరూ చనిపోయినవారితో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. 12 అలాంటివి చేసే వాళ్లంటే మీ దేవుడైన యెహోవాకు అసహ్యం. అందుకే ఆ ఇతర రాజ్యాల వాళ్లను మీ ఎదుట నుండి ఆయన వెళ్లగొట్టేస్తాడు. 13 మీ దేవుడైన యెహోవాకు మీరు నమ్మకంగా ఉండాలి.

యెహోవాయొక్క ప్రత్యేక ప్రవక్త

14 “మీరు ఆ ఇతర జనాంగాలను మీ దేశంలోనుండి వెళ్లగొట్టాలి. ఆ జనాంగాలు సోదెగాండ్ర మరియు శకునాలు చెప్పువారి మాంత్రికుల మాటలు వింటారు. అయితే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అలాంటి పనులు చేయనియ్యడు. 15 మీ దేవుడైన యెహోవా మీ దగ్గరకు ఒక ప్రవక్తను[a] పంపిస్తాడు. ఈ ప్రవక్త మీ స్వంత ప్రజల్లోనుండి వస్తాడు. అతడు నాలాగే ఉంటాడు. మీరు ఈ ప్రవక్త మాట వినాలి. 16 దేవుడే మీకు ఈ ప్రవక్తను పంపిస్తాడు, ఎందుకంటే మీరు ఆయనను అడిగింది అదే. మీరు హోరేబు (సీనాయి) కొండ దగ్గర సమావేశమైనప్పుడు దేవుని స్వరం విని, కొండమీద మహా అగ్నిని చూచి మీరు భయపడ్డారు. అందుచేత ‘మా దేవుడైన యెహోవా స్వరం మరోసారి మమ్మల్ని విననీయవద్దు. ఆ మహా గొప్ప అగ్నిని మాకు కనబడనీయవద్దు, మేము చస్తాము’ అని మీరు అన్నారు.

17 “యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘వారు అడుగుతోంది మంచిదే. 18 నీవంటి ఒక ప్రవక్తను నేను వారికోసం పంపిస్తాను. ఈ ప్రవక్త వారి స్వంత ప్రజల్లో ఒకడే. అతడు చెప్పాల్సిన విషయాలను నేను అతనికి చెబుతాను. నేను ఆజ్ఞాపించేవి అన్నీ అతడు ప్రజలకు చెబుతాడు. 19 ఈ ప్రవక్త నా పక్షంగా మాట్లాడతాడు అతడు నా పక్షంగా మాట్లాడినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే నా ఆజ్ఞలు వినటానికి నిరాకరిస్తే, ఆ వ్యక్తిని నేను శిక్షిస్తాను.’

బూటకపు ప్రవక్తలను తెలుసుకోవటం ఎలా?

20 “అయితే ఒక ప్రవక్త చెప్పాల్సిందిగా నేను చెప్పని దానిని చెప్పవచ్చు. అతడు నా పక్షంగా మాట్లాడుతున్నానని ప్రజలతో చప్పవచ్చును. ఇలా జరిగితే ఆ ప్రవక్త చంపబడాల్సిందే. లేక ఇతర దేవుళ్ల పక్షంగా ఒక ప్రవక్త మాట్లాడవచ్చు. ఆ ప్రవక్త కూడా చంపబడాల్సిందే. 21 ‘ప్రవక్త చెబుతోన్న విషయం యెహోవా చెప్పింది కాదు అని మనం ఎలా తెలుసు కోగలము’ అని మీరు తలుస్తూ ఉండవచ్చు. 22 ప్రవక్త యెహోవా పక్షంగా మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు, ఆ విషయం జరగకపోతే, అది యెహోవా చెప్పింది కాదు అని అప్పుడు మీకు తెలిసిపోతుంది. ఈ ప్రవక్త తన స్వంత ఆలోచనలనే చెబుతున్నాడని మీకు తెలుస్తుంది. అతని గూర్చి మీరు భయపడాల్సిన పనిలేదు.

కీర్తనలు. 105

105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
    ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
    ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
    సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
    దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
    యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
    వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
    ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
    ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
    అని దేవుడు చెప్పాడు.
12 అబ్రాహాము కుటుంబం చిన్నదిగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగ్దానం చేశాడు.
    మరియు వారు కనానులో నివసిస్తున్న యాత్రికులు మాత్రమే.
13 దేశం నుండి దేశానికి, రాజ్యం నుండి రాజ్యానికి
    వారు ప్రయాణం చేసారు.
14 కాని యితర మనుష్యులు ఆ కుటుంబాన్ని బాధించనియ్యకుండా దేవుడు చేసాడు.
    వారిని బాధించవద్దని దేవుడు రాజులను హెచ్చరించాడు.
15 “నేను ఏర్పాటు చేసుకొన్న నా ప్రజలను బాధించవద్దు.
    నా ప్రవక్తలకు ఎలాంటి కీడూ చేయవద్దు.” అని దేవుడు చెప్పాడు.
16 దేవుడు ఆ దేశంలో ఒక కరువు వచ్చేటట్టు చేశాడు.
    ప్రజలకు తినుటకు సరిపడినంత ఆహారం లేదు.
17 అయితే దేవుడు వారికి ముందుగా వెళ్లుటకు యోసేపు అనే మనిషిని పంపించాడు.
    యోసేపు ఒక బానిసవలె అమ్మబడ్డాడు.
18 యోసేపు కాళ్లను తాళ్లతో వారు కట్టివేశారు.
    అతని మెడకు వారు ఒక ఇనుప కంటె వేశారు.
19 యోసేపు చెప్పిన సంగతులు నిజంగా జరిగేంతవరకు
    అతడు (యోసేపు) బానిసగా చెప్పింది సరియైనది అని యెహోవా సందేశం రుజువు చేసింది.
20 కనుక యోసేపును విడుదల చేయమని ఈజిప్టు రాజు ఆదేశించాడు.
    అనేక మందికి అధికారిగా ఉన్న అతనిని కారాగారం నుండి వెళ్లనిచ్చాడు.
21 అతడు యోసేపును తన ఇంటికి యజమానిగా నియమించాడు.
    రాజ్యంలో అన్ని విషయాలను గూర్చి యోసేపు జాగ్రత్త తీసుకొన్నాడు.
22 యోసేపు యితర నాయకులకు హెచ్చరిక ఇచ్చాడు.
    పెద్ద మనుష్యులకు యోసేపు నేర్పించాడు.
23 తరువాత ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చాడు.
    యాకోబు హాము దేశంలో[b] నివసించాడు.
24 యాకోబు కుటుంబం చాలా పెద్దది అయింది.
    వారు వారి శత్రువులకంటే శక్తిగలవారయ్యారు.
25 కనుక ఈజిప్టు ప్రజలు యాకోబు వంశాన్ని ద్వేషించటం మొదలు పెట్టారు.
    ఈజిప్టువారు బానిసలకు విరోధంగా పథకాలు వేయటం ప్రారంభించారు.
26 కనుక దేవుడు తన సేవకుడైన మోషేను,
    తాను ఏర్పాటు చేసుకొన్న యాజకుడు అహరోనును పంపించాడు.
27 హాము దేశంలో అనేక అద్భుతాలు చేయటానికి
    దేవుడు మోషే, అహరోనులను వాడుకొన్నాడు.
28 దేవుడు కటిక చీకటిని పంపించాడు.
    కాని ఈజిప్టు వాళ్లు ఆయన మాట వినలేదు.
29 కనుక దేవుడు నీళ్లను రక్తంగా మార్చాడు.
    వాళ్ల చేపలన్నీ చచ్చాయి.
30 ఆ దేశం కప్పలతో నింపివేయబడింది.
    రాజు గదులలోకి కూడ కప్పలు వచ్చాయి.
31 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా జోరీగలు,
    దోమలు వచ్చాయి.
    అన్నిచోట్లా అవే ఉన్నాయి.
32 దేవుడు వర్షాన్ని వడగండ్లుగా చేశాడు.
    ఈజిప్టువారి దేశంలో అన్ని చోట్లా అగ్ని మెరుపులు కలిగాయి.
33 ఈజిప్టువారి ద్రాక్షా తోటలను, అంజూరపు చెట్లను దేవుడు నాశనం చేశాడు.
    వారి దేశంలో ప్రతి చెట్టునూ దేవుడు నాశనం చేసాడు.
34 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా మిడుతలు వచ్చాయి.
    అవి లెక్కింపజాలనంత విస్తారంగా ఉన్నాయి.
35 మిడుతలు దేశంలోని మొక్కలన్నింటినీ తినివేశాయి.
    నేల మీద పంటలన్నింటినీ అవి తినివేశాయి.
36 అప్పుడు ఈజిప్టు దేశంలో ప్రతి మొదటి సంతానాన్ని దేవుడు చంపేశాడు.
    వారి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపివేశాడు.
37 అప్పుడు దేవుడు ఈజిప్టు నుండి తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు.
    వారు వెండి బంగారాలు వారి వెంట తెచ్చారు.
    దేవుని ప్రజలు ఎవ్వరూ తొట్రిల్లి పడిపోలేదు.
38 దేవుని ప్రజలు వెళ్లిపోవటం చూచి ఈజిప్టు సంతోషించింది.
    ఎందుకంటే దేవుని ప్రజలను గూర్చి వారు భయపడ్డారు.
39 దేవుడు తన మేఘాన్ని ఒక దుప్పటిలా పరిచాడు.
    రాత్రివేళ తన ప్రజలకు వెలుగు ఇచ్చుటకు దేవుడు తన అగ్నిస్తంభాన్ని ఉపయోగించాడు.
40 ప్రజలు మాంసం కోసం ఆడిగినప్పుడు దేవుడు వారికి పూరేళ్లను రప్పించాడు.
    దేవుడు వారికి ఆకాశం నుండి సమృద్ధిగా ఆహారాన్ని యిచ్చాడు.
41 దేవుడు బండను చీల్చగా నీళ్లు ఉబుకుతూ వచ్చాయి.
    ఎడారిలో ఒక నది ప్రవహించడం మొదలైంది.

42 దేవుడు తన పవిత్ర వాగ్దానం జ్ఞాపకం చేసికొన్నాడు.
    దేవుడు తన సేవకుడు ఆబ్రాహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసికొన్నాడు.
43 దేవుడు తన ప్రజలను ఈజిప్టునుండి బయటకు రప్పించాడు.
    ప్రజలు వారి సంతోష గీతాలు పాడుతూ ఆనందంగా బయటకు వచ్చారు.
44 అప్పుడు యితరులు నివసిస్తున్న దేశాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు.
    ఇతరుల కష్టార్జితాన్ని దేవుని ప్రజలు పొందారు.
45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
    వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.

యెహోవాను స్తుతించండి.

యెషయా 45

ఇశ్రాయేలును విమోచించటానికి దేవుడు కోరెషును ఎన్నుకొంటాడు

45 యెహోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి:

“కోరషు కుడిచేయి నేను పట్టుకొంటాను.
    రాజుల దగ్గర నుండి అధికారం తీసివేసుకొనేందుకు
    నేను అతనికి సహాయం చేస్తాను.
    పట్టణ ద్వారాలు కోరెషును ఆపుజేయలేవు. పట్టణ ద్వారాలు నేను తెరుస్తాను, కోరెషు లోనికి ప్రవేశిస్తాడు.
కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. నేను నీకు ముందుగా వెళ్తాను.
    పర్వతాలను నేను చదును చేస్తాను.
పట్టణం ఇత్తడి తలుపులు నేను పగులగొడ్తాను.
    తలుపుల మీది ఇనుప గడియలను నేను విరుగగొడ్తాను.
చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను.
    దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను.
నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేందుకు నేను దీనిని చేస్తాను.
    ఇశ్రాయేలీయుల దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని చేస్తున్నాను.
    ఏర్పాటు చేయబడిన నా ప్రజలు ఇశ్రాయేలీయుల కోసం నేను వీటిని చేస్తున్నాను.
కోరెషూ, నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
    నీవు నన్ను ఎరుగవు, కానీ నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవుడను.
    ఇంక ఏ దేవుడూ లేడు.
నేనే నీకు బట్టలు ధరింపజేసినవాడను.
    అయినా నీవు ఇంకా నన్ను ఎరుగవు.
నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజలంతా తెలుసుకోవాలని నేను ఈ సంగతులను చేస్తాను.
నేనే యెహోవాను అని, నేను తప్ప ఇంకో దేవుడు లేడని తూర్పు నుండి పడమటి వరకు ప్రజలు తెలుసుకొంటారు.
నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను.
    నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు కల్గిస్తాను.
    నేను యెహోవాను నేనే ఈ సంగతులన్నింటిని చేస్తాను.

“పైన ఆకాశంలోని మేఘాలు మంచితనాన్ని
    భూమిమీద వర్షంగా కురిపించుగాక!
భూమి నెరలు విడిచి రక్షణను
    ఫలింపజేయును గాక!
దానితోబాటు మంచితనం పెరుగును గాక!
    యెహోవాను నేనే అతణ్ణి[a] సృజించాను.”

దేవుడు తన సృష్టిని అదుపులో ఉంచుతాడు

“ఈ ప్రజలను చూడు! వాళ్లు వారిని సృజించిన వానితో వాదిస్తున్నారు. వాళ్లు నాతో వాదించటం చూడు. వాళ్లు పగిలిపోయిన కుండ పెంకులా ఉన్నారు. ఒకడు కుండ చేయటానికి జిగట మన్ను ఉపయోగిస్తాడు. మరి ఆ మట్టి, ‘ఓ మనిషీ, ఏం చేస్తున్నావు?’ అని అడగదు. తయారు చేయబడిన వస్తువులకు వాటిని తయారుచేసిన వానిని ప్రశ్నించే అధికారం లేదు. మనుష్యులు ఈ మట్టిలాగే ఉన్నారు. 10 ఒక తండ్రి తన పిల్లలకు ప్రాణం పోస్తాడు. మరి పిల్లలు, ‘నీవెందుకు నాకు ప్రాణం పోస్తున్నావు?’ అని అడిగేందుకు అధికారం లేదు. పిల్లలు తల్లిని పట్టుకొని, ‘నీవెందుకు నాకు జన్మనిస్తున్నావు?’ అని ప్రశ్నించేందుకు వీల్లేదు.”

11 యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఆయనే ఇశ్రాయేలీయులను సృజించాడు. మరియు యెహోవా అంటున్నాడు:

“నా కుమారులారా, మీకు ఒక సంకేతం చూపించమని నన్ను అడిగారు.
    నేను చేసిన వాటిని మీకు చూపించమని మీరు నాకు ఆదేశించారు.
12 కనుక చూడండి! భూమిని నేనే సృజించాను.
    దానిమీద జీవించే మనుష్యులందరినీ నేనే సృజించాను.
నా స్వంత చేతులు ఉపయోగించి ఆకాశాలను సృజించాను.
    ఆకాశ సమూహాలన్నింటినీ నేనే ఆజ్ఞాపించాను.
13 కోరెషు మంచి పనులు చేసేందుకు అతని శక్తిని నేనే అతనికి ఇచ్చాను.
    అతని పని నేను సులభం చేస్తాను.
కోరెషు నా పట్టణాన్ని మరల నిర్మిస్తాడు.
    అతడు నా ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. కోరెషు నా ప్రజలను నాకు అమ్మడు.
    అతడు ఈ పనులు చేసేందుకు అతనికి నేనేమీ చెల్లించాల్సిన అవసరంలేదు.
    ప్రజలు విమోచించబడతారు. దానికి నాకేమీ ఖర్చుకాదు.”
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.

14 యెహోవా చెబుతున్నాడు, “ఈజిప్టులో, ఇథియోపియాలో ఎన్నో సంగతులు చేయబడ్డాయి.
    అయితే ఇశ్రాయేలు ప్రజలారా, మీరు వాటిని పొందుతారు.
ఆజానుబాహులైన సెబా ప్రజలు మీ వాళ్లవుతారు.
    వారు మెడలలో సంకెళ్లతో మీ వెనుక నడుస్తారు.
వాళ్లు మీ ఎదుట సాష్టంగపడతారు.
    వాళ్లు మీకు విన్నపం చేసుకొంటారు.”
ఇశ్రాయేలూ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
    మరి ఇంకే దేవుడూ లేడు.

15 దేవా, నీవు ప్రజలు చూడలేని దేవుడవు.
    నీవు ఇశ్రాయేలు రక్షకుడవు.
16 చాలామంది ప్రజలు తప్పుడు దేవుళ్లను చేసుకొంటారు.
    కానీ ఆ ప్రజలు నిరాశ చెందుతారు.
    ఆ ప్రజలంతా సిగ్గుతో తిరిగి వెళ్లిపోతారు.
17 కానీ ఇశ్రాయేలు యెహోవా చేత రక్షించబడును.
    ఆ రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
    మరల ఎన్నటెన్నటికి ఇశ్రాయేలు సిగ్గుపడడు.
18 యెహోవాయే దేవుడు.
    ఆయనే భూమిని, ఆకాశాలను సృజించాడు.
    భూమిని యెహోవా దాని స్థానంలో ఉంచాడు.
యెహోవా భూమిని చేసినప్పుడు, అది ఖాళీగా ఉండాలని ఆయన కోరలేదు.
    భూమి మీద జీవం ఉండాలని యెహోవా కోరాడు.
యెహోవా చెబుతున్నాడు: “నేనే యెహోవాను.
    నేను తప్ప ఇంకో దేవుడు లేడు.
19 నేను రహస్యంగా మాట్లాడలేదు. నేను స్వేచ్చగా మాట్లాడాను.
    ప్రపంచపు చీకటి స్థలాల్లో నేను నా మాటలను దాచిపెట్టలేదు.
ఖాళీ ప్రదేశాల్లో నన్ను వెదకమని
    యాకోబు ప్రజలకు నేను చెప్పలేదు.
నేనే యెహోవాను, నేను సత్యం మాట్లాడుతాను.
    నేను మాట్లాడినప్పుడు సరైనవే నేను చెబుతాను.

యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేస్తాడు

20 “ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు. 21 ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.)

“చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి ఏ దేవుడు లేడు. 22 దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను.

23 “నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు. 24 ‘మంచితనం, అధికారం యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి’” అని ప్రజలు చెబుతారు.

కొంత మంది మనుష్యులు యెహోవా మీద కోపగిస్తారు. అయితే యెహోవా జనులు వచ్చి, యెహోవా చేసిన వాటిని గూర్చి సాక్ష్యం చెబుతారు. అందుచేత కోపగించిన ఆ మనుష్యులు సిగ్గుపడతారు. 25 ఇశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు.

ప్రకటన 15

ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు

15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.

నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:

“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
    నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
    నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
    నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
    కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”

దీని తర్వాత పరలోకంలో ఉన్న మందిరాన్ని చూసాను. అంటే సాక్ష్యపు గుడారము తెరుచుకోవటం చూసాను. ఆ మందిరం నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళతో బయటకు వచ్చారు. వాళ్ళు తెల్లటి మెరిసే నార బట్టలు వేసుకొని ఉన్నారు. రొమ్ముల మీద బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఆ నాలుగు ప్రాణుల్లో ఒకటి ఆ ఏడుగురు దూతలకు చిరంజీవి అయిన దేవుని ఆగ్రహంతో నిండిన ఏడు బంగారు పాత్రల్ని యిచ్చింది. ఆ మందిరమంతా దైవశక్తి వల్ల మరియు ఆయన తేజస్సు వల్ల కలిగిన పొగలతో నిండిపోయింది. ఏడుగురు దూతలు తెచ్చిన ఏడు తెగుళ్ళు పూర్తి అయ్యేవరకు ఆ మందిరంలో ఎవ్వరూ ప్రవేశించలేకపోయారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International