Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 16

పస్కా పండుగ

16 “అబీబు[a] నెలలో మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించాలి. ఎందుకంటే అబీబు నెలలోనే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రాత్రిపూట ఈజిప్టునుంటి బయటకు రప్పించాడు. యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఏర్పరచుకొనే చోటుకు మీరు వెళ్లాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు, పస్కా పండుగ భోజనానికి ఒక ఆవును లేక మేకను మీరు బలి యివ్వాలి. ఈ బలితోపాటు పొంగినది ఏదీ తినవద్దు. ఏడు రోజులపాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఇది “బాధరొట్టె అని పిలువబడుతుంది.” ఈజిప్టు దేశంలో మీ బాధలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది సహాయపడుతుంది. ఎంత త్వరగా మీరు ఆ దేశం విడిచిపెట్టాల్సి వచ్చిందో జ్ఞాపకం ఉందా! మీరు బ్రదికినంత కాలం ఆ రోజును జ్ఞాపకం ఉంచుకోవాలి. దేశవ్యాప్తంగా ఏడు రోజులపాటు ఎక్కడా ఎవరి యింటిలో పులిసిన రొట్టెలు ఉండకూడదు. మరియు మొదటి రోజు సాయంత్రం మీరు బలి అర్పించే మాంసం అంతా తెల్లవారక ముందే తినటం అయిపోవాలి.

“మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాలు దేనిలోనైనా పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించకూడదు. మీ దేవుడైన యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఏర్పాటు చేసుకొన్న స్థలంలో మాత్రమే పస్కా పండుగ జంతువును మీరు బలిగా అర్పించాలి. అక్కడ సాయంకాలం సూర్యుడు అస్తమించినప్పుడు పస్కా పండుగ జంతువును మీరు బలి అర్పించాలి. యెహోవా మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొనివచ్చిన సందర్భము ఇది. మరియు మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే పస్కా పండుగ మాంసం మీరు వండుకొని తినాలి. అప్పుడు ఉదయాన్నే మీరు తిరిగి మీ గుడారాలకు వెళ్లిపోవాలి. పులియని రొట్టెలను ఆరు రోజులు మీరు తినాలి. ఏడో రోజున మీరు ఏ పనీ చేయకూడదు. ఆ రోజు, మీ దేవుడైన యెహోవా కోసం ప్రత్యేక సమావేశంగా ప్రజలంతా కూడు కొంటారు.

వారాల పండుగ (పెంతెకొస్తు)

“మీరు పంట కోయటం మొదలు పెట్టినప్పటి నుండి ఏడు వారాలు లెక్క కట్టాలి. 10 అప్పుడు మీ దేవుడైన యెహోవాకు వారాల పండుగను మీరు జరుపుకోవాలి. ఒక స్వేచ్ఛార్పణ తీసుకొని రావటంతో దీనిని జరుపుకోండి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడో ఆలోచించి, మీరు ఎంత యివ్వాలి అనేది నిర్ణయించండి. 11 యెహోవా తన ప్రత్యేక ఆలయంగా ఏర్పచుకొనే చోటుకు వెళ్లండి. అక్కడ మీరూ, మీ ప్రజలూ కలిసి అక్కడ మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా గడపండి. మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ సేవకులు, మీ ప్రజలందరినీ మీతో బాటు తీసుకొని వెళ్లండి. అంతే కాదు, మీ పట్టణాలలో నివసించే లేవీయులను, విదేశీయులను, తల్లిదండ్రులు లేని పిల్లలను, విధవలను కూడ తీసుకొని వెళ్లండి. 12 మీరు ఈజిప్టులో బానిసలు అని మరచిపోవద్దు. ఈ ఆజ్ఞలకు మీరు తప్పక విధేయులు కావాలి.

పర్ణశాలల పండుగ

13 “మీ ధాన్యపు కళ్లమునుండి, మీద్రాక్ష గానుగ నుండి మీరు మీ పంటను కూర్చుకొనే ఏడు రోజులకు పర్ణశాలల పండుగ మీరు జరుపుకోవాలి. 14 మీరూ, మీ కుమారులు, మీ కుమారైలు, మీ సేవకులందరూ, మీ పట్టణల్లో నివసించే లేవీయులు, విదేశీయులు, తల్లిదండ్రులు లేని పిల్లలు, విధవలు ఈ పండుగలో సంతోషంగా గడపండి. 15 యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఏడు రోజులపాటు ఈ పండుగను మీరు ఆచరించాలి. మీ దేవుడైన యెహోవాను గౌరవించేందుకు దీనిని చేయండి. మీ దేవుడైన యెహోవా మీ పంట అంతటినీ, మీరు చేసిన పని అంతటినీ ఆశీర్వదించాడు గనుక బాగా సంతోషించండి.

16 “మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలంలో ఆయనను కలుసుకొనేందుకు సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులంతా రావాలి. ఇది పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, పర్ణశాలల పండుగలప్పుడు సంభవిస్తుంది. యెహోవాను కలుసుకొనేందుకు వచ్చే ప్రతి వ్యక్తీ ఒక కానుక తీసుకొని రావాలి. 17 ప్రతి మనిషీ ఇవ్వగలిగినంత ఇవ్వాలి. యెహోవా తనకి ఎంత ఇచ్చాడో అనేది గ్రహించి, తాను ఎంత ఇవ్వాలో నిర్ణయించాలి.

ప్రజల కోసం అధికారులు, న్యాయమూర్తులు

18 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ప్రతి పట్టణంలో మీ వంశాలలో న్యాయమూర్తులను, అధికారులను మీరు నియమించాలి. ఈ న్యాయమూర్తులు, అధికారులు న్యాయంగా సక్రమంగా ప్రజలకు తీర్పు తీర్చాలి. 19 న్యాయ తీర్పును మీరు మార్చకూడదు. మీరు కొందరియెడల పక్షపాతం చూపించకూడదు. ఒక తీర్పులో మీ మనసు మార్చుకొనేందుకు మీరు డబ్బు తీసుకోకూడదు. డబ్బు జ్ఞానుల కళ్లను గుడ్డివి చేస్తుంది, ఒక మంచి వ్యక్తి చెప్పేదానిని మార్చేస్తుంది. 20 మీరు బ్రతికి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకొనేందుకు న్యాయం, మంచి తనం ఉండే తీర్పులనే మీరు ఇవ్వాలి.

విగ్రహాలు దేవునికి అసహ్యం

21 “మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం నిలబెట్టినప్పుడు, అషెరా[b] దేవతను ఘనపర్చే చెక్క స్తంభాలు ఏవీ బలిపీఠం పక్కగా మీరు నిలబెట్టకూడదు. 22 మరియు తప్పుడు దేవుళ్లను పూజించేందుకోసం ప్రత్యేకమైన రాయిని మీరు నిలబెట్టకూడదు. మీ దేవుడైన యెహోవా విగ్రహాలను విగ్రహారాధనను అసహ్యించుకుంటాడు.

కీర్తనలు. 103

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
    యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
    కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
    తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
    దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
    అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
14 మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు.
    మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు.
15 మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు.
    మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు.
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు.
16     ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడిపోతుంది.
    త్వరలోనే ఆ పువ్వు ఎక్కడికి ఎగిరిపోతుందో నీవు చూడలేకపోతావు.
17 కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
    దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు.
దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల ఎంతో మంచివాడుగా ఉంటాడు.
18     దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
    దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు.
19 దేవుని సింహాసనం పరలోకంలో ఉంది.
    మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు.
20 దేవదూతలారా, యెహోవాను స్తుతించండి.
    దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు.
    మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి.
21 యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి.
    మీరు ఆయన సేవకులు,
    దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
    అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!

యెషయా 43

దేవుడు ఎల్లప్పుడు తన ప్రజలతో ఉన్నాడు

43 యాకోబూ, యెహోవా నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు, యెహోవా నిన్ను సృజించాడు. ఇప్పుడు యెహోవా చెబుతున్నాడు: “భయపడవద్దు. నేను నిన్ను రక్షించాను. పేరుపెట్టి నిన్ను పిలిచాను. నీవు నా స్వంతం. నీకు కష్టాలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నీవు నదులు దాటి వెళ్లేటప్పుడు, అవి నీమీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్య నడిచేటప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే యెహోవానైన నేను నీకు దేవుడను గనుక, ఇశ్రాయేలు పరిశుద్ధుడనైన నేను మీకు రక్షకుణ్ణి గనుక. మీకు విలువగా చెల్లించేందుకు నేను ఈజిప్టును ఇచ్చాను. నిన్ను నా స్వంతం చేసుకొనేందుకు ఇథియోపియాను, సెబాను నేను ఇచ్చాను. నీవు నాకు ప్రియుడివి గనుక నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు బతుకునట్లు నీకు మనుష్యులనూ, నీకిష్టమైన జనాంగాలను నేను ఇచ్చివేస్తాను.”

“కనుక భయపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను. నేను నీ పిల్లలను సమకూర్చి వారిని నీ దగ్గరకు రప్పిస్తాను. తూర్పునుండి, పడమరనుండి నేను వారిని సమకూరుస్తాను. నా మనుష్యుల్ని నాకు ఇచ్చివేయి అని నేను ఉత్తరానికి చెబుతాను. నా మనుష్యుల్ని బందీలుగా చెరసాలలో ఉంచవద్దు అని నేను దక్షిణానికి చెబుతాను. దూర దేశాలనుండి నా కుమారులను, కుమార్తెలను నా దగ్గరకు తీసుకొని రండి. నా ప్రజలందరినీ, నా నామం పెట్టబడిన మనుష్యులందరినీ నా దగ్గరకు తీసుకొని రండి. నేను వారిని నా కోసమే సృష్టించుకొన్నాను. వాళ్లను నేనే సృష్టించాను. వాళ్లు నావాళ్లు.”

“కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి. ప్రజలందరూ, రాజ్యాలు అన్నీ సమావేశపర్చబడాలి. ఆదిలో జరిగిన దానిని గూర్చి వాళ్ల తప్పుడు దేవుళ్లలో ఎవరైనా వారితో చెప్పాలని కోరుతున్నారేమో, వారు వారి సాక్షులను తీసుకొని రావాలి. సాక్షులు సత్యం చెప్పాలి. వారిదే సరి అని ఇది తెలియజేస్తుంది.”

10 యెహోవా చెబుతున్నాడు: “ప్రజలారా, మీరే నా సాక్షులు. నేను ఏర్పాటు చేసికొన్న ఆ సేవకులు మీరే. ప్రజలు నన్ను విశ్వసించుటకు వారికి మీరు సహాయం చేస్తారని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాను. ‘నేనే ఆయనను’ అని, నేనే సత్య దేవుడను అని మీరు గ్రహించాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు ముందుగా ఏ దేవుడూ లేడు, నా తర్వాత ఏ దేవుడూ ఉండడు. 11 నా మట్టుకు నేనే యెహోవాను. నేను ఒక్కడనే రక్షకుడను, మరి ఎవరూలేరు. 12 మీతో మాట్లాడిన వాడను నేనే. నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ సంగతులు నేనే మీకు చెప్పాను. మీతో ఉన్న ఎవరో క్రొత్తవాడు కాదు. మీరే నా సాక్షులు, నేనే దేవుడను.” సాక్షాత్తు యెహోవా చెప్పిన మాటలు ఇవి. 13 “నేను ఎల్లప్పుడూ దేవునిగానే ఉన్నాను. నేనేదైనా చేశాను అంటే నేను చేసిన దానిని ఎవరూ మార్చలేరు. నా శక్తి నుండి మనుష్యులను ఎవ్వరూ రక్షించలేరు.”

14 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మిమ్మల్ని రక్షిస్తాడు. యెహోవా చెబుతున్నాడు, “నేను మీ కోసం సైన్యాలను బబులోనుకు పంపిస్తాను. అనేక మంది ప్రజలు బంధించబడతారు. ఆ కల్దీయుల ప్రజలు వారి స్వంత పడవల్లోనే తీసుకొనిపోబడతారు. (కల్దీ ప్రజలకు ఆ పడవలను గూర్చి చాలా గర్వం) 15 నేను యెహోవాను, మీ పరిశుద్ధుడ్ని. ఇశ్రాయేలును నేను సృష్టించాను. నేను మీ రాజును.”

దేవుడు తన ప్రజలను మరల రక్షిస్తాడు

16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, 17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడతారు. క్రొవ్వువత్తి మంట ఆర్పినట్టుగా వారు ఆర్పివేయబడతారు. 18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. 19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. 20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.

22 “యాకోబూ, నీవు నాకు మొరపెట్టలేదు. ఎందుకంటే ఇశ్రాయేలూ, నీవు నాతో విసిగిపోయావు. 23 ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గరకు తీసుకొని రాలేదు. మీరు నన్ను ఘనపర్చలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు, మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంతపెట్టలేదు. 24 కనుక మీరు నన్ను ఘనపర్చేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు.

25 “నేను, నేనే మీ పాపాలు తుడిచివేసే వాడ్ని. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాలు జ్ఞాపకం చేసుకోను. 26 కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గూర్చి చెప్పి, మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. 27 మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు. 28 మీ పవిత్ర పాలకులను పవిత్రులు గాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నావాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలుకు చెడుగులు సంభవిస్తాయి.

ప్రకటన 13

సముద్రం నుండి మృగం పైకి రావటం

13 సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవదూషణ పేరు వ్రాయబడి ఉంది. నేను చూసిన ఆ మృగం ఒక చిరుతపులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది.

ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది. ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వలె ఎవరున్నారు? ఈ మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు?” అని అన్నారు.

గర్వంగా మాట్లాడటానికి, దైవదూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది. ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్ళను దూషణ చేసింది. భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. అంతేకాక, అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది. ఈ భూమ్మీద నివసించే వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొఱ్ఱెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు.

చెవులున్న వాళ్ళు వినండి:

10 బంధింపబడవలసినవాడు
    బంధింపబడతాడు.
కత్తితో వధింపబడవలసినవాడు
    వధింపబడతాడు.

కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.

భూమిలోనుండి మృగం రావటం

11 తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది. 12 అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది. 13 అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది.

14 మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది. 15 మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది. 16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. 17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది.

18 ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International