Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 13-14

ఇతర దేవుళ్లను సేవించవద్దు

13 “ఒక ప్రవక్త లేక కలల భావం చెప్పే ఒక వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మీకు ఏదో ఒక సూచన లేక అద్భుతం చూపిస్తానని ఆతడు మీతో చెప్పవచ్చు. మరియు ఆతడు మీకు చెప్పిన సూచన లేక అద్భుతం నెరవేరవచ్చు. అప్పుడు ఆతడు ఇతర దేవుళ్లను (మీరు ఎరుగని దేవుళ్లను) పూజించమని మీతో చెప్పవచ్చును. ‘మనం ఆ దేవుళ్లనే సేవిద్దాము’ అని అతడు మీతో అనవచ్చును. ఆ మనిషి మాట వినవద్దు. ఎందుకంటె మీరు మీ దేవుణ్ణి మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనేందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు తప్పక ఆయనను గౌరవించాలి. యెహోవా ఆజ్ఞలకు విధేయులై, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. యెహోవాను సేవించండి, ఎన్నటికీ ఆయనను విడువకండి. అంతేకాదు కలలను గూర్చి చెప్పే ఆ ప్రవక్తను చంపివేయాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు లోబడటం మానివేయండి అని మీతో చెబుతున్నాడు గనుక. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినవాడు యెహోవా. అక్కడి బానిస జీవితంనుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడు. మీరు జీవించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన జీవితం నుండి మిమ్మల్ని తప్పించి వేయాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. అందుచేత మీ ప్రజలనుండి చెడుగును తీసివేసేందుకు మీరు ఆ వ్యక్తిని చంపివేయాలి.

“మీతో సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా, మీరు ఇతర దేవుళ్లను పూజించేందుకు రహస్యంగా మిమ్మల్ని ఒప్పించవచ్చు. నీ స్వంత సోదరుడు. నీ కుమారడు, నీ కుమార్తె, నీవు ప్రేమించే నీ భార్య, లేక నీ అతి సన్నిహిత మిత్రుడు కావచ్చు. ‘మనం పోయి యితర దేవుళ్లను పూజిద్దాము’ అని ఆ వ్యక్తి చెప్పవచ్చు. (ఈ దేవుళ్లను మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఎరుగరు. ఆ దేవుళ్లు మీకు దగ్గర్లో, దూరంలో, మీ చుట్టు పక్కల రాజ్యాల్లో ఉండే ప్రజల దేవుళ్లు.) మీరు ఆ వ్యక్తితో సమ్మతించకూడదు. ఆతని మాట వినవద్దు. ఆతని మీద జాలిపడవద్దు, అతణ్ణి స్వేచ్ఛగా వెళ్ళిపోనివ్వవద్దు. ఆతణ్ణి కాపాడవద్దు. 9-10 కాని, మీరు అతణ్ణి చంపాల్సిందే. మీరు అతణ్ణి రాళ్లతో కొట్టి చంపెయ్యాలి. నీవే మొట్టమొదట రాళ్లు తీసుకొని అతని మీద విసరాలి. తర్వాత ప్రజలందరూ రాళ్లు విసిరి అతణ్ణి చంపాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మీ దేవుడైన యెహోవాకు దూరం చేయాలని ప్రయత్నించాడు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన వాడు యెహోవాయే. 11 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరు విని భయపడతారు. అంతేకాదు, వారు యిలాంటి చెడ్డపనులు ఇంకేమీ మీ మధ్య జరిగించరు.

12 “మీ దేవుడైన యెహోవా మీరు నివసించేందుకు పట్టణాలు మీకు ఇచ్చాడు. కొన్నిసార్లు ఈ పట్టణాల్లో ఒకదాన్ని గూర్చి మీరు ఏదైనా చెడువార్త వినవచ్చును. మీరు 13 మీ స్వంత దేశంలోనే దుర్మార్గులు కొందరు వారి పట్టణస్థులను చెడ్డపనులు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని వినవచ్చును. ‘మనం వెళ్లి యితర దేవుళ్లను సేవిద్దాము, అని వారు వారి పట్టణస్థులతో అనవచ్చును.’ (ఈ దేవుళ్లు యింతకు ముందు మీరు ఎన్నడూ ఎరుగని దేవుళ్లు.) 14 మీరు ఇలాంటి వార్త వింటే, అది సత్యమా అని తెలుసుకొనేందుకు మీరు చేయగలిగింది అంతా చేయాలి. అది వాస్తవమేనని మీకు తెలిస్తే-అలాంటి దారుణ విషయం నిజంగానే జరిగిందని మీకు ఋజువైతే 15 అప్పుడు మీరు ఆ పట్టణస్థులను శిక్షించాలి. వాళ్లందరినీ చంపివేయాలి. మరియు వారి పశువులన్నింటినీ చంపివేయండి. మీరు ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయాలి. 16 అప్పుడు మీరు విలువైన వస్తువులన్నింటినీ పోగు చేసి పట్టణం మధ్యకు వాటిని తీసుకొని వెళ్లాలి. ఆ పట్టణాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా మీరు కాల్చివేయాలి. ఆ పట్టణం శాశ్వతంగా పాడు దిబ్బగా అవుతుంది. అది ఎన్నటికీ తిరిగి కట్టబడకూడదు. 17 ఆ పట్టణంలో ఉన్న సమస్తం నాశనం చేయబడేందుకు అది యెహోవాకు అప్పగించబడాలి. కనుక ఆ వస్తువుల్లో ఏదీ మీకోసం మీరు ఉంచుకోకూడదు. మీరు ఈ ఆజ్ఞను పాటిస్తే, అప్పుడు యెహోవా మీ మీద కోపం చాలిస్తాడు. యెహోవా మీకు దయను ప్రసాదిస్తాడు. ఆయనకు మీమీద జాలి ఉంటుంది. ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ప్రకారం మీ రాజ్యాన్ని విస్తారంగా పెరుగనిస్తాడు. 18 మీరు మీ దేవుడైన యెహోవా మాట ఆలకించి, నేడు నేను మీకు యిస్తున్న ఆజ్ఞలకు విధేయులైతే యిలా జరుగుతుంది. మీ దేవుడైన యెహోవా సరైనవి అని చెప్పేవాటిని మీరు చేయాలి.

ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు

14 “మీరు మీ దేవుడైన యెహోవా పిల్లలు. ఎవరైనా చనిపోయినప్పుడు మీ విచారం వ్యక్తం చేయటానికి మిమ్మల్ని మీరు కోసుకోకూడదు. మీ తలలు గుండు గీసుకోకూడదు. ఎందుకంటే మీరు ఇతరులకు వ్యత్యాసంగా ఉన్నారు. మీరు యెహోవాకు ప్రత్యేకమైన ప్రజలు. ప్రపంచంలోని ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొన్నాడు.

ఇశ్రాయేలీయులకు అనుమతించబడిన భోజనం

“తినకూడని చెడ్డది అని యెహోవా చెప్పినది ఏదీ తినవద్దు. మీరు ఈ జంతువులను తినవచ్చును: ఆవులు, గొర్రెలు, మేకలు, జింక, దుప్పి, ఎర్రచిన్న జింక, అడవి గొర్రెలు, అడవి మేకలు, లేడి. కొండ గొర్రెలు. గిట్టలు రెండుగా చీలి ఉండి, నెమరు వేసే ఏ జంతువునైనామీరు తినచ్చును. కానీ ఒంటెలను, కుందేళ్లను, పాట్టి కుందేళ్లను తినవద్దు. ఈ జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. కనుక ఈ జంతువులు మీకు పవిత్ర ఆహారం కాదు. మరియు మీరు పందుల్ని తినకూడదు. వాటి గిట్టలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అందుచేత పందులు మీకు పవిత్ర ఆహారం కాదు. పందిమాంసం ఏమీ తినవద్దు, చచ్చిన పందిని ముట్టుకోవద్దు.

“రెక్కలు, పొలుసులు ఉన్న ఎలాంటి చేపనైనా తినవచ్చు. 10 కానీ రెక్కలు పొలుసులు లేకుండా నీళ్లలో జీవించే దేనినీ మీరు తినవద్దు. అది మీకు పవిత్ర ఆహారం కాదు.

11 “పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును. 12-18 ఆయితే మీరు తినకూడని పక్షులు ఏవంటే: పక్షిరాజు, ఏ రకమైన రాబందు, క్రౌంచు పక్షి, పిల్లిగద్ద, కాకులు, నిప్పుకోళ్లు, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైడికంటె, ఏ విధమైన గుడ్లగూబ, హంస, గూడ బాతు, తెల్లబందు, చెరువుకాకి, చీకు బాతు, సారస పక్షి, సంకుబుడి కొంగ, ఏ విధమైన కొంగ, కుకుడు గువ్వ, గబ్బిలము.

19 “రెక్కలుగల అపవిత్ర పురుగులను దేనినీ తినవద్దు. 20 అయితే పవిత్రమైన ఏ పక్షినైనా మీరు తినవచ్చును.

21 “దానంతట అదే చచ్చిన ఏ జంతువునూ తినవద్దు. చచ్చిన జంతువును మీ ఊళ్లో ఉన్న విదేశీయునికి మీరు ఇవ్వవచ్చు, అతడు దాన్ని తినవచ్చు. లేక చచ్చిన జంతువును విదేశీయునికి మీరు అమ్మవచ్చు. కానీ మీ మట్టుకు మీరు చచ్చిన జంతువును తినకూడదు. ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు చెందిన వారు గనుక. మీరు ఆయనకు ప్రత్యేక ప్రజలు.

“గొర్రెపిల్లను దాని తల్లి పాలతో వండవద్దు.

పదోవంతు ఇవ్వటం

22 “ప్రతి సంవత్సరం మీ పొలాలలో పండే పంటల్లో పదవ వంతు మీరు జాగ్రత్తగా దాచిపెట్టాలి. 23 తర్వాత యెహోవా తనకు ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొన్న స్థలానికి మీరు వెళ్లాలి. అక్కడ మీ పంటల్లో పదోవంతు, మీ ధాన్యంలో పదోవంతు, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె, మీ పశువుల మందలో, గొర్రెల మందలో, మొట్టమొదట పుట్టిన వాటిని మీ దేవుడైన యెహోవాతో కలిసి మీరు తినాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాను మీరు ఎల్లప్పుడూ గౌరవించటం జ్ఞాపకం ఉంచుకొంటారు. 24 అయితే మీరు ప్రయాణం చేయటానికి ఆ స్థలం మీకు చాలా దూరం కావచ్చును. ఒకవేళ మీకు యెహోవా అనుగ్రహించిన పంటలన్నింటిలోని దశమ భాగాలు మీరు మోసుకొని పోలేకపోవచ్చును. ఆలాగనుక జరిగితే యిలా చేయండి: 25 మీ పంటలోని ఆ భాగం అమ్మివేయండి. ఆ ధనం మీతోకూడ తీసుకొని, యెహోవా నిర్ణయించిన ఆ ప్రత్యేక స్థలానికి వెళ్లండి. 26 మీకు యిష్టం వచ్చింది ఏదైనా– ఆవులు, గొర్రెలు, ద్రాక్షారసం, మద్యం లేక మీరు కోరినది ఏ భోజనంగాని యింకేదైనాసరే కొనేందుకు ఆ ధనం వినియోగించండి. తర్వాత మీరు, మీ కుటుంబం మీ దేవుడైన యెహోవాతో కలిసి ఆ స్థలంలో భోజనంచేసి ఆనందించండి. 27 అయితే మీ పట్టణాల్లో నివసించే లేవీయులను నిర్లక్ష్యం చేయవద్దు, ఎందుకంటే మీవలే వారికి భూమిలో భాగం లేదు.

28 “ప్రతి మూడేళ్ల చివరలో, మీ దశమ భాగాలన్నీ ఆ సంవత్సరానికి మీరు తీసుకొని రావాలి. మీ పట్టణంలో ఇతరులు దీనిని వినియోగించుకోగలిగిన ఒక స్థలంలో ఈ ఆహారాన్ని ఉంచాలి. 29 లేవీయులకు వారి స్వంత భూమి లేదు గనుక ఈ ఆహారం వారికోసం ఉంటుంది. మీ పట్టణంలో భోజనం లేని వారికి, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు కూడా ఈ భోజనం ఉంటుంది. ఇలా గనుక మీరు చేస్తే మీరు చేసే ప్రతి దానిలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

కీర్తనలు. 99-101

99 యెహోవాయే రాజు.
    కనుక రాజ్యాలు భయంతో వణకాలి.
కెరూబు[a] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు.
    అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది.
సీయోనులో యెహోవా గొప్పవాడు.
    ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు.
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక.
    దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు.
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు.
    దేవా, నీతిని నీవు చేశావు.
    యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పాదపీఠాన్ని[b] ఆరాధించండి.
మోషే, అహరోను దేవుని యాజకులలో కొందరు,
    మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు.
వారు యెహోవాను ప్రార్థించారు.
    దేవుడు వారికి జవాబు యిచ్చాడు.
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు.
    వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు.
    దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు.
మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు.
    నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు
    ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు.
మన దేవుడైన యెహోవాను స్తుతించండి.
    ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి.
    మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.

కృతజ్ఞత కీర్తన.

100 భూమీ, యెహోవాను గూర్చి పాడుము!
నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు!
    ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము.
యెహోవా దేవుడని తెలుసుకొనుము.
    ఆయనే మనలను సృజించాడు.
    మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము.
కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి.
    స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి.
    ఆయనను గౌరవించండి. ఆయన నామాన్ని స్తుతించండి.
యెహోవా మంచివాడు.
    ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది.
    ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు.

దావీదు కీర్తన.

101 ప్రేమ, న్యాయాలను గూర్చి నేను పాడుతాను.
    యెహోవా, నేను నీకు భజన చేస్తాను.
నేను జాగ్రత్తగా పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    నేను నా ఇంటిలో పరిశుద్ధ జీవితం జీవిస్తాను.
    యెహోవా, నీవు నా దగ్గరకు ఎప్పుడు వస్తావు?
నా యెదుట ఏ విగ్రహాలు[c] ఉంచుకోను.
    అలా నీకు విరోధంగా తిరిగే వారిని నేను ద్వేషిస్తాను.
    నేను అలా చేయను!
నేను నిజాయితీగా ఉంటాను.
    నేను దుర్మార్గపు పనులు చేయను.
ఒకవేళ ఎవరైనా తన పొరుగువారిని గూర్చి రహస్యంగా చెడ్డమాటలు చెబితే
    అలా చేయకుండా అతన్ని నేను ఆపివేస్తాను.
మనుష్యులు ఇతరులకంటే తామే మంచివారమని తలుస్తూ
    అతిశయించడం నేను జరుగనివ్వను.

నమ్మదగిన మనుష్యులకోసం నేను దేశం అంతటా చూస్తాను.
    ఆ మనుష్యులను మాత్రమే నేను నాకోసం పని చేయనిస్తాను.
    యదార్థ జీవితాలు జీవించేవాళ్లు మాత్రమే నా సేవకులుగా ఉండగలరు.
అబద్ధీకులను నేను నా ఇంటిలో ఉండనివ్వను.
    అబద్ధీకులను నేను నా దగ్గర ఉండనివ్వను.
ఈ దేశంలో నివసించే దుర్మార్గులను నేను ఎల్లప్పుడూ నాశనం చేస్తాను.
    దుర్మార్గులను యెహోవా పట్టణం నుండి బలవంతంగా వెళ్లగొడతాను.

యెషయా 41

యెహోవా శాశ్వతమైన సృష్టికర్త

41 యెహోవా చెబుతున్నాడు:
“దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి.
దేశాల్లారా, ధైర్యంగా ఉండండి.
    నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.
మనం కలిసికొందాం.
    ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం.
ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు?
    మంచితనం నాతో కూడ నడుస్తుంది.
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు.
    వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు.
    వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు.
    అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?
    ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?
యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.
    యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను.
    అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
దూర దూర స్థలాలూ, మీరంతా
    చూచి భయపడండి.
భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ,
    మీరంతా భయంతో వణకండి.
మీరంతా దగ్గరగా రండి,
    నా మాటలు వినండి.

“పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”

యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు

యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి
    యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను.
    నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు.
    నీవు చాలా దూర దేశంలో ఉన్నావు.
అయితే నేను నిన్ను పిలిచి,
    నీవు నా సేవకుడివి.
నేను నిన్ను ఏర్పరచుకొన్నాను.
    నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను.
    భయపడకు, నేను నీ దేవుణ్ణి.
నేను నిన్ను బలంగా చేశాను.
    నేను నీకు సహాయం చేస్తాను.
నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు.
    కానీ వాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు.
    కానీ నీవు వారిని కనుగొనలేవు.
నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు
    పూర్తిగా కనబడకుండా పోతారు.
13 నేను యెహోవాను,
    నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.
నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
    అని నేను నీతో చెబుతున్నాను.
14     ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా భయపడవద్దు.
నిజంగా నేను మీకు సహాయం చేస్తాను.”

సాక్షాత్తూ యెహోవాయే ఆ మాటలు చెప్పాడు.

“ఇశ్రాయేలు పరిశుద్ధుడు (దేవుడు),
    నిన్ను రక్షించేవాడు ఈ సంగతులు చెప్పాడు:
15 చూడు, నిన్ను నేను ఒక క్రొత్త నూర్పిడి చెక్కగా చేశాను. ఈ పనిముట్టుకు పదునైన పండ్లు చాలా ఉన్నాయి.
    ధాన్యపు గింజల గుల్లలు పగులగొట్టుటకు రైతులు దీనిని ఉపయోగిస్తారు.
    నీవు పర్వతాలను అణగ దొక్కి, చితుక గొడ్తావు. కొండలను నీవు పొట్టులా చేస్తావు.
16 వాటిని గాలిలో విసిరివేస్తావు.
    గాలి దానిని విసరి, చెదరగొడ్తుంది.
అప్పుడు నీవు యెహోవాయందు సంతోషంగా ఉంటావు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుని (దేవుని) గూర్చి నీవు ఎంతగానో అతిశయిస్తావు.

17 “పేదలు, అక్కరలో ఉన్నవారు నీళ్లకోసం వెదకుతారు.
    కానీ వారికి ఏమీ దొరకవు.
    వారు దాహంతో ఉన్నారు. వారి నాలుకలు పిడచకట్టాయి.
నేను వారి ప్రార్థనలకు జవాబిస్తాను.
    నేను వాళ్లను విడువను, చావనివ్వను.
18 ఎండిపోయిన కొండల మీద నేను నదులను ప్రవహింపజేస్తాను.
    లోయలో నీటి ఊటలను నేను ప్రవహింపజేస్తాను.
అరణ్యాన్ని నీటి సరసుగా నేను చేస్తాను.
    ఎండిన భూములలో నీటి బుగ్గలు ఉబుకుతాయి.
19 అరణ్యంలో వృక్షాలు పెరుగుతాయి.
    దేవదారు వృక్షాలు, తుమ్మ చెట్లు గొంజి చెట్లు, తైలవృక్షాలు తమాల వృక్షాలు, సరళ వృక్షాలు అక్కడ ఉంటాయి.
20 ఈ సంగతులు జరగడం ప్రజలు చూస్తారు. యెహోవా శక్తిచేత ఇవి జరిగాయని వారు తెలుసుకొంటారు.
    ప్రజలు ఈ సంగతులు చూస్తారు.
వారు గ్రహించటం మొదలుబెడతారు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు (దేవుడు)
    ఈ సంగతులను చేసినట్టు వారు తెలుసుకొంటారు.”

అబద్దపు దేవతలకి యెహోవా సవాలు

21 యాకోబు రాజు, యెహోవా చెబుతున్నాడు: “రండి మీ వివాదాలు నాతో చెప్పండి. మీ రుజువులు చూపించండి, సరియైన విధంగా మనం నిర్ణయంచేద్దాం. 22 జరుగుతోన్న వాటిని గూర్చి, మీ విగ్రహాలు (అబద్ధపు దేవతలు) వచ్చి మాతో చెప్పాలి. మొదట్లో ఏమి జరిగింది? భవిష్యత్తులో ఏమి జరుగుతుంది? మాతో చెప్పండి. మేము జాగ్రత్తగా వింటాం. అప్పుడు తర్వాత ఏమి జరుగుతుంది అనేది మాకు తెలుస్తుంది. 23 ఏమి జరుగుతుందో తెలుసుకొనేందుకు గాను మేము ఎదురు చూడాల్సిన వాటిని గూర్చి చెప్పండి. అప్పుడు మీరు నిజంగానే దేవుళ్లు అని మేము నమ్ముతాం. ఏదో ఒకటి చేయండి. ఏదైనా సరే మంచిగాని చెడుగాని చేయండి. అప్పుడు మీరు బ్రతికే ఉన్నారని మాకు తెలుస్తుంది. మేము మిమ్మల్ని వెంబడించగలుగుతాం.

24 “చూడండి, తప్పుడు దేవుళ్లారా, మీరు శూన్యం కంటె తక్కువ. మీరు ఏమీ చేయలేరు. ఉత్త పనికి మాలిన మనిషి మాత్రమే మిమ్మల్ని పూజించాలనుకొంటాడు.”

యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేయటం

25 “ఉత్తరాన నేను ఒక మనిషిని మేల్కొలిపాను.
    సూర్యోదయమయ్యే తూర్పు దిశనుండి అతడు వస్తున్నాడు.
    అతడు నా నామాన్ని ఆరాధిస్తాడు.
కుమ్మరి మట్టి ముద్దను తొక్కుతాడు. అదే విధంగా ఈ ప్రత్యేక మనిషి రాజులను అణగదొక్కుతాడు.

26 “ఇది జరుగక ముందే దీనినిగూర్చి మాతో ఎవరు చెప్పారు?
    ఆయన్ను మనం దేవుడు అని పిలవాలి.
మీ విగ్రహాల్లో ఒకటి ఈ సంగతులను మాకు చెప్పిందా? లేదు.
    ఆ విగ్రహాల్లో ఏదీ మాకేమీ చెప్పలేదు. ఆ విగ్రహాలు ఒక్క మాట కూడ చెప్పలేదు.
    మరియు మీరు చెప్పే ఒక్క మాట కూడ ఆ అబద్ధపు దేవుళ్ళు వినలేవు.
27 ఈ విషయాలను గూర్చి యెహోవాను, నేనే మొట్టమొదట సీయోనుకు చెప్పాను.
    ‘చూడండి, మీ ప్రజలు తిరిగి వస్తున్నారు’ అనే ఒక సందేశం ఇచ్చి
    ఒక సందేశహరుని యెరూషలేముకు నేను పంపించాను.”

28 ఆ తప్పుడు దేవుళ్లను నేను చూశాను.
    వారిలో ఎవరూ ఏమీ చెప్పగల తెలివి లేనివాళ్లు.
వాళ్లను నేను ప్రశ్నలు అడిగాను.
    కానీ వారు ఒక్క మాట కూడా పలుకలేదు.
29 ఆ దేవుళ్లంతా శూన్యంకంటె తక్కువ.
    వాళ్లు ఏమీ చేయలేరు.
    ఆ విగ్రహాలు బొత్తిగా పనికి మాలినవి.

ప్రకటన 11

ఇద్దరు సాక్షులు

11 ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు: “వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడ లెక్కపెట్టు. కాని వెలుపలి ఆవరణం, యూదులు కానివాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభై రెండు నెలల దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు. నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనెపట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవసందేశం చెబుతారు.”

రెండు ఒలీవ వృక్షాలు, రెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి. వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టినవాళ్ళు ఈ విధంగా మరణిస్తారు. తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంది.

వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, ఒక మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది. వాళ్ళ మృతదేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉన్నాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ వాళ్ళ ప్రభువు సిలువకు వేయబడ్డాడు. మూడున్నర రోజులు ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలు ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు. 10 ఈ యిరువురు ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు.

11 కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్ళను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు. 12 అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం బిగ్గరగా, “మీదికి రండి” అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు.

13 అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూకంపంవల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. బ్రతికున్నవాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు.

14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది.

ఏడవ బూర

15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది:

“ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది.
    ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”

16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు:

“ప్రభూ! సర్వశక్తివంతుడవైన దైవమా!
    నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉన్నావు.
నీ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు.
    కనుక నీకు మా కృతజ్ఞతలు!
18 దేశాలు ఆగ్రహం చెందాయి.
    ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది.
చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది.
    నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది.
నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించేవాళ్ళకు,
    సామాన్యులకు, పెద్దలకు,
అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది.
    భూమిని నాశనం చేసేవాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”

19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International