M’Cheyne Bible Reading Plan
దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం
12 “కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. 2 ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి. 3 వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.
4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. 5 మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం. ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి 6 మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం[a] మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి. 7 మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.
8 “ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు మనకు యిష్టం వచ్చిన ఏ పద్ధతిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించాం. 9 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో మనం యింకా ప్రవేశించలేదు గనుక. 10 ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు. 11 అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి. 12 మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు మీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. (ఆ లేవీయులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలిసి సంతోషంగా సమయం గడపండి. 13 మీకు కనబడిన ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో మీ దహనబలులు అర్పించకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. 14 మీ వంశాలకు చెందిన ఒక ప్రాంతంలో యెహోవా తన ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకొంటాడు. దహన బలులు అర్పించటం, నేను మీతో చెప్పిన యితర పనులు అన్నీ అక్కడే చేయండి.
15 “మీరు నివసించే ఏ స్థలంలోనైనా ఎర్ర జింక, చిన్న దుప్పిలాంటి ఏ మంచి జంతువునైనా మీరు చంపి తినవచ్చును. మీరు కొరినంత మాంసం, మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఈ మాంసం తినవచ్చును. 16 కాని రక్తంతో మాత్రం మీరు తినకూడదు. రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.
17 “మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా: దేవునికి చేందిన ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త ద్రాక్షారసం, నూనె భాగాలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదట పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన ఏ కానుకగాని, ఏ స్వేచ్ఛార్పణలుగాని, లేక దేవునికి చెందిన ఏ కానుకలేగాని, 18 మీ దేవుడైన యెహోవా నిర్ణయించే ప్రత్యేక స్థలంలో, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్న ఆ స్థలంలో మాత్రమే అర్పణలను మీరు తినాలి. మీరు అక్కడికి వెళ్లి, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ పని మనుష్యులందరు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులతో కలిసి మీరు భోజనం చేయాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన వాటితో ఆనందించండి. 19 మీరు ఎల్లప్పుడూ ఈ భోజనాలను లేవీయులతోకూడ పంచుకొనే విషయంలో ఖచ్చితంగా ఉండండి. మీరు మీ దేశంలో బతికినంతకాలం ఇలా చేయండి.
20-21 “మీ దేశాన్ని విస్తృతపరుస్తానని మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసాడు. ఆయన అలా చేసినప్పుడు, ఆయన తన ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొనే స్థలానికి మీ నివాసం చాలా దూరం కావచ్చు. అది చాలా దూరమై, మాంసం కోసం మీరు ఆకలిగా ఉంటే, అప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మాంసమైనా తినవచ్చును. యెహోవా మీకు ఇచ్చిన పశువుల మందలోనుండిగాని, గొర్రెల మందలోనుండిగాని, ఏ జంతువునైనా చంపుకోవచ్చును. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం యిది చేయండి. మీరు నివసించే చోట మీకు యిష్టం వచ్చినప్పుడు ఈ మాంసం తినవచ్చును. 22 జింక, దుప్పి మాంసం తిన్నట్టుగానే మీరు ఈ మాంసం తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా యిలా చేయవచ్చును. 23 రక్తంతో మాత్రం తినకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. ఇంకా ప్రాణం ఉన్న మాంసం మీరు తినకూడదు. 24 రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి. 25 సరైనది అని యెహోవా చెప్పిన ప్రతిదీ మీరు చేయాలి. అందుచేత రక్తంతో తినవద్దు. మీకు మీ సంతతివారికి మేలు కలుగుతుంది.
26 “మీరు ప్రతిష్ఠించిన వాటిని, మీ మొక్కు బడులను, మీ దేవుడైన యెహోవా నియమించే ప్రత్యేక స్థలానికి మీరు తీసుకొని వెళ్లాలి. 27 మీరు మీ దహన బలులను ఆ స్థలంలో అర్పించాలి. మీ దహనబలుల రక్తం, మాంసం మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. మీ యితర బలుల విషయంలో రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. అప్పుడు ఆ మాంసం మీరు తినవచ్చును. 28 నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికి జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.
29 “ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు. 30 అయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు. 31 ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దెవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు.
32 “నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం జాగ్రత్తగా చేయాలి. నేను మీకు చెప్పేవాటికి మరేమీ కలుపవద్దు, ఏమీ తీసివేయవద్దు.
97 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది.
దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి.
2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి.
నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి.
3 యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ
ఆయన శత్రువులను నాశనం చేస్తుంది.
4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది.
ప్రజలు దాన్ని చూచి భయపడతారు.
5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి.
భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి.
6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి.
ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక!
7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు.
వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు.
కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు.
వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు.
8 సీయోనూ, విని సంతోషించుము!
యూదా పట్టణములారా, సంతోషించండి!
ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు.
9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు.
ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు.
10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు.
కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు.
11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి.
12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి.
ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి.
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది
40 మీ దేవుడు చెబుతున్నాడు,
“ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి!
2 యెరూషలేముతో దయగా మాట్లాడండి.
‘నీ సేవాసమయం అయిపోయింది
నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి
యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”
3 వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు.
“యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి.
ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి.
4 ప్రతి లోయనూ పూడ్చండి
ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి.
వంకర మార్గాలను చక్కగా చేయండి.
కరకు నేలను సమనేలగా చేయండి.
5 అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది
మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు.
సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
6 ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని.
కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?”
ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు.
మనుష్యుల మంచి తనం క్రొత్త గడ్డి పరకలా ఉంది.
7 యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది.
ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది.
సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి.
8 గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది.
కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”
రక్షణః దేవుని శుభ వార్త
9 సీయోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు.
యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది.
భయపడవద్దు. గట్టిగా మాట్లాడు.
యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు:
“చూడు, ఇదిగో మీ దేవుడు!
10 చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు.
మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు.
యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు.
వారి జీతం యెహోవా దగ్గర ఉంది.
11 గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు.
యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు.
గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.”
దేవుడు లోకాన్ని చేశాడు; దాన్ని ఆయన పరిపాలిస్తాడు
12 మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు?
ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని ఉపయోగించింది ఎవరు?
భూమిమీద ధూళి అంతటినీ కొలిచేందుకు పాత్రను ఉపయోగించింది ఎవరు?
పర్వతాలను, కొండలను తూకం వేసేందుకు త్రాసులను ఉపయోగించింది ఎవరు? యెహోవాయే.
13 యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు.
యెహోవా చేసిన వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన వారెవరూ లేరు.
14 యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా?
న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా యెహోవాకు నేర్పించారా?
యెహోవాకు ఎవరైనా తెలివిని ఉపదేశించారా?
యెహోవా జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా నేర్పించారా?
లేదు. ఇవన్నీ యెహోవాకు ముందే తెలుసు.
15 చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి.
దూర దేశాలన్నింటినీ యెహోవా తీసుకొని ఆయన వాటిని తన త్రాసులో వేస్తే
అవి చిన్న ధూళి కణాల్లా ఉంటాయి.
16 యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు.
లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు.
17 లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం
దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ కలిసి ఏ మాత్రం విలువ చేయవు.
దేవుడు ఎలాంటివాడవి ప్రజలు ఊహించలేరు
18 నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా?
లేదు నీవు దేవుని పటము చేయగలవా? లేదు.
19 కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి
వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు.
ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు.
బంగారం పనివాడు ఆ విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు.
20 పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు.
కనుక పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు.
తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక దేవుని బొమ్మ చెక్కిస్తాడు.
అదీ, పేదవాని దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు.
21 తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ?
తప్పక అది నీవు విన్నావు.
ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు.
భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు.
22 నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు.
ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు.
ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు.
ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని క్రింద కూర్చునేందుకు పరిచాడు.
23 నిజమైన దేవుడు పరిపాలకులను ప్రాముఖ్యత లేనివారినిగా చేస్తాడు.
ఆయన ఈ లోకపు న్యాయమూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు.
24 ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు
కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే
దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు.
దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి.
గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది.
25 పరిశుద్ధుడు (దేవుడు) చెబుతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా?
లేదు. నాకు ఎవరు సమానం కాదు.”
26 పైన ఆకాశాలను చూడు.
ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు?
ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు?
ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు?
సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు,
అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.
27 యాకోబూ, ఇది నిజం!
ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి!
“నేను జీవించే విధము యెహోవా చూడలేదు
దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?”
28 యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు.
భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు. యెహోవా నిత్యమూ జీవిస్తాడు.
29 బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు.
శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు.
30 యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి.
చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు.
31 కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది.
వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు.
వారు అలసి పోకుండా నడుస్తారు.
దేవదూత, చిన్న గ్రంథము
10 శక్తివంతుడైన మరొక దేవదూత పరలోకం నుండి క్రిందికి రావటం చూశాను. ఆయన మేఘాన్ని ఒక వస్త్రంగా ధరించి ఉన్నాడు. ఆయన తలపై మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖం సూర్యునిలా ఉంది. ఆయన కాళ్ళు మండుతున్న స్తంభాల్లా ఉన్నాయి. 2 ఆయన చేతిలో ఒక చిన్న గ్రంథం ఉంది. అది తెరువబడి ఉంది. ఆయన తన కుడి కాలు సముద్రం మీద, ఎడమకాలు భూమ్మీద ఉంచి బిగ్గరగా అరిచాడు. 3 ఆ అరుపు సింహ ఘర్జనలా ఉంది. ఆయన అలా అరచినప్పుడు ఏడు ఉరుములు మాట్లాడాయి.
4 ఏడు ఉరుములు మాట్లాడిన వాటిని నేను వ్రాయటం మొదలుపెట్టాను. కాని పరలోకం నుండి ఒక స్వరం నాతో, “ఏడు ఉరుములు అన్న మాటల్ని దాచి ముద్ర వేయి, వాటిని వ్రాయవద్దు” అని అన్నది.
5 సముద్రం మీద, భూమ్మీద నిలబడి ఉన్న దూత నేను చూస్తుండగా తన కుడి చేతిని పరలోకం వైపుకు చాపాడు. 6 చిరకాలం జీవించేవాని మీద, పరలోకం, అందులో ఉన్నవాటిని సృష్టించినవాని మీద, భూమిని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టంచినవానిమీద, సముద్రాన్ని, అందులో ఉన్నవాటన్నిటినీ సృష్టించినవాని మీద ప్రమాణం చేసి ఈ విధంగా అన్నాడు: “ఇక ఆలస్యం ఉండదు. 7 కాని ఏడవ దూత తన బూర ఊదటం మొదలు పెట్టే రోజులు వచ్చినప్పుడు దేవుని రహస్య ప్రణాళిక సమాప్తమౌతుంది. దేవుడు తన సేవకులైన ప్రవక్తలకు ఈ రహస్యాన్ని ముందే చెప్పాడు.” అని అన్నాడు.
8 నేను పరలోకం నుండి విన్న స్వరం మళ్ళీ నాతో, “వెళ్ళు. సముద్రం మీదా, భూమ్మీదా నిలబడి ఉన్న దూత చేతిలో తెరువబడివున్న గ్రంథాన్ని తీసుకో!” అని అన్నది.
9 అందువల్ల, నేను దేవదూత దగ్గరకు వెళ్ళి, ఆ చిన్న గ్రంథాన్నివ్వమని అడిగాను. ఆయన నాతో, “ఇది తీసుకొని తిను. అది నీ కడుపుకు చేదు కలిగిస్తుంది. కాని నీ నోటికి తేనెలా మధురంగా ఉంటుంది” అని అన్నాడు. 10 నేనా చిన్న గ్రంథాన్ని, దూత చేతినుండి తీసుకొని తినివేసాను. అది నా నోటికి తేనెలా మధురంగా ఉండెను. కాని అది తిన్నాక నా కడుపుకు చేదుగానుండెను. 11 ఆ తర్వాత ఆ దూత నాతో, “నీవు చాలమంది ప్రజల్ని గురించి, దేశాల్ని గురించి, రాజుల్ని గురించి మళ్ళీ ప్రవచనం చెప్పాలి” అని అన్నాడు.
© 1997 Bible League International