M’Cheyne Bible Reading Plan
యెహోవాను జ్ఞాపకం చేసుకోండి
8 “ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు. 2 ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకొన్నాడు. 3 యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో[a] మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు. 4 గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు. 5 ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి.
6 “మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి. 7 నదులు, నీటి మడుగులు ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే మంచి దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మును తీసుకొని వస్తున్నాడు. 8 అది గోధుమ, యవలు, ద్రాక్షాతోటలు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో నిండిన దేశం. ఒలీవ నూనె, తేనెగల దేశం అది. 9 అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును. 10 మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.
యెహోవా చేసినదాన్ని మరచిపోకండి
11 “జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. 12 మీరు తినేందుకు ఆహారం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. 13 మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది. 14 అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. 15 భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. 16 మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు. 17 ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు. 18 మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక.
19 “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. 20 దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
6 చీకటిలో దాపురించే రోగాలకు గాని
మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
7 నీ ప్రక్కన వేయిమంది,
నీ కుడి ప్రక్కన పది వేలమంది శత్రుసైనికులను ఓడిస్తావు.
నీ శత్రువులు నిన్ను కనీసం తాకలేరు.
8 ఊరికే చూడు, ఆ దుర్మార్గులు శిక్షించబడినట్లుగా
నీకు కనబడుతుంది.
9 ఎందుకంటే నీవు యెహోవాను నమ్ముకొన్నావు గనుక.
సర్వోన్నతుడైన దేవుణ్ణి నీ క్షేమ స్థానంగా చేసుకొన్నావు గనుక.
10 కీడు ఏమీ నీకు జరగదు.
నీ ఇంట ఎలాంటి వ్యాధి ఉండదు.
11 ఎందుకంటే నిన్ను కనిపెట్టుకొని ఉండుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు ఎక్కడికి వెళ్లినా వారు నిన్ను కాపాడుతారు.
12 నీ పాదం రాయికి తగులకుండా
దేవదూతలు వారి చేతులతో నిన్ను పైకి ఎత్తుతారు.
13 సింహాల మీద, విషసర్పాల మీద
నడిచే శక్తి నీకు ఉంటుంది.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
అష్షూరీయులు యూదాను ముట్టడించుట
36 యూదాకు హిజ్కియా రాజు. అష్షూరుకు సన్హెరీబు రాజు. హిజ్కియా రాజైన పదునాలుగవ సంవత్సరంలో సన్హెరీబు యూదా పట్టణాల మీద యుద్ధం చేశాడు. మరియు సన్హెరీబు ఆ పట్టణాలను ఓడించేశాడు. 2 యెరూషలేము మీద యుద్ధం చేయటానికి సన్హెరీబు తన సైన్యాధిపని పంపించాడు. ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సైన్యాధిపతి బలమైన తన సైన్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ సైన్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది.
3 ఆ సైన్యాధిపతితో మాట్లాడుటకు ముగ్గురు మనుష్యులు యెరూషలేము నుండి బయటకు వెళ్లారు. వీరు హిల్కీయా కుమారుడు ఎల్యాకీము, ఆసాపు కుమారుడు యోవాహు, షెబ్నా, ఎల్యాకీము రాజభవన సంరక్షకుడు. యెహోవా అధికార పత్రాలు భద్రపరచేవాడు; షెబ్నా రాజ్యపు కార్యదర్శి.
4 సైన్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన హిజ్కియాతో ఈ సంగతులు చెప్పండి:
“మహారాజు, అష్షూరు రాజు చెబుతున్నాడు, మీ సహాయం కోసం మీరు దేనిని నమ్ముకొంటున్నారు? 5 మీరు గనుక మీ బలాన్నీ, తెలివిగల మీ యుద్ధ తంత్రాలనూ నమ్ముకొంటే అవన్నీ నిష్ప్రయోజనమే అని నేను చెబుతున్నాను. అవి వట్టి మాటలు తప్ప ఇంకేమీ లేదు. కనుక మీరు నాకు విరోధంగా ఎందుకు యుద్ధం చేస్తారు? 6 ఇప్పుడు నేను మళ్లీ అడుగుతున్నాను, మీ సహాయం కోసం మీరు ఎవరిని నమ్ముకొంటున్నారు? మీ సహాయం కోసం మీరు ఈజిప్టు మీద ఆధారపడ్తున్నారా? ఈజిప్టు విరిగిపోయిన కర్రలా ఉంది. ఆధారంగా మీరు దానిమీద ఆనుకొంటే, అది మీకు బాధ మాత్రమే కలిగిస్తుంది, మీ చేతికి గాయం చేస్తుంది. ఈజిప్టు రాజు ఫరో సహాయంకోసం అతని మీద ఆధారపడే వాళ్లెవ్వరూ అతణ్ణి నమ్మలేరు.
7 “అయితే మీరు అనవచ్చు, ‘మా సహాయం కోసం మేం మా దేవుడు యెహోవాను విశ్వసిస్తున్నాం’ అని. అయితే యెహోవా బలిపీఠాలను, ఆరాధించే ఉన్నత స్థలాలను హిజ్కియా నాశనం చేసేశాడు అని నేనంటున్నాను. ఇది నిజం, అవునా? యూదాకు, యెరూషలేముకు హిజ్కియా ఈ సంగతులు చెప్పటం సత్యం, ‘ఇక్కడ యెరూషలేములో ఒకే బలిపీఠం దగ్గర మీరు ఆరాధిస్తారు.’
8 “అయినా మీరు ఇంకా యుద్ధం చేయాలనే అనుకొంటే, నా ప్రభువు, అష్షూరు రాజు మీతో ఈ ఒడంబడిక చేస్తాడు! యుద్ధ రంగంలో స్వారీ చేయగల రెండువేల మంది మీకు ఉంటే, నేను మీకు అన్ని గుర్రాలు ఇస్తాను. 9 అలాగైనా సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు ఓడించలేరు. అందుచేత ఈజిప్టు సైనికుల మీద రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు?
10 “మరియు నేను వచ్చి ఈ దేశంలో యుద్ధం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్ణణాలను నాశనం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడు. ‘లేచి నిలబడే ఈ దేశానికి వెళ్లి, దీన్ని నాశనం చేయి’” అని యెహోవా నాతో చెప్పాడు.
11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు, “దయచేసి సిరియా భాషలో మాతో మాట్లాడు. మా యూదా భాషలో మాతో మాట్లాడవద్దు. నీవు యూదా భాషలో మాట్లాడితే, నగరం గోడమీద మనుష్యులు అర్థం చేసుకొంటారు” అని ఆ సైన్యాధిపతితో చెప్పారు.
12 కానీ సైన్యాధిపతి, “మీకూ, మీ యజమానుడు హిజ్కియాకూ మాత్రమే చెప్పమని మా యజమాని నన్ను పంపించలేదు. ఆ గోడల మీద కూర్చొన్న మనుష్యులతో కూడ చెప్పమని నా యజమాని నన్ను పంపించాడు. ఆ మనుష్యులకు ఆహారంగాని భోజనం గాని ఉండదు. వాళ్లు కూడా మీలాగే, వారి మల మూత్రాలనే తిని, త్రాగుతారు” అని చెప్పాడు.
13 అప్పుడు సైన్యాధికారి లేచి, పెద్ద స్వరంతో మాట్లాడాడు. అతడు యూదా భాషలో మాట్లాడాడు. 14 సైన్యాధికారి చెప్పాడు, “మహారాజు అష్షూరు రాజు మాటలు వినండి:
“హిజ్కియా మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. అతడు మిమ్మల్ని రక్షించలేడు. 15 ‘యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.
16 “హిజ్కియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అష్షూరు రాజు మాట వినండి. అష్షూరు రాజు చెబుతున్నాడు, ‘మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఇంటికి వెళ్లవచ్చును. ప్రతి ఒక్కరు తన స్వంత ద్రాక్షవల్లినుండి ద్రాక్షపండ్లు తినేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది. 17 నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత వరకు మీరు ఇలా చేయవచ్చు. ఆ క్రొత్త దేశంలో మీకు మంచి ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం ఉంటాయి. ఆ దేశంలో భోజనం, ద్రాక్షవనాలు ఉంటాయి.’
18 “హిజ్కియా మిమ్మల్ని వెర్రి వాళ్లనుగా చేయనియ్యకండి. ‘యెహోవా మనలను రక్షిస్తాడు.’ అని అతడు అంటాడు. అయితే యితర రాజ్యాల్లోని యితర దేవుళ్లు ఎవరైనా సరే వారిని అష్షూరు బలంనుండి రక్షించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు. 19 ఆ ప్రజల్లో ప్రతి ఒక్కరినీ మేము ఓడించాం. హమాతు, అర్పదు దేవుళ్లు ఏమయ్యారు? వారు ఓడించబడ్డారు. సెపర్యయీం దేవతలు ఎక్కడ? వారు ఓడించబడ్డారు. సమరయ దేవుళ్లు ఆ ప్రజలను నా బలంనుండి రక్షించారా? లేదు. 20 ఆ రాజ్యాలన్నింటిలో నా బలం నుండి తన ప్రజలను రక్షించగలిగిన ఒక్క దేవుని పేరు నాకు చెప్పండి. నేను వాళ్లందర్నీ ఓడించేశాను. అందుచేత నా బలంనుండి యెహోవా యెరూషలేమును రక్షించజాలడు.”
21 యెరూషలేములోని ప్రజలు చాలా మౌనంగా ఉన్నారు. ఆ సైన్యాధికారికి వారు జవాబు చెప్పలేదు. (హిజ్కియా ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “ఆ సైన్యాధికారికి జవాబు చెప్పవద్దు” అని హిజ్కియా ఆజ్ఞాపించాడు.)
22 అప్పుడు రాజభవన అధికారి (హిజ్కియా కుమారుడు ఎల్యాకీము) రాజ్య కార్యదర్శి (షెబ్నా) అధికార పత్రాలు భద్రపరిచే అధికారి (ఆసాపు కుమారుడు యోవాహు) వారి బట్టలు చింపివేశారు. (వారు చాలా విచారించినట్టు ఇది సంకేతం) ఆ ముగ్గురు మనుష్యులూ హిజ్కియా దగ్గరకు వెళ్లి, సైన్యాధికారి తమతో చెప్పిన సంగతులన్నీ అతనితో చెప్పారు.
ముద్రలు
6 ఆ గొఱ్ఱెపిల్ల ఆ ఏడింటిలో మొదటి ముద్రను తెరవటం చూసాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి “రా!” అని ఉరుముతూ అనటం విన్నాను. 2 నా ముందు ఒక తెల్లటి గుఱ్ఱం కనిపించింది. దానిమీద స్వారి చేస్తున్నవాడు విల్లు పట్టుకొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం యివ్వబడింది. అతడు విజయం సాధించాలని నిర్ణయించుకొన్న వీరునిలా స్వారి చేస్తూ యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు.
3 ఆ గొఱ్ఱెపిల్ల రెండవ ముద్రను తీసినప్పుడు రెండవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. 4 అప్పుడు యింకొక గుఱ్ఱం వెలుపలికి వచ్చింది. అది ఎఱ్ఱటి రంగులో ఉంది. భూమ్మీద శాంతి లేకుండా చేయటానికి, మానవులు ఒకరినొకరు వధించుకొనేటట్లు చేయటానికి, దాని రౌతుకు అధికారం యివ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం యివ్వబడింది.
5 ఆ గొఱ్ఱెపిల్ల మూడవ ముద్రను తీసినప్పుడు మూడవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. నా ముందు ఒక నల్లటి గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు చేతిలో ఒక తక్కెడ ఉంది. 6 అప్పుడు ఆ నాలుగు ప్రాణులనుండి ఒక స్వరం, “ఒక దేనారమునకు ఒక సేరు గోధుమలు, ఒక దేనారమునకు మూడు సేర్లు యవలు; నూనెను, ద్రాక్షారసమును పాడు చేయవద్దు!” అని అనటం వినిపించింది.
7 ఆ గొఱ్ఱెపిల్ల నాల్గవ ముద్రను తీసినప్పుడు నాల్గవ ప్రాణి “రా!” అని అనటం విన్నాను. 8 అక్కడ నా ముందు పాలిపోయినట్టుగా ఉన్న ఒక గుఱ్ఱం కనిపించింది. దాని రౌతు పేరు “మృత్యువు.”[a] మృత్యులోకము వానిని అనుసరిస్తూ వాని వెనుకనే ఉంది. భూమి నాల్గవ వంతుపై అతనికి అధికారం యివ్వబడింది. కత్తితో, కరువుతో, తెగులుతో, క్రూర మృగాలతో భూనివాసులను చంపటానికి అతనికి అధికారం యివ్వబడింది.
9 ఆ గొఱ్ఱెపిల్ల ఐదవ ముద్రను తీసినప్పుడు, వధింపబడిన ఆత్మల్ని బలిపీఠం క్రింద చూసాను. వీళ్ళు దేవుని సందేశాన్ని బోధించటంవల్ల మరియు సాక్ష్యం చెప్పటంవల్ల వధింపబడినవాళ్ళు. 10 వాళ్ళు పెద్ద స్వరంతో, “మహా ప్రభూ! నీవు పరిశుద్ధుడవు, సత్యవంతుడవు. ఈ భూమ్మీద నివసించేవాళ్ళపై తీర్పు చెప్పటానికి, మా రక్తము నిమిత్తము పగ తీర్చుకోవటానికి యింకా ఎంతకాలం పడ్తుంది?” అని అన్నారు. 11 ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక తెల్లటి వస్త్రం యివ్వబడింది. “మీరు చంపబడినట్లే, మీ తోటి సేవకులు, సోదరులు చంపబడతారు. వాళ్ళ సంఖ్య ముగిసే వరకు మీరు మరికొంత కాలం కాచుకొని ఉండాలి” అని వాళ్ళకు తెలుపబడింది.
12 ఆయన ఆరవ ముద్రను విప్పుతూ ఉంటే నేను చూసాను. ఒక పెద్ద భూకంపం కలిగింది. గొఱ్ఱె బొచ్చుతో చేసిన గొంగళిలాగా, సూర్యగోళం నల్లగా మారిపోయింది. పున్నమి చంద్రబింబం ఎఱ్ఱటి రక్తంలా మారిపోయింది. 13 తీవ్రంగా గాలి వీచినప్పుడు, కాలం కాని కాలంలో కాచిన అంజూరపు పండ్లు క్రింద పడినట్లు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు భూమ్మీద పడ్డాయి. 14 ఆకాశం కాగితంలా చుట్టుకుపోయి మాయమైపోయింది. అన్ని పర్వతాలు, ద్వీపాలు స్థానం తప్పాయి.
15 అప్పుడు ఈ భూమిని పాలించే రాజులు, యువరాజులు, సైన్యాధిపతులు, శ్రీమంతులు, శక్తివంతులు, బానిసలు, బానిసలు కానివాళ్ళు గుహల్లో, పర్వతాలపై ఉన్న రాళ్ళ మధ్య దాక్కొన్నారు. 16 వాళ్ళు పర్వతాలను, రాళ్ళను పిలుస్తూ, “మాకు అడ్డంగా పడి మమ్మల్ని సింహాసనంపై కూర్చొన్నవానినుండి, ఆ గొఱ్ఱెపిల్ల కోపంనుండి కాపాడండి. 17 ఆయన ఆగ్రహం చూపించే గొప్ప దినం వచ్చింది! దాన్ని ఎవరు ఎదుర్కోగలరు?” అని అన్నారు.
© 1997 Bible League International