M’Cheyne Bible Reading Plan
ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు
7 “మీరు స్వాధీనం చేసుకొనేందుకు ప్రవేశించబోతున్న దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్ములను తీసుకొని వస్తాడు. అనేక రాజ్యాలవాళ్లను – హిత్తీయులు, గిర్గాషీయులు, ఆమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు – మీకంటె బలంగల ఏడు గొప్ప రాజ్యాల వాళ్లను మీకోసం యెహోవా బలవంతంగా బయటకు వెళ్లగొడ్తాడు. 2 ఈ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా మీ అధికారం క్రింద ఉంచుతాడు. మీరు వారిని ఓడిస్తారు. మీరు వాళ్లను సర్వనాశనం చేయాలి. వాళ్లతో ఏ ఒడంబడిక చేసుకోవద్దు. వాళ్లకు దయ చూపించవద్దు. 3 ఆ ప్రజల్లో ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు, ఆ ఇతర రాజ్యాలకు చెందిన ఎవరినీ మీ కుమారులనుగాని కుమారైలనుగాని పెళ్లి చేసుకోనివ్వవద్దు. 4 ఎందుకంటే మీ పిల్లలు నన్ను వెంబడించకుండా ఆ ఇతరులు వారిని మళ్లిస్తారు. అప్పుడు మీ పిల్లలు ఇతర దేవుళ్లను సేవిస్తారు. కనుక యెహోవా మీ మీద కోపగిస్తాడు. వెంటనే ఆయన మిమ్మల్ని నాశనం చేస్తాడు.
బూటకపు దేవుళ్లను నాశనం చేయండి
5 “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆషేరు స్తంభాలను[a] నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి. 6 ఎందుకంటే మీరు యెహోవాకు స్వంత ప్రజలు. భూమిమీద మొత్తం ప్రజలందరిలో మీరు ఆయనకు ప్రత్యేక ప్రజగా ఉండేందుకు – కేవలం ఆయనకు మాత్రమే చెందిన వారుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొన్నాడు. 7 యెహోవా ఎందుకు ప్రేమించి, ఏర్పాటు చేసుకొన్నాడు? ఇతర ప్రజలకంటే మీరు ఎక్కువమంది ఉన్నారని కాదు. సమస్త జనులలో మీరే అతి తక్కువ సంఖ్యవారు. 8 అయితే యెహోవా మహాశక్తితో మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. బానిసత్వంనుండి ఆయన మిమ్మల్ని స్వతంత్రులను చేసాడు. ఈజిప్టు రాజు ఫరో అధికారంనుండి ఆయన మిమ్మల్ని విడుదల చేసాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనుకను, మీ పూర్వీకులకు ఆయన చేసిన వాగ్దానాన్ని నిలుపు కోవాలనీ ఆయన అలా చేసాడు.
9 “అందుచేత మీ దేవుడైన యెహోవా ఒక్కడే దేవుడు, ఆయన నమ్మదగినవాడు అని జ్ఞాపకం ఉంచుకోండి. ఆయన తన ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. ఆయనను ప్రేమించి, ఆయన ఆజ్ఞలకు విధేయులయ్యే వారందరికీ ఆయన తన ప్రేమ, దయ చూపుతాడు. వేయి తరాలవరకు ఆయన తన ప్రేమ, దయ చూపిస్తూనే ఉంటాడు. 10 అయితే యెహోవాను ద్వేషించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. వాళ్లను ఆయన నాశనం చేస్తాడు. ఆయనను ద్వేషించే మనిషిని శిక్షించటంలో ఆయన నిదానించడు. 11 కనుక నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలు, చట్టాలు నియమాలు విధేయత చూపే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.
12 “మీరు ఈ ఆజ్ఞలను ఆలకించి, వాటికి జాగ్రత్తగా విధేయులైతే, మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ప్రేమ ఒడంబడికను నిలబెట్టుకొంటాడు. మీ పూర్వీకులకు ఆయన యిది వాగ్దానం చేసాడు. 13 ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు, ఆశిర్వదిస్తాడు. మీ ప్రజల సంఖ్య యింకా యింకా పెరిగిపోతుంది. ఆయన మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు. ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె ఆయన మీకు ఇస్తాడు. మీ ఆవులకు దూడలను, గొర్రెలకు గొర్రె పిల్లలను ఇచ్చి ఆయన ఆశీర్వాదిస్తాడు. మీకు ఇస్తానని ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీకు ఈ ఆశీర్వాదాలన్నీ లభిస్తాయి.
14 “ప్రజలదరికంటే మీరు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. భార్వాభర్తల ప్రతి జంటకూ పిల్లలు పుడతారు. మీ పశువులకు దూడలు పుడతాయి. 15 సమస్త రోగాలనూ యెహోవా మీ నుండి తొలగించివేస్తాడు. ఇంతకు ముందు ఈజిప్టులో మీకు కలిగిన భయంకర వ్యాధులు ఏవీ ఆయన మీకు రానివ్వడు. కానీ ఈ వ్యాధులన్నింటిని మిమ్మల్ని ద్వేషించేవారిమీద ఆయన ఉంచుతాడు. 16 మీరు ఎవరిని ఓడించేందుకు మీ దేవుడైన యెహోవా సహాయం చేస్తాడో, ఆ ప్రజలందరినీ మీరు నాశనం చేయాలి. వారిమీద జాలి పడవద్దు. మరియు వారి దేవుళ్లను సేవించవద్దు. ఎందుకంటే వారు మీకు ఉరియవుతారు. మీరు వారి దేవుళ్లను సేవిస్తే, మీరు శిక్ష అనుభవిస్తారు.
యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుట
17 “‘ఈ రాజ్యాలు మనకంటే బలమైనవి. వారిని మనం ఎలా వెళ్లగొట్టగలము?’ అని మీ హృదయంలో అనుకోవద్దు. 18 వారిని గూర్చి మీరు భయపడకూడదు. ఫరోకు, ఈజిప్టు ప్రజలందరికి మీ దేవుడైన యెహోవా చేసిన దానిని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. 19 ఆయన వారికి కలిగించిన మహా కష్టాలను మీరు చూశారు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు మీరు చూశారు. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించేందుకు యెహోవా ప్రయోగించిన ఆయన మహాశక్తిని, బలాన్ని మీరు చూశారు. మీరు భయపడే వారందరి మీదా అదే శక్తిని మీ దేవుడైన యెహోవా ప్రయోగిస్తాడు.
20 “మీ దగ్గర్నుండి పారిపోయి, దాక్కున్న వాళ్లందరినీ పట్టుకొనేందుకు మీ దేవుడైన యెహోవా కందిరీగలను సహా పంపిస్తాడు. ఆ ప్రజలందరినీ దేవుడు నాశనం చేస్తాడు. 21 మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉన్నాడు గనుక వారినిగూర్చి భయపడవద్దు. ఆయన మహా గొప్పవాడు, భీకరుడునైన దేవుడు. 22 ఆ రాజ్యాల ప్రజలు మీ దేశాన్ని కొంచెంకొంచెంగా విడిచి వెళ్లి పోయేటట్టు మీ దేవుడైన యెహోవా వారిని బలవంతపెడ్తాడు. వాళ్లందరినీ ఒకేసారిగా మీరు నాశనం చేయరు. మీరు అలా చేస్తే మీకు అడవి మృగాల బాధ విపరీతంగా పెరిగిపోతుంది. 23 అయితే మీ దేవుడైన యెహోవా ఆ రాజ్యాలను మీకు ఇస్తాడు. వారు నాశనం అయ్యేంతవరకు గొప్ప చిక్కుతో యెహోవా వారిని యుద్ధంలో గందరగోళ పరుస్తాడు. 24 వారి రాజులను ఓడించటానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు. మీరు వారిని చంపేస్తారు, వారు ఎన్నడైనా జీవించిన విషయం కూడా ప్రపంచం మరచిపోతుంది. మిమ్మల్ని అడ్డగించటం ఏ మనిషి తరం కాదు. మీరు వాళ్లందరినీ నాశనం చేస్తారు.
25 “మీరు వారి దేవుళ్ల విగ్రహాలను తప్పక కాల్చి వేయాలి. ఆ విగ్రహాల మీద ఉండే బంగారంకానీ వెండి గానీ మీరు తీసుకొంటే బాగుంటుందని మీరు ఆశించ కూడదు. ఆ వెండిగాని, బంగారంగాని మీకోసం మీరు తీసుకోకూడదు. మీరు అలా చేస్తే, మీరు చిక్కులో పెట్టబడతారు. (మీ జీవితాలు నాశనం అవుతాయి) ఎందుకంటే మీ యెహోవా దేవునికి ఆ విగ్రహాలు అసహ్యం. 26 యెహోవా అసహ్యించుకొనే ఆ విగ్రహాల్లో ఒక్కటికూడా మీరు మీ ఇంటిలోనికి తీసుకొని రాకూడదు. ఆ విగ్రహాలను మీరు మీ ఇంట్లోకి తీసుకొనివస్తే, ఆ విగ్రహాలవలె మీరు కూడా నాశనం చేయబడతారు. మీరు వాటిని బాగా అసహ్యించుకోవాలి. ఆ విగ్రహాలను నాశనం చేస్తానని దేవుడు ప్రమాణం చేసాడు.
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
7 దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
8 మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
9 నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
13 యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము.
నీ సేవకులకు దయ చూపించుము.
14 ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము.
మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము.
15 మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు.
ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము.
16 వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము.
వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము.
17 మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము.
మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము.
దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు
35 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది. 2 అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ[a] చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.
3 బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి. 4 ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు. 5 అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి. 6 కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి. 7 ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.
8 ఆ సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. ఈ రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు. 9 ఆ మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు. ప్రమాదకరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.
10 దేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వారి సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపేస్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారిపోతాయి.
గ్రంథము, గొఱ్ఱెపిల్ల
5 ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. 2 శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. 3 పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. 4 ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. 5 అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.
6 అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. 7 ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు. 8 ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. 9 వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు:
“నీవు వధింపబడినందుకు ప్రతి జాతినుండి ప్రతి భాషనుండి,
ప్రతి దేశంనుండి,
ప్రతి గుంపునుండి,
నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు.
కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.
10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు.
వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”
11 ఆ తర్వాత చూస్తే నాకు చాలమంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగా ఉంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు. 12 వాళ్ళు బిగ్గరగా,
“శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని,
మహిమను, స్తుతిని పొందటానికి వధింపబడిన గొఱ్ఱెపిల్ల యోగ్యమైనవాడు”
అని పాడారు.
13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను:
“సింహాసనంపై కూర్చున్న వానికి, గొఱ్ఱెపిల్లకు చిరకాలం స్తుతి,
గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక!”
14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు.
© 1997 Bible League International